పంట పొలాల్లో ప్లాస్టిక్ భూతం తిష్టవేసుక్కూచుంది. వ్యవసాయంలో చాలా పనుల కోసం ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకం గత 70 ఏళ్లుగా అనేక రెట్లు పెరిగింది. మల్చింగ్ షీట్లు, ఫామ్‌పాండ్ లైనింగ్, ప్లాస్టిక్ డ్రిప్ లేటరల్స్, పీవీసీ పైపులు, గ్రీన్ హౌస్‌ల పైకప్పులు, సైలేజీ గడ్డి బేల్స్ కోసం ఫిల్మ్‌ల తదితర పనుల కోసం వ్యవసాయంలో ప్లాస్టిక్ వాడకం అంతకంతకూ పెరుగుతోంది. వీటిల్లో ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ ముఖ్యమైనది.
ఒక పంట కాలంలో చిరిగిపోయే పల్చటి షీట్ ఇది. కలుపును నివారించడం ద్వారా కలుపు తీత శ్రమతో పాటు ఖర్చును లేదా రసాయనిక కలుపు మందుల ముప్పును/ వాటి కొనుగోలు ఖర్చును తగ్గించడం.. మట్టిలో నుంచి నీటి తేమ ఆరిపోకుండా చూడటం ద్వారా నీటిని ఆదా చేయటం ద్వారా దిగుబడి పెరుగుదలకు ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు ఉపయోగపడుతున్నాయి.
కోటి 25 లక్షల టన్నుల ప్లాస్టిక్ సేద్యం
2019వ సంవత్సర కాలంలో ప్రపంచవ్యాప్తంగా పంటల సాగు, ఆక్వా సాగు, చేపల వేట దగ్గరి నుంచి ఆయా ఆహారోత్పత్తులను వినియోగదారులకు చేర్చే వరకు ఉన్న దశలన్నిటిలో కలిపి సుమారు కోటి 25 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ను వినియోగించినట్లు ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా పంటలు/ఉద్యాన తోటల సాగులో, పశువుల పెంపకంలో ఏడాదికి కోటి టన్నుల ప్లాస్టిక్ వాడుతుండగా.. ఇందులో మల్చింగ్ ఫిల్మ్ వాటా 34 లక్షల టన్నులు.
చేపల వేట, ఆక్వా సాగులో 21 లక్షల టన్నులు, అటవీ ఉత్పత్తులకు సంబంధించి మరో 2 లక్షల టన్నుల ప్లాస్టిక్ సామగ్రి వాడుతున్నారు. 2030 నాటికి వ్యవసాయంలో ప్లాస్టిక్ వాడకం 50% పెరగనుందని వ్యాపారుల అంచనా. ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేకపోయినప్పటికీ, వ్యవసాయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ప్లాస్టిక్‌లో సింహభాగం అంటే 60 లక్షల టన్నుల ప్లాస్టిక్ (ప్రపంచ వినియోగంలో సగం)ను ఆసియా దేశాల్లో రైతులే వాడుతున్నారని ఎఫ్.ఎ.ఓ. చెబుతోంది.
ప్లాస్టిక్ అవశేషాలతో ముప్పేమిటి?
పంట భూముల్లో మిగిలిపోయే ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ అవశేషాల వల్ల ఆయా భూములు కాలుష్యం బారిన పడినందున సూక్ష్మజీవరాశి నశించి పంట దిగుబడులు తగ్గిపోతున్నట్లు ఎఫ్.ఎ.ఓ. పేర్కొంది. ఇలా భూమిలో కలిసిన ప్లాస్టిక్ (ముఖ్యంగా మల్చింగ్ ఫిల్మ్ అవశేషాల) ద్వారా వెలువడే మైక్రోప్లాస్టిక్స్ (సూక్ష్మప్లాస్టిక్ కణాలు) ఆహారోత్పత్తులు, నీటి ద్వారా తిరిగి మనుషులకు చేరి వారికి అనారోగ్యం కలిగించడం కూడా జరుగుతోందని ఎఫ్.ఎ.ఓ. ఆందోళన వ్యక్తం చేసింది. పెద్ద ఎత్తున పోగుపడే వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల వన్యప్రాణులు, మూగజీవాలు కూడా అనారోగ్యం పాలువుతున్నాయి. కొన్ని ప్లాస్టిక్ కణాలలో ఉండే థాలేట్స్, బిస్పినాల్స్ వంటి విషతుల్య పదార్థాలు మనుషుల హార్మోన్ వ్యవస్థను అస్థవ్యస్థం చేసి ఆనారోగ్యాల బారిన పడేస్తాయి. ఈ ప్లాస్టిక్ వస్తువులు, సూక్ష్మప్లాస్టిక్ కణాలు వాగులు, కాలువల ద్వారా సముద్రంలోకి చేరి జలచరాలకు దీర్ఘకాలం హాని చేస్తున్నాయి.
వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక పద్ధతి ప్రకారం సేకరించి, పునర్వినియోగించే పటిష్ట వ్యవస్థ కొరవడింది. సేకరించి పొలాల్లోనే తగటబెడుతున్నారు. ఒక వేళ చెత్త కుప్పల్లో వేసినా.. అక్కడ వాటికి నిప్పు పెడుతున్నారు. తగలబడిన ప్లాస్టిక్ నుంచి పాలీక్లోరినేటెడ్ డిబెన్‌జో–పి–డయాక్సిన్లు, ఫ్యురాన్లు వంటి విషతుల్య వాయువులు వెలువడుతూ ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్నాయి. ఒక వైపు ఆహారోత్పత్తి పెరుగుదలకు దోహదపడుతున్న ఈ ప్లాస్టిక్.. మరోవైపు ఆహారభద్రతపై, ఆహార నాణ్యత, పౌష్టికాహార శోషణపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అదేవిధంగా, సాంఘిక, ఆర్థిక పరంగా నష్టాలకు కారణభూతమవుతోంది. అందువల్ల, వ్యవసాయంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని గాడిన పెట్టి, ప్రత్యామ్నాయాలపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటూ ఎఫ్.ఎ.ఓ. శాస్త్రవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, పాలకులకు అనేక సూచనలు చేసింది.
కిలో షీట్‌తో 700 చ.అ.ల భూమి కలుషితం
పంట పూర్తయిన తర్వాత చీలికలు పేలికలయ్యే మల్చింగ్ ప్లాస్టిక్ షీట్ ముక్కలను ఏరివేయటం పెద్ద సమస్యగా మారింది. వీలైనంత వరకు ఏరి తగులబెట్టడం లేదా చెత్తకుప్పలో వేస్తున్నారు. మిగతా ప్లాస్టిక్ ముక్కలు భూమిలో అలాగే ఉండిపోతున్నాయి. వీటితో పాటు డ్రిప్ లేటరల్స్ ముక్కలు తదితర ప్లాస్టిక్ వస్తువులను సక్రమంగా ఏరి తిరిగి ఉపయోగించే పరిస్థితి లేనందున భూమి ప్లాస్టిక్ కాలుష్యం బారిన పడుతోంది. ఆసియా దేశాల్లో 10 శాతాన్ని మాత్రమే సేకరించి, తిరిగి వాడగలుగుతున్నామని అంచనా.
మట్టిలో కలిసే సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు మట్టిలోని సూక్ష్మజీవరాశిని నాశనం చేస్తున్నాయి. దీంతో భూసారం దెబ్బతింటున్నది. ఒక కిలో పల్చటి ప్లాస్టిక్ షీట్ 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యవసాయ భూమిని కలుషితం చేస్తోందని అంచనా. చమురు, సహజవాయువు లేదా బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను శుద్ధిచేసి 99% ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇవి ఒక వైపు ఉపయోగపడుతూనే నిర్వహణ లోపం వల్ల మనుషులు, పశు పక్ష్యాదుల ఆరోగ్యానికి, పర్యావరణానికి తీరని హాని కలిగిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రత్యామ్నాయాలున్నప్పటికీ..!
రసాయనిక కలుపు మందులు వాడకుండా, కలుపు మొలవకుండా చూసేందుకు వ్యవసాయంలో వాడుతున్న ప్లాస్టిక్ మల్చింగ్ ఫిల్మ్‌కు ప్రత్యామ్నాయాలు అనేకం. పంటల మార్పిడి పాటించడం, పంట పొలంలో ఖాళీ లేకుండా అంతర పంటలు వేయటం(సజీవ ఆచ్ఛాదన) లేదా ఎండుగడ్డి వంటి పంట వ్యర్థాలను మల్చింగ్‌గా వాడటం వంటి మార్గాలున్నాయి. త్వరగా చివికి భూమిలో కలిసిపోయే పర్యావరణహితమైన (బయోడీగ్రేడబుల్) మల్చింగ్ ఫిల్మ్‌లను సంపన్న దేశాల్లో వాడుతున్నారు. అదేవిధంగా, మన కాయిర్ బోర్డు రూపొందిస్తున్న కొబ్బరి పీచుతో తయారు చేసే ‘భూవస్త్రాలు’ కూడా పంటల మధ్య ఆచ్ఛాదనకు ఉపయోగపడతాయి.
కొద్ది నెలల్లో మట్టిలో కలిసిపోతాయి. అయితే, వీటితో వచ్చిన చిక్కేమిటంటే.. ప్లాస్టిక్ మల్చింగ్ ఫిల్మ్ కన్నా వీటి ధర 2–3 రెట్లు ఎక్కువగా ఉండటమే. ఈ ప్రతిబంధకాలను అధిగమించేందుకు ముఖ్యంగా ఆసియా దేశాలు పరిశోధనలకు ఊతమివ్వాలి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలు ఫలించి, ధర అందుబాటులోకి వస్తే బయోడీగ్రేడబుల్ మల్చింగ్ ఫిల్మ్‌లు మన దేశంలోనూ రైతులకు అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు.
– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment