పోలీసులు అరెస్టు చేసిన నిందితులు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లోని అక్షజ్ మాలిక్యులర్ రీసెర్చ్ ల్యాబ్‌లో మాదక ద్రవ్యాలను తయారు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి కొకైన్ మాత్రలు, ఎల్‌సీడీలతో పాటు 53 గ్రాముల సింథటిక్ డ్రగ్స్, 3.6 కిలోల నార్కోటిక్ పదార్థాల ద్రవం, 50 కిలోల హైడ్రోక్లోరైడ్, 12 బాటిళ్ల మిథైలమైన్, రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లు ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) డీసీపీ కే మురళీధర్‌తో కలిసి సీపీ మహేశ్ భగవత్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
►నల్లగొండ జిల్లా ఓపులాయిపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి లెనిన్ బాబు వరంగల్‌లోని సీకేఎం కాలేజీలో కర్బన్ రసాయన శాస్త్రంలో పీజీ పూర్తి చేశాడు. 2004–13 మధ్య సువాన్, మిత్రోస్, సాయి లైఫ్ సైన్సెస్, అల్బానీ వంటి పలు ఫార్మా కంపెనీలలో జూనియర్ సైంటిస్ట్‌గా పనిచేసి, ఆర్ అండ్ డీ విభాగంలో సీనియర్ కెమిస్ట్ స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత 2014లో నాచారంలోని జీవీకే బయో సైన్సెస్ సమీపంలో అక్షజ్ మాలిక్యులర్ రీసెర్చ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశాడు. కొంతకాలం నడిపిన తర్వాత దీన్ని 2019లో ఉప్పల్‌కు మార్చాడు.
►2017లో ప్రభాకర్ అనే వ్యక్తి నాంపల్లి లెనిన్‌బాబాకు గుంటూరు జిల్లా కొరటిపాడు గ్రామానికి చెందిన పులిచెర్ల శ్రీనివాస్ రెడ్డిని పరిచయం చేశాడు. అగ్రి కెమికల్స్ తయారు చేయాలని సూచించాడు. ఇద్దరి స్నేహ బలపడిన తర్వాత.. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న ఇరువురు మాదక ద్రవ్యాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. అక్షజ్ మాలిక్యులర్ ల్యాబ్స్‌లో లెనిన్‌బాబు సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తే, వాటిని శ్రీనివాస్ రెడ్డి చెన్నైలోని నెపోలియన్‌కు సరఫరా చేసేవాడు.
►ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న భువనగిరి ఎస్‌ఓటీ, ఉప్పల్ పోలీసులు, ఉప్పల్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో కలిసి ఆకస్మిక దాడులు చేసి లెనిన్‌బాబు, శ్రీనివాస్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. నెపోలియన్ పరారీలో ఉన్నాడు.
చదవండి: సికింద్రాబాద్ మహాత్మాగాంధీ రోడ్డు ఏరియాకు ఎన్నో ప్రత్యేకతలు
ఏడేళ్ల నుంచి శ్రీనివాస్ రెడ్డి పరారీలోనే..
1994లో జేఎస్‌ఎస్ ఫార్మసీ కాలేజీలో బీఫార్మసీ పూర్తి చేసిన శ్రీనివాస్ రెడ్డి.. తార్నాకలోని కిమ్టీ కాలనీలో స్థిరపడ్డాడు. కొంత కాలం మెడికల్ రిప్రజెంట్‌గా పనిచేశాడు. 2010లో ఎఫెడ్రిన్ సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో చెన్నై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. 2014లో మెథాంఫేటమిన్ డ్రగ్ సప్లయి కేసులో హైదరాబాద్ ఎన్‌సీబీ పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు. బెయిల్ మీద బయటికి వచ్చాక కూడా శ్రీనివాస్ ప్రవర్తనలో మార్పు రాలేదు.
2015లో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న నేపథ్యంలో 2015లో కీసర్ పీఎస్‌లో ఎన్‌డీపీఎస్ కేసు నమోదయింది. అప్పటి నుంచి శ్రీనివాస్ పరారీలోనే ఉన్నాడు. 2018లో ఉప్పల్ పీఎస్‌లో నమోదయిన ఎన్‌డీపీఎస్ కేసులోనూ శ్రీనివాస్ పరారీలోనే ఉన్నాడు. ఏడేళ్ల నుంచి పరారీలో ఉన్న శ్రీనివాస్.. తాజాగా రాచకొండ పోలీసులకు చిక్కాడు.
చదవండి: ‘పతాక’ స్థాయిలో పొరపాట్లు!
Comments
Please login to add a commentAdd a comment