Online Business
-
మీ ఆర్డర్.. వచ్చిందండీ..
సాక్షి, భీమవరం: ఇటీవల కాలంలో ఆన్లైన్ బిజినెస్ పెరిగింది. ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్, క్లాత్, రెడీమేడ్, టూల్స్, హోమ్ నీడ్స్, మెడికల్, కిరాణా, ఫర్నిచర్ తదితర వివిధ రకాల వస్తువుల నుంచి ఫుడ్ ఐటమ్స్ వరకు అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే వస్తువులను డోర్ డెలివరీ సేవలందించే ఈ కార్ట్, డెలివరీ, అమెజాన్, షాడోఫెక్స్, ఈ.కామ్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బీస్, బ్లూడార్ట్, వాల్మో తదితర ఈ–కామర్స్ సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ–కార్ట్ బ్రాంచీలు మూడు వరకు ఉన్నాయి. తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, భీమవరం, నరసాపురం, ఆకివీడు తదితర పట్టణాలతో పాటు పలు మండల కేంద్రాల్లోను తమ బ్రాంచ్‌లు ఏర్పాటుచేశాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా సంస్థలకు చెందిన బ్రాంచ్‌లు 80కు పైనే ఉన్నాయి. డెలివరీ బాయ్స్‌కు డిమాండ్ ఆన్లైన్ ఆర్డర్లు పెరగడంతో డెలివరీ బాయ్స్‌కు డిమాండ్ ఏర్పడింది. పార్శిళ్లపై గతంలో అంతంత మాత్రంగా ఉండే కమీషన్‌ను ఇటీవల ఏజెన్సీలు పెంచాయి. ప్రస్తుతం లోకల్, లాంగ్ రూట్‌ను బట్టి ఒక్కో పార్శిల్ డెలివరీపై రూ.14 నుంచి రూ.20 వరకు కమీషన్ ఇస్తున్నాయి. వారం వారం పేమెంట్లు చేస్తున్నాయి. నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదించుకోవచ్చునంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ నిరుద్యోగ యువతను ఆకర్షిస్తున్నాయి. డెలివరీ బాయ్స్‌కు బైక్, డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి. ఒక్క భీమవరంలోనే 500 మందికిపైగా డెలివరీ బాయ్స్/ఏజెంట్లుగా సేవలు అందిస్తూ ఉపాధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు వేలకు పైగా డెలివరీ బాయ్స్ ఉంటారని అంచనా. అధిక శాతం మంది ఫుల్ టైమ్ వర్కర్స్‌గా పనిచేస్తున్నారు. 5 శాతం వరకు మహిళలు కూడా డెలివరీ సర్విస్ చేస్తున్నారు. రోజుకు 40 నుంచి 60 వరకు పార్శిళ్లు డెలివరీ చేయడం ద్వారా నెలకు 15 వేల నుంచి రూ. 20 వేలకు పైగా ఆర్జిస్తున్నారు. ఫుడ్ డెలివరీ యాప్‌లతో పార్ట్‌టైం అవకాశాలు ఒకప్పటిలా రెస్టారెంట్‌కు వెళ్లి తినడం, పార్శిల్ తెచ్చుకోవడమంటే ఇప్పుడు చాలా మంది పెద్ద పనిగా ఫీల్ అయిపోతున్నారు. మొబైల్లోని జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ యాప్‌పై ఒక క్లిక్ ద్వారా తమకు ఇష్టమైన రెస్టారెంట్ నుంచి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. దీంతో ఫుడ్ డెలివరీ సంస్థల సేవలు మారుమూల ప్రాంతాలకు విస్తరించాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి నిర్ణీత వేళల్లో ఫుడ్ ఆర్డర్లు ఉండటం వల్ల వీటిలో పార్ట్‌టైం జాబ్ అవకాశాలు ఉంటున్నాయి. ఆయా సమయాల్లో మూడు నాలుగు గంటల పాటు డోర్ డెలివరీ సర్విస్ చేస్తూ ఆదాయం పొందుతున్నారు. పాకెట్ మనీగా పనికొస్తాయని విద్యార్థులు, డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను స్ఫూర్తిగా తీసుకుని డిగ్రీ, పైచదువులు చదివిన వారు సైతం డెలివరీ బాయ్స్‌గా చేస్తున్నారు. ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లలో పని చేస్తున్న వారు మూడు వేల వరకు ఉండగా అధికశాతం మంది నిరుద్యోగ యువత, విద్యార్థులు ఉంటున్నారు. రోజుకు రూ. 500 నుంచి రూ.700 వరకు ఆర్జిస్తున్నారు. కాలంతో పోటీపడుతూ పార్శిల్ డెలివరీ చేస్తేనే డెలివరీ బాయ్స్‌కు కమీషన్ వస్తుంది. అందుకయ్యే బైక్ మెయింటినెన్స్, పెట్రోల్ ఖర్చులను వీరే భరించాలి. ట్రాఫిక్ ఉన్నా, గుంతల రోడ్లైనా కాలంతో పోటీ పడుతూ నిర్ణీత సమయానికి ఆర్డర్ కస్టమర్లకు డెలివరీ ఇవ్వడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు.ట్రైన్లో ఉన్నా ఆర్డర్ చెంతకు చేరుస్తారు. ఒక్కోసారి తప్పుగా ఇచ్చిన అడ్రస్‌లు, ఫోన్ నెంబర్లతో ఆచూకీ తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఆర్డర్ పెట్టిన వస్తువులు సరిగా లేదనో, చెప్పిన సమయానికి రాలేదనో కస్టమర్ల చీత్కారాలకు చిరునవ్వుతో బదులిస్తూనే సాగిపోతుంటారు.బ్యాగు నిండా పార్శిళ్లతో.. ఇప్పుడు ఎక్కడ చూసినా డెలివరీ బాయ్లే. పగలనక రేయనకా, ఎండనక వాననక కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు బైక్‌లు, స్కూటర్లపై రయ్ రయ్ మంటూ ఉరుకులు పరుగులు పెడుతూ కనిపిస్తున్నారు. వస్తువులు, ఆహారాన్ని ఆర్డర్ పెట్టిన వారి చెంతకు చేరుస్తూ సేవలందిస్తున్నారు.ఇన్‌టైంలో అందిస్తేనే..రెండు నెలల నుంచి డెలివరీ బాయ్‌గా చేస్తున్నాను. రోజుకు 40 నుంచి 50 వరకు పార్శిళ్లు డెలివరీ చేస్తుంటాను. ఇన్‌టైంలో ఆర్డర్ పెట్టిన వారికి పార్శిల్ డెలివరి చేయాలన్నదే మా టార్గెట్. అది రీచ్ అయితేనే ఆనందంగా ఉంటుంది. – బి.అశోక్ కుమార్, వీరవాసరం ఉరుకుల పరుగుల జీవితం మూడేళ్ల నుంచి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాను. ఆర్డర్లో సూచించిన సమయానికి పార్శిల్ డెలివరీ చేయాలి. అందుకనే ఎండైనా వానైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉరుకులు పరుగులు పెడుతూ పార్శిల్స్ అందజేస్తుంటాం. – ఎం.సునీల్ కుమార్, డెలివరీ బాయ్, భీమవరం ఇబ్బందులు ఉంటాయిడెలివరీ చేసే సమయంలో ఆర్డర్ పెట్టిన వారు ఫోన్ నంబర్, అడ్రస్ సరిగా ఇవ్వకపోవడం వల్ల ఒక్కోసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్డర్ డెలివరీ చేస్తేనే మాకు కమిషన్ వస్తుంది. లేకపోతే ఎంత తిరిగినా ఫలితం లేక నష్టపోతాం. – పి.రమేష్, డెలివరీ బాయ్, పెన్నాడ -
కడుపు నిండుగా.. షుగర్‌కు దూరంగా..!
ఏ రోజైనా వేరే ఏం తిన్నా, ఎంత తిన్నా.. కాసింత అన్నం కడుపులో పడితే తప్ప మనసున పట్టదు.. కూరలు ఏవైనా చేత్తో కలుపుకొంటూ ఇంత అన్నం తింటే ఉండే తృప్తే వేరు. కానీ మధుమేహం (షుగర్) వ్యాధి వచ్చి.. ఈ సంతృప్తి లేకుండా చేస్తోంది. అన్నం త్వరగా అరిగి, శరీరంలోకి వేగంగా గ్లూకోజ్ విడుదల కావడం.. రక్తంలో షుగర్ స్థాయిలు వేగంగా పెరిగిపోయే అవకాశం ఉండటమే దీనికి కారణం. దీనితో షుగర్‌తో బాధపడుతున్నవారు అన్నాన్ని చూస్తూనే నోరు కట్టేసుకుంటున్నారు. పెద్దగా అలవాటు లేకపోయినా, తినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. గోధుమ, జొన్న రొట్టెలనో.. కొర్రలు, ఊదలతో చేసిన అన్నమో తింటున్నారు. కానీ షుగర్ బాధితులు పెద్దగా గాభరా అవసరం లేకుండా హాయిగా లాగించేయడానికి వీలైన బియ్యం రకమే.. ‘తెలంగాణ సోనా’. సాధారణ బియ్యంతో పోలిస్తే.. ఈ బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువని, రక్తంలో వేగంగా షుగర్ లెవల్స్ పెరిగే సమస్య తక్కువని తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.మన వ్యవసాయ వర్సిటీలోనే అభివృద్ధి.. అన్నం తింటే రక్తంలో షుగర్ స్థాయి వేగంగా పెరుగుతుందన్న భయంతో నడి వయస్కులు కూడా ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు. షుగర్ వచ్చినవారు, యాభై ఏళ్లు దాటినవారైతే నోటికి తాళం వేసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని రకాల బియ్యంతోనూ ఇదే సమస్య. అదే ‘తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్–15048)’రకంతో ఈ ఇబ్బంది ఉండదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మిగతా రకాల బియ్యంతో పోలిస్తే.. ఈ రకం బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువని, మనకిష్టమైన అన్నం తింటూనే షుగర్‌ను నియంత్రణలో పెట్టుకోవచ్చని వివరిస్తున్నారు. ఈ తెలంగాణ సోనా బియ్యం ప్రత్యేకతలకు సంబంధించి అమెరికా ‘జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్’లోనూ ఆర్టికల్ ప్రచురితమైందని చెబుతున్నారు. ఈ బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ 51.5 మాత్రమే. ఈ రకాన్ని వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలే అభివృద్ధి చేయడం గమనార్హం. సరిహద్దులు దాటిన తెలంగాణ సోనా ‘షుగర్ ఫ్రీ రైస్’గా పేరు తెచ్చుకున్న తెలంగాణ సోనా బియ్యానికి దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈ రకం వరిని పండించేందుకు వివిధ రాష్ట్రాల రైతులు మొగ్గుచూపుతున్నారు. మిగతా సన్నరకాల వరితో పోల్చితే పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉండటం, తక్కువ కాలంలోనే పంట చేతికి రావడం, అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలం కావడంతో.. ‘తెలంగాణ సోనా’రకం వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మూడేళ్ల క్రితం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తెలంగాణ సోనా సాగు.. ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సాగు చేస్తున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం తెలంగాణలో రెండు సీజన్లలో కలిపి 20 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా వరి సాగవుతోంది. ఇతర రాష్ట్రాల్లో మరో 30 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. సాధారణంగా ఇతర సన్నరకాల వడ్లను మిల్లింగ్ చేస్తే.. 50 నుంచి 60 కిలోల బియ్యమే వస్తాయి. నూకల శాతం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ సోనా రకమైతే 68 నుంచి 70 కిలోల వరకు బియ్యం వస్తున్నాయని.. ఈ రకం సాగు వ్యవధి మిగతా వాటి కంటే 20 రోజులు తక్కువకావడం వల్ల ఫెర్టిలైజర్ వాడకం కూడా తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆన్లైన్లో భారీగా వ్యాపారం తెలంగాణ సోనా బియ్యానికి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. షుగర్ బాధితులతోపాటు సాధారణ వ్యక్తులూ దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో ఆన్లైన్లో ఈ బియ్యం వ్యాపారం పెరిగింది. అమెజాన్ వంటి ప్రముఖ ఈ–కామర్స్ సైట్లలోనూ తెలంగాణ సోనా విక్రయాలు సాగుతున్నాయి. ‘డయాబెటిక్ కంట్రోల్ వైట్ రైస్, డయాబెటిక్ కేర్ రైస్, షుగర్ కంట్రోల్ రైస్, డెక్కన్ ముద్ర లో జీఐ, గ్రెయిన్ స్పేస్ తెలంగాణ సోనా రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్’తదితర పేర్లతో ఆన్లైన్లో లభ్యమవుతున్నాయి.అయితే ఈ పేరిట అమ్ముతున్నదంతా తెలంగాణ సోనా రకమేనా అన్నది తేల్చడం, పక్కాగా అదేనా, కాదా అని గుర్తుపట్టడం కష్టమేనని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తోపాటు పలు సంస్థలు, వ్యక్తులతో వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ సోనా బ్రాండింగ్‌పై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ ఏంటి? దానితో సమస్యేమిటి? మనం తీసుకునే ఏ ఆహారమైనా ఎంత వేగంగా అరిగిపోయి, శరీరంలోకి ఎంత గ్లూకోజ్‌ను విడుదల చేస్తుందనే లెక్కను గ్లైసిమిక్ ఇండెక్స్(జీఐ)తో కొలుస్తారు. జీఐ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే.. రక్తంలో షుగర్ స్థాయిలు అంత వేగంగా పెరుగుతాయన్న మాట. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు తీవ్రమైన సమస్యగా మారుతుంది. బియ్యంతో చేసిన అన్నం ఎక్కువ. 1–55 మధ్య ఉంటే తక్కువగా అని.. 56–69 ఉంటే మధ్యస్థమని.. 70 శాతానికి పైగా ఉంటే అత్యధికమని చెబుతారు. సాధారణంగా బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ 79.22 వరకు ఉంటుంది. అందుకే షుగర్ బాధితులు అన్నం తగ్గించి, ఇతర ఆహారం తీసుకుంటారు. అయితే తెలంగాణ సోనా గ్లైసిమిక్ ఇండెక్స్ 51.5 వరకే ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ‘జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) మాత్రం తెలంగాణ సోనాలో మరీ అంత తక్కువగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండదని పేర్కొంది. ఓ మోతాదు మేరకు తినొచ్చుసాధారణ బియ్యంతో పోలిస్తే తెలంగాణ సోనా గ్లైసిమిక్ ఇండెక్స్ త క్కువని వ్యవసాయ విశ్వవిద్యాల యం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ లెక్కన చూ స్తే ఇతర రకాల బియ్యం కంటే తెలంగాణ సోనాతో ప్రయోజనం ఉంటుందని చెప్పవచ్చు.మధుమే హం బాధితులు ఓ మోతాదు వరకు ఈ బియ్యంతో వండిన అన్నం తీసుకో వచ్చు. దక్షిణ భారతంలో వేల ఏళ్లుగా అన్నమే ప్రధాన ఆహారం. అన్నం తింటేనే కాస్త సంతృప్తి. అందువల్ల మధు మేహ బాధితులు వైద్యులను సంప్రదించి.. ఎంత మేరకు ఈ అన్నం తినవచ్చన్నది నిర్ధారించుకుని వాడితే మంచిది. – ప్రొఫెసర్ కిరణ్ మాదల, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ బాధితులకు తెలంగాణ సోనాతో మేలు తెలంగాణ సోనా రకం బియ్యంతో వండిన అన్నాన్ని షుగర్ బాధితులు తీసుకో వచ్చు. ఇది మెల్లగా జీర్ణమవుతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కావడం వల్ల గ్లూకోజ్ లెవల్స్ వేగంగా పెరగవు. షుగర్ బాధితులేకాదు.. మిగతా వారంతా ఈ బియ్యాన్ని వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. – డాక్టర్ ఆర్.జగదీశ్వర్, రిటైర్డ్ పరిశోధన సంచాలకుడు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ బియ్యంలో పిండి పదార్థాలు తక్కువ సాంబమసూరి, ఇతర వరి రకాలతో పోలిస్తే తెలంగాణ సోనా బియ్యంలో పిండి పదార్థాల శాతం తక్కువ. కాబట్టి ఇది షుగర్ బాధితులకు ఉపయోగపడుతుంది. వాస్తవంగా షుగర్ నియంత్రణ కోసం ఈ వరి వంగడాన్ని తయారు చేయలేదు. రూపొందించిన తర్వాత అందులో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువని తేలింది. పలు పరిశోధనల తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2015లో తెలంగాణ సోనాను అభివృద్ధి చేసింది. రకం సాగుతో రైతులకూ ప్రయోజనం. పెట్టుబడి తక్కువ. దిగుబడి ఎక్కువ. – డాక్టర్ వై.చంద్రమోహన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, రైస్బ్రీడర్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం– సాక్షి, హైదరాబాద్Suh -
11 లక్షల వర్తకులతో మీషో
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ కంపెనీ మీషో వేదికపై వర్తకుల సంఖ్య 11 లక్షలు దాటింది. గడిచిన ఏడాదిలో 6 లక్షల పైచిలుకు చిన్న వర్తకులు చేరారని కంపెనీ ప్రకటించింది. ఎనమిదేళ్లలోనే ఈ మైలురాయికి చేరుకున్నట్టు తెలిపింది. ‘విక్రేతల్లో సగం మంది ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాలకు చెందినవారు ఉన్నారు. మొత్తం సెల్లర్స్‌లో 80 శాతం పైచిలుకు మంది ఈ–కామర్స్‌కు కొత్తగా చేరినవారే. మీషో ద్వారానే ఆన్లైన్ వ్యాపారంలోకి వీరు అడుగుపెట్టారు. కశ్మీర్‌లోని పుల్వామా, హిమాచల్ ప్రదేశ్ ఉనా, కర్ణాటక నాగమంగళ, మేఘాలయ జోవాయ్, రాజస్తాన్‌లోని మౌంట్ అబు నుంచి సైతం విక్రేతలు నమోదయ్యారు. ఇంటర్నెట్ వాణిజ్యాన్ని మారుమూల ప్రాంతాలకూ చేర్చడం, చిన్న అమ్మకందారులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలన్న సంస్థ లక్ష్యానికి ఇది నిదర్శనం’ అని మీషో వివరించింది. వార్షిక ప్రాతిపదికన 14 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకున్నట్టు 2022లో కంపెనీ ప్రకటించింది. విక్రేతల సగటు ఆదాయం మూడింతలు పెరిగిందని తెలిపింది. -
ఐ యామ్ ఏబుల్.. వైకల్యాన్నే కాదు, మా నైపుణ్యాలనూ చూడండి..!
మానసిక, శారీరక వైకల్యాలున్న పిల్లలను ఎవరో ఒకరు ప్రత్యేకంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకరి మీద ఆధారపడే ఈ పిల్లలు.. ‘వైకల్యాన్నే కాదు... మా నైపుణ్యాలనూ చూడండి మేమూ కొన్ని సాధించగలం’ అని చేసి చూపుతున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు తమంతట తాము చక్కగా సొంతంగా చక్కగా చదువుకోవడమేగాక, తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే క్రమంలో ‘ఐ యామ్ ఏబుల్’ అంటూæడబ్బు కూడా సంపాదిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఐ యామ్ ఏబుల్’ అనే హ్యాండిక్రాఫ్ట్స్ ఆన్లైన్ స్టోర్ సంచలనాలు సృష్టిస్తోంది. మానసిక, శారీరక వైకల్యం ఉన్న పిల్లలు కొన్ని వస్తువులను తయారు చేసి ఈ స్టోర్‌లో విక్రయిస్తున్నారు. వివిధ రకాల ఉత్పత్తుల తయారీ నుంచి బిల్లింగ్ చేసేంత వరకు అన్ని పనులు వారే చూసుకోవడం విశేషం. ఇటీవల డెభ్బై జార్లు కావాలని ఓ కార్పొరేట్ సంస్థ నుంచి ఆర్డర్ రావడంతో విజయవంతంగా జార్లను డెలివరీ చేశారు. వీరి సామర్థ్యాలను చూసిన వారంతా అభినందనలతో ముంచెత్తుతున్నారు. దీంతో ఈ పిల్లలంతా పట్టరాని సంతోషంతో చిందులు వేస్తున్నారు. జినీషా.. వయసు వచ్చినా ఇంకా పసినవ్వులను చిందిస్తోన్న అభం శుభం తెలియని దివ్యాంగ బాలలకు తోడుగా నేనున్నానంటూ వెన్నుతట్టి వెనుక ఉండి నడిపిస్తోంది జినీషా ఛేదా. ముంబైలోని స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ స్కూల్ ‘జిన్శిక్షా’ను నడుపుతోన్న జినీషా.. రకరకాల యాక్టివిటీల్లో బిజీగా ఉండే పిల్లలకు ఉపాధి కల్పించాలనుకుంది. తన స్కూలు సభ్యులతో చర్చించి.. పిల్లలు ఉత్పత్తి చేస్తోన్న వస్తువులతో కేఫ్ లేదా సూపర్ మార్కెట్ ప్రారంభించాలనుకుంది. కానీ ఈ రెండింటి ఏర్పాటుకూ చాలా ఖర్చు అవుతుంది. అందువల్ల తక్కువ ఖర్చులో ఏం చేయాలి అని ఆలోచించి గతేడాది డిసెంబర్లో ‘ఐ యామ్ ఏబుల్’ పేరిట ఆన్లైన్ స్టోర్‌ను ప్రాంభించింది. ఉత్పత్తుల తయారీ నుంచి బిల్లింగ్ వరకు అన్ని పనులు పిల్లలే చూసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. దీనిద్వారా పిల్లల్లో ఉద్యోగ అనుభవంతో పాటు ఉపాధిని కల్పిస్తోంది. హ్యాండీక్రాఫ్ట్స్‌ను తయారు చేసిన ప్రతి ఒక్కరికి జీతం కూడా ఇస్తోంది. పిల్లల ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టి వీళ్లు కూడా కొన్ని చేయగలరు అని ప్రపంచం ముందు ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తోన్న జినీషా.. ప్రస్తుతం ముంబైలో మాత్రమే ఉన్న ఈ స్టోర్‌ను దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. -
ఆన్లైన్ ఫార్మసీ విక్రయాలను నిషేధించాలి
న్యూఢిల్లీ: ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఔషధాలను విక్రయించకుండా నిషేధం విధించాలని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) డిమాండ్ చేసింది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్’ పేరుతో ఆన్లైన్ ఔషధ విక్రయాల్లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించిన మరుసటి రోజే సీఏఐటీ ఈ డిమాండ్ చేయడం గమనార్హం. ఆన్లైన్లో ఔషధాలను విక్రయించే ఈ ఫార్మసీలను నిషేధించాలని కోరుతూ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయ ల్, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశామని.. తక్షణమై దీనిపై దృష్టి సారించాలని కోరినట్టు ప్రకటించింది. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం (డీసీ) ఔషధాల దిగుమతులు, తయా రీ, విక్రయాలు, పంపిణీలను నియంత్రిస్తోందని.. ప్రజారోగ్యం, భద్రత దృష్ట్యా కఠిన నిబంధనలు చట్టంలో ఉన్నట్టు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయ, కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా, ఒరిజినల్ డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా ఔషధాలను విక్రయించడం, పంపిణీ చేయడం నిషేధమని గుర్తు చేశారు. భారతీయ చట్టాల్లోని మధ్యవర్తుల ముసుగులో కల్తీ, నకిలీ ఔషధాలను విక్రయించి బాధ్యత నుంచి తప్పించుకోకుండా ఈ ఫార్మసీలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆఫ్‌లైన్ వర్తకులను దెబ్బతీసే విధంగా భా రీ తగ్గింపులు, దోపిడీ ధరలను అనుసరించే మార్కెట్‌ప్లేస్‌లను నిషేధించాలని కోరారు. కనీస పెనాల్టీని రూ.లక్ష నుంచి రూ.10 లక్షలకు పెంచాలని.. అప్పుడు ఫార్మ్ఈజీ, నెట్‌మెడ్స్, ఫ్లిప్‌కార్ట్, అమె జాన్ ఫార్మసీ, టాటా1ఎంజీ తదితర నిబంధనలను ఉల్లంఘిస్తున్నవారిని తగిన విధంగా శిక్షించడానికి వీలు పడుతుందని అభిప్రాయం తెలియజేశారు. -
ఆన్లైన్ వ్యాపారం ముసుగులో భారీ సైబర్ మోసం
విజయవాడ స్పోర్ట్స్: ఆన్లైన్ వైద్య పరికరాల వ్యాపారం ముసుగులో జరుగుతున్న సైబర్ మోసం విజయవాడలో వెలుగు చూసింది. నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ శనివారం సాయంత్రం సైబర్, సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది జూన్ చివరి వారంలో టెలివియా అనే సంస్థ లవ్‌లైఫ్ అండ్ న్యాచురల్ హెల్త్‌కేర్ పేరుతో ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించి ఆన్లైన్లో వైద్య పరికరాల విక్రయం ప్రారంభించింది. ఈ యాప్‌లో ఉన్న వైద్య పరికరాలను కొనుగోలు చేయండి.. సదరు పరికరాలను మేమే అద్దెకు ఇచ్చి, వచ్చిన లాభాన్ని మీకు ఇస్తామనే బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కరోనా సమయంలో వైద్య పరికరాలకు గిరాకీ పెరిగిన నేపథ్యంలో ఈ వ్యాపారంలో పెట్టుబడి పెడితే లక్షలు ఆర్జించవచ్చనే ఆశతో ఎంతో మంది ఈ యాప్‌ను డౌన్‌లోన్ చేసుకుని వైద్య పరికరాలపై పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న పెట్టుబడిదారులతో 372 టెలిగ్రాం గ్రూపులను (ఒక్కో గ్రూపునకు 250 మంది సభ్యులు) ఏర్పాటు చేసి వ్యాపారం లావాదేవీలను ఎప్పటికపుడు అప్డేట్ చేశారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చిన లాభాలను ఎప్పటికప్పుడు పెట్టుబడిదారులకు ఇచ్చేయడంతో పాటు తరుచూ గిఫ్ట్ కూపన్లను ఇవ్వడంతో వేలాది మంది ఈ వ్యాపారం పట్ల ఆకర్షితులయ్యారు. ఒక్కొక్కరు రూ.లక్షల్లో నగదును నిర్వాహకులకు యూపీఐ (ఫోన్ పే, గూగుల్ పే) ద్వారా పంపారు. ఈ నెల 19వ తేదీ నుంచి సంస్థ బోర్డ్ తిప్పేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నగర ప్రజల నుంచి ఈ సంస్థ కోట్లాది రూపాయలు వసూలు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, విచారణ చేస్తున్నామని సైబర్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
ఆన్లైన్లో అరటి ఆకులు.. ధర తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే!
హైదరాబాద్: కాదేది వ్యాపారానికి అనర్హం అన్న చందంగా మారింది కార్పొరేట్ ఆన్లైన్ వ్యాపారస్తుల తీరు. వీరు పండుగల సీజన్లలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి మరీ భోగి పిడకల దగ్గరి నుంచి మావిడాకులు, పూజా సామాగ్రి, కొబ్బరిచిప్పలు, వేప పుల్లలు వరకూ అన్నింటినీ ఇంటివద్దకే సరఫరా చేస్తున్నారు. తాజాగా అరటి ఆకులు కూడా ఆన్లైన్లో అమ్మకానికి రెడీ అయ్యాయి. హిందూ సంప్రదాయంలో అరటి ఆకులకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే గ్రామాల్లో దొరికినంత ఈజీగా పట్టణాల్లో అరటి ఆకులు దొరకవు. నగర వాసులు పండగలు, పబ్బాలు వస్తే వీటి కోసం మార్కెట్ల వద్ద బారులు తీరాల్సి వస్తుంది. దీంతో ఆన్లైన్ వ్యాపారులు అరటి ఆకులను ఇంటికే డెలవరీ చేస్తామంటూ ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పల్లెల్లో అయితే ఫ్రీగా దొరికే వీటి ధర ఆన్లైన్లో ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఐదు అరిటాకులు ధర రూ. 50 లు అంటూ బిగ్ బాస్కెట్ అనే అస్లైన్ కార్పొరేట్ వ్యాపార సంస్థ తమ సైట్లో ఆఫర్ ప్రకటించింది. ఇక్కడ బిగ్ బాస్కెట్ వాళ్లు కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారండోయ్. ఐదు ఆకుల అసలు ధర రూ. 62.50 అయితే, 20 శాతం డిస్కౌంట్ పోనూ రూ. 50కి ఇస్తున్నామని సదరు సంస్థ ప్రకటించింది. అసలే శ్రావణ మాసం పూజలు, ఫంక్షన్ల కాలం.. దీంతో అరిటాకులకు ఆన్ లైన్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోం: ఇదీ పరిస్థితి! -
Falguni Nayar: నైకా నాయిక
నైకా... సౌందర్య సాధనాల దిగ్గజం.. అందంతో పాటు మహిళా సాధికారత కూడా ఈ కంపెనీ లక్ష్యం... చిన్నస్థాయిలో ఆన్లైన్ వ్యాపారం ప్రారంభించి, కొన్ని కోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగారు నైకా సిఈవో ఫల్గుణీ నాయర్. ‘పెద్దగా ఆలోచించు, చిన్నగా ప్రారంభించు’ అనే వ్యాపార సూత్రాన్ని ఆచరించి చూపారు నైకా కంపెనీ సిఈవో ఫల్గుణీ నాయర్. బ్యూటీ ప్రాడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. ‘మంచి శిక్షణ, ఉన్నత విద్య, అండగా నిలిచేవారు... ఈ మూడు అంశాలు ఒక స్త్రీని ఉన్నత స్థానం మీద కూర్చోబెడతాయి’ అంటారు ఫల్గుణీ నాయర్. చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించిన ఫల్గుణీ, అతి తక్కువ కాలంలోనే కొన్ని కోట్ల టర్నోవర్ స్థాయికి తీసుకువెళ్లారు. ఫల్గుణీ నాయర్ ఐఐఎం అహ్మదాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాక, 19 సంవత్సరాల పాటు కొటక్ మహీంద్రా గ్రూప్‌కి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా పనిచేశారు. 2005లో ఆ బ్యాంక్‌కి మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టి, 2012లో తన 50వ ఏట ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇందుకు రెండు కారణాలు చెబుతారు ఫల్గుణీ నాయర్. ‘‘నాకు మేకప్ అంటే చాలా ఇష్టం. అలాగే ఆన్లైన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవాలనే కోరిక బలంగా ఉంది. ఈ రెండు కారణాల వల్లే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను’’ అంటున్న ఫల్గుణీ నాయర్ తల్లిదండ్రులు గుజరాతీలు. కాని ముంబైలో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త. ‘‘మా నాన్న గారి నుంచే నాకు చిన్నతనంలోనే వ్యాపారం చేయాలనే వచ్చింది. మా ఇంట్లో అందరూ స్టాక్ మార్కెట్, ట్రేడ్ గురించి మాట్లాడుకునేవాళ్లం. అలా నాకు వ్యాపారం మీద అవగాహన కలిగింది’’ అంటారు. బ్యూటీకి సంబంధించిన ఉత్పత్తులకు భారతదేశంలో మంచి మార్కెట్ ఉందనీ, ఆ వ్యాపారం ప్రారంభించటం వల్ల తన కల నెరవేరుతుందని భావించారు. యుటీవీకి చెందిన రోనీ స్క్రూవాలా, పీవీఆర్ సినిమాస్‌కి చెందిన అజయ్ బిజిలీల నుంచి నాయకత్వ లక్షణాలతో పాటు, ఒడిదుడుకులను ఎదుర్కోవటానికి కావలసిన ఆత్మవిశ్వాసం అలవర్చుకున్నారు. విజయగాథ... ఎవరు ఏ ఉత్పత్తులు వాడితే మంచిదనే విషయాన్ని వివరిస్తూ 2012లో నైకా స్థాపించారు ఫల్గుణీ నాయర్. ఈ ఆలోచన రావటానికి కారణం... పలురకాల ఉత్పత్తులు తయారుచేస్తున్న సెఫోరా కంపెనీ. ఎన్నడూ సౌందర్య సాధనాలు ఉపయోగించని ఫల్గుణీ, వారి ఉత్పత్తులను వాడటం ప్రారంభించారు. అప్పుడే తను కూడా ఒక కంపెనీ ప్రారంభించి, భారతదేశ సౌందర్య సాధనాలను ప్రపంచానికి చూపాలనుకున్నారు. అదేవిధంగా భారతీయ మహిళలు ఆత్మవిశ్వాసంతో వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చూడాలని కలలు కన్నారు. ‘‘ఉత్తమ సౌందర్య సాధనాలు తయారుచేస్తూ, భారతదేశాన్ని సౌందర్య సాధనాలకు ప్రతిరూపంగా చూపుతూ, వినియోగదారులకు వాటి మీద అవగాహన కలిగించాలనుకున్నాను’’ అంటారు ఫల్గుణీ నాయర్. అందంగా కనిపించాలనే కోరిక ఉన్న మహిళలకు ఈ సాధనాలు ఉపయోగపడాలనుకున్నారు. అలా వారంతా నైకాకి అతి త్వరగా కనెక్ట్ అయ్యారు. మహిళలంతా ధైర్యంగా ముందుకు దూసుకుపోవాలి.. అంటారు ఫల్గుణీ నాయర్. నైకా ప్రారంభించినప్పుడు అదొక ఈ కామర్స్ వెబ్సైట్ మాత్రమే. ఇప్పుడు ఈ కంపెనీ మహిళా సాధికారతకు కావలసిన అంశాలను వివరించటం మీద దృష్టి పెట్టింది. ‘బ్యూటీ అండ్ వెల్నెస్’ మీద ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. వీటి వల్ల బ్యూటీ అడ్వైజర్ కావటానికి అవకాశం ఉంటుంది... అంటారు ఫల్గుణీ నాయర్. -
కరోనా తెచ్చిన మార్పు .. ఆన్లైన్లో ఆవులు, గేదెల ఫొటోలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కరోనా మహమ్మారి వ్యాపారాలను ఛిన్నాభిన్నం చేసింది. ఈ పరిస్థితుల్లో కొందరు ఆధునిక సాంకేతికతను వినియోగించి గట్టెక్కుతున్నారు. పశువుల అమ్మకాలు, కొనుగోళ్లకు రైతులు, వ్యాపారులు సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. విజయనగరం జిల్లాలో పశువుల క్రయవిక్రయాలకు వారపు సంతలు జరిగేవి. ఈ సంతలకు ఎక్కువగా జెర్సీ, దేశవాళీ ఆవులు, ముర్రా గేదెలు, దేశవాళీ గేదెలు, దుక్కి పశువులు, దున్నపోతులు, ఒంగోలు గిత్తలు తదితర రకాలకు చెందిన పశువులు వస్తుంటాయి. జిల్లాలోని అన్ని సంతల్లో కలిపి నెలకు రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు పశువుల వ్యాపారం జరిగేది. కరోనా కారణంగా వారపు సంతలన్నీ మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో రైతులు, వ్యాపారులు ఆన్లైన్ ద్వారా పశువుల క్రయవిక్రయాలు చేపట్టారు. ఈ విధానం ఈ మధ్యే ప్రారంభం కాగా.. జిల్లాలో నెలకు రూ.3 కోట్ల విలువైన పశువుల అమ్మకాలు ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలోని అలమండ, మానాపురం, పార్వతీపురం, అచ్యుతాపురం, బొద్దాం, సాలూరు, కూనేరు, కందివలసలో వారపు పశు సంతలు జరిగేవి. ఈ సంతల్లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు, రైతులు వచ్చి పశువులు కొనుగోలు చేసేవారు. సంతలు మూతపడటంతో ఈ వ్యవహారాలన్నీ ఆన్లైన్లో సాగుతున్నాయి. ప్రతి సోమవారం జరిగే అలమండ పశువుల సంత ఆన్లైన్లో ఇలా.. ఔత్సాహికులైన కొందరు పశువుల కొనుగోలుదారులు, అమ్మకందారులు, రైతులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. రైతుల వద్ద ఉన్న పశువులను వీడియో, ఫొటోలు తీసి వాటి ధర, ఇతర వివరాలను ఆ గ్రూపుల్లో అప్లోడ్ చేస్తున్నారు. నచ్చిన వారు సంబంధిత రైతులు లేదా వ్యాపారులతో చాటింగ్ చేసి పశువుల్ని బేరమాడి కొంటున్నారు. కొందరైతే ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విక్రయిస్తున్నారు. దళారులు సైతం పశువుల్ని విక్రయించే రైతుల వద్దకు వెళ్లి వారి వద్ద ఉన్న పశువును వీడియో, ఫొటోలు తీసి ఆ పశువు వివరాలు, ధరను వ్యాపారులకు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. ఇలా పశువును కొనుగోలు చేసిన వ్యాపారులు లేదా వ్యక్తులు నగదును ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ యాప్‌ల ద్వారా చెల్లిస్తున్నారు. పశువుల్ని కొనుగోలు చేసిన వారికి ట్రక్కులు, ఇతర రవాణా వాహనాల్లో వాటిని పంపిస్తున్నారు. ఆన్లైన్లో అమ్ముతున్నాం కరోనా వల్ల పశువుల సంతలు జరగడం లేదు. చాలా రోజులపాటు పశువుల అమ్మకాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఫోన్ల ద్వారా పశువుల అమ్మకాలు చేస్తున్నాం. రైతుల వద్ద ఉన్న పశువుల వివరాలు, ఫొటోలు, వీడియోలు తీసి గుంటూరు, ఒడిశా తదితర ప్రాంతాలకు చెందిన సంతల్లో పాత పరిచయాలు ఉన్న వారికి పంపిస్తున్నాం. వారు వీటిని చూసి నచ్చితే డబ్బులను ఆన్లైన్ ద్వారా రైతులకు చెల్లిస్తున్నారు. – కె.బలరాం, పశువుల వ్యాపారి కొట్టాల వద్దే అమ్మకాలు సంతలు జరక్కపోవడంతో కొట్టాల వద్దే పశువుల అమ్మకాలు చేస్తున్నాం. మాకు తెలిసిన మధ్యవర్తులు వచ్చి మా దగ్గర ఉన్న పశువును ఫోన్లో ఫొటో తీసి పంపిస్తారు. మాకు నచ్చిన ధర వస్తే అమ్ముతాం. కొనుగోలు చేసిన వారు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపి పశువుల్ని తీసుకువెళ్తున్నారు. – బి.సూర్యనారాయణ, రైతు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాం ఆన్లైన్ ద్వారా పశువుల అమ్మకాలకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాం. కొంతమందికి దీనిపై అవగాహన లేదు. అవగాహన ఉన్న వాళ్లు మాత్రం ఆన్లైన్ ద్వారా పశువుల అమ్మకాలు జరిపిస్తున్నారు. – పిల్లల సత్యం, పశువుల వ్యాపారి -
మా పిల్లల నుంచి నేర్చుకున్నాను..
సూచీ ముఖర్జీ... లైమ్‌రోడ్ ఆన్లైన్ బిజినెస్ దిగ్గజం.. గృహిణిగా, సిఈవోగా... రెండు రకాల జీవితాలను బ్యాలెన్స్ చేసుకోవటంలో విజయం సాధించారు. సూచీ ఇద్దరు పిల్లలకు తల్లి, ఎంతో మందికి స్నేహితురాలు, ఇప్పుడు ఔత్సాహిక పారిశ్రామికవేత్త... ‘కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నామంటే మన మీద మనం ఒత్తిడి తెచ్చిపెట్టుకున్నట్లే’ అంటారు సూచీ ముఖర్జీ. ఇంటిని, వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం చాలా కష్టమే అయినప్పటికీ, కుటుంబంతోనే ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. పిల్లలతో ఉదయాన్నే కొద్దిసేపు గడిపి, వాళ్లని స్కూల్ దగ్గర దింపి, ఆ తరవాత తన వ్యాపార పనుల్లోకి ప్రవేశిస్తారు సూచీ ముఖర్జీ. ‘‘మంచి జీవిత భాగస్వామి, నన్ను అర్థం చేసుకునే అత్తమామలు దొరకటం నిజంగా నా అదృష్టం. అందుకు నేను వారికి ఋణపడి ఉంటాను’’ అంటారు లైమ్‌రోడ్.కామ్ వ్యవస్థాపకురాలు, సిఈవో అయిన సూచీ ముఖర్జీ. హర్యానాకు చెందిన సూచీ ముఖర్జీ 2012లో ఈ సంస్థను స్థాపించారు. 40 సంవత్సరాల లోపు వయసున్న, అత్యున్నత స్థాయి కొత్త వ్యాపారవేత్త ల జాబితాలో ఆమె మొదటిస్థానం పొందారు. ‘‘మా అబ్బాయి పుట్టినప్పుడు నేను ఖాళీ సమయంలో ఒక మ్యాగజీన్ చదువుతుంటే, నాకు కావలసిన జ్యూయలరీ కనిపించింది. వెంటనే నేను ఒకే ఒక్క క్లిక్‌తో బుక్ చేసి తెప్పించుకున్నాను. అప్పుడే నాకు కూడా ఇటువంటి సైట్ ఒకటి స్థాపించాలనే ఆలోచన వచ్చింది. లక్కీగా వెంటనే దానిని అమలు చేయ గలిగాను’’ అని చెప్పారామె. ఫిట్నెస్ బావుండాలి.. ‘‘వ్యాపారంలో రాణించాలంటే ఫిట్నెస్ చాలా అవసరం. అందుకోసం కొంత సమయం తప్పనిసరిగా కేటాయించాలి... వ్యాపారంలో విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకోవాలి. ఓటమి సాధించినప్పుడు అధైర్యపడకూడదు. విజయం సాధించేవరకు పోరాడాలి. అందుకు పట్టుదల ఉండాలి. ధైర్యంగా దీక్షతో పనిచేయాలి. ఎంత సంక్షోభంలో ఉన్నప్పటికీ సృజనను విడిచిపెట్టకూడదు’’ అంటారు సూచీ ముఖర్జీ. మహిళల కోసం... లైమ్‌రోడ్.కామ్ మహిళల కోసం ప్రారంభించబడిన ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్. ‘‘మా లైమ్‌రోడ్ స్క్రాప్‌బుక్‌ను ప్రతి నెల సుమారు పది లక్షల మంది చూస్తున్నారు. ఈ సంవత్సరం మా వ్యాపారం 600 శాతం పెరిగింది. వ్యాపారంలో నిరంతరం సృజన ఉండాలి. వ్యాపారం ప్రారంభించే ముందు నేను చేయగలనా లేదా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. చేయగలనని నా మనసు సమాధానం చెప్పింది. నేను ఒక స్థాయికి ఎదగడానికి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాను. అయినప్పటికీ విలక్షణమైన ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాను’’ అంటున్న సూచీ ముఖర్జీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు. ఈ కామర్స్ లైఫ్‌స్టయిల్ అండ్ యాక్సెసరీస్ వెబ్‌సైట్‌ను ఫ్యాషన్ మాగజీన్ విధానంలో రూపొందించారు. 50 మందితో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు 400 మంది ఉన్నారు. సూచీ ముఖర్జీకి ఇద్దరు పిల్లలు అమ్మాయి మైరా, అబ్బాయి అదితి. ఢిల్లీ, సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఫైనాన్స్ అండ్ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. స్కైప్, ఈబే, గమ్‌ట్రీ వంటి వివిధ సంస్థలలో సుమారు 16 సంవత్సరాలు పనిచేశారు. తాను కలగన్న సంస్థను స్థాపించటం కోసం 2011లో భారతదేశానికి వచ్చి, 2012లో లైమ్‌రోడ్.కామ్‌ను స్థాపించారు. 16వ శతాబ్దం నాటి గ్రాండ్ ట్రంక్ రోడ్డు వల్ల పెద్ద ఎత్తున వ్యాపారం జరిగినట్లే, తాను స్థాపించబోయే సంస్థ కూడా అంత వ్యాపారం చేయాలనుకున్నారు. గ్రాండ్ ట్రంక్ రోడ్డుని ప్రేరణగా తీసుకుని లైమ్‌రోడ్. అని పేరుపెట్టారు. – సూచీ ముఖర్జీ, సిఈవో, ఫౌండర్, లైమ్‌రోడ్.కామ్ -
ఆన్లైన్లో లాభాలంటూ మోసం: ముగ్గురిపై కేసు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ బిజినెస్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిన ఘటనలో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్‌కు చెందిన సీహెచ్. సురేష్ అనే వ్యాపారికి గతే డాది జూలై 30న సుధాకర్ అనే వ్యక్తి పరిచయమై, ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్ అనే ఆన్లైన్ బిజినెస్‌లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో సురేష్ రూ. 7 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఈ డబ్బును ఓం ప్రకాశ్, శ్రీవాత్సవ్ అనే వ్యక్తులతో కలిసి సుధాకర్ డ్రా చేసుకున్నాడు. అయితే లాభాలు రాకపోగా ఇదేమిటని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సీసీఎస్ పోలీసుల ఆదేశాలతో జూబ్లీహిల్స్ పోలీసులు ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: మహిళ మెడలో చెప్పుల దండ వేసి.. గుండు కొట్టించి..) -
చేనేతకు వీడియో ‘కాల్’
నిన్నటి వరకు.. గుట్టలుగా పట్టుచీరలు.. ఎలా అమ్ముకోవాలో తెలియదు.. బేరం వస్తే వచ్చినట్టు లేదంటే లేదు.. కొత్తగా ఏదైనా ఆలోచన చేయాలన్నా బయటి పరిస్థితులు, మార్కెట్‌పై అంతంతగానే అవగాహన.. ప్రత్యేకించి ఆన్‌లైన్‌పై అవగాహన లేక అమ్మకాల్లో వెనుకబాటు.. ఈ క్రమంలోనే నష్టాలు.. ఆపై బతుకు కష్టాలు.. ప్రస్తుతం.. అవసరం అన్నిటినీ నేర్పిస్తుంది. ఇప్పుడు భూదాన్‌పోచంపల్లి పట్టు చీరల వ్యాపారులు ‘ఆన్లైన్’ బాటపట్టారు. వీడియో కాల్లో డిజైన్ చూపించి అమ్మడం నేర్చుకున్నారు. మంచి డిజైన్లను ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేసి ఆర్డర్లు రాబట్టుకుంటున్నారు. కరోనా కాలంలో అన్ని రంగాలు కుదేలైపోతే ఇక్కడి వ్యాపారులు మాత్రం ఆన్లైన్, సామాజిక మాధ్యమాల ద్వారా లక్షల విలువైన చేనేత వస్త్రాలను విక్రయించారు. సాక్షి, యాదాద్రి: ఆన్లైన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో భూదాన్ పోచంపల్లి పట్టుచీరల అమ్మకాలు ఊపం దుకున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌ల ద్వారా వందలాది మంది యువ చేనేత కళాకారులు ఇక్కత్, టైఅండ్‌డై పట్టుచీరలు, పెళ్లిచీరలు, కాటన్ చీరలు, డ్రెస్ మెటీరియల్ అమ్మకాలను పెంచుకుని ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా సుమారు రూ.4 కోట్ల మేరకు ఆన్లైన్ వ్యాపారం సాగుతోందని అంచనా. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లితో పాటు చౌటుప్పల్, రామన్నపేట, హైదరాబాద్ కేంద్రాలుగా ఆన్లైన్లో వస్త్రాల అమ్మకాలు సాగుతున్నాయి. చేనేత కుటుం బాల్లో ఉన్నత చదువులు చదువుకున్న యువత.. తమకున్న అవగాహనతో ఈ రంగంలో రాణిస్తున్నారు. జిల్లాలో సుమారు 700 మంది వరకు ఆన్లైన్ వ్యాపారంలో కొనసాగుతున్నారు. కరోనా సమయంలోనూ తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకుని కొత్త డిజైన్లతో కొనుగోలుదారులకు చేరువయ్యారు. ధర తక్కువ.. మంచి డిజైన్ కరోనా నేపథ్యంలో అందరి ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. జనం అనవసర ఖర్చులు తగ్గించుకున్నారు. దీంతో వస్త్రాల కొనుగోళ్లూ పడిపోయా యి. మరోపక్క రవాణా వసతి లేక, శుభకార్యాలు నిలిచిపోవడంతో చేనేత పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ఎగుమతులు నిలిచిపోవడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఉత్పుత్తులు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో ఈ రంగంలోని యువత చేనేత వస్త్రాలను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూ బ్ వంటి మాధ్యమాల్లో పెడుతూ వాటి గురించి ప్రచారం చేశారు. చివరకు వీడియో కాల్ ద్వారా డిజైన్లను చూపించి ఆకర్షించే యత్నం చేశారు. త క్కువ ధరకే మంచి రంగులు, అందమైన చీరల డిజైన్లను ఆన్లైన్లో ఉంచి కొనుగోలుదారులను ఆకట్టుకోగలిగారు. దీంతో వస్త్రాల కొనుగోళ్లు పెరిగాయి. ఆన్లైన్లో అమ్మకాలు ఇలా.. భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, సిరిపురం, వెల్లం కి, బోగారం, రామన్నపేట, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు ఆన్లైన్ అమ్మకాల్లో ముందున్నారు. పోచంపల్లి ఇక్కత్ (టై అండ్ డై) పట్టుచీరలు, డ్రెస్మెటీరియల్స్తోపాటు, మస్రస్ (మెర్స్రైజ్డ్), సిల్కు, పట్టు, కాటన్ వస్త్రాలలో తమకు అందుబాటులో ఉన్న డిజైన్లను, వాటి ధరలను వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తారు. డిజైన్లు, ధర నచ్చి డబ్బులు చెల్లించిన వారికి కొరియర్ ద్వారా పంపిస్తారు. నమ్మకం కుదిరిన వారికి, సంస్థలకు క్రెడిట్ కూడా ఇస్తున్నారు. దీంతో లాక్డౌన్ సమయంలోనూ ఆన్లైన్ అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్కొక్కరు నెలకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల విలువైన సరుకు విక్రయించారని అంచనా. లాక్డౌన్ అనంతరం దుకాణాలు తెరుచుకోవడంతో ఆన్లైన్ వ్యాపారం కాస్త తగ్గింది. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 30 వేల చేనేత కుటుంబాలు ఉండగా, ప్రతి నెలా సగటున లక్ష పట్టుచీరలు ఉత్పత్తవుతున్నాయి. ఆన్లైన్లో విక్రయించే వారికి సొంతంగా వెబ్సైట్లు, కొందరికి యూట్యూబ్ చానల్స్ ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేసేవారు కొందరు అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. విదేశాల నుంచి ఆర్డర్లు.. ఆన్లైన్లో పట్టుచీరల కోసం ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. కరోనాతో తగ్గిన సేల్స్‌ను ఆన్లైన్ ద్వారా పెంచుకున్నాం. ఆర్థిక ఇబ్బందులను గుర్తించి కొనుగోలుదారుల కోసం తక్కువ ధర చీరలను కొత్త డిజైన్లతో ఎక్కువగా తయారుచేసి అమ్మకానికి పెట్టాం. వీడియో కాల్ ద్వారా చీరల రంగులు, డిజైన్లు చూపించి.. నచ్చితే ఆన్లైన్ చెల్లింపులతో విక్రయిస్తున్నాం. వీరికి ఇండియా పోస్ట్, కొరియర్ల ద్వారా పార్శిళ్లను పంపిస్తున్నాం. – అంబటి సాయినాథ్, ఆన్లైన్ వస్త్రవ్యాపారి, భూదాన్‌పోచంపల్లి మార్జిన్ తగ్గించుకున్నాం లాక్డౌన్ వేళ ఆన్లైన్ వస్త్రవ్యాపారం బాగా జరిగింది. షాపింగ్‌కు బయటకు వెళ్లే వీల్లేకపోవడంతో చాలామంది ఆన్లైన్ ద్వారా చీరల్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇచ్చారు. కరోనా సమయంలో మేం కూడా మార్జిన్ (లాభం) తగ్గించుకున్నాం. ఒక్క పోచంపల్లిలోనే సుమారు 300పైగా యువకులు, దుకాణదారులు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్‌సీజన్‌తో గిరాకీ కొంచెం తగ్గింది. – భారత హరిశంకర్, ఆన్లైన్ వస్త్రవ్యాపారి, భూదాన్‌పోచంపల్లి -
వీధి వ్యాపారులకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్
భోపాల్: వీధుల్లో తోపుడు బండ్లపై, ఇతర మార్గాల్లో చిరుతిళ్లు, ఇతర ఆహార పదార్థాలను అమ్మే చిన్న, మధ్య తరహా వ్యాపారుల కోసం పెద్ద రెస్టారెంట్ల తరహాలో ఒక ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించే యత్నాలు కొనసాగుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇందుకు సంబంధించిన పథకం ఒకటి రూపకల్పన దశలో ఉందన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండార్స్ ఆత్మ నిర్భర్ నిధి(పీఎంస్వనిధి) లబ్ధిదారులను ఉద్దేశించి ఆన్లైన్లో మోదీ మాట్లాడారు. వినియోగదారుల నుంచి నగదు తీసుకోకుండా, డిజిటల్ పేమెంట్ విధానాన్ని ప్రోత్సహించాలని వారికి సూచించారు. పీఎం స్వనిధి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 1న పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. పీఎం స్వనిధి లబ్ధిదారులైన ఇండోర్ జిల్లాకు చెందిన చగన్‌లాల్, గ్వాలియర్‌కు చెందిన అర్చన, రాయిసెన్ జిల్లాకు చెందిన దాల్ చంద్ తదితరులతో ప్రధాని మాట్లాడారు. చీపురు కట్టల వ్యాపారంలో మరింత లాభం ఆర్జించేందుకు చగన్‌లాల్‌కు ప్రధాని ఒక సూచన చేశారు. చీపురు కట్టలోని ప్లాస్టిక్ పైప్‌ను తిరిగివ్వాల్సిందిగా వినియోగదారులను కోరాలని, ఆ పైప్‌లను మళ్లీ వాడడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చని సూచించారు. పీఎం మత్స్యసంపద యోజన మత్స్యకారులకు ఉపయోగపడే ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై)’ పథకాన్ని నేడు మోదీ ప్రారంభించనున్నారు. ‘ఈ–గోపాల’ అనే యాప్‌ను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు. బిహార్‌లో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. -
రూ.7.5 లక్షల కోట్లకు రిటైల్ ఈ కామర్స్
న్యూఢిల్లీ: దేశంలో ఈకామర్స్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో 2024 నాటికి రిటైల్ ఈ కామర్స్ మార్కెట్ పరిమాణం 100 బిలియన్ డాలర్లకు (రూ.7.5లక్షల కోట్లు) చేరుకుంటుందని ఓ నివేదిక తెలియజేసింది. అంతర్జాతీయ సంస్థ అల్వారెజ్ అండ్ మార్సల్ (ఏఅండ్ఎం), సీఐఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. వినియోగదారుల్లో మారుతున్న కొనుగోళ్ల ధోరణి, ఆన్లైన్లో విక్రేతలు పెరుగుతుండడం తదితర అంశాలు రిటైల్ ఈ కామర్స్ మార్కెట్ వృద్ధికి ఇతోధికంగా తోడ్పడతాయని ఈ నివేదిక తెలియజేసింది. తాజా గ్రోసరీల విక్రయాలకు డిమాండ్, ఫుడ్ డెలివరీ కంపెనీల సంఖ్య పెరగడం కూడా వచ్చే ఐదేళ్లలో మార్కెట్ విస్తరణకు మేలు చేస్తుందని పేర్కొంది. సరఫరా వ్యవస్థకు సంబంధించి నూతన ఆవిష్కరణలు అన్నవి భారత్ లో ఈ కామర్స్ మార్కెట్ తదుపరి విస్తరణకు కీలకమని సూచించింది. పదేళ్లలో భారీగా విస్తరణ.. గత పదే?ళ్ల కాలంలో భారత రిటైల్ రంగం శరవేగంగా ప్రగతి సాధించినట్టు ఈ నివేదిక తెలిపింది. ‘‘2019 చివరికి రిటైల్ రంగం పరిమాణం 915 బిలియన్ డాలర్లకు విస్తరించింది. ఇందుల్ రిటైల్ ఈ కామర్స్ మార్కెట్ పరిమాణం 2019 ఆఖరుకు 30 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ 2010లో రిటైల్ రంగంలో ఈ కామర్స్ మార్కెట్ విలువ 1 బిలియన్ డాలర్ల కంటే (రూ.7,500 కోట్లు) తక్కువగా ఉండగా, పదేళ్లలో 30 బిలియన్ డాలర్ల స్థాయికి విస్తరించింది’’ అని ఈ నివేదిక తెలియజేసింది. గత దశాబ్ద కాలంలో ఈ కామర్స్ వృద్ధికి ఇంటర్నెట్ విస్తరణ, స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య పెరగడం తోడ్పడినట్టు పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, ఫర్నిచర్, ఫార్మసీ, కాస్మెటిక్స్ మార్కెట్ విస్తరణలో ప్రముఖ పాత్ర పోషించినట్టు తెలిపింది. ‘‘ఈ కామర్స్ రిటైల్ మార్కెట్ (బిజినెస్ టు కస్టమర్/బీటుసీ) 2024 నాటికి 100 బిలియన్ డాలర్లకు పైగా విస్తరించనుంది. 2019నాటికి దేశంలో ఈ కామర్స్ విస్తరణ 3 శాతమే. విస్తరణకు భారీ అవకాశాలున్నాయి’’ అని ఈ నివేదిక అంచనా వేసింది. అమెరికా, చైనా మార్కెట్లలో ఈ కామర్స్ రిటైల్ వ్యాప్తి 2019 నాటికి వరుసగా 15 శాతం, 20 శాతంగా ఉండగా.. భారత్ లో 2024 నాటికి 6 శాతానికి చేరుకోవచ్చని పేర్కొంది. ‘‘ఈ కామర్స్ విక్రయాల్లో పెద్ద మొత్తం దేశంలోని అగ్రగామి 30 పట్టణాల నుంచే వస్తున్నా.. వచ్చే ఐదేళ్లలో 60 శాతానికి పైగా అమ్మకాలు టైర్–2, 3 పట్టణాల నుంచి వచ్చే అవకాశం ఉంది. కనుక చిన్న పట్టణాలకు కూడా సరుకులను డెలివరీ చేసే విధంగా ఈ కామర్స్ కంపెనీలు విక్రేతల పరిధిని పెంచుకోవాల్సి ఉంటుంది’’ అని ఏఅండ్ఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ సైగల్ పేర్కొన్నారు. కస్టమర్ల అవసరాలు, మారుతున్న కొనుగోళ్ల ధోరణి, తగిన టెక్నాలజీలు, రవాణా భాగస్వాములపై ఈ కామర్స్ విస్తరణ ఆధారపడి ఉంటుందని ఈ నివేదిక తెలియజేసింది. ఎఫ్ఎంసీజీ, గ్రోసరీలు, వస్త్రాల విక్రయాలు మరింత పెంచుకునేందుకు సోషల్ మీడియా, చాట్ ఇంజన్స్, ఏఐ బాట్స్ అన్నవి కీలకమవుతాయని పేర్కొంది. -
‘అన్‌లాక్’తో ఇ–కామర్స్ టేకాఫ్
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ప్రభుత్వం క్రమంగా సడలిస్తూ అన్‌లాక్ చేస్తున్న నేపథ్యంలో ఇ–కామర్స్ వ్యాపారం పుంజుకుంటోంది. షాపింగ్ కోసం బైటికెళ్లడాన్ని తగ్గించుకుంటూ ఆన్లైన్ మాధ్యమానికి వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తుండటం ఇందుకు తోడ్పడుతోంది. ఇక, పెరుగుతున్న వ్యాపారంతో పాటు ఇ–కామర్స్ విభాగంలో కొత్తగా మరింత మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ఇ–కామర్స్ వ్యాపారం దాదాపు 80 శాతం పెరిగింది. దాదాపు 10 కోట్లమంది క్రియాశీలంగా ఉండే వినియోగదారులతో ఇ–కామర్స్ రంగం అంతకంతకూ వృద్ధి చెందుతోందని నివేదిక పేర్కొంది. లాక్డౌన్ ముందటి పరిస్థితి కంటే కూడా ప్రస్తుతం ఇ–కామర్స్ వ్యాపారం ఎక్కువగా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్ని రకాల వస్తువులను విక్రయించే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఇ–కామర్స్ సంస్థలే కాదు... కిరాణా సరుకులు, వ్యాయామ పరికరాలు వంటి ప్రత్యేక కేటగిరీ వస్తువులను విక్రయించే సంస్థల వ్యాపారం కూడా జోరందుకుంది. ఐఏఎంఏఐ నివేదిక ప్రకారం దేశంలో ఇ–కామర్స్ వ్యాపారం ఇలా ఉంది... లాక్డౌన్ రోజుల్లో 80 శాతం వ్యాపారం డౌన్ దేశంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలులో ఉన్న ఏప్రిల్, మేలో ప్రభుత్వం కేవలం నిత్యావసర వస్తువుల విక్రయానికే అనుమతించింది. దాంతో ఇ–కామర్స్ వ్యాపారం దాదాపు 80 శాతం తగ్గిపోయింది. మార్చి చివరి వారం నుంచి జూన్ మొదటివారం వరకూ దేశీయంగా ఇ–కామర్స్ సంస్థలు దాదాపు రూ.7,520 కోట్ల వ్యాపారాన్ని కోల్పోయారని అంచనా. ఉపాధికీ ఊతం.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇతర రంగాల్లో ఉద్యోగాల్లో కోత విధిస్తుంటే ఇ–కామర్స్ రంగం కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా వినియోగదారులకు సకాలంలో సరఫరా చేసేందుకు ఇ–కామర్స్ సంస్థలు కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. అమెజాన్ ఇండియా తమ పంపిణీ వ్యవస్థలో కొత్తగా 50వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అటు బిగ్ బాస్కెట్ ఇటీవల కొత్తగా 12వేలమంది సిబ్బందిని నియమించుకుంది. గ్రోఫర్స్ సంస్థ ఇప్పటికే కొత్తగా 2,500 మందిని రిక్రూట్ చేసుకోగా ...మరో 5వేలమంది ఉద్యోగులను త్వరలో తీసుకుంటామని చెప్పింది. అటు ఇ–కామ్ ఎక్స్‌ప్రెస్ సంస్థ ఇటీవల కొత్తగా 7,500 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. అన్‌లాక్‌తో జోరందుకున్న వ్యాపారం మే మూడో వారం నుంచి లాక్డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తున్న ప్రభుత్వం జూన్ నుంచి మరింత వెసులుబాటు కల్పించడం ఇ–కామర్స్ సంస్థలకు అనుకూలంగా మారింది. ఇ–కామర్స్ సంస్థలు దేశంలోని దాదాపు 19వేల పిన్‌కోడ్ ప్రాంతాల్లో ప్రస్తుతం సరుకులు అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో రోజుకు 30లక్షల వరకు షిప్మెంట్లను డెలివరీ చేస్తున్నాయి. మరికొంతకాలం పాటు వినియోగదారులు షాపింగ్ కోసం ఎక్కువగా బయటకు వెళ్లే పరిస్థితి లేనందున రాబోయే రెండు నెలల్లో ఈ వ్యాపారం మరింత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సంస్థలవారీగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తుల విషయం చూస్తే.. అమెజాన్ ఇండియా పోర్టల్‌లో ప్రధానంగా ఉద్యోగుల ‘వర్క్ ఫ్రం హోం’, విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు సంబంధించిన వస్తువుల విక్రయం విపరీతంగా పెరిగింది. మొత్తం మీద అమెజాన్ వ్యాపారం 50 శాతం పెరిగింది. ఇక, మరో దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వ్యాపారం 90 శాతం ఎగిసింది. ఈ పోర్టల్ ద్వారా వ్యాయామ పరికరాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, గృహ అలంకరణ వస్తువుల విక్రయాలు గణనీయంగా ఉంటున్నాయి. -
90 నిముషాల్లో ఫోన్ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ ‘బిగ్ సి’ ఆన్లైన్ విక్రయాల్లోకి ప్రవేశించింది. కంపెనీ స్టోర్లున్న నగరం, పట్టణంలో వెబ్, యాప్ ద్వారా ఆర్డరు ఇచ్చిన 90 నిమిషాల్లోనే మొబైల్‌ను ఉచితంగా డెలివరీ చేస్తారు. కస్టమర్ కోరితే ఇంటి వద్దే మొబైల్స్‌ను ప్రదర్శిస్తారు. ప్రస్తుతం సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 81 నగరాలు, పట్టణాల్లో 225 ఔట్లెట్లు ఉన్నాయి. కర్ణాటకలో కొద్ది రోజుల్లో అడుగు పెట్టనున్నట్టు బిగ్ సి ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. 17వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించిన సందర్భంగా డైరెక్టర్లు స్వప్న కుమార్, బాలాజీ రెడ్డి, కైలాష్ లఖ్యానీతో కలిసి సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. 2021 మార్చి నాటికి స్టోర్ల సంఖ్య 300లకు చేరుతుందన్నారు. ఇందుకోసం రూ.50 కోట్లదాకా ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్టోర్లలో ఇతర ఉపకరణాలు.. మొబైల్స్, యాక్సెసరీస్‌తోపాటు ఎంఐ, టీసీఎల్ కంపెనీల స్మార్ట్ టీవీల విక్రయాలను ప్రారంభించామని బాలు చౌదరి తెలిపారు. ‘ఇతర కంపెనీల స్మార్ట్ టీవీలను సైతం ప్రవేశపెడతాం. ఇంటర్నెట్తో అనుసంధానించే స్మార్ట్ ఉపకరణాల సంఖ్య పెంచుతాం. 17వ వార్షికోత్సవం పురస్కరించుకుని రూ.12 కోట్ల విలువైన బహుమతులు, రూ.5 కోట్ల విలువైన క్యాష్ పాయింట్లను సైతం ఆఫర్ చేస్తున్నాం. ప్రతి కొనుగోలుపై స్క్రాచ్ కార్డు ద్వారా ఖచ్చితమైన బహుమతిని కస్టమర్ అందుకోవచ్చు. ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌ల వంటి బహుమతులు వీటిలో ఉన్నాయి. జనవరి 31 వరకు ఈ ఆఫర్ ఉంటుంది’ అని వివరించారు. 5 కోట్ల మంది కస్టమర్లకు చేరువయ్యామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. -
చిన్న నగరాల నుంచీ ఆన్‘లైన్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘నా చిన్నప్పుడు ఊర్లో వస్తువులు ఏవీ దొరికేవి కావు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవి కావు. వచ్చినా ఖరీదెక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ–కామర్స్ రాకతో ప్రపంచంలో లభించే ఏ వస్తువైనా ఆర్డరు చేయవచ్చు’ అని అమెజాన్ ఇండియా కేటగిరీ మేనేజ్మెంట్ డైరెక్టర్ షాలిని పుచ్చలపల్లి అన్నారు. అమెజాన్ ఫెస్టివ్ యాత్రలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆమె సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. పారదర్శక ధర కారణంగానే భారత్‌లో ఈ–కామర్స్ విజయవంతం అయిందన్నారు. దేశ జనాభాలో 10 శాతం మంది ఈ–కామర్స్ వేదికగా ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. ఒక ఉత్పాదనను విక్రయించేందుకు బెస్ట్ ప్రైస్‌తో విక్రేతలు పోటీపడతారని, ఇది కస్టమర్‌కు కలిసి వచ్చే అంశమని వివరించారు. చిన్న నగరాల నుంచే..: కొత్తగా అమెజాన్‌కు జతకూడుతున్న కస్టమర్లలో 91 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే ఉన్నారని షాలిని వెల్లడించారు. ‘99.6% పిన్‌కోడ్స్‌కు చేరుకున్నామంటే ఈ–కామర్స్ పట్ల పెరిగిన అవగాహనే ఉదాహరణ. అమెజాన్ పోర్టల్‌లో 20 కోట్లకుపైగా ఉత్పత్తులు విక్రయిస్తున్నాం. రోజూ 2 లక్షల ప్రొడక్టులు జోడిస్తున్నాం. 5 లక్షల మంది సెల్లర్లున్నారు. ఆర్డర్లలో 40% ఒక రోజులోనే డెలివరీ చేస్తున్నాం. ప్రైమ్ కస్టమర్ల సంఖ్య 18 నెలల్లో రెండింతలైంది. కొనుగోలు నిర్ణయంపై కస్టమర్ రేటింగ్స్‌దే కీలక పాత్ర. నచ్చకపోయినా, నాసిరకంగా ఉన్నా ఉత్పాదనను 30 రోజుల్లో వెనక్కి ఇచ్చే అవకాశం ఉండడం వినియోగదార్లకున్న వెసులుబాటు’ అన్నారు. ఆన్‌లైన్‌కు పెద్ద బ్రాండ్లు..: ఆఫ్‌లైన్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న పెద్ద బ్రాండ్లను ఆన్‌లైన్‌కు తీసుకొచ్చామని అమెజాన్ ఫ్యాషన్ ఇండియా బిజినెస్ హెడ్ అరుణ్ సిర్దేశ్‌ముఖ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ బ్రాండ్లు కొన్ని ఉత్పాదనలను తొలిసారిగా అమెజాన్‌లో ప్రవేశపెట్టాయన్నారు. ఇవి రెండు రోజుల్లోనే తమ ఉత్పత్తులను డెలివరీ ఇస్తున్నాయని గుర్తు చేశారు. ఏడాదిలో కొత్తగా 1.20 లక్షల మంది సెల్లర్లు తోడయ్యారని కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్, మార్కెటింగ్ డైరెక్టర్ కిషోర్ తోట పేర్కొన్నారు. కాగా, ఫెస్టివ్ యాత్రలో భాగంగా ట్రక్కులపై నిర్మించిన నమూనా ఇంటిని కంపెనీ ప్రదర్శించింది. అమెజాన్ పోర్టల్‌లో లభించే ఉత్పత్తులతో ఈ ఇల్లును అందంగా తీర్చిదిద్దారు. ఫస్ట్ సేల్ అదుర్స్.. : సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 4 వరకు నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫస్ట్ సేల్ గ్రాండ్ సక్సెస్ అని అమెజాన్ ప్రకటించింది. రిసెర్చ్ ఏజెన్సీ నీల్సన్ ప్రకారం.. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 4 మధ్య దేశంలో జరిగిన ఆన్లైన్ సేల్స్‌లో కస్టమర్లు, కొనుగోళ్ల పరంగా అమెజాన్ అధిక వాటా సొంతం చేసుకుంది. 500లకుపైగా సిటీస్ నుంచి 65,000ల కంటే ఎక్కువ సెల్లర్లకు ఆర్డర్లు లభించాయి. మిలియనీర్, క్రోర్‌పతి సెల్లర్స్ సంఖ్య 21,000 దాటింది. స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 15 రెట్లు, పెద్ద ఉపకరణాలు 8 రెట్ల వృద్ధి నమోదైంది. ఎకో డివైసెస్ 70 రెట్ల వృద్ధి సాధించాయి. -
ఈ–కామర్స్‌లో పారదర్శకతకు పెద్దపీట
న్యూఢిల్లీ: ఆన్లైన్ వ్యాపారంలో పారదర్శకతను పెంపొందించే దిశగా కొత్త ఈ–కామర్స్ విధానం ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. ధరలు, డిస్కౌంట్లలో పారదర్శకతతో పాటు ఇటు రిటైలర్లు అటు కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కొత్త విధానం ముసాయిదాపై కసరత్తు చేస్తోందని, వచ్చే 2–3 వారాల్లో సంబంధిత వర్గాల అభిప్రాయాల కోసం దీన్ని వెల్లడిస్తామని ప్రభు తెలిపారు. ‘ఈ–కామర్స్ వ్యాపార నిర్వహణను సులభతరం చేయడమనేది పాలసీ ప్రధాన లక్ష్యం. ఇటు రిటైలర్లకు... అటు వినియోగదారులకు ఇది ప్రయోజనకరంగా ఉండాలి. ఈ–కామర్స్ వ్యాపారంలో ధరలు, డిస్కౌంట్ల విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలి‘ అని ఆయన చెప్పారు. ‘డిస్కౌంట్లు ఇవ్వొచ్చని గానీ ఇవ్వొద్దని గానీ మేం నిర్దేశించబోము. ఏది చేసినా పారదర్శకంగా ఉండాలన్నదే మా ఉద్దేశం‘ అని మంత్రి వివరించారు. వాణిజ్య శాఖ గతంలో తయారు చేసిన ముసాయిదాలోని సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని కొత్త ముసాయిదాను ఖరారు చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు, భారత్‌లో తయారీ కేంద్ర ఏర్పాటు విషయంలో కొన్ని మినహాయింపులు కోరుతున్న అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ప్రతినిధులతో వచ్చే నెల దావోస్‌లో భేటీ కానున్నట్లు సురేశ్ ప్రభు తెలిపారు. ఇప్పటికే యాపిల్‌తో చర్చలు జరుగుతున్నాయని, ఆ సంస్థ కోరుతున్న మినహాయింపులను ప్రభుత్వం పరిశీలించే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. -
ముకేశ్ అంబానీ రిటైల్ జోరు..
(సాక్షి, బిజినెస్ విభాగం) జ్యుయలరీ నుంచి మొదలుపెడితే దుస్తులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, పాదరక్షలు, నిత్యావసర సరుకులు... ఇలా అన్నింటికీ వేరువేరు ఆఫ్‌లైన్ స్టోర్లు నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్... ఈ బలాన్ని ఆన్‌లైన్‌కు ఉపయోగించుకోవటానికి స న్నాహాలు చేస్తోంది. వీటన్నిటినీ ఆన్‌లైన్‌లోకి తేవటానికి తన మరో ప్రధాన ఆయుధమైన రిలయన్స్ జియోను ఎంచుకుంటోంది. ఇంటింటికీ జియో ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్... దాని ద్వారానే ఆన్లైన్ వ్యాపారం వృద్ధి చెం దుతుందని భావిస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ–కామర్స్ అనుభవాన్ని అం దించేందుకు తనకు మూలమూలనా ఉన్న జియో పాయింట్ స్టోర్స్‌ను వినియోగించుకోనుంది. చౌక చార్జీలతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ తాజాగా రిటైల్ రంగంలోనూ అదే తరహాలో దూసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. త్వరలో ప్రారంభించే రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ వెంచర్ కోసం ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న జియో పాయింట్ స్టోర్స్‌ను ఉపయోగించుకోబోతున్నారు. ప్రస్తుతం 5,000 పైచిలుకు నగరాల్లో 5,100 పైగా చిన్న స్థాయి జియో పాయింట్ స్టోర్స్ ఉన్నాయి. ప్రణాళికల ప్రకారం ఇంటర్నెట్ అంతగా అందుబాటులో లేని ప్రాంతాల వారికి, ఆన్లైన్ షాపింగ్ చేయని వారికి చేరువయ్యేందుకు వీటిలో ఈ–కామర్స్ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తారు. కొనుగోలుదారులు ఆన్లైన్లో ఆర్డర్లిచ్చేందుకు వీటిలో ఉండే స్టోర్ ఎగ్జిక్యూటివ్స్ సహాయం అందిస్తారు. పప్పులు, పంచదార, సబ్బులు వంటి నిత్యావసరాలు మొదలుకుని సౌందర్య సంరక్షణం, దుస్తులు, పాదరక్షల దాకా అన్నింటినీ వీటి ద్వారా ఆర్డరివ్వొచ్చు. రిలయన్స్ రిటైల్ ఈ ఆర్డర్లను ప్రాసెస్ చేస్తుంది. ఇప్పటికే ఈ స్టోర్స్‌కు సిమ్‌కార్డులు, మొబైల్ హ్యాండ్సెట్స్, యాక్సెసరీస్ మొదలైనవి సరఫరా చేస్తున్న జియో పంపిణీ వ్యవస్థ... ఇకపై ఈ–కామర్స్ ఆర్డర్స్‌ను కొనుగోలుదారుల ఇంటి వద్దకే చేరుస్తుంది. ‘ఇన్స్టాలేషన్ అవసరం లేని, షెల్ఫ్ లైఫ్ ఉండే చాలా మటుకు ఉత్పత్తులను ఈ నెట్వర్క్ ద్వారా విక్రయించేందుకు అవకాశం ఉంది. కస్టమర్ ఆయా ఉత్పత్తులను జియో పాయింట్ వద్దే తీసుకోవచ్చు కూడా. కావాలనుకుంటే స్టోర్ ఎగ్జిక్యూటివ్స్ వాటిని ఇంటికి కూడా డెలివరీ చేస్తారు‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిలయన్స్ రిటైల్ ఇప్పటికే జియో పాయింట్ స్టోర్స్ నుంచి టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లకు సంబంధించి ఈ తరహా ఆర్డర్లు తీసుకుంటోంది. మొత్తం కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్ అమ్మకాల్లో వీటి వాటా 10 శాతం దాకా ఉంటోంది. ఇప్పుడు ఇదే విధానాన్ని నిత్యావసరాలు మొదలైన వాటికి కూడా వర్తింపచేయాలని భావిస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ–కామర్స్ వెంచర్.. కంపెనీ వర్గాల కథనం ప్రకారం.. రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ వెంచర్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 95% జనాభాకు చేరువవ్వాలని రిలయన్స్ రిటైల్ లకి‡్ష్యస్తోంది. ఈ–కామర్స్, జియో పాయింట్ స్టోర్స్ ద్వారానే ఇది సాధ్యం అవుతుందని కూడా భావిస్తోంది. దాదాపు 10,000 పైగా జనాభా ఉన్న పట్టణాల్లో రిటైల్ పాయింట్స్ ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా పెద్ద నగరాలు, చిన్న పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 50,000 పైచిలుకు జియో పాయింట్ స్టోర్స్‌ను కొత్తగా ప్రారంభించాలని రిలయన్స్ భావిస్తోంది. కస్టమర్ సేల్స్, సర్వీస్ టచ్ పాయింట్స్‌గానే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉత్పత్తుల పంపిణీకి కూడా వీటిని ఉపయోగించుకోనుంది. ఈ ప్రణాళికల్లో భాగంగా ప్రతి మూడునెలల్లో కొత్తగా 500 జియో పాయింట్స్‌ను ప్రారంభిస్తోంది. అన్ని ఫార్మాట్లలోనూ దిగ్గజాలతో పోటీ! ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు దీటుగా రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ వెంచర్ ఉండబోతోందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సంస్థలు కూడా గ్రామీణ ప్రాంతాల వారికి చేరువయ్యేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు అమెజాన్ ప్రత్యేకంగా ప్రాజెక్ట్ ఉడాన్ విధానాన్ని అమలు చేస్తోంది. దీని కింద చిన్న పట్టణాల్లో 12,000 పైచిలుకు చిన్న రిటైల్ సంస్థలు, స్థానిక ఎంట్రప్రెన్యూర్స్‌తో చేతులు కలిపింది. ఈ షాపుల ద్వారా ఆన్లైన్లో అమెజాన్‌లో ఆర్డర్లు పెట్టొచ్చు. ఉత్పత్తుల డెలివరీ తీసుకోవచ్చు. దీంతో పాటు దిగ్గజ సంస్థలకు దీటుగా వీడియో, మ్యూజిక్, మ్యాగజైన్స్, న్యూస్ వంటి రంగాల్లోనూ రిలయన్స్ భారీగా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. 12 బిలియన్ డాలర్ల మార్కెట్.. కన్సల్టెన్సీ సంస్థ ఎర్న్స్ట్ అండ్ యంగ్ అంచనాల ప్రకారం భారత ఈ–కామర్స్ విభాగంలో గ్రామీణ ప్రాంత మార్కెట్ వచ్చే నాలుగేళ్లలో 10–12 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందనుంది. 2017 నుంచి 2021 మధ్య కాలంలో దేశీయంగా ఈ–కామర్స్ విక్రయాలు 32 శాతం మేర వార్షిక వృద్ధి నమోదు చేయనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోను పెరుగుతున్న ఆదాయాలు, వినియోగం, వ్యవసాయేతర ఆదాయ మార్గాలు, సానుకూల వ్యవసాయ పరిస్థితులు, ఇంటర్నెట్ వినియోగం మెరుగుపడుతుండటం, చిన్న కుటుంబాలు తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. -
ఆన్లైన్ అదుర్స్!
తొలి 6 స్థానాలు పొందిన నగరాలివే.. 1 ఢిల్లీ 2 ముంబై 3 బెంగళూరు 4 చెన్నై 5 కోల్‌కతా 6 హైదరాబాద్ సాక్షి, హైదరాబాద్ : ఆన్లైన్ వ్యాపారం అదుర్స్ అనిపించింది. దసరా.. దీపావళి పండుగలతో ఆన్లైన్ డీల్స్ హోరెత్తించడంతో వెబ్సైట్లు పండుగ చేసుకున్నాయి. నచ్చిన వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేయడంలో మెట్రో నగరాల ప్రజలు ముందున్నారు. ఈ విషయంలో గ్రేటర్ సిటిజన్లు ఆరో స్థానంలో నిలిచారు. స్మార్ట్ జనరేషన్గా మారుతోన్న కుర్రకారు ఈ విషయంలో అగ్రభాగాన నిలవడం విశేషం. ప్రధానంగా 18–35 వయస్సు గ్రూపులో ఉన్న యువతలో సుమారు 90 శాతం ఆన్లైన్ కొనుగోళ్లకే మక్కువ చూపుతున్నట్లు అసోచామ్ తాజా సర్వేలో వెల్లడైంది. ఇక స్మార్ట్‌ఫోన్ వినియోగంతో ఆన్లైన్లో వస్తువులు కొనేవారి సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోందని పేర్కొంది. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా పలువురు నెటిజన్ల అభిప్రాయాలను సేకరించి సర్వే వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా 15 మెట్రో నగరాల్లో ఆన్లైన్ ఈ కామర్స్ డీల్స్ సుమారు రూ.30 వేల కోట్ల మేర జరిగినట్లు అంచనా వేశారు. ఆన్లైన్ కొనుగోళ్లు పెరగడానికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం ఓ కారణమని అసోచామ్ పేర్కొంది. దేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగం ఈ కామర్స్ ఇండస్ట్రీకి వూతమిచ్చిందని ఈ సర్వే తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణె, గుర్గావ్, నోయిడా, ఛండీగడ్, నాగ్‌పూర్, ఇండోర్, కోయంబత్తూర్, హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఈ మెట్రో నగరాల్లో ఏటా 60 నుంచి 65 శాతం మేర ఆన్లైన్ కొనుగోళ్లు పెరుగుతున్నాయని సర్వే గుర్తించింది. ఏం కొంటున్నారంటే... మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, బ్రాండెడ్ షూస్, ఆభరణాలు, పెర్ఫ్యూమ్స్, గృహోపకరణాలు తదితరాల కొనుగోలుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారని సర్వేలో తేలింది. వీటిల్లోనూ ప్రధానంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను 78 శాతం మేర కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. పురుషులే అధికం.. అసోచామ్ సర్వే ప్రకారం.. ఆన్లైన్ కొనుగోళ్లలో పురుషులదే ఆధిపత్యమని తేలింది. వీరి వాటా 65 శాతం ఉండగా.. స్త్రీలు 35 శాతం మంది ఆన్లైన్ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక పండగ సీజన్లో 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ, పురుషులే అధిక భాగం ఆన్లైన్ కొనుగోళ్లు జరిపినట్లు తేలింది. నిత్యం ఆన్లైన్లో జరిగే కొనుగోళ్లలో యువతే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. 18–35 ఏళ్ల వయసు గలవారు అత్యధికంగా 90 శాతం మంది కొనుగోళ్లలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇక 36–45 ఏళ్ల మధ్య వయసున్న వారు 8 శాతం, 45–60 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు రెండు శాతం మాత్రమే ఆన్లైన్లో కొనుగోళ్లు జరుపుతున్నారు. -
చెత్తను కొంటాం.. ఆన్లైన్లో!
పాత పేపర్లు అమ్మే వ్యక్తి వస్తే గానీ ఇంట్లో చెత్త తరగదు!!. కొట్టుకెళ్లి అమ్మితే గానీ ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలూ కదలవు!!. రెండూ కష్టమైన పనులే. మరి ఒక్క క్లిక్‌తో ఆ సమస్య తీరిపోతే? ఆ వెసులుబాటునే వ్యాపారంగా మార్చుకున్నారు ఇద్దరు స్నేహితులు. హలోడస్ట్‌బిన్.కామ్‌ను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ వసంత్ రెడ్డి మాటల్లోనే.. ♦ నేను, రాజమహేంద్ర రెడ్డి ఇద్దరం ఉస్మానియా వర్సిటీ నుంచి స్నేహితులం. చదువులో భాగంగా మేం ప్లాస్టిక్, ఈ–వేస్ట్‌లపై చేసిన ప్రాజెక్ట్ వర్కే చదువు పూర్తయ్యాక మాకు వ్యాపార వేదికయింది. చెత్త సేకరణ, పునఃవినియోగంపై పరిశోధన చేసి రూ.15 లక్షల పెట్టుబడితో 2016 మేలో హలోడస్ట్‌బిన్.కామ్‌ను ప్రారంభించాం. ♦ పాత పేపర్లు, మ్యాగజైన్లు, స్క్రాప్, అల్యూమినియం, పుస్తకాలు ఏవైనా సరే కిలోల చొప్పున కొంటాం. ఇళ్లతో పాటు సొసైటీలు, పరిశ్రమలు, కంపెనీల నుంచి కూడా ఈ–ప్లాస్టిక్, పాత ఇనుము తీసుకుంటాం. ధరలు కిలో పేపర్‌కు రూ.7, ప్లాస్టిక్, ఈ–వేస్ట్‌లకు రూ.8, టిన్నులు రూ.6, ఇనుముకు రూ.12 ఉంటాయి. ♦ యాప్ ద్వారా గానీ వెబ్సైట్ ద్వారా గానీ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి గానీ మా సేవలను వినియోగించుకోవచ్చు. ఆర్డర్ రాగానే డిజిటల్ వెయింగ్ మిషీన్, వాహనం వెంట తీసుకెళతాం. ప్రస్తుతం రోజుకు టన్ను చెత్తను కొంటున్నాం. మేం సేకరించిన చెత్తను రీసైక్లింగ్ కంపెనీలకు విక్రయిస్తాం. హైదరాబాద్‌కు చెందిన 10 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. ♦ ప్రస్తుతం 10 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు 500 టన్నుల చెత్తను కొన్నాం. ఏడాదిలో రూ.10 లక్షల టర్నోవర్ నమోదు చేశాం. డబ్బులు నేరుగా ఇవ్వకుండా హలోడస్ట్‌బిన్.కామ్ వాలెట్లో వేస్తాం. దీని ద్వారా మాతో ఒప్పందం చేసుకున్న పలు సూపర్ మార్కెట్లలో షాపింగ్ చేసుకోవచ్చు. పాత ఫోన్ల యాక్ససరీలూ దొరుకుతాయ్ ఇక్కడ..! విపణిలోకి కొత్తగా వచ్చిన సెల్ఫోన్ల యాక్ససరీలు దొరకడం పెద్దగా కష్టం కాదు. కానీ, ఐదు, పదేళ్ల కిందటి ఫోన్ల యాక్ససరీలు కొనాలంటే చాలా కష్టం. ఒక్కోసారి దొరకవు కూడా. కానీ, డయల్ మామలో వెతికితే దొరికేస్తాయి. పదేళ్ల కిందటివే కాదు. తొట్టతొలి మోడల్ మొబైల్ యాక్ససరీలూ దొరుకుతాయిక్కడ. ఇదే తమ ప్రత్యేకత అంటున్నారు డయల్ మామా కో–ఫౌండర్ ఎం.హర్షవర్ధన్‌రెడ్డి. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ♦ నేను, స్నేహితుడు కిరణ్ కుమార్ కలిసి 2014 డిసెంబర్లో అమీర్‌పేట కేంద్రంగా డయల్ మామా మొబైల్ సొల్యూషన్స్‌ను ఆరంభించాం. ఇప్పటివరకు రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాం. రిటైలర్లకు మాత్రమే మొబైల్ యాక్ససరీలు విక్రయిస్తాం. రూ.5 వేల లోపు సెల్‌ఫోన్లనూ విక్రయిస్తాం. ♦ సెల్‌ఫోన్ ఫ్లిప్ కవర్స్, బ్యాటరీలు, చార్జర్ల వంటి 4 వేల కేటగిరీల్లో 1.75 లక్షల యాక్ససరీలున్నాయి. వీటిని ముంబై నుంచి దిగుమతి చేసుకుంటాం. దీనికోసం 450 మంది డీలర్లతో ఒప్పందం చేసు కున్నాం. తెలంగాణ, ఏపీల్లో 20 వేల మంది రిటైలర్లున్నారు. ఇందులో 1250 మంది యాక్టివ్ రిటైలర్లు కస్టమర్లుగా ఉన్నారు. ♦ ప్రస్తుతం రోజుకు లక్ష రూపాయల వరకు ఆర్డర్లొస్తున్నాయి. యాక్ససరీలను సనత్‌నగర్‌లోని గోడౌన్లో నిల్వ చేస్తాం. ఆర్డర్ రాగానే ఇక్కడి నుంచే ప్యాకేజింగ్ చేసి.. 3 రోజుల్లో డెలివరీ చేస్తాం. ఇందుకు ప్రధాన కొరియర్ సంస్థలతో జట్టుకట్టాం. ♦ ప్రస్తుతం 13 మంది ఉద్యోగులున్నారు. జనవరి నాటికి కనీసం 5 వేల మంది రిటైలర్లకు రూ.25 కోట్ల వ్యాపారానికి చేరుకోవాలని లకి‡్ష్యంచాం. త్వరలోనే వ్యక్తిగత కస్టమర్లకు సేవలందించేందుకు వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నాం. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఏపీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా కూడా నగదును పంపించే వీలుంది. ఒకటేమో చెత్తను ఆన్లైన్లో కొనుగోలు చేసే కంపెనీ. మరొకటేమో పాత మొబైల్ ఫోన్లకు కూడా చక్కని యాక్సెసరీస్‌ను విక్రయించే కంపెనీ. రెండింటి ఆలోచనలూ వినూత్నమే. ‘సాక్షి’ స్టార్టప్ డైరీకి వస్తున్న మెయిల్స్ నుంచి ఈ రెండూ మీ కోసం... -
వ్యాపారం మీది.. వేదిక మాది!
⇒ వ్యక్తిగత వర్తకులు, ఎస్ఎంఈలకు ఆన్లైన్ వ్యాపార వేదిక ⇒ క్రాఫ్ట్లీలో చేనేత, హస్తకళలకు ప్రత్యేక విభాగం కూడా.. ⇒ కేంద్ర ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యండీక్రాఫ్ట్స్తో ఎంవోయూ ⇒ అందుబాటులో 1,500 విభాగాల్లో 70 లక్షల ఉత్పత్తులు ⇒ ఇప్పటివరకు 9.5 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ ⇒ ‘స్టార్టప్ డైరీ’తో క్రాఫ్ట్లీ కో–ఫౌండర్ విశేష్ ఖురానా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో బ్రాండెడ్ ఉత్పత్తులు లేదా స్థానికంగా పేరొందిన ఉత్పత్తులు ఆన్లైన్లో కొనాలంటే ఈజీనే. ఎందుకంటే వీటికి బోలెడన్ని వేదికలున్నాయి. మరి, చిన్న, మధ్య తరహా సంస్థలు, వ్యాపారస్తుల ఉత్పత్తుల పరిస్థితేంటి? మరీ ముఖ్యంగా చేనేత, హస్తకళా ఉత్పత్తులకో? ఆయా తయారీ సంస్థలు, విక్రయదారులకు సరైన ఆన్లైన్ వేదికంటూ లేకపోవటంతో పోటీపడలేకపోతున్నాయి. దీనికి పరిష్కారం చూపిస్తోంది క్రాఫ్ట్లీ.కామ్. ఈ సంస్థ సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి దాని వ్యవస్థాపకుడు విశేష్ ఖురానా ఏం చెబుతారంటే... ఢిల్లీ కేంద్రంగా ఆగస్టు 2015లో సాహిల్ గోయెల్, గౌతమ్ కపూర్, నేను కలిసి దీన్ని ప్రారంభించాం. వ్యక్తిగత వర్తకులకు, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఆన్లైన్లో ఉత్పత్తులను విక్రయించుకునే వేదికే క్రాఫ్ట్లీ. విక్రయదారులకు ఉత్పత్తుల కేటలాగ్, ఉత్పత్తుల ప్రదర్శన, ఆన్లైన్ మార్కెటింగ్, పేమెంట్ సొల్యూషన్స్, లాజిస్టిక్ సేవలను కూడా అందిస్తాం. 1,500 విభాగాలు, 70 లక్షల ఉత్పత్తులు.. ప్రస్తుతం క్రాఫ్ట్లీలో 17 వేల మంది విక్రయదారులు నమోదయ్యారు. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక నుంచి ఎక్కువ మంది ఉన్నారు. ఫ్యాషన్, జ్యుయెలరీ, హోమ్‌డెకర్, ఫుట్‌వేర్ వంటి 1,500 కేటగిరీల్లో సుమారు 70 లక్షలకు పైగా ఉత్పత్తులున్నాయి. ప్రతి రోజూ క్రాఫ్ట్లీ ద్వారా 10 వేల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. ప్రతి ఉత్పత్తి అమ్మకంపై విక్రయదారుడి నుంచి 10 శాతం కమీషన్ తీసుకుంటాం. వ్యాపారులు లేదా సంస్థలు కావాలంటే ఈ–కామర్స్ వేదికను అభివృద్ధి చేసిస్తాం. ఫీచర్లను బట్టి వీటి ధరలు రూ.3–15 వేల వరకూ ఉంటాయి. త్వరలోనే మరో విడత నిధుల సమీకరణ.. ఈ ఏడాది ముగింపు నాటికి 5 మిలియన్ డాలర్ల ఆదాయంతో పాటు వచ్చే ఏడాది కాలంలో మరో లక్ష మంది విక్రయదారుల్ని నమోదు చేయాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మా సంస్థలో 200 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు 9.5 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాం. బెర్టెల్స్మెన్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ (బీఐఐ), నిర్వాణా వెంచర్, బీనూస్, 500 స్టార్టప్స్ వంటివి ఈ పెట్టుబడులు పెట్టాయి. ఈ ఏడాది ముగింపునాటికి మరో విడత నిధుల సమీకరణ చేస్తాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. చేనేత, హస్తకళలకు ప్రత్యేకం.. ఇటీవలే కేంద్ర ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యండీక్రాఫ్ట్స్ (ఈపీసీహెచ్)తో ప్రత్యేక ఒప్పందం చేసుకున్నాం. ఈ ఎంవోయూతో ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ కింద చేనేతదారులు, హస్త కళాకారులు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, అస్సాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్పత్తిదారులు నమోదయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 5 వేల మంది చేనేత, హస్తకళాకారులున్నారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ఆశకు పోతే నెత్తిన గుడ్డే..
ఆన్లైన్ వ్యాపారం ఇప్పుడు జోరందుకుంటోంది. సరి కొత్త ఉత్పత్తులు మొదలుకుని సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే సైట్లు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ వస్తువులు, ఉపకరణాల ప్రకటనలు ఆకర్షిస్తుంటాయి. ఎంతో ఖరీదైనవి సగం ధరకే అనే ప్రకటనలకైతే వినియోగదారులు ఇట్టే బుట్టలో పడిపోతుంటారు. అప్రమత్తంగా లేకపోతే తక్కువ ధరకే కొన్న ఆనందం కొన్ని రోజుల్లోనే ఆవిరైపోవచ్చు. కొత్త చికాకులూ చుట్టుముట్టొచ్చు. * సెకండ్ హ్యాండ్ ఉపకరణాల కొనుగోలుతో చికాకు * దొంగలించిన ఫోన్లను ఆన్లైన్లో విక్రయం * జాగ్రత్తలు తీసుకోకుంటే జేబుకు చిల్లే చిత్తూరు(గిరింపేట): మొదటి సన్నివేశం: చిత్తూరులోని క ట్టమంచికి చెందిన అనిల్ అనే యువకుడు ఆన్లైన్లో ఈ కామర్స్ వెబ్సైట్లో ఓ స్మార్ట్ ఫోన్ ప్రక టన చూసి ఆకర్షితుడయ్యాడు. ఆ మోడల్ వాస్తవ ధర సుమారు రూ. 40 వేలు. అయితే సగం ధ రకే ఆ ఫోన్‌ను అమ్మకానికి పెట్టడంతో ఏ మాత్రం అనుమానం లేకుండా ప్రకటన ఇచ్చిన వ్యక్తి నుంచి ఆ ఫోన్ కొనుగోలు చేశాడు. ఆ ఫోన్ కు బిల్లు ఇవ్వమని అడిగాడు. ఎక్కడోపోయిందని తిరుపతి వాసిగా చెప్పుకున్న ఆ ప్రకటనదారుడు పేర్కొనడంతో నిజమేనని నమ్మాడు. కానీ, తర్వాత కొన్ని రోజులకు ఆ ఫోన్ అతడి పెద్ద షాకే ఇచ్చింది. రెండో సన్నివేశం: కొత్తగా కొన్న సెకండ్ హ్యాండ్ ఫోన్లో సిమ్‌కార్డు వేసి రెండు రోజుల పాటు వినియోగించాడు. ఆ తర్వాత మూడో రోజు వచ్చిన ఓ ఫోన్ కాల్ అతడికి వణుకు, జ్వరం తెప్పించింది. అది దొంగలించిన ఫోన్ అని, దానిని మర్యాదగా అప్పగించకపోతే కేసు తప్పదని తిరుపతి పోలీసుస్టేషన్ నుంచి ఫోన్ రావడంతో హడలిపోయాడు. వెంటనే తనకు స్మార్ట్ ఫోన్ అమ్మిన వ్యక్తికి కాల్ చేశాడు. కానీ ఆ నంబర్ స్విచ్ఛాఫ్‌లో ఉందని వాయిస్ వినిపించింది. ఆన్లైన్లో తాను చూసిన ప్రకటన కోసం వె తికాడు. కానీ అక్కడ ఆ ప్రకటన లేదు. ఇలా షాక్ మీద షాక్ తగలడంతో చేసేదేమీ లేక తాను ముచ్చట పడి కొన్న సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్‌ను పోలీసులకు అప్పగించాడు. ప్రకటనదారుడి సెల్ నంబర్ ఆధారంగా అతడి వివరాలు కనుగొనేందుకు యత్నించినా అదీనూ తప్పుడు నంబర్ అని పోలీసుల విచారణలో తేలింది. ఇది ఒక్క అనిల్‌కు ఎదురైన సమస్యే కాదు. జిల్లాలో ఇలా మోసపోతున్న వారు చాలా మందే వున్నారు. ఆన్లైన్లోని కొన్నిసైట్లలో ప్రకటనల ద్వారా విక్రయిస్తున్న సెకండ్ హ్యాండ్ ఫోన్లలో ఎక్కువగా దొంగలించినవే కావడంతో కొన్నవారు ఇలాంటి చేదు అనుభవాలను చవిచూడాల్సి వస్తోంది. సెల్ఫోన్లు చోరీకి గురైతే పోలీసులు తమ వద్ద గల సాఫ్ట్వేర్ ద్వారా (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడె ంటిటీ(ఐఎంఈఐ)నంబరు ద్వారా ఫోన్ ఏ ప్రాంతంలో వుందో ట్రాక్ చేసి గుర్తిస్తారు. కొట్టేసిన ఫోన్లోని సిమ్‌కార్డు తీసేసి విక్రయించినా ఐఎంఈఐ నంబరు వారిని పట్టిస్తోంది. అటువంటి ఫోన్లను కొనుగోలు చేసిన వారు కొత్త సిమ్‌ను అందులో వేసిన వెంటనే పోలీసుల ట్రాకింగ్‌కు చిక్కుతోంది. ఈ క్రమంలో తక్కువ ధరకు ఫోన్ లభించిదంటూ బిల్లులేని ఫోన్లను కొంటే భాదితుల జాబితాలోకి చేరాల్సిందే. ఐఎంఈఐ ప్రత్యేకత * ప్రతి ఫోన్‌కు ఐఎంఈఐ సంఖ్య ఆధార్ సంఖ్యలాగా విశిష్టమైన ది. ఒక ఫోన్‌కున్న సంఖ్య మరొక ఫోన్‌కు ఉండదు. * ఒక వేళ ఫోన్‌ను దొంగలు అపహరించి సిమ్‌కార్డును దానిలోంచి తీసివేసినా పోలీసులు ఆ సంఖ్య ఆధారంగా దొంగలను పట్టుకుంటారు. ఏ పరిధిలో ఫోన్‌ను వినియోగిస్తున్నారనే విషయాన్ని గమనించి పట్టుకునే అవకాశం వుంది. * స్మార్ట్ ఫోన్లలో యాంటీ థెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను అప్లోడ్ చేసుకుంటే తమ ఖరీదైన ఫోన్లను కాపాడుకోవచ్చు. సాధరణంగా జరిగే పొరపాట్లు * షాపింగ్చేసే సమయంలో ఏమరుపాటుతో సెల్ఫోన్లను పక్కనపెట్టి మరచిపోతుంటారు. * బస్సులో వెళ్లేటప్పుడు నిద్రిస్తున్న సమయంలో దొంగలు తమ పని కానిచ్చేయడమో లేదా జేబు నుంచి పడిపోవడం, తమ స్టాపింగ్ రాగానే సెల్ ఉన్నదీ లేనిదీ గమనించకనే హడావుడిగా దిగి వెళుతుంటారు. * రైలు ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ల వద్ద దరఖాస్తు ఫారాలను పూర్తిచేయడంలో నిమగ్నమై సెల్‌ఫోన్‌ను పక్కన పెట్టి అలాగే వ దలి వెళుతుంటారు. * రైల్వేస్టేషన్లలో సెల్ఫోన్లను చార్జింగ్ పెట్టి దానిని గమనించకుండా వుండడంతో సమయం చూసి వాటి ని కొట్టేస్తున్నారు. * విద్యార్థులు పరీక్ష లకు హాజరయ్యే సమయంలో ఫోన్లను బ్యాగ్‌లలో పెట్టి పరీక్షలకు వెళుతుంటారు. ఆ సమయంలో అవి దొంగతనానికి గురవుతుంటాయి. -
‘ఆన్లైన్’ పండుగ..!
బెంగళూరు/ముంబై: ఈ పండుగల సీజన్లో ఆన్లైన్ వ్యాపారం వేడెక్కుతోంది. ఈ కామర్స్ దిగ్గజాల, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్ సంస్థలు భారీ స్థాయిలో అమ్మకాలే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సంస్థ ద బిగ్ బిలియన్ డేస్ పేరుతో పండుగల సీజన్ అమ్మకాలను మంగళవారం నుంచి ప్రారంభించింది. పోటీ సంస్థలు, స్నాప్‌డీల్, అమెజాన్ సంస్థలు ఈ పండుగ సీజన్‌ను ఒక పేరుతో బ్రాండింగ్ చేయకపోయినా, ఇవి కూడా వినియోగదారులను ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తున్నాయి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదంటూ పండుగల సీజన్ కొనుగోళ్ల కోసం ఫ్లిప్‌కార్ట్ భారీ ప్రచారం నిర్వహిస్తోంది. దాదాపు పది లక్షల ఫ్యాషన్ ఉత్పత్తులపై 80 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఇస్తామని అంటోంది. ప్రతీ గంటకు కొత్త ఆఫర్లిస్తామని స్నాప్‌డీల్, రోజూ 1 కేజీ బంగారం గెల్చుకునే అవకాశముందని, ఒక్క రోజులోనే డెలివరీ ఇస్తామని అమెజాన్ ఇండియాలు ఊరిస్తున్నాయి. 10 గంటల్లో 10 లక్షల వస్తువుల అమ్మకాలు 13వ తేదీన 10 గంటల్లో పది లక్షలకు పైగా వస్తువులను విక్రయించామని దేశవ్యాప్తంగా 60 లక్షల హిట్స్ వచ్చాయని, ఒక సెకన్‌కు 25 వస్తువులను అమ్మామని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. మెట్రో నగరాల్లో బెంగళూరు, ఢిల్లీ, చెన్నైల నుంచి, ఇతర నగరాల్లో లూధియానా, లక్నో, భోపాల్ల నుంచి ఎక్కువగా హిట్స్ వచ్చాయని పేర్కొంది. ఇప్పటివరకూ పాదరక్షలు, పురుషుల దుస్తులు, యాక్సెసరీలు బాగా అమ్ముడయ్యాయని ఫ్లిప్‌కార్ట్ హెడ్ ముకేష్ బన్సాల్ చెప్పారు. గత రెండు రోజుల్లో 16 లక్షల యాప్ డౌన్లోడ్లు జరిగాయని, 70 కేటగిరీల్లో 3 కోట్ల వస్తువులను ఆఫర్ చేసున్నట్లు పేర్కొన్నారు. ఉదయమే డెలివరీ అమెజాన్ అర్ధరాత్రి వరకూ ఆర్డర్ చేసిన వస్తువులను మరునాడు ఉదయం 11 గంటలలోపు డెలివరీ చేసే మార్నింగ్ డెలివరీ సర్వీస్‌ను అమెజాన్ అంది స్తోంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ/ఎన్సీఆర్, ముంబైల్లో ఈ మార్నింగ్ డెలివరీ సర్వీస్ అందుబాటులో ఉంటుందని అమెజాన్ ఇండియా కస్టమర్ ఎక్స్పీరియన్స్ హెడ్ అక్షయ్ సాహి చెప్పారు. ఆర్డర్‌కు రూ.120 ఫ్లాట్ చార్జీతో ఈ ఆఫర్‌ను అందిస్తున్నామని తెలిపారు. ఒకవేళ ఉదయం 11 గంటలలోపు ఆర్డర్ చేస్తే, ఆ వస్తువులను అదే రోజు డెలివరీ చేసే వెసులుబాటు కూడా ఉందని వివరించారు. -
8మంది నైజీరియన్ల అరెస్ట్
బెంగళూరు(బనశంకరి): మారుతున్న కాలానికి అనుగుణంగా ఆన్లైన్ వ్యాపారంలో అందుబాటులోకి రావడంతో, దాన్ని కూడా దుర్వినియోగానికి ఉపయోగించుకున్నారు ఈ నైజీరియన్లు. ఎట్టకేలకు పోలీసులు వలపన్ని 8 మందిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే, పేరుపొందిన ఆన్లైన్ కంపెనీలైన క్వికర్, ఓఎల్ఎక్స్ ద్వారా ప్రజలను వంచిస్తున్న ఆరుగురు నైజీరియన్ పర్యాటకులతోపాటు ఇద్దరు మహిళలను కలిపి మొత్తం 8 మందిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో నైజీరియాకు చెందిన బోలాజీ, అతని భార్య చుకుఒకపాల, ఆవేరియల్లావల్, ఓకాజికాలింగ్, ఓజాలావల్, క్రస్టినాఒబినా తదితరులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇంకా ఈ గ్యాంగ్‌లో ముగ్గురు పరారీలో ఉండడంతో వారికోసం గాలిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్.రెడ్డి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిందితులు ఆన్లైన్లో ఖరీదైన కార్లు, వస్తువులు, పెంపుడు కుక్కల ఫొటోలను పెట్టి తక్కువ ధరకు ఇస్తామంటూ ప్రకటనలు ఇస్తారు. జూన్ 20 తేదీన శేఖర్ అనే వ్యక్తికి తక్కువ ధరకు కారు ఇస్తామన్నారు. ఆ కారును ఎయిర్‌పోర్టులో నిలిపి అత్యవసర పనిమీద విదేశాలకు వెళుతున్నట్లు చెప్పారు. నైజీరియన్ గ్యాంగ్‌లో ఓ మహిళ మొబైల్ నెంబర్ ఇచ్చి ఆమెను సంప్రదించాలని శేఖర్‌కు తెలిపారు. మొబైల్‌కు ఫోన్ చేసిన తక్షణం మహిళ తాను కస్టమ్స్ అధికారిని అంటూ చెప్పి కారు కొనుగోలుకు సంబంధించి డబ్బును బ్యాంక్ ఖాతాలో జమ చేసుకుంది. వెంటనే ఏటీఎం ద్వారా నగదు డ్రా చేసుకుని కారు ఇవ్వకుండా వెళ్లిపోయింది. దీనిపై శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై చిక్కపేటే పోలీసులు కేసు నమోదు చేసుకుని, గాలింపు చేపట్టారు. పోలీసులు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి నైజీరియన్ గ్యాంగ్ ఆచూకీ కనుగొన్నారు. నైజీరియన్లు వంచనకు పాల్పడిన సమయంలో వందలాదిసిమ్ కార్డులు, అనేక బ్యాంక్ ఖాతాలు తెరిచి ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేగాక బరాక్ఒబామా, మిషెల్ ఒబామా తదితర పేర్లుతో నకిలీ ఫౌండేషన్లు స్థాపించినట్లు కూడా తెలిసింది. వీటితో పాటు నకిలీ పాస్‌పోర్టు, వీసా, పాన్‌కార్డులను తయారు చేయడం, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసానికి పాల్పడుతున్నట్లు తెలిసింది. వీరి అరెస్ట్‌తో 12కు పైగా కేసులు వెలుగుచూశాయి. వంచనకు గురైన ప్రజలు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందిస్తే విచారణకు వీలుగా ఉంటుందన్నారు. అరెస్టయిన నైజీరియన్ గ్యాంగ్‌లో ప్రముఖ ఆరోపి బోలాజీ హెణ్ణూరులో ఒక ఏడాది క్రితం తమ దేశంలో ఓ యువకుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిపింది.