ఆశయం మంచిదే కానీ... | Sakshi Editorial On Plastic usage | Sakshi
Sakshi News home page

ఆశయం మంచిదే కానీ...

Published Tue, Jul 5 2022 1:54 AM | Last Updated on Tue, Jul 5 2022 1:54 AM

Sakshi Editorial On Plastic usage

ప్రమాదం పొంచి ఉందని అర్థమైనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ప్రపంచాన్ని, అందులోనూ మన దేశాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్‌ దుర్వినియోగంపై కొరడా జుళిపించడం అర్థం చేసుకోదగినదే. ఈ జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ‘తక్కువ ఉపయోగం, ఎక్కువగా వ్యర్థాలు పేరుకొనే’ కొన్ని రకాల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ తయారీ, అమ్మకం, వినియోగాలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. అలాగే, ప్లాస్టిక్‌ వస్తువుల ఉత్పత్తిదారులు, ఎగుమతి దారులు, బ్రాండ్‌ ఓనర్లు తప్పనిసరిగా నిర్ణీతస్థాయిలో ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ చేయాలని షరతు పెట్టింది. గత ఫిబ్రవరిలోనే రీసైక్లింగ్‌ నిబంధనలు ప్రకటించిన సర్కారు ఇప్పుడు నిషేధపుటుత్తర్వులు అమలులోకి తెచ్చింది. ప్లాస్టిక్‌కు చౌక ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేవంటూ వ్యతిరేకులు వాదిస్తున్న వేళ ప్రభుత్వం తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు బోలెడన్ని కసరత్తులు చేయక తప్పదు.  

ప్రభుత్వ ఉత్తర్వులతో ఇకపై ప్లాస్టిక్‌ ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు, స్ట్రాలు, స్వీట్‌ బాక్సులు, ఐస్‌క్రీమ్‌ పుల్లలు, సిగరెట్‌ ప్యాక్‌లు, పీవీసీ బ్యానర్లు, కొన్ని ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ సామగ్రి – ఇలా 19 రకాల ఉత్పత్తులు నిషిద్ధం. ప్రస్తుతం 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ సంచీలపైనే నిషేధం పెట్టారు. డిసెంబర్‌ కల్లా 120 మైక్రాన్ల కన్నా తక్కువున్న అన్నిటినీ నిషేధించాలన్నది ప్రభుత్వ ఆలోచన.

ప్రస్తుతానికైతే, ప్యాకింగ్‌ కోసం ప్లాస్టిక్‌ వినియోగించవచ్చంటూ త్వరితగతిన అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) రంగాన్ని కొన్ని నిబంధనలతో ప్రభుత్వం అనుమతించింది. ప్లాస్టిక్‌ నిషేధ నిర్ణయాన్ని ఉల్లఘించినవారికి పర్యావరణ పరిరక్షణ చట్టంలోని సెక్షన్‌ 15 కింద, దాని ఆధారంగా వివిధ నగరపాలక సంస్థలు చేసుకున్న చట్టాల కింద శిక్ష తప్పదని సర్కారు హెచ్చరిక. 

ప్రభుత్వ కఠిన నిర్ణయం వెనుక పెద్ద కథే ఉంది. మన దేశంలో వార్షిక తలసరి ప్లాస్టిక్‌ వ్యర్థాల సృష్టి దాదాపు 4 కిలోలు. ప్రపంచంలోని మిగిలిన అనేక దేశాలతో పోలిస్తే, ఇది కొంత తక్కువగా అనిపించవచ్చు. కానీ, మొత్తంగా చూస్తే మాత్రం ప్రపంచంలో చైనా, అమెరికాల తర్వాత అత్యధికంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నది మన దేశమే. కచ్చితమైన లెక్కలు లేవు కానీ, 2015లో 95 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలకు కారణమయ్యామని సర్కారు మాట.

ఇక, 2019–20 లెక్కల ప్రకారం ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో 12 శాతాన్నే మన దేశం రీసైకిల్‌ చేస్తోంది. మరో 20 శాతాన్ని కాల్చేస్తోంది. మిగతా 68 శాతం చెత్త రూపంలో, భూమిలో కలిసీ కలవక హాని కలిగిస్తున్నాయి. అలాగే, మన దేశంలో సగటున ప్రతి వ్యక్తీ ఏటా 9.5 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలో కలవడానికి కారణమవుతున్నాడు. ఇది ఆందోళనకరం. ఇకనైనా మేల్కొనకుంటే– కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ, మనం నివసిస్తున్న పుడమి విధ్వంసానికి మనమే కారణమవుతాం. 

నిజానికి, 2022 కల్లా దేశంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను వాడకుండా చేస్తామంటూ 2018లోనే ప్రపంచ పర్యావరణ దినాన మన దేశం ప్రకటించింది. దానికి తగ్గట్టే ఇప్పుడీ నిషేధపు చర్య. ఈ నిర్ణయం వెనుక ఉన్న సదుద్దేశాన్ని స్వాగతిస్తూనే, అమలులో ఉన్న సాధకబాధకాలనూ గ్రహించాల్సి ఉంది. ఆ మాటకొస్తే, గత అయిదేళ్ళలో దేశంలో కనీసం 20కి పైగా రాష్ట్రాలు తమ తమ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వినియోగంపై ఏదో ఒక నియంత్రణ పెడుతూనే వచ్చాయి.

ఆశయం మంచిదే అయినా, ఆశించినంతగా ఆ నియంత్రణలు అమలు కాలేదన్నది చేదు నిజం. విధులే తప్ప నిధులు, తగినంత సిబ్బంది కొరవడిన వివిధ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్ళు, మునిసిపాలిటీలు క్షేత్రస్థాయిలో చతికిలబడ్డాయి. ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూడడానికి ఏం చేయాలో ఆలోచించాలి.
 
బలంగా, బరువు తక్కువగా, దీర్ఘకాలం మన్నే ప్లాస్టిక్‌ వినియోగాన్ని మాన్పించడం ఒక సవాలే. ఏటా 18 శాతం వంతున వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్న ప్యాకేజింగ్‌ రంగంలో మరీ కష్టం. కాబట్టి, కేవలం నిషేధాలను నమ్ముకోకుండా పలు యూరోపియన్‌ దేశాల్లో లాగా ప్లాస్టిక్‌పై బాధ్యతగా వ్యవహరిస్తున్న సంస్థలకు ప్రోత్సాహకాలివ్వాలి. ఆ పని చేయని సంస్థలు అందుకు తగిన మూల్యం చెల్లించేలా నిబంధన పెట్టాలి. అలాగే, నిషేధాన్ని పర్యవేక్షించడానికి కంట్రోల్‌ రూమ్‌లు పెడితే సరిపోదు.

ఆరోగ్యానికీ, పర్యావరణానికీ కలుగుతున్న నష్టం, మన వంతు బాధ్యతపై ప్రజా చైతన్యం పెంచాలి. నిషేధం అమలుకు భాగస్వామ్య పక్షాలన్నిటినీ కలుపుకొనిపోవాలి. ఉదాహర ణకు ప్లాస్టిక్‌తో పోలిస్తే, కాగితం స్ట్రాలకు ఖర్చు అయిదు రెట్లు ఎక్కువట. అసలే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న తయారీదార్లు, చిన్న వ్యాపారులపై ఇది పెనుభారం. కాబట్టి, పర్యావరణ హితంగా కంపోస్ట్‌ అయ్యే ప్లాస్టిక్‌ తయారీ లాంటివి పరిశ్రమతో కలసి ప్రభుత్వమూ అన్వేషించాలి.  

ఒక్కమాటలో నాలుగైదు దశాబ్దాలుగా నిత్యజీవితంలోకి పూర్తిగా జొరబడిన ప్లాస్టిక్‌ను వద్దంటే సరిపోదు. ప్రత్యామ్నాయాలు చూపించాలి. ప్లాస్టిక్‌ బదులు కాగితం, జనపనార, ఖాదీ సంచీలు, స్టీలు బాక్సులు వాడాలన్నది ప్రభుత్వ సూచన. అయితే, ఈ ప్రత్యామ్నాయాలు విస్తృతంగా అందు బాటులో ఉండేలా చూడడం కీలకం. ప్లాస్టిక్‌ బదులు కాగితం, వెదురుబొంగుల వినియోగం పెరిగితే, అది మళ్ళీ చెట్ల నరికివేతకు కారణమవుతుంది.

అందుకే, చౌకగా ఉంటూనే పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాల వైపు ప్రజల్ని మళ్ళించాలి. ఈ మధ్య దీపావళి టపాసులపై ప్రజల్లో చైతన్యం తెచ్చినట్టే, ప్లాస్టిక్‌పైనా తీసుకురాగలిగితేనే ఫలితం ఉంటుంది. పర్యావరణానికీ, ప్రజారోగ్యానికీ మేలు కలుగుతుంది. ఆశయం మంచిదైనా, ఆచరణమార్గాలు కీలకమంటున్నది అందుకే! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement