helpline number
-
సీఏఏ దరఖాస్తుదారుల కోసం హెల్ప్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ(సవరణ) చట్టం(సీఏఏ)–2019 కింద భారత పౌరసత్వం పొందాలనుకునే శరణార్ధులకు సాయపడేందుకు త్వరలో హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆన్లైన్ వేదికగా దరఖాస్తు ప్రక్రియ జరుగుతుందని హోం శాఖ బుధవారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టింది. దరఖాస్తుల సమర్పణకు ఇప్పటికే ఓ పోర్టల్‌ను సిద్ధం చేసినట్లు గుర్తుచేసింది. ప్రతిరోజూ ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఈ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి. దేశంలోని ఏ ప్రాంతంలో నివసిస్తున్న వలసదారులైనా ఈ నంబర్లకు ఫోన్ చేసి తమ దరఖాస్తు సంబంధ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. -
Afghanistan: హెల్ప్‌లైన్ నంబర్లు ప్రకటించిన భారత ప్రభుత్వం
న్యూఢిల్లీ: అఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులు, అఫ్గానీల కోసం భారత ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అవసరమైన వారు ఈ నెంబర్లకు సంప్రదించడం ద్వారా భారత ప్రభుత్వం నుంచి సహాయం పొందవచ్చు. ఇప్పటికే ఆఫ్గనీలకు ప్రత్యేక వీసాలను జారీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అమెరికా సేనలు వైదొలగి పోవడంతో అఫ్గనిస్తాన్ పౌర ప్రభుత్వాన్ని తాలిబన్లు కూల్చివేశారు. తాలిబన్లు అధికార పీఠం చేజిక్కంచుకోవడంతో ఆ దేశం విడిచి వెళ్లేందుకు వేలాదిగా అఫ్గన్ పౌరులు ప్రయత్నాలు చేస్తున్నారు. విమానాశ్రయాలకు క్యూ కడుతున్నారు. వాట్సాప్: +91 8010611290 ; +91 9599321199 ; +91 7042049944 ఫోన్: +91 11 4901 6783 ; +91 11 4901 6784 ; +91 11 49016785 ఇ-మెయిల్: SituationRoom@mea.gov.in చదవండి: భారత సైనికుల చేతికి అత్యాధునిక AK 200 రైఫిల్స్ -
ఆన్లైన్ మోసాలపై హెల్ప్‌లైన్ అస్త్రం
న్యూఢిల్లీ: మీరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారా? వారి మాయమాటలు నమ్మి, సొమ్ము బదిలీ చేశారా? ఓటీపీలు, క్రెడిట్‌కార్డుల వివరాలు చెప్పేశారా? సాధారణంగా మీరు సైబర్‌క్రైమ్ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసే లోపే నేరగాళ్లు డబ్బును తమ ఖాతాల నుంచి ఉపసంహరించేసుకుంటారు. ఇలాంటి మోసాలను ఆపి నేరగాళ్ల అకౌంట్లను స్తంభింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించింది. మోసాన్ని గుర్తించి (మీ అకౌంట్ల నుంచి డబ్బు పోయినట్లు గుర్తించగానే) వెంటనే ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోంశాఖ హెల్ప్‌లైన్ నంబర్ 155260 అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్‌లో నంబర్‌ను ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులోకొచ్చింది. ఆర్బీఐసహా అన్ని ప్రధాన బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, వ్యాలెట్లు, ఆన్లైన్ వాణిజ్య సంస్థ సహకారంతో ఈ హెల్ప్‌లైన్‌ను హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి) నిర్వహిస్తోంది. ఈ మేరకు సిటిజెన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్, మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్) హెల్ప్‌లైన్ అమల్లో ఉంది. డబ్బును ఆన్లైన్ ద్వారా బదిలీ చేసిన తర్వాత త్వరగా ఫిర్యాదు చేస్తే వెనక్కి రప్పించడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సదరు డబ్బు డిజిటల్ ఎకోసిస్టమ్ నుంచి బయటకు వెళ్లక ముందే అప్రమత్తమైతే చాలావరకు వెనక్కి వస్తుందని అంటున్నారు. అమాయకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును సైబర్ నేరస్తులు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు.. ఇలా ఐదు బ్యాంకుల ఖాతాల్లోకి మార్చినప్పటికీ సిటిజెన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్, మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అధికారులు వెనక్కి రప్పించగలిగారు. -
ఆధార్ సేవా కేంద్రాల కోసం హెల్ప్‌లైన్
న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల కోసం అందిస్తున్న సేవలను చాలావరకు డిజిటల్ విధానంలోకి మారుస్తుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) కూడా తన ఆధార్ సేవలను డిజిటల్ రూపంలోకి మార్చింది. తాజాగా మరికొన్ని సేవలను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ప్రజలు ఇంటి నుంచి ఆన్లైన్ ద్వారా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. కొన్ని సేవల కోసం తప్పని సరిగా దగ్గరలోని ఆధార్ సేవా కేంద్రాల వద్దకు వెళ్లాలని సూచించింది. మీ దగ్గరలోని ఆధార్ సేవ కేంద్రం తెలుసుకోవడం కోసం ప్రజలు 1947 ఆధార్ హెల్ప్‌లైన్ నంబర్‌ను డయల్ చేసి దగ్గర్లో ఉన్న ఆధార్ సేవా కేంద్రాల అడ్రస్ తెలుసుకోవచ్చు అని తాజా ట్వీట్లో యుఐడిఎఐ తెలిపింది. అలాగే ఎమ్-ఆధార్ యాప్‌ను కూడా వాడుకోవచ్చని యూఐడీఏఐ ట్వీట్ చేసింది.(చదవండి: అమెరికాను గడగడలాడించిన హ్యాకర్?) #Dial1947AadhaarHelpline You can locate your nearest Aadhaar Kendra with the details like address of the authorized centers in the area by simply dialing 1947 from your mobile or landline . You can also locate an Aadhaar Center using mAadhaar App pic.twitter.com/c0f1OgWsUp — Aadhaar (@UIDAI) February 2, 2021 -
‘మేరీ సహేలీ’తో మహిళా ప్రయాణికులకు రక్ష
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): రైళ్లలో ప్రయాణించే మహిళల భద్రతే ముఖ్య ఉద్దేశంగా మేరీ సహేలీ(మై ఫ్రెండ్) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రైల్వే భద్రతా దళం(ఆర్పీఎఫ్) అందుబాటులోకి తీసుకొచ్చింది. శనివారం విశాఖ రైల్వే స్టేషన్లో సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ జితేంద్ర శ్రీవాస్తవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోదావరి స్పెషల్ ఎక్స్‌ప్రెస్, ఏపీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్ల వద్ద మహిళా ప్రయాణికులకు ఆర్పీఎఫ్ సిబ్బంది అవగాహన కల్పించారు. భద్రత ఇలా: ఆర్పీఎఫ్ సిబ్బంది ముందుగా మహిళా ప్రయాణికుల సీటు, బెర్త్, కోచ్ నంబర్లు తదితర సమాచారం సేకరించి వారిని అప్రమత్తం చేస్తారు. ఇదే సమాచారాన్ని ఆ రైలు ప్రయాణించే అన్ని స్టేషన్లలోని ఆర్పీఎఫ్ సిబ్బందికి ఆందజేస్తారు. ఆ రైలు ఆ స్టేషన్‌కు వెళ్లే సమయానికి అక్కడ ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయాణికుల వద్దకు వెళ్తారు. వారి స్థితిని తెలుసుకుంటారు. ఇలా ఆ రైలు గమ్యం చేరే వరకు ప్రతి స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది వారిని అనుసరిస్తుంటారు. అత్యవసరమైతే ఉచిత హెల్ప్‌లైన్ 182 నంబర్లో సంప్రదించాలని ప్రయాణికులకు చెబుతున్నారు. -
కరోనా : వేడి వేడి సమోసా కావాలా నాయనా!
మహమ్మారి కరోనాను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోంది. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. అయితే ఇలాంటి కష్ట సమయంలో కూడా ఒక ఆకతాయి తన బుద్ధిని బయటపెట్టుకున్నాడు. బాధితులకోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి ఒక వింత కోరిక కోరాడు. దీంతో అప్పటికే ఇలాంటి అసంబద్ద కాల్స్ తో విసుగు చెందిన జిల్లా ఉన్నతాధికారి సదరు వ్యక్తికి తగిన రీతిలో బుద్ధి చెప్పారు. అంతేకాదు సంక్షోభ సమయంలో కీలకమైన సేవలందిస్తున్న సమయంలో ఇలాంటి పిచ్చి పిచ్చి కాల్స్ తో విసిగిస్తే.. ఇలాంటి గుణపాఠమే చెబుతామంటూ హెచ్చరించారు. కరోనా బాధితుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రాంపూర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసిన ఒక వ్యక్తి తనకు వేడి వేడి సమోసాలు కావాలని కోరాడు. అంతకు ముందు పిజ్జా డెలివరీ కావాలని అడిగాడు. పలుమార్లు ఇలాగే చేయడంతో చిర్రెత్తుకొచ్చిన డిఎం ఆంజనేయ కుమార్ సింగ్ అతగాడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అతను అడిగినట్టుగానే సమోసాలను అతనికి పంపించి, అనంతరం సదరు వ్యక్తిచేత డ్రైనేజీ శుభ్రం చేయించారు. దీనికి సంబంధించి ఆయనొక పోస్ట్ షేర్ చేశారు. తమ అమూల్య సమయాన్నివృధా చేస్తే ఇలానే వుంటుందనేసందేశాన్నిచ్చారు. నిబంధనలు పాటిస్తూ ప్రజలు సురక్షితంగా వుండాలని సూచించారు. దీంతో డీఎం చర్యను పలువురు నెటిజన్లు అభినందించారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న వారిని ఇలా విసిగించడం తగదని మండిపడుతున్నారు. కలిసికట్టుగా పోరాడి కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టాలని పిలుపునివ్వడం విశేషం. नाली साफ कर सामाजिक कार्य में योगदान देकर प्रशासन को सहयोग देते व्यवस्था का दुरुपयोग करने वाले व्यक्ति। राष्ट्रीय आपदा के समय आप सभी का सहयोग प्रार्थनीय है। जिम्मेदार नागरिक बनें। स्वस्थ रहें। सुरक्षित रहें। pic.twitter.com/4vMMp97OLp — DM Rampur (@DeoRampur) March 29, 2020 -
ప్రయాణికుల కోసం ఒకే నంబర్: రైల్వే
న్యూ ఢిల్లీ: ప్రయాణికులకు రైల్వే సమాచార సౌకర్యం కోసం భారత రైల్వే ఇంటిగ్రేటెడ్ హెల్ప్‌లైన్ నంబర్ 139ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నంబర్‌ను జనవరి 1న భారత రైల్వే ప్రారంభించింది. గతంలో రైల్వే సమాచారం కోసం పలు రకాల సహాయక నంబర్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. కాగా ప్రయాణికులకు అన్నిరకాల సేవలను ఒకే నంబర్లతో అందించటం కోసం ఇండియన్ రైల్వే 139 నంబర్‌ను తీసుకువచ్చింది. దీంతో పాటు భారత రైల్వే ప్రయాణికుల కోసం ‘రైల్ మాడాడ్’ అనే యాప్‌ను లాంచ్ చేసింది. నూతన సంవత్సరం సందర్భంగా భారత రైల్వే గతంలో ఉన్న సహాయక నంబర్లు నిలిపివేసి 139 నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జనవరి 1 నుంచి కేవలం 139, 182 నంబర్లతో పాటు ‘రైల్ మాడాడ్’ పోర్టల్‌తో అన్ని సేవలను అందించనున్నట్లు భారత రైల్వే పేర్కొంది. సాధారణ ఫిర్యాదు సంఖ్య-138, క్యాటరింగ్ సేవ-1800111321, విజిలెన్స్-152210, ప్రమాదం, భద్రత- 1072, క్లీన్ మై కోచ్ - 58888/138, ఎస్ఎంఎస్ ఫిర్యాదు-9717630982 వంటి సహాయక నంబర్లు జనవరి ఒకటి నుంచి పనిచేయవని భారతీయ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. -
‘112’ అన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది
సాక్షి, న్యూఢిల్లీ: 112 నంబర్ ఆధారిత అత్యవసర స్పందన వ్యవస్థ పశ్చిమ బెంగాల్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ‘ఆపదలో ఉన్న వ్యక్తి 112ని ఆశ్రయిస్తే తక్షణం సహాయం అందుతుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది, లేదా వలంటీర్లు ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షిస్తారు. ఆపదలో ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నారు? ఎంత దూరంలో ఉన్నారు? వంటి వివరాలతో సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం అందుతుంది. 112 నెంబర్ యాప్ అమలు చేయడానికి అన్ని రాష్ట్రాలకు నిధులు కూడా సమకూర్చాం. బెంగాల్ మినహా మిగతా 27 రాష్ట్రాల్లో ఇది అమలవుతోంది.’అని పేర్కొన్నారు. -
ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ @ 112
న్యూఢిల్లీ: ఏకీకృత అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ ‘112’ను మంగళవారం 11 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించారు. పౌరుల భద్రత, ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ‘112’ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సేఫ్ సిటీ ప్రాజెక్టు మొదటి దశ అమలు చేయడానికి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబై నగరాల్లో నిర్భయ ఫండ్ కింద రూ.2,919 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టం (ఎఆర్‌ఎస్‌ఎస్) కింద ప్రవేశపెట్టిన 112 హెల్ప్‌లైన్ కింద ప్రస్తుతం పోలీసు (100), ఫైర్ (101), మహిళల హెల్ప్‌లైన్ (1090)లను అనుసంధానించగా, త్వరలోనే హెల్త్ హెల్ప్‌లైన్ (108)ను కూడా చేర్చనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కశ్మీర్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించారు. -
అటెన్షన్ టాక్స్ పేయర్స్..
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ ఇ-ఫైలింగ్‌లో పన్ను చెల్లింపుదారుల కోసం ఒక కొత్త హెల్ప్ లైన్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఇ-ఫైలింగ్ కోసం హెల్ప్ డెస్క్ నెంబర్లను మారుస్తున్నామంటూ సోమవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఇ-ఫైలింగ్( ఆన్లైన్ ద్వారా) పన్ను వివరాలను నమోదు చేసుకునే వారి కోసం ఆదాయపన్ను శాఖ కొత్త హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రకటించింది. అడ్వైజరీ ద్వారా ఐటీశాఖ నేడు కొత్త నెంబర్లతో ఈ ప్రకటన జారీ చేసింది. టోల్ ఫ్రీ నెంబర్18001030025, డైరక్ట్ నెంబర్ 918046122000 కొత్త నెంబర్లు పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉంటాయని ఐటీశాఖ వెల్లడించింది. https://www.incometaxindiaefiling.gov.in. వెబ్ పోర్టల్ ద్వారా పన్నుదారులు తమ పన్నులకు సంబంధించిన అంశాలను ఈ-ఫైయిలింగ్ చేసుకోవచ్చు. పోర్టల్‌లో ఐటీఆర్ ఫారం దాఖలు సందర్భంగా ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే ఈ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించ వచ్చని సీనియర్ అధికారి తెలిపారు. -
‘మిషన్ కాకతీయ’ హెల్ప్‌లైన్ ప్రారంభించిన మంత్రి హరీష్
హైదరాబాద్ సిటీ: మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుధ్దరణపై ప్రజల నుంచి నేరుగా సూచనలు, సలహాలు స్వీకరించేందుకు రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఆరంభించింది. గురువారం జలసౌధలో జరిగిన కార్యక్రమంలో నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీష్‌రావు హెల్ప్‌లైన్ నెంబర్ 040-23472233ని ఆరంభించారు. ఈ హెల్ప్‌లైన్ నిర్వహణ కోసం ఇద్దరు ఈఈ, డీఈ, జేఈలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, చెరువుల పునరుధ్దరణ పనుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు భాగ స్వాములై పూడికమట్టిని తరలించుకుపోవడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. -
హెల్ప్‌లైన్‌కు కార్పొరేటర్ల మోకాలడ్డు
భివండీ, న్యూస్‌లైన్ : భివండీ కార్పొరేషన్ పట్టణ ప్రజల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ నంబర్ ప్రారంభించనుంది. వివిధ సమస్యలపై ప్రజలు నేరుగా ఆయా విభాగాల అధికారులకు ఫిర్యాదులు చేయడానికి కార్పొరేషన్ కమిషనర్ జీవన్ సోనావణే 997001312 అనే హెల్ప్ లైన్ నంబర్ ప్రాంభించాలని సంకల్పించారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కానీ, కొందరు కార్పొరేటర్ల నుండి వ్యతిరేకత రావడంతో ఇది అటకెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలకు ఇబ్బందిలేకుండా.. భివండీ మున్సిపల్ కార్పొరేషన్ 26 కి.మీ. మేర విస్తరించి ఉంది. ప్రజల ఫిర్యాదులు ఏమైనా చేయాలంటే కార్యాలయానికి వ్యయప్రయాసాలకు ఓర్చి రావల్సి వస్తోంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు హెల్ప్ లైన్ ప్రారంభించాలని కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు ఆరోగ్య విభాగం-బి 01, విద్యుత్ శాఖ-02, నీటి పారుదల శాఖ-03, నిర్మాణ శాఖ-04, లెసైన్స్ శాఖ-05, టౌన్ ప్లానింగ్ శాఖ-06, పన్ను చెల్లింపు శాఖ-07, అగ్నిమాపక శాఖ-08, ఉద్యాన వన విభాగం-09, వైద్య ఆరోగ్య విభాగం-10 ఇలా ఇంటర్ కామ్ నంబర్లను కేటాయించారు. కార్పొరేటర్ల వ్యతిరేకత ప్రజల కోసం హెల్ప్‌లైన్ నంబర్ ప్రారంభించడాన్ని కొందరు కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నెంబర్ వల్ల ప్రజలతో ఉన్న సత్సంబంధాలు దెబ్బతింటాయని కొందరు ఇటీవల జరిగిన మహాసభలో కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. హెల్ప్‌లైన్ నెంబర్ ప్రారంభించడంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీంతో ఇది ప్రారంభానికి నోచుకొంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేటర్ల తీరుపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలకు సౌకర్యం కల్పిస్తాం కానీ కార్పొరేషన్ కమిషనర్ మాత్రం ప్రజల నుండి ఫిర్యాదులు చేయడానికి ఎలాగైనా సౌకర్యం కల్పిస్తామని అధికారులు అంటున్నారు. ఈ విషయమై జీవన్ సోనావణే‘ న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. ఒకవేళ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తే ఎస్సెమ్మెస్ సేవలనుఅందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. -
కోల్‌కతాకు బయలుదేరిన మంత్రి గంటా
విశాఖ : మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ఉదయం కోల్‌కతాకు బయలుదేర్దారు. తీర్థయాత్రలకు వెళ్లి విషాహారం తిని అస్వస్థతకు గురైన తెలుగు వారిని ఆయన పరామర్శించనున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా కలెక్టర్ జీఎస్ఆర్కే ఆర్ విజయకుమార్ అస్వస్థతకు గురైన వారికి వైద్యం అందుతున్న తీరుపై కోల్‌కతా జాయింట్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. యాత్రికులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కాగా కోల్‌కతాలో అస్వస్థతకు గురైన వారికి అక్కడి అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నామని, ప్రభుత్వ ఖర్చులతో స్వస్థలాలకు చేరుస్తామని మంత్రి పి.నారాయణ తెలిపారు. -
ఒంగోలు వాసుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు
ఒంగోలు : తీర్థయాత్రలకు వెళ్లి కోల్‌కతాలో అస్వస్థతకు గురైన ఒంగోలు వాసుల కోసం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. బాధితుల బంధువులు తమవారి సమాచారం కోసం 88866 16005 హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. పుణ్యక్షేత్రాల సందర్శనార్థం ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్లిన 48 మంది రాష్ట్రవాసులు రెండు రోజుల క్రితం కోల్‌కతాలో విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బాధితులంతా ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన వారు. వీరిలో 27 మంది నెల్లూరు, కావలికి చెందిన వారు కాగా, ఒంగోలువాసులు 21 మంది ఉన్నారు. ఒక ప్రైవేటు పర్యాటక ఏజెన్సీ ప్యాకేజీలో వీరంతా గత నెల 29వ తేదీన ఒంగోలు నుంచి తీర్థయాత్రలకు వెళ్లారు. మరోవైపు తమవారి యోగక్షేమాల కోసం బంధువులు ఆత్రతగా ఎదురు చూస్తున్నారు. -
కోల్‌కతాలో తెలుగు యాత్రికులకు అస్వస్థత
కోల్‌కతాలో 48 మంది ఏపీ తీర్థ యాత్రీకులకు అస్వస్థత ఒంగోలు/నెల్లూరు/కావలి/హైదరాబాద్: పుణ్యక్షేత్రాల సందర్శనార్థం ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్లిన 48 మంది రాష్ట్రవాసులు రెండు రోజుల క్రితం కోల్‌కతాలో విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులంతా ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన వారు. వీరిలో 27 మంది నెల్లూరు, కావలికి చెందిన వారు కాగా, ఒంగోలువాసులు 21 మంది ఉన్నారు. ఒక ప్రైవేటు పర్యాటక ఏజెన్సీ ప్యాకేజీలో గత నెల 29వ తేదీన ఒంగోలు నుంచి పొదిలి గురుస్వామి నాయకత్వంలో వీరంతా పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. వీరిలో చాలా మంది బంధువులే. వీరు కాశీ, ప్రయాగ తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించిన అనంతరం కాళీమాత దర్శనం కోసం శుక్రవారం రైలులో కోల్‌కతా చేరారు. హౌరా రైల్వే స్టేషన్లో దిగగానే ఎదురుగా ఉన్న గణేశ్ భవన్ అనే హోటల్లో బస చేశారు. అక్కడి హోటల్లో అల్పాహారం, భోజనం తీసుకున్నారు. ఆ తర్వాత వారికి తీవ్రవాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. తొలుత వీరిని అక్కడి గాంధీ సొసైటీ ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో చిన్న పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురు బాలలు, ఐదుగురు మహిళలు ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం ఆదివారం సాయంత్రం వరకు 30 మందిని కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా, కోల్‌కతాలో అస్వస్థతకు గురైన వారికి అక్కడి అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నామని, ప్రభుత్వ ఖర్చులతో స్వస్థలాలకు చేరుస్తాం ఏపీ మంత్రి పి.నారాయణ తెలిపారు. -
ఇక జనతా దర్బార్ ఉండదు
ఆన్లైన్లో సమస్యలు చెప్పుకోవచ్చు: కేజ్రీవాల్ హాట్లైన్లను ఏర్పాటుచేస్తాం సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వారినుంచి వినతిపత్రాలు స్వీకరించే ఉద్దేశంతో ప్రారంభించిన జనతాదర్బార్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఇకపై జనతాదర్బార్ ఉండబోదని, ఆన్లైన్లో కానీ, హెల్ప్‌లైన్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను త్వరలో ప్రకటిస్తారని, సెక్రటేరియట్లో కూడా త్వరలో ఒక హెల్ప్బాక్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఊహించని స్థాయిలో ప్రజలు రావడం, నిర్వహణ లోపంతో కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ సచివాలయ ఆవరణలో మొట్టమొదటిసారిగా శనివారం నిర్వహించిన జనతా దర్బార్ రసాభాసగా మారిన విషయం తెలిసిందే. పటిష్ట ఏర్పాట్లతో మళ్లీ జనతా దర్బార్‌ను ఏర్పాటుచేస్తామని అప్పుడు ప్రకటించిన ముఖ్యమంత్రి.. తాజాగా ఆ కార్యక్రమాన్ని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తనను ప్రత్యక్షంగా కలవాలనుకునేవారి కోసం వారంలో ఒక రోజు రెండు నుంచి మూడుగంటల సమయం కేటాయిస్తానన్నారు. ప్రభుత్వం తనకు కల్పిస్తున్న జెడ్ కేటగిరీ భద్రతపై, వాటర్ ట్యాంకర్ మాఫియా, టెండర్ మాఫియా నుంచి ముప్పు ఉందన్న ఐబీ నివేదికలపై విలేకరులు ప్రశ్నించగా ‘నాకు భద్రత అవసరం లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ముఖ్యమంత్రులకు, మంత్రులకు భద్రత కల్పించడం ముఖ్యం కాదు. సామాన్యులకు రక్షణ కల్పించాలి’ అన్నారు. ఆప్‌కు జైకొట్టిన మేధా పాట్కర్ ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ప్రముఖ సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేధా పాట్కర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ తరఫున ఆమె బరిలోకి దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 200 ప్రజా సంఘాలతో ఏర్పడిన ‘నేషనల్ అలయెన్స్ ఫర్ పీపు ల్స్ మూవ్మెంట్స్’ కూటమికి మేధాపాట్కర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తారా అని అడగ్గా.. ‘నేను ఇప్పుడు దేన్నీ తోసిపుచ్చలేను. రాజకీయాలు అంటరానివని మేం భావించడం లేదు. మా ఆలోచనలు ఆ పార్టీ ఆలోచనలకు సారూప్యత ఉంది’ అని ఆమె చెప్పారు. ‘బీజేపీ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకోవాలి. మోడీకి బదులు గోవా సీఎం మనోహర్ పారికర్‌ను ప్రధాని బరిలో దించాలి’ అని ఆప్ సూచించింది. -
హస్తిన నుంచి అవినీతిని తరిమేద్దాం!
సాక్షి, న్యూఢిల్లీ: సాక్షి, న్యూఢిల్లీ: ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం ఇవ్వమని అడుగుతున్నాడా? అయితే అతనితో మీరు ఎలా వ్యవహరించాలనే విషయమై అవినీతి నిరోధక విభాగం అధికారులు సూచనలు, సలహాలు ఇస్తారు. ఆ ప్రకారంగా నడుచుకొని సదరు అవినీతి అధికారులను కటకటాల వెనక్కు తోయొచ్చు. అయితే ఈ విషయమై ముం దు మీరు అవినీతి నిరోధక విభాగాన్ని సంప్రదించా ల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనంతా సులభతరం చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ప్రకటించింది. ఎన్నికలకు ముందు.. హస్తిన నుంచి అవినీతిని తరిమేస్తామని హామీ ఇచ్చిన కేజ్రీవాల్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు ‘యాంటి కరప్షన్ డ్రైవ్’ను ఆయన బుధరవారం ఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ‘011-27357169’ హెల్ప్ లైన్ నంబర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ఇది హెల్ప్‌లైన్ నంబర్ మాత్రమే. దీనికి ఫిర్యాదు చేసే అవకాశం లేదు. ఈ నంబర్‌కు ఫోన్ చేసి, స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, ఆడియో లేదా వీడియో రికార్డింగుతో సాక్ష్యాన్ని అవినీతి నిరోధక విభాగానికి అప్పగించి లంచగొండి అధికారులను పట్టించవచ్చు. ఈ హెల్ప్‌లైన్ నంబరు ప్రతి ఢిల్లీవాసిని ఓ అవినీతి వ్యతిరేక ఉద్యమకారునిగా చేస్తుం ది. లంచగొండి అధికారులను భయపెట్టాలనేదే ఈ హెల్ప్‌లైన్ జారీ చేయడం వెనుకనున్న ప్రధాన ఉద్దేశం. ఈ హెల్ప్‌లైన్ గురించి ఢిల్లీ ప్రభుత్వం హోర్డింగుల ద్వారా, రేడియో జింగిల్స్ ద్వారా ప్రచా రం చేస్తుంది. ఉద యం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుంద’ని చెప్పారు. ‘అధికారులు ఎవరైనా లంచం అడిగితే నిరాకరించకండి. వారితో సెట్టింగ్ చేసుకొని మాకు తెలియచేయండి. మేం వారి భరతం పడతాం’ అని రామ్‌లీలామైదాన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున ప్రకటించినట్లుగా మరో హామీ ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను ముందుగా ప్రకటించినట్లుగా రెండు రోజులలోకాక పదిరోజుల తరువాత విడుదల చేశారు. విజిలెన్స్ విభాగంలో సమస్యల వల్ల ఈ హెల్ప్‌లైన్ నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి సమయం పట్టిందని కేజ్రీవాల్ చెప్పా రు. అయితే ప్రస్తుతం తాము జారీ చేసిన నం బరు కఠినంగా ఉందని, సులభంగా ఉండే నాలుగంకెల నంబర్‌ను మరో నాలుగైదు రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. హెల్ప్‌లైన్ ఎలా పనిచేస్తుందో కూడా ఆయన వివరించారు. ‘011-27357169 నంబరుకు ఫోన్చేసినట్లయితే ఫోన్ చేసిన వ్యక్తి పేరు, వారు చెప్పే మాటలు ఢిల్లీ ప్రభుత్వ కాల్సెంటర్లో రికార్డు అవుతాయి. ఆ తరువాత ఫోన్ చేసిన వ్యక్తికి అవినీతి నిరోధక విభాగం అధికారి నుంచి పోన్ వస్తుంది. ఫోన్ చేసిన అధికారి స్టింగ్ ఆపరేషన్ ఎలా నిర్వహించాలనేది తెలియచేస్తారు. ఈ సలహా మేరకు ఫోన్‌చేసిన వ్యక్తి తనను లంచం అడిగిన అధికారి మాటలను ఫోన్లో రికార్డు చేసి దానిని అవినీతి నిరోధక విభాగానికి సమర్పిస్తే అవినీతి నిరోధక విభాగం వలపన్ని లంచం అడిగిన అధికారిని పట్టుకుంటుంద’ని ఆయన చెప్పారు. ఢిల్లీవాసి అందించే వీడియా లేదా ఆడియో టేపులు కోర్టులో సాక్ష్యంగా కూడా పనికి వస్తాయన్నారు. ఈ హెల్ప్‌లైన్‌ను సమర్థంగా నిర్వహించడం కోసం అవినీతి నిరోధక విభాగం తగినన్ని బృందాలను సిద్ధంగా ఉంచిందని చెప్పారు. అవసరమైతే ఢిల్లీ పోలీసుల సహాయం తీసుకోవడానికి లెప్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడినట్లు ఆయన చెప్పారు.