సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసి ముద్దయిన ధాన్యాన్ని సైతం మామూలు ధాన్యం ధరకే కొంటామని... రైతులు ఆందోళన చెందొద్దని సీఎం కేసీఆర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చినా క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తిస్థాయిలో భరోసా లభించట్లేదని తెలుస్తోంది. కొనుగోలు కేంద్రాలతోపాటు మిల్లర్లు తడిసిన ధాన్యాన్ని తీసుకోవడానికి సుముఖత చూపడం లేదు. త డిసిన ధాన్యాన్ని 17 శాతంలోపు తేమ ఉండేలా ఆరబెట్టి తీసుకొస్తేనే కాంటా వేస్తా మని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. ఒకవేళ అటువంటి ధాన్యాన్ని ఎక్కడైనా సేకరించినా మిల్లర్లు మాత్రం ఆ ధాన్యాన్ని తీసుకొనేందుకు ససేమిరా అంటున్నారు.
నిబంధనల పేరుతో మిల్లర్లు ససేమిరా
తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టాక మిల్లింగ్ చేస్తే వచ్చే ముడి బియ్యం రంగు మారడమేగాక, నూ కల శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే తడిసిన బియ్యాన్ని బాయిల్డ్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యంలోంచి తొలి విడతగా 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ కింద ఆయా జిల్లాలకు కేటాయించింది. మంత్రి గంగుల అధికారులు, మిల్లర్లతో సమావేశమై ఆదేశాలు జారీ చేశారు. అయితే బాయిల్డ్ రైస్ కింద కూడా తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని రైస్ మిల్లులు సేకరించడం లేదు. తడిసిన ధాన్యాన్ని కూడా 17 శాతంలోపు తేమ ఉండేలా ఆరబెట్టాకే పంపాలని చెబుతున్నారు. లేకపోతే ఎఫ్‌సీఐ ఆ బియ్యం తీసుకోదంటున్నారు.
11.72 ఎల్‌ఎంటీ మాత్రమే కొనుగోలు
రాష్ట్రంలో ఇప్పటివరకు 5,716 కొనుగోలు కేంద్రాలను తెరవగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడం, ఆరబెట్టిన ధాన్యం మళ్లీ తడవడం వంటి పరిణామాల నేపథ్యంలో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు 1.58 లక్షల మంది రైతుల నుంచి కేవలం 11.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్నే కొనుగోలు చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో పౌరసరఫరాల సంస్థ ఈ యాసంగిలో కొనుగోలు అంచనాను 1.02 కోట్ల మెట్రిక్ టన్నుల నుంచి 80.46 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించగా అంత మొత్తంలో ధాన్యం సేకరించడం కూడా అనుమానమేనని అధికారులు చెబుతున్నారు.
అన్నిచోట్లా అదే తీరు
ఖమ్మం జిల్లా వైరా మండలంలోని దాచాపురం గ్రామానికి చెందిన కొందరు రైతులు గత నెల 30 న ధాన్యాన్ని గరికపాడు సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్రంలో 738 బస్తాలను విక్రయించారు. నిర్వాహకులు ఈ ధాన్యాన్ని ఈ నెల ఒకటిన నేరెడలోని ఓ రైస్‌మిల్లుకు పంపగా ధాన్యం తడిచిందనే సాకుతో 3 రోజుల తరువాత ఆ బస్తాలను వెనక్కు పంపారు. రైతులు గొడవకు దిగడంతో ఆరబెట్టి తీసుకురావాలన్నాడు. కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఓ రైస్‌మిల్లు తనిఖీకి వెళ్లిన ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అక్కడ జరుగుతున్న జాప్యాన్ని తప్పుబట్టారు.
రైస్‌మిల్లు గుమాస్తాపై చేయిచేసుకున్న ప్రభుత్వ విప్
సాక్షి, కామారెడ్డి/భిక్కనూరు: తేమ పేరుతో ధాన్యం బస్తాలు దించుకోని రైస్‌మిల్లు గుమా స్తాపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ శివారులోని పూర్ణిమ రైస్ మిల్లుకు రైతులు ట్రాక్టర్లపై ధాన్యం శుక్రవారం తీసుకెళ్లారు. అక్కడి గుమాస్తా ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందంటూ బస్తాలను దించుకోలేదు. దీంతో రైతులు పెద్దమల్లారెడ్డి పర్యటనలో ఉన్న గంప గోవర్ధన్ దృష్టికి ఫోన్లో తీసుకెళ్లారు. ఆయన వెంటనే అధికారులతో కలసి రైస్ మిల్లు వద్దకు చేరుకున్నారు. ధాన్యం ఎందుకు తీసుకోలేదని మిల్లు యజమానిని అడగ్గా తాను ఆ సమయంలో లేనని చెప్పాడు.
దీంతో గుమాస్తాను ప్రశ్నించగా ధాన్యంలో తేమ 18–20 శాతం వరకు ఉందని ఓసారి, 16 శాతం వచ్చిందని మరోసారి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన గోవర్ధన్ గుమాస్తా చెంప చెళ్లుమనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ కావడంతో శనివారం ఉదయం నుంచి జిల్లాలోని రైస్ మిల్లర్లు అన్‌లోడింగ్ నిలిపివేశారు. అయితే జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ శనివారం మధ్యాహ్నం వారితో సమావేశమై రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించడంతో సాయంత్రం 4 గంటల నుంచి తిరిగి అన్‌లోడింగ్ మొదలుపెట్టారు. ఈ ఉదంతంపై గంప గోవర్ధన్ స్పందిస్తూ తేమ శాతం ఎంత వచ్చిందని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పడంతోపాటు మిస్‌గైడ్ చేయడంతోనే గుమాస్తాపై కోపగించానన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతుంటే కొర్రీలు పెట్టడం సరికాదని హెచ్చరించారు.
రైతుల ఘోష వినపడదా?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ధాన్యం, మొక్కజొన్న రైతుల కళ్లల్లోని ఆనందం ప్రభుత్వ నిర్వాకంతో ఆవిరై పోయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతుల ఘోష వినపడకపోవడం బాధాకరమని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఖమ్మంలో శనివారం రైతుభరోసా ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు వినతిపత్రాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్‌కు అందజేశారు. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో 80 లక్షల టన్నుల ధాన్యం, సుమారు 32 లక్షల టన్నుల మక్కలు పండితే ఇప్పటివరకు 10 లక్షల టన్నుల ధాన్యమే కొనుగోలు చేశారన్నారు. మొక్కజొన్నను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదని ఆరోపించారు. వర్షానికి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ హామీ నెరవేరలేదన్నారు.
పొంగులేటి పోరుబాట
మాజీ ఎంపీ పొంగులేటి రాజకీయంగా దూకుడు పెంచారు. ఇకపై ప్రతీ సోమవారం ప్రజాసమస్యలపై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయాలని కూడా పొంగులేటి నిర్ణయించి, తొలిలేఖ వచ్చే సోమవారం రాయనున్నారు. ఈ నెల 14న ఖమ్మం నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనాన్ని భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. తర్వాత ఉమ్మడి జిల్లాలో పొంగులేటి పాదయాత్రకు కార్యాచరణ రూపొందించు కుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పలు మండలాల్లో పాదయాత్ర చేస్తారని తెలిసింది. కాగా, నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ మాజీనేత చకిలం అనిల్‌కుమార్ పొంగులేటితో రెండు గంటలపాటు భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన నేతలు కూడా ఆయనను కలిసిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment