bio waste
-
రైతులకు వరం.. ఐఐటీ హైదరాబాద్ సరికొత్త ఆవిష్కరణ!
హైదరాబాద్ : వ్యవసాయదారులకు, రైతుకూలీలకు ఉపయోకరంగా ఉండటమే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే సరికొత్త ఆవిష్కరణకు ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ బాటలు వేసింది. వేస్ట్ టూ వెల్త్ వ్యవసాయం చేసేప్పుడు ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలతో బయో బ్రిక్స్ (ఇటుకలు)ను ఐఐటీ, హైదరాబాద్ విద్యార్థులు రూపొందించారు. సాగు చేసేప్పుడు వచ్చే చెత్తను సేకరించి దాన్ని ప్రత్యేక పద్దతిలో మిక్స్ చేసి ఈ ఇటుకలను రూపొందించారు. ప్రస్తుతం ప్రోటోటైప్‌లో ఉన్న ఈ ఇటుకలను కమర్షియల్ పద్దతిలో భారీ ఎత్తున తయారు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం అందివ్వడంతో పాటు ఆఫ్ సీజన్లో రైతు కూలీలకు కూడా మరో పనిని అందుబాటులోకి తెచ్చినట్టు అవుతుందని ఐఐటీ , హైదరాబాద్ అధ్యాపకులు అంటున్నారు. ప్రాజెక్ట్ బిల్డ్ ఐఐటీ హైదరాబాద్‌లో బోల్డ్ యూనిక్ ఐడియా లీడ్ డెవలప్మెంట్ (బిల్డ్) పేరుతో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టారు. అందులో భాగంగా భవన నిర్మాణ రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్టులో భాగంగా 2019 నుంచి బయె బ్రిక్ పరిశోధనలు ప్రారంభించారు. ఇటీవల హైదరాబాద్ క్యాంపస్‌లోనే ఈ ఇటుకలను ఉపయోగించి సెక్యూరిటీ గార్డ్ గదిని నిర్మించారు. బయె ఇటుక ప్రత్యేకతలు - సాధారణ ఇటుకలతో పోల్చినప్పుడు బయో ఇటుకలు చాలా తక్కువ (ఎనిమిదో వంతు) బరువును కలిగి ఉన్నాయి. దీంతో ఇంటి పైకప్పు నిర్మాణానికి సైతం వీటిని వినియోగించవచ్చు. పీవీసీ షీట్లపై ఈ ఇటుకలను పేచ్చి కప్పును పూర్తి చేయవచ్చు. - బయె ఇటుకలు వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్‌గా పని చేస్తాయి. కాబట్టి భవనానికి అదనపు రక్షణ లభిస్తుంది. అంతేకాదు కొంత మేరకు సౌండ్ ప్రూఫ్‌గా కూడా పని చేస్తున్నాయి. - సాధారణ ఇటుకలతో పోల్చితే బయో ఇటుకలను కాల్చేందుకు కనీసం 6 సెంటిగ్రేడ్ వరకు తక్కువ ఉష్ణోగ్రత సరిపోతుంది. ఫలితంగా పర్యావరణ కాలుష్యం తగ్గిపోతుంది. - ఈ ఇటుకలను భారీ ఎత్తున తయారు చేస్తే ఒక్కో ఇటుక తయారీకి కేవలం రూ.2 నుంచి రూ. 3 ల వ్యయం అవుతుంది. దీంతో ఇటుకల రేటు తగ్గిపోతుంది. గ్రామీణ ప్రాంతాలకు ఉపయుక్తం బయో బ్రిక్ టెక్నాలజీ విరివిగా అందుబాటులోకి వస్తే రూరల్ ఇండియాకు ఎంతగానో మేలు జరుగుతుందని ఐఐటీ హైదరాబాద్ అధ్యాపక బృందం అంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యే వ్యర్థాలతో అతి తక్కువ ఖర్చుతోనే ఇటుకలు అందుబాటులోకి వస్తాయని, వీటి వల్ల ఇంటి నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గుతుందంటున్నారు. వ్యయం తగ్గడంతో పాటు ఇంటి నాణ్యత కూడా బాగుంటుందని హామీ ఇస్తున్నారు. చదవండి : Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో! ఎల్ అండ్ టీ కీలక నిర్ణయం? -
గడువు ముగిసింది.. గుట్టలు పెరిగాయి!
గాంధీఆస్పత్రి : కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో బయోమెడికల్ (జీవ) వ్యర్థాలు రోజురోజుకూ గుట్టలుగా పేరుకుపోతున్నాయి. డంపింగ్‌యార్టుకు తరలించి బయోమెడికల్ వేస్ట్‌ను నిర్వీర్యం చేయాల్సిన కాంట్రాక్టు సంస్థ కాలపరిమితి ముగియడంతో నెల రోజులుగా జీవవ్యర్థాలు ఆస్పత్రి ప్రాంగణంలోనే కుప్పులుగా పడున్నాయి. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో పాటు వైద్యులు, సిబ్బంది, ఆస్పత్రికి ఆనుకుని ఉన్న పద్మారావునగర్ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గాంధీఆస్పత్రి కోవిడ్ నోడల్ సెంటర్‌గా ప్రకటించడంతోపాటు కరోనా పాజిటివ్ రోగులకు వైద్యసేవలందిస్తున్న విషయం విదితమే. రోగులు, వైద్యులు, సిబ్బంది వినియోగించిన పీపీఈ కిట్లు, మాస్క్‌లు, చేతి, కాళ్ల గ్లౌజ్‌లు, సిరంజీలు, నీడిల్స్, ఐవీ ఫ్లూయిడ్స్, డైపర్లు తదితర వైద్య వస్తువులు బయోమెడికల్ వేస్టేజ్ కిందికే వస్తాయి. ఈ వ్యర్థాలను తరలించే సంస్థ కాంట్రాక్టు నెల రోజుల క్రితం ముగియడంతో టన్నుల కొద్ది జీవవ్యర్థాలు ఆస్పత్రి ప్రాంగణంలో గుట్టలుగా పేరుకుపోయింది. దీంతో వాటి నుంచి కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోందని తక్షణమే బయో వేస్ట్ నుంచి తమకు రక్షణ కల్పించాలని పద్మారావునగర్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. టెండర్ ప్రక్రియ ముగిసిందని, రేటు తేడాతో సదరు సంస్థ జీవవ్యర్థాల తరలింపునకు ముందుకు రావడంలేదని తెలిసింది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం... జీవవ్యర్థాల తరలింపు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో సెర్టిలైజ్ చేసిన తర్వాతే జీవవర్థాలను ప్రత్యేకమైన బ్యాగుల్లో నింపుతాం. వ్యర్థాల్లో వైరస్ ఉండదు. దుర్వాసన కూడా రాదు. ఇంతకు ముందు బయోమెడికల్ వేస్ట్ తరలింపు సేవలందించిన సంస్థే మరోమారు టెండర్ దక్కించుకుంది. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది. – ప్రొఫెసర్ రాజారావు, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ -
వ్యర్థం.. అనర్థం జర ఫైలం!
సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు కరోనా మహమ్మారి మానవాళిని భయకంపితులను చేస్తుండగా.. మరోవైపు వైరస్ బాధితులు వాడి పడేసిన జీవ వ్యర్థాలు సైతం దడ పుట్టిస్తున్నాయి. రోజుకు ఏకంగా సుమారు టన్నుకు పైగానే ఈ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, ప్రాంతాల్లోని 12 ప్రభుత్వ ఆస్పత్రులు, 128 క్వారంటైన్ కేంద్రాలు, 7 నమూనా సేకరణ కేంద్రాలు, 10 ల్యాబ్‌ల నుంచి నిత్యం కోవిడ్ జీవ వ్యర్థాలను సేకరిస్తున్నారు. వీటిని రాష్ట్రంలోని 11 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ సెంటర్లకు తరలించి పర్యావరణానికి హాని కలిగించని రీతిలో విచ్ఛిన్నం చేస్తున్నారు. ఈ వ్యర్థాలను సేకరించేందుకు సుమారు 55 ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడం గమనార్హం. మార్చి 29 నుంచి ఏప్రిల్ 29 వరకు సుమారు 30 టన్నుల వ్యర్థాలను సేకరించి ఆయా కేంద్రాలకు తరలించినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. ఇందులో అత్యధికంగా గాంధీ ఆస్పత్రి నుంచి 15 టన్నుల జీవ వ్యర్థాలను సేకరించినట్లు స్పష్టం చేశాయి.(కాల్చేస్తే ఖతం.. కుళ్లిపోతే విషం!) కోవిడ్ వ్యర్థాలివే... కోవిడ్ సోకిన రోగులకు ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో వాడిన మాస్క్‌లు, గ్లౌస్లు, దుస్తులు, మలమూత్రాలు, సిరంజీలు, కాటన్, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లు, మెడిసిన్స్ కవర్లు తదితరాలను కోవిడ్ వ్యర్థాలుగా పరిగణిస్తున్నారు. వ్యర్థాల పరిమాణం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వీటిని నిర్లక్ష్యంగా ఇతర జీవ వ్యర్థాలతో పాటే పడవేస్తే వ్యాధి విజృంభించే ప్రమాదం పొంచి ఉంది. దీంతో పీసీబీ వర్గాలు, శుద్ధి కేంద్రాల నిర్వాహకులు వీటిని ప్రత్యేక శ్రద్ధతో సేకరించి పలు జాగ్రత్తలు పాటించి శుద్ధి కేంద్రాలకు తరలిస్తుండడం విశేషం. వ్యర్థాల శుద్ధి ఇలా.. కోవిడ్ సోకిన రోగులతో పాటు వారు వాడి పడేసిన వ్యర్థాలను సైతం అంతే జాగ్రత్తగా శుద్ధి చేస్తున్నారు. ప్రధానంగా జీవ వ్యర్థాలను శుద్ధి చేసే కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ కేంద్రాలు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, నిజామాబాద్, వనపర్తి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో 11 వరకు ఉన్నాయి. 55 ప్రత్యేక వాహనాల ద్వారా ఈ కేంద్రాలకు నిత్యం కోవిడ్ వ్యర్థాలు చేరుతున్నాయి. వీటిని రెండు విడతలుగా ప్రత్యేక యంత్రాల్లో కాల్చి బూడిద చేస్తున్నారు. అనంతరం ఈ బూడిదను దుండిగల్‌లోని హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రానికి తరలించి ప్రత్యేక బాక్సుల్లో నిల్వ చేసి పూడ్చివేస్తున్నారు. శుద్ధి కేంద్రాల్లోని సిబ్బంది బెంబేలు.. కోవిడ్ వ్యర్థాలను శుద్ధి చేస్తున్న 11 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ కేంద్రాల్లో సుమారు 200 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహణలో ఉన్న తమకు సైతం బీమా తదితర వసతులుకల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
కాల్చేస్తే ఖతం.. కుళ్లిపోతే విషం!
సాక్షి, అమరావతి: చెత్తాచెదారం కుళ్లిపోతే ఎరువుగా మారుతుంది. ఇది భూమికి లాభం చేకూరుస్తుంది. అదే మనుషులకొచ్చే జబ్బులను నయం చేసే మందులు కుళ్లిపోతే విషమవుతాయి. ఇవి భూమిని విషతుల్యంగా మారుస్తాయి. భూగర్భ జలాలు కలుషితమై కొత్త జబ్బులొస్తాయి..ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య (100–200 డిగ్రీల సెల్సియస్‌ల మధ్య) కాలి్చవేయాల్సిన మందులు..మున్సిపాలిటీ డంపింగ్ యార్డుల్లో కుళ్లిపోతుండడంతో ప్రమాదం ముంచుకొస్తోంది. కొత్తరకం బాక్టీరియా పుట్టుకొస్తోంది. కాలం చెల్లిన మందులతోనే తీవ్ర సమస్యలు మందుల షాపుల యాజమాన్యాలు కాలం చెల్లిన మందులను చెత్త డబ్బాల్లో వేసి కొత్త సమస్యలకు తెరతీస్తున్నారు. వీటితో పాటు పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీవరేజీ ట్రీట్మెంటు ప్లాంట్లు లేకపోవడం వల్ల బయో ద్రవ వ్యర్థాలు (బయో లిక్విడ్ వేస్ట్) మురికి కాలువల్లో కలుస్తున్నాయి. దీనివల్ల కూడా భయంకరమైన జబ్బులు వస్తున్నాయి. దీనిపై సీపీసీబీ (కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) ఇటీవలే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులు ఏ మాత్రం ఉపేక్షించతగ్గవి కావని, దీనిపై ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అన్నిటికీ మించి కాలం చెల్లిన యాంటీబయోటిక్స్ మందులు కుళ్లిపోయి తీవ్ర ముప్పును తెస్తున్నట్టు సీపీసీబీ పేర్కొంది. మందులు కుళ్లిపోతే వచ్చే నష్టాలు... ►కాలం చెల్లిన యాంటీబయోటిక్స్ కుళ్లిపోవడం వల్ల కొత్తరకం బాక్టీరియా పుట్టుకొస్తోంది. ఈ బాక్టీరియా వల్ల జబ్బులు సోకితే అత్యంత సామర్థ్యం కలిగిన యాంటీబయోటిక్స్ వాడినా తగ్గే అవకాశం ఉండదు. ►చెత్త కుప్పల్లో మందులు కుళ్లిపోతే వాయు కాలుష్యం తీవ్రమవుతుంది. గాలి ద్వారా వ్యాప్తి చెందే జబ్బుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ►భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయి ►ఈ జలాలు తాగడం వల్ల మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, హెపటైటిస్ బి వంటి జబ్బులు వస్తున్నాయి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చెబుతోంది పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం మందులను బయట పడేయకూడదు. వాటిని విధిగా బయోవ్యర్థాల నిర్వహణ సంస్థలకే అప్పజెప్పాలి. పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా వీటిని క్లోజ్డ్ డిగ్రేడబుల్ హౌస్ (నాలుగు గోడల మధ్య ఉన్న బయోవ్యర్థాల ప్లాంటు)లో కాలి్చవేయాలి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే హక్కు, జరిమానాలు విధించే అధికారం ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు ఉంది. కేరళలో ‘ప్రౌడ్’ ప్రాజెక్టు వినియోగించని మందుల నిర్వీర్యంపై కేరళ అద్భుతమైన చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రౌడ్ (ప్రోగ్రాం ఆన్ రిమూవల్ ఆఫ్ అన్యూజ్డ్ డ్రగ్స్)ను ప్రారంభించింది. కేరళ డ్రగ్ కంట్రోల్ అథారిటీ, కేరళ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పనికిరాని, కాలం చెల్లిన మందుల నిరీ్వర్యం చేయడంలో ముందంజ వేశాయి. ఒక్క మాత్ర కూడా మున్సిపాలిటీ డబ్బాల్లోకి వెళ్లకుండా చేయగలుగుతున్నాయి. తిరువనంతపురంలో మొదలైన ఈ పైలెట్ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కేరళ యోచిస్తోంది. రాష్ట్రంలో ఫార్మసీ సంస్థల వివరాలు ఇలా ►మాన్యుఫాక్చరింగ్ లైసెన్సులు 258 ►రిటైల్ అండ్ హోల్‌సేల్ ►మెడికల్ స్టోర్లు 33,039 ►బయోవ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు 12 ►2018–19లో నిబంధనల ఉల్లంఘనలు 6,385 ►సీజ్చేసిన షాపుల సంఖ్య 66 అగ్రిమెంటు లేకుంటే లైసెన్సులు రద్దు చేస్తాం మందుల షాపులు గానీ, సీ అండ్ ఎఫ్ (క్యారీ ఫార్వర్డ్ ఏజెన్సీలు)లు గానీ కాలం చెల్లిన మందులను చెత్త బుట్టల్లో వేయడానికి వీల్లేదు. కచి్చతంగా బయోవ్యర్థాల ప్లాంట్లకు పంపించాల్సిందే. సీ అండ్ ఎఫ్ ఏజెన్సీలు బయోవ్యర్థాల నిర్వాహకులతో అవగాహన ఒప్పందం చేసుకోకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పాం. మందులు మున్సిపాలిటీ చెత్త డబ్బాల్లో వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో నిఘా పెంచాం. – ఎంబీఆర్ ప్రసాద్, సంచాలకులు, ఔషధనియంత్రణ మండలి ఈ చట్టం ఆస్పత్రులకు మాత్రమే వర్తిస్తోంది ఎన్వీరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కేవలం ఆస్పత్రుల బయోవ్యర్థాల నిర్వీర్యం కోసం మాత్రమే ఉపయోగపడుతోంది. ఇప్పటివరకూ మెడికల్‌షాపులు లేదా మాన్యుఫాక్చరింగ్ సంస్థలు మందులను నిబంధనలకు విరుద్ధంగా పారబోస్తే వాటిపై చర్యలు తీసుకుని, జరిమానాలు విధించిన దాఖలాలు కనిపించలేదు. – ఎ.విజయభాస్కర్‌రెడ్డి, ఫార్మసీ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు -
వ్యర్థాలను కిలోల లెక్కన మూటగట్టి పడేస్తారా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బయోవ్యర్థాల నిర్వహణ అత్యంత దారుణంగా ఉందని, వ్యర్థాలను వేర్వేరుగా చేసి ఒక క్రమపద్ధతిలో నిర్వీర్యం చేయాల్సిన ప్రభుత్వ ఆస్పత్రులు.. నిబంధనలు పాటించకుండా అన్ని వ్యర్థాలను కిలోల లెక్కన మూటగట్టి పడేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏజీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు, బయోవ్యర్థాల నిర్వహణపై ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) విభాగం సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అత్యంత అధ్వానంగా ఉన్నట్టు తేలింది. బయోవ్యర్థాల నిర్వహణలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కూడా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు వెల్లడైంది. ఆస్పత్రుల్లో అధ్వాన పరిస్థితులు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ సర్వే నివేదిక ప్రకారం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ రూల్స్–2016ను ఏమాత్రం అమలు చేయడం లేదు. సూదులు, సిరంజ్‌లు, రోగుల వ్యర్థాలు, ప్లాస్టిక్ వేస్ట్, ఆహార వ్యర్థాలు ఇలా దేనికది వేరు చేసి నిర్వీర్యం చేయాలి. కానీ ఆస్పత్రులు.. అన్నింటినీ ఒకే మూట గట్టి కిలోల లెక్కన పంపిస్తున్నాయి. బయోవ్యర్థాలను తీసుకెళ్లే వారితో ఆస్పత్రి సూపరింటెండెంట్లు చేసుకున్న ఒప్పందాలు ఎక్కడా అమలు కావడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో సరైన పారిశుధ్య నిర్వహణ కూడా లేదు. దీనిపై పీసీబీ నోటీసులు ఇచ్చిందని చెబుతున్నా వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ద్రవ వ్యర్థాలనూ పట్టించుకోవడం లేదు వివిధ ఆస్పత్రుల్లో ద్రవ వ్యర్థాలు (లిక్విడ్ వేస్ట్)ను కూడా సరిగా నిర్వీర్యం చేయడం లేదు. లేబొరేటరీలు, రోగుల రక్తం, మూత్రం వంటివాటి వ్యర్థాల నిర్వహణ సరిగా లేదు. వీటి నుంచి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉన్నా పట్టించుకోలేదు. ఇలాంటి ద్రవ వ్యర్థాలను ఒక పద్ధతిలో నిర్వీర్యం చేయాల్సి ఉండగా, వీటన్నిటినీ మున్సిపాలిటీ డ్రైనేజీలోకి వదులుతున్నారు. వాస్తవానికి సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల్లో వీటిని శుద్ధి చేసిన తర్వాత ఆ ద్రవ వ్యర్థాలను వదిలాలి. కానీ ఏ ఒక్క ఆస్పత్రిలోనూ సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు లేవు. అంతేకాదు బయోమెడికల్ వ్యర్థాలకు సంబంధించి ఏ ఆస్పత్రిలోనూ రికార్డులు లేవు. వ్యర్థాల నిల్వ, వాటి రవాణా తదితరాలకు సంబంధించి ఏ ఒక్క ఆధారమూ లేదు. వచ్చినవి వచ్చినట్టు మూటగట్టి బయటకు పంపిస్తున్నట్టు సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో ఆస్పత్రుల్లో ఉన్న అధ్వాన పరిస్థితులు, పీసీబీ వ్యవహారం, ఇంత జరుగుతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రజారోగ్యంతో చెలగాటమాడటమేనని స్పష్టం చేసింది. శిక్షణా తరగతుల పేరిట నిధుల దుర్వినియోగం ఆస్పత్రుల్లో వ్యర్థాల నిర్వహణపై శిక్షణా తరగతులు పేరుతో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) విజయవాడకు చెందిన ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ సంస్థ తూతూమంత్రంగానే శిక్షణా తరగతులు నిర్వహించింది. ఎలాంటి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించలేదు. పీసీబీ అధికారులు, వ్యర్థాల నిర్వహణ సంస్థ కుమ్మక్కై ఇప్పటికే పలుమార్లు శిక్షణా తరగతుల పేరిట కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం చేసినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘బయో’ భయం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వచ్చే బయో వ్యర్థాల నిర్వీర్యం ఘోరంగా ఉంది. ఈ వ్యర్థాల నిర్వీర్యం సరిగా లేకపోవడంతో హెపటైటిస్ బి లాంటి భయంకర వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆస్పత్రుల్లో విడుదలయ్యే వ్యర్థాలను ఎక్కడికక్కడ వేరుచేసి, నిబంధనల మేరకు నిర్దేశించిన ఉష్ణోగ్రతల్లో నిర్వీర్యం చేయాల్సి ఉండగా అలా చేయకుండా వ్యర్థాలను పారపోస్తున్నారు. ప్లాస్టిక్‌ను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాలు అధికారుల దృష్టికి వచ్చినా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. విజయవాడ అరండల్‌పేటలో బయోవ్యర్థాల వాస్తవ స్థితిగతులు ‘సాక్షి’ పరిశీలనలో బయటపడ్డాయి. ఒక పడక వ్యర్థానికి రూ.4 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో పడక నుంచి విడుదలయ్యే వ్యర్థాలకు రోజుకు రూ.4 ఇస్తారు. ఒక్కో పడక నుంచి సగటున రోజుకు 250 గ్రాముల వరకు వ్యర్థాలు విడుదలవుతున్నాయి. రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఒక్కో జిల్లాలో సగటున 8 వేల పడకలు ఉండగా, గుంటూరు, కృష్ణా, విశాఖలో మాత్రం ఒక్కో జిల్లాలోనే 20 వేల పడకలున్నాయి. రాష్ట్రం మొత్తం సుమారు 1.40 లక్షల పడకల నుంచి రోజుకు 35 వేల కిలోల బయో వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ఈ వ్యర్థాలను ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే నిర్వీర్యం చేయాలి. కానీ అలా చేయడం లేదు. ఉదాహరణకు కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకే కాంట్రాక్టర్ ఈ నిర్వహణ చేస్తున్నారు. కృష్ణా జిల్లా యూనిట్‌ను గత కొన్ని నెలలుగా నిర్వహించకుండా ఈ వ్యర్థాలను గుంటూరుకు తరలిస్తున్నారు. ఇతర జిల్లాల్లోనూ పరిస్థితులు ఇలానే ఉన్నాయి. అంతేకాకుండా వ్యర్థాల రవాణా, వాటి నిర్వీర్యం విషయంలో ఏ మాత్రం నిబంధనలు పాటించడం లేదు. బయో వ్యర్థాలను నిర్వీర్యం చేసే యూనిట్లలో పనిచేసే సిబ్బందికి కనీస రక్షణ ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వ్యర్థాల నుంచి విడుదలయ్యే బ్యాక్టీరియా, వైరస్ల వల్ల తాము వ్యాధులబారిన పడుతున్నామని సిబ్బంది చెబుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు బయో వ్యర్థాల నిర్వీర్యంలో పీసీబీ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కవుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఏసీబీకి దొరికిన అధికారే దీనికి నిదర్శనం. ఈ వ్యర్థాలను నిర్వీర్యం చేసే ప్లాంట్లు ఎలా ఉన్నా, ప్లాస్టిక్ వ్యర్థాలను బయటే అమ్ముకుంటున్నా, వీటిని రవాణా చేసే విషయంలో ఎలా వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి ఒకే కాంట్రాక్టర్ ఉంటున్నారు. కొత్త వారిని రానివ్వడం లేదు. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో ఒక కాంట్రాక్టర్ దరఖాస్తు చేసుకుంటే 25 కేసులు పెట్టారు. చివరకు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు గెలిచి కాంట్రాక్ట్ దక్కించుకోగలిగారు. పీసీబీ అధికారులే వెనకుండి కొత్త కాంట్రాక్టర్‌ను ఇబ్బందిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలోని ఓ పీసీబీ అధికారికి వివరణ కోసం ఫోన్ చేయగా.. వెంటనే సంబంధిత యూనిట్ల వారికి సమాచారం అందడం గమనార్హం. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ఇవే.. ♦ బయో వ్యర్థాలను తీసుకెళ్లే వాహనాలకు విధిగా జీపీఎస్ ఉండాలి. ♦ ఈ వాహనాలకు రూట్ చార్ట్ ఉండాలి. ♦ ఏ ఆస్పత్రిలో ఎంత బయోవ్యర్థాలు సేకరించారో కాంట్రాక్ట్ సంస్థ విధిగా తన వెబ్సైట్లో నమోదు చేయాలి. ♦ వ్యర్థాలను సేకరించే పనివారికి ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించాలి. ♦ వారికి గ్లౌజులు, ఎన్–95 మాస్కులు ఉండేలా చూడాలి. ♦ వ్యర్థాలను నిర్వీర్యం చేసే ప్లాంట్లను నిరంతరం అధికారులు పర్యవేక్షించాలి. ♦ సేకరించిన వ్యర్థాలను 48 గంటల్లోగా నిర్వీర్యం చేయాలి బయో వ్యర్థాల నిర్వహణ ఎలా ఉంటుందంటే.. ♦ ప్రతి జిల్లాలో టెండర్ల ద్వారా పీసీబీ ఆధ్వర్యంలో సంస్థను నిర్ణయిస్తారు. ♦ జిల్లాకొక కాంట్రాక్టర్‌ను నిర్ణయిస్తారు. అదే జిల్లాలో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. ♦ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యర్థాలన్నీ ఏ రోజుకారోజు సేకరించాలి. ♦ ఆస్పత్రిలోనే వ్యర్థాలను వేర్వేరు బ్యాగుల్లో వేసి సంచిని సీల్ చేసి బార్కోడ్ వేస్తారు. ♦ ఆ వ్యర్థాల సంచులను నిర్వీర్యం చేసే ప్లాంట్ వరకూ తెరవకుండా తీసుకెళ్లాలి. వ్యర్థాల నిర్వహణ ఎలా ఉండాలి? ఆస్పత్రుల నుంచి విడుదలయ్యే వ్యర్థాల్లో నాలుగు రకాలు ఉంటాయి. వీటిని వేర్వేరు బ్యాగుల్లో వేస్తారు. పసుపు పచ్చ బ్యాగులో టాక్సిన్ వేస్ట్ (విషపూరిత వ్యర్థాలు లేదా అవయవాలు), ఎర్రబ్యాగుల్లో సిరంజిలు, గ్లౌజ్ వంటి ప్లాస్టిక్‌వి, తెల్ల బ్యాగుల్లో నీడిల్స్, కత్తులు, నల్లబ్యాగుల్లో ఆహార వ్యర్థాలు తీసుకెళ్లాలి. ముఖ్యంగా ఎర్రబ్యాగుల్లో వేసిన ప్లాస్టిక్‌ను వెయ్యి సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలో కరిగించి, ముక్కలు చేయాలి. దీనికి కేజీకి రూ.10 ఇస్తారు. ఆసుపత్రుల్లో ఏం జరుగుతోంది దాదాపు అన్ని జిల్లాల్లో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను బ్యాగుల్లో నుంచి తీసి నేరుగా చెత్త సేకరించేవారికి కేజీ రూ.60కు అమ్మేస్తున్నారు. వారు ఈ వ్యర్థాలను స్వల్ప ఉష్ణోగ్రతలో కరిగించి స్ట్రాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ఐస్‌క్రీమ్ కప్పులుగా తయారుచేస్తున్నారు. నష్టాలేంటి దీనివల్ల హెపటైటిస్ బి, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంది. చర్యలు శూన్యం ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బయో వ్యర్థాల వల్ల జబ్బులొస్తున్నాయని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులూ చర్యలు తీసుకోవడంలేదు. విజయవాడ అరండల్‌పేటలో ‘సాక్షి’ పరిశీలనకు వెళ్లగా బ్యాగులు తీసేసి అప్పటికప్పుడే ఇతర ప్రాంతానికి తరలించారు. మరమ్మతులున్నాయని అనుమతించాం కృష్ణా జిల్లాలో ఉన్న ప్లాంటు మరమ్మతుకు వచ్చిందంటే 15 రోజులు గుంటూరులోని ప్లాంటులో వ్యర్థాలను నిర్వీర్యం చేస్తామంటే అనుమతి ఇచ్చాం. – కె.వి.రావు, జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, పీసీబీ, విజయవాడ అక్కడ పరిస్థితులు దారుణం నిబంధనల ప్రకారం వ్యర్థాల నిర్వీర్యం జరగడం లేదు. కొన్ని రోజుల కిందటే ఈ ప్లాంట్‌ను చూసి కాంట్రాక్టర్‌కు నోటీసు ఇచ్చాం. బయో వ్యర్థాలు ఓపెన్ చేసి ఎక్కువ సేపు ఉంచడం వల్ల వాసనలు వస్తున్నాయి. – మహేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, పీసీబీ, గుంటూరు బయో వ్యర్థాల వల్ల పెను ప్రమాదం బయో వ్యర్థాలను సరిగా నిర్వీర్యం చేయకపోతే పెను ప్రమాదం పొంచి ఉన్నట్టే. హెచ్ఐవీ, హెపటైటిస్ బి, సి, ఎ వంటి వ్యాధులు వస్తాయి. ఆస్పత్రిలో వాడిన కత్తులు, నీడిల్స్, సర్జికల్ బ్లేడ్స్ కారణంగా టైఫాయిడ్, కలరా, ఇన్ఫెక్షన్లు, రుమటిక్ ఫీవర్, చర్మసంబంధిత వ్యాధులు వస్తాయి. రక్తం వంటివి ఉన్న బ్యాగులు లేదా, గ్లౌజులు సరిగా నిర్వీర్యం చేయకపోతే ఫైలేరియాసిస్, మలేరియా లాంటి వ్యాధులూ వస్తాయి. – డా.హరిచరణ్, అసోసియేట్ ప్రొఫెసర్, కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల. -
బయో వ్యర్థాలతో ఆటలా..!
సాక్షి, పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ) : ఎంతో జాగ్రత్తగా తరలించాల్సిన బయో వ్యర్థాలను కేజీహెచ్ ఆవరణలో ఎక్కడబడితే అక్కడే పారిశుధ్య సిబ్బంది కాల్చేస్తున్నారు. బాటిల్స్‌లో సేకరించిన రక్త నమూనాలు, సిరంజిలు, పెప్పెట్లు వంటివి ఆవరణలో కాల్చేయడంతోపాటు తుప్పల్లో, డొంకల్లో పారేస్తున్నారు. అసలు వీటిని అంత నిర్లక్ష్యంగా ఎవరు బయటకు తీసుకొస్తున్నారో అంతుచిక్కడం లేదు. భవంతుల వెనుక ఉన్న ఖాళీ స్థలాల్లో వీటిని తగలబెట్డడం వల్ల ఎవరికీ తెలియడం లేదు. అటుగా వెళ్లిన రోగులు, వారి బంధువులు వీటిని చూసి భయపడుతున్నారు. విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని చెబుతున్నారు. బయో వ్యర్థాలను జాగ్రత్తగా తరలించాల్సిన పారిశుధ్య సిబ్బంది ఈ విధంగా చేయడం వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని... అధికారులు తగిన చర్యలు తీసుకొని సంబంధిత సిబ్బందిని హెచ్చరించాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. -
బాబోయ్.. బయోభూతం
ఆస్పత్రుల నుంచి వచ్చే బయో వ్యర్థాలనుప్రత్యేకంగా తరలించి ప్లాంటులో నిర్వీర్యంచేయాల్సి ఉండగా చాలావరకు నిబంధనలనుపాటించడం లేదు. పలు ఆసుపత్రుల నుంచిసేకరించిన వీటిని చెత్తతో కలిపి సాధారణడంపింగ్యార్డులకు తరలిస్తున్నారు. కాగా..ఈ ప్లాంటు మన జిల్లాలో లేకపోవడం..పొరుగున ఉన్న అనంతపురం జిల్లా ధర్మవరంమండలంలో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్నప్లాంటుకు వీటిని తరలించాల్సి ఉంది. కొన్నిప్రైవేటు ఆసుపత్రులు ఈ సంస్థతో ఒప్పందంచేసుకోకపోవడంతో.. ఒప్పందంలో ఉన్నఆసుపత్రులూ ఈ కార్యక్రమాన్ని సరిగాచేపట్టక పోవడంతో పాటు వ్యర్థాలనుఎక్కడంటే అక్కడ చెత్తలో పడేస్తున్నారు.జనాలను రోగాల పాల్జేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ ప్రమాదకరంగా మారుతోంది. వ్యర్థాలను నిబంధనల ప్రకారం నిర్వీర్యం చేయాల్సి ఉన్నా పలు చోట్ల ఈ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. దీంతో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. రోగులకు వినియోగించిన సిరంజీలు, బ్యాండేజీలు, బ్లేడ్లు, ఐవీసెట్లు ఇతర వ్యర్థ పరికరాల ద్వారా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. నిబంధనల ప్రకారం ఈ వ్యర్థాలను కేటాయించిన డబ్బాల్లో వేరుచేసి ప్రత్యేక ప్లాంటుకు తరలించి నీడిల్ బర్నల్ ద్వారా కరిగించి విచ్ఛిన్నం చేయాల్సి ఉంది. రోజూ 2 టన్నులు.. జిల్లాలో రిమ్స్, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి, పులివెందులలో ఏరియా ఆసుపత్రి, సీఎం ఆరోగ్య కేంద్రాలు 11, పీహెచ్‌సీలు 75, సీహెచ్‌సీలు 12ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో సుమారు 300లకు పైగా ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 1,500 మంది ఆర్ఎంపీ, ఇతరులు (ప్రథమ చికిత్స చేయగలిగిన వారు) సేవలందిస్తున్నారు. అధికసంఖ్యలో ల్యాబ్‌లూ ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల నుంచి నిత్యం సుమారు 2టన్నులకు పైగా బయోవ్యర్థాలు వస్తుంటాయని అంచనా. వాటిని కేటగిరీలుగా విభజించి ప్రత్యేకంగా కేటాయించిన డబ్బాల్లో వేయాలి. నిబంధనలు పాటించని ఆసుపత్రులు జిల్లాలో కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి ఉన్న ఆసుపత్రులు 181 ఉండగా.. మిగిలినవి అన«ధికారికంగా కొనసాగుతున్నాయి. వీటిలో అధిక శాతం ఆసుపత్రులు నిబంధనలు పాటించడం లేదు. వ్యర్థాలను వేరుచేయడం లేదు. పలుచోట్ల రంగుల డబ్బాలను కూడా పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. దీంతోపాటు కొన్నిచోట్ల వీటిని అట్ట పెట్టెల్లో వేస్తున్నారు. ఫలితంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదమున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. గ్రామాల్లో వినియోగించిన బయో వ్యర్థాలను అక్కడే చెత్తలో పడేస్తున్నారు. ఈ పరిణామం ప్రమాదకరంగా మారుతోంది. నిర్వీర్యం చేసేది కొంతే? ఆసుపత్రుల్లో వ్యర్థాలను సూచించిన రంగుల డబ్బాల్లో వేసి నిబంధనల ప్రకారం వీటిని నీడిల్ బర్నల్లో కరిగించాలి. శ్రీవెన్ ఎన్విరాన్ టెక్నాలజీస్ సంస్థ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని ధర్మవరం మండలం దంపెట్ల వద్ద ఈ వ్యర్థాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ఉంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ అయిన ఆసుపత్రుల నుంచి మంచానికి రూ.3.50 నుంచి రూ.4.50 వరకు రోజుకు వసూలు చేస్తారు. వాస్తవంగా 48గంటలకు మించి వైద్యశాలల్లో వ్యర్థాలను ఉంచకూడదు. కానీ పలుచోట్ల రోజుల తరబడి వీటిని సేకరించడం లేదు. దీంతో వ్యర్థాల నిల్వ పేరుకుపోవడంతో వీటిని పక్కనే ఉన్న డంపింగ్ డబ్బాల్లో సిబ్బంది పడేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు వీటిని కూడా కడప శివారుల్లోని మద్దిమడుగు డంపింగ్‌యార్డుకు తరలించి తగులబెడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఈ విషయంలో కఠిన చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో భారీసంఖ్యలో ఆసుపత్రులు ఉండగా రోజుకు కేవలం 429 కేజీల వ్యర్థాలు వస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. నిబంధనలు ఇవి.. ♦ ఎరుపురంగు డబ్బాలో గ్లవ్స్, ప్లాస్టిక్ గొట్టాలు, సీసాలు, సెలైన్ సీసాలు, ఐవీ సెట్లు, మూత్రసంచులు, సూదులు లే ని సిరంజీలు, ట్యూబ్‌లు వ్యర్థాలు వేయాలి. ♦ పసుపు రంగు డబ్బాలో దూది, డ్రస్సింగ్, పిండికట్టు వ్యర్థాలు, గాజు వస్త్రం, శరీర ద్రవాలు, భాగాలు, అవయవాలు, నమూనాలు, మానవ కణజాలాలు, సూక్ష్మ క్రిమి వ్యర్థాలు, నెత్తురు, చీము, రక్త సంచులు, గడువు ముగిసిన మందులు, టీకాలు వంటి వాటిని వేయాలి. ♦ నీలం రంగు డబ్బాలో గాజు సీసాలు, ఇంప్లాట్లు, ప్రూఫ్ కంటైనర్లలో సూదులు, సిరంజీలు, కత్తిరించిన సూదులు వంటి వ్యర్థాలను వేర్వేరుగా వేయాలి. వ్యర్థాల విచ్ఛిన్నానికి చర్యలు.. ఆసుపత్రి వ్యర్థాలను సేకరించి విచ్ఛిన్నం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రోజూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి సేకరించి ప్లాంటుకు తరలించే విధంగా ఏర్పాట్లు చేశాం. మంచాల(బెడ్స్) ప్రాతిపదికన సొమ్ము తీసుకుని వ్యర్థాలను సేకరిస్తున్నారు. అసుపత్రి వ్యర్థాలు చెత్తలో కలుస్తుండడం, దీనిని డంపింగ్ యార్డులకు తరలిస్తుండడాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. జిల్లాలో అథరైజేషన్ చేయించుకోని 13 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశాం. – నరేంద్రబాబు, ఈఈ, కాలుష్య నియంత్రణ మండలి, తిరుపతి -
వ్యర్థం.. అనర్థం
ఒక ప్లాస్టిక్ బాటిల్ నలిపి పారేస్తాం.. ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వాడి పారేస్తాం..కానీ మనం అనుకుంటున్న ఆ ఒక్క ప్లాస్టిక్ బాటిల్.. ఆ ఒక్క ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్.. ఒకట్లు పదులవుతున్నాయి.. వందలు వేలవుతున్నాయి.. లక్షలు కోట్లవుతున్నాయి.. అటు వాటిని రీసైక్లింగ్ చేసే యూనిట్ల పరిస్థితీ అంతంత మాత్రంగా ఉండటంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉభయ తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. సాక్షి, అమరావతి: గత నాలుగైదేళ్లలో తెలంగాణ, ఏపీలో ప్లాస్టిక్ వ్యర్థాల విడుదల పెరిగిపోతోంది. దీంతో వేలాది మంది జబ్బుల బారిన పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు ప్లాస్టిక్ చెత్త విడుదల్లో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఇంత భారీ వ్యర్థాన్ని నిర్వీర్యం లేదా రీసైక్లింగ్ చేసేందుకు తగిన వ్యవస్థలు లేకపోవడం, నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం పర్యావరణానికి ముప్పుగా మారింది. గతంలో ప్లాస్టిక్ వాడొద్దు.. పేపర్ బ్యాగ్‌లు వాడాలని ప్రచారం చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు పట్టించుకోవడం లేదు. నియంత్రణకు చర్యలేవీ? 2011లో 1.40 లక్షల టన్నులున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఇప్పుడు 2.43 లక్షల టన్నులకు చేరాయి. చెత్త సేకరణ చేసి సకాలం లో నిర్వీర్యం చేసే పరిస్థితి లేదు. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో వివిధ ఆస్పత్రుల నుంచి వెలువడే బయోమెట్రిక్ వ్యర్థాల నిర్వీర్యం కూడా సరిగా జరగడం లేదని తేలింది. అమలుకాని నిబంధనలు.. ప్లాస్టిక్ వినియోగంపై నిబంధనలు అమలు కావడంలేదు. 50 మైక్రాన్ల బ్యాగుల కంటే తక్కువ మందం ఉన్న బ్యాగుల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2016లో నిబంధనలు విధించింది. ఆస్పత్రుల్లో విడుదలవుతున్న బయో వ్యర్థాలపైన కూడా ఆంక్షలు విధించింది. ఎక్కడైతే బయో వ్యర్థాలు విడుదలవుతున్నాయో వాటి నిర్వీర్యంలో కూడా ఆ సంస్థలే ప్రధానంగా బాధ్యత వహించాలని సూచించారు. కానీ ఈ నిబంధనలు తెలుగు రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. ప్లాస్టిక్ వ్యర్థాలతో వచ్చే భయానక జబ్బులు - ఆడవాళ్లలో పునరుత్పత్తి ప్రక్రియ(సంతానోత్పత్తి)కు విఘాతం.. వ్యాధి నిరోధకత భారీగా తగ్గుతుంది - కేన్సర్ వ్యాధికారకాలు పెరిగి వ్యాధి బారిన పడే అవకాశం - సెక్స్ హార్మోన్లు క్రమంగా తగ్గుతాయి - గుండె జబ్బులు రావడానికి కూడా దోహదం కేరళను చూసి నేర్చుకోవాల్సిందే ప్లాస్టిక్ బ్యాగుల ఉత్పత్తి, వాటి నిర్వీర్యం,రీ సైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి వాటిలో దేశంలోనే కేరళ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. కేరళలో ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి 50 వేల టన్నులు వీటిని నిర్వీర్యం,రీసైక్లింగ్ చేయడానికి ఉన్న యూనిట్లు 807 2.43(లక్షల టన్నులు) ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యేటా విడుదలవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు 67 రెండు రాష్ట్రాల్లో కలిపి రీసైక్లింగ్ యూనిట్లు.వీటిలో కొన్ని పనిచేయడంలేదు -
రిమ్స్ లో పేరుకుపోయిన చెత్త
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో రోగుల కోసం ఉపయోగించిన బయోవేస్ట్ చెత్త(సెలైన్ బాటిళ్లు, సిరంజీలు, ఆపరేషన్‌కు ఉపయోగించే వస్తువులు)కు సంబంధించిన జీవవ్యర్థ పదార్థాలు పేరుకుపోతున్నాయి. చెత్తను తరలించే సొసైటీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కంపుకొడుతున్నాయి. చెత్తను సేకరించి దూరప్రాంతాలకు తరలించేందుకు బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సొసైటీ పనిచేయాల్సి ఉంది. 2011 మేలో జీవవ్యర్థ పదార్థాలను తరలించేందుకు ఈ సొసైటీ రిమ్స్‌లో టెండర్ దక్కించుకుంది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో అప్పటి కలెక్టర్ ఈ టెండర్‌ను ప్రకటించారు. అయితే రెండేళ్లు గడుస్తున్నా సొసైటీ సేవలు నామమాత్రంగా ఉన్నాయి. సదరు కాంట్రాక్టర్ సమావేశాలకే తప్ప రిమ్స్‌లో కనిపించరనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రిమ్స్‌లో జీవవ్యర్థ పదార్థాలు పేరుకుపోయి రోగాలు ప్రబలే అవకాశం ఉంది. ఒక దశలో మిగతా చెత్తను తీసుకెళ్లాల్సిన మున్సిపల్ సిబ్బంది కూడా ఇటు వైపు రావడమే మానేశారు. నిధులు కాంట్రాక్టర్ పాలు ప్రతీరోజు ఆస్పత్రిలోని ఒక్క పడకకు రూ.5 చొప్పున బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సొసైటీ వసూలు చేస్తోంది. రిమ్స్‌లో దాదాపు 400 పడకలు ఉన్నాయి. అంటే రోజు రూ.2 వేలు కాగా, నెలకు రూ.60 వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. 2011 మేలో కాంట్రాక్టు దక్కించుకున్న సొసైటీ ఇప్పటివరకు దాదాపు 27 నెలలుగా చెత్తను తరలించడం లేదు. అంటే నెలకు రూ.60 వేల చొప్పున రూ.16 లక్షలకుపైగా డబ్బులు కాంట్రాక్టర్ జేబుల్లోకి వెళ్లాయి. ఉదయమే సొసైటీ సిబ్బంది ఆస్పత్రికి వచ్చి జీవవ్యర్థ పదార్థాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇదేమి పట్టనట్టుగా సొసైటీ కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నాడు. రిమ్స్‌లోని పోస్టుమర్టం గది వద్ద, ఆస్పత్రి వెనుక రోడ్డుపై డంపింగ్ యార్డులో జీవవ్యర్థ పదార్థాలు కనిపిస్తున్నాయి. ఆస్పత్రిలోని ప్రతివార్డులో రోగులకు ఇచ్చిన ఇంజక్షన్లు, ఆపరేషన్ థియేటర్లో ఉపయోగించిన సర్జరీ వస్తువులు జాగ్రత్తగా ఒక బ్యాగులో ఉంచి బయో మెడికల్ సొసైటీ వారు దీనిని డిస్పోస్ చేయాలి. ఈ సొసైటీ వాహనం ద్వారా ఈ జీవవ్యర్థ పదార్థాలు నిజామాబాద్‌లో ఉన్న వారి యూనిట్ కేంద్రానికి తరలించాలి. కానీ, ఇక్కడ సిబ్బంది నిరక్ష్యం కారణంగా, పర్యవేక్షకుల లోపంతో సెలైన్లు, ఇంజక్షన్లు డంపింగ్ యార్డులో పడేసిన దానిని ఎవ్వరు పట్టించుకోవడం లేదు. రూ.లక్షలు నష్టపోతున్న రిమ్స్ రిమ్స్‌లో వాడిన సెలైన్ డబ్బాలు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ప్రతి నెల టెండర్లు నిర్వహించాల్సి ఉంటుంది. రోజు ఉపయోగించే వాటిని ఒక గదిలో భద్రపరిచి నెలరోజుల తర్వాత కిలోల చొప్పున టెండర్లు నిర్వహించాలి. వైద్య విధాన పరిషత్ సమయంలో టెండర్లు నిర్వహించేవారు. ప్రస్తుతం వీటికి గ్రహణం పట్టింది. ఆస్పత్రిలో వాడుతున్న సెలైన్లు, ప్లాస్టిక్ వస్తువులు నిల్వ ఉంచకుండా ఇష్టారీతిన డంపింగ్ యార్డుల్లో పడేయడంతో రిమ్స్ రూ.లక్షలు నష్టపోతోంది. దాదాపు రోజు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రోగులకు సుమారు 1000కిపై సెలైన్లు ఉపయోగిస్తారు. ఈ లెక్కన చూస్తే నెలకు 30 వేల వరకు ఖాళీ సెలైన్ బాటిళ్లు జమచేయాలి. వీటికి టెండర్లు నిర్వహించి వచ్చిన ఆదాయంతో ఆస్పత్రి అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి. కానీ, రిమ్స్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెండర్లు నిర్వహించ లేదు. దీంతో రోజు ఉపయోగిస్తున్న సెలైన్ బాటిళ్లు డంపింగ్ యార్డులో దర్శనమిస్తున్నాయి. సొసైటీ వారు కూడా వీటిని అలాగే వదిలి వేయడంతో రూ.లక్షలు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. రోగాలు ప్రబలే ప్రమాదం రిమ్స్‌లో జీవవ్యర్థ పదార్థాలు ఆస్పత్రి వెనుక పడేయడంతో రోగాలు ప్రబలే అవకాశం ఉంది. డంపింగ్ యార్డులో జీవవ్యర్థ పదార్థాలు పడేయంతో పశువులు, పందులు సంచరిస్తున్నాయి. రోగులుకు ఉపయోగించిన సర్జరీ వస్తువులు, రోగులు పడేసిన చెత్త రెండిటిని రోడ్డుపైనే పడేస్తున్నారు. దీంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లే వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వర్షకాలంలో సిరంజీలు, ఇతర హానీ చేసే వస్తువులు బురదలో కూరకుపోతున్నాయి. ఇవి కాళ్లకు కుచ్చుకునే ప్రమాదం ఉంది. పందులు సంచరిస్తుండడంతో వాటి వల్ల రోగాలు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. పశువులు రిమ్స్‌లోని డంపింగ్ యార్డులోని వ్యర్థ పదార్థాలు తినడం ద్వారా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. దీనికి తోడు దోమలు వృద్ధి చెందడంతో వ్యాధులు వ్యాపించే అవకాశం లేకపోలేదు. వ్యాధి నయం చేసుకోవడం కోసం ఆస్పత్రికి వస్తే ఆస్పత్రిలో ఉన్న అపరిశుభ్రతతో ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని రోగులు భయపడుతున్నారు. అధికారులు స్పందించి ఆస్పత్రిలో పేరుకుపోతున్న చెత్తను తొలగించాలని రోగులు కోరుతున్నారు. నోటీసులు పంపాం..- డాక్టర్ శశిధర్, రిమ్స్ డెరైక్టర్ రిమ్స్‌లో రోజు జీవవ్యర్థ పదార్థాలు తీసుకెళ్లడం లేదని మా దృష్టికి వచ్చింది. సదరు కాంట్రాక్టర్‌కు నోటీసులు అందజేశాము. రోజు ఉపయోగించిన సిరంజీలు ఒక బ్యాగులో ఉంచి సొసైటీ వాహనంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. గతంలో బ్యాగుల కొరత ఉందని చెప్పిన కాంట్రాక్టర్ అప్పటి నుంచి వ్యర్థ పదార్థాలు తరలించడం లేదని తెలిసింది. దీనిపై కాంట్రాక్టర్‌ను పిలిపించి హెచ్చరించాం. అయిన మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది. త్వరలో ఉన్నత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం.