
జిన్నారం (పటాన్‌చెరు): కారణమేమోగానీ అప్పుడే పుట్టిన ఓ పసి గుడ్డు అనాథలా మారింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని దోమడుగు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం వర్షం పడుతున్న సమయంలో రోడ్డుపై ఏడుపు వినిపించడంతో దోమడుగు గ్రామ ప్రజలు దగ్గరకు వెళ్లి చూశారు. అప్పుడే పుట్టిన ఓ బిడ్డను ఎవరో వదిలేసి వెళ్లారని గుర్తించారు. ముఖంపై రక్తం మరకలు ఇంకా తుడవక ముందే.. పేగు నుంచి కారుతున్న రక్తం ఆరకముందే గుడ్డలో చుట్టేసిన ఆడ శిశువు రోడ్డు పక్కన కనిపించడం స్థానికులను కలచివేసింది.
ఈ విషయాన్ని పోలీసులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ విజయకృష్ణ, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు గోవర్ధన్‌గౌడ్ అంగన్‌వాడీ, ఆశ వర్కర్లకు సమాచారమిచ్చారు. వారు శిశువును సంగారెడ్డిలోని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని ఎస్‌ఐ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.