Plastic goods
-
రీ సస్టేనబిలిటీ రీసైకిల్డ్ పాలిమర్స్
పర్యావరణ నిర్వహణ సేవల్లో ఉన్న రీ సస్టేనబిలిటీ అధిక నాణ్యత కలిగిన రీసైకిల్డ్ పాలిమర్స్ తయారీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మ్యారికో వ్యవస్థాపక కుటుంబమైన హర్ష మారివాలా ఫ్యామిలీ యాజమాన్య మూలధనాన్ని నిర్వహిస్తున్న షార్ప్ వెంచర్స్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తోంది.ఈ సంయుక్త భాగస్వామ్యంలో రీ సస్టేనబిలిటీకి 85 శాతం, షార్ప్ వెంచర్స్ మిగిలిన వాటాను కలిగి ఉంటాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసేందుకు హైదరాబాద్‌తోపాటు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వద్ద ఏఐ సాంకేతికతతో కూడిన అత్యాధునిక ప్రాసెసింగ్ కేంద్రాలను నెలకొల్పుతామని రీ సస్టేనబిలిటీ ఎండీ, సీఈవో మసూద్ మాలిక్ తెలిపారు. మ్యారికో ఫౌండర్, చైర్మన్ హర్ష మారివాలాతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వచ్చే ఏడాది రెండు ప్లాంట్లు కార్యరూపంలోకి వస్తాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా ఏటా 32,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తాం’ అని ఆయన ఈ సందర్భంగా వివరించారు.ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ దాదాపు అన్ని దేశాలకు సవాలుగా మారుతోంది. ఎఫ్ఎంసీజీ, రిటైల్ పరిశ్రమలతో పాటు ఇతర చాలా రంగాల్లో అనివార్యంగా ఇంకా ప్లాస్టిక్‌ను వాడుతున్నారు. ఆయా రంగాల్లో దాని స్థానంలో ఇతర ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇవి పూర్తయి ప్రాచుర్యం పొంది అందరికీ అందుబాటులోకి రావాలంటే మరింత సమయం పడుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అయితే అప్పటివరకు విడుదలయ్యే ప్లాస్టిక్‌తో మానవాళికి ప్రమాదం పొంచి ఉంది. దాని నిర్వహణ కోసం కంపెనీలు కొత్త టెక్నాలజీలను వాడుతున్నాయి. అందులో భాగంగానే రీ సస్టేనబిలిటీ, షార్ప్ వెంచర్స్ కంపెనీలు సంయుక్తంగా ఏఐ సాంకేతికతను వినియోగించుకుంటూ ప్లాస్టిక్‌ను రిసైకిల్ చేసి పాలిమర్స్‌ను తయారు చేసేందుకు సిద్ధం అయ్యాయి.ఇదీ చదవండి: ఈవీ సబ్సిడీపై కీలక వ్యాఖ్యలు.. మంత్రి స్పష్టతఇప్పటికే ప్లాస్టిక్ అంతటా వ్యాపించింది. నేల, చెరువులు, నదులు, సముద్రాలన్నింటినీ ఆక్రమిస్తోంది. కాలువలు, నదుల ద్వారానే ప్రతి ఏడాది 1.2 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే 2040కల్లా సుమారు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతాయని అంచనా. ప్లాస్టిక్ ఉత్పత్తి సమయంలో వెలువడే ఉద్గారాలు తీవ్ర వాయు కాలుష్యానికి కారకాలుగా మారుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్పందించి ఈ విభాగంలో సేవలందిస్తున్న కంపెనీలకు ప్రోత్సాహకాలు పెంచాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఆశయం మంచిదే కానీ...
ప్రమాదం పొంచి ఉందని అర్థమైనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ప్రపంచాన్ని, అందులోనూ మన దేశాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ దుర్వినియోగంపై కొరడా జుళిపించడం అర్థం చేసుకోదగినదే. ఈ జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ‘తక్కువ ఉపయోగం, ఎక్కువగా వ్యర్థాలు పేరుకొనే’ కొన్ని రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, అమ్మకం, వినియోగాలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. అలాగే, ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తిదారులు, ఎగుమతి దారులు, బ్రాండ్ ఓనర్లు తప్పనిసరిగా నిర్ణీతస్థాయిలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయాలని షరతు పెట్టింది. గత ఫిబ్రవరిలోనే రీసైక్లింగ్ నిబంధనలు ప్రకటించిన సర్కారు ఇప్పుడు నిషేధపుటుత్తర్వులు అమలులోకి తెచ్చింది. ప్లాస్టిక్‌కు చౌక ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేవంటూ వ్యతిరేకులు వాదిస్తున్న వేళ ప్రభుత్వం తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు బోలెడన్ని కసరత్తులు చేయక తప్పదు. ప్రభుత్వ ఉత్తర్వులతో ఇకపై ప్లాస్టిక్ ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు, స్ట్రాలు, స్వీట్ బాక్సులు, ఐస్‌క్రీమ్ పుల్లలు, సిగరెట్ ప్యాక్‌లు, పీవీసీ బ్యానర్లు, కొన్ని ప్లాస్టిక్ ప్యాకేజింగ్ సామగ్రి – ఇలా 19 రకాల ఉత్పత్తులు నిషిద్ధం. ప్రస్తుతం 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచీలపైనే నిషేధం పెట్టారు. డిసెంబర్ కల్లా 120 మైక్రాన్ల కన్నా తక్కువున్న అన్నిటినీ నిషేధించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతానికైతే, ప్యాకింగ్ కోసం ప్లాస్టిక్ వినియోగించవచ్చంటూ త్వరితగతిన అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) రంగాన్ని కొన్ని నిబంధనలతో ప్రభుత్వం అనుమతించింది. ప్లాస్టిక్ నిషేధ నిర్ణయాన్ని ఉల్లఘించినవారికి పర్యావరణ పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 15 కింద, దాని ఆధారంగా వివిధ నగరపాలక సంస్థలు చేసుకున్న చట్టాల కింద శిక్ష తప్పదని సర్కారు హెచ్చరిక. ప్రభుత్వ కఠిన నిర్ణయం వెనుక పెద్ద కథే ఉంది. మన దేశంలో వార్షిక తలసరి ప్లాస్టిక్ వ్యర్థాల సృష్టి దాదాపు 4 కిలోలు. ప్రపంచంలోని మిగిలిన అనేక దేశాలతో పోలిస్తే, ఇది కొంత తక్కువగా అనిపించవచ్చు. కానీ, మొత్తంగా చూస్తే మాత్రం ప్రపంచంలో చైనా, అమెరికాల తర్వాత అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నది మన దేశమే. కచ్చితమైన లెక్కలు లేవు కానీ, 2015లో 95 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలకు కారణమయ్యామని సర్కారు మాట. ఇక, 2019–20 లెక్కల ప్రకారం ప్లాస్టిక్ వ్యర్థాల్లో 12 శాతాన్నే మన దేశం రీసైకిల్ చేస్తోంది. మరో 20 శాతాన్ని కాల్చేస్తోంది. మిగతా 68 శాతం చెత్త రూపంలో, భూమిలో కలిసీ కలవక హాని కలిగిస్తున్నాయి. అలాగే, మన దేశంలో సగటున ప్రతి వ్యక్తీ ఏటా 9.5 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలవడానికి కారణమవుతున్నాడు. ఇది ఆందోళనకరం. ఇకనైనా మేల్కొనకుంటే– కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ, మనం నివసిస్తున్న పుడమి విధ్వంసానికి మనమే కారణమవుతాం. నిజానికి, 2022 కల్లా దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వాడకుండా చేస్తామంటూ 2018లోనే ప్రపంచ పర్యావరణ దినాన మన దేశం ప్రకటించింది. దానికి తగ్గట్టే ఇప్పుడీ నిషేధపు చర్య. ఈ నిర్ణయం వెనుక ఉన్న సదుద్దేశాన్ని స్వాగతిస్తూనే, అమలులో ఉన్న సాధకబాధకాలనూ గ్రహించాల్సి ఉంది. ఆ మాటకొస్తే, గత అయిదేళ్ళలో దేశంలో కనీసం 20కి పైగా రాష్ట్రాలు తమ తమ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగంపై ఏదో ఒక నియంత్రణ పెడుతూనే వచ్చాయి. ఆశయం మంచిదే అయినా, ఆశించినంతగా ఆ నియంత్రణలు అమలు కాలేదన్నది చేదు నిజం. విధులే తప్ప నిధులు, తగినంత సిబ్బంది కొరవడిన వివిధ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్ళు, మునిసిపాలిటీలు క్షేత్రస్థాయిలో చతికిలబడ్డాయి. ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూడడానికి ఏం చేయాలో ఆలోచించాలి. బలంగా, బరువు తక్కువగా, దీర్ఘకాలం మన్నే ప్లాస్టిక్ వినియోగాన్ని మాన్పించడం ఒక సవాలే. ఏటా 18 శాతం వంతున వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్న ప్యాకేజింగ్ రంగంలో మరీ కష్టం. కాబట్టి, కేవలం నిషేధాలను నమ్ముకోకుండా పలు యూరోపియన్ దేశాల్లో లాగా ప్లాస్టిక్‌పై బాధ్యతగా వ్యవహరిస్తున్న సంస్థలకు ప్రోత్సాహకాలివ్వాలి. ఆ పని చేయని సంస్థలు అందుకు తగిన మూల్యం చెల్లించేలా నిబంధన పెట్టాలి. అలాగే, నిషేధాన్ని పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్‌లు పెడితే సరిపోదు. ఆరోగ్యానికీ, పర్యావరణానికీ కలుగుతున్న నష్టం, మన వంతు బాధ్యతపై ప్రజా చైతన్యం పెంచాలి. నిషేధం అమలుకు భాగస్వామ్య పక్షాలన్నిటినీ కలుపుకొనిపోవాలి. ఉదాహర ణకు ప్లాస్టిక్‌తో పోలిస్తే, కాగితం స్ట్రాలకు ఖర్చు అయిదు రెట్లు ఎక్కువట. అసలే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న తయారీదార్లు, చిన్న వ్యాపారులపై ఇది పెనుభారం. కాబట్టి, పర్యావరణ హితంగా కంపోస్ట్ అయ్యే ప్లాస్టిక్ తయారీ లాంటివి పరిశ్రమతో కలసి ప్రభుత్వమూ అన్వేషించాలి. ఒక్కమాటలో నాలుగైదు దశాబ్దాలుగా నిత్యజీవితంలోకి పూర్తిగా జొరబడిన ప్లాస్టిక్‌ను వద్దంటే సరిపోదు. ప్రత్యామ్నాయాలు చూపించాలి. ప్లాస్టిక్ బదులు కాగితం, జనపనార, ఖాదీ సంచీలు, స్టీలు బాక్సులు వాడాలన్నది ప్రభుత్వ సూచన. అయితే, ఈ ప్రత్యామ్నాయాలు విస్తృతంగా అందు బాటులో ఉండేలా చూడడం కీలకం. ప్లాస్టిక్ బదులు కాగితం, వెదురుబొంగుల వినియోగం పెరిగితే, అది మళ్ళీ చెట్ల నరికివేతకు కారణమవుతుంది. అందుకే, చౌకగా ఉంటూనే పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాల వైపు ప్రజల్ని మళ్ళించాలి. ఈ మధ్య దీపావళి టపాసులపై ప్రజల్లో చైతన్యం తెచ్చినట్టే, ప్లాస్టిక్‌పైనా తీసుకురాగలిగితేనే ఫలితం ఉంటుంది. పర్యావరణానికీ, ప్రజారోగ్యానికీ మేలు కలుగుతుంది. ఆశయం మంచిదైనా, ఆచరణమార్గాలు కీలకమంటున్నది అందుకే! -
తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం
-
తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం.. టీటీడీ కీలక సూచనలు ఇవే..
సాక్షి, తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో నేటి(బుధవారం, జూన్ 1వతేదీ) నుంచి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. కాగా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా తిరుమల ఆస్థానమండపంలో దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో టీటీడీ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో హోటళ్లు, దుకాణాల నిర్వాహకులు తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా డస్ట్ బిన్లలో ఉంచాలని, తద్వారా సేకరణకు అనువుగా ఉంటుందని అధికారులు అదేశాలు జారీ చేశారు. దుకాణాల్లో అనుమతించిన వస్తువులనే విక్రయించాలని , దుకాణదారులు ప్రతీ మంగళవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు మాస్ క్లీనింగ్ చేపట్టాలని అధికారులు కోరారు. జూన్ ఒకటో తేదీ నుంచి విజిలెన్స్, హెల్త్, ఎస్టేట్ అధికారులు నిరంతరంగా తనిఖీలు చేసి ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడ కనిపించినా దుకాణాలను సీజ్ చేస్తారని స్పష్టం చేశారు. దుకాణదారులు ఒక సంకల్పంతో ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరారు. కాగా, ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లలో వచ్చే ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దుకాణ దారులకు సూచించారు. పంచలు, బొమ్మలు, ఇతర వస్తువులకు ప్లాస్టిక్ కవర్ల ప్యాకింగ్ లేకుండా బయోడిగ్రేడబుల్ కవర్లు గానీ, పేపర్ కవర్లు గాని ఉపయోగించాలన్నారు. ప్లాస్టిక్ షాంపూ పొట్లాలు కూడా విక్రయించరాదని టీటీడీ సూచించింది. హోటళ్ల నిర్వాహకులు, మఠాల నిర్వాహకులు కూడా ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి టీటీడీ పేర్కొంది. దుకాణాల వద్ద అధిక ధరలకు విక్రయించకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. మరోవైపు.. తిరుమల తరహాలోనే ఏపీలో ఉన్న దేవాలయాల్లో ఇక నుంచి ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో పాటు ప్లాస్టిక్ కవర్లలో పూజా సామగ్రిని ఆలయాల్లోకి ఇకపై అనుమతించబోమని అంటున్నారు. ఆలయానికి అనుబంధంగా ఉండే షాపుల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలను నిషేధించనున్నారు. ఆలయాల్లో ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్నగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని నిర్ణయించారు. జూలై 1 నుంచి.. ప్రధాన ఆలయాలు అన్నింటిలో ప్లాస్టిక్ నిషేధించనున్నట్టు అధికారులు తెలిపారు. -
‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు’
సాక్షి, విజయవాడ : 2020 నాటికి అన్ని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలిస్తామని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, నగరపాలకసంస్ధ సంయుక్త భాగస్వామ్యంతో మంగళవారం ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ వ్యర్థాల నుంచి ఇటుకలు, టైల్స్ తయారు చేయడాన్ని మంత్రి బాలినేని పరిశీలించారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ కంపెనీలకు తరలించే వాహనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం శుభపరిణామమన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేంధించేలా చర్యలు చేపట్టినట్లు, 110 మున్సిపాలిటీల్లో ఈ విధానం తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ నిషేధించాలన్న కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారని, 44 మున్సిపాలిటీల్లో మెటీరియల్ రికవరీ సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలో 7 చోట్ల కంపోస్ట్ పాయింట్స్ ఏర్పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో గత కొన్నేళ్లుగా డంపింగ్ యార్డు సమస్యగా మారిందని స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. నగరంలో ప్రతిరోజు 500 టన్నుల చెత్త ఉత్పత్తి అయి ఈ యార్డుకు చేరుతుందని, పనికిరానీ వ్యర్థాలను సిమెంట్ కంపెనీలకు పంపడం ద్వారా కొంత వరకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి మార్చడం లో గత ప్రభుత్వం విఫలమైందని, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, నగర పాలక సంస్థ, అల్ట్రాటెక్ సిమెంట్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. గుంటూరు, పాతపాడు ప్రాంతలకు డంపింగ్ యార్డు తరలించేలా చర్యలు చేపడుతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నగరంలో 7 చోట్ల కంపోస్ట్ పాయింట్స్ ఏర్పాటు చేశామని వీఎంసీ కమిషనర్ ప్రసన్న కుమార్ వెల్లడించారు. 250 టన్నుల పొడి చెత్తను ఎరువుగా మార్చే ప్రక్రియ చేపట్టామని, అల్ట్రాటెక్ సిమెంట్ వారు 50 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను ఫ్యూయల్ గా వినియోగించుకునేలా ఒప్పందం కుదిరిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ప్రసాద్ పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ భూతం.. అంతానికి పంతం
నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్ భూతం అగ్రస్థానంలో ఉంది. మనిషి తన సౌకర్యం కోసం తయారు చేసుకున్న ఈ పదార్థం అతనికే కాకుండా ప్రాణికోటికే ముప్పుగా పరిణవిుంచింది. ఇటీవలికాలంలో కడలి ఒడ్డుకు కొట్టుకొచి్చన మృత తిమింగలం ఉదరంలో దొరికిన కిలోల కొద్దీ ప్లాస్టిక్ వస్తువులు మనిషి నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేశాయి. నేలనే కాదు సముద్రాన్నీ, నింగినీ కాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్నామనే కఠోర వాస్తవాలను ఇటువంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అనర్థాలపై పౌరసమాజం స్పందిస్తోంది. ఇదిలా ఉద్యమరూపం సంతరించుకుంటే ఉపద్రవం తొలగుతుందన్న భరోసా కలుగుతోంది. రీ సైక్లింగ్‌కు కష్టతరమైనవి.. ప్లాస్టిక్ ఫోమ్ కప్పులు, కోడిగుడ్డు, మాంసం ట్రేలు, ప్యాకింగ్ పీనట్స్, కోట్ హ్యాంగర్స్, యోగర్ట్ కంటైనర్స్, ఇన్సులేషన్, ఆటబొమ్మలు. రీసైక్లింగ్ మేనేజ్ చేయగలిగినవి ప్యాకేజింగ్ ఫిలిం, షాపింగ్ బ్యాగ్స్, బబుల్ ర్యాప్, ఫ్లెక్సిబుల్ బాటిల్స్, వైర్ అండ్ కేబుల్ ఇన్సులేషన్, బాటిల్ టాప్స్, డ్రింకింగ్ స్ట్రాస్, లంచ్ బాక్సులు, ఇన్సులేటెడ్ కూలర్లు, ఫ్య్రాబ్రిక్ అండ్ కార్పెట్ టారప్స్, డైపర్స్. తెనాలి (గుంటూరు జిల్లా): ప్లాస్టిక్‌తో నేడు ప్రపంచంలోని ప్రతి ప్రదేశమూ ముప్పును ఎదుర్కొంటోంది. ఒక్కో మనిషి ఏడాదిలో 11 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్టు అధికారిక అంచనా. వీటిలో సగం ఒకసారి ‘యూజ్ అండ్ త్రో’ ప్లాస్టిక్ వస్తువులే. 2022 నాటికి దేశాన్ని ప్లాస్టిక్ రహితంగా రూపొందించాలని గాంధీజీ 150వ జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రభుత్వాలే కాదు, ప్లాస్టిక్ అనర్థాలపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన కలుగుతోంది. ప్లాస్టిక్ వస్తువులకు కూరగాయలు... గుంటూరు జిల్లాలో ఏకైక స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటి తెనాలిలో రోజుకు అర టన్ను చొప్పున నెలకు 15 టన్నులు ప్లాస్టిక్ చెత్త వస్తోంది. రీసైక్లింగ్‌కు వీలుకాని 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన క్యారీ బ్యాగులను మున్సిపాలిటీ నిషేధించింది. ఆకస్మిక తనిఖీలు చేస్తూ జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. తడిచెత్త, పొడిచెత్త పేరుతో వేర్వేరుగా చెత్తను సేకరించటమే కాకుండా ప్లాస్టిక్ చెత్తను కూడా సేకరిస్తున్నారు. ప్రజలనూ భాగస్వాముల్ని చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు ప్రయత్నాలు ఆరంభించారు. తొలుత ఇక్కడి గాంధీనగర్ రైతుబజారులో ‘ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చి వెళ్లండి...కూరగాయలు తీసుకెళ్లండి’ అనే వినూత్న కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా చేపట్టారు. స్వచ్ఛందంగా ముందు కొచ్చిన రైతులు షేక్ అబ్దుల్ రషీద్, రావిపూడి శ్రీనివాసరావు స్టాల్స్‌లో అమలు చేస్తున్నారు. ‘ప్లాస్టిక్‌కు బదులుగా కూరగాయలు’ ప్రారంభంలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ ఆరోగ్యాధికారి డాక్టర్ బీవీ రమణ తదితరులు ఉచితంగా క్లాత్ బ్యాగులు.. ప్రతిరోజూ 10 కిలోలకు పైగా వస్తువులను ఇచ్చి కూరగాయలు తీసుకెళుతున్నట్టు రైతుబజారు ఏస్టేట్ అధికారి గుంటూరు రమేష్ చెప్పారు. ప్లాస్టిక్‌ను శానిటేషను సిబ్బంది తీసుకెళుతున్నారు. స్పందించిన శారదా సర్వీస్ సొసైటీ నిర్వహించిన వైద్యశిబిరంలో, గుడ్డతో చేసిన చేతిసంచులను ప్రజలకు పంపిణీ చేయటం విశేషం. ఇదేరీతిలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యదర్శి మొవ్వా సత్యనారాయణ సంస్థ పేరుతో 500 చేతిసంచులను రూపొందించి, సభ్యులకు, స్థానికులకు పంపిణి చేయనున్నట్లు ప్రకటించారు. ప్లాస్టిక్ వస్తువులకు నోటుపుస్తకాలు... నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు సహకారంతో కృష్ణా బాలకార్మిక విద్యాలయ పథకం ఇదే తరహాలో ప్లాస్టిక్ సేకరణకు ఉపక్రమించారు. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీలోని పాఠశాలలో విద్యార్థులను కలిశారు. ఎవరైతే ప్లాస్టిక్ సీసాలు, వ్యర్థాలను సేకరించి తీసుకొస్తారో వారికి నోటు పుస్తకాలను అందజేస్తామని ప్రకటించారు. దీంతో పాఠశాల్లోని 120 మంది విద్యార్థులు కాలనీలో తిరిగి, వ్యర్థాలను సేకరించారు. ప్రాజెక్టు డైరెక్టర్ ఆంజనేయరెడ్డికి అందజేశారు. తొలిరోజునే ఆ విధంగా 50 కిలోల ప్లాస్టిక్ చెత్త వచ్చింది. కిలోకు లాంగ్ సైజ్ నోటుబుక్ చొప్పున విద్యార్థులకు అందజేశారు. ఈ విధానాన్ని కొనసాగిసూ్తనే కృష్ణాజిల్లాలోని 16 బాల కార్మిక పాఠశాలల్లో అమలు చేస్తామని ఆంజనేయరెడ్డి ప్రకటించారు. సేకరించిన ప్లాస్టిక్ చెత్తను విజయవాడ నగర పాలక సంస్థకు అప్పగిస్తున్నారు. ఎక్స్పైరీ తేదీ లేని ప్లాస్టిక్... ఏ వస్తువుకైనా ఎక్స్పైరీ తేదీ ఉంటుంది...ప్లాస్టిక్ మినహా అని చెప్పాలి. వీటిలో ఒక్కసారి వాడి పారేసే కప్పులు, క్యారీబ్యాగులు, నీళ్ల సీసాలు, బాటిల్ మూతలు, స్ట్రాలు, స్పూన్లు, ఆహారంపై ర్యాపర్లు, పాలప్యాకెట్లు, షాంపూ సాచెట్లు, నూనెలు, మసాలాల సాచెట్లు, చాక్లెట్లు, చిప్స్ కవర్లు వంటివి రీసైక్లింగ్‌కు వీలుపడదు. ప్లాస్టిక్ బ్యాగ్స్ డీకంపోజింగ్‌కు వేల సంవత్సరాలు పడుతుంది. ఇవి నెమ్మదిగా చిన్నచిన్న ముక్కలుగా ‘మైక్రో ప్లాస్టిక్స్’గా మారతాయి. నీరు, మట్టిని కలుషితం చేస్తాయి. రోడ్లు, డ్రెయిన్లను బ్లాక్ చేసి సమస్యలను సృష్టిస్తాయి. ప్లాస్టిక్ తయారీలో వాడే హానికర రసాయనాలు జంతువుల కణజాలంలోకి చేరతాయి. చివరకు మనిషి ఆహార చట్రంలోకి ప్రవేశిస్తాయని ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్’ నివేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో 83 శాతం కుళాయి నీటిలో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని వెల్లడెంది. రీసైక్లింగ్ చేయదగిన వస్తువులు... బేవరేజ్ బాటిల్స్, ఫుడ్ జార్స్, క్లాతింగ్ అండ్ కార్పెట్ ఫైబర్, కొన్ని షాంపూలు, మౌత్‌వాష్ బాటిల్స్.డిటర్జంట్, బ్లీచ్ బాటిల్స్, స్నాక్ బాక్సులు, మిల్కా జగ్గులు, బొమ్మలు, బకెట్లు, క్రేట్స్, కుండీలు, గార్డెన్ ఫర్నిచర్, చెత్త కుండీలు రీసైక్లింగ్ అతికష్టం క్రెడిట్ కార్డులు, కిటికీ, తలుపు ఫ్రేములు, గట్టర్స్, పైపులు, ఫిటింగ్స్, వైర్, కేబుల్, సింథటిక్ లెదర్, నైలాన్ ఫాబ్రిక్స్, బేబీ బాటిల్స్, కాంపాక్ట్ డిసు్కలు, మెడికల్ స్టోరేజి కంటైనర్స్, కార్ పార్ట్స్, వాటర్ కూలర్ బాటిల్స్. ఉడతా భక్తి సాయం... ఆరేళ్లుగా రైతుబజారులో ఉంటున్నా...ఇక్కడ ప్లాస్టిక్‌ను నిషేధించారు. ఆ చెత్త సేకరణకు నేనూ, మరో రైతు ఉడతాభక్తిలా సహకరించాలని ప్లాస్టిక్‌ను తీసుకుని కూరగాయలు ఇస్తున్నాం. కనీసం ఒక నెలరోజులు ఇస్తాం. – షేక్ అబ్దుల్ రషీద్, రైతు రాష్ట్రంలోనే తొలిసారి... రైతుబజారులో ప్లాస్టిక్ వస్తువులు తీసుకుని కూరగాయలు ఉచితంగా ఇవ్వడం ఇదే తొలిసారి. సామాజిక బాధ్యతగా ప్రజలను చైతన్యం చేయాలనేది మా ఉద్దేశం. – గుంటూరు రమేష్, ఏస్టేట్ అధికారి, రైతుబజారు -
ప్లాస్టిక్ వినియోగంలో స్వీయ నియంత్రణ
సాక్షి, హైదరాబాద్: రోజువారి జీవన విధానంలో భాగంగా వివిధ రూపాల్లో పెరిగిన ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించేందుకు స్వీయ నియంత్రణ కీలకంగా మారింది. ప్రధానంగా ఒకసారి వాడి పారేసే ‘యూజ్ అండ్ త్రో’, ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’వస్తువులతోనే సమస్య తీవ్రత పెరిగింది. దళసరికాగితం, నార(జ్యూట్), గుడ్డలతో తయారు చేసిన సంచుల ద్వారా ప్రస్తుతం సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌కు, ఇతర ప్లాస్టిక్ వస్తువులకు చెక్ చెప్పే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒకసారి విని యోగించిన ప్లాస్టిక్ సీసాలు, ఇతర వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేస్తుండడంతో వాటి వల్ల పర్యావరణానికి, జీవవైవిధ్యానికి ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నియంత్రణకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) నడుం బిగించింది. పీసీబీ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హి సేవా’పేరిట ఈ నెలలో మొదలుపెట్టిన కార్యక్రమంలో భాగంగా ‘ప్లాస్టిక్ వేస్ట్ శ్రమదాన్’నినాదంతో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈ నెల 27 వరకు వివిధరూపాల్లో కార్యాచరణను చేపట్టనున్నారు. బుధవారం నుంచి హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆటోల ద్వారా ఒకమారు వినియోగించిన ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ప్రచారంతోపాటు, బాటిళ్లు ఇతరవస్తువుల సేకరణకు ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మళ్లీ వాటిని పున ర్వినియోగంలోకి తెచ్చేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ప్రైవేట్సంస్థలు రూపొందించిన ‘రీ సై కాల్’ యాప్ ద్వారా ప్లాసిక్వ్యర్థాల సేకరణను చేపట్టి రీసైక్లింగ్ ద్వారా సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాల్లో దానిని వినియోగించేలా చర్యలు తీసుకుంటోంది. ఇంటివద్దే ప్లాస్టిక్ వ్యర్థాలను విడదీసి దగ్గర్లోని సేకరణ కేంద్రాల్లో అందజేస్తే, వాటిని రీసైక్లింగ్‌కు, లేదా ధ్వంసం చేసేందుకు పంపిస్తారు. క్యారీ బ్యాగ్‌లు, కప్‌లు, స్ట్రాలు, కట్లరీ వంటి సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వల్ల పర్యా వరణానికి జరిగే నష్టాన్ని వివిధ సాధనాల ద్వారా వివరించేందుకు పీసీబీ ఏర్పాట్లు చేసింది.అక్టోబర్ 1–7 తేదీల మధ్య ఎఫ్ఎం రేడియో కార్యక్రమాల ద్వారా, 35 లక్షల మందికి ఎస్ఎంఎస్లు పంపించడం ద్వారా, కరపత్రాల పంపిణీ, తదితర రూపా ల్లో ప్రచార, ప్రజాచైతన్య కార్యకమాలు నిర్వహిస్తోంది. -
‘ఆవు’, ‘ఓం’ వినగానే గగ్గోలు
మధుర: బీజేపీ హిందుత్వ ఎజెండాను తప్పుపడుతున్నవారిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ‘ఆవు’ ‘ఓం’ అనే పదాలను వినగానే దేశంలో కొందరు వ్యక్తులు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ఈ పదాలు భారత్‌ను 16–17వ శతాబ్దాల నాటి కాలంలోకి తీసుకెళ్లిపోయాయన్న రీతిలో వీరు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌ను నాశనం చేసేందుకు ఇలాంటివారు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో బుధవారం జాతీయ జంతువ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని(ఎన్ఏడీసీపీ) ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘నేను ఆఫ్రికాలోని రువాండా దేశానికెళ్లా. అక్కడి ప్రభుత్వం గ్రామాల్లోని ప్రతీ ఇంటికి ఓ ఆవును ఇస్తోంది. ఆవులకు ఆడదూడ పుడితే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మరో కుటుంబానికి అప్పగిస్తుంది. పశుపోషణ ద్వారా రువాండా ఆర్థిక వ్యవస్థను బలపర్చుకుంటోంది. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో నేను స్వయంగా చూశా. కానీ మన దేశంలో కొందరు వ్యక్తులు మాత్రం ఓం, ఆవు అనే పదాలను వినగానే విద్యుత్ షాక్ కొట్టినట్లు ఉలిక్కిపడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. అసలు పశుపోషణ లేకుండా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా మనుగడ సాధించడం సాధ్యమా? అని మోదీ ప్రశ్నించారు. వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహంతో పాటు స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ పథకాలతో ఆర్థిక వ్యవస్థ, ప్రకృతి మధ్య సమతుల్యత సాధ్యమవుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఉగ్రమూకలకు పాక్ అండదండలు.. దాయాది దేశం పాకిస్తాన్‌పై ప్రధాని మోదీ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉగ్రమూకలకు పాకిస్తాన్లో అన్నిరకాలుగా అండదండలు అందజేస్తున్నారనీ, ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశభద్రత విషయంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. భారత్‌లో ఉగ్రదాడులకు పాక్ కుట్ర పన్నుతోందన్న నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని ఈ మేరకు స్పందించారు. ‘నేడు ఉగ్రవాదం అన్నది ఓ భావజాలంగా మారిపోయింది. సరిహద్దులు దాటి విస్తరించిన ఉగ్రవాదం అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది. ఈ ఉగ్రవాదులను మన పొరుగుదేశం(పాకిస్తాన్)లో పెంచిపోషిస్తున్నారు. ఈ భావజాలాన్ని నిరోధించడానికి ఉగ్రమూకలకు మద్దతు ఇస్తూ శిక్షణ, ఆశ్రయం కల్పిస్తున్నవారిపై, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రపంచదేశాలన్నీ ప్రతిజ్ఞ చేయాలి’ అని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం అణచివేతకు తాము కట్టుబడి ఉన్నామని మోదీ వెల్లడించారు. కాలుష్యం, ఉగ్రవాదం, అనారోగ్యం... ఏ సమస్యను పరిష్కరించాలన్నా ప్రజలు ఏకం కావాల్సిందేనని మోదీ స్పష్టం చేశారు. 12 వేలకోట్లతో వాక్సినేషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు మరోసారి పిలుపునిచ్చారు. దీని కారణంగా పర్యావరణం కలుషితం కావడమే కాకుండా జంతువులు, చేపలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని 50 కోట్ల పాడిపశువులు, గొర్రెలు, మేకలు, పందులకు గాలికుంటు వ్యాధి(ఎఫ్ఎండీ) సోకకుండా రూ.12,652 కోట్లతో వ్యాక్సినేషన్ అందించే ప్రక్రియకు మోదీ శ్రీకారం చుట్టారు. అనంతరం ఓ మహిళా బృందంతో కలిసి ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల నుంచి ప్లాస్టిక్‌ను వేరుచేశారు. 2025 నాటికి జంతు సంబంధిత వ్యాధులను నియంత్రించాలనీ, 2030 నాటికి పూర్తిగా అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మోదీ చెప్పారు. 2022 నాటికి దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు గుడ్‌బై
గ్రేటర్ నోయిడా: ప్రపంచదేశాలన్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్యూపీ)కి ఇక గుడ్ బై చెప్పే సమయం వచ్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీడు భూముల్ని సాగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి కూడా ఆయన వివరించారు. ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి (యూఎన్‌సీసీడీ) కాప్14 సదస్సుకి ఈ సారి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ సదస్సులో 200 దేశాలకు చెందిన ప్రతినిధులనుద్దేశించి సోమవారం ప్రధాని ప్రసంగించారు. ఒకసారి మాత్రమే వినియోగించాల్సిన ప్లాస్టిక్‌ను వచ్చే కొద్ది సంవత్సరాల్లో భారత్‌లో పూర్తిగా నిర్మూలిస్తామని ప్రధాని చెప్పారు. ‘ప్లాస్టిక్ వినియోగం పెరిగే కొద్దీ పచ్చని భూములు కూడా ఎడారులుగా మారిపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు మన భూముల్ని ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వెలువడే కాలుష్యం మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎటుచూసినా కుప్పులు తెప్పలుగా పేర్కొంటున్న ప్లాస్టిక్ భూముల్ని నాశనం చేసి వ్యవసాయాన్ని దెబ్బ తీస్తోంది‘‘ అని మోదీ చెప్పారు. ప్రపంచదేశాలన్నీ కూడా ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. భూముల క్షీణతపై ఆందోళన పర్యావరణంలో వస్తున్న మార్పులు ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని ప్రధాని అన్నారు. వాతావరణం వేడెక్కడంతో కాలం కాని కాలంలో వర్షాలు కురవడం, తుపాన్లు ముంచెత్తడం, సముద్ర మట్టాలు పెరిగిపోవడం వంటి వాటితో భూముల్ని కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘భూమిలో సారాన్ని పెంచాలంటే, వ్యవసాయానికి అనుగుణంగా వాటిని మార్చాలంటే నీటి సరఫరాలో పక్కా వ్యూహాలను అనుసరించాలి. బీడు భూములకి నీటి వసతిని కల్పించాల్సిన అవసరం ఉంది‘ అని మోదీ అన్నారు. 2015–17 మధ్య కాలంలో భారత్‌లో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 8 లక్షల హెక్టార్లకు పెరిగిందని వెల్లడించారు. 2030 నాటికి 2.1 కోట్ల హెక్టార్ల నుంచి 2.6 కోట్ల హెక్టార్ల భూముల్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భూముల్ని పునరుద్ధరించడానికి రిమోట్ సెన్సింగ్, స్పేస్ టెక్నాలజీని వినియోగిస్తోందన్నారు. ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఈ సదస్సు ఈనెల 2 నుంచి 13 వ తేదీ వరకు జరగనుంది. -
ప్రకృతికి మేలు చేసే బ్యాంబూ బాటిల్స్..!
ప్రస్తుతం పర్యావరణాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్ ఒకటి. పచ్చటి ప్రకృతికి చీడలా తయారైన ఈ రక్కసి కారణంగా ఎన్నో ప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలో పలు ప్రభుత్వాలు ప్లాస్టిక్ నిషేధానికై చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ప్రస్తుతం రోజూవారీ జీవితంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం భాగమైపోయింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టేందుకు ఓ ఐఐటీ పూర్వ విద్యార్థి తన వంతు ప్రయత్నంగా పర్యావరణ హితమైన వాటర్ బాటిల్‌ను తయారు చేశాడు. అసోం ఐఐటీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన ధ్రితిమాన్ బోరా వెదురు బొంగులతో రూపొందించిన ఈ బాటిల్ ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కారకుండా ఉండటమే కాకుండా... నీళ్లని ఎల్లప్పుడూ చల్లగా ఉంచే ఈ చెక్క బాటిల్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వ్యాపారవేత్తగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న బోరా.. ఒక్కో బాటిల్ ధరను రూ. 450- 700గా నిర్ణయించాడు. సాధారణ బాటిళ్లలాగే వీటిని కూడా రెండు వారాలకొకసారి శుభ్రం చేయాలని సూచించాడు. -
ప్రజల భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్ నిషేధం: కలెక్టర్
సాక్షి, విజయవాడ : ప్రజల భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్ వాడకాన్ని నియత్రించవచ్చన్నారు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. జిల్లాలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడానికి నిర్ణయం తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. కళ్యాణ మండపాలు, రెస్టారెంట్లు, దుకాణాల వద్ద ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉందని వచ్చే వారంలో ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయడానికి ఒక ప్రకటన విడుదల చేయనున్నట్లు వివరించారు. వచ్చే మంగళవారం, బుధవారం, శుక్రవారం ప్రజలతో సమావేశాలు ఏర్పాలు చేసి ప్లాస్టిక్ వాడకం వలన కలిగే దుష్పరిణాలమాలను వివరిస్తామని అన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాటన్ క్లాత్ బ్యాగ్స్, పేపర్ గ్లాస్లు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కార్పోరేషన్, పోలీస్, కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ల సహాకారంతో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని, ప్లాస్టిక్‌ను నగరంలోకి రాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కూడా వీటిపై ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో సైకిల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రజలతో ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేయిస్తామన్నారు. అలాగే స్వయం సహాయక సంఘాలతో కాటన్ బ్యాగ్‌ల తయారీ చేపడతామన్నారు. -
సచివాలయంలో ప్లాస్టిక్ బంద్: సీఎస్ ఎస్.కె.జోషి
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పర్యావరణానికి హాని కలిగించే అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి సర్క్యులర్ జారీ చేశారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందంతో ఉండే అన్ని రకాల ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లను, ఫ్లెక్సీలను, ప్లాస్టిక్ పోస్టర్లను సచివాలయంలో నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ నిషేధం నిబంధనలు ఉల్లంఘించినవారికి రూ.250 నుంచి రూ.500 వరకు జరిమానా విధించాలని నిర్ణయించారు. సచివాలయంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని చేతన సచివాలయ సారస్వత వేదిక మే 25న ఇచ్చిన లేఖ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వస్తువుల నిషేధం అమలు నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారిని విచారించేందుకు సాధారణ పరిపాలన శాఖకు చెందిన హెల్త్ సూపర్వైజర్ను నియమించారు. -
ప్లాస్టిక్ వస్తువులలో ఆహారం తింటున్నారా.. జాగ్రత్త
న్యూయార్క్ : ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికే కాదు మనుషుల ప్రాణాలకు కూడా ముప్పేనట. ప్లాస్టిక్ వస్తువులలో ఉంచిన వేడివేడి ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల జీర్ణకోశ సంబంధ రోగాలు వచ్చే అవకాశం ఎక్కువని తాజా పరిశోధనలో తేలింది. అమెరికాకు చెందిన ‘టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్శిటీ’ వారు జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్లాస్టిక్ వస్తువులలో ఉంచిన ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల ఇంఫ్లమేటరి బోవెల్ డిసీస్(ఐబీడీ) అనే జీర్ణకోశ సంబంధ వ్యాధి దాడి చేసే అవకాశం ఎక్కువని తేలింది. ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే బిస్ ఫినాల్ ఏ(బీపీఏ) అనే రసాయనం కారణంగా మనిషి జీవితకాలం తగ్గిపోతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వస్తువులలో ఉంచిన ఆహార పదార్థాలలోని పోషక విలువలను శరీరం గ్రహించటం కష్టంగా మారుతుందని తేల్చారు. అంతేకాకుండా మనం ఉపయోగించే ఫేస్ వాష్‌లలో కూడా ప్లాస్టిక్ కణాలు ఉంటాయని నిర్థారించారు. బీపీఏ తినే ఆహార పదార్థాలలో చేరటం ద్వారా మానవ ప్రవర్తనలో మార్పులు తేవటమే కాక చిన్నపిల్లల మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని వెల్లడైంది. -
ఇంటి ముందుకొచ్చే మనుషులు...
ఆ రోజులు... రాలిన బాదంకాయల కోసం పిల్లలు వచ్చేవారు. ఎర్రగా పూసి, గోడ బయటకు తలవాల్చిన మందారాల కోసం యూనిఫాముల్లో ఉన్న ఆడపిల్లలు వచ్చేవారు. దేవుని పటాలకు కాదనేదెవరని నందివర్థనాల కోసం పక్కింటామె వచ్చేది. చనువున్న కాలేజీ స్టూడెంట్ కాదనడానికి వీల్లేని పద్ధతిలో రోజాపువ్వును తెంపుకెళ్లేది. రెండు చేతులున్న ప్రతి మహాలక్ష్మి గుప్పెడు గోరింటాకు కోసం హక్కుగా గేటు బాదేది. నాలుగు పుదీనా రెబ్బల కోసం ఎవరైనా రావచ్చు. చారెడు కరివేపాకుకు అడగాల్సిన పనీ లేకపోవచ్చు. సవరాలు చేసిస్తాం అని మురికిగా ఉన్న ఆ ముగ్గురు ఆడవాళ్లు ఆశగా చూసేవారు. కాసింత సద్దన్నం పెడితే రేకుడబ్బాలో ఉన్న చెక్కదువ్వెనలిచ్చి నక్కలోళ్లు చక్కాపోయేవారు. తీరిగ్గా నడిచే ఒంటెద్దు బండి నుంచి శేర్ల లెక్కన ఉప్పు చేటల్లో ఒంపుకు రావాలి. ముగ్గు పిండి అమ్మే ముసలామెకు మొదటగా మంచినీళ్లు అందించాలి. కట్టెల మోపు అమ్మేవారికి చెమట ఆరేలోపు డబ్బులిస్తేనే పుణ్యం. నెయ్యి అమ్మేవాళ్ల మోసం ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు. తేనె అమ్మేవాళ్లు తియ్యగానే మట్టి నాకిస్తారు. ప్లాస్టిక్ వస్తువులకు అతుకులు వేస్తామని వచ్చిన మనిషి పచ్చటి బిందెకు ఎర్రటి పాచ్ వేసేవాడు. కుడితి కోసం వచ్చే ఆడమనిషి అంతపెద్ద కుండను చులాగ్గా నడుముకు ఎత్తుకునేది. బావిలో పడ్డ వస్తువులను తీస్తాననేవాడు పలుచగా, రివటగా, అప్పుడే నీటి నుండి తీసిన గవ్వలా మెరుస్తుండేవాడు. సోది చెప్పే అమ్మి రేడియో లేని వెలితిని పోగొడుతూ చాలాసేపు రాగాలు తీసేది. కబళం మీద ఆశ లేని బుడబుక్కలవాడు చిల్లర డబ్బులు తీసుకుని బొంగురుగా ఆశీర్వదించేవాడు. ముస్లింల ఇంటి ముందు కూడా హరిదాసు కమ్మని కీర్తన ఆలపించేవాడు. హిందువుల గడపలు ఫకీరు దువాను ఆహ్వానించేవి. సంవత్సరానికి ఒకసారి పసుప్పచ్చ బట్టల్లో యామాలసామి గుర్రాన ఊరేగి ఇంటింటినీ కటాక్షించేవాడు. సత్రం వంకాయలు అమ్మే ఆమె తక్కెడలో మోసం ఉండేది కాదు. ప్రతి తెల్లారి చేపల బుట్టలతో వచ్చే బెస్త ఆడవాళ్లకు కపటం తెలిసేది కాదు. రంగురంగుల కోడిపిల్లలు ఆరు తీసుకుంటే రెండే బతికేవి. ఉడుము నుంచి తీసిన తైలం మోకాళ్లకు మంచిదని ఎవరో తచ్చాడేవారు. గాజుల మలారం దించి చేయి పట్టుకున్నాక డజనుకు రెండు కొసరుగా ఇవ్వాలి. చీరల మూట ఆసామి సులభ ఇ.ఎమ్.ఐలు కనిపెట్టేవాడు. చెవిలో గుబిలి తీసేవాడితో మగాళ్లకు బేరం తెగేది కాదు. కక్కు కొడతాం అని వచ్చేవాళ్లు ఎండన కూచుని నున్నబడ్డ పొత్రాల ఒళ్లు హూనం చేసేవారు. సిరిచాపలు అమ్మేవారు కాసింత నడుము వాల్చే తీరిక లేక అదే పనిగా తిరుగుతుండేవారు. పాముబుట్టతో వచ్చినవాడు పైసలిస్తే తప్ప పడగను తట్టేవాడు కాదు. ఎలుగుబంటి స్వయంగా వచ్చి ఇచ్చే తావీదును భయం భయంగా కొనాల్సి వచ్చేది. కోతిని తెచ్చేవాడికి అంతగా మతింపు లేదు. సోడాబండి వచ్చిందనే సంగతి సోడానే కయ్యిన కూసి దండోరా వేసేది. ఆకురాయి మీద సానపడుతున్న కత్తి చక్కున మెరిసేది. మల్లెల కన్నా ముందే వాటి పరిమళం వీధిలో ఆగి ఆగి ఒంటిని తాకేది. పీచుమిఠాయి గంట ఒన్ టూ త్రీగా మోగేది. చేతికి తీపి గడియారం చుట్టే మనిషి మొత్త చూసుకుని కూలబడ్డాడంటే మరి కదిలేవాడు కాదు. నల్ల ఈతకాయలు రుచా, పెద్ద ఈతకాయలు రుచా అంటే డబ్బును బట్టి ఉంటుంది. ప్రతి విజయదశమికి కళుగోళ్లమ్మ తల్లి పల్లకీ ఎక్కివచ్చేది. తొలి ఏకాదశికి విష్ణుమూర్తి రథమెక్కి వైభోగం తెచ్చేవాడు. శివరాత్రికి ఆదిదేవుడు తేరువుపై ఊరేగుతూ అభయమిచ్చేవాడు. మకరజ్యోతికి వెళ్లే స్వాములను సాగనంపుతూ ఆడపిల్లలంతా ప్రమిదలతో వెలుగు నింపే వారు. తప్పెట్ల మోతలో పీర్లు కవాతు చేసేవి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం సైకిల్‌కి బిగించిన తెల్లని మినీ హారన్‌తో ఏసు పాటలు పాడుతూ క్రైస్తవ బృందాలు వచ్చేవి. అమ్మ తరపు వాళ్లు వచ్చేవారు. అయ్య తరపు వాళ్లు వచ్చేవారు. అలిగిపోయిన వారు వచ్చేవారు. వచ్చి అలిగిపోయేవారు. తలుపు మూసిపెట్టడం చాలా అమర్యాదగా ఉండేది. ఇవాళలాగా మనుషులు వచ్చి పోయే ఇల్లంటే గౌరవం ఇనుమడించేది. ఇప్పుడు కొన్నే ఉన్నాయి. చాలా పోయాయి. కొన్నే గుర్తున్నాయి. చాలా కనుమరుగైపోయాయి. కాని- ఇన్నాళ్లు గడిచినా ఇన్నేళ్లు గడిచినా ఒక మిట్టమధ్యాహ్నం పూట తాగుడుకు బానిసైన భర్త అన్నీ తెగనమ్మగా ఆకలికి తాళలేక ఇంట్లో ఉన్న అడుగుబొడుగు వంటపాత్రలు తీసుకుని వాటిని అమ్మడానికి ఇంటి ముందుకు వచ్చిన పంతులుగారి భార్య ముఖం మరుపుకు రాలేదు. ఆ పాత్రలు తీసుకో నిరాకరించి అమ్మ తన దగ్గర ఉన్న డబ్బు ఇచ్చింది. అప్పుడు పంతులుగారి భార్య ఏడవడం గుర్తు. అమ్మ కూడా పెద్దగా ఏడవడం గుర్తే. - ఖదీర్ -
బతుకులు బుగ్గిపాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: పేదల కాయకష్టమే ప్రధాన పెట్టుబడిగా రాజకనీ ట్రేడర్స్ అనే సంస్థ చెన్నై శివార్లు ఆవడి-పూందమల్లి హైరోడ్డులోని కాడువెట్టి గ్రామంలో ఐదేళ్ల క్రితమే ఏర్పాటైంది. వీధి వీధినా తిరుగుతూ పాత సామాన్లు కొనేవారు, చెత్తకుప్పల్లో వస్తువులను సేకరించే వారి నుంచి ప్లాస్టిక్ సామాన్లు కొనడం, వాటిని హోల్‌సేల్‌గా ప్లాస్టిక్ వస్తువుల తయారీ కంపెనీలకు విక్రయించే వ్యాపారం అక్కడ సాగుతోంది. తిరుచెందూరుకు చెందిన ఇమ్మానుయేల్ (36) ఈ సంస్థద్వారా బాగా ఆర్జించినట్లు సమాచారం. అయితే వ్యాపారానికి తగినట్లుగా కంపెనీ ప్రాంగణంలో భద్రతా చర్యలు చేపట్టలేదు. తాత్కాలికమైన రేకుల షెడ్డు, లోన కొన్ని గదులతో వ్యాపారం సాగించేవారు. కంపెనీలో పనిచేస్తున్న 25 మందిలో నగరానికి చెందిన 20 మంది విధులు పూర్తి కాగానే ఇళ్లకు వెళ్లిపోతారు. ఒడిశాకు చెందిన ఇద్దరు, తిరుచందూరు ఇద్దరు, కాంచీపురానికి చెందిన ఒకరు రాత్రి వేళల్లో అక్కడ తలదాచుకుంటున్నారు. ఎప్పటి లాగానే పనులు ముగిసిన తరువాత బుధవారం రాత్రి లోన గడియపెట్టుకుని ఐదుగురు రెండు గదుల్లో నిద్రించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో అటువైపు వెళుతున్న ఒక వ్యక్తి ప్లాస్టిక్ కంపెనీ నుంచి నల్లని పొగలు రావడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి కంపెనీ తలుపులు బాదడంతో మెళకువ వ చ్చిన తూత్తుకూడికి చెందిన చిత్రవేల్ (30) వెలుపలకు పరుగులు తీశాడు. మరో గదిలో నలుగురు యువకులు నిద్రిస్తున్నట్లు అతను చెప్పాడు. పూందమల్లి, ఆవడి, గిండీ, అశోక్‌నగర్, అంబత్తూరు, కోయంబేడు ప్రాంతానికి చెందిన 15 అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పడం ప్రారంభించాయి. సుమారు 3 గంటల పాటు పోరాడి మంటలను ఆర్పివేశారు. రెండో గదిలోకి వెళ్లి చూడగా నలుగురు యువకులను కాలిబూడిదైన స్థితిలో కనుగొన్నారు. మృతులను ఒడిశాకు చెందిన అమర్ (24), రాజా (26), తిరుచందూరుకు చెందిన రఘు (26), కాంచీపురానికి చెందిన శరత్‌కుమార్ (24)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో అదే ప్రాంగణంలో నిలిపి ఉన్న కారు సైతం కాలిబూడిదైంది. తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో నాలుగు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు పంపారు. రాజకనీ ట్రేడర్స్ కంపెనీ పరిసరాల్లోని ఖాళీ ప్రదేశాల్లో రాత్రి వేళలో చెత్తకుప్పను కాలుస్తారు. బుధవారం రాత్రి కూడా ఇలా కాల్చిన కుప్పల్లోని నిప్పు రవ్వలు ప్లాస్టిక్ వస్తువులపై పడటం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. లేదా దోమల నివారణకు అక్కడి కార్మికులు వెలిగించిన ఒత్తుల నుంచి నిప్పు పుట్టిందని అంటున్నారు. నిప్పును సులభంగా ఆకర్షించే గుణం కలిగిన ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాద నివారణ జాగ్రత్త చర్యలు చేపట్టలేదని తేలింది. అంతేగాక అగ్నిమాపకశాఖ ద్వారా ఎన్ఓసీ పొందకుండా కంపెనీని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్లాస్టిక్ కంపెనీ యజమాని ఇమ్మానువేల్ (36)ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కి‘లేడీ’లు..!
నెత్తిపై బుట్ట.. అందులో కొన్ని ప్లాస్టిక్ వస్తువులు..ఊరూరా..వీధివీధి సంచారం..చూడగానే..ఈఇంతులకెంత కష్టం..పొట్టకూటి కోసం ఎంత కష్టపడుతున్నారు అనుకునేంత అమాయకత్వం.. అదే వారికి పెట్టుబడిగా మారుతోంది. మహిళలను చూడగానే..జనం సహజంగా ప్రదర్శించే జాలి.. వారి మాయా ప్రవృత్తికి మార్గమవుతోంది. దొంగతనాలకు పాల్పడుతున్నారు. తీరా దొరికిపోయే సరికి..అబ్బే తమకేమీ తెలియదంటూ.. చేతులెత్తేస్తున్నారు. నరసన్నపేటలో సోమవారం జరిగిన ఓ చోరీ ఘటన ఈ ముఠా అసలు రూపాన్ని తేటతెల్లం చేసింది. నరసన్నపేట,న్యూస్‌లైన్: తిలారు గ్రామానికి చెందిన తంగి ధనలక్ష్మి నరసన్నపేట సంతకు వచ్చింది. సరిపడా సామగ్రి కొనుగోలు చేసి.. తన పర్సులోని కొంత సొమ్మును వ్యాపారికి ఇచ్చింది. మిగతా రూ.6 వేల సొమ్ముతో పాటు పర్సును సామగ్రిపై పెట్టింది. అయితే..ఆ సమయంలో నెత్తిపై ప్లాస్టిక్ వస్తువులతో కూడిన బుట్టలతో ఇద్దరు మహిళలు వచ్చారు. ధనలక్ష్మి కాస్త ఆదమరిచి ఉండడంతో పర్సును కొట్టేశారు. పర్సులో ఉన్న నగదును బాలుడు తీసేసి..పర్సును కాలువలో పడేశా డు. అయితే.. తానొకటి తలిస్తే..భగవంతుడొకని తలచు అన్న చందాన..వీరైతే..గుట్టు చప్పుడు కాకుండా..రూ.6 వేలు నొక్కేశామనుకుని సంబర పడుతున్నా.. ఈ తంతంగమంతా..నరసన్నపేటకు ఓ కలాసీ గమనిస్తున్నా డు. అంతలోనే..ధనలక్ష్మి కూడా తన పర్సు పోయిందంటూ..కేకలు వేయడంతో.. అంతా కలిసి..వారి కోసం గాలించారు. స్థానిక మఠం వీధి వద్ద పట్టుకున్నారు. స్థానికులంతా నిలదీయడంతో తమకు కేవలం రూ.1500 దొరికాయంటూ..బాలుడి ద్వారా ఇవ్వబోయా రు.స్థానికులు గట్టిగా నిలదీసి..స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. ట్రైనీ ఎస్సై శ్రీనివాసరావు పోలీసులతో సహా వచ్చి..వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు సేకరిస్తున్నారు.