
రోజుకు సుమారు 19 వేల టన్నులు తరలింపు
స్థానికుల ఆందోళన.. 144 సెక్షన్ విధింపు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్ (Pyaranagar)లో ఏర్పాటు చేస్తున్న వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుపై స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో ప్రతీరోజు సుమారు 7,500 టన్నుల చెత్త ఉత్పత్తి కాగా ఇందులో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి (Kukatpally) జోన్ల పరిధిలో నిత్యం ఉత్పత్తి అయ్యే సుమారు 1,900 టన్నుల చెత్తను ప్యారానగర్ డంప్‌యార్డుకు తరలించనున్నారు. ఈ భారీ డంప్‌యార్డుతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పోరాటం చేస్తున్నారు.
గుమ్మడిదల (Gummadidala) మండలం ప్యారానగర్, నల్లవల్లి, మాంబాపూర్ తదితర గ్రామాలతోపాటు, మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే శివంపేట, నావపేట గ్రామస్తులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఖిలపక్షంగా ఏర్పడి ఈ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ యార్డు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను తరలించడంతో స్థానికులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారీ ఎత్తున మోహరించిన పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్న వారిని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
పచ్చని పంట పొలాల్లో
ఈ డంప్‌యార్డు (Dump Yard) ఏర్పాటు చేస్తున్న ప్యారానగర్ చుట్టుపక్కల మొత్తం పచ్చని పంట పొలాలే ఉన్నాయి. వ్యవసాయమే జీవనాధారమైన మా పంట పొలాల్లో చెత్త డంప్‌యార్డు పెట్టొదంటూ రైతులు వాపోతున్నారు. ఈ యార్డుతో వెలువడే కాలుష్యంతో చెరువులు, కుంటలే కాదు, భూగర్భ జలాలు కూడా కలుషితమై పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: ‘టక్కరి దొంగ’.. ఎవరికీ అర్థం కాకుండా కొట్టేశాడు
నాయకుల ముందస్తు అరెస్ట్
డంపింగ్‌యార్డ్ నిర్మాణ పనులను అడ్డుకోకుండా కొంతమంది నాయకులను పోలీసులు అర్ధరాత్రి ముందస్తు అరెస్టు చేసి కంది మండలంలోని బేగంపేట్ పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. ఇక అదేసమయంలో జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు డంపింగ్‌యార్డ్ నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించారు. డంపింగ్‌యార్డ్ పనులతోపాటు అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులతో కలసి ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళనకారులందర్నీ అరెస్టు చేశారు. ప్యారానగర్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్
విధించారు.
Comments
Please login to add a commentAdd a comment