![చెత్తను కొంటాం.. ఆన్‌లైన్‌లో!](/styles/webp/s3/article_images/2017/09/17/41504293971_625x300.jpg.webp?itok=9dwxc4fy)
చెత్తను కొంటాం.. ఆన్‌లైన్‌లో!
పాత పేపర్లు అమ్మే వ్యక్తి వస్తే గానీ ఇంట్లో చెత్త తరగదు!!. కొట్టుకెళ్లి అమ్మితే గానీ ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలూ కదలవు!!. రెండూ కష్టమైన పనులే. మరి ఒక్క క్లిక్‌తో ఆ సమస్య తీరిపోతే? ఆ వెసులుబాటునే వ్యాపారంగా మార్చుకున్నారు ఇద్దరు స్నేహితులు. హలోడస్ట్‌బిన్.కామ్‌ను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ వసంత్ రెడ్డి మాటల్లోనే..
♦ నేను, రాజమహేంద్ర రెడ్డి ఇద్దరం ఉస్మానియా వర్సిటీ నుంచి స్నేహితులం. చదువులో భాగంగా మేం ప్లాస్టిక్, ఈ–వేస్ట్‌లపై చేసిన ప్రాజెక్ట్ వర్కే చదువు పూర్తయ్యాక మాకు వ్యాపార వేదికయింది. చెత్త సేకరణ, పునఃవినియోగంపై పరిశోధన చేసి రూ.15 లక్షల పెట్టుబడితో 2016 మేలో హలోడస్ట్‌బిన్.కామ్‌ను ప్రారంభించాం.
♦ పాత పేపర్లు, మ్యాగజైన్లు, స్క్రాప్, అల్యూమినియం, పుస్తకాలు ఏవైనా సరే కిలోల చొప్పున కొంటాం. ఇళ్లతో పాటు సొసైటీలు, పరిశ్రమలు, కంపెనీల నుంచి కూడా ఈ–ప్లాస్టిక్, పాత ఇనుము తీసుకుంటాం. ధరలు కిలో పేపర్‌కు రూ.7, ప్లాస్టిక్, ఈ–వేస్ట్‌లకు రూ.8, టిన్నులు రూ.6, ఇనుముకు రూ.12 ఉంటాయి.
♦ యాప్ ద్వారా గానీ వెబ్‌సైట్ ద్వారా గానీ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి గానీ మా సేవలను వినియోగించుకోవచ్చు. ఆర్డర్ రాగానే డిజిటల్ వెయింగ్ మిషీన్, వాహనం వెంట తీసుకెళతాం. ప్రస్తుతం రోజుకు టన్ను చెత్తను కొంటున్నాం. మేం సేకరించిన చెత్తను రీసైక్లింగ్ కంపెనీలకు విక్రయిస్తాం. హైదరాబాద్‌కు చెందిన 10 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం.
♦ ప్రస్తుతం 10 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు 500 టన్నుల చెత్తను కొన్నాం. ఏడాదిలో రూ.10 లక్షల టర్నోవర్ నమోదు చేశాం. డబ్బులు నేరుగా ఇవ్వకుండా హలోడస్ట్‌బిన్.కామ్ వాలెట్‌లో వేస్తాం. దీని ద్వారా మాతో ఒప్పందం చేసుకున్న పలు సూపర్ మార్కెట్లలో షాపింగ్ చేసుకోవచ్చు.
పాత ఫోన్ల యాక్ససరీలూ దొరుకుతాయ్ ఇక్కడ..!
విపణిలోకి కొత్తగా వచ్చిన సెల్‌ఫోన్ల యాక్ససరీలు దొరకడం పెద్దగా కష్టం కాదు. కానీ, ఐదు, పదేళ్ల కిందటి ఫోన్ల యాక్ససరీలు కొనాలంటే చాలా కష్టం. ఒక్కోసారి దొరకవు కూడా. కానీ, డయల్ మామలో వెతికితే దొరికేస్తాయి. పదేళ్ల కిందటివే కాదు. తొట్టతొలి మోడల్ మొబైల్ యాక్ససరీలూ దొరుకుతాయిక్కడ. ఇదే తమ ప్రత్యేకత అంటున్నారు డయల్ మామా కో–ఫౌండర్ ఎం.హర్షవర్ధన్‌రెడ్డి. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
♦ నేను, స్నేహితుడు కిరణ్ కుమార్ కలిసి 2014 డిసెంబర్‌లో అమీర్‌పేట కేంద్రంగా డయల్ మామా మొబైల్ సొల్యూషన్స్‌ను ఆరంభించాం. ఇప్పటివరకు రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాం. రిటైలర్లకు మాత్రమే మొబైల్ యాక్ససరీలు విక్రయిస్తాం. రూ.5 వేల లోపు సెల్‌ఫోన్లనూ విక్రయిస్తాం.
♦ సెల్‌ఫోన్ ఫ్లిప్ కవర్స్, బ్యాటరీలు, చార్జర్ల వంటి 4 వేల కేటగిరీల్లో 1.75 లక్షల యాక్ససరీలున్నాయి. వీటిని ముంబై నుంచి దిగుమతి చేసుకుంటాం. దీనికోసం 450 మంది డీలర్లతో ఒప్పందం చేసు కున్నాం. తెలంగాణ, ఏపీల్లో 20 వేల మంది రిటైలర్లున్నారు. ఇందులో 1250 మంది యాక్టివ్ రిటైలర్లు కస్టమర్లుగా ఉన్నారు.
♦ ప్రస్తుతం రోజుకు లక్ష రూపాయల వరకు ఆర్డర్లొస్తున్నాయి. యాక్ససరీలను సనత్‌నగర్‌లోని గోడౌన్‌లో నిల్వ చేస్తాం. ఆర్డర్ రాగానే ఇక్కడి నుంచే ప్యాకేజింగ్ చేసి.. 3 రోజుల్లో డెలివరీ చేస్తాం. ఇందుకు ప్రధాన కొరియర్ సంస్థలతో జట్టుకట్టాం.
♦ ప్రస్తుతం 13 మంది ఉద్యోగులున్నారు. జనవరి నాటికి కనీసం 5 వేల మంది రిటైలర్లకు రూ.25 కోట్ల వ్యాపారానికి చేరుకోవాలని లకి‡్ష్యంచాం. త్వరలోనే వ్యక్తిగత కస్టమర్లకు సేవలందించేందుకు వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నాం. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఏపీ ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా కూడా నగదును పంపించే వీలుంది.
ఒకటేమో చెత్తను ఆన్‌లైన్లో కొనుగోలు చేసే కంపెనీ. మరొకటేమో పాత మొబైల్ ఫోన్లకు కూడా చక్కని యాక్సెసరీస్‌ను విక్రయించే కంపెనీ. రెండింటి ఆలోచనలూ వినూత్నమే. ‘సాక్షి’ స్టార్టప్ డైరీకి వస్తున్న మెయిల్స్ నుంచి ఈ రెండూ మీ కోసం...