శ్రీకాకుళం జిల్లాలో రైతులను ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం, మిల్లర్లు
ధాన్యం అమ్మడానికి మిల్లర్ల వద్దకే వెళ్లాలన్న అధికారులు
మద్దతు ధర ఇవ్వడానికి మిల్లర్ల నిరాకరణ
తక్కువ ధర నిర్ణయించిన దళారులు
ముందు అంగీకరించి, ఆ తర్వాత ధర మరింత తగ్గించిన మిల్లర్లు
ధాన్యం ట్రాక్టర్లతో రోడ్డుపైనే నిరసన తెలిపిన రైతులు
పది మందికి అన్నం పెట్టే అన్నదాతను అగచాట్లకు గురిచేసింది. కూటమి ప్రభుత్వం నడి రోడ్డుపై అవమానించింది. నూతన సంవత్సరం వేళ మిల్లర్లతో కలిసి అన్నదాతలతో ఆడుకుంది. ఆరుగాలం శ్రమించి పంటను అమ్ముకునేందుకు వెళ్లిన రైతులను నడిరోడ్డుపై నిలబెట్టింది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ప్రియాగ్రహారంలో బుధవారం జరిగిన ఈ ఘటన రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది.
పోలాకి: ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల ధాన్యం రంగుమారింది. ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా వదిలేసింది. ఇదే అదనుగా కొందరు మిల్లర్లు అక్రమాలకు తెగబడుతున్నారు. తేమ పేరిట రైతులను నిలువునా దగా చేస్తున్నారు. అధికారులూ మిల్లర్లకే అమ్మాలని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం, మిల్లర్లు కలిసి ఆడుతున్న ఈ ఆటలో రైతులు నలిగిపోతున్నారు.
బుధవారం పొలాకి మండలం ప్రియాగ్రహారంలో 20 మంది అన్నదాతలు నడిరోడ్డుపై నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రియాగ్రహారానికి చెందిన రైతులు బుధవారం రైతు సేవా కేంద్రానికి వెళ్లి ధాన్యానికి ట్రక్‌షీట్ వేయాలని కోరారు. ధాన్యం శాంపిల్ చూసిన సిబ్బంది.. తాము తేమ శాతం మాత్రమే నిర్థారించగలమని, రంగు మారినట్లు కనిపిస్తున్నందున మిల్లర్‌ను సంప్రదించాలని చెప్పారు.
రైతులు మిల్లర్ దగ్గరకు వెళ్లగా.. మద్దతు ధర ఇవ్వలేనంటూ కరాఖండిగా చెప్పేశారు. కొద్దిసేపటికి మిల్లర్ తరపున దళారీ ఎంటరయ్యాడు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర (80 కేజీలు) రూ.1,840 కాగా.. రైతు సొంత ఖర్చులతో ధాన్యాన్ని మిల్లు వద్ద చేర్చేలా రూ.1,700కు దళారీ రేటు మాట్లాడాడు. గత్యంతరం లేక రైతులు అంగీకరించారు. ధాన్యం ట్రాక్టర్లకు లోడ్ చేశారు. ఇంతలో మిల్లర్ మళ్లీ మాటమార్చేశాడు.
ఆ ధాన్యం తమకు వద్దని, రూ.1,500 మాత్రమే ఇస్తామని, లేదంటే అసలు తీసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో రైతులు నిర్ఘాంతపోయారు. సొంత ఖర్చులతో ధాన్యం తెచ్చిన తర్వాత తీసుకోకపోతే ఎలా అంటూ రోడ్డపైన ఆందోళనకు దిగారు. రైతంటే ఇంత చిన్నాచూపా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య మండలం అంతా ఉందని రైతులు తెలిపారు.
బియ్యం బాగున్నా కొనరెందుకు?
ధాన్యం పైకి రంగు మారినట్లు కనిపిస్తున్నా, లోపల బియ్యం బాగుందని రైతులు చెబుతున్నారు. రంగు మారిన ధాన్యం నుంచి తీసిన బియ్యాన్ని వారు చూపించి, నాణ్యత ఏమాత్రం తగ్గలేదని తెలిపారు. అయినా ఎందుకు కొనడంలేదని నిలదీశారు.
రైతులకు జరిగిన అవమానాన్ని, వారి ఆవేదనను ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మిల్లర్లకు నచ్చజెప్పారు. మిల్లర్లు చెప్పిన ధరకు, మద్దతు ధరకు మధ్యస్తంగా మరో ధరకు రైతులను బలవంతంగా ఒప్పించారు.
అవగాహన కల్పిస్తాం
ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. రంగు మారిన ధాన్యంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానందున మిల్లర్లు కొనడంలేదు. తుపాను ప్రభావం నేపథ్యంలో రైతుల వద్ద ఉన్న రంగు మారిన ధాన్యంపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాత రైతులకు తెలియజేస్తాం. – ఎం.సురేష్‌కుమార్, తహశీల్దార్, పోలాకి
రైతులను వంచించారు
వర్షంతో పంట నేలవాలి అనేక గ్రామాల్లో ధాన్యం రంగు మారటంతో రైతులంతా నష్టపోయారు. అన్నదాతకు అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం మమ్మల్ని వంచించింది. నూతన సంవత్సర ఆరంభం రోజున నడిరోడ్డుపై నిలబెట్టింది. అధికారులు మా సమస్య పరిష్కరించకుండా నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు లైన్‌లో నిలబడ్డారు. – దుర్రు యర్రయ్య, రైతు, ప్రియాగ్రహారం
మళ్లీ దళారుల రాజ్యమే..
పంట కొనుగోలులో మళ్లీ దళారుల రాజ్యం వచ్చింది. చాలాచోట్ల మిల్లర్లు దళారులతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని రైతులను నిలువునా ముంచుతున్నారు. మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ పూర్తయ్యేలా కొనుగోలు చేసినట్లు రికార్డులు చూపించి, ఎంపిక చేసిన వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నారు.
వాస్తవానికి ఆ రైతులు ధాన్యం నూర్పిడి కూడా చేయడంలేదు. ఇది ముమ్మాటికీ మోసమే. ఇలాంటి వాటిపై ప్రతి మండలంలో మిల్లర్ల వారీగా అధికారులు సూక్ష్మ పరిశీలన చేయాలి. – కరిమి రాజేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment