![Benefits of Drumstick Leaves](/styles/webp/s3/article_images/2025/02/19/SAGUBADI.jpg.webp?itok=ZChmLyjF)
మునగ సకల పోషకాల గని అని మనకు తెలుసు. సాంబారులో మునక్కాడలు వేసుకోవటం కూడా అందరికీ తెలుసు. అయితే, కాయల్లో కన్నా ఆకుల్లో ఎక్కువ పోషకాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తమిళనాడులో, సరిహద్దు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మునగ ఆకును ఆకుకూరగా వాడుకోవటం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు కొందరు రైతులు మునగాకు పొడిని అమ్ముతున్నారు. ఈ పొడితో బిస్కట్లు తదితర ఆహారోత్పత్తులను సైతం తయారు చేసి స్థానికంగానే కాదు, విదేశాలకూ అమ్ముతున్నారు. పొలాల్లోనే కాదు, పెరట్లో కూడా మునగ ఆకుని పండించుకునే ఓ పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
తక్కువ స్థలంలో ఎక్కువ మునగ ఆకులు పండించే సాంద్ర వ్యవసాయ పద్ధతి (ఇంటెన్సివ్ ఫార్మింగ్ సిస్టం) ఇది. పోషకాహార లోపాలకు మునగాకు సరైన మందు. పోషకాహార లోపం నివారణకు వివిధ పద్ధతుల్లో మునగ ఆకు ఉత్పత్తుల వాడకం పెరిగింది. మరి ఇంటి పెరట్లోనే ఇంటెన్సివ్‌గా మునగాకు తోటలను సాగు చేయటం ఎలా? ఇంటి పెరటిలో కొద్దిపాటి స్థలంలో మునగ తోట పెంపకాన్ని చేపడితే ఏడాదంతా తాజా మునగాకును పొందవచ్చు. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే మంచి పంట వస్తుంది. ఇంటి పెరట్లోనే కాదు.. పార్కుల్లోని ఖాళీ స్థలాలు, తోటలు, పాఠశాల ఆవరణల్లోనూ ఈ విధానంలో మనుగతోటలను సాగు చేసుకుంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం మన సొంతమవుతుంది. దీనికి అనుసరించాల్సిన పద్ధతులు వరుస క్రమంలో...
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/PATTI-SAGUBADI.jpg)
1. ముందుగా 13 చదరపు అడుగుల స్థలాన్ని ఇంటిపెరటిలో ఎంపిక చేసుకోవాలి. ఇందులో రెండడుగులు లోతు తవ్వాలి.
2. తవ్విన మట్టికి సమాన నిష్పత్తిలో కోళ్ల ఎరువు లేదా వానపాముల ఎరువును కలుపుకోవాలి.
3. తవ్విన గుంతను తిరిగి సేంద్రియ ఎరువుల మిశ్రమంతో నింపాలి. మడిని నీటితో తడుపుతుండాలి. ఆరు వారాల్లో మంచి ఎరువు తయారవుతుంది.
4. మడిని నాలుగు సమాన భాగాలుగా విభజించి గుర్తు పెట్టుకోవాలి.
5. మునగ విత్తనాలను నాటుకోవాలి.
6. విత్తనాలపై గడ్డిని పరిచి ఆచ్ఛాదన కల్పించాలి. నీటి తడులివ్వాలి.
7. పెంపుడు జంతువులు, పశువుల నుంచి రక్షణ కల్పించాలి.
8. నెల రోజుల వయసున్న మునగ మొక్కలు
9. 5 వారాల వయసున్న మునగ మొక్కలు
10. 6 వారాల వయసున్న మునగ మొక్కలు
11. మూడోసారి కోతకు సిద్ధం
12. భూమి మట్టం నుంచి అడుగున్నర ఎత్తులో కత్తిరించాలి.
13. ఒక పక్క నుంచి కత్తిరించుకుంటూ వెళ్లాలి.
14. పూర్తిగా కోసిన మునగ మడి
15. కొమ్మలను పరదాపై నీడకింద ఆరబెట్టాలి.
16. మూడో కోతలో దాదాపు 90 కిలోల తాజా ఆకుల దిగుబడి వస్తుంది.
17. కొమ్మలను పరదాపై నీడ కింద ఆరబెట్టాలి. 20 కిలోల ఆకును నీడలో ఆరబెడితే కిలో మునగాకు పొడిని తయారు చేసుకోవచ్చు.
18. ప్రతి 50–60 రోజులకు ఒకసారి మునగ ఆకు కోతకు సిద్ధమవుతుంది.
తాజా ఆకును వాడుకోవచ్చు లేదా నీడలో ఆరబెట్టిన ఆకుతో పొడిని తయారు చేసుకోవచ్చు. కత్తిరించిన తరువాత మునగ మొక్కల మోళ్లు మళ్లీ చివురిస్తాయి. మరో 50 రోజుల్లో కోతకొస్తాయి. తోట ద్రవ జీవామృతం, ఘనజీవామృతం వంటివి తగుమాత్రంగా వాడుతూ పోషకాల లోపం రాకుండా చూసుకుంటే.. ఈ సాంద్ర మునగ ఇలా ఏళ్ల తరబడి పోషకాల గని వంటి మునగాకును ఇస్తూనే ఉంటుంది.
ఆరు నెలలు పోషకాలు సేఫ్!
భారత ఔషధ, సుగంధ మొక్కల బోర్డు సమాచారం ప్రకారం.. మునగాకు పొడి – ఒక అద్భుతమైన ఆహార పదార్థం. దీనిలో విటమిన్లు, ఖనిజ లవణాలు, మాంసకృత్తులు విశేషంగా ఉన్నాయి. పోషకాహార లోపం గల పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే స్త్రీలకు ఉపయోగపడే పోషకాలను ఇస్తుంది. ఏ ఆహారంతోనైనా దీన్ని కలిపి తీసుకోవచ్చు.విత్తనం, మొక్క నాటుకోవాలనేమీ లేదు. కొమ్మను విరిచి నాటితే వేరు పోసుకొని చెట్టుగా ఎదుగుతుంది.చెట్లు నాటుకున్న తరువాత ఎప్పుడైనా మునగాకులు కోసుకోవచ్చు.
⇒ మునగ తోటల్లో సంవత్సరానికి 6–9 సార్లు కొమ్మలను భూమి నుండి 15–50 సెం.మీ. ఎత్తు వరకు కత్తిరించుకోవచ్చు
⇒ కొమ్మల నుంచి కోసుకున్న తాజా మునగాకును నీటిలో బాగా కడిగి శుభ్రపరచాలి ∙ఆకులను సూర్యరశ్మి తగలని ప్రదేశంలో సహజంగా ఎండబెడితే, ఆకుల్లో ఉన్న విటమిన్లు అలాగే నిక్షిప్తమై ఉంటాయి. పొడి చేయటానికి సులువుగా ఉంటుంది
⇒ ఇలా ఎండిన ఆకులను దంచటం ద్వారా లేదా పిండిమర ద్వారా పొడి చేసుకోవచ్చు
⇒ పొడిని గాలిచొరపడని, తేమలేని సీసాలో పోసుకొని సూర్యరశ్మి తగలకుండా భద్రపరచుకోవాలి
⇒ మునగాకు పొడిని 24 డిగ్రీల సెల్షియస్ కన్నా తక్కువ శీతోష్ణస్థితిలో ఉంచితే, 6 నెలల వరకు తాజాగా పోషక విలువలేవీ కోల్పోకుండా ఉంటుంది
⇒ మునగాకు పొడిని ఆహార పదార్ధాల్లో గాని, పానీయాల్లో గాని కలుపుకోవచ్చు. మునగాకు పొడిని ఆహార పదార్థాలు పూర్తిగా వండిన తర్వాత కలుపుకుంటే పోషక విలువలు మనకు పూర్తిగా లభ్యమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment