
నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఖరీదైపోతున్న భోజనం
సాక్షి, అమరావతి: నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో ఇంటి వంటా మంట పుట్టిస్తోంది. భోజనం తయారీ ఖరీదు భారీగా పెరుగుతోంది. గతేడాది జనవరితో పోలిస్తే ఈ సంవత్సరం జనవరి నెలలో శాకాహార భోజన వ్యయం 2 శాతం, నాన్ వెజ్ భోజన వ్యయం 17 శాతం పైగా పెరిగినట్లు క్రిసిల్ తాజాగా విడుదల చేసిన రోటీ రైస్ రేట్ (ఆర్‌ఆర్‌ఆర్) నివేదిక వెల్లడించింది.
రైస్, చికెన్, పెరుగు, సలాడ్ ఆధారంగా ఒక ప్లేట్ నాన్‌వెజ్ థాలీ ధరను నిర్ణయిస్తారు. అదే వెజ్ థాలీ అయితే రైస్, దాల్, పెరుగు, సలాడ్ ఉంటాయి. నాన్ వెజ్ థాలీ తయారీ వ్యయంలో 50 శాతం చికెన్‌దే. బ్రాయిలర్ చికెన్ ధరలు 33 శాతం పెరగడంతో నాన్ వెజ్ భోజనం ఖర్చు పెరగడానికి ప్రధాన కారణమని తెలిపింది.
గతేడాది జనవరి నెలలో రూ.52గా ఉన్న ఒక ప్లేట్ నాన్ వెజ్ థాలీ ధర ఈ ఏడాది రూ.60.6కి పెరిగింది. గతేడాది చికెన్ ఉత్పత్తి అధికంగా ఉండి ధరలు తక్కువగా ఉండటంతో థాలీ వ్యయం బాగా తగ్గిందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఉత్పత్తి తగ్గడం, దాణా ధరలు ముఖ్యంగా మొక్కజొన్న ధర పెరగడంతో థాలీ ఖర్చు పెరిగిందని తెలిపింద. రానున్న కాలంలో కూడా నాన్ వెజ్ థాలీ ధరలు పెరిగుతాయని పేర్కొంది.
వెజ్‌కి కలిసొచ్చిన గ్యాస్, టమోటా
టమోటా, గ్యాస్ సిలెండర్ ధరలు తగ్గడం వెజ్ థాలీకి కలిసొచ్చింది. పప్పులు, ఆయిల్ ధరలు పెరిగానా వెజ్ థాలీ వ్యయం స్పల్పంగా ఉండటానికి టమోటా, గ్యాస్ ధరలు తగ్గడమేనని క్రిసిల్ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బంగాళా దుంపల ధరలు ఏకంగా 35 శాతం, వంట నూనెల ధరలు 17 శాతం, పప్పు దినుసులు 7 శాతం పెరిగాయి. ఇదే సమయంలో గ్యాస్ సిలెండర్ ధర రూ.903 నుంచి 803కు తగ్గింది. టమోటా ధరలు గతేడాదితో పోలిస్తే 34 శాతం తగ్గాయి. దీంతో వెజ్ థాలీ కేవలం 2 శాతం పెరిగి రూ.28 నుంచి రూ.28.7కి చేరినట్లు క్రిసిల్ పేర్కొంది.