వ్యర్థం.. అనర్థం
ఒక ప్లాస్టిక్ బాటిల్ నలిపి పారేస్తాం.. ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వాడి పారేస్తాం..కానీ మనం అనుకుంటున్న ఆ ఒక్క ప్లాస్టిక్ బాటిల్.. ఆ ఒక్క ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్.. ఒకట్లు పదులవుతున్నాయి.. వందలు వేలవుతున్నాయి.. లక్షలు కోట్లవుతున్నాయి.. అటు వాటిని రీసైక్లింగ్ చేసే యూనిట్ల పరిస్థితీ అంతంత మాత్రంగా ఉండటంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉభయ తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి.
సాక్షి, అమరావతి: గత నాలుగైదేళ్లలో తెలంగాణ, ఏపీలో ప్లాస్టిక్ వ్యర్థాల విడుదల పెరిగిపోతోంది. దీంతో వేలాది మంది జబ్బుల బారిన పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు ప్లాస్టిక్ చెత్త విడుదల్లో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఇంత భారీ వ్యర్థాన్ని నిర్వీర్యం లేదా రీసైక్లింగ్ చేసేందుకు తగిన వ్యవస్థలు లేకపోవడం, నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం పర్యావరణానికి ముప్పుగా మారింది. గతంలో ప్లాస్టిక్ వాడొద్దు.. పేపర్ బ్యాగ్‌లు వాడాలని ప్రచారం చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు పట్టించుకోవడం లేదు.
నియంత్రణకు చర్యలేవీ?
2011లో 1.40 లక్షల టన్నులున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఇప్పుడు 2.43 లక్షల టన్నులకు చేరాయి. చెత్త సేకరణ చేసి సకాలం లో నిర్వీర్యం చేసే పరిస్థితి లేదు. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో వివిధ ఆస్పత్రుల నుంచి వెలువడే బయోమెట్రిక్ వ్యర్థాల నిర్వీర్యం కూడా సరిగా జరగడం లేదని తేలింది.
అమలుకాని నిబంధనలు..
ప్లాస్టిక్ వినియోగంపై నిబంధనలు అమలు కావడంలేదు. 50 మైక్రాన్‌ల బ్యాగుల కంటే తక్కువ మందం ఉన్న బ్యాగుల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2016లో నిబంధనలు విధించింది. ఆస్పత్రుల్లో విడుదలవుతున్న బయో వ్యర్థాలపైన కూడా ఆంక్షలు విధించింది. ఎక్కడైతే బయో వ్యర్థాలు విడుదలవుతున్నాయో వాటి నిర్వీర్యంలో కూడా ఆ సంస్థలే ప్రధానంగా బాధ్యత వహించాలని సూచించారు. కానీ ఈ నిబంధనలు తెలుగు రాష్ట్రాల్లో అమలు కావడం లేదు.
ప్లాస్టిక్ వ్యర్థాలతో వచ్చే భయానక జబ్బులు
- ఆడవాళ్లలో పునరుత్పత్తి ప్రక్రియ(సంతానోత్పత్తి)కు విఘాతం.. వ్యాధి నిరోధకత భారీగా తగ్గుతుంది
- కేన్సర్ వ్యాధికారకాలు పెరిగి వ్యాధి బారిన పడే అవకాశం
- సెక్స్ హార్మోన్లు క్రమంగా తగ్గుతాయి
- గుండె జబ్బులు రావడానికి కూడా దోహదం
కేరళను చూసి నేర్చుకోవాల్సిందే
ప్లాస్టిక్ బ్యాగుల ఉత్పత్తి, వాటి నిర్వీర్యం,రీ సైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి వాటిలో దేశంలోనే కేరళ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది.
కేరళలో ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి 50 వేల టన్నులు
వీటిని నిర్వీర్యం,రీసైక్లింగ్ చేయడానికి ఉన్న యూనిట్లు 807
2.43(లక్షల టన్నులు) ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యేటా విడుదలవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు
67 రెండు రాష్ట్రాల్లో కలిపి రీసైక్లింగ్ యూనిట్లు.వీటిలో కొన్ని పనిచేయడంలేదు