grain
-
నడి రోడ్డుపై అన్నదాతకు అవమానం
పది మందికి అన్నం పెట్టే అన్నదాతను అగచాట్లకు గురిచేసింది. కూటమి ప్రభుత్వం నడి రోడ్డుపై అవమానించింది. నూతన సంవత్సరం వేళ మిల్లర్లతో కలిసి అన్నదాతలతో ఆడుకుంది. ఆరుగాలం శ్రమించి పంటను అమ్ముకునేందుకు వెళ్లిన రైతులను నడిరోడ్డుపై నిలబెట్టింది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ప్రియాగ్రహారంలో బుధవారం జరిగిన ఈ ఘటన రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది.పోలాకి: ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల ధాన్యం రంగుమారింది. ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా వదిలేసింది. ఇదే అదనుగా కొందరు మిల్లర్లు అక్రమాలకు తెగబడుతున్నారు. తేమ పేరిట రైతులను నిలువునా దగా చేస్తున్నారు. అధికారులూ మిల్లర్లకే అమ్మాలని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం, మిల్లర్లు కలిసి ఆడుతున్న ఈ ఆటలో రైతులు నలిగిపోతున్నారు. బుధవారం పొలాకి మండలం ప్రియాగ్రహారంలో 20 మంది అన్నదాతలు నడిరోడ్డుపై నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రియాగ్రహారానికి చెందిన రైతులు బుధవారం రైతు సేవా కేంద్రానికి వెళ్లి ధాన్యానికి ట్రక్‌షీట్ వేయాలని కోరారు. ధాన్యం శాంపిల్ చూసిన సిబ్బంది.. తాము తేమ శాతం మాత్రమే నిర్థారించగలమని, రంగు మారినట్లు కనిపిస్తున్నందున మిల్లర్‌ను సంప్రదించాలని చెప్పారు. రైతులు మిల్లర్ దగ్గరకు వెళ్లగా.. మద్దతు ధర ఇవ్వలేనంటూ కరాఖండిగా చెప్పేశారు. కొద్దిసేపటికి మిల్లర్ తరపున దళారీ ఎంటరయ్యాడు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర (80 కేజీలు) రూ.1,840 కాగా.. రైతు సొంత ఖర్చులతో ధాన్యాన్ని మిల్లు వద్ద చేర్చేలా రూ.1,700కు దళారీ రేటు మాట్లాడాడు. గత్యంతరం లేక రైతులు అంగీకరించారు. ధాన్యం ట్రాక్టర్లకు లోడ్ చేశారు. ఇంతలో మిల్లర్ మళ్లీ మాటమార్చేశాడు. ఆ ధాన్యం తమకు వద్దని, రూ.1,500 మాత్రమే ఇస్తామని, లేదంటే అసలు తీసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో రైతులు నిర్ఘాంతపోయారు. సొంత ఖర్చులతో ధాన్యం తెచ్చిన తర్వాత తీసుకోకపోతే ఎలా అంటూ రోడ్డపైన ఆందోళనకు దిగారు. రైతంటే ఇంత చిన్నాచూపా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య మండలం అంతా ఉందని రైతులు తెలిపారు. బియ్యం బాగున్నా కొనరెందుకు?ధాన్యం పైకి రంగు మారినట్లు కనిపిస్తున్నా, లోపల బియ్యం బాగుందని రైతులు చెబుతున్నారు. రంగు మారిన ధాన్యం నుంచి తీసిన బియ్యాన్ని వారు చూపించి, నాణ్యత ఏమాత్రం తగ్గలేదని తెలిపారు. అయినా ఎందుకు కొనడంలేదని నిలదీశారు. రైతులకు జరిగిన అవమానాన్ని, వారి ఆవేదనను ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మిల్లర్లకు నచ్చజెప్పారు. మిల్లర్లు చెప్పిన ధరకు, మద్దతు ధరకు మధ్యస్తంగా మరో ధరకు రైతులను బలవంతంగా ఒప్పించారు.అవగాహన కల్పిస్తాంధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. రంగు మారిన ధాన్యంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానందున మిల్లర్లు కొనడంలేదు. తుపాను ప్రభావం నేపథ్యంలో రైతుల వద్ద ఉన్న రంగు మారిన ధాన్యంపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాత రైతులకు తెలియజేస్తాం. – ఎం.సురేష్‌కుమార్, తహశీల్దార్, పోలాకిరైతులను వంచించారువర్షంతో పంట నేలవాలి అనేక గ్రామాల్లో ధాన్యం రంగు మారటంతో రైతులంతా నష్టపోయారు. అన్నదాతకు అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం మమ్మల్ని వంచించింది. నూతన సంవత్సర ఆరంభం రోజున నడిరోడ్డుపై నిలబెట్టింది. అధికారులు మా సమస్య పరిష్కరించకుండా నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు లైన్లో నిలబడ్డారు. – దుర్రు యర్రయ్య, రైతు, ప్రియాగ్రహారంమళ్లీ దళారుల రాజ్యమే..పంట కొనుగోలులో మళ్లీ దళారుల రాజ్యం వచ్చింది. చాలాచోట్ల మిల్లర్లు దళారులతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని రైతులను నిలువునా ముంచుతున్నారు. మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ పూర్తయ్యేలా కొనుగోలు చేసినట్లు రికార్డులు చూపించి, ఎంపిక చేసిన వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నారు. వాస్తవానికి ఆ రైతులు ధాన్యం నూర్పిడి కూడా చేయడంలేదు. ఇది ముమ్మాటికీ మోసమే. ఇలాంటి వాటిపై ప్రతి మండలంలో మిల్లర్ల వారీగా అధికారులు సూక్ష్మ పరిశీలన చేయాలి. – కరిమి రాజేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ -
రైతుకు దక్కాల్సిన సొమ్ములో 30% తినేస్తున్నారు
సాక్షి, అమరావతి: ధాన్యం సేకరణలో రైతుకు తీరని అన్యాయం జరుగుతోంది. అలా అనడం కంటే ప్రభుత్వమే రైతుకు అన్యాయం చేస్తోందని చెప్పడం కరెక్ట్. రైతుకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. కల్లాల్లో ధాన్యం పెట్టుకొని ధాన్యం విక్రయించడానికి ఎదురుచూసు్తన్న రైతు బలహీనతను ఆసరాగా చేసుకొని దళారులు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోకపోగా ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం మిల్లర్లు, దళారులతో కలిసి ధాన్యం రైతులకు దక్కాల్సిన సొమ్ములో నేరుగా 30% తినేస్తోంది. మిల్లర్లు–దళారుల దోపిడీని నిలువరించాల్సిన ప్రభుత్వ పెద్దలు.. ప్రచార ఆర్భాటానికి ధాన్యం సేకరణ అంశాన్ని ఉపయోగించుకుని జబ్బలు చరుచుకుంటున్నారు. దోపిడీ సాగుతున్న తీరు ఇలా..మద్దతు ధరలోనూ 30–40 శాతానికి పైగా లూటీరైతులకు చెల్లించాల్సిన కనీస మద్దతు ధరలో 30–40 శాతానికి పైగా లూటీ అవుతోంది. ఖరీఫ్ సీజన్లో 32.75 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించగా.. దాన్ని ఇటీవలే 37 లక్షల టన్నులకు పెంచారు. ఇప్పటివరకు 22 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. మరో 15 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. అత్యధికంగా ఉత్తరాంధ్రలోనే 5.20 లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 2.50 లక్షల టన్నులు, ఎన్టీఆర్ జిల్లాలో లక్ష టన్నులు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1.50 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు సేకరించిన ధాన్యంలో 90 శాతానికి పైగా రైతుల పేరిట దళారులే సేకరించారు. ఇప్పటివరకు తాము సేకరించామని చెబుతున్న ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రకారం రైతులకు రూ.5,397 కోట్లు చెల్లించినట్టుగా చెబుతున్నారు. కానీ.. ఇందులో వివిధ రూపాల్లో రూ.1,618 కోట్లకు పైగా.. అంటే 30 శాతానికి పైగా స్వాహా అయినట్టు తెలుస్తోంది.మిల్లర్లతో కుమ్మక్కుమిల్లర్లతో కొనుగోలు కేంద్రాల సిబ్బంది కుమ్మక్కయ్యారు. ఆర్ఎస్కేలలో నిర్ధారించిన తేమ శాతానికి అమ్మించేలా మిల్లర్లను ఒప్పించాల్సింది పోయి, మిల్లర్లు నిర్ధారించిన తేమ శాతానికి అమ్ముకోవాలంటూ రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆర్ఎస్కేల్లో 17 శాతం ఉందని నిర్ధారించిన ధాన్యాన్ని మిల్లు దగ్గరకు తీసుకెళితే ధాన్యంలో ధూళి, దుమ్ము ఉందనే సాకుతో 18–20 శాతంగా నమోదు చేస్తున్నారు. దోపిడీ కోసమే ఇలా పొంతనలేని లెక్కలు చెబుతున్నారు. పొరుగు జిల్లాల నుంచి వచ్చే మిల్లర్లు సైతం 16–17 తేమ శాతం ఉన్న ధాన్యాన్ని 18–21 శాతం వరకు నిర్ధారించి మీకు నచ్చితే లోడింగ్ చేస్తాం, లేకుంటే పట్టుకెళ్లిపోండని తెగేసి చెబుతున్నారు.దళారులు పంపిస్తే గంటలోనే అన్లోడింగ్దళారులు ప్రారంభంలో రైతులకు మద్దతు ధర 75 కేజీల బస్తాకు రూ.1,350 నుంచి రూ.1,500 మధ్య చెల్లించేవారు. ప్రస్తుతం కాస్త పెంచి రూ.1,500 నుంచి రూ.1,600 మధ్య చెల్లిస్తున్నారు. అదే ఎంటీయూ 1262, 1318 రకం ధాన్యానికైతే నేటికీ రూ.1,100 నుంచి రూ.1,300 మధ్యే చెల్లిస్తున్నారు. ఫలితంగా 75 కేజీల బస్తా దగ్గరే 125 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలు, మిల్లర్ల వేధింపులు తట్టుకోలేక చివరకు దళారులకే ధాన్యాన్ని ఇచ్చి మిల్లులకు పంపిస్తున్నారు. కాగా.. దళారులు తెచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు గంటలోనే అన్లోడ్ చేసుకుంటున్నారు. అదే రైతు నేరుగా తీసుకెళ్తే అన్‌లోడింగ్‌కు 24 నుంచి 48 గంటల సమయం పడుతోంది. మొహం చాటేస్తున్న మిల్లర్లువర్షాలతో ధాన్యంలో తేమ శాతం పెరిగిపోతోంది. ఎంత ఆరబెట్టినా మిల్లు వద్ద 25 శాతం కన్నా తక్కువ తేమ చూపడం లేదు. తేమ శాతం వంకతో మిల్లర్లు కొనేందుకు కూడా మొహం చాటేస్తున్నారు. ధాన్యం వ్యాపారులు 75 కేజీల బస్తాకు రూ.1,100.. మహా అయితే రూ.1,200కు మించి ఇవ్వలేమని తెగేసి చెబుతున్నారు. ఏం చేయాలో పాలుపోక రైతులు దిక్కులు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ధాన్యం సొమ్ములు గంటలోనే జమ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ సాంకేతిక కారణాల సాకుతో 15 నుంచి నెల రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.పక్కదారి పడుతోందిలా..సాధారణంగా రైతులు కోసిన ధాన్యాన్ని 40 కేజీల చొప్పున బస్తాలలో కాటా వేస్తారు. గోనె సంచి బరువు మరో 500 గ్రాములు కలిపి 40.50 కేజీల చొప్పున కాటా వేయాలి. కానీ.. 41.50 కేజీల వరకు కాటా తూస్తున్నారు. అంటే కేవలం 40 కేజీల కిట్టీ దగ్గరే ఏకంగా కిలో చొప్పున టన్నుకు 25 కేజీలకుపైగా నష్టపోతున్నారు. అంటే కిలోకు రూ.23 చొప్పున 25 కిలోలకు రూ.575 చొప్పున ప్రతి టన్నుకూ రైతులకు నష్టం వాటిల్లుతోంది. ఇక తేమ శాతం విషయానికి వస్తే 17 శాతం వరకు తేమ ఉంటే పూర్తిస్థాయి మద్దతు ధర (క్వింటాకు రూ.2,300) చొప్పున చెల్లించాలి. కానీ.. బూతద్దం పెట్టి వెతికినా పూర్తిస్థాయి మద్దతు ధర రైతులకు దక్కడం లేదు. నిబంధనల ప్రకారం తేమ 17 శాతం ఉన్నా 75 కేజీల బస్తాకు కేజీన్నర నుంచి రెండున్నర కేజీల చొప్పున తరుగు మినహాయిస్తున్నారు. అంటే ఇక్కడ టన్నుకు 35–40 కేజీలు చొప్పున రూ.920 నష్టపోతున్నాడు. తేమ శాతం 17 దాటితే ఒక్కో శాతానికి రెండున్నర కేజీల వరకు తరుగు మినహాయిస్తున్నారు. 25 శాతం తేమ ఉంటే బస్తాకు 8–12 కేజీల చొప్పున కోత పడుతోంది. ఈ విధంగా టన్నుకు 140 కేజీల చొప్పున రూ.3,864 మేర రైతులకు నష్టం వాటిల్లుతోంది. నిబంధనల మేరకు తేమ శాతం ఉన్నా సరే టన్నుకు రూ.1,495 నష్టపోతుంటే.. తేమ శాతం గనుక 17–25 మధ్య ఉంటే టన్నుకు రూ.5,355 వరకు నష్టపోతున్నారు. అంటే టన్నుకు రూ.23 వేలు దక్కాల్సిన రైతులకు కేవలం సుమారు రూ.17 వేలు మాత్రమే దక్కుతోంది. మిగిలిన మొత్తం దళారులు, మిల్లర్లు స్వాహా చేస్తున్నారు. వారినుంచి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులకు వాటాలు ముడుతున్నాయి.తేమ శాతంలో పొంతన లేని లెక్కలుధాన్యం కొనుగోలులో దోపిడీకి కూటమి ప్రభుత్వమే దగ్గరుండి ద్వారాలు తెరిచింది. దళారులు, మిల్లర్ల ప్రమేయం లేకుండా గడచిన ఐదేళ్లుగా అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరిగితే.. ప్రస్తుతం మిల్లర్ల కనుసన్నల్లోనే «కొనుగోళ్లు జరిగే పరిస్థితి నెలకొంది. తొలుత 25 శాతం వరకు తరుగు లేకుండానే తీసుకుంటామని తొలుత చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత మాటమార్చి 17 శాతం దాటితే ఐదు కేజీలు తరుగుతో తీసుకుంటామని ప్రకటించింది. చివరకు నిబంధనల మేరకు 17 శాతం తేమ ఉన్నా సరే పూర్తి మద్దతు ధర చెల్లించే పరిస్థితి కన్పించడం లేదు. గతంలో రైతు భరోసా కేంద్రాల్లో నిర్ధారించిన తేమ శాతమే ఫైనల్. అదే తేమ శాతానికి మద్దతు ధర లెక్కగట్టి రైతులకు జమ చేసేవారు. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే)తో పాటు మిల్లుల వద్ద కూడా తేమ శాతాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ రెండుచోట్ల నిర్ధారిస్తున్న తేమ శాతానికి పొంతన లేకుండా పోతోంది.కాళ్లా వేళ్లా పడినా కొనడం లేదు ఈ రైతు పేరు గుడవర్తి వెంకట సుబ్బరాజు. బాపట్ల జిల్లా మంతెనవారిపాలేనికి చెందిన సుబ్బరాజు పదెకరాల్లో ఎంటీయూ–1262 రకం సాగు చేశారు. ఈ నెల 16న కోయగా.. ఎకరాకు 35 బస్తాల చొప్పున 350 బస్తాల దిగుబడి వచ్చింది. 8 రోజులు ఆరబెట్టి.. 24వ తేదీన రైతు సేవా కేంద్రంలో తేమ పరిశీలిస్తే 23 శాతం వచ్చింది. బాపట్ల ఉప్పరపాలెం రైసుమిల్లుకు అదే రోజున 100 బస్తాలను తోలితే 23 శాతం తేమ ఉందని 5 కేజీల తరుగుతో తీసుకున్నారు. బుధవారం మరో 200 బస్తాలు తీసుకెళ్తే 27 శాతం తేమ ఉంది. మీ ధాన్యం మాకొద్దని తెగేసి చెప్పారు. ‘తరుగు ఎంతైనా తీసుకోండి. మీకు నచ్చిన ధర ఇచ్చి ధాన్యం దింపుకోండ’ని కాళ్లావేళ్లా పడినా మిల్లు యాజమాన్యం పట్టించుకోలేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. మిల్లర్ ఏం చెబితే అదే ఫైనల్ అన్నారు. వాతావరణం చూస్తే గంటకోలా మారుతోంది. చేసేది లేక టార్పాలిన్లు అద్దెకు తెచ్చి మిల్లు ఎదుటే ట్రాక్టర్లో ఉన్న ధాన్యం బస్తాలపై కప్పి అక్కడే పడిగాపులు పడుతున్నాను. ఉదయం నుంచి తిండీ తిప్పల్లేవు. ఏంచేయాలో పాలుపోవడం లేద’ని సుబ్బరాజు కన్నీరుమున్నీరయ్యారు.బస్తాకు రూ.1,470కు మించి ఇవ్వడం లేదు ఈ రైతు పేరు కొండవీటి వెంకటసుబ్బారావు. కృష్ణా జిల్లా మంతెనకు చెందిన ఈయన నాలుగు ఎకరాల్లో ఎంటీయూ–2077 వరి సాగు చేసారు. బుడమేరు ముంపు వల్ల ఎకరాకు 30 బస్తాలకు మించి రాలేదు. రైతు సేవా కేంద్రానికి శాంపిల్ తీసుకెళ్లి తేమ శాతం చూడమంటే.. ‘అవసరం లేదు నేరుగా మిల్లుకు తీసుకుపొండి..అక్కడ వాళ్లు చెప్పిన తేమ శాతమే ఫైనల్’ అని కొనుగోలు కేంద్రం సిబ్బంది బదులిచ్చారు. దీంతో దాములూరులోని బాలాజీ రైస్‌మిల్లుకు 213 (ఒక్కొక్కటీ 40 కేజీల) బస్తాలు తీసుకెళితే 24 శాతం తేమ వచ్చింది. రెండో రోజు మరో 105 బస్తాలు తీసుకెళితే 26 శాతం వచ్చిందని చెప్పారు. దాదాపు 8 కేజీలు తరుగు తీసేశారు. 75 కేజీల బస్తాకు రూ.1,470 చొప్పున ఇస్తామన్నారు. అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు’ అని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు.పొంతన లేని తేమ లెక్కలు ఈ రైతు పేరు గుడిపూడి అవినాశ్. ఏలూరు జిల్లా దెందులూరుకు చెందిన ఈయన ఐదెకరాల్లో ఎంటీయూ–1318 రకం సాగు చేశారు. ఎకరాకు 33 బస్తాల దిగుబడివచ్చింది. 18న కోత కోయగా.. 23న రైతు సేవా కేంద్రంలో 17 శాతం తేమ వచ్చింది. అదే రోజున మారుతి మిల్లుకు 154 బస్తాలు తరలిస్తే.. అక్కడ తేమ శాతం 19గా చూపించారు. 75 కేజీల బస్తాకు రూ.1,725 ఇవ్వాల్సి ఉండగా.. రూ.1,650 చొప్పున ఇచ్చారు. రైతు సేవాకేంద్రంలో చెబుతున్న తేమ శాతానికి మిల్లులో చెబుతున్న తేమ శాతానికి పొంతన ఉండడం లేదు. ఇదేమిటని అడిగితే మీకు నచ్చకపోతే తీసుకెళ్లిపోవచ్చని మిల్లర్ చెబుతున్నారు. -
చకచకా కోత.. ఆరబోతకు వెత
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎకరం వరి పొలాన్ని ఒకే రోజులో కోయాలంటే గతంలో పన్నెండు మంది కూలీలు అవసరమయ్యేవారు. ఇలా కోసిన పంటను కుప్ప వేసి తూర్పారబట్టడం వరకు కనీసం రెండు వారాల సమయం పట్టేది. కానీ ఇప్పుడు హార్వెస్టర్ ఎకరం పొలాన్ని గంటలోనే కోసి ధాన్యం, గడ్డిని వేరు చేసి ఇస్తోంది.దీంతో రెండు వారాల్లో చేయాల్సిన పని ఒక గంటలోనే పూర్తవుతోంది. ఇదంతా పైకి బాగున్నట్టే కనిపిస్తున్నా ధాన్యం ఆరబెట్టేందుకు అవస్థలు తప్పడం లేదు. రాష్ట్రంలో నానాటికీ వరి సాగు పెరుగుతున్న నేపథ్యంలో ఆరబోత అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. తేమ చిక్కులు వరి కోసినప్పుడు సాధారణంగా 35 శాతం నుంచి 40 శాతం మధ్య ధాన్యంలో తేమ ఉంటుంది. ఈ తేమ 17 శాతం ఉంటేనే ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేస్తారు. గతంలో కొడవళ్లతో కోసి, తూర్పారబట్టే వరకు ధాన్యం పంట పొలాల్లోనే ఎండి సాధారణ స్థాయికి తేమ చేరేది. అయితే హార్వెస్టర్ కోత కావడంతో ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉంటోంది. దీనిని తగ్గించేందుకు రైతులు ఖాళీ స్థలాలు, రోడ్ల వెంట, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెడుతున్నారు. కూలీలను పెట్టి ప్రతీ అరగంటకు ఓసారి నెరుపుతున్నారు. దీంతో రైతులకు ఖర్చు పెరుగుతోంది. ధాన్యం ఆరబోత యంత్రాలు ధాన్యాన్ని ఆరబెట్టే మొబైల్ ప్యాడీ డ్రయర్ మిషన్లు మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. మోడళ్ల ఆధారంగా వీటిæ ధర రూ.8 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంది. గంట వ్యవధిలో ఒక ఎకరం పొలంలో పండిన ధాన్యాన్ని ఆరబెట్టడమే కాక తాలును వేరు చేస్తుంది. కోతల సమయాన హార్వెస్టర్ మాదిరే ఈ యంత్రాలతోనూ ప్రయోజనాలు ఉన్నాయి. మొబైల్ ప్యాడీ డ్రయర్ మిషన్లకు రాష్ట్ర రైతు సంక్షేమ శాఖ పరిధిలోని యాంత్రీకరణ– సాంకేతిక విభాగం 2023 జనవరి 23న ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు 60 శాతం సబ్సిడీ, ఇతరులకు 50 శాతం సబ్సిడీ అందించవచ్చని పేర్కొంది. ఈ నిర్ణయం వెలువడి దాదా రెండేళ్లు కావొస్తున్నా యంత్రాలు విరివిగా అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైంది. పది రోజులుగా ఇక్కడే... కల్లాల్లో ధాన్యం ఆరబోసి ఎప్పుడు అమ్ముడవుతుందా అని చూడాల్సి వస్తోంది. పది రోజులుగా కల్లాల దగ్గరే రాత్రీపగలు కాపలా ఉంటున్నాం. తేమ శాతం 17కు ఎప్పుడు చేరుతుందా అని ఎదురుచూస్తున్న. ఈ సమయంలో మబ్బులు పడితే భయం పుడుతోంది. – తడికల నర్సింగరావు, కుదునూరు, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ ఫొటోలో కనిపిస్తున్నది శ్మశానం.ఇల్లెందు మండలం కొమురారం గ్రామానికి చెందిన రైతులు రెండు, మూడు వారాల పాటు రేయింబవళ్లు ఇక్కడే ఉంటున్నారు. ఇదేమీ గ్రామ ఆచారం కాదు. ధాన్యం ఆరబెట్టేందుకు ఖాళీ స్థలం లేక శ్మశానమే వేదికగా మారింది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుదురునూరులో కొనుగోలు కేంద్రం. మబ్బులు పట్టి చినుకులు కురుస్తుండడంతో అప్రమత్తమైన రైతులు కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కుప్పలుగా పేరుస్తూ కవర్లుకప్పేస్తున్నారు. -
ధాన్యం వర్షార్పణం
దాచేపల్లి(పల్నాడు జిల్లా): ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణమైంది. నడికుడి వ్యవసాయ మార్కెట్‌యార్డులోని ఫ్లాట్‌ఫారాలపై రైతులు ఆరబోసిన ధాన్యం గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యింది. పలువురు రైతులు పొలంలో పండించిన వరి పంటని యంత్రాల ద్వారా కోసి నడికుడి మార్కెట్‌యార్డుకి ఆరబోసేందుకు తీసుకొచ్చారు. సుమారు మూడు వేలకుపైగా ధాన్యపు బస్తాలను సిమెంట్ ఫ్లాట్‌ఫారాలపై రైతులు ఆరబోశారు. ఆకస్మాత్తుగా తెల్లవారుజామున వర్షం కురవడంతో ఆరబోసిన ధాన్యం మొత్తం తడిసిపోయింది. వర్షపు నీటిలో కొంత ధాన్యం కొట్టుకుపోయింది. వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల వద్ద నుంచి రైతులు యార్డుకు చేరుకునేలోపే ధాన్యం వర్షంలో తడిసింది. వర్షపునీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని రైతులు అతికష్టం మీద ఒబ్బిడి చేసుకున్నారు. ఫ్లాట్‌ఫారంపై ఉన్న ధాన్యపు బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయి. రెండు, మూడు రోజులు ఆరబోసి అమ్ముకుందామని ఆశపడిన అన్నదాత తడిసిన ధాన్యం చూసి నీరుగారిపోయాడు. యార్డులో ఆరబోసిన ధాన్యం సైతం తడిసిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ధాన్యం దళారీగా సర్కారు
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వం ధాన్యం దళారీగా మారింది. రైతులకు, మిల్లర్లకు మధ్య మధ్యవర్తిత్వం నడుపుతోంది. మిల్లర్లు చెప్పిన ధరకు ధాన్యం ఇచ్చేయాలంటూ రైతులపై ఒత్తిడి తీసుకొస్తోంది. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ పూర్తిస్థాయిలో కనీస మద్దతు ధర దక్కడంలేదు. చరిత్రలో ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్థితులు చూడలేదు’.. అంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. తేమశాతంతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. గడిచిన రెండ్రోజులుగా మండల తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్బీకేలు, రైతుక్షేత్రాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశుల ఎదుట నిరసనలు వ్యక్తంచేసిన రైతులు బుధవారం విజయవాడలోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వివిధ మండలాల రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు, వివిధ రైతు సంఘాల నేతలు మాట్లాడారు. వారు ఏమన్నారంటే..మంత్రి చిటికలేసినా ధాన్యం కదల్లేదు..కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి, రోడ్లపై ఉన్న ధాన్యాన్ని సాయంత్రానికి కల్లా కాటావేసి మిల్లులకు తరలించాలని నాలుగు రోజుల క్రితం అధికారులకు చిటకలేసి మరీ చెప్పారు. రోజులు గడుస్తున్నా గింజ ధాన్యం కూడా కాటా వేయలేదు. మంత్రులు, ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో పట్టించుకోవడంలేదు. వాళ్లు పర్యటించిన చోట కూడా ధాన్యం కాటా వేయడం కానీ, మిల్లులకు తోలడంగానీ జరగడంలేదు. మారుమూల గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు ‘మద్దతు’ దక్కడంలేదు..తేమ శాతం ఎంతున్నా కొంటామంటున్నారు. ఆ తర్వాత 17 శాతం దాటితే ఐదు కేజీల కోత వేసి మిగిలిన ధాన్యాన్ని కొంటామన్నారు. పూర్తిస్థాయి మద్దతు ధర కల్పించాల్సిన ప్రభుత్వమే తరుగు మినహాయించి కొంటామని చెప్పడం దారుణం. తుపాను, వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేమ శాతం 20 నుంచి 24 శాతం వస్తోంది. రెండు శాతమో, ఐదు శాతమో కట్ చేసి మిగిలిన ధాన్యానికి మద్దతు ధర ప్రకారం లెక్కిస్తే 75 కేజీల బస్తాకు రూ.1,670 చొప్పున ఇవ్వాలి. కానీ, రూ.1,470–1,500కు మించి ఇవ్వడంలేదు. పైగా.. ధాన్యం బాగోలేదంటూ మిల్లర్లు పేచీ పెడుతున్నారు. కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఎంటీయూ 1,262, 1,318 వంటి ఫైన్ వెరైటీ ధాన్యానికి కూడా మద్దతు లభించని దుస్థితి ఏర్పడింది.రైతులకు–మిల్లర్లకు మధ్య బ్రోకర్లుగా మారారు..నిజానికి.. రైతుసేవా కేంద్రాల్లో తేమ శాతాన్ని పరీక్షించాలి. అక్కడ నిర్ధారించే దానినే ప్రామాణికంగా తీసుకుని ధరను నిర్ణయించి అదే ధరకు కొనుగోలు చేయాలి. కానీ, ఎక్కడా ఆ పరిస్థితిలేదు. ఆర్ఎస్కేలకు వెళ్తుంటే తేమ శాతం కూడా చూడడంలేదు. ఏ మిల్లుకు వెళ్తారని అడిగి అక్కడకు పంపించేస్తున్నారు. మిల్లు వాళ్లు ఏ ధర నిర్ణయిస్తారో ఆ ధరకు అమ్ముకోండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇది రైతాంగాన్ని మిల్లర్లు దోచుకునేందుకు ఉపయోగపడే పద్ధతే తప్ప రైతులకు మేలుచేసే విధానం కాదు. ఇక వాట్సప్‌లో ‘హాయ్’ అని మెసేజ్ పెడితే చాలు క్షణాల్లో మీ ధాన్యం కొనేస్తామంటున్నారు. కానీ, ఆచరణలో ఇదెక్కడా అమలుకు నోచుకోవడంలేదు.ఒక్క ప్రైవేటు వ్యాపారిపైనైనా కేసు పెట్టారా?ఇక ప్రైవేటు వ్యాపారులు కొనే ధాన్యాన్ని ప్రభుత్వం ఎందుకు కొనడంలేదో అర్థం కావడంలేదు. తక్కువ ధరకు కొనే వ్యాపారస్తులపై కేసులు పెడతామని చెప్పారుగానీ.. రాష్ట్రంలో ఒక్క ధాన్యం వ్యాపారిపైనైనా కేసు పెట్టారా? ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు తక్కువ రేటుకు ధాన్యం కొంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పోనీ ప్రభుత్వమైనా కొంటుందా అంటే అదీలేదు. గతేడాది కోసిన ధాన్యాన్ని కోసినట్లుగానే తీసుకెళ్లారు.. ప్రతీ రైతుకూ మద్దతు ధర లభించింది. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితిలేదు. ధర్నాలో ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు టీవీ లక్ష్మణస్వామి, కృష్ణాజిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే. శివనాగేంద్ర, పంచకర్ల రంగారావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.ఇలా అయితే ఎండ్రిన్ తాగి చావాలి..ఏడెకరాల్లో వరి వేశాం. పంట కోసి 15 రోజులైంది. తేమ 17 శాతం ఉంది. 20 శాతమైనా తీసుకుంటామన్నారు. కానీ తీసుకోలేదు. బేరగాళ్లు వచ్చి 75 కేజీల బస్తాకు రూ.1,450 ఇస్తామన్నారు. మా రైతు రూ.1,740 చొప్పున లెక్కగట్టి కౌలు ఇవ్వాలంటున్నారు. ఇలా అయితే మా చేతి డబ్బులు పెట్టుకోవాలి. పైగా పంటను కాపాడుకునేందుకు పరదాలకు రోజుకు రూ.2వేలు ఖర్చవుతోంది. డబ్బులు కట్టలేక చచ్చిపోతున్నాం. ఇలా అయితే ఎండ్రిన్ తాగి చావడం తప్ప వేరే దారిలేదు.– పొద్దుటూరు ప్రసాద్, గొడవర్రు. కంకిపాడు మండలం, కృష్ణాజిల్లాఇలా అయితే కౌలు రైతులు బతికేదెలా?నేను మూడెకరాల్లో వరి వేశాను. గతేడాదితో పోలిస్తే ఎకరాకు ఐదు బస్తాలు తగ్గింది. తేమ శాతం తక్కువగానే ఉన్నప్పటికీ ఈ రకం ధాన్యాన్ని కొనడంలేదు. ఆర్బీకేల్లోనే 20–25 శాతం ఉంటే 1,450 ఇస్తామంటున్నారు.బయట వాళ్లు కొనడం లేదు. పంటను కాపాడుకునేందుకు పరదాల కోసం రోజుకు ఎకరాకు రూ.300–500 చొప్పున చెల్లిస్తున్నాం. ఇలా అయితే కౌలురైతులు బతికేదెలా? కోసూరి శివనాగేంద్ర, గడ్డిపాడు, పమిడిముక్కల మండలం, కృష్ణాజిల్లాగతేడాది మద్దతు ధర వచ్చింది..ఎనిమిది ఎకరాల్లో వరికోసి 10 రోజులైంది. తేమ 15.5 శాతం ఉంది. మిల్లుకు పంపిస్తామన్నారు. కానీ ఎవరూ రాలేదు. మళ్లీ వెళ్లి అడిగితే మిల్లు దగ్గరకు వెళ్లండి అంటున్నారు. బేరగాళ్లు రూ.1,400 ఇస్తామంటున్నారు. అధికారులు పట్టించుకోవడంలేదు. గతేడాది కోసిన వెంటనే 75 కేజీల బస్తాకు రూ.1,630కు కొన్నారు. ఈ ఏడాది కొనేవాడులేడు. 10 రోజులుగా రోడ్డుపైనే ధాన్యం ఉంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – గెద్దా నరేంద్ర, గొడవర్రు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లానష్టానికి తోలాల్సి వస్తోంది..ఐదెకరాల్లో వరివేసా. ఎకరాకు 30 బస్తాలొచ్చింది. గొడవర్రు ఆర్ఎస్కు తీసుకెళ్తే 15.4% తేమ వచ్చింది. రేటు చెప్పలేదు. 90 బస్తాలు మిల్లుకు తోలారు. అక్కడ 75 కేజీల బస్తాకు రూ.1,600 కు మించి ఇవ్వమని తెగేసి చెప్పారు. ఆర్ఎస్కే సిబ్బందికి చెబితే పట్టించుకోలేదు. చేసేది లేక బస్తాకు రూ.130 చొప్పున నష్టానికి మిల్లుకు తోలాల్సి వచ్చింది.– గెడ్డం రాజా, గొడవర్రు, కృష్ణాజిల్లా -
దళారికి రొక్కం.. రైతుకు దుఃఖం
అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలకు కష్టకాలం దాపురించింది. చెమటోడ్చి పండించిన పంటకు మద్దతు ధరను దక్కించుకోలేని దుస్థితిలో రైతాంగం విలవిల్లాడిపోతోంది. ప్రకృతి వైపరీత్యాలకు మించి ‘దోపిడీ విపత్తు’ కర్షకులను ముంచేస్తోంది. పంట చేతికొచ్చిందన్న సంతోషం క్షణకాలంలో ఆవిరై పోతోంది. ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో ‘దళారీ రాజ్యం’ రాజ్యమేలుతోంది.రైతులకు మద్దతు ధర దేవుడెరుగు.. చెప్పిన రేటుకు ధాన్యం ఇవ్వకుంటే కల్లంలో నుంచి సరుకు బయటకు వెళ్లే పరిస్థితే కనిపించడం లేదు. పేరుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి ధాన్యం కొనేది దళారులే. ప్రభుత్వానికి రైతుల పేరుతో ధాన్యం విక్రయించేదీ దళారులే. సంపూర్ణ మద్దతు ధర అందించాల్సిన కూటమి ప్రభుత్వం.. మిల్లర్లు, వ్యాపారుల దందాకు గేట్లు తెరిచి రైతుల నోట్లో మట్టి కొడుతోంది.పంపాన వరప్రసాదరావు, వీఎస్వీ కృష్ణ కిరణ్ (సాక్షి, అమరావతి) : రాష్ట్రంలో కష్టపడి పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకోలేక అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సాధారణ రకానికి క్వింటా రూ.2300, ఏ గ్రేడ్‌కు రూ.2,320గా మద్దతు ధర ప్రకటించింది. అంటే 75 కేజీల బస్తా సాధారణ రకానికి రూ.1,725, ఏ గ్రేడ్‌కు రూ.1,740 చొప్పున మద్దతు ధర చెల్లించాలి. కానీ, కూటమి ప్రభుత్వం ఏలుబడిలో 75 కేజీల బస్తాకు రూ.150 నుంచి రూ.325 వరకు రైతులు నష్టపోతున్నారు. ఖరీఫ్ కొనుగోళ్ల ప్రారంభం నుంచే ఈ దోపిడీ పర్వం ఊపందుకుంది. రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ ప్రోద్బలంతోనే దళారులు చక్రం తిప్పుతున్నారు. పైకి మాత్రం ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తోంది.రైతుల ఖాతాల్లో పూర్తి మద్దతు ధర జమ చేస్తున్నట్టు లెక్కలు చూపిస్తోంది. కానీ, ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతుల్లో నూటికి 90 శాతం మంది బస్తాకు రూ.150 నుంచి రూ.325 నష్టాన్ని మూటగట్టుకుని అమ్ముకున్న దుస్థితి క్షేత్ర స్థాయిలో కనిపిస్తోంది. ఏలూరు జిల్లా నల్లజర్ల, భీమడోలు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు తీరును ‘సాక్షి’ బృందం పరిశీలించింది. ఈ పరిశీలనలో మిల్లర్ల దందా, దళారుల దోపిడీతో రైతులు పడుతున్న వెతలు వెలుగు చూశాయి. సిండికేట్‌గా మారిన మిల్లర్లు ⇒ రైతులకు మేలు చేసేందుకే అంటూ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ఎత్తేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రైతుకు నచ్చిన మిల్లుకు ధాన్యం తీసుకెళ్లవచ్చని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం మిల్లర్లు, దళారుల నెత్తిన పాలు పోసినట్టయ్యింది. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు/వ్యాపారులు సిండికేట్ అయ్యారు. జట్టు కూలీల (హమాలీలు)ను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. కోత కోసిన తర్వాత పంటను బస్తాల్లోకి నింపి వాహనాల్లో ఎక్కించాలంటే కూలీలు అవసరం. కానీ రైతులు జల్లెడపట్టినా కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది.⇒‘దళారీ మాకు ముందుగానే రూ.10 వేలు ఇచ్చారు. ప్రభుత్వానికి పని చేస్తే డబ్బులు ఎప్పుడో వస్తాయి. మా ఇబ్బందులు మాకుంటాయి. అందుకే వెంటనే కూలి వచ్చేచోటే పనికి వస్తున్నాం’ అంటూ ఓ హమాలీ చెప్పుకొచ్చారు. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుందామంటే కనీస సౌకర్యాల్లేక రైతులకు దిక్కుతోచడం లేదు. రోడ్లపై ఆరబెట్టుకుందామంటే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వం తరఫున పని చేసేందుకు కూలీలు ఎవ్వరూ ముందుకు రావట్లేదు. దీంతో చేసేది లేక ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నష్టానికే తెగనమ్ముకోవాల్సి వస్తోంది.పెట్టుబడి సాయం అందక అప్పులు⇒ గత ఐదేళ్లలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మేలో తొలి విడత పెట్టుబడి సాయం రూ.7,500 చొప్పున రైతుల ఖాతాకు జమ అయ్యేది. అలాగే పంటల బీమా పరిహారం కూడా రైతుల ఖాతాలో జమ చేసేవారు. ఖరీఫ్ పంట సాగులో దుక్కి పనులతో పాటు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకు ఈ సొమ్ము ఎంతగానో అక్కరకు వచ్చేది. ⇒ తాము అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ హామీ ఇచ్చిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా రూపాయి కూడా జమ చేయలేదు. దీంతో ఈ ఏడాది పెట్టుబడి పెట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు నానా అగచాట్లు పడ్డారు. ⇒ అత్యధిక శాతం మంది రైతులు ధాన్యం వ్యాపారుల (దళారులు) వద్ద చేబదులు తీసుకొని సాగు చేస్తే, మరికొంత మంది ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3–5తో వడ్డీకి అప్పులు తెచ్చి మరీ పంట సాగు చేశారు. మరో వైపు విత్తు నుంచి కోత వరకు రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో విజృంభించిన తెగుళ్లు, చీడపీడల దాడికి దిగుబడులు కాస్త తగ్గిపోయాయి. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. కోసిన తర్వాత తేమ లేకుండా ఆరబెట్టి, కేంద్రానికి తీసుకెళ్లేందుకు నానా పాట్లు పడుతున్నారు. ⇒ ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. పంట ఆరబెట్టుకునేందుకు కూలీల ఖర్చు భారంగా మారుతోంది. సరైన టార్ఫలిన్లు, ఫ్లాట్‌ఫారాలు లేక పోవడంతో పంటను జాగ్రత్త చేసి మంచి రేటుకు అమ్ముకునే గత్యంతరం లేక నష్టమని తెలిసినా తక్కువ రేటుకే దళారులకు తెగనమ్ముకుంటున్నారు. రూ.1,480 కోట్ల దోపిడీకి ప్లాన్!⇒ ఖరీఫ్‌లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణను ప్రభుత్వం ప్రాథమిక లక్ష్యంగా ప్రకటించింది. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తోంది. అయితే రైతులు కోసిన పంటను బస్తాల్లో నింపి, మిల్లుకు తరలించే ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. దీంతో దళారులు రంగ ప్రవేశం చేసి రైతుల పంటను మిల్లులకు తరలించేందుకు కమీషన్ల పేరిట భారీ దోపిడీకి తెరదీశారు.⇒ ప్రస్తుత సీజన్లో కోసిన పంటను కోసినట్టే విక్రయిస్తే దళారులు 75 కేజీల బస్తాకు రూ.1,400కు బేరం కుదుర్చుకుంటున్నారు. కొంత ఆరిన పంటకు రూ.1550 – రూ.1600 లెక్కగడుతున్నారు. ఇలా టన్నుకు ఒక్కో రైతు సుమారు రూ.2,100 నుంచి రూ.4 వేల వరకు నష్టపోతున్నాడు. ఈ లెక్కన 37 లక్షల టన్నుల సేకరణకు రూ.6,382 కోట్లు మద్దతు ధర రైతులుకు ఇవ్వాల్సి ఉండగా, ఇందులో సుమారు రూ.1,480 కోట్ల మేర మిల్లర్లు, దళారులు కలిసి బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నట్టు స్పష్టమవుతోంది.గత ప్రభుత్వంలో దళారులకు ముకుతాడు⇒ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ప్రస్తుతం కోతలు ప్రారంభం అయ్యాయి. ఈ నెలాఖరు నాటికి మిగిలిన జిల్లాల్లో కోతలు ఊపందుకుంటాయి. డిసెంబర్లో పూర్తి స్థాయిలో ధాన్యం ఉత్పత్తులు వస్తాయి. అయితే ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే పౌర సరఫరాల సంస్థ రూ.50.90 కోట్లు విలువైన 22,122 టన్నుల ధాన్యాన్ని సేకరించింది. కానీ, ఇప్పటికీ ధాన్యం విక్రయించిన వారిలో చాలా మంది రైతులకు రెండు రోజులు దాటినా మద్దతు ధర జమ కాలేదు. ⇒ గత ప్రభుత్వంలో రైతులకు వాస్తవ మద్దతు ధర అందించడంలో ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. ట్రక్ షీట్ జనరేట్ చేసే సమయంలోనే ఏ మిల్లుకు లోడు వెళ్తుందో తెలిసేది. దీంతో దళారులు ముందుగా రైతులను మభ్యపెట్టే, బెదిరించే ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. రైతులు సొంతంగా ధాన్యాన్ని మిల్లుకు తోలుకుంటే గన్నీ, లేబర్, ట్రాన్స్‌పోర్టు(జీఎల్టీ) చార్జీలు ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో సుమారు రూ.68 వేల కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించింది. దాదాపు 39 లక్షల మంది రైతులకు సంపూర్ణ మద్దతు ధరను అందించింది.కోతకు రెట్టింపు ఖర్చయ్యిందినేను ఆరు ఎకరాలు కౌలుకు సాగు చేశాను. రెండు రోజుల కిందటే పంటను (సంపత్ స్వర్ణ) కోశాను. తేమ శాతం ఎక్కువగా ఉంటే సరైన ధర దక్కట్లేదు. అందుకే దేవుడిపైనే భారం వేసి రోడ్డు పక్కన ఆరబోస్తున్నా. ఇటీవల వర్షానికి చేను వాలిపోయింది. అందుకే మిషన్‌పై ఎకరా పంటను గంటలో కోయాల్సి ఉండగా రెండున్నర గంటలు పట్టింది. ఎకరా కోతకు రూ.3 వేలు అవుతుంటే.. నాకు మాత్రం రూ.7 వేలు దాటింది. ఎకరాకు రూ.18 వేల నుంచి రూ.26 వేల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. ఆ స్థాయిలో మాత్రం మాకు మద్దతు ధర దక్కట్లేదు. – మర్రిపూడి నాగరాజు, అచెన్నపాలెం, ఏలూరు జిల్లాపెట్టుబడి సాయం అందలేదు1.80 ఎకరాల్లో ఎంటీయూ 7029 రకం వరి వేశాను. ఎకరాకు రూ.35 వేల వరకు ఖర్చయ్యింది. ఎకరాకు 30 బస్తాల దిగుబడి వచ్చింది. ఈసారి పెట్టుబడి లేక చాలా అగచాట్లు పడాల్సి వచ్చింది. ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తుందని ఆశగా ఎదురు చూశాం. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు కోసిన పంటను అయినకాడకి అమ్ముకోవాల్సి వస్తోంది. – చావా నాగేశ్వరరావు, నల్లజర్ల, ఏలూరు జిల్లాఆరబెట్టుకునే అవకాశం లేదునేను ఐదెకరాల్లో వరి సాగు చేశా. ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. ధాన్యం షావుకారు(వ్యాపారి) వద్ద చేబదులు తీసుకున్నాం. ఆరబెట్టుకునేందుకు అవకాశం లేక వ్యాపారికే అమ్మేసుకున్నా. ప్రభుత్వం వసతులు కల్పించి ఉంటే మాకు మంచి ధర దక్కేది. – ప్రగడ సురేష్, గౌరీపట్నం, పశ్చిమగోదావరి జిల్లాఆరబెట్టుకోలేకే అమ్ముకుంటున్నాం⇒ ఏలూరు జిల్లా నల్లజర్ల మండలం మారెళ్లమూడికి చెందిన రైతు రామాంజనేయులు 3 ఎకరాల్లో పీఆర్ 126 రకం వరి వేశాడు. 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో బెంగళూరు నుంచి వచ్చే యంత్రాల సాయంతో కోత కోశారు. గంటకు రూ.3 వేలు తీసుకున్నారు. ‘కోసిన ధాన్యాన్ని ఆరబెడితే కానీ తేమ శాతం తగ్గదు. తేమ శాతం తగ్గితే కానీ కొనుగోలు కేంద్రంలో మద్దతు ధర ఇవ్వరు. ఆరబెట్టేందుకు గ్రామాల్లో కనీస సౌకర్యాల్లేవు. చేసేది లేక ధాన్యం షావుకారుకు బస్తా రూ.1,400 చొప్పున అమ్ముకోవాల్సి వచ్చింది. కానీ ఇంకా డబ్బులు చేతికి రాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో రైతు కమిటీలకు ట్రాక్టర్లు, హార్వస్టర్లు, కల్టివేటర్లు ఇచ్చారు. అదే విధంగా డ్రైయర్లు, టార్పాలిన్లు ఇస్తే ధాన్యాన్ని ఆరబెట్టుకోవచ్చు. తేమ శాతం తగ్గాక మద్దతు ధరకు అమ్ముకోగలుగుతాం’ అని చెప్పుకొచ్చాడు.గతిలేక షావుకారికి అమ్మేశా⇒ ఈ రైతు పేరు మొన్ని శ్రీను. ఏలూరు జిల్లా నల్లజర్ల మండలానికి చెందిన ఈయన ఖరీఫ్‌లో రెండెకరాల్లో సంపత్ స్వర్ణ రకం వరి సాగు చేశాడు. ఈసారి పెట్టుబడి సాయం అందక షావుకారుల దగ్గర చేబదులు తీసుకున్నాడు. ఎకరాకు 37 బస్తాల దిగుబడి వచ్చింది. ‘కేంద్రంలో మద్దతు ధరకు అమ్ముకుందామనుకున్నా. కొనుగోలు కేంద్రంలో అమ్ముకుంటే బస్తా (75 కేజీలు)కు రూ.1,725 వస్తుంది. కానీ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదు.పైగా పట్టుబడి పట్టే వాళ్లు (హమాలీలు) అందరూ షావుకారుల దగ్గరే ఉన్నారు. అందుకే షావుకారుతో మాట్లాడాను. తేమ శాతం ఎక్కువగా ఉందన్న కారణంతో బస్తాకు రూ.1,400 చొప్పున ఇస్తానన్నారు. అది కూడా 15 రోజులకో.. 20 రోజులకో ఇస్తారు. నష్టపోతున్నామని తెలుసు. కానీ వాళ్లకు అమ్మడం తప్ప మాకు వేరే దారి లేద’ని ఆవేదన వ్యక్తం చేశాడు. -
పంట దిగుబడిలో దేశంలోనే తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: పంట దిగుబడిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టిస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయ న తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. రాష్ట్రంలో ఈసారి 60.80 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారని, 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు. దీంట్లో 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆస్కారముందని చెప్పారు. ఖరీఫ్ నుంచి సన్నాలకు బోనస్‌గా క్వింటాల్‌కు రూ.500 ప్రకటించిన నేపథ్యంలో రైతులు సన్నాల వైపు మొగ్గుచూపినట్టు తెలిపారు. ఈ మొత్తం ధాన్యం సేకరణకు రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని, అందులో ఇప్పటికే రూ.20 వేల కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. 10 నెలల వ్యవధిలోనే పౌరసరఫరాల సంస్థకు ఉన్న రుణంలో రూ.11,537.40 కోట్ల భారాన్ని తగ్గించుకున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో 7,572 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ బియ్యానికి బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో డిమాండ్ ఉందని, ఇతర దేశాలు కూడా తెలంగాణ బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎలాంటి అవాంతరాలు సంభవించినా, అధిగమించేందుకు అధికారులను సన్నద్ధం చేయాలని పౌర సరఫరాలశాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్.చౌహాన్‌ను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నిబంధనల మేరకే బ్యాంకు గ్యారంటీలను తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా సాగాలి
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొచ్చే విధంగా వ్యవహరించవద్దని ఆయన అధికారులకు సూచించారు. ధాన్యం కొను గోళ్ల విషయంలో రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా ఉండేలా చూడాలని ఉద్బోధించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగో ళ్లపై పౌరసరఫరాల కార్యాలయం నుంచి మంత్రి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కోటి న్నర మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోళ్లు ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసిందని తెలిపారు. ఇందుకోసం రూ.30 వేల కోట్లు అవసరమ వుతాయని ఆయన తెలిపా రు. ఇప్పటికే రాష్ట్ర ప్ర భుత్వం రూ.20 వేల కోట్లు ధాన్యం కొనుగోళ్ల కోసం కేటా యించిందని, అవసరమైతే అదనపు నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు సృష్టించవద్దని చెప్పారు. ప్రభుత్వం, రైస్ మిల్లర్లు పరస్పరం తోడ్పాటు అందించుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. ధాన్యం కొను గోళ్లలో మిల్లర్ల సహకారం తప్పనిసరిగా ఉండాల న్నారు. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలపై ఆందోళన చెందాల్సి న అవసరం లేదని, ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగించిన వెంటనే బ్యాంక్ గ్యారంటీలను వాపస్ చేయ నున్నట్లు చెప్పారు. మిల్లర్ల కోరిక మేరకు ధాన్యం మిల్లింగ్ చార్జీలు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తుందని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అకాల వర్షాలతో రైతులు నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కలెక్టర్లు ఎప్పటి కప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డి.యస్ చౌహాన్, కమిషనర్, జాయింట్ సెక్రటరీ ప్రియాంకా అలా, మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలిభూదాన్పోచంపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా భూదాన్‌పోచంపల్లి: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారిస్తూ ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ...రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు గడిచినా తూకం వేయడం లేదన్నారు. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం వల్ల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని, రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూదాన్‌పోచంపల్లి పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, నాయకులు, రైతులు రావుల శేఖర్‌రెడ్డి, సామ రవీందర్‌రెడ్డి, బత్తుల శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరబోసిన ధాన్యం నీటిపాలు
చౌటుప్పల్: సకాలంలో ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా నీటిపాలు చేయాల్సి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం సాయంత్రం కురిసిన ఆకస్మిక భారీ వర్షానికి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి. ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టుకుని తిరిగి కుప్పలు పోసుకునే సమయంలో వర్షం రావడంతో రైతులు ఏమి చేయాలో తెలియక పరుగులుపెట్టారు. అప్పటికప్పుడు ధాన్యాన్ని కుప్పలుగా పోసుకున్నారు. పట్టాలు కప్పుకున్నారు. పెద్ద ధాన్యం కుప్పలను ట్రాక్టర్లతో దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేశారు. అయినా వర్షం భారీగా కురవడంతో వరద నీటి ప్రవాహంలో ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు బోరున విలపించారు. -
చిన్న రైతులకు అ‘ధన’పు తోడ్పాటు
చిన్న, సన్నకారు రైతులు పండించిన ధాన్యానికి అనదపు విలువను జోడిస్తూ వ్యవసాయాన్ని మరింత లాభదాయకం చేయడంలో కృషి చేస్తోంది దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఆర్య.ఏజీ’. తాజాగా రిత్ సమ్మిట్ 2.0 పేరుతో 200 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPO) మరింత ఆకర్షణీయమైన, లాభదాయక సంస్థలుగా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. సాంకేతిక సహకారంతో సాగు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ, లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చొరవను ప్రారంభించింది.ఈ నేపథ్యంలో రైతులకు ఉత్పత్తుల నిల్వ, మార్కెట్‌తో పాటు రుణ సౌకర్యం కల్పిస్తున్న ఆర్య.ఏజీ సంస్థ ఎలా ఏర్పాటైంది.. రైతులకు ఎలాంటి సేవలు అందిస్తోంది.. టెక్నాలజీ పరంగా పెరిగిన సౌలభ్యాలు.. తదితర అంశాలపై సాక్షి బిజినెస్ వెబ్ డెస్క్ ఆర్య.ఏజీ మేనేజింగ్ డైరెక్టర్ చట్టనాథన్ దేవరాజన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా వారు వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలను ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం.సాక్షి: ఆర్య.ఏజీ ఎలా ఏర్పాటైంది?నాథన్: నేను, ప్రసన్నరావు, ఆనంద్ చంద్ర అనే మరో ఇద్దరితో కలిసి ఆర్య.ఏజీని ప్రారంభించాం. మొదట నష్టాల్లో ఉన్న ఆర్య కొలేటరల్స్ అనే సంస్థను కొనుగోలు చేశాం. తర్వాత దీన్ని ఆర్య.ఏజీ పేరుతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దాం.సాక్షి: ఆర్య.ఏజీ ఎలా పని చేస్తుంది?నాథన్: మా సంస్థ ప్రధానంగా మూడు విభాగాలుగా పనిచేస్తుంది. ఆర్య.ఏజీ కింద ఆర్య కొలేటరల్ వేర్‌హౌసింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యధన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యటెక్ ప్లాట్‌ఫారమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విభాగాలు ఉన్నాయి. ఈ మూడింటినీ సమ్మిళితం చేసి రైతులకు సేవలు అందిస్తున్నాం.సాక్షి: రైతులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు?నాథన్: దేశంలో అత్యధికమంది చిన్న, సన్నకారు రైతులే. వీరికి ప్రధాన సమస్య దిగుబడిని నిల్వ చేయడం. ప్రధానంగా ఈ సమస్యను పరిష్కరించడం కోసం వేర్‌హౌస్‌లను నిర్వహిస్తున్నాం. దీంతో పాటు వారికి దిగుబడులకు మార్కెటింగ్ కల్పిస్తున్నాం. ఈలోపు అవసరమున్న రైతులకు దిగుబడులపై రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నాం.సాక్షి: ఎలాంటి దిగుబడులకు స్టోరేజ్ కల్పిస్తున్నారు.. సామర్థ్యం ఎంత?నాథన్: మాది ప్రధానంగా గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్. అంటే అన్ని రకాల ధాన్యం దిగుబడులకు స్టోరేజ్, మార్కెటింగ్, ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. సీజన్‌ను బట్టి దేశవ్యాప్తంగా 3000 వేర్‌హౌస్‌లను నిర్వహిస్తున్నాం. 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులకు స్టోరేజ్ సదుపాయం కల్పిస్తున్నాం.సాక్షి: ఎక్కడెక్కడ మీ కార్యకలాపాలు ఉన్నాయి?నాథన్: కొన్ని ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. స్థానిక సంస్థలు, ప్రభుత్వాల సహకారంతో రైతులకు సేవలు అందిస్తున్నాం. -
ధాన్యం బకాయిలివ్వరా?
సాక్షి, అమలాపురం: భారీ వర్షాలు.. వరదలతో వరి చేలు చెరువులుగా మారిపోయాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి రైతు భరోసా సాయం అందలేదు. ఇంకోవైపు రబీకి సంబంధించి ధాన్యం బకాయిలు సైతం రెండు, మూడు నెలలుగా జమ కావడం లేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో కడుపుమండిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులు సోమవారం అమలాపురం కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా చేశారు. అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్‌కు వచి్చన జేసీ నుపూర్ అజయ్ కారును పది నిమషాల పాటు అడ్డుకున్నారు. మూడు మండలాల నుంచి తరలివచ్చి.. అల్లవరం, ఉప్పలగుప్తం, అయినవిల్లి మండలాలకు చెందిన సుమారు 60 మంది రైతులు కలెక్టరేట్‌కు తరలివచ్చి ధర్నా చేపట్టారు. మే నెలలో అమ్మిన ధాన్యానికి ప్రభుత్వం ఇప్పటికీ సొమ్ములు చెల్లించకపోవడంపై మండిపడ్డారు. తమకు రావాల్సిన సొమ్ములు కోసం జిల్లా ఉన్నతాధికారులకు, గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండాపోయింది. జిల్లాలో సుమారు 8 వేల మంది రైతులకు రూ.154 కోట్ల వరకు ధాన్యం సొమ్ములు చెల్లించాల్సి ఉంది. డీఆర్వో వి.వెంకటేశ్వర్లు రైతులతో చర్చించినా ఫలితం లేకపోయింది. కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. కలెక్టర్ వరద పర్యటనలో ఉన్నందున జేసీ నుపూర్ కార్యాలయానికి వచ్చి ఐదుగురు రైతులు మాట్లాడాలని డీఆర్వో సూచించారు. దీంతో రైతులు వాగి్వవాదానికి దిగారు. రైతులంతా వస్తామని పట్టుబట్టారు. ఆయన వెంట ప్రధాన గేట్లును నెట్టుకుంటూ కార్యాలయం వైపు చొచ్చుకురాగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జేసీ నుపూర్ అజయ్ రైతులతో మాట్లాడుతూ.. ధాన్యం సొమ్ములు నెలాఖరులోగా రైతుల ఖాతాలలో జమ అవుతాయని చెప్పారు. జేసీ హామీతో రైతులు వెనుదిరిగారు. ఆత్మహత్యలే శరణ్యం ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మే నెలలో ధాన్యం విక్రయించగా అప్పట్లో ఎన్నికల కోడ్ ఉండటంతో ప్రభుత్వం సొమ్ము చెల్లించడానికి వీలు కాలేదని, ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ధాన్యం అమ్మకాలు చేసి 70 రోజులు అవుతున్నా సొమ్ములు ఖాతాల్లో జమ చేయకపోవడంతో నష్టపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని, నెలాఖరు నాటికి ధాన్యం సొమ్ములు ఇవ్వకుంటే సాగు సమ్మె చేపడతామని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంలో సకాలంలో సొమ్ములు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం సొమ్ములు 21 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమయ్యేవి. గత ఏడాది ఖరీఫ్ ధాన్యం అమ్మకాలు చేసిన వారంలోనే సొమ్ములు పడడాన్ని రైతులు గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది రబీ ధాన్యం కొనుగోలు సొమ్ములు కూడా మొదట్లో సకాలంలో వేశారు. అదేవిధంగా మే 24, 25 తేదీలలో రెమాల్ తుపాను సమయంలో వర్షాలు కురుస్తుండగా రైతుల వద్ద నుంచి ఏకంగా 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో చెల్లింపులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత ఒకసారి రూ.117 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేశారు. మిగతా రైతులకు చెల్లింపులు చేయలేదు.మే మొదటి వారంలో అమ్మాం నేను మే మొదటి వారంలో ధాన్యం విక్రయించాను. రూ.1.20 లక్షల వరకు సొమ్ములు రావాల్సి ఉంది. రబీ కోతలకు మెషీన్ ఖర్చులు నుంచి కూలీలు, ఖరీఫ్ విత్తనాలు, దమ్ములు వరకు అప్పులు చేశాను. 70 రోజులు దాటుతున్నా సొమ్ములు ఇవ్వకపోవడం అన్యాయం. – చొల్లంగి రామకృష్ణ, దేవగుప్తం గ్రామంఆత్మహత్యలే శరణ్యం ధాన్యం అమ్మిన సొమ్ముల్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేయలేదు. ఇలాగే ఉంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. జేసీ మేడమ్ శనివారం చివరిలో సొమ్ములు మా ఖాతాలో పడతాయని చెప్పారు. అలా జరగకపోతే నిరాహార దీక్షలు చేపడతాం. – కర్రి రాములు, జనుపల్లి గ్రామం -
బ్లాక్‌లిస్టులో మిల్లులు.. రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సెక్యూరిటీ డిపాజిట్ కానీ, బ్యాంక్ గ్యారంటీ కానీ లేకుండానే వేల కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించే విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం ఇచ్చేటప్పుడే మిల్లర్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలని, సకాలంలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అప్పగించక పోవడంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించే మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తాజాగా చర్చనీయాంశమైన 2022–23 రబీ సీజన్‌లోని 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) ధాన్యాన్ని సీఎంఆర్ చేయని, తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంట్రాక్టు సంస్థలకు ధాన్యం అప్పగించని మిల్లులపై కొరడా ఝుళిపించనుంది. మిల్లర్ల విషయంలో ఉదాసీనత గత కొన్నేళ్లుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మిల్లర్ల విషయంలో అవలంభించిన ఉదాసీన వైఖరి ఇప్పుడు సర్కార్‌కు ఇబ్బందికరంగా మారింది. మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకున్న 2022–23 రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించిన 35 ఎల్ఎంటీల ధాన్యం రికవరీ బాధ్యతలను.. ప్రభుత్వం టెండర్ల ద్వారా నాలుగు సంస్థలకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే 3 నెలలు గడిచినా 35 ఎల్‌ఎంటీల్లో 2 ఎల్ఎంటీల ధాన్యాన్ని కూడా రికవరీ చేయలేదు. దీంతో విపక్షాలు ఈ ధాన్యం రికవరీ టెండర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2022–23 యాసంగి సీజన్లో మిల్లుల్లో నిల్వ చేసినట్లుగా చెపుతున్న ధాన్యాన్ని 4 కాంట్రాక్టు సంస్థలకు అప్పగించకపోతే.. వాటిని డిఫాల్ట్ మిల్లులుగా పేర్కొంటూ బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. 2022–23 యాసంగి ధాన్యంపైనే రచ్చ ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్ధతు ధరకు కొని..సీఎంఆర్ కోసం మిల్లులకు పంపడం జరుగుతుంది. ఖరీఫ్ ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి సీఎంఆర్ కింద అప్పగించే మిల్లర్లు, రబీ ధాన్యాన్ని మాత్రం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం)గా ఎఫ్‌సీఐకి ఇవ్వడం గత కొన్నేళ్లుగా జరుగుతోంది. రాష్ట్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రబీ ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకలుగా విరిగిపోతాయి. ఈ నేపథ్యంలో 2021లో కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి బాయిల్డ్ రైస్‌ను సీఎంఆర్‌గా తీసుకునేది లేదని స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపుల తర్వాత ప్రతి ఏటా 10 నుంచి 15 ఎల్ఎంటీల బియ్యాన్ని మాత్రమే బాయిల్డ్ రైస్‌గా తీసుకునేందుకు ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో 2020– 2021, 2021–2022లలో మిల్లర్లు రబీ ధాన్యాన్ని కూడా ముడిబియ్యంగా మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించారు. కాగా 2022–23 రబీ సీజన్లో 65 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం యధావిధిగా మిల్లులకు అప్పగించింది. అయితే మిల్లర్లు ప్రభుత్వం వెసులుబాటు ఇచి్చన విధంగా సుమారు 20 ఎల్ఎంటీల ధాన్యాన్ని మాత్రమే బాయిల్డ్ రైస్‌గా మిల్లింగ్ చేసి, మిగతా ధాన్యాన్ని మిల్లులు, గోడౌన్లకు పరిమితం చేశారు. అప్పటి ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ, తాము యాసంగి బియ్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగించలేమని మిల్లర్లు తెగేసి చెప్పారు. దీంతో పౌరసరఫరాల శాఖ మిల్లుల్లోని ధాన్యాన్ని వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు టెండర్లు ఆహ్వానించగా ఏడు సంస్థలు క్వింటాల్ ధాన్యాన్ని సగటున రూ.1,860 చొప్పున కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. ధర తక్కువగా రావడంతో ఆ బిడ్లను రద్దు చేసిన అధికారులు మళ్లీ టెండర్లను పిలిచారు. ఈసారి 10 వేల టన్నుల కెపాసిటీ గల మిల్లర్లంతా టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు మార్చారు. అంటే ఏ మిల్లులో ఉన్న ధాన్యం ఆ మిల్లరే కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించారు. అయితే అప్పటికే ఎన్నికల కోడ్ రావడంతో ఈ టెండర్లు ఆగిపోయాయి. కొత్త టెండర్లు.. స్కామ్ ఆరోపణలు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రాగానే మిల్లుల్లో ఉన్న 2022–23 రబీ ధాన్యాన్ని విక్రయించడంపై దృష్టి పెట్టింది. కానీ ఈ ధాన్యాన్ని ఇంతవరకు ఎందుకు మిల్లింగ్ చేయలేకపోయారనే అంశంపై శ్రద్ధ పెట్టలేదు. ఎప్పటిలాగానే మిల్లర్లకు భారం కాకుండా నిబంధనలను మార్చి మిల్లుల్లో ఉన్నట్టు చెబుతున్న 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు కొత్తగా టెండర్లు పిలిచారు. ఆరు సంస్థలు ధాన్యం కొనుగోలుకు ముందుకు రాగా, మూడు నెలల క్రితం నాలుగు సంస్థలను ఎంపిక చేశారు. క్వింటాలు ధాన్యానికి సగటున రూ.2,007 రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేలా ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 90 రోజుల్లోగా అంటే ఈనెల 23వ తేదీ లోగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి రూ.7 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. కానీ ఈ 4 సంస్థలు కలిపి ఇప్పటివరకు 2 ఎల్ఎంటీల ధాన్యాన్ని కూడా సేకరించలేదని ప్రభుత్వమే చెబుతోంది. ఈ లోపు విపక్షాలు ఈ తతంగాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వంపై ఆరోపణా్రస్తాలు సంధించడం మొదలు పెట్టాయి. మిల్లుల వద్ద ధాన్యానికి బదులు క్వింటాలుకు రూ.2,223 చొప్పున కాంట్రాక్టు సంస్థలు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. మొత్తంగా రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, ఈ ధాన్యం వేలం ప్రక్రియపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లోనే నిరుటి 35 ఎల్ఎంటీల రబీ ధాన్యం విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. 4 సంస్థలకు మరో 3 నెలల గడువు ఇవ్వడంతో పాటు అప్పటికి ధాన్యం అప్పగించని మిల్లర్లను డిఫాల్టర్లుగా గుర్తించి బ్లాక్‌లిస్టులో పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్లలో జవాబుదారీతనం పెంచేలా.. మిల్లర్లలో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ఇకపై వారివద్ద సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ధాన్యం అప్పగించేటప్పుడే సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు. ఈ విధానాన్ని అమలు చేస్తే మిల్లర్లలో జవాబుదారీతనం పెరగడంతో పాటు ధాన్యం కొనుగోళ్ల కోసం చేసే అప్పులు కూడా కొంతవరకు తగ్గుతాయని భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 3,500 పైగా రైస్ మిల్లులు ఉండగా, ఒక్కో మిల్లర్ నుంచి రూ.కోటి చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ తీసుకున్నా రూ.3,500 కోట్లకు పైగా జమయ్యే అవకాశం ఉంది. ఏపీలో 100% సెక్యూరిటీ డిపాజిట్ ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాలు సెక్యూరిటీ డిపాజిట్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. దీనివల్ల మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ అప్పగించకుంటే సెక్యూరిటీ డిపాజిట్‌ను జప్తు చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. ఏపీలో వంద శాతం సెక్యూరిటీ డిపాజిట్ అమల్లో ఉంది. అంటే మిల్లర్లు రూ.కోటి కడితే అంతే విలువైన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం ప్రభుత్వం అప్పగిస్తుందన్నమాట. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో 1:3 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటున్నారు. అంటే మిల్లర్లు రూ.కోటి చెల్లిస్తే రూ.3 కోట్ల విలువైన ధాన్యాన్ని వారికి ఇస్తారు. -
ధాన్యం.. దయనీయం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు అతలాకుతలం అవుతున్నారు. గత రెండురోజులుగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో కోత దశలో ఉన్న వరి పంట నేలవాలింది. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో.. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిచిపోయాయి.ఇంతకుముందు వర్షానికి తడవడంతో ఆరబోసుకున్న వడ్లు వర్షపు నీటికి కొట్టుకుపోయాయని రైతులు వాపోయారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మార్కెట్ యార్డు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోయింది. మహబూబాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా వర్షం కారణంగా రైతులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.ఉమ్మడి కరీంనగర్‌లోని పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శుక్రవారం సుమారు గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. పలు మండలాల్లో క్వింటాళ్ల కొద్దీ వడ్లు తడిచిపోయాయి. ఖమ్మం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు మామిడి కాయలు రాలిపోయాయి. ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేయాలని, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. -
ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
ఈ చిత్రంలోని రైతు దంపతులు మీసా పరుశరాములు, రేణుక (రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్) 2.20 ఎకరాల సొంత భూమితో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. పండిన ధాన్యాన్ని 17 రోజుల క్రితం ముస్తాబాద్‌లోని కొనుగోలు కేంద్రానికి తెచ్చారు. కానీ ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు. అప్ప ట్నుంచి ఇప్పటివరకు మూడుసార్లు వర్షాలతో ధాన్యం తడిసింది. ఇప్పుడు 17% తేమ వచ్చే వరకు కొనలేమని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ధాన్యాన్ని ఆరబెట్టడం, ఈలోగా మళ్లీ వర్షం పడటం, మళ్లీ ఆరబెట్టడం నిత్యకృత్యంగా మారడంతో ఈ దంపతులు లబోదిబోమంటున్నారు. సాక్షి, హైదరాబాద్: తడిచిన ధాన్యాన్ని సైతం కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆ శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఇచి్చన హామీలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ రైతులు రోజుల తరబడి వేచి చూస్తున్నా.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు 17 శాతం తేమ వచ్చేదాకా ధాన్యం కాంటా వేయలేమని కరాఖండిగా చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం ఇప్పటికే చాలాసార్లు తడిచింది. ధాన్యం తడవడం, రైతులు ఆరబెట్టేందుకు అష్టకష్టాలూ పడటం నిత్యకృత్యమైంది. మరోవైపు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చేస్తున్న సూచనలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 45 రోజుల్లో 27 ఎల్‌ఎంటీలే సేకరణ రాష్ట్రంలో గత 15 రోజుల నుంచి అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు రైతుల పంటను నీళ్లపాలు చేస్తున్నాయి. వర్షం పడిన ప్రతిసారీ పౌరసరఫరాల శాఖ తడిచిన ధాన్యం కొంటామనే హామీ ఇవ్వడమే తప్ప అమలుపై శ్రద్ధ చూపించడం లేదు. దీంతో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే రైతుల వడ్లు పలుమార్లు నీళ్లలో తడిశాయి. చాలాచోట్ల ధాన్యం వరదల్లో కొట్టుకుపోయింది.ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు మొదలై 45 రోజులు దాటినప్పటికీ, ఇప్పటివరకు 27 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించింది. నల్లగొండ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల్లో సైతం కోతలు దాదాపుగా ముగిశాయి. వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో కోతలు కొంత ఆలస్యం అయ్యాయి. అయితే వరి కోసి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తెస్తున్న రైతులు అక్కడే ఆరబెట్టి, తమ వంతు వచ్చేంత వరకు కాంటా కోసం వేచిచూస్తున్నారు.రైతుల పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ ఫోన్ నంబర్‌తో లింక్ అయితేనే కొనుగోళ్లు జరుపుతుండడంతో కొందరు రైతులతో పాటు కౌలు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా తేమ 17 శాతానికి చేరుకునే వరకు వేచి ఉండాలని చెబుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.మిల్లర్ల కొర్రీలు మరోవైపు కొంచెం తేమ శాతం ఎక్కువగా ఉన్నా మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోవడం లేదు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టిన తరువాత ధాన్యం రంగు మారినా తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. అలాంటి ధాన్యం లోడ్లు మిల్లులకు వస్తే నేరుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, రైతులకు ఫోన్లు చేసి పచ్చి ధాన్యాన్ని తీసుకోబోమని తేల్చిచెబుతున్నారు. తీసుకునే పక్షంలో క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల తరుగు తీయాల్సి ఉంటుందంటూ మెలిక పెడుతున్నారు.ధాన్యం కాంటాకే ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు విధిలేని పరిస్థితుల్లో మిల్లర్లు చెప్పినట్లు వింటూ దోపిడీకి గురవుతున్నారు. ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ ఈ అంశంపై దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షంతో తడిచిన ధాన్యం గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటాం. – ఇటీవల హైదరాబాద్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి -
రైతన్నకు అకాల నష్టం
నిజామాబాద్/కామారెడ్డి నెట్వర్క్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శని వారం ఉదయం 10 గంటల వరకు కురిసిన అకాల వర్షానికి కల్లాలు, రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి పోయింది. పలుచోట్ల వర్షపు నీటి ప్రవాహంలో వడ్లు కొట్టుకుపోయాయి. చేతికందిన పంటను అమ్ముకు నే సమయంలో వర్షం దెబ్బతీయడంతో రై తులు కంటతడి పెడుతున్నారు. ఆర్మూరు, ఆలూర్, ఎడపల్లి, వర్ని, చందూర్, మోస్రా, సాలూర, రుద్రూర్, కోట గిరి, పొతంగల్, రెంజల్, మాక్లూర్, డొంకేశ్వర్ మండలాల్లో రైతుల కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, లింగంపేట, పి ట్లం, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలా ల్లో రోడ్లపై ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ధాన్యం రాశుల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో పోలీసుస్టేషన్ సమీపంలో రోడ్లపై ఉన్న ధాన్యం రాశుల మధ్య నీరు భారీగా చేరడంతో మోటార్ల సహాయంతో తొలగించారు. వర్షాలతో అంతటా వరి కోతలకు బ్రేక్ పడింది. -
వ్యవసాయ మార్కెట్లలో రైతుల పడిగాపులు
తిరుమలగిరి (తుంగతుర్తి)/జనగామ: వానల్లేక, సాగునీరు అందక చాలా చోట్ల వరి పంట దెబ్బతి న్నది. మిగిలిన చోట రైతులు వరికోతలు పూర్తి చేసి.. వ్యవసాయ మార్కెట్లకు తెస్తున్నారు. కానీ మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోళ్లు చేస్తుండటం, అదీ సరిగా సాగకపోవడంతో.. పడిగాపులు పడుతున్నారు. శనివారం సూర్యాపేట జిల్లా తిరు మలగిరి, జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఇదే పరిస్థితి కనిపించింది. భారీగా పోటెత్తిన ధాన్యం: శనివారం తిరుమ లగిరి వ్యవసాయ మార్కెట్ యార్డుకు 47,660 బస్తాల ధాన్యం వచ్చింది. యాసంగి సీజన్ మొదలై నప్పటి నుంచి ఇంత భారీగా ధాన్యం రావడం ఇదే మొదటిసారి. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా.. వాతావరణంలో మార్పులతో రైతులు యార్డుకే ధాన్యాన్ని తీసుకొస్తున్నారని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే మార్కెట్లోకి ధాన్యం ట్రాక్టర్లను అనుమతించాల్సి ఉండగా.. శనివారం తెల్లవారు జాము వరకు పంపలేదు. దీనితో రోడ్డు పైనే వందలకొద్దీ ట్రాక్టర్లు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కాగా ట్రేడర్లు ధాన్యానికి క్వింటాల్‌కు కనిష్టంగా రూ.1,700, గరిష్టంగా రూ.1,980 ధర చెల్లించారు. జనగామలో కొనుగోళ్లు నిలిపేసిన ట్రేడర్లు తక్కువ ధరకు ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళ న, ముగ్గురు ట్రేడర్లపై కేసుల నమోదు నేపథ్యంలో.. జనగామ వ్యవసాయ మార్కెట్లో ట్రేడర్లు కొనుగోళ్లు నిలిపివేశారు. దీనితో మార్కెట్‌కు వరి ధాన్యం, మక్కలు, చింతపండు, ఇతర వ్యవసాయ ఉత్పత్తు లను తీసుకువచ్చిన రైతులు వాటిని అమ్ముకో వడా నికి పడిగాపులు పడుతున్నారు. ఇక మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రాజునా యక్ శనివారం జనగామ మార్కెట్ కార్యాలయంలో.. ట్రేడర్లు, అడ్తిదారులతో రెండు గంటల పాటు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రైవేట్ మార్కె ట్లోనూ మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని రాజునాయక్ కోరగా.. అది సాధ్యం కాదని ట్రేడర్లు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లేని నిబంధనలను జనగామ మార్కెట్‌పై ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు. తమపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. మరోవైపు ఈ మార్కెట్లో కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. -
రైతులను మోసం చేస్తే సహించేది లేదు
సాక్షి, హైదరాబాద్/ జనగామ: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఎవరు మోసం చేసేందుకు ప్రయత్నించినా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లలో విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. జనగామ మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన అంశంపై సీఎం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. వ్యవసాయ మార్కెట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అద నపు కలెక్టర్ రోహిత్ సింగ్‌కు నా అభినందనలు. అధికారులందరూ ధాన్యం కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు. ముగ్గురు ట్రేడర్లపై కేసులు జనగామ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ అయి ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తు న్నారంటూ రైతులు బుధవారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్.. మార్కెట్ కార్యదర్శి భాస్క ర్ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ తీసుకున్నాక కార్యదర్శిపై చర్యలు చేపడతామన్నారు. మరోవైపు జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ నరేంద్ర ఫిర్యాదు మేరకు ముగ్గురు ట్రేడర్లపై కేసు నమోదు చేసినట్టు సీఐ రఘు పతిరెడ్డి తెలిపారు. ప్రైవేటు మార్కెట్లో ధాన్యానికి రూ.1,800కన్నా ఎక్కువ ధర ఇవ్వాలని అధికారులు ఆదేశించినా.. వ్యాపారులు కేవలం రూ.30 పెంచి కొనుగోలు చేస్తున్నట్టు రైతులు ఆరోపించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం వ్యవసాయ మార్కెట్లో పర్యటించారు. ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తే ఊరు కునేది లేదన్నారు. -
ధాన్యం లేదంటే డబ్బులు ఇవ్వాల్సిందే!
ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ మిల్లు నుంచి గత సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్లో ప్రభుత్వం ఇచ్చిన 10 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను రికవరీ చేసుకునేందుకు ధాన్యం కాంట్రాక్టు పొందిన ఓ సంస్థ ప్రతినిధులు వెళ్లారు. తీరా అక్కడికి వెళితే మిల్లులో ధాన్యం నిల్వలు లేవు. మిల్లులో ఉన్న ధాన్యం చెడిపోతుందని అమ్మివేసినట్లు మిల్లర్ ఒప్పుకున్నాడు. దీంతో క్వింటాల్‌కు రూ. 2,259 లెక్కన 10 మెట్రిక్ టన్నులకు రూ. 2,25,900 చెల్లించాలని లెక్క చెప్పి వెళ్లారు. సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్లుగా సాఫీగా సాగిన ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు మిల్లర్లకు దడపుట్టిస్తోంది. గత సంవత్సరం యాసంగి సీజన్లో వచ్చిన ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయలేమని రాష్ట్రంలోని మిల్లర్లంతా చేతులెత్తేయడంతో ఆగిపోయిన సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు వారి మెడకే చుట్టుకుంది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా మిల్లుల్లోనే నిల్వ చేసిన ధాన్యం నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వం వేలం వేసి, బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థలకు ధాన్యం కొనుగోలు కాంట్రాక్టులను అప్పగించింది. గన్నీ బ్యాగులతో కలిపి క్వింటాలుకు సగటున రూ. 2,007 లెక్కన ధాన్యం కాంట్రాక్టు పొందిన సంస్థలు తమకు కేటాయించిన జిల్లాల నుంచి ధాన్యం సేకరణకు శ్రీకారం చుట్టాయి. తీరా ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ తీసుకొని మిల్లులకు వెళితే అక్కడ ధాన్యం కనిపించడం లేదు. దీంతో మిల్లర్ల నుంచి క్వింటాలు ధాన్యానికి బదులుగా రూ. 2,259 లెక్కన డబ్బులు వసూలు చేయాలని కాంట్రాక్టు సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించడంతో మిల్లర్లు బెంబే లెత్తుతున్నారు. వేలంలో 6 సంస్థలకు ధాన్యం అప్పగింత 2022–23 సంవత్సరం యాసంగిలో రాష్ట్రంలో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 20 ఎల్ఎంటీ ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ఆదేశాల మేరకు మిల్లర్లు సీఎంఆర్ కింద బాయిల్డ్ బియ్యంగా మిల్లింగ్ చేసి అప్పగించారు. మిగతా ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా, మిల్లింగ్ చేయలేదు. దీంతో నిల్వ ఉన్న ధాన్యాన్ని గత ప్రభుత్వం వేలం వేయాలని ప్రయత్నించినా వీలుకాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 12 లాట్ల కింద వేలం వేశారు. రూ. 300 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకే వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వడంతో కేవలం ఏడు సంస్థలే బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. అందులో ఓ సంస్థ తిరస్కరణకు గురికాగా మిగతా ఆరు సంస్థలు ఈ బిడ్లను దక్కించుకున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్రీయ భండార్, నాకాఫ్ కూడా ఉన్నాయి. వేలంలో క్వింటాలు ధాన్యానికి సగటున రూ. 2,007 లెక్కన (గన్నీ బ్యాగులతో కలిపి) ప్రభుత్వానికి చెల్లించేలా బిడ్లు ఆమోదం పొందాయి. ఈ బిడ్డింగ్ ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలపడంతో సదరు సంస్థలు ధాన్యాన్ని మిల్లర్ల నుంచి రికవరీ చేసే ప్రక్రియను ప్రారంభించాయి. ధాన్యం అమ్మేసుకున్న మిల్లర్లు.. గత యాసంగి సీజన్లో సీఎంఆర్ చేయ కుండా నిల్వ చేసినట్లు మిల్లర్లు చెప్పినప్పటికీ, ఏ మిల్లర్ దగ్గరా సరిపడా ధాన్యం నిల్వలు లేవు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సమావేశం సందర్భంగా మిల్లర్లే ఒప్పుకున్నారు. తడిసి న, నిల్వ ఉంచిన ధాన్యం పాడైపోతుందనే కార ణంగా చాలా వరకు విక్రయించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి మీడియాకు కూడా చెప్పారు. అయి తే మిల్లర్ల నుంచి ధాన్యాన్ని రికవరీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం వేలం ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు క్వింటాలుకు బిడ్డింగ్‌లో రూ.1,852 నుంచి 2,260 వరకు ధర పలికింది. సగటున క్వింటాలుకు రూ.1879 కాగా, రూ.125 గన్నీ బ్యాగుల కింద .. మొత్తంగా క్వింటాలుకు రూ. 2,007 చొప్పున లెక్క చూపారు. ఆయా సంస్థలు ఎంతకు ధాన్యం కొనుగోలు టెండర్లు దక్కించుకున్నా య నే విషయాన్ని పక్కనబెట్టి క్వింటాలు ధాన్యం ఇవ్వకపోతే, దాని బదులు రూ. 2,259 చెల్లించాలని అల్టిమేటం ఇస్తున్నట్లు పలువురు మిల్లర్లు తెలిపారు. సన్న ధాన్యం టెండరును క్వింటాలుకు రూ. 2,260కి దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ నిజామాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి ధాన్యాన్ని రికవరీ చేసుకోవాల్సి ఉంది. మిల్లర్లు సన్న ధాన్యం ఇవ్వని పక్షంలో క్వింటాలుకు రూ.2,500కు పైగా వసూలు చేసే ఆలోచనలో ఆ సంస్థ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో 50 నుంచి 100 మెట్రిక్ టన్నుల ధాన్యం రికవరీకి కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ పొందినట్లు చెపుతున్నారు. -
ధాన్యం దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లుల్లో ఏడాది కాలంగా నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. ఆ ధాన్యాన్ని తక్కువ ధరకు పొందడం ద్వారా సర్కారు ఖజానాకు రూ. వందల కోట్ల నష్టం కలిగించేలా వ్యాపారులు, మిల్లర్లు చక్రం తిప్పుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ కనుసన్నల్లో సిండికేట్ అయి తమ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని 12 లాట్లుగా విభజించి బిడ్లు ఆహ్వానించగా క్వింటాల్ ధాన్యం సగటున రూ. 1,950కన్నా తక్కువ మొత్తానికి దక్కించుకునేలా 27 బిడ్లు మాత్రమే దాఖలు కావడం వ్యాపారుల కుమ్మక్కును స్పష్టం చేస్తోంది. కాగా, ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం బిడ్డర్లకు ధాన్యాన్ని అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే జరిగితే ఇప్పటికే అప్పుల్లో ఉన్న పౌరసరఫరాల సంస్థకు దాదాపు రూ. 1,500 కోట్లకుపైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ వేలం ప్రక్రియకు పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారులతోపాటు ఇతర ఉన్నతాధికారులు సహకారాన్ని అందించారనే ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. యాసంగిలో 66.84 ఎల్ఎంటీల సేకరణ రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ చేయించి ఎఫ్‌సీఐకి అప్పగించడం... ఎఫ్‌సీఐ నుంచి ధాన్యం సొమ్మును రీయింబర్స్ చేసుకోవడం అనే ప్రక్రియ గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల సంస్థ అప్పులు చేయడం... ఎఫ్‌సీఐ నుంచి డబ్బు తీసుకొని ఆ అప్పులు తిరిగి చెల్లించడం ఈ ప్రక్రియలో భాగమే. ఈ క్రమంలోనే 2022–23 రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించి సుమారు 7 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 66.84 ఎల్ఎంటీల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కనీస మద్దతు ధర కింద రూ. 13,760 కోట్లకుపైగా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేసింది. సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించింది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా..లెక్క చూపకుండా.. యాసంగి సీజన్లో క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 67 కిలోల ముడి బియ్యం (రా రైస్) ఎఫ్‌సీఐకి మిల్లర్లు అప్పగించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా మిల్లింగ్ చేస్తే బియ్యం విరిగి నిర్ణీత లెక్క ప్రకారం 67 కిలోల బియ్యం రావని, అందువల్ల బాయిల్డ్ రైస్‌గా అయితేనే మిల్లింగ్ చేస్తామని మిల్లర్లు తేల్చిచెప్పారు. యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాటు మేరకు సుమారు 12 ఎల్ఎంటీల వరకు బాయిల్డ్ రైస్‌గా ఎఫ్‌సీఐకి ఇచ్చారు. మిగతా ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు లెక్కలు చూపారు. అయితే నిల్వ ఉన్న ధాన్యంలో మేలు రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ కింద ఇవ్వకుండా ఎక్కడికక్కడ బియ్యాన్ని మిల్లర్లు విక్రయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. సర్కార్ లెక్కల ప్రకారం ప్రస్తుతం మిల్లుల్లో కనీసం 50 ఎల్ఎంటీల ధాన్యమైనా నిల్వ ఉండాలి. కానీ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో టాస్‌్కఫోర్స్, విజిలెన్స్ జరిపిన తనిఖీల్లో ఈ మొత్తంలో ధాన్యం కాగితాల మీదే తప్ప భౌతికంగా లేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తప్పిన వేలం మిల్లర్లు నిల్వ ఉంచిన ధాన్యాన్ని వేలం వేయాలని గత ఆగస్టులోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ మేరకు 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచగా 54 బిడ్లు దాఖలయ్యాయి. అప్పట్లో క్వింటాల్‌కు కనిష్టంగా రూ. 1,618, గరిష్టంగా రూ. 1,732, సగటున రూ. 1,670 ధర పలికింది. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ క్వింటాల్‌కు రూ. 2,060 కాగా రవాణా ఖర్చులు, నిల్వ వల్ల రుణాలపై పెరిగిన వడ్డీ కలిపి క్వింటాల్ ధాన్యానికి రూ. 2,300 వరకు అవుతుందని అప్పటి పౌరసరఫరాల కమిషనర్ అంచనా వేశారు. వేలంలో వచ్చే ధరతో పోల్చుకుంటే నష్టం వస్తుందనే కారణంతో ఆ టెండర్లను రద్దు చేశారు. నిబంధనలు మార్చి మరోసారి అక్టోబర్‌లో టెండర్లను ఆహ్వానించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ టెండర్లను నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఇతర అధికారులతో చర్చించి మరోసారి ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జనవరి 25న ఐదుగురు ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని వేలానికి ఉంచి ఇటీవల ఫైనాన్షియల్ బిడ్లను తెరిచారు. బిడ్ల కనిష్ట ధర రూ. 1,920గా ఉన్నట్లు తెలిసింది. చక్రం తిప్పిన మాజీ సహకార సంస్థ చైర్మన్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినప్పటికీ వేలంలో రాష్ట్రంలో పలుకుబడిగల మిల్లర్లు, కొందరు వ్యాపారులే పాల్గొన్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ వేలం ప్రక్రియలో చక్రం తిప్పినట్టుగా పౌరసరఫరాల శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పలుకుబడి గల ఆయన కొత్త ప్రభుత్వంలోనూ తనదైన రీతిలో సిండికేట్ నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. క్వింటాల్ ధాన్యం రూ. 2 వేలలోపే ఉండేలా బిడ్డర్లతో రింగ్ అయినట్లు సమాచారం. వాస్తవానికి మిల్లుల్లో ఎంత యాసంగి ధాన్యం ఉందో కూడా సరిగ్గా తెలియదు. ఈ పరిస్థితుల్లోనే గత ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యం వేలం వేసేందుకు ప్రయత్నించింది. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 35 ఎల్ఎంటీలు విక్రయించేందుకు సిద్ధమైంది. విజిలెన్స్, టాస్‌్కఫోర్స్ తనిఖీల నేపథ్యంలో వీలైనంత తక్కువ ధరకు ధాన్యాన్ని దక్కించుకొని ప్రభుత్వానికి ఆ మేరకు డబ్బు చెల్లించడం ద్వారా గండం గట్కెక్కాలనే ధోరణిలో మిల్లర్లు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్వింటాల్ ధాన్యం రూ. 2,300 వరకు పలికే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా ఇప్పటి మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకుంటే..వేలం ప్రక్రియలో ముందుకెళ్లడం వల్ల సర్కారు ఖజానాకు రూ. 1,500 కోట్లకుపైగానే నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా టెండర్లపై ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. -
Fact Check: రైతులకే ప్రా‘ధాన్యం’...'పచ్చ'రాతల్లోనే దైన్యం!
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2014–15లో రెండు సీజన్లలో కలిపి 1.18 లక్షల మంది రైతుల నుంచి 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇందు కోసం రూ.5,583 కోట్లు చెల్లించింది. ఇక్కడ సగటున ఒక రైతు నుంచి సేకరించిన ధాన్యం 34.42 టన్నులు. చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉన్న రాష్ట్రంలో ఒక్కో రైతు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఎలా కొనుగోలు చేశారన్నది ఎవరికైనా కలిగే సందేహం. అంటే ఇక్కడ దళారులు, మిల్లర్లు కొందరు రైతుల పేరిట ప్రభుత్వానికి ధాన్యం విక్రయించి మద్దతు ధర కొట్టేశారన్నది సుస్పష్టం. 2015–16లో సగటున ఒక రైతు నుంచి 24 టన్నుల ధాన్యం సేకరించినట్టు చూపారు. ఇక్కడ కూడా మద్దతు ధర మధ్యవర్తులే కాజేశారని తెలుస్తోంది కదా... దీనిని బట్టి టీడీపీ హయాంలో ధాన్యం దోపిడీ ఎంతగా సాగిందో అర్థమవుతోంది. కానీ నాడు కళ్లకు గంతలు కట్టుకున్న ఈనాడుకు ఇవేవీ కనిపించలేదు. ఇప్పుడు పారదర్శకంగా సేకరణ జరుగుతున్నా... లేనిపోని ఏడుపుగొట్టు రాతలు. సాక్షి, అమరావతి: రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, మిల్లర్లకు దోచిపెట్టడం తెలుగుదేశం సంస్కృతి. వారి హయాంలో పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరించేది. కొనేదంతా మిల్లర్లు, దళారులే. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200ల వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యేక్షంగా రైతులు నష్టపోయేవారు. కానీ, సీఎంగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ప్రతి సీజన్లోనూ ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్ ప్రామాణికంగా పంట కొనుగోలు చేపట్టడంతో వాస్తవ రైతుకు పూర్తి మద్దతు ధర దక్కుతోంది. దీంతో తమ దళారుల దోపిడీ వ్యవస్థను నాశనం చేశారన్న ఆక్రోశం రామోజీ రాతల్లో నిలువెల్లా కనిపిస్తోంది. వాస్తవానికి రైతుకు మద్దతు ధరతో పాటు గన్నీ, లేబర్, రవాణా చార్జీలను సొంతంగా పెట్టుకున్న రైతుకు టన్నుకు రూ.2,523ల వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది. అందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పంట విక్రయించేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా బయట మార్కెట్లోని వ్యాపారుల్లో ధాన్యానికి డిమాండ్ పెరిగింది. చేసేదేమీ లేక వారు సైతం ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరకు మించి చెల్లిస్తూ కల్లాల్లోంచే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. అందువల్ల రైతులు మంచి రేటు వస్తున్న చోటే ధాన్యం అమ్ముకుంటున్నారు. అంత మాత్రాన ప్రభుత్వ సేకరణ తగ్గిందనడం ఎంతవరకు సమంజసం. ఈ వాస్తవాన్ని మరుగునపెట్టి రామోజీ రైతులపై కపట ప్రేమను ఒలకబోయడం చూస్తే జాలేస్తోంది. టీడీపీ ఐదేళ్లలో 17.94లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువలైన 2.65 కోట్ల టన్నులను ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి అండగా నిలిచింది. అంటే గతంతో పోలిస్తే దాదాపు 20లక్షల మంది అదనంగా రైతులు సంపూర్ణ మద్దతు ధరను అందుకున్నారు. ఆశాజనకంగా దిగుబడులు గత ఖరీఫ్‌లో దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. గతేడాది చివరల్లో మిచాంగ్ తుఫాన్ కొంత ఇబ్బంది పెట్టినా ఎకరాకు అత్యధికంగా 40–42 బస్తాల దిగుబడి వచ్చింది. జనవరి పండుగ సీజన్ కావడం, పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలకు బియ్యం అవసరం పెరగడంతో దాదాపు 15 లక్షల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు మించి(సాధారణ రకానికి రూ.100కు పైగా ఫైన్ వెరైటీలకు రూ.200–500లకు పైగా) చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేయడం విశేషం. ఇదే క్రమంలో ఆర్బీకే ద్వారా 29.58లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ లెక్కన 44.58 లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి బయటకు వెళ్లిపోయింది. అంటే దాదాపు ఈఖరీఫ్‌లో పంట మొత్తం విజయవంతంగా కొనుగోలు చేశారు. ఇంతటి ఫలితాన్ని రామోజీ కలలోకూడా ఊహించి ఉండరు. కానీ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు అడ్డగోలు అభాండాలు వేశారు. కేంద్ర నిబంధనలు రామోజీకి తెలియవా... కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర దక్కట్లేదని గుండెలు బాదుకున్న రామోజీకి.. ధాన్యం కొనుగోలు విషయంలో నిబంధనలు విధిస్తుందన్న విషయం తెలీదా? ఆ ప్రకారం తేమ 17శాతం మించితే కొనుగోలుకు ఎక్కడైనా అభ్యంతరం చెబుతారు కదా? ఇదే ఆసరాగా చేసుకుని టీడీపీ హయాంలో బస్తాలకు బస్తాలు అదనంగా రైతు నుంచి దోచేసినప్పుడు ఈనాడు గొంతెందుకు మూగబోయిందన్నది ఇక్కడి ప్రశ్న. అధికారంలో మనవాడు లేకుంటే దుమ్మెత్తి పోయడమే వారికి తెలిసిన న్యాయం. కానీ, సీఎం జగన్ రైతుకు ఒక్క రూపాయి నష్టం జరగకుండా తేమ శాతం ఎక్కువగా ఉన్నా మద్దతు ధరకు కొనుగోలు చేసి డ్రయర్ సౌకర్యం ఉన్న మిల్లులకు తరలిస్తున్నారు. ప్రకృతి వైప రీత్యాల సమయంలోనూ తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని సైతం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. ♦ ఇక దుడ్డు రకాలు(జయ రకం ధాన్యం) కేరళకు ఎగుమతి చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఒప్పందం చేసుకుంది. అందువల్ల గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆ రకాలనే సాగు చేసేందుకు మొగ్గు చూపారు. గతేడాది తుఫాన్ కంటే ముందే అక్కడ కోతలు పూర్తవడం, ప్రభుత్వం కంటే ముందుగా బయట వ్యాపారులు వచ్చి మంచి రేటు ఇచ్చి పంట కొనుగోలు చేయడంతో ప్రభుత్వానికి సేకరించే అవకాశం రాలేదు. దీనిని కూడా ఈనాడు వక్రీకరించింది. ♦ ధాన్యం సేకరణలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వమే కళ్లాల్లోని ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తోంది. అక్కడ కస్టమ్ మిల్లింగ్ చేసిన తర్వాత బియ్యాన్ని బఫర్ గొడౌన్లు, మండల నిల్వ కేంద్రాలకు తరలించాలి. వీటిన్నింటికీ ప్రతి స్టేజీలో వేర్వేరు రవాణా వ్యవస్థలు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ ప్రాంతాల్లో సమర్థవంతమైన వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించింది. దానిపై దీనిని ఈనాడు ధాన్యం సేకరణ మిల్లర్లకు అప్పగిస్తున్నారంటూ అబద్దపు ప్రచారం చేస్తోంది. -
నేటితో ధాన్యం వేలం బిడ్ల దాఖలుకు గడువు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో నిల్వ ఉన్న 2022–23 రబీ సీజన్‌కు సంబంధించిన 35 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ)ల ధాన్యం వేలం బిడ్ల దాఖలుకు గడువు శుక్రవారంతో ముగియనుంది. గత రబీలో సేకరించిన ధాన్యాన్ని రా రైస్‌గా మిల్లింగ్ చేయడానికి మిల్లర్లు ఆసక్తి చూపని విషయం తెలిసిందే. రబీలో సేకరించిన 66.84 ఎల్ఎంటీల ధాన్యం నుంచి బాయిల్డ్ రైస్‌కు సంబంధించి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఇచ్చిన టార్గెట్ ప్రకారం సుమారు 20 ఎల్ఎంటీల ధాన్యాన్ని మాత్రమే మిల్లింగ్ చేసి కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) కింద ఎఫ్సీఐకు అప్పగించాలని నిర్ణయించారు. మిగతా ధాన్యాన్ని ముడి బియ్యంగా ఇవ్వాల్సి ఉండటంతో వారు ససేమిరా అన్నారు. దీంతో గత ప్రభుత్వం 25 ఎల్ఎంటీల ధాన్యం కోసం బిడ్లు ఆహ్వానించినప్పటికీ, ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియ రద్దయింది. దీంతో గత నెలలో గ్లోబల్ టెండర్ నోటీస్ జారీ చేశారు. ఈ మేరకు వేలంలో పాల్గొనే బిడ్డర్లతో ఇటీవల సమావేశం జరగగా, వేలం నిబంధనల్లో కొన్ని సవరణలను సూచించారు. ఈ మేరకు నిబంధనలను మారుస్తూ బిడ్లు దాఖలు చేసేందుకు గడువును శుక్రవారం వరకు పొడిగించారు. -
ఆ వడ్లకు పైసలిచ్చేస్తాం!
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లులకు పంపిన 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఏమైందో లెక్క తెలియడం లేదని సాక్షాత్తూ పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మిల్లర్లు బెంబేలెత్తుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే మంత్రి ఉత్తమ్ పౌరసరఫరాల సంస్థ పనితీరుపై సమీక్ష నిర్వహించి రూ.56 వేల కోట్ల అప్పులు, రూ.11 వేల కోట్ల నష్టాల్లో ఉన్నట్లు తేల్చారు. ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్‌లలో చోటు చేసుకున్న అవకతవకలే అందుకు కారణమని, మిల్లర్లు ఇప్పటికే ధాన్యాన్ని విక్రయించడంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు కూడా లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మిల్లర్లలో ఆందోళన మొదలైంది. సర్కార్ ధాన్యం విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోకముందే రాజీ చేసుకోవాలని భావిస్తున్నారు. తమ వద్ద ఉన్న ధాన్యం నిల్వ విలువను ఖర్చులతో కలిపి ప్రభుత్వానికి చెల్లించాలని ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయమేదీ తీసుకోలేదు. మిల్లర్ల వద్ద 83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం గత సంవత్సరం రబీ(యాసంగి)లో సేకరించిన 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ముడిబియ్యంగా మిల్లింగ్ చేసేందుకు పనికిరాదని, బాయిల్డ్ రైస్‌గా మాత్రమే మిల్లింగ్ చేయడానికి వీలవుతుందని మిల్లర్లు తేల్చి చెప్పారు. ఈ మేరకు 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లుల్లోనే నిల్వ చేసినట్లు లెక్కలు చూపించారు. ఇదే కాకుండా గత సంవత్సరం వానకాలానికి సంబంధించిన మరో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా మిల్లింగ్ చేసి, ఎఫ్‌సీఐకి సీఎంఆర్ అప్పగించడంలో మిల్లర్లు విఫలమయ్యారు. ఈ మొత్తం 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ సుమారు రూ. 18 వేల కోట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. సంస్థకున్న రూ.56 వేల కోట్ల అప్పుల్లో ఈ రూ.18 వేల కోట్లు చెల్లిస్తే తప్ప మళ్లీ అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మిల్లర్ల వద్ద ఉన్నట్లు చెపుతున్న 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంపై కీలక నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై పౌరసరఫరాల సంస్థ సీఎండీ అనిల్ కుమార్, ఇతర అధికారులు ప్రణాళిక రూపొందించారని తెలిసింది. మిల్లర్లు స్వయంగా ధాన్యం విలువ చెల్లించేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన కనీస మద్ధతు ధరకు తోడు, రవాణా, నిర్వహణ ఖర్చులన్నీ మిల్లర్ల నుంచి వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. వేలం ప్రయత్నాలు విఫలం.. మిల్లర్లు సీఎంఆర్‌కు తిరస్కరించిన యాసంగి ధాన్యాన్ని విక్రయించాలని గత ప్రభుత్వం ఆగస్టు నెలలో నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత 25 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని అమ్మేందుకు బిడ్డర్ల నుంచి టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లకు 10 సంస్థలే అర్హత సాధించడంతో పాటు ధాన్యం క్వింటాలుకు సగటు ధరను రూ.1865 గా కోట్ చేయడంతో ఈ ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో ప్రభుత్వం అక్టోబర్‌లో రెండో దఫా టెండర్లను ఆహ్వానించింది. నిబంధనలను సడలించి సాధారణ మిల్లర్లు కూడా బిడ్డింగ్‌లో పాల్గొనేలా టెండర్లను ఆహ్వానించింది. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ టెండర్లకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువు దీరినప్పటికీ, పాత టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్ల వద్ద 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు లెక్కల్లో కనిపిస్తున్నప్పటికీ, అందులో సగానికి పైగా విక్రయించినట్లు పౌరసరఫరాల సంస్థ ఇప్పటికే గుర్తించింది. కర్ణాటక, తమిళనాడుకు భారీ ఎత్తున ధాన్యాన్ని, బియ్యాన్ని విక్రయించినట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. ఈ పరిస్థితుల్లో మిల్లర్ల నుంచి ధాన్యం విలువకు సమానమైన మొత్తాన్ని ( క్వింటాలుకు రూ. 2,350) చొప్పున ముక్కు పిండి వసూలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో మిల్లుల్లో ఉన్న ధాన్యంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. -
ఆర్ఎన్ఆర్ ధాన్యం @ రూ.3,545
సాక్షి, హైదరాబాద్: ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర రికార్డు సృష్టించింది. క్వింటాల్ ధర రూ.3,545 పలికింది. మహబూబ్‌గర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ చర్రితలో ఎన్నడూలేని విధంగా భారీ స్థాయి లో రేట్లు పలుకుతున్నాయి. గత సీజన్లో క్వింటాకు రూ.2,600 మాత్రమే పలికింది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 2,203 ఉండగా... మార్కెట్లో రూ. వెయ్యి నుంచి రూ.1,200 అధికంగా వస్తున్నది. బీపీ టీని అంతగా సాగు చేయకపోవడంతో సన్నాలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్, మిర్యాలగూడతోపాటు ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి అవుతోంది. అన్ని మార్కెట్లలోనూ పెద్ద మొత్తంలో ధర లభిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లా వరకే ఈ సీజన్లో 1.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. రాష్ట్ర మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ధరలు పలుకుతుండటం, రైతులు మార్కెట్‌కు క్యూ కట్టారు. దీంతో మార్కెట్‌కు ధాన్యం పెద్దఎత్తున అమ్మకానికి వస్తోంది. ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఆర్ఎన్ఆర్ సన్నరకాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు ధరలను పెంచి కొనుగోలు చేస్తున్నారు. ఆర్ఎన్ఆర్ (తెలంగాణ సోన) ఈరకం బియ్యం సన్నగా ఉండటం, క్వాలిటీ బాగా ఉండటం, నూనె శాతం తక్కువ, షుగర్ పేషంట్లకు బాగుంటుందని డిమాండ్ పెరింగింది. గతంలో వేసే బీపీటీ (సోనా రకం) ధాన్యాన్ని రైతులు అంతగా సాగుచేయకపోవడం కూడా ఈ సన్నాలకు డిమాండ్ అధికంగా వస్తున్నది. అయితే యాసంగిలో ఎక్కువశాతం 1010 దొడ్డురకం ధాన్యం సాగుచేసే అవకాశం ఎక్కువగా ఉండటంతో వచ్చే సీజన్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు సన్నరకాలకు ధరలు అధికంగా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. -
ఉదారంగా ఉండాలి
సాక్షి, అమరావతి: ఇటీవల తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఇదే విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేసి వారిలో భరోసా నింపాలని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు సూచించారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తుపానుతో పంట నష్టం, రంగు మారిన వరి ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఆర్బీకేల వారీగా కొనుగోళ్లు.. కొన్ని నిబంధనలు సడలించైనా సరే రైతులకు న్యాయం చేయాలని అధికార యంత్రాంగానికి సీఎం జగన్ స్పష్టం చేశారు. రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుంటారని, ఆర్బీకేల వారీగా కొనుగోళ్లు జరుగుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈమేరకు సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి అప్పటికప్పుడే ఆదేశాలు జారీచేశారు. నష్టపోయిన రైతన్నలకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పంట నష్టపోయిన వారికి వైఎస్సార్ ఉచిత బీమా కింద వారికి పరిహారం అందించేందుకు అనుసరించాల్సిన ప్రక్రియను సమర్థంగా చేపట్టి ఆదుకోవాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్‌పై ఆరా రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ (పంట నష్టం అంచనాలు) ప్రక్రియను ప్రారంభించారా? అని ఈ సందర్భంగా అధికారులను సీఎం జగన్ ఆరా తీశారు. ఈ నెల 11 నుంచి మొదలైన ఎన్యూమరేషన్ 18 వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. 19వతేదీ నుంచి 22 వరకు సామాజిక తనిఖీల కోసం జాబితాలను ఆర్బీకేలలో అందుబాటులో ఉంచనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ఆ తరువాత అభ్యంతరాల స్వీకరణ, సవరణల అనంతరం ఈ నెలాఖరుకు జిల్లా కలెక్టర్లు తుది జాబితాలను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. సంక్రాంతి లోగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఈ సమావేశంలో మంత్రి జోగి రమేష్, ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, సామినేని ఉదయభాను, సింహాద్రి రమేష్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, పౌరసరఫరాల శాఖ ఎండీ వీరపాండ్యన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
ఖరీఫ్ దిగుబడులు...144 లక్షల టన్నులు
సాక్షి, అమరావతి: ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసిన రైతులు దిగుబడులపై ఆశాజనకంగా ఉన్నారు. వ్యవసాయ శాఖ విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనా నివేదిక ప్రకారం ఈసారి 144 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది రాష్ట్రంలో ఖరీఫ్ సాగు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఖరీఫ్ సీజన్లో సాధారణ విస్తీర్ణం 84.98 లక్షల ఎకరాలు కాగా, గత ఏడాది 89.68 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దిగుబడులు 164 లక్షల టన్నులు వచ్చాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 74 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగయ్యాయి. దిగుబడులు 144 లక్షల టన్నులు వస్తాయని అంచనా వేశారు. అయితే, రెండో ముందస్తు అంచనా నివేదికలో దిగుబడులు కొంతమేర పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. జూలైలో అధిక, సెప్టెంబర్లలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవగా, జూన్, ఆగస్టు నెలల్లో కనీస వర్షపాతం నమోదుకాక రైతులు ఇబ్బందిపడ్డారు. సగటున 593 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, 493.8 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. ఈ ప్రభావం ఖరీఫ్ పంటల సాగుపై పడింది. ఫలితంగా సాగు విస్తీర్ణం తగ్గింది. అయితే, దిగుబడులు మాత్రం ఆశాజనకంగా ఉంటాయని రైతులు అంచనా వేస్తున్నారు. పంటల అంచనాలు ఇలా.. మొదటి ముందస్తు అంచనా దిగుబడుల నివేదిక ప్రకారం ఈ ఏడాది ఆహార పంటలు 47లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 73.89లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ప్రధానంగా వరి గత ఏడాది 40 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 74.81 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది 36.55 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 67.43 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. చెరకు 24.43లక్షల టన్నులు, పామాయిల్ 22.87లక్షల టన్నులు, మొక్కజొన్న 4.88లక్షల టన్నులు, వేరుశనగ 2.32లక్షల టన్నులు, అపరాలు 2.17లక్షల టన్నులు చొప్పున దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ప్రతికూల వాతావరణంలో సైతం మిరప రికార్డు స్థాయిలో 6 లక్షల ఎకరాలకు పైగా సాగవగా, 12 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. కాగా, పత్తి 12.85లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు.