ఆస్పత్రి ప్రాంగణంలో గుట్టలుగా పేరుకుపోయిన బయోమెడికల్ వ్యర్థాలు
గాంధీఆస్పత్రి : కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో బయోమెడికల్ (జీవ) వ్యర్థాలు రోజురోజుకూ గుట్టలుగా పేరుకుపోతున్నాయి. డంపింగ్‌యార్టుకు తరలించి బయోమెడికల్ వేస్ట్‌ను నిర్వీర్యం చేయాల్సిన కాంట్రాక్టు సంస్థ కాలపరిమితి ముగియడంతో నెల రోజులుగా జీవవ్యర్థాలు ఆస్పత్రి ప్రాంగణంలోనే కుప్పులుగా పడున్నాయి. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో పాటు వైద్యులు, సిబ్బంది, ఆస్పత్రికి ఆనుకుని ఉన్న పద్మారావునగర్ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గాంధీఆస్పత్రి కోవిడ్ నోడల్ సెంటర్‌గా ప్రకటించడంతోపాటు కరోనా పాజిటివ్ రోగులకు వైద్యసేవలందిస్తున్న విషయం విదితమే. రోగులు, వైద్యులు, సిబ్బంది వినియోగించిన పీపీఈ కిట్లు, మాస్క్‌లు, చేతి, కాళ్ల గ్లౌజ్‌లు, సిరంజీలు, నీడిల్స్, ఐవీ ఫ్లూయిడ్స్, డైపర్లు తదితర వైద్య వస్తువులు బయోమెడికల్ వేస్టేజ్ కిందికే వస్తాయి.
ఈ వ్యర్థాలను తరలించే సంస్థ కాంట్రాక్టు నెల రోజుల క్రితం ముగియడంతో టన్నుల కొద్ది జీవవ్యర్థాలు ఆస్పత్రి ప్రాంగణంలో గుట్టలుగా పేరుకుపోయింది. దీంతో వాటి నుంచి కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోందని తక్షణమే బయో వేస్ట్ నుంచి తమకు రక్షణ కల్పించాలని పద్మారావునగర్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. టెండర్ ప్రక్రియ ముగిసిందని, రేటు తేడాతో సదరు సంస్థ జీవవ్యర్థాల తరలింపునకు ముందుకు రావడంలేదని తెలిసింది.
త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం...
జీవవ్యర్థాల తరలింపు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో సెర్టిలైజ్ చేసిన తర్వాతే జీవవర్థాలను ప్రత్యేకమైన బ్యాగుల్లో నింపుతాం. వ్యర్థాల్లో వైరస్ ఉండదు. దుర్వాసన కూడా రాదు. ఇంతకు ముందు బయోమెడికల్ వేస్ట్ తరలింపు సేవలందించిన సంస్థే మరోమారు టెండర్ దక్కించుకుంది. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment