Gummadidala
-
హైదరాబాద్ మహానగరంలోని చెత్త ఇక్కడికే..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్ (Pyaranagar)లో ఏర్పాటు చేస్తున్న వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుపై స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో ప్రతీరోజు సుమారు 7,500 టన్నుల చెత్త ఉత్పత్తి కాగా ఇందులో శేరిలింగంపల్లి, కూకట్పల్లి (Kukatpally) జోన్ల పరిధిలో నిత్యం ఉత్పత్తి అయ్యే సుమారు 1,900 టన్నుల చెత్తను ప్యారానగర్ డంప్‌యార్డుకు తరలించనున్నారు. ఈ భారీ డంప్‌యార్డుతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పోరాటం చేస్తున్నారు.గుమ్మడిదల (Gummadidala) మండలం ప్యారానగర్, నల్లవల్లి, మాంబాపూర్ తదితర గ్రామాలతోపాటు, మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే శివంపేట, నావపేట గ్రామస్తులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఖిలపక్షంగా ఏర్పడి ఈ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ యార్డు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను తరలించడంతో స్థానికులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారీ ఎత్తున మోహరించిన పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్న వారిని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.పచ్చని పంట పొలాల్లో ఈ డంప్‌యార్డు (Dump Yard) ఏర్పాటు చేస్తున్న ప్యారానగర్ చుట్టుపక్కల మొత్తం పచ్చని పంట పొలాలే ఉన్నాయి. వ్యవసాయమే జీవనాధారమైన మా పంట పొలాల్లో చెత్త డంప్‌యార్డు పెట్టొదంటూ రైతులు వాపోతున్నారు. ఈ యార్డుతో వెలువడే కాలుష్యంతో చెరువులు, కుంటలే కాదు, భూగర్భ జలాలు కూడా కలుషితమై పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.చదవండి: ‘టక్కరి దొంగ’.. ఎవరికీ అర్థం కాకుండా కొట్టేశాడునాయకుల ముందస్తు అరెస్ట్ డంపింగ్‌యార్డ్ నిర్మాణ పనులను అడ్డుకోకుండా కొంతమంది నాయకులను పోలీసులు అర్ధరాత్రి ముందస్తు అరెస్టు చేసి కంది మండలంలోని బేగంపేట్ పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. ఇక అదేసమయంలో జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు డంపింగ్‌యార్డ్ నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించారు. డంపింగ్‌యార్డ్ పనులతోపాటు అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులతో కలసి ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళనకారులందర్నీ అరెస్టు చేశారు. ప్యారానగర్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. -
పసిగుడ్డును పారేశారు..
జిన్నారం (పటాన్చెరు): కారణమేమోగానీ అప్పుడే పుట్టిన ఓ పసి గుడ్డు అనాథలా మారింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని దోమడుగు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం వర్షం పడుతున్న సమయంలో రోడ్డుపై ఏడుపు వినిపించడంతో దోమడుగు గ్రామ ప్రజలు దగ్గరకు వెళ్లి చూశారు. అప్పుడే పుట్టిన ఓ బిడ్డను ఎవరో వదిలేసి వెళ్లారని గుర్తించారు. ముఖంపై రక్తం మరకలు ఇంకా తుడవక ముందే.. పేగు నుంచి కారుతున్న రక్తం ఆరకముందే గుడ్డలో చుట్టేసిన ఆడ శిశువు రోడ్డు పక్కన కనిపించడం స్థానికులను కలచివేసింది. ఈ విషయాన్ని పోలీసులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ విజయకృష్ణ, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు గోవర్ధన్‌గౌడ్ అంగన్వాడీ, ఆశ వర్కర్లకు సమాచారమిచ్చారు. వారు శిశువును సంగారెడ్డిలోని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని ఎస్ఐ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
గుమ్మడిదల: సరైన మార్కులు రావడం లేదని ఓ బీటెక్ విద్యార్థి ఉరేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో గురువారం జరిగింది. గుమ్మడిదలకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి, మీనాల కుమారుడు అఖిల్‌రెడ్డి ఈ ఏడాది చెన్నైలోని భారతీ యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. వారం క్రితం అఖిల్‌రెడ్డి గుమ్మడిదలకు వచ్చాడు. గురువారం సాయత్రం చెన్నై వెళ్లేందుకు రైలు టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. కానీ మధ్యాహ్నం ఇంట్లో అఖిల్‌రెడ్డి ఉరేసుకున్నాడు. బీటెక్‌లో సరైన మార్కులు రావడం లేదనే మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఇళ్లు కోల్పోయిన వారికి ‘డబుల్’ ఇళ్లు
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి జిన్నారం :రోడ్డు వెడల్పు చేయటంలో ఇళ్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. జిన్నారం, కొడకంచి, వావిలాల గ్రామాల్లో డబుల్‌రోడ్డు వేస్తుండటంతో ఇళ్లు కోల్పోతున్న లబ్దిదారులతో ఎమ్మెల్యే శుక్రవారం మాట్లాడారు. స్థానికంగా ఉన్న ఎంపీపీ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులతో ఆయన స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డబుల్ రోడ్డు అన్ని గ్రామాలను కలుపుతూ వేయించేలా ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. గ్రామాల నుంచి డబుల్‌రోడ్డు వెళ్తుండటంతో కొంత మంది ఇళ్లు కూల్చివేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకోని ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న డబుల్బెడ్రూంలను మొదటి ప్రాధాన్యతగా వారికే అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, రోడ్డు వేసేందుకు ప్రజలు సంబంధిత అధికారులకు సహకరించాలని సూచించారు. గ్రామాలను అభివృద్ధి చేసేలా రాష్ర్ట ప్రభుత్వం అనేక నిధులను కేటాయిస్తుందన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధిలో అన్ని పార్టీల నాయకులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్‌రెడ్డి, తహశీల్దార్ శివకుమార్, నాయకులు వెంకటేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. వేడుకలను ధూంధాంగా నిర్వహించాలి కొత్తగా ఏర్పాటు కానున్న గుమ్మడిదల మండలంలో ఆవిర్భావ వేడుకలను ధూంధాంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జిన్నారం మండలంలోని గుమ్మడిదలలో మండల ఆవిర్భావ వేడుకలను నిర్వహణకు సంబంధించిన విషయాలను ఎమ్మెల్యే స్థానిక నాయకులు, ప్రజలతో మాట్లాడారు. ఈ నెల 10న ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని స్థానిక నాయకులు, ప్రజలు నిర్ణయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గుమ్మడిదల మండల ఏర్పాటుకు తాను చాలా కృషి చేశానన్నారు. ప్రజల సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. కొత్త మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేలా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మండల ఆవిర్భావ వేడుకలను ఈ నెల 10వ తేదీన ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సురేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ నరేందర్‌రెడ్డి, తహశీల్దార్ శివకుమార్, నాయకులు వెంకటేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరికలు : మండలంలోని సోలక్పల్లిలో టీఆర్ఎస్ మండల యువత అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరారు. లంబాడి గోపీనాయక్తో పాటు మరో 20మంది వరకు ఆయా పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలను వేసిపార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీసీ రోడ్డుకు శంకుస్థాపన సోలక్పల్లిలో రూ. 3లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. గ్రామాల అభివృద్ధికి తనవంతుకృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందదర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్, సర్పంచ్ రాములుయాదవ్, ఉపసర్పంచ్ సుధాకర్‌యాదవ్, నాయకులు రవీందర్‌రెడ్డి, జగన్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, పోచయ్యయాదవ్తదితరులు పాల్గొన్నారు.