అనకాపల్లి జిల్లా తుమ్మపాలలో నీటి మునిగిన వరి పనలను గట్టుకు చేర్చుతున్న రైతు
ఉత్తర, కోస్తాంధ్రలో అన్నదాతలు విలవిల
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిర్వాకం, నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేయడం రైతులకు ఆశనిపాతంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ నిర్వాకం వల్ల మద్దతు ధర దక్కక గగ్గోలు పెడుతున్న రైతులు.. తాజాగా ముసురు పట్టి కురుస్తున్న వర్షాలతో మరింత కుదేలవుతున్నారు.
మరో వైపు కళ్లాల్లోని పంట నేలకొరిగి ముంపునకు గురవుతుంటే.. ఇంకో వైపు కోసిన ధాన్యం రాసులన్నీ తడిసి ముద్దవుతున్నాయి. కళ్లెదుటే ధాన్యం మొలకలెత్తి.. రంగు మారిపోతూ.. తేమ శాతం అంతకంతకు పెరిగిపోతుండడం రైతులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వరుస వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
పంట ఏపుగా ఎదిగే వేళ జూలైలో కురిసిన అకాల వర్షాలతో పలు జిల్లాల్లో రెండోసారి విత్తుకున్నారు. పంట ఏపుగా ఏదిగే వేళ సెప్టెంబర్‌లో వరదలు, భారీ వర్షాలు దెబ్బతీస్తే.. కోత కోసే సమయంలో ఫెంగల్ తుపాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తాజాగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలు రైతుల ఆశలను పూర్తిగా చిదిమేస్తున్నాయి. కృష్ణా డెల్టాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోతలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
పల్నాడు జిల్లాలో ఇంకా పంట పూర్తిగా చేనుపైనే ఉంది. ఉత్తరాంధ్ర మొదలు పల్నాడు వరకు 8 లక్షల ఎకరాల్లో పంట చేలల్లోనే ఉంది. శ్రీకాకుళంలో 70 వేల ఎకరాలు, అనకాపల్లిలో 65 వేలు, కృష్ణా డెల్టాలో 80 వేలు, గుంటూరులో 30 వేల, బాపట్లలో 1.82 వేల ఎకరాలు, పల్నాడులో 50 వేల ఎకరాల్లో పంట చేనుపై ఉంది. ఆయా జిల్లాల్లో 50 శాతానికి పైగా పంట ముంపు నీటిలో చిక్కుకుని నేలకొరిగింది.
మొలకెత్తుతున్న ధాన్యం
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట పూర్తిగా నేలకొరిగింది. ఆయా జిల్లాల్లో కోసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వర్షానికి తడవకుండా కప్పుకునేందుకు టార్పాలిన్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. వీటిని సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో అద్దెకు తెచ్చుకొని మరీ కప్పుకుంటున్నారు.
మరొక వైపు ఒబ్బిడి చేసుకునేందుకు, చేనుపై వరిగిన పంటను కాపాడుకునేందుకు కూలీలు దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మరొక వైపు రైతుల వద్ద సిద్ధంగా ఉన్న 3–4 లక్షల టన్నుల ధాన్యం రంగుమారి, మొలకలొచ్చే పరిస్థితి ఏర్పడడంతో లబోదిబోమంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్దతు ధర లభించక అయినకాడకి అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడింది. పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖాధికారులు.. దళారీలు, మిల్లర్లతో కుమ్మక్కు కావడంతో 75 కేజీల బస్తాకు 300–400 వరకు నష్టపోతున్నారు. వరుస వైపరీత్యాలతో తేమ 20–25 శాతం మధ్య నమోదవుతోంది. తాజాగా కురుస్తున్న వర్షాలు, మంచు ప్రభావంతో అది 25–30 శాతం వరకు వెళ్లొచ్చని వాపోతున్నారు.
16 లక్షల టన్నుల ధాన్యం మాటేంటి?
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో 70 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వగా, 34.92 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 84.13 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ఆ మేరకు తొలుత 32.75 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ధేశించగా, దాన్ని 36–37 లక్షల వరకు పెంచినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే 22.80 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్టుగా ప్రభుత్వం చెబుతుండగా, ప్రొక్యూర్‌మెంట్ వెరైటీస్‌కు సంబంధించి 16 లక్షల టన్నులకు పైగా ధాన్యం ఇంకా రైతుల వద్దే ఉంది.
అత్యధికంగా శ్రీకాకుళం, కృష్ణ జిల్లాల్లో 2.50 లక్షల టన్నుల చొప్పున, విజయనగరం జిల్లాలో 1.50 లక్షల టన్నులు, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాల్లో లక్ష టన్నుల చొప్పున ధాన్యం ఉంది. నాన్ ప్రొక్యూర్‌మెంట్ వెరైటీస్‌కు సంబంధించి మరో 3–4 లక్షల టన్నుల ధాన్యం రైతుల దగ్గర ఉండడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment