
చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వరదలో కొట్టుకుపోయిన ధాన్యం
సకాలంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం
చౌటుప్పల్: సకాలంలో ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా నీటిపాలు చేయాల్సి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం సాయంత్రం కురిసిన ఆకస్మిక భారీ వర్షానికి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి.
ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టుకుని తిరిగి కుప్పలు పోసుకునే సమయంలో వర్షం రావడంతో రైతులు ఏమి చేయాలో తెలియక పరుగులుపెట్టారు. అప్పటికప్పుడు ధాన్యాన్ని కుప్పలుగా పోసుకున్నారు. పట్టాలు కప్పుకున్నారు. పెద్ద ధాన్యం కుప్పలను ట్రాక్టర్లతో దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేశారు. అయినా వర్షం భారీగా కురవడంతో వరద నీటి ప్రవాహంలో ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు బోరున విలపించారు.