సాక్షి, నెట్‌వర్క్: వరుసగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. చాలాచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. ఏంచేయాలో రైతులకు పాలుపోవడంలేదు. జగిత్యాల జిల్లా మల్యాల మార్కెట్ యార్డులో విక్రయానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం మొలకెత్తింది. వందల క్వింటాళ్లు మొలకెత్తడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కథలాపూర్, జగిత్యాల రూరల్, మెట్‌పల్లి తదితర మండలాల్లో ఆదివారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. మామిడికాయలు రాలిపోయాయి.
నువ్వు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి, రామగుండం, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి తదితర మండలాల్లో ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. రాజన్న సిరిసిల్లజిల్లాలోని రుద్రంగి మండలంలో వడగళ్లవానకు కొనుగోలు కేంద్రంలోని ధాన్యం కొట్టుకుపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.
నకిరేకల్, తిరుమలగిరి, రహీంఖాన్‌పేటలోని మార్కెట్లలో రైతులు ఆరబోసుకున్న ధాన్యం వరదనీటిలో కొట్టుకుపోయింది. కామారెడ్డి జిల్లాలో బిచ్కుందలోని మార్కెట్ యార్డులో రైతులు ఆరబెట్టిన వరి ధాన్యం భారీవర్షానికి కొట్టుకుపోయి సమీపంలోని డ్రెయినేజీలో కలిసింది.
శ్మశానంలోనూ ధాన్యం ఆరబోత
పాల్వంచరూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభిస్తామని చెప్పినా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కొన్నిచోట్ల కొనుగోళ్లు జరుగుతున్నా మిల్లులకు తరలింపులో జాప్యం జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించాల్సిన చోట రైతులు 20 రోజుల క్రితం ధాన్యం తెచ్చి ఆరబోశారు.
ఎప్పటికప్పుడు కొనుగోళ్లు చేపట్టి ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే మిగతా రైతులకు చోటు దక్కేది. కానీ కొనుగోళ్లే మొదలు కాకపోవడంతో నిర్దేశిత ప్రాంతం నిండిపోగా.. ఆనుకుని ఉన్న శ్మశానం (వైకుంఠధామం)లోనూ ధాన్యం ఆరబోసి రాత్రింబవళ్లు కాపలా ఉంటున్నారు. ఆకాశం మేఘావృతం కావడమే కాక చిరుజల్లులు కురుస్తుండటంతో రైతులు అవస్థలు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment