plastic wastage
-
Khushboo Gandhi: బీ గుడ్.. డూ గుడ్!
మనదేశంలో ఏడాదికి 9,400 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ కాలువలు, నదుల్లోకి చేరుతోంది. ఇందులో ఎక్కువ భాగం ప్యాకింగ్‌కు ఉపయోగించినదే ఉంటోంది. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం. ఓ చిన్న హెయిర్ ఆయిల్ బాటిల్‌ని ప్యాక్ చేయడానికి దానికంటే నాలుగురెట్లు బరువున్న ప్యాకింగ్ మెటీరియల్‌ని ఉపయోగిస్తారు. అందులో కాగితంతో చేసిన అట్టపెట్టె ఉంటుంది. బాటిల్ పగలకుండా ప్లాస్టిక్ బబుల్ రేపర్ ఉంటుంది. కాగితం ఇట్టే మట్టిలో కలిసిపోతుంది. దాంతో ఇబ్బంది ఉండదు. మరి ప్లాస్టిక్ బబుల్ ర్యాపర్ ఎన్నేళ్లకు మట్టిలో కలుస్తుంది. ‘వస్తువులు రవాణాలో పగలకుండా ఉండాలంటే బబుల్ ర్యాపర్ ప్లాస్లిక్తోనే చేయాలా? కొబ్బరిపీచుతో బబుల్ ర్యాప్ చేసాను చూడండి’ అంటూ కుషన్‌ను పోలిన కాయిర్ పౌచ్‌ను చూపించింది ఖుష్బూ గాంధీ. అలాగే కాయిర్ బోర్డ్‌లో ఒక పొరలోకి గాలిని చొప్పించి బుడగలు తెప్పించింది. ముంబయిలో పుట్టి పెరిగిన ఖుష్బూ గాంధీ నిఫ్ట్‌లో మెటీరియల్ డెవలప్మెంట్ కోర్సు చేసింది.‘గో డూ గుడ్’ స్టార్టప్ ద్వారా ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ మెటీరియల్‌ని తయారు చేస్తోంది. ప్లాస్టిక్‌కి వ్యతిరేకంగా తనదైన శైలిలో ఉద్యమిస్తోన్న ఖుష్బూ... ‘ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి’ అని మైకులో గొంతుచించుకుంటే సరిపోదు, ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయం చూపిస్తే ఆటోమేటిగ్గా ప్లాస్టిక్‌ని దూరం పెట్టేస్తారు’ అంటోంది. ఇంకా...‘నా ప్రయోగాలు నాకు లాభాలను తెచ్చిపెడతాయో లేదో తెలియదు, కానీ సస్టెయినబుల్ లైఫ్ స్టయిల్ వైపు సమాజాన్ని నడిపించడంలో మాత్రం విజయవంతం అవుతాను’ అంటోంది ఖుష్బూ గాంధీ. ఎకో ఫ్రెండ్లీ సిరా!‘‘ప్లాస్టిక్ బబుల్ ర్యాపరే కాదు, పేపర్ మీద ప్రింటింగ్ కోసం ఉపయోగించే ఇంక్ కూడా అంత త్వరగా నేలలో ఇంకదు. పైగా మట్టిని కలుషితం చేస్తుంది. సీ వీడ్ (సముద్ర నాచు), నాచురల్ కలర్ పిగ్మెంట్స్తో ఇంకు తయారు చేశాం. ఒకసారి ఉపయోగించి పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్‌కు బదులు వ్యవసాయ వ్యర్థాలతో ప్లేట్లు తయారు చేస్తున్నాం. ఇక్కడ మరో విషయం చె΄్పాలి. ఒకసారి వాడిపారేసే పేపర్ ప్లేట్లు, గ్లాసులకు ల్యామినేషన్తో కోటింగ్ వేస్తుంటారు. నేను దానికి కూడా ప్రత్యామ్నాయం కనుక్కున్నాను. ఎకో ఫ్రెండ్లీ కోటింగ్ చేస్తున్నాం. ‘గో డూ గుడ్’ ద్వారా మేము పది టన్నుల ప్లాస్టిక్ వాడకాన్ని నివారించగలిగాం. అలాగే ఎకో ఫ్రెండ్లీ ఇంక్‌తో ఒకటిన్నర లక్షల ఉత్పత్తులు అక్షరాలద్దుకున్నాయి. ఏడు టన్నుల బయో డీగ్రేడబుల్ బబుల్ ర్యాపర్లను వాడుకలోకి తెచ్చాం. ఈ ప్రయత్నంలో ఐదు టన్నుల వ్యవసాయ వ్యర్థాలు వినియోగంలోకి వచ్చాయి. లధాక్‌లో ప్లాస్టిక్ వేస్ట్! నేను ఈ రంగలోకి అడుగు పెట్టడానికి కారణం పదేళ్ల కిందటి లధాక్ పర్యటన. మారుమూల ప్రదేశాలు ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయి ఉన్నాయి. షాంపూ సాషే నుంచి లేస్ ర్యాపర్ వరకు అవీ ఇవీ అనే తేడా లేకుండా ప్రతి పదార్థమూ ప్లాస్టిక్‌లోనే ప్యాక్ అవుతోందని నాకు తెలిసిందప్పుడే. ఆ చెత్త కాలువల్లోకి చేరకుండా అంతటినీ ఒకచోట పోగు చేసి తగలబెడుతున్నారు. వాళ్లకు చేతనైన పరిష్కారం అది. ఇంతకంటే పెద్ద పరిష్కారమార్గాన్ని కనుక్కోవాలని అప్పుడు అనిపించింది. ఆ తర్వాత నేను మెటీరియల్ డెవలప్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం స్పెయిన్కెళ్లాను. కోర్సు పూర్తయ్యేలోపు నా ఆలోచనకు ఒక స్పష్టమైస రూపం వచ్చింది. బయోడీగ్రేడబుల్ వస్తువులతో ప్లాస్టిక్‌కి సమాధానం చెప్పవచ్చనే ధైర్యం వచ్చింది. పీజీ పూర్తయి తిరిగి ఇండియాకి రాగానే మా తమ్ముడు, మా వారితో కలిసి పూణేలో నా డ్రీమ్ ్రపాజెక్ట్ ‘గో డూ గుడ్’కు శ్రీకారం చుట్టాను. ఇది విజయవంతంగా నడుస్తోంది’’ అని వివరించిందామె. ఖుష్బూ పేరుకు తగినట్లు పరిమళభరితంగా తన విజయ ప్రస్థానాన్ని రాసుకుంటోంది. మరి... మనం మన చరిత్రను ఏ సిరాతో రాసుకుందాం... మట్టిని కలుషితం చేసే ఇంకుతోనా లేక మట్టిలో కలిసిపోయే ఇంకుతోనా. మనమే నిర్ణయించుకోవాలి. -
ఫీజుకు బదులు ప్లాస్టిక్!
ఈ భూగోళం మీద ప్లాస్టిక్ తొడుగు ఉంది. అది నీటిలో నానదు. మట్టిలో కలవదు. నిప్పులో కాల్చితే విషంగా మారుతుంది. అలాంటి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. లేదా రీసైకిల్ చేయాలి. అందుకే అసోంలోని ఆ స్కూల్ 2016లో వృథా ప్లాస్టిక్కే స్కూల్ ఫీజ్గా ప్రారంభమైంది. ఏడేళ్లు గడిచినా దిగ్విజయంగా నడిచి పర్యావరణ హితమైన స్కూల్‌గా ప్రశంసలు అందుకుంటోంది.ఫీజుకు బదులు ప్లాస్టిక్ వేస్ట్‌ను ఎవరైనా తీసుకుంటారా? ఆ స్కూల్లో తీసుకుంటారు. ఎంత వేస్ట్ తెస్తే అంత మెచ్చుకుంటారు కూడా. పర్మితా శర్మ, మజిన్ ముక్తార్ అనే పర్యావరణ ప్రేమికుల, బాలల హితుల వినూత్న ఆలోచన ఇది. అసోంలోని పమోహీలో ‘అక్షర్’పేరుతో వీరిద్దరూ ఒక పాఠశాల స్థాపించారు 2016లో. దీనిని భిన్నంగా నడపాలని నిశ్చయించుకున్నారు.చదువు, స్కిల్స్, పర్యావరణ స్పృహ సిలబస్‌గా ఉండాలనుకున్నారు. అందుకే ఫీజు కట్టాలంటే నోట్లు తేవద్దు వేస్ట్ ప్లాస్టిక్ తెండి అని చెప్పసాగారు. వీలైనన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకెళ్తే ఫీజు కట్టినట్లు రసీదు ఇస్తారు. మరో విషయం ఏమిటంటే ఇక్కడ విద్యార్థులను వారి వయసును బట్టి కాకుండా అవగాహన స్థాయిని బట్టి తరగతుల్లో వేస్తారు. ఎనిమిదేళ్లు వచ్చిన వారు 3వ క్లాస్‌లో ఉండాలని రూల్ లేదు. నాలుగులో ఉండొచ్చు లేదా రెండులోనూ ఉండొచ్చు.ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడాలని..మనుషులు బాగా చలి పుడితే దేనితోనైనా చలిమంట వేసుకోవడానికి వెనుకాడరు. అసోంలో చలి ఎక్కువ. కాని కట్టెలు ఖర్చు. అందుకే చలిమంటల కోసం ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లను, కవర్లను తెచ్చి మంటల్లో వేయసాగారు. ప్లాస్టిక్ వ్యర్థాలను బహిరంగంగా తగులబెట్టడం పర్యావరణానికి తీవ్రమైన హాని. దీనిపై అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదు.దానికి తోడు ప్లాస్టిక్ తగులపెట్టడం వల్ల వెలువడే విష వాయువులు పీల్చి పిల్లలు జబ్బు పడసాగారు. దీంతో సామాజిక కార్యకర్త అయిన పర్మితా శర్మకు ఓ ఆలోచన తట్టింది. తన మిత్రుడు, అమెరికాలో బాలల విద్యారంగంలో పని చేస్తున్న నిపుణులు మజిన్‌తో తన ఆలోచనను పంచుకుంది. అసోం భౌగోళిక పరిస్థితుల గురించి, అక్కడ నెలకొన్న సవాళ్ల గురించి మజిన్‌కు వివరించింది. అలా వారిద్దరి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ‘అక్షర్’ విద్యాలయం.ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేస్తున్న విద్యార్థులుఎవరు చేరుతారు?స్కూలంటే డబ్బు తీసుకుని చదువు చెప్పాలి. ప్లాస్టిక్ తెండి స్కూల్లో చేరండి అంటే ఎవరు చేరతారు. పైగా సంప్రదాయ విద్యకు, వృత్తి విద్యకు మధ్య వారధిగా ప్రారంభించిన ఈ పాఠశాలకు విద్యార్థులను రప్పించడం మొదట్లో సవాలుగానే మారింది. ఇక అక్కడి పేద పిల్లలు దగ్గర్లోనే ఉన్న రాళ్ల క్వారీలలో పనిచేస్తారు. వారిని బడికి పంపిస్తే ఆదాయం కోల్పోతామని తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపేందుకు ససేమిరా అన్నారు. దీంతో తల్లిదండ్రుల అవసరాలకు తగిన విధంగా స్కూల్ సమయాన్ని, బోధనను ‘అక్షర్’ లో రూపకల్పన చేశారు.ప్లాస్టిక్ ఇటుకలు..‘అక్షర్’లో నెదర్లాండ్స్ నుంచి తెప్పించిన మెషినరీ ద్వారా ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తారు. పాత ప్లాస్టిక్‌తో ఇటుకలు తయారు చేస్తారు. వీటిని నిర్మాణాల్లో వాడొచ్చు. పిల్లలు స్కూల్ అయ్యాక ఈ ఇటుకల తయారీ నేర్చుకుంటున్నారు. అలాగే పూలకుండీలు, బౌల్స్ వంటివి ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు రెండున్నర వేల ప్లాస్టిక్ బాటిళ్లు, ఏడు లక్షల ప్లాస్టిక్ కవర్లు ఇక్కడ రీసైకిల్ అయ్యాయి.అసోంను ప్లాస్టిక్ పీడ నుంచి విముక్తం చేయాలంటే తమ స్కూల్ మోడల్ని ఫాలో కావాలని పర్మిత, మజిన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికి 5 స్కూళ్లు ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయి. అంటే ఫీజుగా ప్లాస్టిక్‌ను తీసుకుంటున్నాయి. మరో వంద స్కూళ్లు ఇలా చేస్తే బాగుంటుందని పర్మిత, మజిన్ భావిస్తున్నారు. అసోంలో మాత్రమే కాదు దేశమంతా ఈ మోడల్‌ను ఉపయోగిస్తే ప్లాస్టిక్ వ్యర్థాలను కచ్చితంగా తరిమికొట్టడం వీలవుతుంది.ఇవి చదవండి: Kalaiyarasi: తను ఒక ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’.. -
వేస్ట్ నుంచి ‘బంగారం’: అదిరిపోయే కళ
‘వ్యర్థాల గురించి మాట్లాడుకోవడం పరమ వ్యర్థం’ అనుకోవడం లేదు యువతరం. ఎలక్ట్రానిక్స్ నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల వరకు రకరకాల వ్యర్థాలను కళాకృతులుగా రూపొందించి పర్యావరణ సందేశాన్ని అందించడం ఒక కోణం అయితే, ఎలక్ట్రానిక్ వ్యర్థాలలోని విలువైన వాటితో నగలు రూపొందించే ఎమర్జింగ్ ఆర్ట్ ట్రెండ్ లోతుపాతులు తెలుసుకోవడం మరో కోణం... కోల్‌కతాలోని శ్రీశ్రీ అకాడమీ విద్యార్థులు తమ పాఠశాల అవరణలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలతో అద్భుతాన్ని సృష్టించారు. ‘ట్రాష్ ఇన్స్టాలేషన్’ ప్రాజెక్ట్‌లో భాగంగా స్టూడెంట్స్ యుతిక, ఇషాని, రజనీష్, మంజరీ, అదిత్రిలు ప్లాస్టిక్‌తో తయారుచేసిన డాల్ఫిన్ స్టాచ్యూను పాఠశాల ఆవరణలోని వర్టికల్ గార్డెన్లో ఏర్పాటు చేశారు. నెలరోజుల వ్యవధిలో తయారు చేసిన ‘డాల్ఫిన్ ఇన్ పెరిల్’ అనే ఈ ఆర్ట్ ఇన్స్టాలేషన్ పాఠశాలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ‘ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, సముద్ర జీవులకు తీవ్రహాని కలుగుతుందనే విషయాన్ని ప్రచారం చేయడానికి కళను ఒక మాధ్యమంలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. భవిష్యత్‌లో ఇలాంటివి మరిన్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అంటుంది అదిత్రి. కేరళలోని తిరువనంతపురంలో ‘కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’కు చెందిన యంగ్ టీమ్ 20,000 ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఉపయోగించి 90 అడుగుల పాము ఇన్‌స్టాలేషన్‌ను రూపొదించింది. ప్లాస్టిక్ అనే విషసర్పం భూగోళాన్ని కాటు వేస్తున్నట్లుగా కనిపించే ఈ ఇన్స్టాలేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటిని దృష్టిలో పెట్టుకొని ‘ఫ్యాషన్ ఆఫ్ ది న్యూ ఎరా 100 శాతం ట్రాష్ అండ్ ప్లాస్టిక్!’ అంటూ ఒక యువ ఆర్టిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ముంబైలో ఉంటున్న హరిబాబు ఇ–వేస్ట్ కళలో ఎంతోమంది యూత్‌కు ఇన్స్పైరింగ్గా నిలుస్తున్నాడు. ఇ–వేస్ట్ కళారూపాలతో ప్రముఖ ఆర్ట్ గ్యాలరీలలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. కేరళలో పుట్టిన హరిబాబు చెన్నైలో పెరిగాడు. చెన్నై గవర్నమెంట్ ‘కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’లో చదువుకున్నాడు. ఇ–వ్యర్థాలతో కళాకృతుల తయారీకి ప్రశంసల మాట ఎలా ఉన్నా బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం ఎప్పటికప్పుడూ ఖాళీ అవుతుండేది. ‘నీకేమైనా పిచ్చి పట్టిందా?’ అని తిట్టేవారు మిత్రులు. అయితే బజాజ్ ఆర్ట్ గ్యాలరీ ఫెలోషిప్ అవార్డ్ అందుకున్న తరువాత హరిబాబుకు బ్రేక్ వచ్చింది. ఏడాది తరువాత ‘స్టేట్–ఆఫ్–ది–ఆర్ట్ స్టూడియో’ ముంబైలో ప్రారంభించాడు. టన్నుల కొద్దీ ఇ–వ్యర్థాల నుంచి ఎన్నో శిల్పాలు రూపొందించిన హరిబాబు దగ్గరికి సలహాలు, సూచనల కోసం ఎంతోమంది యంగ్ ఆర్టిస్ట్‌లు వస్తుంటారు. భువనేశ్వర్‌కు చెందిన మ్యూరల్ ఆర్టిస్ట్ దిబూస్ జెనా, ఆర్టిస్ట్ సిబానీ బిస్వాల్ ఆర్గానిక్ స్క్రాప్, రీయూజ్డ్ మెటల్‌లతో ఆర్ట్ ఇన్స్టాలేషన్లను సృష్టించారు. మానవ తప్పిదాల వల్ల సముద్రానికి జరుగుతున్న హాని గురించి తెలియజేసేలా ఉంటుంది జెనా రూపొందించిన తిమింగలం. ‘ఒషాబా బ్రాండ్ గురించి తెలుసుకున్న తరువాత ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై ఆసక్తి పెరిగింది. వృథా అనుకునే వాటి నుంచి ప్రయోజనం సృష్టించాలి అనే వారి ఫిలాసఫీ నాకు నచ్చింది’ అంటుంది భో΄ాల్‌కు చెందిన ఇరవై రెండు సంవత్సరాల రీతిక. కళ తప్పి మూలన పడ్డ ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి గత సంవత్సరం లండన్ కేంద్రంగా ఒషాబా బ్రాండ్‌కు అంకురార్పణ జరిగింది. వాడి పారేసిన స్మార్ట్‌ఫోన్ సర్క్యూట్ బోర్డులు, ప్లగ్, యూఎస్బీ కేబుల్స్, చార్జింగ్ కేబుల్స్..మొదలైన వాటిలోని విలువైన వాటిని ఈ బ్రాండ్ ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. నిజానికి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఆభరణాల తయారీలో ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. 2018లో అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ‘డెల్’ కాలం చెల్లిన తమ కంప్యూటర్ విడి భాగాల నుంచి సేకరించిన విలువైన వాటితో నగలు రూపొదించడానికి లైఫ్‌స్టైల్ బ్రాండ్ ‘బాయూ విత్ లవ్’తో కలిసి భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విలువైన పదార్థాల వృథాను నివారించడానికి, ఎలక్ట్రానిక్ వ్యర్థాల గురించి వినియోగదారులలో అవగాహన కలిగించే సృజనాత్మక విధానాన్ని ‘డెల్’ ఎంచుకుంది. ‘జువెలరీ బ్రాండ్స్ రీ–సైకిల్డ్ అల్టర్నేటివ్స్పై ఆసక్తి చూపుతున్నాయి. వాడిపాడేసిన స్మార్ట్ఫోన్లు, లాప్‌టాప్‌లు... మొదలైన వాటిలో గోల్డ్ మైన్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూలకు పడి ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో దాగి ఉన్న విలువైన లోహలు, ఒక టన్ను ఇ–వేస్ట్ నుంచి ఎన్ని గ్రాముల బంగారం వస్తుంది... లాంటి వివరాలు నాకు ఆసక్తికరంగా మారాయి’ అంటుంది ముంబైకి చెందిన నవీన. 23 సంవత్సరాల నవీనకు పాత, కొత్త అనే తేడా లేకుండా నగల డిజైనింగ్ ఐడియాలపై ఆసక్తి. ఈ ఆసక్తి ఆమెను ఎలైజా వాల్టర్లాగే నలుగురు మెచ్చిన డిజైనర్‌గా మార్చవచ్చు. నగ దరహాసం ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి నగలు తయారు చేసే బ్రాండ్‌గా బ్రిటన్‌లో మంచి పేరు సంపాదించింది లైలీ జువెలరి. ఎలైజా వాల్టర్ 24వ యేట ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది, యువతలో ఎంతోమందిలాగే ఇ–వ్యర్థాలలోని అపురూప అంశాలపై ఆసక్తి పెంచుకుంది. ‘ప్రపంచంలోని బంగారంలో ఏడు శాతం నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌లో దాగి ఉన్నందున ఆభరణ బ్రాండ్లు వాటిని ముఖ్యమైన వనరుగా చూస్తున్నాయి’ అంటున్న ఎలైజా వాల్టర్ ప్రయాణం యువతలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇ–వ్యర్థాల నుంచి రూపొందించిన ఈ ఆభరణాన్ని ఎలైజా వాల్టర్ డిజైన్ చేసింది. -
వాడేసిన ప్లాస్టిక్‌తో వండర్స్
మనింట్లో చాలా ప్లాస్టిక్ కవర్స్ పోగవుతాయి. వాటిని చెత్తలో పడేస్తాము. అవి ఎప్పటికీ మట్టిలో కలవక అలాగే కాలుష్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాని ఈ ప్లాస్టిక్ కవర్లనే రాజిబెన్ దారాలుగా చేసి బ్యాగులు అల్లుతుంది. బుట్టలు చేస్తుంది. పర్సులు చేస్తుంది. డోర్మ్యాట్లు సరేసరి. అందుకే ఆమెకు చాలా గుర్తింపు వచ్చింది. ఆమె వల్ల ఎందరికో ఉపాధి కలుగుతోంది. కొత్త ఆలోచన చేసిన వారే విజేతలు. గుజరాత్ కచ్ ప్రాంతంలోని కోటె అనే చిన్న పల్లెలో ఏమీ చదువుకోని అమ్మాయి – రాజి బెన్ పెరిగి పెద్దదయ్యి లండన్ వెళ్లి అక్కడ పెద్దవాళ్లతో తాను చేసిన కృషిని వివరించింది. ఆమె తన జీవితంలో ఇంత పెద్ద ప్రయాణం చేసి, గుర్తింపు పొందేలా చేసింది ఏమిటో తెలుసా? వృధా ప్లాసిక్. వాడేసిన ప్లాస్టిక్ రోడ్ల మీద, ఇళ్ల డస్ట్బిన్లలో, చెత్త కుప్పల మీద అందరూ ప్లాస్టిక్ కవర్లను, రేపర్లను పారేస్తారు. వాటిని ఏం చేయాలో ఎవరికీ ఏమీ తోచదు. అవి తొందరగా మట్టిలో కలిసిపోవు. కాని రాజిబెన్ వాటిని ఉపయోగంలోకి తెచ్చింది. వాటిని సేకరించి, కట్ చేసి పీలికలుగా మార్చి, కలిపి నేసి అందమైన వస్తువులు తయారు చేసింది. బ్యాగులు, సంచులు, పర్సులు... వాటి మన్నిక కూడా ఎక్కువ. ఎలా చేస్తారు? వాడేసిన ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ను సేకరించి సర్ఫ్ నీళ్లతో కడుగుతారు. ఆ తర్వాత వాటిలోని మలినాలు పోవడానికి వేడి నీళ్లలో నానబెడతారు. తర్వాత రెండు రోజులు ఎండలో ఆరబెడతారు. ప్లాస్టిక్ మందంగా ఉంటే అర ఇంచ్ వెడల్పు రిబ్బన్లుగా; పలుచగా ఉంటే ముప్పావు ఇంచ్ రిబ్బన్లుగా కట్ చేస్తారు. ఈ ముక్కలను నాణ్యమైన జిగురుతో అంటించి పొడవైన ఉండగా మారుస్తారు. అంటే మగ్గం మీద నేయడానికి దారం బదులు ఈ ప్లాస్టిక్ ఉండనే ఉపయోగిస్తారు. ఈ ప్లాస్టిక్ దారాలతో నేస్తే దళసరి వస్త్రం తయారవుతుంది. దానిని కట్ చేసుకుని రకరకాల వస్తువులుగా చేతి నైపుణ్యంతో తీర్చిదిద్దుతారు. హ్యాండ్ బ్యాగ్‌లు, కూరగాయల బ్యాగ్‌లు, ఫోన్ బాక్సులు, పర్సులు.. ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి. మన్నికతో ఉంటాయి. ఎలా వచ్చింది ఐడియా? రాజి బెన్ నేత కుటుంబంలో పుట్టింది. అయితే తండ్రికి నేత మీద విసుగుపుట్టి వ్యవసాయం చేసేవాడు. అదీగాక ఆడపిల్లలు మగ్గం మీద కూచోవడం నిషిద్ధం. కాని రాజి బెన్కి మగ్గం మీద పని చేయాలని 12 ఏళ్ల వయసు నుంచే ఉండేది. అందుకని మేనమామ కొడుకు దగ్గర రహస్యంగా మగ్గం పని నేర్చుకుంది. 14 ఏళ్లు వచ్చేసరికి మగ్గం పనిలో ఎక్స్‌పర్ట్‌గా మారింది. అయితే ఆమెకు పుట్టింటిలో కాని మెట్టినింటిలో గాని మగ్గం మీద కూచునే అవకాశమే రాలేదు. ఏడేళ్లు కాపురం చేశాక భర్త హటాత్తుగా మరణించడంతో రాజి బెన్ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాల్సి వచ్చింది ముగ్గురు పిల్లల కోసం. కచ్‌లో ఒక ఎన్.జి.ఓ ఉంటే అక్కడ మగ్గం పని ఖాళీ ఉందని తెలిస్తే వెళ్లి చేరింది. అందమైన వస్త్రాలు అల్లి వాటిని ఆకర్షణీయమైన వస్తువులుగా తీర్చిదిద్దే స్థానిక కళలో ఆమె ప్రావీణ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఎన్.జి.ఓ వారు ఆమె చేసిన ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ సేల్ నిర్వహించేవారు. 2012లో జరిగిన ఎగ్జిబిషన్లో ఒక విదేశీ డిజైనర్ ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసి తయారు చేసిన బ్యాగ్‌ను చూపించి ‘ఇలాంటిది తయారు చేయగలవా?’ అని అడిగాడు. అది ఎలా తయారయ్యిందో అర్థమయ్యాక రాజి బెన్‌కు నాలుగు రోజులు కూడా పట్టలేదు అలాంటి బ్యాగులు తయారు చేయడానికి. ఆ డిజైనర్ వాటిని చూసి సంతృప్తిగా కొనుక్కుని వెళ్లాడు. మరికొన్ని బ్యాగులు జనం క్షణాల్లో ఎగరేసుకుపోయారు. అప్పటి నుంచి వేస్ట్ ప్లాస్టిక్ నుంచి రాజి బెన్ హస్తకళా ఉత్పత్తులను తయారు చేస్తోంది. స్వచ్ఛ్ సుజల్ శక్తి సమ్మాన్ రాజి బెన్ ఖ్యాతి ఎంత దూరం వెళ్లిందంటే అమృత మహోత్సవం సందర్భంగా ‘స్వచ్ఛ్ సుజల్ శక్తి సమ్మాన్’ పురస్కారం ఆమెకు ప్రకటించారు. అలాగే యూరప్ దేశాల నుంచి ఆమె ఉత్పత్తులకు ఆర్డర్లు వస్తున్నాయి. ‘ప్లాస్టిక్ పీడ విరగడ అవ్వాలంటే దానిని ఎన్ని విధాలుగా రీసైకిల్ చేయవచ్చో అన్ని విధాలుగా చేయాలి. రాజి బెన్ కొత్త తరాన్ని తనతో కలుపుకుంటే ఆమె ఉత్పత్తులు చాలా దూరం వెళ్లడమే కాక పర్యావరణానికి మేలు కూడా జరుగుతుంది’ అని విదేశీ ఎంట్రప్రెన్యూర్లు అంటున్నారు. రాజి బెన్ ప్రస్తుతం 90 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. 2018 నుంచి సొంత సంస్థ పెట్టుకోవడంతో దాని టర్నోవర్ ఇప్పుడు సంవత్సరానికి 10 లక్షలు దాటిపోయింది. ఆమె గెలుపు గాథ మరింత విస్తరించాలని కావాలని కోరుకుందాం. -
గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రల్లో తింటున్నారా?దీనిలోని బిస్ఫినాల్ వల్ల..
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి.గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఓవైపు ప్లాస్టిక్‌ను నిర్మూలించాలని చెబుతున్నా మరింత ఎక్కువగా వాడుతున్నాం. ఇప్పటికే ప్లాస్టిక్ ఉత్పత్తి సంవత్సరానికి 40 కోట్ల టన్నులకు చేరుకుందని అంచనా. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో సమస్య సంక్షోభంగా మారే అవకాశం తొందర్లోనే ఉంది. ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే నష్టాలివే పర్యావరణ_కాలుష్యం: ►సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు పర్యావరణ కాలుష్యానికి ప్రధాన మూలం. ఎందుకంటే అవి భూమిలో ఇంకిపోవడానికి చాలా సమయం పడుతుంది.ప్లాస్టిక్ కవర్లు వన్యప్రాణులకు హాని కలిగిస్తాయి. జంతువులు వాటిని ఆహరంగా భావించి తినేస్తున్నాయి. ఇది ఎక్కువైతే, మరణానికి కూడా దారితీయొచ్చు. ► ప్లాస్టిక్ కవర్లు అనేక రసాయనాలు కలిగి ఉంటుంది. వీటిని నీటిలో వదలడం వల్ల అవి కూడా కలుషితం అయ్యి ప్రమాదాన్ని కలిగిస్తాయి. ► కొన్ని ప్లాస్టిక్ కవర్లలో మానవ ఆరోగ్యానికి హాని కలిగించే బిస్ఫినాల్ A (BPA), థాలేట్స్ ,ఫ్లేమ్ రిటార్డెంట్స్ వంటి రసాయనాలు ఉండవచ్చు. ఈ రసాయనాలు ప్లాస్టిక్ నుండి బయటకు వెళ్లి ఆహారం లేదా పానీయాలలోకి వెళ్లి, హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి సమస్యలు మరియు క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ► ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి, పారవేయడం గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తుంది. ఇది వాతావరణ మార్పు, ఇతర పర్యావరణ సమస్యలకు దోహదం చేస్తుంది. ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారం తింటున్నారా? మీరు రోజూ ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం తీసుకుంటున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే. వేడి పదార్థాలను ప్లాస్టిక్ లేదా డిస్పోజబుల్ ప్లేట్లలో ఉంచడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పరాశోధకులు ప్లాస్టిక్ (Plastic) తయారు చేసేందుకు బిఎస్ ఫినాల్ను ఉపయోగిస్తారు. ప్రధానంగా పాలికార్బోనేట్ లేదా రీసైకిల్ కోడ్7గా పిలువబడే ఇది ప్లాస్టిక్‌లో కలుస్తుంది. ఇది విషపూరితమైనది. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ పొంచివుండే ప్రమాదం ఉంది. బీపీఏ అనేది మానవ శరీరంలోని ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను అసమతుల్యత చేసే రసాయనమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి మొదలైన వాటికి దారి తీస్తుంది. అలాగే అలెర్జీలు, గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ తీవ్రతను పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుంది ఎక్కువగా ప్లాస్టిక్ పాత్రల్లో తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రలలో ఆహారం తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని వేడి చేయడం కూడా హానికరమంటున్నారు. మీరు మైక్రోవేవ్ ఉపయోగించాల్సి వస్తే ప్లాస్టిక్‌కు బదులుగా మీరు పేపర్ టవల్, గ్లాస్ ప్లేట్ లేదా సిరామిక్ వస్తువులను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు ప్లాస్టిక్‌ను నిషేధించాలని పదేపదే చెబుతున్నా, ఇంకా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ప్లాస్టిక్ కవర్స్‌ని నిషేధించే విధంగా చర్యలు చేపట్టినా, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్లాస్టిక్ భూమిలో కరగడానికి కొన్ని వందల ఏళ్లు సమయం పట్టడం, అందులో ప్లాస్టిక్ తయారీలో కలిసే పదార్థం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఎంతో మంది నిపుణులు చెబుతున్నా.. ఇంకా ప్లాస్టిక్ రూపుమాపడం లేదు. ప్లాస్టిక్ కవర్ల హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి, సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ల వినియోగాన్ని తగ్గించడం, కంటైనర్లు, పత్తి లేదా బీస్వాక్స్ వంటి సహజ పదార్థాలతో తయారు చేయబడిన ర్యాప్ల వంటి మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్లాస్టిక్ కవర్లను రీసైక్లింగ్ చేయడం సరైన పరిష్కారం కాదు. దానికంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే సమస్యను పరిష్కరించడానికి ఉత్తతమైన మార్గం. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు -
మొలకెత్తే పెన్ను.. పర్యావరణానికి దన్ను
గుంటూరు (ఎడ్యుకేషన్): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, వినియోగంపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే పెన్నులను సైతం పర్యావరణ అనుకూల విధానంలో ఉపయోగిస్తోంది. యూజ్ అండ్ త్రో (వాడిపారేసే) ప్లాస్టిక్ పెన్నులు భూమిలో కలిసిపోయేందుకు వందల ఏళ్లు పడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేల సంఖ్యలో పెన్నులను వాడి పారేస్తుండటంతో పర్యావరణానికి హాని కలిగించని పెన్నుల తయారీ, వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలుత విద్యాశాఖలో ప్రయోగాత్మకంగా పర్యావరణ అనుకూల పెన్నుల వినియోగాన్ని అమల్లోకి తెచ్చింది. కాగితం పొరలతో.. కాగితం పొరలతో తయారు చేసిన పెన్నులకు మందపాటి అట్టతో రూపొందించిన క్యాప్ ఉంచిన పెన్నులను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాల వారీగా నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు ఉచితంగా అందజేస్తున్నారు. ప్యాడ్‌తో పాటు పేపర్ పెన్నులను ఇస్తూ.. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తున్నారు. ప్రత్యేకంగా పేపర్ పెన్నుల ఉత్పత్తిదారులకు ఆర్డర్ ఇచ్చి పెన్నులు తయారు చేయిస్తున్నారు. వీటిని వాడిన తరువాత పడేస్తే అవి మట్టిలో కలిసిపోతాయి. మరో విశేషం ఏమిటంటే.. ఆ పెన్నుల వెనుక భాగంలో అమర్చిన చిన్న గొట్టంలో నవ ధాన్యాలు, వివిధ దినుసులు, పూల మొక్కల విత్తనాలను అమర్చారు. బీన్స్, సన్‌ఫ్లవర్, మెంతులు తదితర విత్తనాలను కూడా అమర్చుతున్నారు. పెన్నును వాడి పారేసిన తరువాత ఇంటి పెరట్లోనో, రోడ్డు పక్కన మట్టిలోనో పారవేస్తే పెన్ను భూమిలో కరిగిపోయి.. అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. ప్రస్తుతం బల్క్ ఆర్డర్లపై తయారు చేస్తున్న ఈ ఎకో ఫ్రెండ్లీ పెన్నును కేవలం రూ.20కే కొనుగోలు చేయవచ్చు. గురువారం గుంటూరు నగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులకు ఎకో ఫ్రెండ్లీ పెన్నులను విద్యాశాఖ అధికారులు పంపిణీ చేశారు. -
పంట పొలాల్లో తిష్టవేసుకొని కూర్చున్న ప్లాస్టిక్ భూతం
పంట పొలాల్లో ప్లాస్టిక్ భూతం తిష్టవేసుక్కూచుంది. వ్యవసాయంలో చాలా పనుల కోసం ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకం గత 70 ఏళ్లుగా అనేక రెట్లు పెరిగింది. మల్చింగ్ షీట్లు, ఫామ్‌పాండ్ లైనింగ్, ప్లాస్టిక్ డ్రిప్ లేటరల్స్, పీవీసీ పైపులు, గ్రీన్ హౌస్‌ల పైకప్పులు, సైలేజీ గడ్డి బేల్స్ కోసం ఫిల్మ్‌ల తదితర పనుల కోసం వ్యవసాయంలో ప్లాస్టిక్ వాడకం అంతకంతకూ పెరుగుతోంది. వీటిల్లో ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ ముఖ్యమైనది. ఒక పంట కాలంలో చిరిగిపోయే పల్చటి షీట్ ఇది. కలుపును నివారించడం ద్వారా కలుపు తీత శ్రమతో పాటు ఖర్చును లేదా రసాయనిక కలుపు మందుల ముప్పును/ వాటి కొనుగోలు ఖర్చును తగ్గించడం.. మట్టిలో నుంచి నీటి తేమ ఆరిపోకుండా చూడటం ద్వారా నీటిని ఆదా చేయటం ద్వారా దిగుబడి పెరుగుదలకు ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు ఉపయోగపడుతున్నాయి. కోటి 25 లక్షల టన్నుల ప్లాస్టిక్ సేద్యం 2019వ సంవత్సర కాలంలో ప్రపంచవ్యాప్తంగా పంటల సాగు, ఆక్వా సాగు, చేపల వేట దగ్గరి నుంచి ఆయా ఆహారోత్పత్తులను వినియోగదారులకు చేర్చే వరకు ఉన్న దశలన్నిటిలో కలిపి సుమారు కోటి 25 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ను వినియోగించినట్లు ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా పంటలు/ఉద్యాన తోటల సాగులో, పశువుల పెంపకంలో ఏడాదికి కోటి టన్నుల ప్లాస్టిక్ వాడుతుండగా.. ఇందులో మల్చింగ్ ఫిల్మ్ వాటా 34 లక్షల టన్నులు. చేపల వేట, ఆక్వా సాగులో 21 లక్షల టన్నులు, అటవీ ఉత్పత్తులకు సంబంధించి మరో 2 లక్షల టన్నుల ప్లాస్టిక్ సామగ్రి వాడుతున్నారు. 2030 నాటికి వ్యవసాయంలో ప్లాస్టిక్ వాడకం 50% పెరగనుందని వ్యాపారుల అంచనా. ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేకపోయినప్పటికీ, వ్యవసాయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ప్లాస్టిక్‌లో సింహభాగం అంటే 60 లక్షల టన్నుల ప్లాస్టిక్ (ప్రపంచ వినియోగంలో సగం)ను ఆసియా దేశాల్లో రైతులే వాడుతున్నారని ఎఫ్.ఎ.ఓ. చెబుతోంది. ప్లాస్టిక్ అవశేషాలతో ముప్పేమిటి? పంట భూముల్లో మిగిలిపోయే ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ అవశేషాల వల్ల ఆయా భూములు కాలుష్యం బారిన పడినందున సూక్ష్మజీవరాశి నశించి పంట దిగుబడులు తగ్గిపోతున్నట్లు ఎఫ్.ఎ.ఓ. పేర్కొంది. ఇలా భూమిలో కలిసిన ప్లాస్టిక్ (ముఖ్యంగా మల్చింగ్ ఫిల్మ్ అవశేషాల) ద్వారా వెలువడే మైక్రోప్లాస్టిక్స్ (సూక్ష్మప్లాస్టిక్ కణాలు) ఆహారోత్పత్తులు, నీటి ద్వారా తిరిగి మనుషులకు చేరి వారికి అనారోగ్యం కలిగించడం కూడా జరుగుతోందని ఎఫ్.ఎ.ఓ. ఆందోళన వ్యక్తం చేసింది. పెద్ద ఎత్తున పోగుపడే వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల వన్యప్రాణులు, మూగజీవాలు కూడా అనారోగ్యం పాలువుతున్నాయి. కొన్ని ప్లాస్టిక్ కణాలలో ఉండే థాలేట్స్, బిస్పినాల్స్ వంటి విషతుల్య పదార్థాలు మనుషుల హార్మోన్ వ్యవస్థను అస్థవ్యస్థం చేసి ఆనారోగ్యాల బారిన పడేస్తాయి. ఈ ప్లాస్టిక్ వస్తువులు, సూక్ష్మప్లాస్టిక్ కణాలు వాగులు, కాలువల ద్వారా సముద్రంలోకి చేరి జలచరాలకు దీర్ఘకాలం హాని చేస్తున్నాయి. వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక పద్ధతి ప్రకారం సేకరించి, పునర్వినియోగించే పటిష్ట వ్యవస్థ కొరవడింది. సేకరించి పొలాల్లోనే తగటబెడుతున్నారు. ఒక వేళ చెత్త కుప్పల్లో వేసినా.. అక్కడ వాటికి నిప్పు పెడుతున్నారు. తగలబడిన ప్లాస్టిక్ నుంచి పాలీక్లోరినేటెడ్ డిబెన్జో–పి–డయాక్సిన్లు, ఫ్యురాన్లు వంటి విషతుల్య వాయువులు వెలువడుతూ ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్నాయి. ఒక వైపు ఆహారోత్పత్తి పెరుగుదలకు దోహదపడుతున్న ఈ ప్లాస్టిక్.. మరోవైపు ఆహారభద్రతపై, ఆహార నాణ్యత, పౌష్టికాహార శోషణపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అదేవిధంగా, సాంఘిక, ఆర్థిక పరంగా నష్టాలకు కారణభూతమవుతోంది. అందువల్ల, వ్యవసాయంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని గాడిన పెట్టి, ప్రత్యామ్నాయాలపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటూ ఎఫ్.ఎ.ఓ. శాస్త్రవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, పాలకులకు అనేక సూచనలు చేసింది. కిలో షీట్‌తో 700 చ.అ.ల భూమి కలుషితం పంట పూర్తయిన తర్వాత చీలికలు పేలికలయ్యే మల్చింగ్ ప్లాస్టిక్ షీట్ ముక్కలను ఏరివేయటం పెద్ద సమస్యగా మారింది. వీలైనంత వరకు ఏరి తగులబెట్టడం లేదా చెత్తకుప్పలో వేస్తున్నారు. మిగతా ప్లాస్టిక్ ముక్కలు భూమిలో అలాగే ఉండిపోతున్నాయి. వీటితో పాటు డ్రిప్ లేటరల్స్ ముక్కలు తదితర ప్లాస్టిక్ వస్తువులను సక్రమంగా ఏరి తిరిగి ఉపయోగించే పరిస్థితి లేనందున భూమి ప్లాస్టిక్ కాలుష్యం బారిన పడుతోంది. ఆసియా దేశాల్లో 10 శాతాన్ని మాత్రమే సేకరించి, తిరిగి వాడగలుగుతున్నామని అంచనా. మట్టిలో కలిసే సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు మట్టిలోని సూక్ష్మజీవరాశిని నాశనం చేస్తున్నాయి. దీంతో భూసారం దెబ్బతింటున్నది. ఒక కిలో పల్చటి ప్లాస్టిక్ షీట్ 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యవసాయ భూమిని కలుషితం చేస్తోందని అంచనా. చమురు, సహజవాయువు లేదా బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను శుద్ధిచేసి 99% ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇవి ఒక వైపు ఉపయోగపడుతూనే నిర్వహణ లోపం వల్ల మనుషులు, పశు పక్ష్యాదుల ఆరోగ్యానికి, పర్యావరణానికి తీరని హాని కలిగిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయాలున్నప్పటికీ..! రసాయనిక కలుపు మందులు వాడకుండా, కలుపు మొలవకుండా చూసేందుకు వ్యవసాయంలో వాడుతున్న ప్లాస్టిక్ మల్చింగ్ ఫిల్మ్‌కు ప్రత్యామ్నాయాలు అనేకం. పంటల మార్పిడి పాటించడం, పంట పొలంలో ఖాళీ లేకుండా అంతర పంటలు వేయటం(సజీవ ఆచ్ఛాదన) లేదా ఎండుగడ్డి వంటి పంట వ్యర్థాలను మల్చింగ్గా వాడటం వంటి మార్గాలున్నాయి. త్వరగా చివికి భూమిలో కలిసిపోయే పర్యావరణహితమైన (బయోడీగ్రేడబుల్) మల్చింగ్ ఫిల్మ్‌లను సంపన్న దేశాల్లో వాడుతున్నారు. అదేవిధంగా, మన కాయిర్ బోర్డు రూపొందిస్తున్న కొబ్బరి పీచుతో తయారు చేసే ‘భూవస్త్రాలు’ కూడా పంటల మధ్య ఆచ్ఛాదనకు ఉపయోగపడతాయి. కొద్ది నెలల్లో మట్టిలో కలిసిపోతాయి. అయితే, వీటితో వచ్చిన చిక్కేమిటంటే.. ప్లాస్టిక్ మల్చింగ్ ఫిల్మ్ కన్నా వీటి ధర 2–3 రెట్లు ఎక్కువగా ఉండటమే. ఈ ప్రతిబంధకాలను అధిగమించేందుకు ముఖ్యంగా ఆసియా దేశాలు పరిశోధనలకు ఊతమివ్వాలి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలు ఫలించి, ధర అందుబాటులోకి వస్తే బయోడీగ్రేడబుల్ మల్చింగ్ ఫిల్మ్‌లు మన దేశంలోనూ రైతులకు అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ప్లాస్టిక్ ముప్పు ఇంతింత కాదయా!
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) ద్వారా పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ యేడు ప్లాస్టిక్ మీద దృష్టి పెట్టాలని నిర్ణయం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2023... ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రజలు చేపట్టే చర్యలు ముఖ్యమైనవని గుర్తు చేస్తున్నది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు తీసుకునే చర్యలు ప్రజల ఆకాంక్షల మేరకే ఉంటాయని నొక్కి చెబుతున్నది. ప్రజా చైతన్యంతో ఒక ‘వృత్తాకార ఆర్థిక వ్యవస్థ’కు నాంది పలికే సమయం ఆసన్నమైంది. ప్లాస్టిక్ కాలుష్యంతో ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి భూమిని, మానవ సమాజాన్ని, సహజ ప్రకృతి వ్యవస్థలను రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి. ఇప్పటికే బిలియన్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయింది. జీవవైవిధ్యంతో పాటు మానవ ఆరోగ్యం మీద కూడా ప్లాస్టిక్ దుష్ప్రభావం చూపుతుంది. ౖఆహారంలో, నీటిలో మెక్రో ప్లాస్టిక్ చేరి నేరుగా మనుష్యుల ఆరోగ్యంపై త్వరగా ప్రభావం చూపే దశకు చేరుకున్నాం. ప్లాస్టిక్ వస్తువు లను కాల్చడంవల్ల విష వాయువులు వెలువడి ఆహారం, నీరు కలు షితం అవుతున్నాయి. అయినా ప్లాస్టిక్ ఉత్పత్తి పెరుగుతున్నది. సంవత్సరానికి 40 కోట్ల టన్నులకు చేరుకుందని అంచనా. ఈ ఉత్పత్తిని అరికట్టడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టకుంటే 2040లోపే ఇది రెట్టింపు అవుతుందని అంచనా. ప్లాస్టిక్ కాలుష్య సమస్య భౌగోళికంగా ఏదో ఒక దేశానికి పరిమిత మైనది కాదు. నదులు, మహాసముద్రాల ద్వారా, గాలి ద్వారా, వివిధ సరఫరా గొలుసు వ్యవస్థల ద్వారా, ఎగుమతులు, దిగుమతుల ద్వారా ఈ కాలుష్యం ఎల్లలు దాటుతున్నది. ముఖ్యంగా మైక్రో, నానోప్లాస్టి క్ల విషయంలో ఇది కచ్చితం! మొత్తం సముద్ర వ్యర్థాలలో ప్లాస్టిక్ 85 శాతం ఉందని అంచనా. ఈ వ్యర్థాలు సముద్ర జలచరాలకు ప్రాణ సంకటంగా మారాయి. జీవాల మనుగడ, సుస్థిర పునరుత్పత్తి సమస్యగా మారింది. సముద్రంలో చేరడం కాకుండా, 46 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి మీద గుట్టలుగా మిగులుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల్లో 17 శాతం కాల్చేస్తున్నారు. కేవలం 15 శాతం పునర్వినియోగం అవుతోంది. ఈ రెండు ప్రక్రియల ద్వారానూ గాలి కాలుష్యం అవుతున్నది. ప్లాస్టిక్ ఉపయోగం క్రమంగా తగ్గించుకోవడమే సుస్థిర మార్గం. దీర్ఘకాలిక పరిష్కారం అంటే ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ పదార్థాలను వాడటం. మైక్రో ప్లాస్టిక్ ఇంకా తీవ్ర సమస్య ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవడానికి వందల ఏండ్లు పడుతుందని మనందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా గమనించిన విషయం ఆందోళన కలిగిస్తున్నది. ఈ వ్యర్థాలు ఎండకు, వానకు, గాలికి, సముద్రంలో ఉప్పు నీటికి పగిలిపోతూ, చిన్న సూక్ష్మ పరి మాణంలోకి మారి, కంటికి కనపడని కణాలుగా, ఫైబర్‌గా మారు తున్నాయి. ఈ మైక్రో ప్లాస్టిక్... కణాలుగా, ఫైబర్ (నూలు)గా తాగే నీటిలో, జలచరాల శరీరాలలో చేరి, తరువాత క్రమంగా మనుష్యు లలో చేరుతున్నది. ప్లాస్టిక్ ఉత్పత్తిలో మైక్రో ప్లాస్టిక్ ఉత్పత్తి కూడా ఉన్నది. పెళ్లిళ్లలో ఒకరి మీద ఒకరు పోసుకునే చమ్కీలు, పుట్టిన రోజు కేకు కట్ చేసేటప్పుడు వాడుతున్న ప్లాస్టిక్ గోలీలు మైక్రో ప్లాస్టిక్ ఉత్పత్తులే. ఒకసారి వాడి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్‌తో పాటు, అసలు అవసరం లేని (జీరో యూజ్) ప్లాస్టిక్ కూడా ఉత్పత్తి అవు తున్నది. అరటి పండు తొక్క తీసేసి ప్లాస్టిక్ కవర్ ప్యాక్ చేయడం, కొబ్బరి బోండాం ప్లాస్టిక్ కవర్లో పెట్టి అమ్మడం, పళ్లను ‘ఫోమ్’తో చేసిన తొడుగుల మీద పెట్టడం వంటివి అనవసర ప్లాస్టిక్ వినియోగంలోకి వస్తాయి. ప్యాకేజింగ్ పరిశ్రమ పూర్తిగా ప్లాస్టిక్ మీద ఆధారపడి, అనవసర వినియోగాన్ని ప్రజల మీద రుద్దుతున్నది. ఇటువంటి అనవ సర ప్లాస్టిక్ వినియోగం మీద ప్రభుత్వ నియంత్రణ అవసరం. మన జీవన శైలి వల్ల కూడా ప్లాస్టిక్ వినియోగం పెరుగుతున్నది. ప్లాస్టిక్ బాధ పోవాలంటే ఉత్పత్తి తగ్గడంతో పాటు దాని వినియోగం తగ్గాలి. అన్నింటికీ ప్లాస్టిక్ వాడే బదులు అవసరమైన వాటికే వాడితే వ్యర్థాలు తగ్గుతాయి. ప్రతి మనిషీ తన ప్లాస్టిక్ వినియోగం మీద దృష్టి పెట్టి, ప్రణాళిక ప్రకారం చేస్తే, వినియోగం తగ్గించవచ్చు. ప్రతి ఇంటిలో స్వల్ప మార్పులతో, భారీ త్యాగాలు చేయకుండా ప్లాస్టిక్ వినియోగం తగ్గించవచ్చు. అపార్ట్మెంట్ సంస్కృతి వల్ల కూడా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ అవుతున్నది. ప్రతి బహుళ అంతస్థుల నివాస సముదాయాలలో, గేటెడ్ కమ్యునిటీలలో ప్లాస్టిక్ ఆడిట్ చేసుకుని, పునర్వినియోగ పద్ధతులు అవలంబిస్తే ప్లాస్టిక్ డిమాండ్ తగ్గుతుంది. ప్రభుత్వం కూడా ప్రజా రవాణా వ్యవస్థను విస్తృత పరిస్తే ప్రైవేటు కార్ల వినియోగం తగ్గుతుంది. కార్లు తగ్గాయంటే, ఆ మేరకు విని యోగం ఉండదు. మనం ప్లాస్టిక్ వాడకున్నా ప్లాస్టిక్ భూతం స్పష్టమైన ప్రభావం చూపుతుంది. కర్బన ఉద్గారాల వల్ల భూతాపం పెరుగు తున్నట్లు, ప్లాస్టిక్ ఎవరో ఎక్కడో వాడినా దాని దుష్ప్రభావం వారితో పాటు మనం కూడా ఎదుర్కోవచ్చు. ఎవరి బాధ్యత ఎంత? 2022 ఫిబ్రవరిలో ఐక్యరాజ్యసమితి ‘పర్యావరణ అసెంబ్లీ’ ప్లాస్టిక్ కాలుష్యంపై అంతర్జాతీయ, చట్టబద్ధమైన ఒడంబడిక అభివృద్ధి చేయ డానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ‘ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్’ కమిటీ (ఐఎన్‌సీ) ద్వారా, ఈ ఒప్పందం 2024 చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. మొత్తం ప్లాస్టిక్ జీవిత చక్రంపై దృష్టి సారించి, సుస్థిరమైన ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఒక సమగ్ర విధానాన్ని ఈ ఒప్పందం ద్వారా సాధించవచ్చని ఆశిస్తు న్నారు. వనరుల సామర్థ్యం పెంచడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల సమ స్యను పరిమాణ పరంగా తగ్గిస్తూ చక్రాకార ఆర్థిక వ్యవస్థ వంటి పరిష్కరాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. 2022 డిసెంబర్లో ‘ఐఎన్‌సీ–1’ మొదటి సమావేశాల్లో చర్చలు జరిగాయి. ఒకసారి వాడి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్‌ను నిషేధించడం, ఉత్పత్తి మీద ఆంక్షలు విధించడం, మెరుగైన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలకు సంబంధించిన విధానాల కూర్పు పైన దృష్టి సారించారు. వివిధ వ్యక్తులు, వర్గాలకు సంబంధించి ఎవరికి ఎంత బాధ్యత ఉంటుంది అనే ప్రశ్నలపై కూడా దృష్టి పెట్టారు. ఉత్పత్తిదారుల మీద కూడా బాధ్యత ఉంది. అదనంగా వ్యర్థాల నిర్వహణలో సాధించాల్సిన మార్పులో సామాజిక న్యాయ కోణం కూడా చర్చించారు. వ్యర్థాల నిర్వహణ మీద ఆధారపడిన జీవనోపాధులకు నష్టం వాటిల్లకుండా చేపట్టవలసిన చర్యలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ కొంత సున్నితత్వం అవసరం అని భావిస్తున్నారు. పారదర్శక పర్యవేక్షణ యంత్రాంగాల అవసరం, పర్యావరణానికి హాని కలిగించని ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ వంటివి ఈ ఒప్పందంలోని కీలక అంశాలు కానున్నాయి. ప్రపంచ ప్లాస్టిక్ ఒప్పందం, కాలుష్యం తగ్గించే చర్యల అమలుకు తీసుకునే నిర్ణ యాలు, చేపట్టే ప్రక్రియలలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం. ప్రజలు పాల్గొనే విధంగా ఒప్పంద ప్రక్రియలను రూపొందించడం అవసరం. ఈ ఒప్పందం తయారీలో, అన్ని దేశాలు ఆమోదించే దశలలో ఎదు రయ్యే సవాళ్లు, తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలలో అవగాహన పెరగాలని ఈ ఒప్పందం మీద ఆశ పెట్టుకున్నవాళ్ళు భావిస్తున్నారు. ప్లాస్టిక్ మీద ఈ ఒప్పందాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి ప్రక్రియలతో అనుసంధానించేలా ముడిపెడితే బాగుంటుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి శిలాజ ఇంధనాలను తగ్గిస్తూ, ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం పెంచే క్రమంలో ప్లాస్టిక్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తి ముడి చమురు శుద్ధి నుంచి వస్తుంది కనుక. ముడి చమురు విని యోగం తగ్గితే ప్లాస్టిక్ వినియోగం తగ్గవచ్చు. ప్రత్యామ్నాయ ఇంధ నాలతో పాటు ప్లాస్టిక్‌కు కూడా ప్రత్యామ్నాయం తేవాలి. అయితే ఇదంత సులువు కాదు. కాగా, మనుషులు ధరించే దుస్తులలో పత్తి, పట్టు, ఉన్ని వంటి సహజమైనవి ప్రోత్సహిస్తే, వేల టన్నుల పాలిస్టర్ వస్త్ర వ్యర్థాలు తగ్గుతాయి. ఎక్కడ వీలైతే అక్కడ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులకు ప్రభుత్వం పెట్టుబడులు పెంచి, తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. భారతదేశంలో చేనేత రంగానికి ఊతం ఇస్తే ప్లాస్టిక్ తగ్గించవచ్చు. కాలుష్యం తగ్గుతుంది, ఉపాధి పెరుగుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ లాభపడుతుంది. దొంతి నరసింహా రెడ్డి ,వ్యాసకర్త విధాన విశ్లేషకులు ‘ 90102 05742 (ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ కోసం ఐరాస ‘ఐఎన్‌సీ’ రెండో సమావేశాలు మే 29 నుంచి జూన్ 2 వరకు ఫ్రాన్స్‌లో జరగనున్నాయి.) -
ఏపీ: రాష్ట్రంలో సేకరించే ప్లాస్టిక్ చెత్తతో రహదారులు
-
గ్రామాల్లో రీసైక్లింగ్ రోడ్లు.. సేకరించే ప్లాస్టిక్ చెత్తతో రహదారులు
గ్రామాల్లో సిమెంట్, తారు రోడ్లను మాత్రమే ఇప్పటివరకు చూశాం. ఇకపై ప్లాస్టిక్ రోడ్లనూ చూడబోతున్నాం. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించిన ఏపీ సర్కారు.. ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్‌పైనా ప్రత్యేక దృష్టి సారించింది. వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలకు అర్థాన్ని.. ప్రయోజనాన్ని చేకూర్చేలా ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణానికి అనువుగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. సిమెంట్ పరిశ్రమల్లో వినియోగించే విధంగానూ రీసైక్లింగ్ యూనిట్లను సిద్ధం చేస్తోంది. సాక్షి, అమరావతి: పర్యావరణంతో పాటు భూగర్భ జలాలకు ప్రమాదకరంగా తయారైన ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు సేకరించి.. వాటిని రోడ్ల నిర్మాణంలో ఉపయోగించేలా రీసైక్లింగ్ చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. నియోజకవర్గానికి ఒకచోట ఈ తరహా రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 160 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు గ్రామాల ఎంపిక సైతం పూర్తయింది. పట్టణాల తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతి ఇంటినుంచీ నేరుగా చెత్త సేకరణ ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇలా సేకరించిన చెత్తను ఆయా గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న చెత్త సేకరణ కేంద్రాల (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ల)లో ప్లాసిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వేరు చేసి ఉంచుతారు. గ్రామాల వారీగా ఇలా వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను వారానికి ఒకటి లేదా రెండు విడతలుగా ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్‌కు తరలించేలా ఒక వాహనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతివారం రూట్ల వారీగా ఆ వాహనంతో అన్ని గ్రామాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తారు. అనంతరం ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను మెషిన్ల సాయంతో బండిల్స్ రూపంలో అణచివేసి.. ఆ తర్వాత చిన్నచిన్న ముక్కలు ముక్కలుగా మార్చి నిల్వ చేస్తారు. రోడ్ల నిర్మాణంలో వినియోగించేలా.. ప్లాస్టిక్ బాటిల్స్ వంటివి మట్టిలో కలవడానికి కనీసం 240 సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలు వర్షం నీటిని భూమిలో ఇంకిపోకుండా అడ్డుపడుతుంటాయి. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో పీఎంజీఎస్‌వై (గ్రామీణ సడక్ యోజన) కింద చేపట్టే రోడ్ల నిర్మాణంలో కంకరతో పాటు కొంతమేర ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్లాస్టిక్ కవర్లు వంటి వాటిని సిమెంట్ పరిశ్రమలలో మండించడానికి ఉపయోగించేలా ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే రీసైక్లింగ్ యూనిట్లలో సిద్ధం చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో ఉపయోగించాల్సి ఉంటుంది. రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా రోడ్డ నిర్మించే కాంట్రాక్టర్లకు ఎక్కడికక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను విక్రయించే ఆలోచన చేస్తున్నారు. రానున్న రోజుల్లో రోడ్ల నిర్మాణంలో వీటి వాడకం పెరిగే పక్షంలో జిల్లాల వారీగా ప్రత్యేక వేలం కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 232 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా 2021 అక్టోబర్ నుంచి క్లీన్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 232 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. వాటిలో స్థానికంగా అమ్మడానికి వీలున్న వాటిని గ్రామ పంచాయతీల స్ధాయిలోనే చిరు వ్యాపారులకు అమ్మేశారు. అమ్మకానికి పనికి రాని ప్లాస్టిక్ వ్యర్థాలను పర్యావరణానికి హాని కలిగించని రీతిలో నాశనం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి గ్రామాల్లొ సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా రోడ్ల నిర్మాణం లేదా సిమెంట్ పరిశ్రమలో మండించడానికి ఉపయోగించేలా రీసైక్లింగ్ ప్రాసెస్ చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. -
ప్లాస్టిక్ రహితానికి మేము సైతం..!
మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగమనేది విడదీయలేని భాగమైపోయింది. తక్కువ ఖర్చుతో పాటు సులభంగా అన్ని అవసరాలకు ఉపయోగపడేవి కావడంతో వాటిపై పూర్తిగా ఆధారపడడం బాగా పెరిగిపోయింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వివిధ రూపాలు, రకాల్లో ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోవడంతో పలుచోట్ల కొత్త చిక్కులు మొదలయ్యాయి. దేశంలో ప్రతి నిమిషం దాదాపు 12 లక్షల ప్లాస్టిక్ బ్యాగులు ఉపయోగిస్తుండగా, కరోనా కాలంలో వీటి వినియోగం మరింతగా పెరిగింది. కోవిడ్ వ్యాప్తి భయాలు ప్రజల్లో విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్లాస్టిక్ కట్లరీ, కప్స్, కంటైనర్లు, లో–మైక్రాన్ కౌంట్ క్యారీ బ్యాగ్‌లు, గార్బేజ్ బ్యాగ్‌లు, మినరల్ వాటర్ బాటిళ్లు, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్న వస్తువుల ప్యాకేజింగ్ మెటీరియల్ వినియోగం ఎన్నో రెట్లు పెరిగింది. ఇప్పటికే యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న కవర్లు, వస్తువుల వినియోగంపై నిషేధం అమలుతో పాటు దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం లేదా ఒకసారి ఉపయోగించి పారేసే సింగిల్‌యూజ్ ప్లాస్టిక్స్ నియంత్రణకు కొంచెం నెమ్మదిగానైనా చర్యలు ప్రారంభమయ్యాయి. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణ లేదా ఆ వస్తువుల వినియోగం తగ్గించుకునే దిశలో కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పాటు వ్యక్తులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ప్రకృతికి, పర్యావరణానికి మేలు కలిగించే పద్ధతులు, విధానాల వ్యాప్తికి సామాజిక కార్యకర్తలు,సంస్థలు కృషిచేస్తున్నాయి. వారి అనుభవాలు, ప్లాస్టిక్ వినియోగం కట్టడికి వారు చేస్తున్న కృషి వివరాలు... ప్లాస్టిక్ నియంత్రణే ఆశయం మానసిక వికాసం సరిగా లేని ‘స్పెషల్ కిడ్స్’ కోసం హైదరాబాద్‌లోని మౌలాలిలో ఏర్పాటు చేసిన ‘ఆశయం’ స్కూల్ ద్వారా పర్యావరణ హితంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్నామ్నాయంగా కొన్ని పర్యావరణహిత వస్తువుల తయారీకి ‘ఆశయం’ సంస్థాపకురాలు లక్ష్మి కృషి చేస్తున్నారు. న్యూస్‌పేపర్, బ్రౌన్పేపర్ ఉపయోగించి పేపర్ బాగ్స్ తయారు చేస్తున్నారు. ఆయా సంస్థలు, వ్యక్తుల అవసరాలకు తగ్గట్టుగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లకు ప్రత్యామ్నాయంగా వివిధ సైజుల్లో బ్యాగులు, ఇతర ఉత్పత్తులను అందిస్తున్నారు. ఇక్కడి పిల్లలతోనే వీటిని తయారు చేయడం, బయటి నుంచి తీసుకొచ్చిన మట్టి దివ్వెలపై కలర్స్, పెయింటింగ్స్ వేయించడం, డెకరేట్ చేయించడం వంటివి చేస్తున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు బట్టల స్టోర్లు, ఫుట్‌వేర్ షాపులు, కూరగాయలు, కిరాణా దుకాణాల వారు వీరి నుంచి పేపర్ బ్యాగ్‌లు కొనుగోలు చేస్తూ తమ వంతు చేయూతను ఇస్తున్నారు. అలవాట్లలో మార్పులతోనే అరికట్టగలం రోజువారీ మన అలవాట్లలో చిన్న చిన్న మార్చులు చేసుకోగలిగితే తప్పకుండా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నియంత్రించవచ్చు. గతం నుంచి మనది పర్యావరణహిత సమాజం. జీవనశైలిని మార్చుకుంటే చాలు గణనీయమైన మార్పులు తీసుకురావొచ్చు. పాత రోజుల్లోలాగా బయటికి వెళ్లేపుడు చేతిసంచి వెంట తీసుకెళ్లడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. మేము నిర్వహించే చేనేత సంతల్లో పాత న్యూస్పేపర్లను రీసైకిల్ చేసి తయారు చేసిన పేపర్బ్యాగ్లనే వాడుతున్నాం. దాదాపు పదేళ్ల నుంచి టూత్‌పేస్ట్ మానేసి పళ్లపొడి ఉపయోగిస్తున్నాం. బయటికి వెళ్లేపుడు స్టీల్ వాటర్‌బాటిళ్లు తీసుకెళతాం. ప్లాస్టిక్ టూత్‌బ్రష్ బదులు ‘బాంబూ బ్రష్’ వాడుతున్నాము. ప్లాస్టిక్ నియంత్రణకు ప్యాకేజ్డ్ ఫుడ్ మానేయడం ఆరోగ్యానికి కూడా మంచిది. పెళ్ళిళ్లు ఫంక్షన్లు, ఒకసారి ఉపయోగించి పడవేసే వస్తువుల వినియోగానికి సంబంధించి అరటిబెరడుతో తయారు చేసిన ఆకుప్లేట్లు, విస్తరాకుల వాడకాన్ని అలవాటు చేయొచ్చు. – సరస్వతి కవుల, సామాజిక కార్యకర్త పర్యావరణహిత మార్గంలో... ఇంజనీరింగ్ పట్టభద్రుడైన స్వర్గం భరత్ కుమార్ మంచి ప్యాకేజీతో వచ్చిన ఐటీ, ఇతర ఉద్యోగాలను కాదనుకుని 2018 నుంచి ‘ఎకో మేట్’– డెస్టినేషన్ ఫర్ ఎసెన్షియల్ అల్టర్నేటివ్స్–డీల్– పేరిట ‘ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ బిజినెస్ స్టార్టప్’ నిర్వహిస్తున్నారు. స్వచ్ఛందసంస్థలో పనిచేసిన అనుభవంతో ప్లాస్టిక్స్ ప్రత్యామ్నాయాలపై విస్తృత అధ్యయనంతో పర్యావరణహిత వస్తువుల తయారీపై ఇష్టం పెంచుకున్నారు. ప్లాస్టిక్ రహిత వస్తువులు, ప్రకృతి సహజమైన పద్ధతులు, సేంద్రియ వ్యవసాయం, సుస్థిర జీవనశైలి విధానాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు తనవంతు కృషి చేయాలని నిర్ణయించారు. పేపర్‌తో, చెక్కతో తయారు చేసిన పెన్సిళ్లు, పెన్స్, స్టేషనరీ ఐటెమ్స్, బాంబూ టూత్‌బ్రష్‌లు, గిన్నెలు తోమేందుకు కొబ్బరి పీచు స్క్రబ్బర్లు , బాడీ స్క్రబ్బర్లు, గుళ్లల్లో ఉపయోగించిన పువ్వులతో తయారు చేసిన అగరువత్తులు, క్లాత్ బ్యాగ్‌లు, జూట్ బ్యాగ్‌లు, ఆకుప్లేట్లు ఇలా ప్రతిదానికీ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా ఇతరత్రా రూపాల్లో ఇప్పుడిప్పుడే ప్రజల్లో ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెరుగుతోందని భరత్ చెబుతున్నారు. కార్పొరేట్, ఐటీ సెక్టర్ ఉద్యోగుల్లో కొంత అవగాహన ఏర్పడినా, మిగతా వర్గాల్లో ఇంకా మార్పు రావాల్సి ఉందని అంటున్నారు. వారి వారి సర్కిళ్లు, వాట్సాప్గ్రూప్ల ద్వారా ప్రచారంతో కొంతవరకు మార్పు వస్తోందని చెప్పారు. ఎకోఫ్రెండ్లీ లైఫ్‌స్టయిల్, సస్టయినబుల్ లివింగ్‌లో బెంగళూరు, పుణె నగరాలు దేశంలోనే ముందువరసలో ఉన్నాయన్నారు. ప్రకృతిసహజ వస్తువుల వ్యాప్తికి కృషి రోజువారీ ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాల వినియోగం తగ్గింపు విషయంలో ప్రజల్లో మార్పు చాలా నెమ్మదిగా వస్తోంది. ప్లాస్టిక్ రహితం చేయడం లేదా ఆ వస్తువుల వినియోగం తగ్గించడమనేది క్షేత్రస్థాయి నుంచే మొదలు కావాలి. గత రెండేళ్లలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా దీపావళి సందర్భంగా లక్ష దాకా మట్టిదివ్వెలను అమ్మగలిగాను. గణేష్‌చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను తయారు చేశాం. కాలేజీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా విద్యార్థులతో టూర్ల సందర్భంగా మార్పు కోసం ప్రయత్నించాను. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా మేమే స్వయంగా స్వచ్ఛమైన దేశీ ఆవుపేడతో తయారుచేసిన గొబ్బెమ్మలు, భోగిదండలు, పిడకలు, నవధాన్యాలు, సేంద్రియ పసుపు, కుంకుమ, రంగోలీ రంగులు, సేంద్రియ నువ్వులు, బెల్లం లడ్డూలు వంటివి సరసమైన ధరలకే అందుబాటులోకి తెస్తున్నాం. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ప్లాస్టిక్, రసాయనాలతో కూడిన వస్తువులు ఉపయోగించకూడదని భావించాను. పళ్లు తోముకునే బ్రష్, పేస్ట్ స్థానంలో పళ్లపొడితో మొదలుపెట్టి సున్నిపిండి, ఇతర సహజ సేంద్రియ వస్తువులతో తయారుచేసిన సబ్బులు, పూజగదిలో రసాయనాలు లేని కుంకుమ, పసుపు, అగరవత్తులు వినియోగంలోకి తెచ్చాను. ఆర్గానిక్ పంటలు సొంతంగా పండించి వాటినే తింటున్నాం. గత ఐదేళ్లుగా గోరక్షకు ‘మురళీధర గోధామం గోశాల’ ఏర్పాటు చేసి ఆవులను కాపాడే ప్రయత్నంతో గో ఆధారిత వస్తువుల వినియోగం వ్యాప్తికి కృషి చేస్తున్నాం. – డా.సీహేచ్ పద్మ వనిత కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్, – కె.రాహుల్మురళీధర అనుసంథాన గో విజ్ఞానకేంద్రం -
15 లక్షల ఖాళీ బీరు సీసాలతో ఆలయం
ప్లాస్టిక్‌తోనే కాదు, గాజుతోనూ పర్యావరణానికి ముప్పే! ప్లాస్టిక్ ఎంతకాలమైనా మట్టిలో కలవదు. గాజు కొంతకాలానికి మట్టిలో కలిసిపోతుంది. ఆ లెక్కన ప్లాస్టిక్ కంటే గాజు మెరుగైనదే అయినా, గాజు తయారీ ప్రక్రియలో గాజును కరిగించడానికి అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. ఫలితంగా పెద్దమొత్తంలో కర్బన ఉద్గారాలు గాలిలోకి విడుదలై, పరిసరాల్లోని వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. వాడేసిన గాజుసీసాలను పునర్వినియోగంలోకి తేవడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకైనా అరికట్టవచ్చని థాయ్‌లాండ్ శాస్త్రవేత్తలు భావించారు. వారి ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఫొటోల్లో కనిపిస్తున్న సీసాల ఆలయం. థాయ్‌లాండ్‌లోని సిసాకేత్ ప్రావిన్స్ ఖున్‌హాన్ ప్రాంతంలో ఉంది ఈ సీసాల ఆలయం. ఈ ఆలయ నిర్మాణం కోసం 1984 నుంచి ఖాళీ బీరుసీసాల సేకరణ మొదలుపెట్టారు. ఆలయ నిర్మాణానికి అంచనా వేసిన మేరకు 15 లక్షల ఖాళీసీసాలను సేకరించి, రెండేళ్లలో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ప్రాంగణంలో ఇదేరీతిలో 2009 నాటికి ఇరవై కట్టడాలను నిర్మించారు. వీటిలో ప్రార్థన మందిరాలు, శ్మశాన వాటిక, పర్యాటకుల కోసం స్నానపు గదులు, ఫౌంటెన్లు వంటివి ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా సీసాలతో నిర్మించినవే! ‘మిలియన్ బాటిల్ టెంపుల్’గా వార్తలకెక్కిన ఈ ఆలయం పేరు ‘వాట్ పా మహా చేది కేవ్’. సీసాలతో ఆలయం నిర్మించడానికి ముందు ఇక్కడ ఒక పురాతన బౌద్ధాలయం జీర్ణావస్థలో ఉండేది. దానిని ఇలా సీసాలతో జీర్ణోద్ధరణ చేశారు. ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించగానే, స్థానికులే కాకుండా థాయ్ ప్రభుత్వం కూడా తనవంతుగా లక్షలాది ఖాళీసీసాలను ఈ ఆలయానికి పంపింది. ఈ సీసాల ఆలయం థాయ్‌లాండ్‌లో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. థాయ్‌లాండ్‌కు వచ్చే పర్యాటకుల్లో చాలామంది ప్రత్యేకించి ఇక్కడకు వచ్చి, ఈ ఆలయం వద్ద నిలబడి ఫొటోలు దిగుతుంటారు. ఎందుకు నిర్మించారంటే..? పనిగట్టుకుని మరీ ఖాళీసీసాలతో ఆలయ జీర్ణోద్ధరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనుకుంటున్నారా? నిజానికి పర్యావరణాన్ని రక్షించుకోవలసిన అవసరం తీవ్రంగానే ఏర్పడింది. చుట్టూ సముద్రతీరం ఉండే థాయ్‌లాండ్ బీచ్‌లలో పర్యాటకుల కోలాహలం నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి ముందు– అంటే, 1984 నాటికి ముందు థాయ్ బీచ్‌లలో ఎక్కడ చూసినా వాడి పారేసిన ఖాళీ బీరుసీసాలు గుట్టలు గుట్టలుగా కనిపించేవి. సముద్రాన్నే మింగేసేంతగా ఖాళీ సీసాల గుట్టలు ఏర్పడటంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. థాయ్ ప్రభుత్వానికి కూడా ఇదో తలనొప్పి వ్యవహారంగా మారింది. సముద్రం కలుషితం కాకుండా ఉండేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకుంటే పరిస్థితి చెయ్యిదాటిపోయే ప్రమాదం ఉందని గుర్తించింది. అయితే, ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. తీరంలో గుట్టలుగా పేరుకుపోతున్న ఖాళీసీసాలను ‘ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. ఈ సమస్య పరిష్కారానికి మీ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోండి’ అని ప్రజలను కోరింది. బౌద్ధభిక్షువులను కూడా ఇదే కోరిక కోరింది. ప్రభుత్వం పిలుపుతో బౌద్ధభిక్షువులు ముందుకొచ్చారు. ‘ఖాళీసీసాలను మాకిచ్చేయండి. మేము ఇక్కడ ఆలయం నిర్మించుకుంటాం’ అని అడిగారు. ‘ఇవ్వడమేంటి? తీరానికి వెళ్లి మీరే కావలసినన్ని సీసాలను తీసుకెళ్లండి’ అని బదులిచ్చింది ప్రభుత్వం. లక్షలాది సీసాలను తెచ్చుకోవడం కొద్దిమంది బౌద్ధభిక్షువుల వల్ల సాధ్యమయ్యే పనికాదు. దీంతో ఆలయ ధర్మకర్తలు బాగా ఆలోచించి, సీసాల సేకరణ కోసం ప్రజల సహాయాన్ని కోరారు. ఒక్కరూ స్పందించలేదు. కొన్నాళ్లు ఓపికగా ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో మరో ప్రకటన చేశారు. ‘పరిశుభ్రతే పరమాత్మ. అందువల్ల అందరూ తలా ఓ చెయ్యి వేసి, దైవకార్యానికి మీ వంతు సహాయం చెయ్యండి. ఆలయ నిర్మాణానికి కలసిరండి. పర్యావరణ పరిరక్షణకు సహాయపడండి’ అని ప్రకటించడంతో ప్రజల్లో నెమ్మదిగా స్పందన మొదలయ్యింది. ఒక్కొక్కరే సీసాలు సేకరించి, ఆలయానికి ఇవ్వసాగారు. థాయ్ తీరంలో నెమ్మదిగా సీసాల గుట్టలు తరిగిపోసాగాయి. అలాగే ఆలయ నిర్మాణం వేగం పుంజుకుంది. రెండేళ్ల వ్యవధిలోనే ఇలా చక్కని సీసాల ఆలయం తయారైంది. వనరుల పునర్వినియోగానికి ఈ ఆలయం ఒక అద్భుతమైన ఉదాహరణ. - దినేష్ రెడ్డి -
Funday Cover Story: ఆర్.. ఆర్.. ఆర్
చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు కానీ ఇది కలియుగం! భూమికి మనమందరం కలిసి చేస్తున్న ద్రోహం ఎంత చెప్పుకున్నా తీరేది కానేకాదు. గాలి, నీరు.. భూమి.. ఖనిజాలు.. ఇలా భూమ్మీది వనరులన్నింటినీ... విచ్చలవిడిగా వాడేసిన ఫలితంగా ముంచుకొస్తున్న.... భూతాపోన్నతి, వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కోవాలంటే... ఒట్టిమాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టాల్సిందే! మానవాళి మొత్తం... మన మనుగడ కోసమే చేస్తున్న ఈ యుద్ధంలో.. అందరి తారక మంత్రం ఒకటే కావాలి. అదేమిటంటారా.... వాతావరణ మార్పుల గురించి కానీ... పెరిగిపోతున్న భూమి సగటు ఉష్ణోగ్రతల గురించి కానీ ఈ రోజు కొత్తగా చెప్పుకోవాల్సిందేమీలేదు. కనీసం రెండు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు, ఐక్యరాజ్య సమితి నియమించిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమేట్ చేంజ్ తరచూ అధ్యయన పూర్వకంగా విడుదల చేసిన నివేదికల్లో హెచ్చరిస్తూనే ఉంది. భూమి సగటు ఉష్ణోగ్రతలను ఈ శతాబ్దం అంతానికి 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితే పెనుముప్పు తప్పదని, సముద్ర తీర నగరాలన్నీ మునిగిపోవడం మొదలుకొని అకాల, తీవ్ర ప్రకృతి వైపరీత్యాలతో భూమిపై మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఇప్పటివరకూ వెలువడిన ఆరు ఐపీసీసీ నివేదికలు స్పష్టం చేశాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విపత్తు ముంచుకొస్తోందని తెలిసినా.. జంతుజాతి వినాశనం అంచున కొట్టుమిట్టాడుతోందన్నా ప్రపంచదేశాలు ఇప్పటికీ వీటిని ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగకపోవడం!! బాధ్యులెవరు? ఖర్చులు ఎవరు భరించాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు నెపం ఇంకొకరిపైకి నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇది మరెంతో కాలం కొనసాగే సూచనలు లేవు. నిరుడు యూరప్ మొత్తం కరవు చుట్టుముట్టింది. అలాగే ఎన్నడూ లేనంత తీవ్రమైన వరదలు పాకిస్థాన్‌ను పలకరించాయి. ఈ ఏడాది మొదట్లోనూ వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అమెరికా మంచులో కూరుకుపోయింది. ఈ వైపరీత్యాలన్నీ వాతావరణ మార్పుల ప్రభావమేనని స్పష్టమైతేనైనా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రపంచదేశాలు ముందుకు కదులుతాయి. ఈ అంశం అలా పక్కనుంచితే... వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు చిరకాలంగా సూచిస్తున్న తారక మంత్రం రెడ్యూస్.. రీసైకిల్.. రీ యూజ్! క్లుప్తంగా ఆర్ఆర్ఆర్ అని పిలుచుకుందాం. వ్యక్తుల స్థాయిలో... ప్రభుత్వాలూ చేపట్టగల ఈ మూడు పద్ధతులను అమలు చేయగలిగితే.. ఒకవైపు వనరుల సమర్థ వినియోగం సాధ్యమవడమే కాకుండా... భూమి పది కాలాల పాటు పచ్చగా ఉండేందుకు అవకాశం ఎక్కువ అవుతుంది. ఎలా మొదలైంది? ఆర్ ఆర్ ఆర్ గురించి దశాబ్దాలుగా మనం వింటున్నాం. కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు తమదైన ప్రయత్నాలు చేస్తున్నాయి. చెత్తను తగ్గించుకునేందుకు, వనరులను ఆదా చేసుకునేందుకు, ఒక వస్తువు లేదా పదార్థాన్ని ఇంకో రూపంలోకి మార్చి మళ్లీ మళ్లీ వాడేందుకు తమదైన రీతుల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు అవసరమైన టెక్నాలజీ, పరికరాల రూపకల్పన సరేసరే. అంతా బాగుంది కానీ.. ప్రపంచమంతా ఒక ఉద్యమంలా సాగుతున్న ఈ ఆర్ ఆర్ ఆర్ ఎలా మొదలైంది? ఊహూ.. స్పష్టంగా ఎవరికీ తెలియదు. అయితే ఏటా ఏప్రిల్ 22న నిర్వహించే ఎర్త్ డేకు ఈ ఆర్ ఆర్ ఆర్కూ కొంత సంబంధం ఉందని చాలామంది అంగీకరిస్తారు. 1970లో అమెరికాలోని విస్కాన్సిన్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ ఈ ఎర్త్ డేను ప్రారంభించినప్పుడు ఆ దేశంలో సుమారు రెండు కోట్ల మంది వేర్వేరు ప్రాంతాల్లో పాల్గొన్నారు. జాతరలు, ప్రదర్శనలు, ఊరేగింపుల్లాంటివి నిర్వహించారు. తద్వారా పర్యావరణ పరంగా భూమికి జరుగుతున్న నష్టాన్ని, ప్రమాద నివారణకు వ్యక్తిగత స్థాయిలో చేయగల పనులను ఈ సందర్భంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించే సమయానికి అమెరికా మొత్తమ్మీద వాడి పారేసే వస్తువులతో పెద్ద సమస్యగా ఉండేదట. 1950లలో ఆర్థికంగా బాగా వృద్ధి చెందడంతో మొదలైన ఈ సమస్య 1970ల నాటికి పతాక స్థాయికి చేరుకుందన్నమాట. కుప్పల్లోనూ చెత్త పేరుకుపోయి ఉండేది. ఎర్త్ డే సందర్భంగా చెత్త సమస్యపై ప్రజల దృష్టి పడటంతో ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను సిద్ధం చేసింది. ఈ చట్టం కారణంగా వస్తువులను రీసైకిల్ చేయాల్సిన అవసరాన్ని తెలియజెప్పే రిసోర్స్ రికవరీ యాక్ట్ కూడా సిద్ధమైంది. ఈ సందర్భంలోనే అమెరికాలో ఈ రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అనే పదం ప్రజల నోళ్లల్లో నానడం మొదలైంది. క్రమేపీ ఒక ఉద్యమంలా మారిందని అంటారు. ఆర్ ఆర్ ఆర్...ఇంతకీ వీటి పరమార్థం? ఆర్ ఆర్ ఆర్ పరమార్థం ఒక్క ముక్కలో చెప్పాలంటే దేన్నైనా అవసరమైనంత మేరకు మాత్రమే వాడుకోమ్మని. పిసినారిగా ఉండమని చెప్పినా తప్పేమీ కాదు. దీనివల్ల ఆర్థికంగా మనకు కొంచెం లాభం చేకూరడమే కాకుండా... భూమి మొత్తాన్ని కాపాడేందుకు మన వంతు సాయం చేసినట్టూ ఉంటుంది. అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. భూమ్మీద ఉన్న వారందరూ చేయిచేయి కలిపినా రాగల ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేము. తీవ్రత కొంచెం తగ్గవచ్చు అంతే. ప్రజలతోపాటు ప్రభుత్వాలు తగు విధానాలు సిద్ధం చేసి, తగినన్ని నిధులు, టెక్నాలజీలను సమకూర్చి కార్యాచరణకు దిగితేనే ప్రయోజనం. ఈ దిశగా ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని ప్రయత్నాలైతే చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్లలో మొదటిదైన రెడ్యూస్ విషయాన్ని పరిశీలిద్దాం. చెత్తకుప్పల్లోకి చేరే వ్యర్థాలను తగ్గించుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. ఇలా చెత్త తగ్గాలంటే మనం వాడే వనరులను కూడా మితంగా అవసరమైనంత మేరకే వాడుకోవాలి. అది కరెంటు కావచ్చు.. నీళ్లు కావచ్చు. ఇంకేదైనా వనరు, పదార్థం కావచ్చు. మితంలోనే పరమార్థమన్నమాట. వ్యక్తులుగా దీన్ని సాధించేందుకు కొన్ని చిట్కాలున్నాయి. మీలో కొందరు ఇప్పటికే వీటిని పాటిస్తూండవచ్చు కూడా. అవేమిటంటే... ఇంటికి కావాల్సిన వస్తువులను చిన్న చిన్న మొత్తాల్లో కాకుండా... నెలకు లేదా కొన్ని నెలలకు సరిపడా ఒకేసారి కొనేయడం. దీనివల్ల ప్యాకేజింగ్ కోసం వాడే ప్లాస్టిక్ గణనీయంగా తగ్గుతుంది. ఎక్కువ మోతాదుల్లో కొంటే ఖర్చులూ కలిసివస్తాయి. మళ్లీమళ్లీ వాడుకోగల సంచులను దగ్గరుంచుకుంటే మరికొంత ప్లాస్టిక్‌ను చెత్తకుప్పలోకి చేరకుండా నిలువరించవచ్చు. వాడి పారేసే వస్తువుల కంటే మళ్లీమళ్లీ వాడుకోగలవాటికే ప్రాధాన్యమివ్వండి. ఇంట్లో అవసరమైనప్పుడు.. అవసరమైన చోట మాత్రమే ఫ్యాన్లు, లైట్లు వాడటం ద్వారా విద్యుత్తును తక్కువగా వాడవచ్చు. కుళాయిల్లో, బాత్రూమ్ సింక్‌లలో లీకేజీలు లేకుంటే బోలెడంత నీళ్లు మిగుల్చుకోవచ్చు. వారంలో ఒక్క రోజు మాంసాహారం మానేసినా పాడి పశువుల పెంపకానికయ్యే వనరులు తగ్గి భూమికి మేలు జరుగుతుందంటారు నిపుణులు. విమాన ప్రయాణాలను తగ్గించుకోవడం, వీలైనప్పుడల్లా కాళ్లకు పనిచెప్పడం లేదా సైకిళ్లను ఉపయోగించడమూ రెడ్యూస్ కిందకే వస్తుంది. కర్బన ఉద్గారాలు మరింత ఎక్కువ కాకుండా ముందుగానే అడ్డుకోవడం అన్నమాట. ► 98 %: వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో (క్యారీబ్యాగుల్లాంటివి) చమురులాంటి శిలాజ ఇంధనాలతో తయారయ్యేవి. ► 7.5 – 19.9 కోట్ల టన్నులు: సముద్రాల్లోకి చేరి కాలుష్యం సృష్టిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల పరిమాణం. ► 450 ఏళ్లు: ప్లాస్టిక్ బాటిళ్లు నశించేందుకు పట్టే సమయం. ► 2800 కోట్లు: ఏటా చెత్తకుప్పల్లోకి చేరుతున్న గాజు బాటిళ్ల సంఖ్య. వీటిల్లో మూడొంతులు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. ► 2021లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల టన్నుల కాగితాన్ని రీసైకిల్ చేశారు. చెత్తకుప్పల్లోకి చేరిన కాగితాల్లో ఇది 68 శాతం మాత్రమే. ఈ ఏడాది తయారైన కార్డ్‌బోర్డులో 91.4 శాతం రీసైకిల్ చేసిన కాగితం. ఒకే ఒక్క శాతం చెత్తకుప్పల్లోకి చేరే చెత్తలో అల్యూమినియం మోతాదు ఇది. అలసిపోయేంతవరకూ రీసైకిల్ చేసుకోగలగడం ఈ లోహపు ప్రత్యేకత కూడా. కానీ.. ఏటా దాదాపు 70 లక్షల టన్నుల అల్యూమినియం రీసైకిల్ కావడం లేదు. వాడి వాడి.. మళ్లీ వాడి... పర్యావరణ పరిరక్షణ తారక మంత్రం ఆర్ ఆర్ ఆర్‌లో రెండోది రీ యూజ్. పేరులో ఉన్న మాదిరిగానే వస్తువులను వీలైనంత ఎక్కువగా వాడటమే ఇది. నిజానికి ఈ విషయం భారతీయులకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. చిరిగిన చీరలిక్కడే బొంతలవుతాయి.. అలాగే వాడేసిన తువ్వాలు తుండుగుడ్డ అయిపోతుంది. ప్లాస్టిక్ డబ్బాలు... పచారీ సామాను నిల్వకు వాడేదీ ఇక్కడే మరి!! మోజు తీరిన దుస్తులు అనా«థ శరణాలయాలకు చేరడమూ మనం చూస్తూంటాం. రీ యూజ్ వల్ల కలిగే అతిపెద్ద లాభం వాడదగ్గ వస్తువులు చెత్తగా కుప్పల్లోకి చేరకుండా నిలువరించడం. ఉన్నవాటినే ఎక్కువ కాలం వాడటం వల్ల కొత్తవి కొనే అవసరం తప్పుతుంది. తద్వారా డబ్బు ఆదాతోపాటు భూమికీ మేలు జరుగుతుంది. టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు సెకెండ్ హ్యాండ్ వస్తువులు కూడా విస్తృతంగా అందుబాటులో ఉంటున్నాయి. అవసరానికి తగ్గట్టు కొత్త ఉత్పత్తులను కాకుండా.. సెకెండ్ హ్యాండ్‌వి కొనగలిగితే వనరులను మిగుల్చుకోగలం. ప్రపంచమంతా.... ఆర్ ఆర్ ఆర్లలో ఇది చాలా పాపులర్. తరచూ అందరికీ వినిపించే రీసైక్లింగ్. వాడేసిన వస్తువుల రూపం, తీరుతెన్నులు మార్చి ఇంకో అవసరానికి వాడుకోవడాన్ని రీసైక్లింగ్ అనవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే వ్యర్థానికి కొత్త అర్థం చెప్పడమన్నమాట. ఈ రీసైక్లింగ్ జాబితాలోకి రాని వస్తువు అంటూ ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్లాస్టిక్, కాగితం, కాంక్రీట్, మానవ, జంతు, పశు, పక్షి వ్యర్థాలు ఇలా దేనైన్నా రీసైకిల్ చేసి వాటి నుంచి ప్రయోజనం పొందవచ్చు. ప్లాస్టిక్ లాంటి పదార్థాలను రీసైకిల్ చేయడం వల్ల గాలి, నేల, నీటి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కొన్ని రకాల ప్లాస్టిక్ పదార్థాలు నశించిపోయేందుకు కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్లాస్టిక్ రీసైక్లింగ్, ప్రత్యామ్నాయాల కోసం విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. రీసైక్లింగ్ విభాగంలోకి ఇటీవలే వచ్చి చేరిన కొత్త రకం వ్యర్థం ఈ–వేస్ట్. యూఎస్బీ డ్రైవ్‌లు మొదలుకొని, ఎయిర్‌పాడ్స్, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్టాప్స్, డెస్క్‌టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తమ జీవితకాలం తరువాత వృథా అయిపోతూండటం వల్ల ప్లాటినమ్ వంటి విలువైన లోహాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇక సేంద్రీయ వ్యర్థాల విషయానికి వస్తే... పొలాల్లోని వ్యవసాయ వ్యర్థాలు మొదలుకొని ఇళ్లలో మిగిలిపోయిన ఆహారం వరకూ చాలావాటిని కుళ్లబెట్టి సహజసిద్ధమైన ఎరువులు లేదా వంటగ్యాస్‌లను తయారు చేసుకోవచ్చు. గ్యారీ ఆండర్సన్ సృష్టి.. ఈ లోగో! ఆర్ ఆర్ ఆర్లు మూడు వేర్వేరు అంశాలు కావచ్చు కానీ.. వీటిని సూచించేందుకు వాడే గుర్తు లేదా సింబల్ మాత్రం ఒక్కటే. మూడు ఆరో గుర్తులతో ఒక వృత్తంలా ఉండే ఈ గుర్తును దాదాపు ప్రతి ప్యాకేజ్‌పైనా చూడవచ్చు. ఆసక్తికరమైన అంశం ఈ లోగోను రూపొందించింది ఎవరన్న విషయం. ఒక ప్రైవేట్ సంస్థ కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా పెట్టిన డిజైన్ పోటీల్లో పాల్గొన్న యూఎస్సీ గ్రాడ్యుయేట్ విద్యార్థి గ్యారీ అండర్సన్ దీన్ని డిజైన్ చేశారు. అప్పట్లో సీసీఏ రీసైక్లింగ్ పనిలోనూ ఉండటం వల్ల దాన్ని సూచించేందుకు లోగోను రూపొందించాలని పోటీ పెట్టారు. పోటీలో నెగ్గిన తరువాత ఆ లోగోతోపాటు గ్యారీ కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. ఎందరో మహానుభావులు... ఎనెన్నో ప్రయత్నాలు! భూతాపోన్నతి, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, వ్యక్తులు, సంస్థల స్థాయిల్లో పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విషతుల్యమైన కాలుష్యాలను వాతావరణం నుంచి తొలగించేందుకు, వాడకాన్ని తగ్గించేందుకు కొత్త టెక్నాలజీలూ అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో మచ్చుకు కొన్నింటి గురించి స్థూలంగా చూస్తే... ఓషన్ క్లీనప్ ప్రాజెక్టు... చెత్తకుప్పల్లోంచి నదుల్లోకి.. అటు నుంచి సముద్రాల్లోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి కొత్త రూపంలో ఆ వ్యర్థాలను వాడుకునేందుకు బోయన్ స్లాట్ అనే యువ ఔత్సాహిక శాస్త్రవేత్త చేపట్టిన ప్రాజెక్టు ఇది. సముద్రాల్లోని ప్లాస్టిక్‌లో అధికభాగం జల ప్రవాహాల ఫలితంగా పసిఫిక్ మహా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున పోగుపడ్డాయి. ‘ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్’ అని పిలిచే ఈ చెత్తకుప్ప సైజు ఎంత ఉందో తెలుసా? ఫ్రాన్స్ దేశ వైశాల్యానికి మూడు రెట్లు... లేదా టెక్సస్ వైశాల్యానికి రెండు రెట్లు ఎక్కువ. అంకెల్లో చెప్పాలంటే కొంచెం అటు ఇటుగా 16 లక్షల చదరపు కిలోమీటర్లు! 2017 నాటి లెక్కల ప్రకారమే ఇక్కడ పోగుపడ్డ ప్లాస్టిక్ బరువు సుమారు 29.7 కోట్ల టన్నులని అంచనా. ఈ నేపథ్యంలో సముద్ర జీవులకు పెను ప్రమాదంగా పరిణమించిన ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్‌ను తొలగించేందుకు 2013లో బోయన్ స్లాట్ అనే నెదర్లాండ్ కుర్రాడు ఓ వినూత్న ప్రయత్నం మొదలుపెట్టాడు. సముద్రపు అలల సాయంతోనే చెత్తను పోగుచేసి బయటకు తరలించేందుకు అవసరమైన టెక్నాలజీలను సిద్ధం చేశాడు. బోయన్స్లాట్ స్థాపించిన ఓషన్ క్లీనప్ సంస్థ ఐదేళ్ల కాలంలో ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్‌లో సగాన్నైనా ఖాళీ చేయాలని సంకల్పిస్తోంది. గత 30 రోజుల్లో ఓషన్ క్లీనప్ సంస్థ ఎనిమిది ఇంటర్సెప్టర్ల సాయంతో 1,11,804 కిలోల ప్లాస్టిక్ చెత్తను తొలగించింది. ఇప్పటివరకూ తొలగించిన చెత్త 20,68,237 కిలోలు. సముద్రాల్లో మాత్రమే కాకుండా... నదుల్లోకి చేరుతున్న ప్లాస్టిక్‌ను కూడా అక్కడికక్కడే ఒడిసిపట్టేందుకు బోయన్ స్లాట్ ప్రయత్నిస్తున్నాడు. డైరెక్ట్ కార్బన్ క్యాప్చర్... భూతాపోన్నతికి ప్రధాన కారణం? గాల్లో కార్బన్‌డైయాక్సైడ్ వంటి విష వాయువుల మోతాదు ఎక్కువ కావడం. అందుకేనేమో కొందరు ఈ సమస్యను నేరుగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే... గాల్లోని కార్బన్ డైయాక్సైడ్‌ను నేరుగా తొలగించేందుకు డైరెక్ట్ కార్బన్ క్యాప్చర్ పేరుతో పలు ప్రాజెక్టులు చేపట్టారు. పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టి గాలిని పోగు చేయడం.. అందులోని కార్బన్ డైయాక్సైడ్‌ను రసాయనాల సాయంతో తొలగించి వేరు చేయడం స్వచ్ఛమైన గాలిని మళ్లీ వాతావరణంలోకి వదిలేయడం ఈ ప్రాజెక్టుల పరమోద్దేశం. వేరు చేసిన కార్బన్ డైయాక్సైడ్‌ను భూమి అట్టడుగు పొరల్లో భద్రపరచడం లేదా కొన్ని ఇతర టెక్నాలజీ సాయంతో విలువైన ఇంధనం, ఇతర పదార్థాలుగా మార్చి వాడుకోవడం చెప్పుకోవాల్సిన అంశం. చిన్నా చితక కంపెనీలను వదిలేస్తే డైరెక్ట్ క్యాప్చర్ టెక్నాలజీలో చెప్పుకోవాల్సిన కంపెనీలు క్లైమ్‌వర్క్స్ ఒకటి. దీంతోపాటు కార్బన్ ఇంజినీరింగ్, గ్లోబల్ థెర్మోస్టాట్లు అనే రెండు కంపెనీలు కలిపి మొత్తం 18 చోట్ల ఫ్యాక్టరీలను స్థాపించి గాల్లోని కార్బన్ డైయాక్సైడ్‌ను వేరు చేస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో ఏడాది ఒక టన్ను నుంచి నాలుగు వేల టన్నుల సామర్థ్యమున్నవి ఉన్నాయి. అత్యధిక సామర్థ్యమున్న కంపెనీ ఏడాదికి ఎనిమిది వేల టన్నుల కార్బన్ డైయాక్సైడ్‌ను వాతావరణం నుంచి తొలగిస్తోంది. అమెరికాలో ఇప్పుడు ఏడాదికి పది లక్షల టన్నుల సామర్థ్యమున్న ఫ్యాక్టరీ ఒకటి వచ్చే ఏడాదికల్లా ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా... మరికొన్ని సంస్థలు కూడా గాల్లోని కార్బన్ డైయారక్సైడ్ను సమర్థంగా పునర్వినియోగించుకునేందుకు కొన్ని టెక్నాలజీలను సిద్ధం చేశాయి. వీటిల్లో రెండు మన దేశంలోనే ఉండటం విశేషం. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న చక్ర ఇన్నొవేషన్స్ సంస్థ డీజిల్ జనరేటర్లు, బస్సుల పొగ గొట్టాల నుంచి వెలువడే కాలుష్యం నుంచి కర్బనాన్ని వేరు చేసి ప్రింటింగ్ ఇంక్గా మారుస్తూంటే... పుణె కేంద్రంగా పనిచేస్తున్న ఇంకో కంపెనీ కార్బన్ క్రాఫ్టస్ డిజైన్ వాటితో భవన నిర్మాణాల్లో వాడే టైల్స్గా మారుస్తోంది. రీసైకిల్‌కు బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. కానీ.. రీయూజ్, రెడ్యూస్లకు సంబంధించినవి తక్కువే. అలాగని ప్రయత్నాలు జరగడం లేదని కాదు. ముంబైలో ఓ యువకుడు చెత్తకుప్పల్లోకి చేరిన తెల్లటి క్యారీబ్యాగులను సేకరించి వాటితో సరికొత్త కాలిజోళ్లు సిద్ధం చేస్తూండటం రీయూజ్‌కు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే.. టెట్రాప్యాకులను చిన్న చిన్న ముక్కలు చేసి వాటితో కుర్చీలు, బల్లలు తయారు చేసి ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తోంది ముంబైలోని ఓ స్వచ్ఛంద సంస్థ. ఇలా ప్రతి దేశంలో, ప్రతి సమాజంలోనూ వ్యక్తులు, సంస్థలు కూడా ఉడతాభక్తి చందంగా ఈ భూమిని రక్షించుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి!! -గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
అద్భుత సృష్టి.. ప్లాస్టిక్ స్పూన్లతో దుర్గామాత విగ్రహం
డిస్పూర్: ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు అస్సాంలోని దుబ్రీ జిల్లాకు చెందిన సంజీవ్ బాసక్ అనే వ్యక్తి దుర్గా నవరాత్రులను వేదికగా చేసుకున్నాడు. పరిశ్రమలు, మెడికల్ వ్యర్థాలను ఉపయోగించి వివిధ కళాకృతులతో అవగాహన కల్పిస్తున్నాడు. వ్యర్థాలను తగ్గించాలని చెప్పేందుకు వివిధ ఆకృతులతో దుర్గా మాత విగ్రహాలను తయారు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు బాసక్. 2015 తొలుత థర్మకోల్‌తో 14 అడుగుల దుర్గమాత విగ్రహాన్ని రూపొందించారు బాసక్. అప్పటి నుంచి ప్రతిఏటా ఇలా వివిధ వ్యర్థ పదార్థాలతో విగ్రహాలు రూపొందిస్తూ అవగాహన కల్పిస్తున్నాడు. అందులో భాగంగానే ఈఏడాది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్పూన్లతో దుర్గమాత విగ్రహాన్ని తయారు చేశాడు బాసక్. ప్రస్తుతం ఈ దుర్గామాత విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్పూన్లతో అస్సాంలో రూపొందించిన దుర్గామాత విగ్రహం ఇదీ చదవండి: టైమ్ బ్యాడ్ అంటే ఇదేనేమో.. సీఎం గెహ్లాట్‌కు ఊహించని షాక్! -
1,000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలతో మహాత్ముడి విగ్రహం
లక్నో: జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్రంతో పాటు స్వచ్ఛభారత్ మిషన్‌పైనా ప్రజల్లో అవగాహన కల్పించారు. స్వచ్ఛాభారత్ మిషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహాత్ముడి విగ్రహంతోనే అవగాహన కల్పిస్తంది ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా నగరపాలక సంస్థ. క్విట్ ఇండియా ఉద్యమం 80వ వార్షికోత్సవం సందర్భంగా 20 అడుగుల మార్చింగ్ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి రూపొందించారు. హెచ్‌సీఎల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో నోయిడా అడ్మినిస్ట్రేషన్ సుమారు 1,000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి విగ్రహం తయారు చేసింది. ఈ విగ్రహాన్ని సెక్టార్ 137లో ఏర్పాటు చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు గుర్తు చేసేలా మహాత్ముడి విగ్రహాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్‌పై జులై 1వ తేదీ నుంచి నిషేధం విధించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు కృషి చేస్తూనే ఉన్నారు. మరోవైపు.. రాజస్థాన్‌లో ఖాళీ పాల ప్యాకెట్లు తీసుకొస్తే లీటర్ పెట్రోల్‌పై డిస్కౌంట్ ఇస్తున్నారు ఓ పెట్రోల్ పంపు యజమాని. ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలను ఇష్టారీతిలో ఎక్కడపడితే అక్కడ పడేయకుండా అవగాహన కల్పించేందుకే ఇలా చేస్తున్నట్లు చెప్పారు అశోక్ కుమార్ ముంద్ర. Unveiled 20ft tall statue of #MarchingBapu installed by HCL Foundation at Sec-137 Noida. The Structure has been made using 1000 kg of Plastic Waste as a tribute to Mahatma Gandhi's #SwachhBharat Mission. @PankajSinghBJP @tejpalnagarMLA @noida_authority @CeoNoida @Manojguptabjp pic.twitter.com/LaTvpK4aQ8 — Dr. Mahesh Sharma (@dr_maheshsharma) August 8, 2022 ఇదీ చదవండి: Viral: 16 ఏళ్ల బాలుడి ముక్కు కొరికేసిన రాజకీయ నేత.. అంత కోపం దేనికో? -
వామ్మో కోవిడ్ వ్యర్థాలు
కోవిడ్–19.. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి. దాని నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా జనం మాస్కులు, చేతికి ప్లాస్టిక్ తొడుగులు, పీపీఈ కిట్లు, కరోనా టెస్టింగ్ కిట్లు, ప్లాస్టిక్ శానిటైజర్ సీసాలు విపరీతంగా ఉపయోగించారు. వీటిలో చాలావరకు ఒకసారి వాడి పారేసేవే. ఇవన్నీ చివరికి ఏమయ్యాయో తెలుసా? వ్యర్థాలుగా మారి సముద్రాల్లో కలిసిపోయాయి. ఎంతగా అంటే ఏకంగా 25,000 టన్నులకుపైగా పీపీఈ కిట్లు, ఇతర కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలు, నదులు, చెరువుల్లోకి చేరుకున్నాయి. ఇంకా చేరుతూనే ఉన్నాయి. ఇవి జల వనరుల్లోని జీవజాలం పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. జీవ జాతులకు ప్రత్యక్ష ముప్పు 2019 డిసెంబర్లో కరోనా మహమ్మారి జాడ తొలుత చైనాలో బయటపడింది మొదలు 2021 ఆగస్టు వరకే 193 దేశాల్లో ఏకంగా 84 లక్షల టన్నుల కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడినట్లు అంచనా. వీటిలో ఏకంగా 70 శాతం జల వనరుల్లోకి చేరుకున్నాయని చెబుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేయడానికి సరైన సదుపాయాలు లేకపోవడమే ప్రధాన సమస్య అంటున్నారు. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ప్రపంచమంతటా నెలకు ఏకంగా 129 బిలియన్ల మాస్కులు, 65 బిలియన్ల గ్లౌజ్‌లు వాడేసినట్టు అంచనా. వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో ఇవి వ్యర్థాలుగా మారిపోయాయి. మాస్కు.. ప్లాస్టిక్ బాంబు ఒకసారి వాడి పారేసే ఫేస్ మాస్కులను ప్లాస్టిక్ బాంబుగా పరిశోధకులు అభివర్ణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మాస్క్‌లు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కిట్ల ముప్పు ఇప్పటికిప్పుడు ప్రత్యక్షంగా అనుభవంలోకి రాకున్నా రానున్న దశాబ్దాల్లో మాత్రం వాటి ప్రభావం దారుణంగా ఉంటుందని చెప్పారు. భూమిపై, సముద్రంలో ఉంటే జీవజాలానికి ప్రమాదం తప్పదని, వ్యర్థాల నిర్వహణపై ప్రపంచదేశాలు ఇప్పటికైనా దృష్టి పెట్టాలని సూచించారు. వేస్ట్ మేనేజ్మెంట్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలని, సామర్థ్యం పెంచుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారులు దాడి చేస్తే పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఇప్పటి నుంచి సన్నద్ధం కావాలని ప్రభుత్వాలకు హితవు పలికారు. వాడి పారేసిన పీపీఈ కిట్లు, మాస్క్‌ల కుప్పల్లో పక్షులు చిక్కుకుపోయి విలవిల్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాల్లో అత్యధికంగా ఆసుపత్రుల నుంచి వెలువడినవే కావడం గమనార్హం. ఇవీ ప్రత్యామ్నాయాలు... ► చేతులు శుభ్రం చేసుకోవడానికి ప్లాస్టిక్ సీసాల్లో వచ్చే శానిటైజర్ కంటే వేడినీరు, సబ్బు వాడుకోవడం ఉత్తమం. సబ్బులు ఇప్పుడు భూమిలో సులభంగా కలిసిపోయే ప్యాకేజింగ్‌లో వస్తున్నాయి. ప్లాస్టిక్ సీసాల్లోని హ్యాండ్ శానిటైజర్లు కాకుండా సబ్బులు వాడుకుంటే పర్యావరణానికి ఎంతోకొంత మేలు చేసినట్టే. ► సింగిల్ యూజ్ ఫేస్‌మాస్క్‌లు వాడితే ప్రతి ఏటా కోట్లాది టన్నుల వ్యర్థాలు పేరుకుపోతాయి. వీటికంటే పునర్వినియోగ మాస్క్‌లు మంచివి. అంటే శుభ్రం చేసుకొని పలుమార్లు వాడుకునేవి. వీటిని వాషబుల్ మాస్క్‌లు అని పిలుస్తున్నారు. వీటిని పర్యావరణహిత మెటీరియల్‌తో తయారు చేస్తున్నారు. ► ప్లాస్టిక్ ముప్పు తెలిసినవారూ కరోనా సమయంలో వైరస్ భయంతో ప్లాస్టిక్ బ్యాగ్‌లు వాడారు. కానీ కాగితపు సంచులు, బట్ట సంచులు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. ► హోటళ్లలో వాడే ప్లాస్టిక్ పొర ఉన్న కాగితపు కప్పులు లక్షల టన్నుల వ్యర్థాలుగా మారుతున్నాయి. గాజు, పింగాణి గ్లాసులను వేడి నీరు, సబ్బుతో శుభ్రం చేసి వాటిని మళ్లీ ఉపయోగించుకోవడం దీనికి మంచి ప్రత్యామ్నాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుడమికి ప్రాణాంతకంగా ప్లాస్టిక్
సాక్షి, అమరావతి: నేలను, నీటిని, గాలిని కలుషితం చేస్తూ అత్యంత ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ ప్రపంచాన్ని వదలనంటోంది. మన దేశంలో ఒక వ్యక్తి ఏడాదికి సగటున నాలుగు కిలోల ప్లాస్టిక్‌ను వాడి పారేస్తున్నాడు. ఈ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి 1000 సంవత్సరాలు పడుతుందని అంచనా. ప్లాస్టిక్ బాటిళ్లకు 450 ఏళ్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులు కుళ్లిపోవడానికి 30 ఏళ్లకు పైగా పడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కానీ అది మట్టిలో కలిసే లోపు అపార నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా వాడి పారేసే ప్లాస్టిక్ ఇంటింటా, వీధుల్లో, రోడ్లపైన, చెత్తకుప్పల్లో, కాలువల్లో, చెరువుల్లో, నదుల్లో, చివరికి సముద్ర తీరాల్లో కూడా పేరుకుపోతోంది. సమస్త జీవరాశికి ప్రాణాంతకంగా పరిణమించింది. ప్లాస్టిక్ వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ, అమలు, ఆచరణలో వైఫల్యం వల్ల రోజురోజుకు దీని బెడద పెరిగిపోతోంది. గతేడాది దేశంలో 35 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడినట్టు కేంద్ర ప్రభుత్వం లెక్క తేల్చింది. గత ఐదేళ్లలో వీటి ఉత్పత్తి రెట్టింపయిందని, సగటు వార్షిక పెరుగుదల 21.8 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. 2015–16లో 15.89 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తయితే, 2018–19లో 30.59 లక్షల టన్నులు, 2019–20లో 35 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి అయ్యాయని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి ఇటీవల పార్లమెంట్లో చెప్పారు. ప్రపంచంలో ఉత్తమ నియంత్రణ దేశాలు ప్రపంచంలో ప్లాస్టిక్ బ్యాగులు, సీసాలు, కట్లర్స్, స్ట్రాలు, కాఫీ స్టిరర్స్ వంటి వాటిని నిషేధించిన మొట్టమొదటి దేశం కోస్టారికా. ఇది యూఎన్వో అందించే అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ను 2019లో అందుకుంది. ఈ దేశంలో 2021 నుంచి 80 శాతం ప్రకృతికి హాని చేయనివి, పునర్ వినియోగించదగ్గ వస్తువులను మాత్రమే వినియోగిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ► జమైకా 2019 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దిగుమతిని నిషేధించింది. ఈ దేశంలో పర్యావరణ అనుకూలం వస్తువులనే తయారు చేస్తున్నారు. ► ఆఫ్రికాలోని దాదాపు 34 దేశాలు ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించాయి. రువాండా పదేళ్ల క్రితమే ప్లాస్టిక్ సంచులను నిషేధించింది. ► ఇండోనేసియా 2018 నుంచి ప్లాస్టిక్ బ్యాగ్‌లు, స్ట్రాలను నిషేధించింది. 2025 నాటికి ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం 70 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ► న్యూజిలాండ్ దేశం 2019లోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులను పూర్తిగా నిషేధించింది. లోరల్, కోకొకోలా, నెస్లే వంటి 12 అంతర్జాతీయ కంపెనీలు 2025 నాటికి 100 శాతం కంపోస్ట్ చేయదగిన ప్యాకేజింగ్‌ను అమలు చేస్తామని ఆ ప్రభుత్వానికి హామీనిచ్చాయి. ► జర్మనీ 56.1 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 53.8 శాతం, దక్షిణ కొరియా 53.7 శాతం, వేల్స్ 52.2 శాతం, స్విట్జర్లాండ్ 49.7 శాతం రీసైక్లింగ్ చేస్తున్నాయి. ఢిల్లీదే అగ్రస్థానం ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ఢిల్లీ మహానగరం మొదటి స్థానంలోఉంది. ఇక్కడ ఏటా 2,51,850 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 1,56,767 టన్నులతో కోల్‌కతా రెండో స్థానంలో ఉంది. చెన్నై 1,56,731 టన్నులతో తర్వాతి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 2020–21 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాలు 70 వేల టన్నులుగా గుర్తించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద 124 ప్లాస్టిక్ తయారీ యూనిట్లు, ఆరు రీసైక్లింగ్ పరిశ్రమలు నమోదు చేసుకున్నాయి. కానీ అనధి కారిక తయారీ సంస్థలు 400 వరకు ఉంటాయని అంచనా. పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతు న్న సరుకుపై లెక్కలు లేవు. అనధికారిక ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలు బీహార్‌లో అత్యధికంగా 43 శాతం, తమిళనాడులో 26 శాతం, మహరాష్ట్రలో 13 శాతం ఉన్నాయి. ఇవి విచ్చలవిడిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. 12 శాతమే రీసైక్లింగ్ ప్లాస్టిక్ వ్యర్థాలలో 12 శాతం మాత్రమే రీసైక్లింగ్ చేస్తున్నారని, 20 శాతం బహిరంగ ప్రదేశాల్లో తగులబెడుతున్నట్టు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) నివేదిక తెలిపింది. మిగిలిన 68 శాతం భూమిలో, నీటిలో కలుస్తున్నట్టు తేల్చింది. చట్ట ప్రకారం ప్లాస్టిక్ తయారీ సంస్థలు అవి ఉత్పత్తి చేస్తున్న వాటిలో 70 శాతం వ్యర్థాలను రీసైక్లింగ్ చేయాలి. కానీ ఈ నిబంధన సరిగా అమలు కావడంలేదు. దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నప్పటికీ, దాని వాడకంపై నియంత్రణ లేదు. దీంతో జూలై 1వ తేదీ నుంచి 75 మైక్రాన్లు, ఆపై మందం గల ప్లాసిక్ సంచులు, బయో డిగ్రేడబుల్ కవర్లను మాత్రమే ఉత్పత్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్లు, ఆపై మందం గలవాటినే ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్‌తో కొన్ని నష్టాలివీ.. ► భూసారం పెరగకుండా అడ్డుపడుతుంది ► క్లోరినేటెడ్ ప్లాస్టిక్‌తో మట్టిలో విష రసాయనాలు చేరుతున్నాయి. అ వి భూగర్భ జలాల్లో కలిసి మానవాళి, ప్రాణికోటికి హానిచేస్తున్నాయి. ► ఏటా పక్షులు, చేపలు, జంతువులు ప్లాస్టిక్ వల్ల చనిపోతున్నాయి. అంతరించిపోతున్న ప్రాణుల్లో దాదాపు 700 జాతులు ప్లాస్టిక్ వల్ల ప్రభావితమైనట్లు గుర్తించారు. ► మనం తినే జలచరాల్లో మైక్రో ప్లాస్టిక్, నానో ఫైబర్ వ్యర్థాలను కూడా కనుగొన్నారు. ► బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను మండించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తి అవుతోంది. ఇది 60 లక్షల మంది మరణాలకు కారణమ వుతున్నట్టు అంచనా. బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం వల్ల శ్వాసకోశ రుగ్మతలు వస్తున్నాయి. ప్లాస్టిక్ పాలిమర్ అవశేషాలతో క్యాన్సర్, ఎండోక్రైన్ గ్రంధి దెబ్బతినడం, చర్మవ్యాధులు సోకుతున్నాయి. ► ప్లాస్టిక్‌లో బిస్ఫినాల్–ఏ, థాలేట్స్, డయాక్సిన్స్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ (పీఏహెచ్), పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్ (పీసీబీస్), స్టైరిన్ మోనోమర్, నానిల్ఫెనాల్ వంటి విష పదార్థాలు ఉంటాయి. ఇవి మానవుల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తిని నిరోధిస్తాయి. పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. దేశానికి సిక్కిం ఆదర్శం ప్లాస్టిక్ నిషేధంలో సిక్కిం రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. దేశంలోనే మొదటిసారిగా సిక్కిం రాష్ట్రం 1998లోనే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను నిషేధించింది. ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించిన మొదటి రాష్ట్రం కూడా ఇదే. 2016లో ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాలలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వాడకాన్ని నిషేధించింది. దీంతో ఈ రాష్ట్రంలో ప్యాస్టిక్ వ్యర్థాలు 5.99 టన్నులకు తగ్గిపోయింది. దీని తర్వాత మిజోరాం(13.30 టన్నులు), త్రిపుర 26.2 టన్నులు), మేఘాలయ (1,263 టన్నులు) ఉన్నాయి. -
ఈ 'రోబో చేప'తో సముద్రాలు క్లీన్.. ప్లాస్టిక్‌ను తినేస్తుందటా!
బీజింగ్: సముద్రాల్లో మాటువేసిన ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ దేశాలకు ఇప్పుడొక పెద్ద సమస్యగా మారిపోయింది. భూమిపై అన్ని సముద్రాల్లో 19.90 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు నిపుణుల అంచనా. వీటిని తొలగించి, మహాసాగరాలను పరిశుభ్రంగా మార్చడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. సముద్రాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు చైనా శాస్త్రవేత్తలు. మెక్రోప్లాస్టిక్‌ను తినే రోబో చేపను తయారు చేశారు. ప్రపంచంలోని కలుషితమైన సముద్రాలను శుభ్రపరిచేందుకు ఏదో ఒకరోజు తమ రోబో ఉపయోగపడుతుందని నైరుతి చైనాలోని సిచువాన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. స్పర్శకు మృదువుగా, కేవలం 1.3 సెంటీమీటర్లు (0.5 అంగుళాలు) పరిమాణంలోని ఈ రోబోలు ఇప్పటికే తక్కువ లోతైన నీటిలోని మైక్రోప్లాస్టిక్‌లను పీల్చుకుంటున్నట్లు తేలింది. అయితే.. అత్యంత లోతైన నీటిలోని మెక్రోప్లాస్టిక్‌ను సేకరించటమే లక్ష్యంగా పరిశోధకుల బృందం కృషి చేస్తోంది. అంతే కాదు ఈ రోబోల ద్వారా ఎప్పటికప్పుడు సముద్రాల కాలుష్యంపై వివరాలు తెలుసుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు వాంగ్ యుయాన్ అనే శాస్త్రవేత్త. 'మేము అత్యంత తేలికపాటి సూక్ష్మీకరించిన రోబోట్‌ను తయారు చేశాం. దీనిని చాలా విధాలుగా ఉపయోగించవచ్చు. బయోమెడికల్, ప్రమాదక పనుల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. అయితే.. మేము ప్రధానంగా మెక్రోప్లాస్టిక్‌ను సేకరించటంపైనే దృష్టి సారించాం. ఇది ఒక నమూనా రోబో మాత్రమే. దీనిని పలుమార్లు ఉపయోగించవచ్చు. ' అని తెలిపారు. ఈ బ్లాక్ రోబోట్ చేప కాంతి ద్వారా వికిరణం చెంది.. దాని రెక్కలను తిప్పడం, శరీరాన్ని కదిలిస్తుంది. ఇతర చేపలతో ఢీకొట్టకుండా కాంతి ద్వారా ఆ రోబో చేపను శాస్త్రవేత్తలు నియంత్రించవచ్చు. ఒకవేళ ఏదైనా చేప దానిని మింగేస్తే సులభంగా జీర్ణమయ్యేలా పోలియురెథేన్తో తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. కాలుష్యకారకాలను ఈ చేపలు ఆకర్షిస్తాయి. అలాగే.. ఏదైన ప్రమాదం జరిగినప్పుడు వాటిని అవి పునరుద్ధరించుకుంటాయి. సాధారణ రోబోల కన్నా ఇవి 2.76 రెట్లు వేగంగా ఈదుతాయి కూడా. ఇదీ చూడండి: భూగోళమంతటా ప్లాస్టిక్ భూతం.. సవాళ్లు ఎన్నున్నా.. స్వచ్ఛ సాగరం -
పర్యావరణహితం.. ప్లాస్టిక్ రహితం
వెనకటికి ఒక నక్క భూమి దగ్గర అప్పు చేసిందట. తీసుకున్న అప్పును తీర్చలేకపోయింది. ఇక అప్పటి నుంచి భూమి నుంచి తప్పించుకోవడానికి ఎక్కడెక్కడికో వెళుతుంది. ఎక్కడికి వెళ్లి ఏంలాభం? ఎక్కడ దాక్కున్నా... భూమే కనిపిస్తుంది! పర్యావరణం పట్ల బాధ్యతారాహిత్యం కూడా అలాంటిదే. ఎంత తప్పించుకోవాలని చూసినా, ఎన్ని సాకులు వెదుక్కున్నా... భూమి కనిపిస్తుంది. బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తుంది. కొందరు మాత్రం భూమాతతో శభాష్ అనిపించుకుంటారు. ఆ కోవకు చెందిన మహిళ అహుజ... ఒకసారి వాడి పారేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లోకి వచ్చింది. పర్యావరణప్రేమికులలో హర్షం వ్యక్తం అయింది. ఎంతోమంది, ఎన్నో విధాలుగా వ్యక్తిగత స్థాయిలో పర్యావరణహిత ఉద్యమాలకు, జీవనశైలులకు ఊపిరిపోయడం వల్లే ఇలాంటి నిషేధం ఒకటి సాధ్యం అయింది. ఇలాంటి వారిలో ముంబైకి చెందిన చైట్సీ అహుజ ఒకరు. మార్కెటర్, ఎర్త్ అడ్వోకెట్ అయిన అహుజ గత అయిదు సంవత్సరాలుగా ప్లాస్టిక్–రహిత జీవనశైలిని అనుసరిస్తుంది. తాను అనుసరించడమే కాదు మిగిలిన వారిని కూడా తన మార్గంలో తీసుకువెళుతుంది. ‘బ్రౌన్ లివింగ్’ స్థాపకురాలైన అహుజ దేశంలో తొలిసారిగా ప్లాస్టిక్–ఫ్రీ మార్కెట్‌కు శ్రీకారం చుట్టింది. బ్రౌన్ లివింగ్‌లో అన్ని ఆర్డర్ల ప్యాక్‌లు ప్లాస్టిక్ మెటీరియల్‌కు దూరంగా ఉంటాయి. ‘బ్రౌన్ లివింగ్ అనేది బ్రాండ్స్, కంపెనీలకు సంబంధించిన సేంద్రీయ, పర్యావరణహిత ఉత్పత్తులను విక్రయించే వేదిక మాత్రమే కాదు, మన జీవనశైలిలో బలమైన మార్పు తీసుకువచ్చే నిర్మాణాత్మక విధానం కూడా’ అనే పరిచయ వాక్యాలు ఆకట్టుకుంటాయి. ‘బ్రౌన్ లివింగ్’ కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని చెట్లు నాటడానికి సంబంధించిన కార్యక్రమాలకు వెచ్చిస్తారు. ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపై అహుజ ఇలా స్పందించారు... ‘ప్లాస్టిక్–రహిత ప్రపంచం అనేది రాత్రికి రాత్రి జరిగే అద్భుతం కాదు. ఒక ప్రయాణం మొదలైంది. కొంతమందిగా మొదలైన ప్రయాణం, ఎంతోమందిని కలుపుకుంటూ వెళుతుంది.ఈ ప్రయాణమే ఉద్యమం అవుతుంది. మన జీవనశైలిని పూర్తిగా మార్చివేస్తుంది’ అంటున్న అహుజ ‘ప్లాస్టిక్–రహిత జీవన విధానాన్ని అనుసరించడం ఖరీదైన వ్యవహరం’లాంటి అపోహలను ఖండిస్తుంది. ప్లాస్టిక్ బదులుగా ప్రత్యామ్నాయాలకు రూపకల్పన చేసిన కంపెనీలకు ప్రభుత్వం అవసరమై ఆర్థిక సహాయం అందించాలని, సబ్సిడీలు ఇవ్వాలని ఆమె కోరుకుంటుంది. ‘ప్లాస్టిక్–రహిత దారి వైపు అడుగులు వేయడానికి ఇప్పుడు ఎన్నో ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉన్నాయి’ అంటున్న అహుజ ప్లాస్టిక్ వాడని కిరాణషాపులకు అండగా ఉండాలని చెబుతుంది. తన ప్రయాణంలో ‘మార్పు అసాధ్యమేమో’ అని కొన్ని సందర్భాలలో అనిపించేది. అంతలోనే ‘మార్పు అనివార్యం కూడా’ అనిపించి తనను పట్టుదలగా ముందుకు నడిపించేది. పరిమితమైన వనరులతోనే మన పూర్వీకులు రకరకాల మార్గాలలో పర్యావరణహితమైన కార్యక్రమాలకు రూపలకల్పన చేశారు. ఒకసారి వెనక్కి వెళ్లి అలాంటి కార్యక్రమాలు మళ్లీ ఉనికిలో ఉండేలా చూడాలంటుంది అహుజ. ‘బ్రౌన్ లెన్స్ మెథడ్ (ప్రతి ఉత్పత్తిని, పనిని పర్యావరణ దృష్టి కోణం నుంచి చూడడం) అనుసరిద్దాం’ అని పిలుపునిస్తున్న అహుజాకు మర్రిచెట్టు అంటే ఇష్టం.ఆదర్శం.‘బలంగా వేళ్లూనుకుపోయిన మర్రిచెట్టును చూస్తే మహాయోధుడిని చూసినట్లుగా ఉంటుంది. ఎంతో స్ఫూర్తి ఇస్తుంది’ అంటుంది. -
ఆశయం మంచిదే కానీ...
ప్రమాదం పొంచి ఉందని అర్థమైనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ప్రపంచాన్ని, అందులోనూ మన దేశాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ దుర్వినియోగంపై కొరడా జుళిపించడం అర్థం చేసుకోదగినదే. ఈ జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ‘తక్కువ ఉపయోగం, ఎక్కువగా వ్యర్థాలు పేరుకొనే’ కొన్ని రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, అమ్మకం, వినియోగాలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. అలాగే, ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తిదారులు, ఎగుమతి దారులు, బ్రాండ్ ఓనర్లు తప్పనిసరిగా నిర్ణీతస్థాయిలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయాలని షరతు పెట్టింది. గత ఫిబ్రవరిలోనే రీసైక్లింగ్ నిబంధనలు ప్రకటించిన సర్కారు ఇప్పుడు నిషేధపుటుత్తర్వులు అమలులోకి తెచ్చింది. ప్లాస్టిక్‌కు చౌక ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేవంటూ వ్యతిరేకులు వాదిస్తున్న వేళ ప్రభుత్వం తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు బోలెడన్ని కసరత్తులు చేయక తప్పదు. ప్రభుత్వ ఉత్తర్వులతో ఇకపై ప్లాస్టిక్ ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు, స్ట్రాలు, స్వీట్ బాక్సులు, ఐస్‌క్రీమ్ పుల్లలు, సిగరెట్ ప్యాక్‌లు, పీవీసీ బ్యానర్లు, కొన్ని ప్లాస్టిక్ ప్యాకేజింగ్ సామగ్రి – ఇలా 19 రకాల ఉత్పత్తులు నిషిద్ధం. ప్రస్తుతం 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచీలపైనే నిషేధం పెట్టారు. డిసెంబర్ కల్లా 120 మైక్రాన్ల కన్నా తక్కువున్న అన్నిటినీ నిషేధించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతానికైతే, ప్యాకింగ్ కోసం ప్లాస్టిక్ వినియోగించవచ్చంటూ త్వరితగతిన అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) రంగాన్ని కొన్ని నిబంధనలతో ప్రభుత్వం అనుమతించింది. ప్లాస్టిక్ నిషేధ నిర్ణయాన్ని ఉల్లఘించినవారికి పర్యావరణ పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 15 కింద, దాని ఆధారంగా వివిధ నగరపాలక సంస్థలు చేసుకున్న చట్టాల కింద శిక్ష తప్పదని సర్కారు హెచ్చరిక. ప్రభుత్వ కఠిన నిర్ణయం వెనుక పెద్ద కథే ఉంది. మన దేశంలో వార్షిక తలసరి ప్లాస్టిక్ వ్యర్థాల సృష్టి దాదాపు 4 కిలోలు. ప్రపంచంలోని మిగిలిన అనేక దేశాలతో పోలిస్తే, ఇది కొంత తక్కువగా అనిపించవచ్చు. కానీ, మొత్తంగా చూస్తే మాత్రం ప్రపంచంలో చైనా, అమెరికాల తర్వాత అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నది మన దేశమే. కచ్చితమైన లెక్కలు లేవు కానీ, 2015లో 95 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలకు కారణమయ్యామని సర్కారు మాట. ఇక, 2019–20 లెక్కల ప్రకారం ప్లాస్టిక్ వ్యర్థాల్లో 12 శాతాన్నే మన దేశం రీసైకిల్ చేస్తోంది. మరో 20 శాతాన్ని కాల్చేస్తోంది. మిగతా 68 శాతం చెత్త రూపంలో, భూమిలో కలిసీ కలవక హాని కలిగిస్తున్నాయి. అలాగే, మన దేశంలో సగటున ప్రతి వ్యక్తీ ఏటా 9.5 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలవడానికి కారణమవుతున్నాడు. ఇది ఆందోళనకరం. ఇకనైనా మేల్కొనకుంటే– కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ, మనం నివసిస్తున్న పుడమి విధ్వంసానికి మనమే కారణమవుతాం. నిజానికి, 2022 కల్లా దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వాడకుండా చేస్తామంటూ 2018లోనే ప్రపంచ పర్యావరణ దినాన మన దేశం ప్రకటించింది. దానికి తగ్గట్టే ఇప్పుడీ నిషేధపు చర్య. ఈ నిర్ణయం వెనుక ఉన్న సదుద్దేశాన్ని స్వాగతిస్తూనే, అమలులో ఉన్న సాధకబాధకాలనూ గ్రహించాల్సి ఉంది. ఆ మాటకొస్తే, గత అయిదేళ్ళలో దేశంలో కనీసం 20కి పైగా రాష్ట్రాలు తమ తమ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగంపై ఏదో ఒక నియంత్రణ పెడుతూనే వచ్చాయి. ఆశయం మంచిదే అయినా, ఆశించినంతగా ఆ నియంత్రణలు అమలు కాలేదన్నది చేదు నిజం. విధులే తప్ప నిధులు, తగినంత సిబ్బంది కొరవడిన వివిధ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్ళు, మునిసిపాలిటీలు క్షేత్రస్థాయిలో చతికిలబడ్డాయి. ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూడడానికి ఏం చేయాలో ఆలోచించాలి. బలంగా, బరువు తక్కువగా, దీర్ఘకాలం మన్నే ప్లాస్టిక్ వినియోగాన్ని మాన్పించడం ఒక సవాలే. ఏటా 18 శాతం వంతున వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్న ప్యాకేజింగ్ రంగంలో మరీ కష్టం. కాబట్టి, కేవలం నిషేధాలను నమ్ముకోకుండా పలు యూరోపియన్ దేశాల్లో లాగా ప్లాస్టిక్‌పై బాధ్యతగా వ్యవహరిస్తున్న సంస్థలకు ప్రోత్సాహకాలివ్వాలి. ఆ పని చేయని సంస్థలు అందుకు తగిన మూల్యం చెల్లించేలా నిబంధన పెట్టాలి. అలాగే, నిషేధాన్ని పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్‌లు పెడితే సరిపోదు. ఆరోగ్యానికీ, పర్యావరణానికీ కలుగుతున్న నష్టం, మన వంతు బాధ్యతపై ప్రజా చైతన్యం పెంచాలి. నిషేధం అమలుకు భాగస్వామ్య పక్షాలన్నిటినీ కలుపుకొనిపోవాలి. ఉదాహర ణకు ప్లాస్టిక్‌తో పోలిస్తే, కాగితం స్ట్రాలకు ఖర్చు అయిదు రెట్లు ఎక్కువట. అసలే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న తయారీదార్లు, చిన్న వ్యాపారులపై ఇది పెనుభారం. కాబట్టి, పర్యావరణ హితంగా కంపోస్ట్ అయ్యే ప్లాస్టిక్ తయారీ లాంటివి పరిశ్రమతో కలసి ప్రభుత్వమూ అన్వేషించాలి. ఒక్కమాటలో నాలుగైదు దశాబ్దాలుగా నిత్యజీవితంలోకి పూర్తిగా జొరబడిన ప్లాస్టిక్‌ను వద్దంటే సరిపోదు. ప్రత్యామ్నాయాలు చూపించాలి. ప్లాస్టిక్ బదులు కాగితం, జనపనార, ఖాదీ సంచీలు, స్టీలు బాక్సులు వాడాలన్నది ప్రభుత్వ సూచన. అయితే, ఈ ప్రత్యామ్నాయాలు విస్తృతంగా అందు బాటులో ఉండేలా చూడడం కీలకం. ప్లాస్టిక్ బదులు కాగితం, వెదురుబొంగుల వినియోగం పెరిగితే, అది మళ్ళీ చెట్ల నరికివేతకు కారణమవుతుంది. అందుకే, చౌకగా ఉంటూనే పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాల వైపు ప్రజల్ని మళ్ళించాలి. ఈ మధ్య దీపావళి టపాసులపై ప్రజల్లో చైతన్యం తెచ్చినట్టే, ప్లాస్టిక్‌పైనా తీసుకురాగలిగితేనే ఫలితం ఉంటుంది. పర్యావరణానికీ, ప్రజారోగ్యానికీ మేలు కలుగుతుంది. ఆశయం మంచిదైనా, ఆచరణమార్గాలు కీలకమంటున్నది అందుకే! -
ప్లాస్టిక్ భూతానికి చెక్..
సాక్షి, అమరావతి: ఉదయం పాలు, కూరలు తేవాలంటే ప్లాస్టిక్ కవర్లు.. టీ తాగాలంటే ప్లాస్టిక్ కప్పు.. వాటర్ బాటిల్ ప్లాస్టిక్.. కూల్‌డ్రింక్ బాటిల్ ప్లాస్టిక్.. టిఫిన్ లేదా ఏదైనా పార్సిల్ తేవాలంటే ప్లాస్టిక్.. దుస్తులు కొన్నా ప్లాస్టిక్ కవర్లోనే ఇంటికి వస్తాయి.. నిత్య జీవితంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకు అనేక ప్లాస్టిక్ వస్తువులు వాడుతుంటాం. కానీ, రసాయనాలతో కూడిన ఈ ప్లాస్టిక్ ఉత్పత్తులు మానవుడితో సహా సమస్త జీవజాలానికి, పర్యావరణానికి అత్యంత హాని కలుగజేస్తున్నాయి. వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్ధాలు చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి (డీకంపోజ్) ఏకంగా 400 ఏళ్లు పడుతుంది.ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగాన్ని నివారించాలని ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా, సాధ్యమవడంలేదు. పైగా, వీటి వినియోగం ఏటికేడాది పెరుగుతూనే ఉందని కేంద్ర పర్యావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గత నాలుగేళ్లలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం రెట్టింపైందని, ఇది మరింత వేగంగా విస్తరిస్తుందని తాజా నివేదికలో పేర్కొంది. 2015–16 సంవత్సరంలో దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం 15.89 లక్షల టన్నులు కాగా, 2019–20 నాటికి 35 లక్షలకు చేరింది. రోజుకు 25,940 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే అందులో సుమారు 10,376 టన్నుల వ్యర్థాలను సేకరించకుండా వదిలేస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. 2050 నాటికి 12 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ దేశ భూ భాగంపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో ప్లాస్టిక్ వినియోగం తక్కువే. అమెరికాలో తలసరి ప్లాస్టిక్ వినియోగం 109 కేజీలు , చైనాలో 38 కేజీలుంటే ఇండియాలో 11 కేజీలే. అయినప్పటికీ ప్లాస్టిక్ వినియోగం వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆన్లైన్ డెలివరీ విస్తరిస్తుండటంతో ప్లాస్టిక్ వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. కేవలం జుమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ప్రతి నెలా అదనంగా 22,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నట్లు అంచనా. ప్రభుత్వం తక్షణం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, లేకపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగంపై కేంద్రం ఆంక్షలు ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ఆ ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తూ 2016లో కేంద్రం నిబంధనలు విధించగా, తాజాగా వాటిని సవరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఒకసారి మాత్రమే వినియోగించే (సింగిల్ యూసేజ్) ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించింది. దీని ప్రకారం కూల్డ్రింక్ల్లో వినియోగించే స్ట్రాలు, ఐస్‌క్రీం స్టిక్‌లు, ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులు, చెంచాలు, బెలూన్స్, క్యాండీ స్టిక్స్ వంటి వాటిలో సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ప్లాస్టిక్ కట్టడిలో ఏపీ చొరవ ప్లాస్టిక్ వినియోగం, నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరుస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ తాజా నివేదికలో పేర్కొంది. పట్టణాల నుంచి సేకరించిన వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ నిర్వహణ పద్ధతులను పాటిస్తోందని పేర్కొంది. రాష్ట్రంలో ఏటా 46,222 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ తయారీలో, రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 131 ప్లాస్టిక్ సంబంధ యూనిట్లు ఉండగా అందులో 117 ప్లాస్టిక్ ఉత్పత్తి చేసేవి. 14 ప్లాస్టిక్ రీ–సైక్లింగ్ యూనిట్లు. తాడిపత్రి, బొబ్బిలి, తిరుపతి, విజయవాడ వంటి మునిసిపాలిటీల్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల వినియోగంపై పాక్షిక నిషేధం అమలవుతోంది. కేంద్ర నిబంధనలను అతిక్రమించిన వారిపై దాడులు చేయడం ద్వారా రాష్ట్ర అధికారులు 235 టన్నల ప్లాస్టిక్ బ్యాగులను సీజ్ చేశారు. రూ.1.64 కోట్లు జరిమానాగా విధించారు. తాజాగా ప్లాసిŠట్క్ వ్యర్థాల నుంచి సముద్ర తీరప్రాంతాన్ని రక్షించేలా అమెరికాకు చెందిన పార్లే ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతంలో ఏటా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేయనున్నట్లు పార్లే ఫర్ ది ఓషన్స్ ఫౌండర్ సైరిల్ గట్చ్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 500 పార్లే ఎయిర్ స్టేషన్లు, 10 ఎకో ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటుతోపాటు 20 వేల మంది సముద్రపు వారియర్స్‌ను నియమిస్తామని వివరించారు. ఆయన ఈ నెల 5న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసే ఉత్పత్తులను వివరించి, రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. -
సుస్థిర ప్రగతిలో హరిత విధానాలు
సాక్షి, అమరావతి: సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతోంది. సుస్థిర ప్రగతిలో హరిత విధానాలకు పెద్దపీట వేయడం ద్వారా అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించేలా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టెయిన్‌బుల్ ప్లానెట్ (జీఏఎస్‌పీ) సంస్థ ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విస్తృతంగా చర్చించారు. వ్యర్థాల నుంచి విలువైన వస్తువుల తయారీని పైలట్ ప్రాజెక్టు కింద విశాఖలో చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంతో అనుసంధానించి దీన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. తద్వారా బీచ్‌లను అత్యంత పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవడంతోపాటు ఇతర అంశాలపైనా తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. హరిత విధానాలకు పెద్దపీట ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, రీ సైక్లింగ్‌పై అనుసరిస్తున్న వివిధ పద్ధతుల గురించి జీఏఎస్‌పీ ప్రతినిధి, ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్, పార్లీ ఫర్ ది ఓషన్స్ ఫౌండర్ సైరిల్ గట్చ్ సమావేశంలో వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో తీవ్రంగా కలుషితమవుతున్న సముద్రాలను, భూగోళాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ అనుకూల విధానాలతో వ్యర్థాల రీ సైక్లింగ్ చాలా కీలకమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 150 మిలియన్ టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ఉత్పత్తి అవుతుండగా కేవలం 9% మాత్రమే రీ సైక్లింగ్ జరుగుతున్నాయని, మిగతావన్నీ కాలుష్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయన్నారు. వ్యర్థాలను విలువైన ఉత్పత్తులుగా మార్చడంలో హరిత విధానాలకు పెద్దపీట వేయడం ద్వారా కొత్త ఆర్థిక వ్యవస్థకు దారులు వేయవచ్చన్నారు. జీఏఎస్‌పీ అనుబంధ సంస్థ పార్లే ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేస్తున్న పలు ఉత్పత్తుల గురించి ముఖ్యమంత్రికి తెలియజేశారు. బ్రాండింగ్ భవన నిర్మాణ మెటీరియల్, ఫర్నిచర్, వస్త్రాలు, బూట్లు తదితర వస్తువులను తయారు చేస్తున్నట్లు తెలిపారు. మన్యంలో ఎకో టూరిజం ఎకో టూరిజంపై ఉత్తరాఖండ్‌లో చేపడుతున్న ప్రాజెక్టు వివరాలను జీఏఎస్‌పీ ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రంలో అరకు, అనంతగిరి, రంపచోడవరం ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. స్థానికులకు మంచి ఆదాయాన్ని సమకూర్చేలా ప్రణాళిక ఉండాలన్నారు. కర్బన వ్యర్థాలతో నిరుపయోగ భూములను సారవంతంగా మార్చడంతోపాటు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, అంతర్జాతీయ మార్కెటింగ్ తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. విశాఖలో పైలట్ ప్రాజెక్టు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ కోసం జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్న వ్యర్థాల ప్రాసెసింగ్ విధానాన్ని పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి జీఏఎస్‌పీ ప్రతినిధులకు వివరించారు. వ్యర్థాల నుంచి విలువైన వస్తువుల తయారీకి విశాఖను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో అనుసంధానించి విలువైన ఉత్పత్తుల తయారీని చేపట్టడంతోపాటు బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచడంపై దృష్టి పెట్టాలన్నారు. విశాఖలో పైలట్ ప్రాజెక్టు అనంతరం మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ తరహా విధానాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. -
ప్లాస్టిక్‌ను తింటది ఈ ఎంజైమ్..!
చావుని తింటది కాలం.. కాలాన్ని తింటది కాళి.. అన్నాడో కవి ఇటీవలి ఒక పాటలో! దీనికి కొనసా గింపు గా ప్లాస్టిక్‌ను తింటది ఈ ఎంజైమ్... అంటున్నారు సైంటిస్టులు. భూకాలుష్యానికి కారణమైన ప్లాస్టిక్ నియంత్రణలో ముందడుగు పడిందంటున్నారు. జీవజాతుల మనుగడకు పెనుముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ నియంత్రణ మనిషికి పెనుసవాలుగా మారుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా భూమిపై ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇతర వ్యర్థాలతో పోలిస్తే ప్లాస్టిక్ డీకంపోజ్ (క్షీణించడం) అవడానికి చాలా కాలం పడుతుంది. ఒక అంచనా ప్రకారం ప్లాస్టిక్ సంపూర్ణంగా డీకంపోజ్ కావడానికి సుమారు 500– 1000 సంవత్సరాలు పడుతుంది. ఇంతటి కలుషితాన్ని ఎలా కట్టడి చేయాలా? అని మనిషి మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ తరుణంలోనే మోంటానా, పోర్ట్స్మౌత్ యూనివర్సిటీలకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక గుడ్‌న్యూస్ వినిపిస్తున్నారు. ప్లాస్టిక్‌ను గుట్టుచప్పుడుకాకుండా కనుమరుగు చేసే ఒక ఎంజైమ్‌ను వీరు గుర్తించారు. వీరి పరిశోధనా వివరాలు పీఎన్ఏఎస్ (ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్)లో ప్రచురించారు. పీఈటీ (పాలీ ఇథిలీన్ టెలిఫ్తాలేట్) ప్లాస్టిక్‌లో ఉండే టీపీఏ (టెరిఫ్తాలేట్)ను డీకంపోజ్ చేసే శక్తి ఈ ఎంజైమ్‌కు ఉందన్నారు. పీఈటీ ప్లాస్టిక్‌ను డిస్పోజబుల్ సీసాలు, బట్టలు, కార్పెట్ల తయారీలో ఉపయోగిస్తారు. 2018లోనే ప్రొఫెసర్ జెన్ డుబోయిస్, ప్రొఫెసర్ జాన్ మెక్గెహాన్లు ఈ ఎంజైమ్ తయారీపై పరిశోధనలు ఆరంభించారు. తాజాగా దీని పూర్తి వివరాలను వెల్లడించారు. బ్యాక్టీరియాలో ఉత్పత్తి టీపీఏను డీకంపోజ్ చేయడం కష్టమని, చివరకు బ్యాక్టీరియా కూడా దీన్ని అరిగించుకోలేదని జెన్, జాన్ చెప్పారు. కానీ పీఈటీని తినే బ్యాక్టీరియాలో ఒక ఎంజైమ్ మాత్రం టీపీఏను గుర్తుపడుతుందని తెలిసిందన్నారు. టీపీఏడీఓ అని పిలిచే ఈ ఎంజైమ్‌పై మరిన్ని పరిశోధనలు చేయగా, ఇది టీపీఏను పూర్తిగా శి«థిలం (బ్రేక్‌డౌన్) చేస్తుందని గుర్తించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి. తాజాగా కనుగొన్న టీపీఏడీఓ ఎంజైమ్‌తో ఎటువంటి రసాయనాలు వాడకుండా జైవిక పద్ధతుల్లోనే ప్లాస్టిక్‌ను డిగ్రేడ్ చేయవచ్చు. పీఈటీ ప్లాస్టిక్‌లో అణువులను విచ్ఛిన్నం చేసే ఒక ఎంజైమ్‌ను గుర్తించడం కీలకమలుపని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఎంజైమ్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా కేవలం సదరు ప్లాస్టిక్‌ను డీకంపోజ్ చేయడమే కాకుండా పలు రకాల ఉపయోగకర రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తుందని సైంటిస్టులు వివరించారు. డైమండ్ లైట్ సోర్స్‌లో ఎక్స్ కిరణాలను ఉపయోగించి టీపీఏడీఓ ఎంజైమ్ 3డీ నిర్మితిని రూపకల్పన చేయడంలో విజయం సాధించినట్లు మెక్‌గెహాన్ చెప్పారు. దీనివల్ల ఈ ఎంజైమ్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేయవచ్చన్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
Tharagai Aradhana: శెభాష్.. 9 నెలలకే ఈత నేర్చుకుని... ఇప్పుడు సముద్రంలో ఈదుతూ..
తారాగై ఆరాధన సముద్రంలో ఈదడానికే పుట్టినట్లుంది. సముద్రంతో మమకారం పెంచుకుంటూ పెరుగుతోంది. సముద్ర జీవులను కాపాడడానికే పని చేస్తోంది. సముద్రంలో చెత్త వేయవద్దని చెప్తోంది. చేపపిల్లలా నీటిలో మునిగి వ్యర్థాల అంతుచూస్తోంది. తారాగై ఆరాధన స్కూబా డైవింగ్ ఎక్విప్మెంట్ ధరించి పడవలో నుంచి సముద్రపు నీటిలోకి దూకిందంటే మరో క్షణంలో కంటికి కనిపించదు. పడవలో నుంచి ముందుకు ఉరికిన దేహం నీటిని తాకడమే ఆలస్యం... బుడుంగున మునక వేస్తుంది. చేపపిల్లలాగ నీటి అడుగుకు చేరుతుంది. పాన్‌పరాగ్ సాషేలు, పాలిథిన్ కవర్లు... అవీ ఇవీ అనే తేడా లేకుండా సముద్రంలో ఉండకూడని వ్యర్థాలన్నింటినీ ఏరి వేస్తుంది. నిజానికి సముద్రానికే ఆ లక్షణం ఉంటుంది. ప్రాణం లేని వస్తువును సముద్రం తన గర్భంలో దాచుకోదు. తనలో రూపుదిద్దుకున్న ప్రాణులకు ఇబ్బంది కలిగించే ఏ వస్తువునూ నిలవనీయదు. వీలయినంత త్వరగా బయటకు తోసేస్తుంది. అలలతోపాటు నిమిషాల్లో తీరానికి కొట్టుకు వచ్చేస్తుందా వస్తువు. కానీ పలుచటి ప్లాస్టిక్ కవర్లు, చిన్న చిన్న వక్కపొడి కవర్ల వంటివి సముద్రంలో నీటి అడుగున ఇసుకలో కూరుకుపోతుంటాయి. అలాంటి వ్యర్థాలు ఎక్కువైపోతున్నాయి. వాటిని తనంతట తానుగా ప్రక్షాళన చేసుకోవడం సముద్రానికి చేతకావడం లేదు. అలలకు శక్తి చాలడం లేదు. అందుకే... ఆ పని సముద్రం మీద ప్రేమ ఉన్న మనుషుల బాధ్యత అయింది. అంతటి బృహత్తర బాధ్యతను తలకెత్తుకున్న సాహసి మన తారాగై ఆరాధన. ఈ పాప వయసు ఎనిమిదేళ్లు. ఇప్పటి వరకు ఆమె సముద్ర తీరంలోనూ, సముద్రంలోనూ కూరుకుని పోయి ఉన్న 600 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరిపారేసింది. సముద్రపు అలలతో ఆడుకునే వయసులో ఇంత పెద్ద పర్యావరణహితమైన బాధ్యతను తలకెత్తుకుంది. ఏ పని చేస్తున్నా తన వెంట తండ్రి ఉంటాడని, అందుకే ధైర్యంగా చేసేస్తున్నానని చెప్తోంది ఆరాధన. నీటిలోనే పెరిగింది తమిళనాడు రాష్ట్రం, కరప్పగమ్లో పుట్టిన ఆరాధనకు సముద్రంతో అనుబంధం ఐదేళ్ల వయసులోనే ఏర్పడింది. ఆరాధన తండ్రి అరవింద్ తరుణ్‌శ్రీ స్కూబా డైవింగ్ ఎక్సపర్ట్ మాత్రమే కాదు, ఇన్స్ట్రక్టర్ కూడా. చెన్నై, పాండిచ్చేరిల్లో శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నాడు అరవింద్. తన కూతురిని చిన్న వయసులోనే ఏదైనా సాధించేలా తీర్చిదిద్దాలని అనుకున్నాడు. నవజాత శిశువుకు ఈత నేర్పించడం చాలా సులువు కూడా. ఆరాధనకు మూడు రోజుల పాపాయిగా ఉన్నప్పుడే నీటిలో తేలడం అలవాటు చేశాడు. తొమ్మిది నెలలకు నీటి తొట్టిలో వదిలితే ఎవరి సహాయమూ లేకుండా సొంతంగా ఈదేది. రెండేళ్లు నిండినప్పటి నుంచి ప్రొఫెషనల్ స్విమ్మర్‌గా తయారైంది. ఐదేళ్ల వయసు నుంచి స్కూబా డైవింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఏడేళ్లు వచ్చేటప్పటికి స్విమ్మింగ్, స్కూబా డైవింగ్‌లో ఆరితేరింది. తండ్రి నేర్పిన విద్య అరవింద్ ఇరవై ఏళ్లుగా ఇదే రంగంలో ఉండడం, సముద్ర జలాలకు జరుగుతున్న హానిని కూడా దగ్గరగా చూడడంతో మెరైన్ పొల్యూషన్‌ని అరికట్టాలనే నిర్ణయానికి వచ్చారాయన. ఆరాధనకు స్కూబా డైవింగ్ నేర్పించడంతోపాటు సముద్ర జలాల పరిరక్షణ పట్ల కూడా అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆరాధన సముద్ర జలాలను ప్రక్షాళన చేయడంతోపాటు సముద్రజలాలు కలుషితమైతే సముద్రంలో నివసించే జీవులకు ఎదురయ్యే ప్రాణహాని గురించి చెబుతోంది. అంతరించిపోతున్న సముద్ర జీవుల పరిరక్షణ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇస్తోంది. ఇందుకోసం స్కూళ్లకు వెళ్లి తన వయసు పిల్లలకు తనకంటే పెద్ద పిల్లలకు మెరైన్ కన్జర్వేషన్ గురించి అవగాహన కల్పిస్తోంది. ఇటీవల ఆరాధన ‘సేవ్ ద ఓషన్’ కార్యక్రమంలో భాగంగా ఏకబిగిన పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఈది వరల్డ్ రికార్డు సాధించింది. ‘‘మా నాన్న గడచిన పదిహేడేళ్లుగా పదివేల కిలోల వ్యర్థాలను వెలికి తీశాడు. నేను ఆరువందల కిలోలు తీశాను. ఇలా సాగర ప్రక్షాళన చేయడమే కాదు, ఇకపై ఎవరూ ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలో పారవేయకుండా చైతన్యవంతం చేస్తున్నాం. మా తరం పెద్దయ్యేటప్పటికి సముద్ర పరిరక్షణ కోసం ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఉండకూడదు’’ అంటోంది తారాగై ఆరాధన. చదవండి: సముద్రం నుంచి సముద్రానికి -
వారు చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఫిదా!
గ్లోబల్ కంపెనీలకు ఇండియన్లు సీఈవోలుగా అవడాన్ని సీఈవో వైరస్ ఫ్రం ఇండియా అంటూ చమత్కరించిన ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. సమకాలిన సామాజిక అంశాలపై సోషల్ మీడియా వేదికగా నిత్యం స్పందిస్తుంటారు. దేశంలో ఏ మూలన అయినా సరే ఏదైనా మంచి కార్యక్రమం జరిగినట్టు ఆయన దృష్టికి వస్తే చాలు.. ప్రశంసలు కురిపించేందుకు ఏ మాత్రం ఆలస్యం చేయరు. తాజాగా నేషనల్ కేడెట్ కార్ప్ (ఎన్సీసీ) వాలంటీర్లు చేసిన పనిని ఆయన మెచ్చుకున్నారు. ముంబై నగరంలోని ఓ బీచ్‌లో పునీత్ సాగర్ అభియాన్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్లు ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కార్యక్రమం చేపట్టారు. బీచ్‌లో పేరుకు పోయిన ప్లాస్టిక్ బాటిళ్లు ఇతర వ్యర్థాలను తొలగించారు. ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ సెంటర్లకు పంపించారు. ఈ ఫోటోలను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ఎన్సీసీ బాధ్యత కలిగిన పౌరులను తయారు చేస్తుందంటూ కొనియాడారు. Even as I participate in a committee to revamp the NCC I’m delighted to see & applaud this initiative. Under the PuneetSagar Abhiyan, the NCC has undertaken the cleaning of beaches & collection of plastic waste for recycling. The NCC produces good Citizens! pic.twitter.com/mvIOibX3cv — anand mahindra (@anandmahindra) December 17, 2021 చదవండి: లీనా నాయర్ సీఈవో ఘనత.. తన శైలిలో మహీంద్రా స్పందన