
సర్కారు అబద్ధాలపై ఎస్సీ పారిశ్రామికవేత్తల ఆగ్రహం
ఎస్సీలకు పెట్టుబడి రాయితీ పెంచామంటూ కూటమి నేతల ప్రచారం
నూతన పారిశ్రామిక విధానంలో పెట్టుబడి రాయితీని 35 శాతానికి తగ్గించిన ప్రభుత్వం
గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 45 శాతం పెట్టుబడి రాయితీ
ఆ మొత్తాన్ని కూటమి సర్కారు తగ్గించడంపై దళిత పారిశ్రామిక సంఘాల నిరసన
ఇదే విషయంపై శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్‌సీపీ
దీంతో రాయితీని 45 శాతానికి పెంచుతూ తాజాగా నిర్ణయం
కానీ.. అదనంగా 10 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రచారం చేయడంపై దళితసంఘాల ఆగ్రహం
ఎస్సీ, ఎస్టీలకు కనీసం 50 శాతం రాయితీ ఇవ్వాలని డిమాండ్
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అదనంగా మరో 10 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించడంపై దళిత పారిశ్రామికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ‘వైఎస్సార్ బడుగు వికాసం’ పేరిట ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 45 శాతం పెట్టుబడి రాయితీ ఇవ్వగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని 35 శాతానికి పరిమితం చేస్తూ నూతన పారిశ్రామిక విధానం 4.0ను తీసుకొచి్చందని దళిత పారిశ్రామిక సంఘాలు విమర్శించాయి.
ఇదే విషయంపై సాక్షి ‘పారిశ్రామిక పాలసీల్లో బడుగులకు మొండిచెయ్యి’ శీర్షికన కథనం ప్రచురించింది. ఆ తర్వాత దళిత పారిశ్రామిక సంఘాలు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఎదుట పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేయగా.. జరిగిన తప్పును త్వరలోనే సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. నవంబర్‌లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో శాసనమండలిలో ఎస్సీ, ఎస్టీ రాయితీలపై వైఎస్సార్‌సీపీ ప్రతినిధులతో పాటు చైర్మన్ కూడా ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని పట్టుబట్టడంతో గతిలేని పరిస్థితుల్లో ఇప్పుడు తిరిగి పెట్టుబడి రాయితీని 45 శాతానికి పునరుద్ధరించారు.
వాస్తవం ఇలా ఉంటే.. కూటమి నాయకులు ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో 10 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటనలు జారీ చేయడం, దీనిని బాకా పత్రికలు పతాక స్థాయిల్లో అదనంగా 10 శాతం ప్రయోజనం అని ప్రచురించడాన్ని దళిత పారిశ్రామిక వేత్తలు తప్పుపడుతున్నారు. కేవలం ఉన్న దాన్ని పునరుద్ధరించి.. అదనంగా ఒక్క శాతం కూడా పెంచకుండా పెంచేసినట్టు ఎలా ప్రచారం చేసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment