మీ ఆర్డర్‌.. వచ్చిందండీ.. | Online orders from e commerce to food | Sakshi
Sakshi News home page

మీ ఆర్డర్‌.. వచ్చిందండీ..

Published Mon, Dec 9 2024 6:02 AM | Last Updated on Mon, Dec 9 2024 6:02 AM

Online orders from e commerce to food

పెరిగిన ఆన్‌లైన్‌ బిజినెస్‌ ఈ కామర్స్‌ నుంచి ఫుడ్‌ వరకు ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు

డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు పెరిగిన ఆదరణ 

జిల్లాలో ఏడు వేల మంది వరకు డెలివరీ బాయ్స్‌ 

 నెలకు రూ. 17 వేల నుంచి 20 వేలకు పైనే సంపాదన

సాక్షి, భీమవరం:  ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ బిజినెస్‌ పెరిగింది. ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్, క్లాత్, రెడీమేడ్, టూల్స్, హోమ్‌ నీడ్స్, మెడికల్, కిరాణా, ఫర్నిచర్‌ తదితర వివిధ రకాల వస్తువుల నుంచి ఫుడ్‌ ఐటమ్స్‌ వరకు అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 

అందుకు తగ్గట్టుగానే వస్తువులను డోర్‌ డెలివరీ సేవలందించే ఈ కార్ట్, డెలివరీ, అమెజాన్, షాడోఫెక్స్, ఈ.కామ్‌ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌ బీస్, బ్లూడార్ట్, వాల్మో తదితర ఈ–కామర్స్‌ సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ–కార్ట్‌ బ్రాంచీలు మూడు వరకు ఉన్నాయి. 

తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, భీమవరం, నరసాపురం, ఆకివీడు తదితర పట్టణాలతో పాటు పలు మండల కేంద్రాల్లోను తమ బ్రాంచ్‌లు ఏర్పాటుచేశాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా సంస్థలకు చెందిన బ్రాంచ్‌లు 80కు పైనే ఉన్నాయి.  

డెలివరీ బాయ్స్‌కు డిమాండ్‌ 
ఆన్‌లైన్‌ ఆర్డర్లు పెరగడంతో డెలివరీ బాయ్స్‌కు డిమాండ్‌ ఏర్పడింది. పార్శిళ్లపై గతంలో అంతంత మాత్రంగా ఉండే కమీషన్‌ను ఇటీవల ఏజెన్సీలు పెంచాయి. ప్రస్తుతం లోకల్, లాంగ్‌ రూట్‌ను బట్టి ఒక్కో పార్శిల్‌ డెలివరీపై రూ.14 నుంచి రూ.20 వరకు కమీషన్‌ ఇస్తున్నాయి. వారం వారం పేమెంట్లు చేస్తున్నాయి. 

నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదించుకోవచ్చునంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ నిరుద్యోగ యువతను ఆకర్షిస్తున్నాయి. డెలివరీ బాయ్స్‌కు బైక్, డ్రైవింగ్‌ లైసెన్స్, స్మార్ట్‌ఫోన్‌ తప్పనిసరి. ఒక్క భీమవరంలోనే 500 మందికిపైగా డెలివరీ బాయ్స్‌/ఏజెంట్లుగా సేవలు అందిస్తూ ఉపాధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు వేలకు పైగా డెలివరీ బాయ్స్‌ ఉంటారని అంచనా. 

అధిక శాతం మంది ఫుల్‌ టైమ్‌ వర్కర్స్‌గా పనిచేస్తున్నారు. 5 శాతం వరకు మహిళలు కూడా డెలివరీ సర్విస్‌ చేస్తున్నారు. రోజుకు 40 నుంచి 60 వరకు పార్శిళ్లు డెలివరీ చేయడం ద్వారా నెలకు 15 వేల నుంచి రూ. 20 వేలకు పైగా ఆర్జిస్తున్నారు.  

ఫుడ్‌ డెలివరీ యాప్‌లతో పార్ట్‌టైం అవకాశాలు 
ఒకప్పటిలా రెస్టారెంట్‌కు వెళ్లి తినడం, పార్శిల్‌ తెచ్చుకోవడమంటే ఇప్పుడు చాలా మంది పెద్ద పనిగా ఫీల్‌ అయిపోతున్నారు. మొబైల్‌లోని జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్‌ డెలివరీ యాప్‌పై ఒక క్లిక్‌ ద్వారా తమకు ఇష్టమైన రెస్టారెంట్‌ నుంచి ఇష్టమైన ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుంటున్నారు. దీంతో ఫుడ్‌ డెలివరీ సంస్థల సేవలు మారుమూల ప్రాంతాలకు విస్తరించాయి. 

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి నిర్ణీత వేళల్లో ఫుడ్‌ ఆర్డర్లు ఉండటం వల్ల వీటిలో పార్ట్‌టైం జాబ్‌ అవకాశాలు ఉంటున్నాయి. ఆయా సమయాల్లో మూడు నాలుగు గంటల పాటు డోర్‌ డెలివరీ సర్విస్‌ చేస్తూ ఆదాయం పొందుతున్నారు. 

పాకెట్‌ మనీగా పనికొస్తాయని విద్యార్థులు, డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ను స్ఫూర్తిగా తీసుకుని డిగ్రీ, పైచదువులు చదివిన వారు సైతం డెలివరీ బాయ్స్‌గా చేస్తున్నారు. ఈ ఫుడ్‌ డెలివరీ యాప్‌లలో పని చేస్తున్న వారు మూడు వేల వరకు ఉండగా అధికశాతం మంది నిరుద్యోగ యువత, విద్యార్థులు ఉంటున్నారు. రోజుకు రూ. 500 నుంచి రూ.700 వరకు ఆర్జిస్తున్నారు. 

కాలంతో పోటీపడుతూ  
పార్శిల్‌ డెలివరీ చేస్తేనే డెలివరీ బాయ్స్‌కు కమీషన్‌ వస్తుంది. అందుకయ్యే బైక్‌ మెయింటినెన్స్, పెట్రోల్‌ ఖర్చులను వీరే భరించాలి. ట్రాఫిక్‌ ఉన్నా, గుంతల రోడ్లైనా కాలంతో పోటీ పడుతూ నిర్ణీత సమయానికి ఆర్డర్‌ కస్టమర్లకు డెలివరీ ఇవ్వడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు.

ట్రైన్‌లో ఉన్నా ఆర్డర్‌ చెంతకు చేరుస్తారు. ఒక్కోసారి తప్పుగా ఇచ్చిన అడ్రస్‌లు, ఫోన్‌ నెంబర్లతో ఆచూకీ తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఆర్డర్‌ పెట్టిన వస్తువులు సరిగా లేదనో, చెప్పిన సమయానికి రాలేదనో కస్టమర్ల చీత్కారాలకు చిరునవ్వుతో బదులిస్తూనే సాగిపోతుంటారు.

బ్యాగు నిండా 
పార్శిళ్లతో.. ఇప్పుడు ఎక్కడ చూసినా డెలివరీ బాయ్‌లే. పగలనక రేయనకా, ఎండనక వాననక కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు బైక్‌లు, స్కూటర్లపై రయ్‌ రయ్‌ మంటూ ఉరుకులు పరుగులు పెడుతూ కనిపిస్తున్నారు. వస్తువులు, ఆహారాన్ని ఆర్డర్‌ పెట్టిన వారి చెంతకు చేరుస్తూ సేవలందిస్తున్నారు.

ఇన్‌టైంలో అందిస్తేనే..
రెండు నెలల నుంచి డెలివరీ బాయ్‌గా చేస్తున్నాను. రోజుకు 40 నుంచి 50 వరకు పార్శిళ్లు డెలివరీ చేస్తుంటాను. ఇన్‌టైంలో ఆర్డర్‌ పెట్టిన వారికి పార్శిల్‌ డెలివరి చేయాలన్నదే మా టార్గెట్‌. అది రీచ్‌ అయితేనే ఆనందంగా ఉంటుంది.   – బి.అశోక్‌ కుమార్, వీరవాసరం 

ఉరుకుల పరుగుల జీవితం 
మూడేళ్ల నుంచి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాను. ఆర్డర్‌లో సూచించిన సమయానికి పార్శి­ల్‌ డెలివరీ చేయా­లి. అందుకనే ఎండైనా వానైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉరుకులు పరుగులు పెడుతూ పార్శిల్స్‌ అందజేస్తుంటాం.  – ఎం.సునీల్‌ కుమార్, డెలివరీ బాయ్, భీమవరం 

ఇబ్బందులు ఉంటాయి
డెలివరీ చేసే సమయంలో ఆర్డర్‌ పెట్టిన వారు ఫోన్‌ నంబర్, అడ్రస్‌ సరిగా ఇవ్వకపోవడం వల్ల ఒక్కోసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్డర్‌ డెలివరీ చేస్తేనే మాకు కమిషన్‌ వస్తుంది. లేకపోతే ఎంత తిరిగినా ఫలితం లేక నష్టపోతాం.  – పి.రమేష్, డెలివరీ బాయ్, పెన్నాడ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement