
పౌర సరఫరాల శాఖలో పనిచేయని 1967 హెల్ప్‌లైన్
రూ.70 లక్షల బిల్లు పెండింగ్.. సేవల నిలిపివేత
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: ‘మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం మరో కాల్‌లో ఉన్నారు. దయచేసి వేచి ఉండండి.. లేదా మరలా ప్రయత్నించండి’ ఇదీ.. ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ హెల్ప్‌లైన్ నంబర్ 1967 తీరు. కూటమి ప్రభుత్వం వచ్చాక వినియోగదారులు ఎప్పుడు ఫోన్ చేసినా ఇలా బిజీటోన్ వినిపిస్తోంది. ఇక్కడేదో ప్రభుత్వం.. వినియోగదారుల సమస్యలను స్వీకరించి పరిష్కరిస్తోందనుకుంటే పొరపాటే. సర్వీసు ప్రొవైడర్‌కు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది.
ఫలితంగా కోట్లాది మంది వినియోగదారులకు సేవలందించే కాల్‌సెంటర్ మూగబోయింది. కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల హక్కుల రక్షణకు పెద్దపీట వేస్తూ టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి వెంటనే పరిష్కరించాలని చెబుతోంది. అయితే దీనికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కొన్ని నెలలుగా టోల్‌ఫ్రీ నంబర్ పనిచేయడం లేదు. వినియోగదారులు, ప్రజలు తమ సమస్యలను చెప్పుకొనేందుకు హెల్ప్‌లైన్‌కు డయల్ చేస్తే నిరాశే ఎదురవుతోంది.
సర్వీసు ప్రొవైడర్‌కు భారీ ఎత్తున బిల్లులు పెండింగ్ పెట్టడంతో సేవలు నిలిపివేసినా పట్టించుకోవట్లేదు. దాదాపు రూ.70 లక్షల వరకు బిల్లులు చెల్లించాలని తెలిసింది. గతేడాది చివర్లో దీపం–2 పథకాన్ని ప్రకటించినప్పుడు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆ ఒక్క నెలలోనే సుమారు రూ.8 లక్షల బిల్లు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే వినియోగదారులు ఎదుర్కొనే సమస్యల తీవ్రత ఇట్టే అర్థమవుతోంది.
ఐదు వ్యవస్థలకు ఒక్కటే నంబర్..
ఆహార కమిషన్, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరం, పౌరసరఫరాల సంస్థ, పౌరసరఫరాల శాఖ, తూనికలు–కొలతలు విభాగానికి సంబంధించి ఒక్కటే టోల్‌ఫ్రీ నంబర్ ఉంది. ధాన్యం సేకరణ సమయంలో రైతులకు ఇబ్బందులు ఎదురైతే ముందుగా 1967కే ఫోన్ చేస్తారు. ఇది గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం.
గతంలో అయితే రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించి సదరు రైతులకు తిరిగి ఫోను చేసి సమస్య పరిష్కారం అయ్యిందా? లేదా? కన్ఫర్మేషన్ తీసుకునే వ్యవస్థ నడిచింది. కానీ, కూటమి ప్రభుత్వ రాకతో ఫిర్యాదు పరిష్కారం మాట దేవుడెరుగు.. అసలు ఫిర్యాదు స్వీకరించే నాథుడే కరువయ్యాడు. హాస్టళ్లలో విద్యార్థులకు నాసిరకం భోజనం పెట్టిన సందర్భాల్లోనూ ఆహార కమిషన్‌కు హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ఫిర్యాదులు అందేవి.
ఇవేకాకుండా వినియోగదారులు వివిధ రకాల వస్తువుల కొనుగోలు సమయంలో, అధిక రేట్ల విక్రƇుుంచే దుకాణాల సమాచారాన్ని టోల్‌ఫ్రీ నంబర్ ద్వారానే చేరవేసేవారు. ఇలా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేసిన టోల్‌ఫ్రీ నంబర్‌ను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment