వీధుల్లో, చెరువుల్లో, సముద్రాల్లో చేరిపోయి మనిషిని రకరకాలుగా ముప్పు తిప్పలు పెడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు ఓ పరిష్కారం దొరికిందని అంటున్నారు స్వీడన్ లోని చామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. భూమ్మీద ఉన్న ప్లాస్టిక్ చెత్తనంతా కరిగించేయడమే కాకుండా.. దాన్ని మళ్లీ తాజా ప్లాస్టిక్‌లా వాడుకునే అద్భుత టెక్నాలజీని వీరు అభివృద్ధి చేశా రు. ఆవిరితో కరగబెట్టడం ద్వారా ప్లాస్టిక్‌ను అణుస్థాయిలో విడగొట్టడం ద్వారా ఈ సాంకేతికత పని చేస్తుందని ఈ పద్ధతిని ఆవిష్కరించిన శాస్త్రవేత్త హెన్రిక్ థున్‌మన్ తెలిపారు. ప్లాస్టిక్‌ను సుమారు 850 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేయడం ద్వారా వచ్చే వాయువును కొన్ని పద్ధతుల ద్వారా మళ్లీ తాజా ప్లాస్టిక్ మాదిరిగా వాడుకోవచ్చని వివరించారు. ఇప్పుడున్న ఫ్యాక్టరీల్లోనే ఈ సరికొత్త రీసైక్లింగ్ ప్రక్రియను చేసుకోవచ్చని చెప్పారు. ప్రయోగాల్లో తాము 200 కిలోల ప్లాస్టిక్ చెత్తను గంటలో మళ్లీ ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేయగల వాయురూపంలోకి మార్చేశామని తెలిపారు.
ఏడాదికి 35 కోట్ల టన్నులు..
2015 నాటి లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తమ్మీద ఏడాదికి ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ దాదాపు 35 కోట్ల టన్నులు. ప్రస్తుతం చాలావరకు ప్లాస్టిక్ చెత్తను మండించి ఆ వేడితో విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగిస్తున్నారు. లేదా వ్యర్థాలు ఎక్కువ స్థలం ఆక్రమించకుండా చూసేందుకు కాల్చేయడాన్ని ఒక మార్గంగా పరిగణిస్తున్నారు. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్‌తోపాటు అనేక ఇతర విషవాయువులు గాల్లోకి చేరి పరిసరాలను కలుషితం చేస్తున్నాయి. మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో సుమారు 60 శాతం చెత్త కుప్పల్లోకి చేరుతోంది. రీసైక్లింగ్ కోసం సేకరిస్తోంది 14 శాతం మాత్రమే. మొత్తం వ్యర్థాల్లో 8 శాతాన్ని చౌకరకం ప్లాస్టిక్‌గా రీసైకిల్ చేస్తుండగా 2 శాతం కొంచెం నాణ్యమైన పదార్థంగా అందుతోంది. ఒక శాతం వ్యర్థాలు మాత్రం వీధుల్లో, నదుల్లో, ఇతర ప్రాంతాల్లో పేరుకుపోయి సమస్యగా మారుతోంది.
కర్బన పరమాణువులతో మ్యాజిక్..
ప్లాస్టిక్‌ను చెత్తగా పడేశాక దాన్ని రీసైకిల్ చేసినా నాణ్యత పెరగదు. ఈ కారణంగానే హెన్రిక్ బృందం ప్లాస్టిక్ పునర్వినియోగానికి ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. పదార్థంలోని కర్బన పరమాణువులను సేకరించి వాడుకునేందుకు ప్రయత్నించింది. వాటిద్వారా మళ్లీ సరికొత్త, నాణ్యమైన ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా ముడిచమురుతో ప్లాస్టిక్‌ను తయారు చేయాల్సిన అవసరాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. ‘మా ఆలోచనలను పరీక్షించుకునేందుకు 200 కిలోల ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేశాం. అది కాస్తా విజయవంతమవడంతో ప్రస్తుతం మొత్తం ప్రక్రియను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. చమురు శుద్ధి కేంద్రాలనే రీసైక్లింగ్ ప్లాంట్లుగాను మార్చేందుకు ఏం కావాలో పరిశీలిస్తున్నాం’అని హెన్రిక్ తెలిపారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment