
ట్రావెల్ అడ్వైజరీ విడుదల చేసిన ద.మ.రైల్వే
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి రీ డెవలప్‌మెంట్ (redevelopment) పూర్తిచేయాలనే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు. సుమారు రూ.720 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రైల్వేస్టేషన్‌లో సివిల్ పనులు కొనసాగుతున్నాయి. ఉత్తరం వైపున ఉన్న స్టేషన్ భవనాన్ని కూల్చివేశారు. దానిస్థానంలో కొత్త భవనం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణమధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు...
ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు గణేష్ టెంపుల్ (Ganesh Temple) వైపు ఉన్న 2వ గేట్‌ను వినియోగించుకోవాలి. ప్రస్తుతం ఈ గేట్‌ను ప్రయాణికుల రాకపోకల కోసం తెరిచి ఉంచారు. అలాగే జనరల్ బుకింగ్ కౌంటర్లు, విచారణ కేంద్రాలు, సుమారు 750 మంది ప్రయాణికులు వేచి ఉండేందుకు 500 అదనపు సీటింగ్ సామర్థ్యంతో వెయిటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు.
(Secunderabad Railway Station: జ్ఞాపకాల స్టేషన్)
ప్రస్తుతం 4వ గేట్ మూసివేశారు. స్వాతిహోటల్ ఎదురుగా ఉన్న 3వ, 3బి నెంబర్ గేట్‌లను వినియోగించుకోవచ్చు. ఈ గేట్ల వద్ద వద్ద అదనపు ప్రవేశం కల్పించారు.
10వ నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు...
10వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు బోయిగూడ ప్రవేశద్వారం వైపు 8వ గేట్‌ను తెరిచారు. ప్రయాణికులు ఇక్కడ సాధారణ టిక్కెట్‌లను కూడా బుక్ చేసుకొనేందుకు కౌంటర్‌లు ఉన్నాయి.
నిర్మాణ పనులు కొనసాగుతున్న దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులను చేసేందుకు 24 గంటల పాటు విధులు నిర్వహించేవిధంగా ప్రత్యేక సిబ్బందిని నియమించారు.
చదవండి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆర్చీలు ఇక చరిత్ర పుటల్లోనే
ఒకటో నెంబర్ నుంచి 10వ నెంబర్ ప్లాట్‌ఫామ్ వరకు ప్రయాణికులు చివరి నిమిషంలో పరుగెత్తవలసిన అవసరం లేకుండా ఏ ట్రైన్ ఏ ప్లాట్‌ఫామ్ పైన ఆగనుందనే సమాచారాన్ని ముందుగానే ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు అన్ని చోట్ల ఆర్‌పీఎఫ్ (RPF) అదనపు బలగాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
హెల్ప్‌లైన్ 139...
పునరాభివృద్ధి పనుల్లో భాగంగా పెద్ద ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నందున ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరారు.ప్రయాణికుల భద్రత, రక్షణ, తక్షణ సహాయ సహకారాల కోసం ఆర్పీఎఫ్ హెల్ప్‌లైన్ – 139ను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment