అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్య స్నాక్స్‌తో విందు
పగలూ రాత్రీ భారీ ఆర్డర్లు పెడుతున్న జనం
ఢిల్లీ, డెహ్రాడూన్‌లో ఏడాదికి రూ.20 లక్షల విలువైన ఆన్‌లైన్ ఆర్డర్లు
43 మంది ఏడాదికి సగటున రూ.75,000 విలువైన చిప్స్ ఆర్డరు
వాలెంటైన్స్ డే రోజు నిమిషానికి 307 గులాబీ పువ్వుల డెలివరీ
హైదరాబాద్‌లో ఓ వ్యక్తి మ్యాంగో ఫ్రూటీ కోసం రూ.35,000 ఖర్చు
ఇంకో వ్యక్తి 217 ఈనో ప్యాకెట్లు ఆర్డరు
బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 2024 ఆన్‌లైన్ ఆర్డర్లలో ఆసక్తికర అంశాలు
సాక్షి, అమరావతి: కాలం మారింది.. అభిరుచులు, అలవాట్లూ మారిపోతున్నాయి. అర్ధరాత్రి వేళ మనం గాఢ నిద్రలో ఉన్న సమయంలో చాలా విందులు జరిగిపోతున్నాయి. రాత్రి పెందరాళే పడుకోవాలన్న పెద్దల మాట ఇప్పుడు చెల్లుబాటు కావడంలేదు. అర్ధ రాత్రి 12 దాటిన తర్వాత మొదలు తెల్లారేవరకు దేశంలో చాలా ఫుడ్ డెలివరీ జరిగిపోతోంది. లక్షలాది మంది నిశిరాత్రిలో ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇందులో చిప్స్, కూల్‌డ్రింక్స్‌దే అగ్రస్థానం. 2024 సంవత్సరానికి సంబంధించి ఈ కామర్స్ సంస్థలు విడుదల చేసిన డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. అర్థరాత్రి 12 నుంచి తెల్లవారుఝామున 4 గంటల మధ్య ఫుడ్ ఆర్డర్లు అత్యధికంగా వస్తున్నట్లు ఈ కామర్స్ సంస్థలు బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి సంస్థల డేటా పరిశీలిస్తే తెలుస్తోంది.
2024లో ఈ సమయంలో ఏకంగా రెండు కోట్లపైగా ఆర్డర్లు స్నాక్స్ కోసం వచ్చినట్లు ఈ కామర్స్ సంస్థలు వెల్లడించాయి. ఒక్క ముంబైలోనే ఈ సమయంలో 31.5 లక్షల ఆర్డర్లు డెలివరీ చేసినట్లు తెలిపాయి.
నిరంతరం భారీ ఆర్డర్లు
పగలూ రాత్రీ నిరంతరం ఆన్‌లైన్‌లో భారీ ఆర్డర్లు వస్తున్నట్లు ఈ సంస్థలు చెబుతున్నాయి. చాలా మంది నిత్యావసర సరుకులూ ఆన్‌లైన్‌లో భారీగానే తెప్పించేస్తున్నారు. గోధుమ పిండి, ఆయిల్, దోశ పిండి, పాలు, పెరుగు, చిప్స్, కూల్‌డ్రింక్స్, పచ్చి మిరపకాయలు, టమోటాలు వంటివి ఆన్‌లైన్ ద్వారా కొంటూ లక్షల్లో బిల్లులు చేస్తున్నారు. ఢిల్లీ, డెహ్రాడూన్‌లలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా కొందరు ఏడాదికి రూ. 20 లక్షలు విలువైన కొనుగోళ్లు చేశారంటే ఆర్డర్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
చిప్స్, కూల్‌డ్రింక్స్‌దీ పెద్ద మార్కెట్టే. బ్లింకిట్ ఒక్కటే ఈ సంవత్సరం 1.75 కోట్ల మ్యాగీ ప్యాకెట్లను డెలివరీ చేస్తే, జెప్టో 12 లక్షల లేస్ మ్యాజిక్ మసాలా చిప్స్ సరఫరా చేసింది. అంతేకాదు.. బ్లింకిట్ 1.85 కోట్ల కోకోకోలా కాన్స్, 84 లక్షల బాటిల్స్ థమ్సప్, 14.6 లక్షల మజా బాటిల్స్‌ను డెలివరీ చేసింది. ఒక్క వ్యక్తే ఏకంగా 1,203 స్స్రైట్ బాటిల్స్ ఆర్డరు పెట్టాడు. 43 మంది ఒకొక్కరు రూ.75,000 విలువైన చిప్స్ ప్యాకెట్లను ఈ ఏడాదిలో కొన్నారు.
హైదరాబాద్, చెన్నై, కొచ్చి, కోల్‌కతా వంటి పట్టణాల్లో చిప్స్ ఆర్డర్లు అత్యధికంగా ఉంటున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఒకాయన ఫ్రూటీ కోసం ఒక్క ఏడాదిలో రూ.35,000 ఖర్చుచేస్తే, మరో వ్యక్తి గ్యాస్ సమస్య తగ్గించే ఈనో ప్యాకెట్లు 217 కొనేశాడు. వాలెంటైన్స్ డే రోజున ప్రతి నిమిషానికి 307 గులాబీ పువ్వులు ఈ సంస్థలు డెలివరీ చేశాయి. జెప్టో ఏడాది మొత్తం మీద 8.25 లక్షల గులాబీ పువ్వులను సరఫరా చేసింది.
ముంబైకి చెందిన జంతు ప్రేమికుడు ఒకాయన కుక్కలు, పిల్లుల ఆహారం కోసం రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశాడట. చెన్నైకి చెందిన మరో జంతు ప్రేమికుడు జెప్టో నుంచి 5,234 క్వింటాళ్ల ఆహారం జంతువుల కోసం ఆర్డర్లు పెట్టారు.
విజయవాడ వాళ్లకి పాలు, పెరుగుంటే చాలు
రాష్ట్రంలోని విజయవాడ విషయానికి వస్తే ఇన్‌స్టామార్ట్‌లో అత్యధికంగా పాలు, పెరుగు, టమోటా, పచ్చిమిర్చి, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి వాటిని అత్యధికంగా కొంటున్నారు. రోజువారీ ఆర్డర్లలో బ్రెడ్, కోడిగుడ్లు కూడా ఉంటున్నాయి. విజయవాడలో పది నిమిషాలకు ఒకసారి ఎల్రక్టానిక్ వస్తువులను కొంటున్నారు. పండుగల సమయంలో సుమారుగా రూ.1.5 లక్షల విలువైన ఎల్రక్టానిక్ వస్తువులను ఆన్‌లైన్ ద్వారా కొంటున్నట్లు ఈ సంస్థలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment