అన్నదాతను దెబ్బతీసిన అకాల వర్షాలు.. తడిసిపోయిన కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం
కొన్నిచోట్ల ధాన్యం రాశులు కొట్టుకుపోయిన వైనం
ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు అతలాకుతలం అవుతున్నారు. గత రెండురోజులుగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో కోత దశలో ఉన్న వరి పంట నేలవాలింది. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో.. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిచిపోయాయి.
ఇంతకుముందు వర్షానికి తడవడంతో ఆరబోసుకున్న వడ్లు వర్షపు నీటికి కొట్టుకుపోయాయని రైతులు వాపోయారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మార్కెట్ యార్డు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోయింది. మహబూబాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా వర్షం కారణంగా రైతులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.
ఉమ్మడి కరీంనగర్‌లోని పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శుక్రవారం సుమారు గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. పలు మండలాల్లో క్వింటాళ్ల కొద్దీ వడ్లు తడిచిపోయాయి. ఖమ్మం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు మామిడి కాయలు రాలిపోయాయి. ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేయాలని, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment