కొనుగోలు కేంద్రాలు క్లోజ్‌! | Government fails in Kharif grain procurement | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాలు క్లోజ్‌!

Published Tue, Mar 11 2025 5:09 AM | Last Updated on Tue, Mar 11 2025 5:09 AM

Government fails in Kharif grain procurement

ఖరీఫ్‌ ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం

దిగుబడుల అంచనాలకు దూరంగా సేకరణ 

33.50 లక్షల టన్నులే సేకరించిన సర్కార్‌

దిగుబడుల్లో 50 శాతం కూడా కొనుగోలు చేయని వైనం 

20–30 రోజులైనా నగదు జమ కావట్లేదని రైతుల ఆందోళన 

టన్నుకు సుమారు రూ.6వేలకు పైగా నష్టపోయిన అన్నదాతలు 

రైతులకు దక్కాల్సిన సుమారు రూ.2 వేల కోట్లకుపైగా మద్దతు ధరలో దోపిడీ.. శ్రీకాకుళం జిల్లాలో సేకరణ కేంద్రాల మూసివేత

సాక్షి, అమరావతి: ఇటు మద్దతు ధరలు లేవు.. అటు కొనుగోలు చేసే నాథుడు లేడు! ధాన్యం రైతులను టీడీపీ కూటమి సర్కారు ముప్పుతిప్పలు పెడుతోంది. రైతు సేవా కేంద్రాల్లో కేవలం పేరుకు మాత్రమే సేకరణ చేస్తూ అన్నదాతల కష్టాన్ని దళారులు, మిల్లర్లకు దోచిపెడుతోంది. సంక్రాంతి తర్వాత నూర్పిడులు చేసిన ధాన్యం రాసులు ఇప్పటికీ శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుప్పలుగా పంట పొలాల్లోనే కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ ముందస్తు దిగుబడి అంచనాలతో పోలిస్తే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం దారిదాపుల్లో కూడా లేదు.  

రబీ సాగు ఊపందుకున్నా.. 
పౌరసరఫరాల శాఖ మంత్రి జిల్లాల పర్యటనకు వెళ్లే సమయాల్లో లక్ష్యం తగ్గిపోతూ వచ్చింది. అతి కష్టంమీద 33. లక్షల టన్నులను సేకరించారు. గోదావరి జిల్లాల్లో జనవరి నెలాఖరు నుంచి కొనుగోళ్లు క్రమంగా నిలిపివేశారు. రబీ సాగు ఊపందుకున్న తరుణంలో ఇప్పటికీ ఖరీఫ్‌ రెండో ముందస్తు అంచనాలతోనే  కొట్టుమిట్టాడుతోంది. 

ఖరీఫ్‌లో సుమారు 35 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వ్యవసాయ శాఖ అక్టోబర్‌ ముందస్తు అంచనాల ప్రకారం 84 లక్షల టన్నుల దిగుబడి, జనవరి రెండో ముందస్తు అంచనా ప్ర­కారం 79 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. విపత్తులతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. ఇందులో ఎంత కాదనుకున్నా సుమారు 70 లక్షల టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది.  

అంచనాలకు ఆమడ దూరంలో కొనుగోళ్లు 
వైఎస్సార్‌ జిల్లాలో 1.71 లక్షల టన్నుల దిగుబడి అంచనా కాగా ప్రభుత్వం కొనుగోలు చేసింది 18 వేల టన్నుల ధాన్యం మాత్రమే. పల్నాడులో 2.25 లక్షల టన్నులు దిగుబడి అంచనా అయితే కొన్నది 12 వేల టన్నులే. బాపట్లలో దిగుబడి అంచనా 5.54 లక్షల టన్నులు అయితే 87 వేల టన్నులే కొనుగోలు చేశారు. 

గుంటూరులో 3.69 లక్షల టన్నులకు గాను 36 వేల టన్నులు కొన్నారు. అనకాపల్లిలో 2.70 లక్షల టన్నుల దిగుబడి రానుందని అంచనా వేస్తే 30 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఫైన్‌ వెరైటీలకు మార్కెట్‌లో పెద్దగా రేటు రాకపోవడంతో అన్నదాతలు కుదేలయ్యారు.  

రైతు సేవా కేంద్రాల వారీగా టార్గెట్లు 
ధాన్యం కొనుగోళ్లకు రైతు సేవా కేంద్రాల వారీగా ప్రభుత్వం టార్గెట్లు విధించింది. టార్గెట్‌ పూర్తయిన చోట ధాన్యం విక్రయించలేని పరిస్థితి నెలకొంది. గత నెలలో కృష్ణా జిల్లాలో, తాజాగా శ్రీకాకుళం జిల్లా­లో సిండికేట్‌గా మారిన మిల్లర్లు బ్యాంకు గ్యా­రంటీలు ఇవ్వకపోవడంతో రైతు సేవా కేంద్రాల్లో ధా­న్యం సేకరించడం లేదు. కనీసం ఆన్‌లైన్‌లో కూడా నమో­దు చేయడం లేదు. 

ధాన్యం కొనుగోలు షె­డ్యూల్‌ ఇస్తే గోతాలు వస్తాయి. వాటిల్లో పంటను భద్రపరిచి జాగ్రత్త చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ద­ళా­రులు, మిల్లర్ల కనుసన్నల్లో సేకరణ జరుగుతుండటంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో కూరుకుపోయారు. మధ్యవర్తులు, దళారులు, కమీషన్‌ ఏజెంట్లు నిర్దేశించిన రేటుకే తెగనమ్ముకోవాల్సి వస్తోంది.

బస్తాకు రూ.400–500 నష్టం 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధాన్యం సేకరణలో మిల్లర్లు, దళారుల దోపిడీని ప్రోత్సహించింది. 75 కేజీల బస్తా సాధారణ రకానికి రూ.1725, ఏ–గ్రేడ్‌కు రూ.1740గా మద్దతు ధర ప్రకటించింది. కానీ తేమ శాతం పేరుతో రైతుల నడ్డి విరిచేశారు. దీంతో రైతులు ఒక్కో బస్తా రూ.400 – 500 నష్టానికి విక్రయించిన దుస్థితి. దీంతో టన్నుకు సుమారు రూ.6 వేలకుపైగా నష్టం వాటిల్లింది. 

ఈ లెక్కన ప్రభుత్వం కొనుగోలు చేసిన రూ.7,790 కోట్ల విలువైన 33.80 లక్షల ట­న్నుల్లో రైతులకు దక్కాల్సిన సుమారు రూ.2 వేల కో­ట్లకు పైగా మద్దతు ధరను మధ్యవర్తులు, మిల్లర్లు మా­టున దోచేశారు. మిల్లరు కనుసైగ చేస్తే తప్ప కల్లాల్లో నుంచి ధాన్యం కదలని పరిస్థితి. పోనీ జీఎల్టీ వస్తుంది కదా అని రైతు సొంతంగా వాహనం సమకూర్చుకుని ధాన్యం తరలిద్దామనుకుంటే దించేందుకు ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.  

కుప్పల్లో.. కల్లాల్లోనే ధాన్యం 
శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి తర్వాతే పంట విక్రయానికి వస్తుంది. ఖరీఫ్‌లో 4.90 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు తాత్కాలిక టార్గెట్‌ ఇచ్చారు. ఇక్కడ 7.50 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుందని అంచనా. ప్రభుత్వం కావాలనే తక్కువగా ధాన్యం కొనుగోలు చేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కుప్పల్లో, కల్లాల్లో సుమారు 1.50 లక్షల టన్నుల వరకు ధాన్యం నిల్వలు కనిపిస్తున్నాయి. మరోవైపు ధాన్యం ఉన్న చోట్ల కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నారు. 

ఇచ్చాపురం, కవిటి, కంచలి, పలాస, రణస్థలం, లావేరు, ఎచెర్ల, తదితర మండలాల్లో 118 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేశారు. 20 – 30 రోజులు గడిచినా సొమ్ము ఖాతాల్లోకి జమ కావడం లేదని రైతులను వాపోతున్నారు. ఇదే అదనుగా దళారీలు 75 కిలోల బస్తాకు మద్దతు ధర కంటే సుమారు రూ.400–300 వరకు తగ్గించి కొంటున్నారు. నెల్లూరులో ఇప్పుడిప్పుడే పంట కోతకు రావడంతో తాత్కాలికంగా 20 వేల టన్నుల కొనుగోలుకు టార్గెట్‌ ఇచ్చారు.  

నాడు కట్టడి.. నేడు ఇష్టారాజ్యం.. 
వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉండగా ధాన్యం సేకరణలో దళారులు, మిల్లర్లు దందాను కట్టడి చేసింది. ప్రభుత్వమే సంపూర్ణ మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరిగింది. బహిరంగ మార్కెట్‌లో సైతం ధాన్యం రేట్లు పెరిగాయి. తొలిసారిగా దొడ్డు బియ్యానికి మంచి గిరాకీ లభించింది. తాము తక్కువ రేటు ఇస్తే రైతులు ప్రభుత్వానికే పంటను విక్రయిస్తారని గ్రహించిన దళారులు సైతం మద్దతు ధరకు మించి పంటను కొనుగోలు చేసిన సందర్భాలు తొలిసారిగా కనిపించాయి. 

కూటమి ప్రభుత్వం రాగానే మొత్తం పరిస్థితి తలకిందులైంది. సాధారణ రకాలకు మద్దతు ధర లేకపోగా బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న సన్నాలకు (ఫైన్‌ వెరైటీలు) ధర పడిపోయింది. గోదావరి డెల్టాలో బీపీటీ సాంబ మసూరి రకాన్ని పండించిన రైతులకు దళారులు చుక్కలు చూపించారు. 7

5 కిలోల బస్తా రూ.2,500 పలుకుతుందని రైతులు ఆశించగా రూ.1,400 – రూ.1,500కి మించి కొనలేదు. కడప ప్రాంతంలోనూ సన్నాలకు ధర లేక రైతులు అవస్థలు పడ్డారు. కృష్ణా డెల్టాలో అధికంగా పండించే ఎంటీయూ–1262, ఎంటీయూ–1318 సూపర్‌ ఫైన్‌ వెరైటీ రకాలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement