పర్యావరణ నిర్వహణ సేవల్లో ఉన్న రీ సస్టేనబిలిటీ అధిక నాణ్యత కలిగిన రీసైకిల్డ్ పాలిమర్స్ తయారీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మ్యారికో వ్యవస్థాపక కుటుంబమైన హర్ష మారివాలా ఫ్యామిలీ యాజమాన్య మూలధనాన్ని నిర్వహిస్తున్న షార్ప్ వెంచర్స్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తోంది.
ఈ సంయుక్త భాగస్వామ్యంలో రీ సస్టేనబిలిటీకి 85 శాతం, షార్ప్ వెంచర్స్ మిగిలిన వాటాను కలిగి ఉంటాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసేందుకు హైదరాబాద్‌తోపాటు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వద్ద ఏఐ సాంకేతికతతో కూడిన అత్యాధునిక ప్రాసెసింగ్ కేంద్రాలను నెలకొల్పుతామని రీ సస్టేనబిలిటీ ఎండీ, సీఈవో మసూద్ మాలిక్ తెలిపారు. మ్యారికో ఫౌండర్, చైర్మన్ హర్ష మారివాలాతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వచ్చే ఏడాది రెండు ప్లాంట్లు కార్యరూపంలోకి వస్తాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా ఏటా 32,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తాం’ అని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ దాదాపు అన్ని దేశాలకు సవాలుగా మారుతోంది. ఎఫ్‌ఎంసీజీ, రిటైల్ పరిశ్రమలతో పాటు ఇతర చాలా రంగాల్లో అనివార్యంగా ఇంకా ప్లాస్టిక్‌ను వాడుతున్నారు. ఆయా రంగాల్లో దాని స్థానంలో ఇతర ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇవి పూర్తయి ప్రాచుర్యం పొంది అందరికీ అందుబాటులోకి రావాలంటే మరింత సమయం పడుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అయితే అప్పటివరకు విడుదలయ్యే ప్లాస్టిక్‌తో మానవాళికి ప్రమాదం పొంచి ఉంది. దాని నిర్వహణ కోసం కంపెనీలు కొత్త టెక్నాలజీలను వాడుతున్నాయి. అందులో భాగంగానే రీ సస్టేనబిలిటీ, షార్ప్ వెంచర్స్ కంపెనీలు సంయుక్తంగా ఏఐ సాంకేతికతను వినియోగించుకుంటూ ప్లాస్టిక్‌ను రిసైకిల్ చేసి పాలిమర్స్‌ను తయారు చేసేందుకు సిద్ధం అయ్యాయి.
ఇదీ చదవండి: ఈవీ సబ్సిడీపై కీలక వ్యాఖ్యలు.. మంత్రి స్పష్టత
ఇప్పటికే ప్లాస్టిక్ అంతటా వ్యాపించింది. నేల, చెరువులు, నదులు, సముద్రాలన్నింటినీ ఆక్రమిస్తోంది. కాలువలు, నదుల ద్వారానే ప్రతి ఏడాది 1.2 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే 2040కల్లా సుమారు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతాయని అంచనా. ప్లాస్టిక్ ఉత్పత్తి సమయంలో వెలువడే ఉద్గారాలు తీవ్ర వాయు కాలుష్యానికి కారకాలుగా మారుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్పందించి ఈ విభాగంలో సేవలందిస్తున్న కంపెనీలకు ప్రోత్సాహకాలు పెంచాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment