orphan
-
అనాథను అక్కున చేర్చుకున్న అన్నపూర్ణ సేవా సంస్థ
నల్గొండ: మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో వారం రోజులుగా రోడ్డు వెంట ఉండి యాచక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. స్థానికులు ఆరా తీయగా ఆమెది మధ్యప్రదేశ్ అని, తన కుటుంబ సభ్యులు కొట్టడంతో పారిపోయి ఇక్కడకు వచ్చినట్లు తెలిసింది. జడ్చర్ల– కోదాడ ప్రధాన రహదారిపై వీధి లైట్ల కింద నాలుగు రోజులుగా వర్షానికి తడుస్తూ ఉంటుండంతో స్థానికులు ఆమె ధీనస్థితిని వీడియో తీసి ‘ఈ అనాథకు దిక్కెవరు’ అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. స్పందించిన ఆర్ఎస్ఎస్ సేవా భారతి సభ్యుడు రాము ఆమెకు శనివారం అల్పాహారం అందించి నల్లగొండలోని సేవా భారతి స్వచ్ఛంద సంస్థ సభ్యులు భీమనపల్లి శ్రీకాంత్‌కు సమాచారం అందించాడు. ఆయన అంబులెన్స్‌లో నేరేడుచర్లకు వచ్చి సేవా భారతి సభ్యులు, స్థానిక పోలీసులు, మున్సిపల్ శాఖ సిబ్బంది సహకారంతో మతిస్థిమితం కోల్పోయిన మహిళళను సూర్యాపేట సమీపంలో గల దురాజ్‌పల్లిలోని అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ అనాథ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. కార్యక్రమంలో సేవా భారతి సభ్యులు మెట్టు వేణుగోపాల్‌రెడ్డి, చామకూరి వీరయ్య, సంపత్, రాములు, రాము, నాగిరెడ్డి, సైదిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, స్థానికులు వెంకన్న, శంకర్‌రెడ్డి, కోటేశ్వర్రావు, వెంకటకృష్ణ తదితరులున్నారు. -
బిడ్డల చెంతకు చేరిన తల్లి
కాకినాడ క్రైం: ప్రాణప్రదంగా చూసుకునే ఇద్దరు బిడ్డల్నీ వదిలేసి రోడ్డు పాలైన ఓ తల్లి తిరిగి వారి చెంతకు చేరింది. భర్త వదిలేశాడనే వేదన తాళలేక మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళను దిశ వన్‌స్టాప్ సెంటర్ అక్కున చేర్చుకుంది. రాష్ట్రాలు దాటి వచ్చి అనాథలా రోడ్లు పట్టిన ఆ తల్లిని తిరిగి బిడ్డల చెంతకు చేర్చింది. వివరాలివీ.. సుమారు నెల రోజులక్రితం ఓ రోజు అర్ధరాత్రి కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్లో ఒంటరిగా కూర్చున్న ఓ అనాథ మహిళ వెంట ఇద్దరు వ్యక్తులు పడ్డారు. వారినుంచి తప్పించుకున్న ఆమె సహాయం కోసం రైల్వే సిబ్బంది క్యాబిన్ తలుపులు కొట్టింది. సిబ్బంది బయటకు రావడంతో ఆ దుండగులిద్దరూ పరారయ్యారు. రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఏవీకే సంతోష్ ఆ మహిళ దుస్థితిని గమనించి, మతిస్థిమితం కోల్పోయిందని నిర్ధారించారు. ఆమె పరిస్థితిని జిల్లా మహిళా, శిశు సాధికార అధికారి ప్రవీణకు వివరించి సహాయం కోరారు. తక్షణమే స్పందించిన ఆమె దిశ వన్‌స్టాప్ సెంటర్ అడ్మిన్ కె.శైలజకు తగిన ఆదేశాలిచ్చారు. శైలజ బాధిత మహిళను కాకినాడ జీజీహెచ్‌లోని దిశ వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించారు. నెల రోజులపాటు సపర్యలు చేసి ఆమె వివరాలు రాబట్టారు. ఆమె పేరు ప్రియాంక షైనీ అని, ఊరు గోరఖ్‌పూర్ అని గుర్తించారు. దీంతో ఆమె ఫొటో సర్క్యులేట్ చేసి... ఆ మహిళ బంధువుల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. 2021 నవంబర్ 2వ తేదీన ఆ మహిళ అదృశ్యమైనట్టు గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని నిర్ధారణ కాగా.. అక్కడి పోలీసుల ద్వారా ప్రియాంక షైనీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వీడియో కాల్లో ఆమెను చూసి నిర్ధారించుకుని కాకినాడ వచ్చారు. దిశ వన్‌స్టాప్ బృందం ఏఎస్ఐ చంద్ర, కౌన్సిలర్ జమీమా, ఐటీ స్టాఫ్ దుర్గాదేవి సమక్షంలో ప్రియాంకను అధికారులు గురువారం ఆమె సోదరికి అప్పగించారు. ప్రియాంక సోదరి మాట్లాడుతూ తన అక్కకు 12, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారని, ఏడాదికాలంగా అమ్మ ఏదని వారు అడుగుతుంటే ఊరెళ్లిందని, త్వరలోనే వచ్చేస్తుందని అబద్ధం చెబుతూ కాలం గడిపామని భావోద్వేగానికి గురైంది. -
నాడు నాన్న.. నేడు అమ్మ! ..
సాక్షి, మెదక్: తండ్రి, తల్లి మృతితో నా అనేవారు లేక ఓ బాలిక అనాథగా మారింది. సర్పంచ్, గ్రామస్తులు ముందుకు వచ్చి అంత్యక్రియలు చేసిన ఘటన జగదేవ్‌పూర్ మండలం రాయవరం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన గుమ్ల రాములు, మల్లవ్వ దంపతులకు కూతురు రేణుక ఉంది. రేణుక వర్గల్ కస్తూర్బాలో ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. రాములు పదేళ్ల క్రితం మృతి చెందగా, మల్లవ్వ తన కూతురుతో కలిసి రెండేళ్లుగా కుకునూర్‌పల్లిలో ఉంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో మల్లవ్వ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం మృతిచెందింది. బంధువులు ఎవరు రాకపోవడంతో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని ఉంచారు. విషయం తెలుసుకున్న రాయవరం సర్పంచ్ పావని మల్లవ్వ శనివారం అంత్యక్రియలకు సాయం అందించారు. తల్లిదండ్రుల మృతితో అనాౖథెన బాలికను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. (చదవండి: అర్థరాత్రి తప్పతాగి ఎస్ఐని ఢీకొట్టారు.. తీవ్రగాయాలతో..) -
అత్తను గెంటేసిన కోడళ్లు! అనాథగా మారిన అవ్వ
నా అనుకున్న వారు ఇంకా కళ్ల ముందే ఉన్నారు. రూ.లక్షలు విలువ చేసే ఆస్తిపాస్తులున్నాయి. ఒకరిపై ఆధారపడనవసరం లేదు. అయినా ఆ వృద్ధురాలు వీధిన పడింది. డబ్బు ముందు మానవ సంబంధాలు అడుగంటడంతో ఏడు పదుల వయసులో ఇతరుల దయాదాక్షిణ్యాలపై బతుకు బండి లాగిస్తోంది. రాప్తాడు/అనంతపురం కల్చరల్: రాప్తాడు మండలం గంగులకుంట గ్రామానికి చెందిన నారాయణమ్మకు 74 ఏళ్లు. ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సిద్దన్నతో ఆమెకు వివాహమైంది. పెళ్లి అనంతరం గంగులకుంటలోనే వారు స్థిరపడ్డారు. వీరికి ఒక్కగానొక్క కుమారుడు లక్ష్మీనారాయణ సంతానం. కొడుకు మృతితో కష్టాలు మొదలు దాదాపు 20 ఏళ్ల క్రితం సిద్దన్న మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి, కుమారుడు కలిసే ఉంటున్నారు. తండ్రి బతికున్నప్పుడే కుమారుడు లక్ష్మీనారాయణ రాప్తాడుకు చెందిన ఓబుళమ్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంతానం కాకపోవడంతో రెండో పెళ్లికి లక్ష్మీనారాయణ సిద్ధమయ్యాడు. ఆ సమయంలో మేనమామ కుమార్తె లక్ష్మీదేవి అయితే తన తల్లిని బాగా చూసుకుంటుందని భావించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొడుకున్నంత కాలం తల్లికి ఏ కష్టమూ రాలేదు. పదేళ్ల క్రితం పిడుగుపాటుకు గురై లక్ష్మీనారాయణ మృతి చెందాడు. ఆ తర్వాత నారాయణమ్మకు కష్టాలు మొదలయ్యాయి. జీమాను కట్టనే దిక్కు భర్త మరణించే నాటికి నారాయణమ్మ పేరుపై 12 సెంట్ల దొడ్డి, 6 ఎకరాల మెట్ట పొలం, రెండు ఇళ్లు, కొంత నగదు ఉండేది. స్థిరాస్తుల విలువ రూ. లక్షల్లోనే ఉంటుంది. ఈ క్రమంలో కోడళ్లు చెరి సగం డబ్బు పంచుకుని నారాయణమ్మను పట్టించుకోకపోవడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. నా అనుకున్న తమ్ముడు సైతం కుమార్తె సుఖం కోసం అక్కను పట్టించుకోవడం మానేశాడు. ఆత్మాభిమానం.. అమాయకత్వమున్న నారాయణమ్మ ఎవరు చెప్పినా వినకుండా గ్రామం మధ్యలో జీమాను కట్టను ఆశ్రయించింది. మొండితనం... మంకుపట్టు జీమాను కట్టపై జీవనం సాగిస్తున్న నారాయణమ్మ తన ఇంటికి వెళ్లేందుకు ససేమిరా అంటోంది. స్థానికులు ఎంత నచ్చచెప్పినా వినకుండా కోడళ్ల ముఖం చూడనని భీష్మించుకుంది. దీంతో నారాయణమ్మకు ఏమైనా జరిగితే గ్రామానికి చెడ్డపేరు వస్తుందని భావించిన గ్రామస్తులే ఏ పూటకా పూట తిండి పెట్టి బాగోగులు చూస్తున్నారు. అధికారులు స్పందించి నారాయణమ్మ విషయంలో జోక్యం చేసుకుని ఆమె శేష జీవితం ప్రశాంతంగా సాగిపోయేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. (చదవండి: అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు...ప్రేమ పేరుతో బాలికతో మరో పెళ్లి) -
విధి మిగిల్చిన విషాదం
సజావుగా సాగిపోతున్న ఆ కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. విద్యుదాఘాతం రూపంలో భార్యాభర్తలను కబళించింది. తల్లిదండ్రులను దూరం చేయడంతో నాలుగేళ్ల చిన్నారి ఆనాథగా మిగిలిపోయింది. మంగళవారం ఉదయం స్థానిక విద్యుత్‌శాఖ క్వార్టర్లలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. అరకులోయ రూరల్: మండలంలోని కంఠభంసుగుడ గ్రామానికి చెందిన గొల్లోరి డొంబుదొర (36), పార్వతి (33) దంపతులు స్థానిక విద్యుత్ శాఖ క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల వింధ్య అనే కుమార్తె ఉంది. డొంబుదొర గిరిజన సహకార సంస్థ మినీ సూపర్ బజార్లో దినసర వేతన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పార్వతి దుస్తులు ఉతికింది. వాటిని ఆరబెట్టేందుకు డొంబుదొర ప్రయత్నించాడు. వైరుపై దుస్తులు ఆరబెడుతుండగా దానికి విద్యుత్ సరఫరా ఉండటంతో షాక్‌కు గురయ్యాడు. అతను కేకలు పెట్టడంతో రక్షించేందుకు పార్వతి ప్రయత్నించింది. ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. ఇద్దరు సంఘటన స్థలంలోనే స్పృహకోల్పోయారు. పరిస్థితిని గమనించిన చుట్టుపక్కల వారు 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆస్పత్రి, విద్యుత్ క్వార్టర్ల వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రలు విద్యుదాఘాతంతో మృతి చెందడంతో కుమార్తె వింధ్య పరిస్థితి దయనీయంగా మారింది. బాధిత చిన్నారిని ఆదుకుంటాం: ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ విద్యుదాఘాతంతో భార్యాభర్తలు మృతి చెందిన ఘటనలో బాధిత చిన్నారిని ఆదుకుంటామని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ మంగళవారం తెలిపారు. గొల్లోరి డొంబుదొర, పార్వతి మృతి చెందడం దురదృష్టకరమన్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన నాలుగేళ్ల చిన్నారిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని పీవో తెలిపారు. ఐటీడీఏ తరపున పూర్తి సహాయ సహాకారాలు అందిస్తామన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర, గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు గంధం చంద్రుడు జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారని పీవో తెలిపారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారని పీవో ప్రకటనలో పేర్కొన్నారు. (చదవండి: ఊరుకాని ఊరులో.. ఇది కదా మానవత్వం అంటే!) -
కరోనా మిగిల్చిన విషాదం...ఆ చిన్నారిని ఆదుకునేవారెవరు ?
విజయపుర (బెంగళూరు గ్రామీణ): మహమ్మారి కరోనా వైరస్ వల్ల వేలాది మంది మృత్యువాత పడగా, వారిపై ఆధారపడిన పిల్లలు, పెద్దలూ ఎందరో రోడ్డు పాలయ్యారు. విజయపుర పట్టణంలో సోనియా (12) అనే చిన్నారి పరిస్థితి కూడా అలాగే ఉంది. తల్లిదండ్రులు కరోనాతో మరణించగా, తినడానికి తిండి లేక, ఉండడానికి స్థలం లేక పెద్దమ్మ వద్ద ఉంటూ కూలీ పనులు చేస్తోంది. పట్టణంలోని చిక్కబళ్లాపుర రోడ్డులో ఉన్న చెరువు కట్ట వద్ద ఉంటూ ద్రాక్ష తోటలపై పక్షులు వాలకుండా పరిచే వలలను అల్లే పని చేస్తోంది. మొదటి వేవ్‌కు కన్నవారు బలి చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు చెందిన అన్సార్ బాషా కొన్నేళ్ల క్రితం ఇదే వలలు అల్లే పని కోసం విజయపురకు వచ్చాడు. తనతో పనిచేసే కె.సరిత అనే మహిళను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వారి బిడ్డ సోనియా. కరోనా మొదటి వేవ్‌లో బాషా, సరితలు ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బలయ్యారు. దాంతో చిన్నారి అనాథ అయ్యింది. పట్టణంలోనే పెద్దమ్మ వద్ద ఉంటూ ఆమెతో కూలీ పనులకు వెళ్తోంది. తల్లిదండ్రులు గుర్తుకు వచ్చినప్పుడల్లా విలపిస్తుంది. తనకు కూడా చదువుకోవాలని ఉందని, ప్రభుత్వం కానీ, దాతలు కానీ సహాయం చేయాలని బాలిక వేడుకుంది. (చదవండి: మంటల్లో కాలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్ ) -
అనాధ విద్యార్థినికి అండగా మంత్రి హరీష్ రావు
-
కన్నీటి గాథ: ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నా ఆ నాన్న అనాథే
సాక్షి,డోర్నకల్(వరంగల్): ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు పుట్టగానే ఆ నాన్న చాలా సంతోషపడ్డాడు. తన రెక్కలను ముక్కలు చేసుకుని మరీ పిల్లలకు ఏ కష్టమూ రానీయకుండా ప్రేమతో పెంచి పెద్దచేశాడు. ఉన్నత చదువులు చదివించాడు. పెళ్లిళ్లు చేసి వారందరినీ ఇంటివారిని చేశాడు. పిల్లల అభివృద్ధిని ఆకాంక్షించాడు తప్పా మరే స్వార్థమూ ఆలోచించలేదు. పిల్లలే ఆస్తిపాస్తులుగా భావించాడు. ఈ క్రమంలోనే భార్య, ఓ కూతురు మృతిచెందారు. తన పిల్లలు కలకాలం బాగుండాలని సింగరేణి ఉద్యోగానికి కూడా స్వచ్ఛంద విరమణ తీసుకుని కుమారుడికి ఉద్యోగం ఇప్పించాడు. ఉన్నదంతా పిల్లలకే.. ఉన్న ఆస్తిపాస్తులన్నీ పిల్లలకు ఇచ్చేశాడు. ఇప్పుడు వృద్ధాప్యం మీదపడింది. చేతిలో చిల్లిగవ్వలేదు. ఒక్కడు అంత మందిని పోషించినా ఏ రోజూ ఇబ్బంది పడని ఆ నాన్నను వారు అనాథ చేశారు. కుమారుడు, కూతుర్లు ఇంటినుంచి గెంటేశారు. నా అనుకున్న వారు కూడా దగ్గరకు రానీయడం లేదు. దీంతో ఇప్పుడు అనాథ నాన్నగా సమాజం ముందు నిలబడ్డాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సీరోలు కాంపెల్లికి చెందిన సలవాది ఇమ్మానియల్ (75) కొత్తగూడెం సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగం చేశాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కుమార్తెలకు, కుమారుడికి పెళ్లిళ్లు చేశాడు. అనారోగ్యంతో ఐదేళ్ల క్రితం భార్య, ఓ కుమార్తె మృతిచెందారు. తను స్వచ్ఛంద పదవీ విరమణ పొంది తన ఉద్యోగాన్ని కుమారుడికి ఇప్పించగా కుమారుడు ఉద్యోగం చేస్తూ ప్రసుతంతం కొత్తగూడెంలోని రుద్రంపూర్‌లో ఉంటున్నాడు. ఇద్దరు కుమార్తెలు ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. ఇమ్మానియల్ వృద్ధుడు కావడంతో తన పనులు తాను చేసుకోవడం ఇబ్బందిగా ఉంది. దీంతో కుమారుడు, కుమార్తెలు ఇంట్లో ఉంచుకోకుండా బయటకు వెళ్లగొట్టారు. దీంతో కేసముద్రంలోని బంధువుల ఇంటికి వెళ్లగా శుక్రవారం ద్విచక్రవాహనంపై తీసుకువచ్చి డోర్నకల్‌లో వదిలిపెట్టారు. దీనస్థితిలో రోడ్డుపక్కన ఉన్న వృద్ధుడిని ఆశ కార్యకర్తలు వి.నిర్మల, సువర్ణ గమనించి పోలీసులకు సమాచారం అందించి స్థానిక బాలుర ప్రభుత్వ హాస్టల్‌కు తరలించారు. సీడీపీఓ ఎల్లమ్మ, అంగన్వాడీ కార్యకర్త వాణి, కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఇన్చార్జ్ ఎల్లావుల హరికృష్ణ హాస్టల్లో ఇమ్మానియల్తో మాట్లాడారు. ఇమ్మానియల్ కుటుంబ సభ్యులతో మాట్లాడగా వారు ఇమ్మానియల్ను తీసుకెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో సీడీపీఓ సూచన మేరకు కాంగ్రెస్ నాయకులు హరికృష్ణ ఆటోలో సికింద్రాబాద్తండాకు తీసుకెళ్లి అక్కడి ఆదరణ అనాథాశ్రమంలో చేర్పించారు. చదవండి: ఉదయం పూలు అమ్ముతూ.. రాత్రి అయితే వేషం మార్చి.. -
మొదట తల్లి.. కర్మ చేస్తుండగా రక్తం కక్కుకుని తండ్రి..
సాక్షి,న్యాల్కల్(సంగారెడ్డి): తల్లి దశదిన కర్మ రోజే తండ్రి చనిపోవడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. పది రోజుల వ్యవధిలో ఇద్దరూ అనారోగ్యంతోనే మరణించారు. కళ్ల ముందే తల్లిదండ్రుల మరణాన్ని చూసిన చిన్నారులు ఏం చేయాలో తెలియక అంత్యక్రియలకు వచ్చిన వారిని చూస్తుండటంతో అందరూ కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని అమీరాబాద్ గ్రామానికి చెందిన మా రుతి రావు, భార్య స్వప్నకుమారి దంపతులకు ఇద్దరు సంతానం. ఇద్దరూ కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో స్వప్నకుమారి ఈనెల 26న మృతి చెందింది. ఆదివారం మృతిరాలి దశదిన కర్మ చేస్తున్న క్రమంలో భర్త మారుతిరావు రక్తం కక్కుకొని మృతి చెందాడు. ఇద్దరి మరణంతో వారి కుమారుడు విగ్నేష్(8), కూతురు రమ్య(4) అనాథలుగా మారారు. అంత్యక్రియలకు వచ్చిన వారు చిన్నారులను చూసి కంటతడి పెట్టారు. అనాథలుగా మారిన చిన్నరులను మనసున్న మహారాజులు, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం చిన్నారులు వారి బాబాయి వద్ద ఉన్నారు. చదవండి: వివాహేతర సంబంధం: ఇంట్లో భర్త నిద్రపోతుంటే ప్రియుడితో కలిసి.. -
అయ్యో జ్యోతి.. నీకు ఎంత కష్టమొచ్చింది!
కన్నబిడ్డను అమ్మ కాదనుకుంది. నాన్న లోకంలోనే లేకుండా పోయాడు. చివరకు వృద్ధాప్యంలో ఉన్న తాతే ఆ ఆడబిడ్డకు ఆధారంగా ఉన్నాడు. అష్టకష్టాలు పడుతూ పోషిస్తున్నాడు. అయినా మన అధికారుల కళ్లకు ఆ బిడ్డ కష్టాలు కనిపించడం లేదు. ప్రభుత్వం ద్వారా అందించాల్సిన ఏ ఒక్కటీ అందించడం లేదు. వివరాల్లోకి వెళ్తే... శృంగవరపుకోట: పట్టణంలోని బర్మా కాలనీకి చెందిన గొర్లె సత్యవతికి కొత్తవలసకు చెందిన గురయ్యతో పుష్కర కాలం కిందట వివాహమైంది. వీరికి పదేళ్ల కుమార్తె జ్యోతి ఉంది. గురయ్య ఎనిమిదేళ్ల కిందట చనిపోవడంతో సత్యవతి తన బిడ్డ జ్యోతితో ఎస్.కోటలోని తండ్రి అంకులు వద్దకు వచ్చేసింది. రెండేళ్ల కిందట సత్యవతి కూడా జ్యోతిని కాదనుకుంది. కన్నబిడ్డను కాదనుకొని వేరొకరిని వివాహమాడి జ్యోతిని వదిలేసి వెళ్లిపోయింది. తండ్రి లేక తల్లి వదిలేయడంతో తాత వద్దే జ్యోతి ఉంటుంది. తాత తట్టా, బుట్ట అల్లి విక్రయించగా వచ్చే కాసింత డబ్బుతో పేదరికం మధ్య మనమరాలు జ్యోతితో అష్టకష్టాల నడుమ జీవనం కొనసాగిస్తున్నాడు. వీరి కి ఇల్లంటూ లేకపోవడంతో పుణ్యగిరిలోని ప్రభుత్వ సామాజిక భవనంలోనే తలదాచుకుంటున్నారు. దయ చూపని అధికారులు ఇన్ని అవస్థల నడుమ కూడా జ్యోతి ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతుంది. అయితే ప్రభుత్వం ఇచ్చే అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుకలేవీ అందడం లేదు. దీనికి కారణం ఆధార్ లేకపోవడమే. ఆధార్ లేకపోవడంతో పాఠశాలలోని ఛైల్డ్ ఇన్ఫో యాప్‌లో జ్యోతి వివరాలు నమోదు కావడం లేదని హెచ్ఎం ఎం.పార్వతి చెప్పారు. తనకు చదువుకోవాలని ఉందని, వసతిగృహంలో వేస్తే చదువుకుంటానని జ్యోతి చెబుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ చిన్నారి జ్యోతికి ప్రభుత్వ పథకాలు అందేలా, చదివేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఆ చిన్నారి ఆశను బతికించాలని ఆశిద్దాం. చదవండి: పెళ్లి ముచ్చట తీరనేలేదు.. తోరణాలు తొలగనేలేదు.. అంతలోనే.. -
అనాథను ఆదరించింది.. అదే ఆమె పాలిట శాపంగా మారింది
శంషాబాద్(హైదరాబాద్): అనాథను ఆదరించి..పెంచి పెద్దచేసిన ఓ విదేశీయురాలు..అదే యువతి కారణంగా హత్యకు గురైంది. తనకో జీవితాన్నిచ్చిన తల్లి లాంటి వృద్ధురాలిని ఆ కసాయి యువతి తన ప్రియుడితో కలిసి కుట్రపన్ని అంతమొదించింది. సహజీవనం వద్దని వారించినందుకు ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి కథనం ప్రకారం..ఫ్రాన్స్ దేశానికి చెందిన మారి క్రిస్టిన్ (68) ముప్పై ఏళ్లుగా భారతదేశంలో నివాసముంటోంది. రాజేంద్రనగర్ దర్గా ఖలీజ్ ఖాన్, టోలిచౌకిలలో మారికా పేరిట రెండు పాఠశాలలను నిర్వహిస్తూ స్వచ్ఛంద సేవలు అందిస్తోంది. అనాథ, పేద విద్యార్థులకు తన పాఠశాలల్లో విద్యావకాశాలు కల్పిస్తోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు కాగా..ఒకరు స్థానికంగా సన్‌సిటీలో, మరొకరు పాండిచ్చేరిలో నివాసం ఉంటున్నారు. మరోవైపు క్రిస్టిన్ ప్రియాంక, రోమా అనే బాలికలను దత్తత తీసుకుని వారికి చదువులు చెప్పించి పెద్దచేసింది. వారితోనే కలిసి దర్గా ఖలీజ్‌ఖాన్ వద్ద నివాసం ఉంటోంది. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం దత్తపుత్రిక రోమాకు వివాహం చేయడానికి మ్యాట్రిమోని సైట్లో వివరాలు పొందుపర్చింది. వారించినందుకే.. మ్యాట్రిమోనీలో రోమా అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విక్రమ్ శ్రీరాములు (25)తో స్నేహం పెంచుకుంది. స్నేహం కాస్తా వీరిద్దరు సహజీవనం చేసే వరకు వెళ్లింది. కొండాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో గది తీసుకుని ఇద్దరు కలసి ఉండటంతో మారి క్రిస్టిన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మారి క్రిస్టిన్‌ను అడ్డుతొలగించుకోవాలని రోమా ప్రియుడు విక్రమ్‌తో కలిసి పథకం పన్నింది. ఈ నెల 8 ఉదయం దర్గా ఖలీజ్ఖాన్లో నివాసముంటన్న మారి క్రిస్టిన్ వద్దకు వెళ్లిన రోమా తనకు కొన్ని డబ్బులు కావాలని అడిగింది. ఆ తర్వాత టోలిచౌకిలోని పాఠశాల వద్ద వదిలేయమని చెప్పింది. అప్పటికే విక్రమ్‌తో పాటు అతడి స్నేహితుడు రాహుల్ గౌతమ్ క్రిస్టిన్ ఇంటి వద్ద కాపుకాశారు. రోమాను టోలిచౌకిలో వదిలేసిన క్రిస్టిన్ ఇంటికి చేరుకోగానే..అక్కడే ఉన్న విక్రమ్, రాహుల్ ఆమె గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం ఆమె కారులోనే మృతదేహాన్ని తీసుకెళ్లి హిమాయత్ సాగర్ చెరువు సమీపంలోని చౌడమ్మ గుట్టల్లో పడేశారు. హత్య అనంతరం మృతురాలి ల్యాప్‌టాప్‌ను తీసుకోవడంతో పాటు ఆమె బ్యాంకు ఖాతాలోంచి రూ.2 లక్షల నగదును కూడా రోమా ఖాతాలోకి మార్చుకుంది. అదృశ్యం కేసు నమోదుతో వెలుగులోకి.. ఈ నెల 8 ఉదయం నుంచి మారి క్రిస్టిన్ కనిపించకపోవడంతో బండ్లగూడ సన్‌సిటీలో నివాసముంటున్న సొంత కూతురు మారికా సొలంగ్ భర్త ప్రశాంత్ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దత్తపుత్రిక రోమాను అనుమానించి విచారణ చేపట్టడంతో హత్య విషయం వెలుగుచూసింది. కుట్ర పన్నిన రోమాతో పాటు హత్య చేసిన విక్రమ్, రాహుల్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్‌కుమార్, సీఐ కనకయ్య, ఎస్ఓటీ పోలీసులు కేసు చేధించడంలో మంచి ప్రతిభ కనబర్చారని డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. చదవండి: బీభత్సం సృష్టించిన కారు.. ముగ్గురి ప్రాణాలు గాల్లోకి -
తల్లిదండ్రులు లేని జీవితంపై విరక్తితో తనువు చాలించిన యువకుడు
నర్మెట: మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా నర్మెట మండలంలోని బొమ్మకూర్‌లో మంగళవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కీ. శే. బండ రవి, బాలమ్మ దంపతులకు ఏకైక కుమారుడు బండ శ్రీకాంత్ (28). అతని తల్లిదండ్రులు మృతిచెందడంతో తనకున్న వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ, ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. జీవితంపై విరక్తి చెంది తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా గమనించిన చుట్టు పక్కల రైతులు చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
సినిమాకు డబ్బు ఇవ్వలేదని ఆదరించిన వాడినే అంతమొందించాడు..
ఒంటిమిట్ట: తనకు ఎవరూ లేరు.. అనాథ అని వచ్చిన ఓ యువకుడు ఆదరించిన వ్యక్తినే అంతమొందించి పరారయ్యాడు. దాదాపు 18 నెలల తర్వాత ఎట్టకేలకు పోలీసులు ఆ నిందితుడిని పట్టుకున్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి కల్యాణ వేదికకు సమీపంలో శ్రీ సాయిరాం సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో గత ఏడాది ఫిబ్రవరి 29న హత్యకు గురైన వాచ్ మెన్ కత్తి వెంకట రమణ (50) కేసును ఎట్టకేలకు ఒంటిమిట్ట పోలీసులు ఛేదించారు. మంగళవారం ఒంటిమిట్టలో డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి విలేకరుల ఎదుట నిందితుడిని హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. శ్రీ సాయిరాం సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో వాచ్‌మెన్‌గా కత్తి వెంకట రమణ ఉండేవాడు. ఇతనికి రెండు ఆటోలు ఉండేవి. ఒక ఆటోను వెంకట రమణ కుమారుడు భరత్ నడుపుతుండగా.. మరో ఆటోను షబ్బీరుల్లా అనే వ్యక్తి నడిపేవాడు. ఈ క్రమంలో నిందితుడు 20 ఏళ్ల వయసు కలిగిన ధనుష్ (అఖిల్).. షబ్బీరుల్లా వద్దకు వచ్చాడు. తనకు ఎవరూ లేరని.. ఏదైనా పని ఇప్పించాలని కోరాడు. షబ్బీరుల్లా ఆటో తనది కాదని అతన్ని వెంకటరమణ వద్దకు తీసుకెళ్లాడు. ఎవరూ లేరని చెబుతుండడంతో ధనుష్‌ను వెంకట రమణ తన ఇంటి వద్ద పనిలో పెట్టుకున్నాడు. సినిమాకు డబ్బు ఇవ్వలేదని.. ఈ క్రమంలో ధనుష్ ఓ రోజు సినిమాకు వెళ్లాలి.. రూ. 500 డబ్బు కావాలి అని బ్రిక్స్ ఫ్యాక్టరీ వద్దనున్న వెంకటరమణను అడిగాడు. తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. అదే సమయంలో బ్రిక్స్ ఫ్యాక్టరీ యజమాని వెంకటరమణకు డబ్బులు ఇవ్వడాన్ని ధనుష్ గమనించాడు. అదే రోజు రాత్రి తనకు డబ్బు ఇవ్వలేదనే కోపంతో వెంకటరమణను రాడ్‌తో కొట్టి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ మృతిచెందాడు. గాలించి పట్టుకున్నారు.. వెంకట రమణ కుమారుడు భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు విజయవాడ, కైకలూరులో ఉన్నాడన్న సమాచారం రావడంతో ఒంటిమిట్ట పోలీసులు వారం రోజుల పాటు కైకలూరులో గాలించారు. అక్కడ నుంచి కడపకు వచ్చాడని సమాచారం వచ్చింది. దీంతో కడప పాత బస్టాండు రూబి లాడ్జ్ వద్ద సోమవారం ధనుష్‌ను పట్టుకున్నారు. నిందితుడు పాత నేరస్తుడే... నిందితుడు ధనుష్ స్వస్థలం కృష్ణా జిల్లా మండపల్లి మండలంలోని చావలపాడు గ్రామం. ఇతడు సెల్ఫోన్లు, ఏటీఎం కార్డులు, నగదు, వాహనాలను దొంగలించేవాడు. కాగా వెంకటరమణ హత్యకు ఉపయోగించిన రాడ్‌తో పాటు 10 సెల్ఫోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని రోజులు పరారీలో ఉన్న ధనుష్‌ను పట్టుకోవడంలో సీఐ హనుమంతనాయక్, ఎస్ఐ సంజీవరాయుడు, హెడ్ కానిస్టేబుళ్లు హరి, రమేష్, కానిస్టేబుల్ సునిల్ కృషి చేశారు. పోలీసులను డీఎస్పీ అభినందించారు. -
హైదరాబాద్: అనాథ అక్కాచెల్లెళ్లను కలిపిన ‘సైన్స్ ఫేర్’ ఫోటో
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వారిలో పెద్దవారు ఇద్దరిని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పించారు. చిన్న అమ్మాయి వారి నానమ్మతాతయ్యల దగ్గర ఉంటుంది. కానీ దురదృష్టం కొద్ది వారు కూడా చనిపోవడంతో.. ఆ బాలిక వీధుల వెంబడి భిక్షాటన చేస్తూ కాలం గడపసాగింది. ఈ క్రమంలో తన అక్కలను చేరదీసిన అనాథాశ్రమం వారే ఆ బాలికను కూడా అక్కున చేర్చుకున్నారు. అయితే వేరే బ్రాంచ్‌లో ఆ చిన్నారిని చేర్పించారు. చివరకు సైన్స్ ఫేర్ ఫోటోలో చెల్లెని గుర్తించిన అక్కలు తన గురించి హోమ్ నిర్వహకులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లును ఒకే చోటకు చేర్చారు. అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారిని ఆ చిన్నారులు.. కనీసం అందరం ఒకే చోట ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల అమ్మ వారి చిన్నతనంలోనే చనిపోగా.. తండ్రి మూడేళ్ల క్రితం చనిపోయాడు. ఈ క్రమంలో పెద్దమ్మాయి(14), మరో అమ్మాయి(12)ని నగరంలోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్చారు. ఇక అందరికంటే చిన్నదైన బాలిక తన తాతనానమ్మల దగ్గర ఉండేది. కానీ దురదృష్టం కొద్ది కొన్ని నెలల క్రితం వారు కూడా మృతి చెందారు. అప్పటి నుంచి బాలిక వీధుల్లో భిక్షాటన చేస్తూ జీవించసాగింది. బాలిక గురించి సమాచారం తెలిసిన అనాథాశ్రమం వారు ఆ చిన్నారిని చేరదీశారు. విచిత్రం ఏంటంటే చిన్నారి అక్కలిద్దరూ ఇదే ఆశ్రమంలో ఉంటున్నారు. కాకపోతే వేరే బ్రాంచ్‌లో. ఇక దీని గురించి ఆ అక్కాచెల్లెళ్లలకు ఏమాత్రం సమాచారం తెలీదు. ఈ క్రమంలో ఓ రోజు వేర్వేరు అనాథశ్రమాల్లో నిర్వహించిన సైన్స్ ఫేర్ ఫోటోలను బాలిక అక్కలు చూశారు. ఆ ఫోటోలో ఉన్న తమ చెల్లిని గుర్తించారు. ఇక దీని గురించి ఆశ్రమం అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు.. ముగ్గురు బాలికలకు డీఎన్ఏ టెస్ట్ చేసి.. వారంతా తోబుట్టువులే అని తేల్చారు. అనంతరం ముగ్గురిని ఒకే చోటకు చేర్చారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఆ అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్క చోట కలిసి ఉండే అవకాశం లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి అకేశ్వర్ రావు మాట్లాడుతూ.. ‘‘మన రాష్ట్రంలో ఉన్న పలు అనాథాశ్రమాల్లో అధికారులు, కౌన్సిలర్లు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించి.. పిల్లలు వాటిలో పాల్గొనేలా ప్రోత్సాహిస్తారు. అలానే సైన్స్ ఫేర్ వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా తీసిన ఫోటో ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లును ఒక్కచోటకు చేర్చింది’’ అన్నారు. -
పసిగుడ్డును పారేశారు..
జిన్నారం (పటాన్చెరు): కారణమేమోగానీ అప్పుడే పుట్టిన ఓ పసి గుడ్డు అనాథలా మారింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని దోమడుగు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం వర్షం పడుతున్న సమయంలో రోడ్డుపై ఏడుపు వినిపించడంతో దోమడుగు గ్రామ ప్రజలు దగ్గరకు వెళ్లి చూశారు. అప్పుడే పుట్టిన ఓ బిడ్డను ఎవరో వదిలేసి వెళ్లారని గుర్తించారు. ముఖంపై రక్తం మరకలు ఇంకా తుడవక ముందే.. పేగు నుంచి కారుతున్న రక్తం ఆరకముందే గుడ్డలో చుట్టేసిన ఆడ శిశువు రోడ్డు పక్కన కనిపించడం స్థానికులను కలచివేసింది. ఈ విషయాన్ని పోలీసులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ విజయకృష్ణ, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు గోవర్ధన్‌గౌడ్ అంగన్వాడీ, ఆశ వర్కర్లకు సమాచారమిచ్చారు. వారు శిశువును సంగారెడ్డిలోని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని ఎస్ఐ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారిని చదివిస్తా.. పెళ్లిచేస్తా: ఎమ్మెల్యే
సాక్షి, జగద్గిరిగుట్ట: తల్లిదండ్రులను కోల్పోయిన టీఆర్ఎస్ కార్యకర్తల పిల్లల పెళ్లిళ్లు అయ్యేంత వరకు ఆసరాగా ఉంటామని మైనంపల్లి హన్మంతరావు అన్నారు. జగద్గిరిగుట్టకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త వెంకటరమణ కుమార్తె వరకట్న వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు 6 సంవత్సరాల కుమార్తె ఉండటంతో చిన్నారి ఆలనా పాలనా చూసేందుకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపలి హన్మంతరావు ముందుకొచ్చారు. ఆర్థికంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం వెంకటరమణ కరోనాతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మైనంపల్లి హన్మంతరావు స్పందించారు. ఆదివారం జగద్గిరిగుట్టకు చేరుకున్న ఆయన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున రూ.5 లక్షల చెక్కును స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్‌తో కలిసి బాధిత కుటుంబానికి అందజేశారు. చిన్నారి చదువుతో పాటు పెళ్లి అయ్యేంత వరకు పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, రావుల శేషగిరి, టీఆర్ఎస్ నాయకులు జైహింద్, రాజేష్, సయ్యద్ రషీద్, ఎర్ర యాకయ్య, సాజిద్, మారయ్య, రుద్ర అశోక్, ఇతర కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు. -
భాగ్య పెళ్లి.. ప్రతి ఒక్కరినీ కదిలించింది..
సాక్షి, సిద్దిపేట: తల్లిదండ్రులు దూరమై, తోబుట్టిన వారికి భారంగా మారిన బాలికకు అన్నీ తానై అండగా నిలిచారు మంత్రి హరీశ్‌రావు. విద్యాబుద్ధులు నేర్పించి, ఉపాధి కల్పించారు. భాగస్వామితో కలసి ఏడడుగులు వేసేదాకా వెన్నంటే ప్రోత్సహించారు. గురువారం సిద్దిపేటలో బాలల సంరక్షణ విభాగంలో పనిచేసే భాగ్య పెళ్లి.. ప్రతి ఒక్కరినీ కదిలిచింది. (28న సీఎం దత్త పుత్రిక ప్రత్యూష వివాహం) అన్ని తామై..: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కసూ్తరిపల్లికి చెందిన భాగ్య తల్లిదండ్రులు 2016లో మృతి చెందారు. తోబుట్టువులకు భారంగా మారి భాగ్య నిరాదరణకు గురైంది. ఈ క్రమంలో తనను ఆదుకోవాలని అప్పట్లో ప్రజావాణిలో ఆమె దరఖాస్తు చేసుకుంది. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు స్పందించారు. భాగ్యకు విద్య, వసతి సౌకర్యంతోపాటు బాగోగులు చూడాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి సూచించారు. అప్పటికే ఇంటర్ చదువుతోన్న ఆమెను డీఎడ్ చేయించారు. ప్రస్తుతం ఆమె కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్‌డబ్లు్య (డిస్టెన్స్) చేస్తోంది. అలాగే.. 2018 నుంచి జిల్లా బాల ల పరిరక్షణ విభాగంలో ఫీల్డ్ వర్కర్‌గా పని చేస్తోంది. పెళ్లి వయస్సు వచ్చిన భాగ్యకు గురువారం ఇబ్రహీంనగర్‌కు చెందిన యువకుడితో స్థానిక టీటీసీ భవన్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివాహం జరిపించారు. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి దగ్గరుండి పెళ్లి తంతును పర్యవేక్షించారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
అనాథకు హోం మినిస్టర్ ‘కన్యాదానం’
ముంబై: తెలుగు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది ఆడపిల్ల అనాథగా పుట్టకూడదు అని. ఆడపిల్ల అనే కాదు అసలు అనాథలుగా పుట్టాలని ఎవరు కోరుకోరు. ఎంత పేదరికం అనుభవించినా సరే తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి బతకాలని కోరుకుంటారు. మరి ముఖ్యంగా వివాహ సమయంలో నా అనే వారు వెంటలేకపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ క్రమంలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఓ వికలాంగ అనాథ యువతి వివాహ వేడుకకు హాజరు కావడమే కాక సదరు యువతి తరఫున కన్యాదాన కార్యక్రమం జరిపించారు. దాంతో అనిల్ దంపతులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు జనాలు. మీరు చేసిన పని ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది అంటూ అభినందిస్తున్నారు. అలానే వరుడి తరఫున తండ్రి బాద్యతలు నిర్వహించిన నాగ్‌పూర్ కలెక్టర్ దంపతులపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. (చదవండి: పేగుబంధం 'అన్వేషణ') వివరాలు.. ఆదివారం నాగ్‌పూర్ జిల్లాలోని ఒక అనాథ ఆశ్రమంలో చెవిటి యువతి(23) వివాహం మరో అనాథ యువకుడి(27)తో జరిగింది. ఈ వేడుకకు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ దంపతులు హాజరయ్యారు. ఈ క్రమంలో వధువు తరఫున కన్యాదానం చేశారు హోం మంత్రి దంపతులు. ఇక నాగ్‌పూర్ కలెక్టర్ రవీంద్ర ఠాక్రే వరుడి తరఫున తండ్రి బాధ్యతలు నిర్వహించారు. ఓ ప్రజాప్రతినిధి, ప్రభుత్వ అధికారి పెళ్లి పెద్దలుగా వ్యవహరించి వివాహ తంతు జరిపించడంతో ఆ యువ జంట ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరో విశేషం ఏంటంటే ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, అధికారులతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరయ్యి.. నూతన వధువరులను ఆశీర్వదించారు. ఇక సదరు యువతిని 23 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు నాగ్‌పూర్‌లోని రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్లారు. ఈ నేపథ్యంలో అమరావతి జిల్లాలోని ఓ అనాథాశ్రమం నిర్వహాకులు ఆమెని తీసుకెళ్లి పెంచి పెద్ద చేశారు. ఇక వరుడుని కూడా రెండేళ్ల వయసులో థానే జిల్లాలోని డొంబివాలి టౌన్షిప్లో వదిలేసి వేళ్లారు అతడి తల్లిదండ్రులు. -
విధి ఆడిన వింత నాటకం!
విధి వెక్కిరిస్తే జీవితం వింత నాటకంలా మారిపోతుంది. ఆ నాటకంలో ఎవరైనా సమిధులు కావాల్సిందే... ఇదే పరిస్థితి అభం..శుభం తెలియని ఇద్దరి చిన్నారులకు ఎదురైంది. ఉన్న తల్లి ఎక్కడుందో తెలియదు. మద్యానికి బానిసై ఇబ్బందులు పెడుతున్న నాన్నను నాన్నమ్మే హతమార్చింది. ఆమెపై కేసు నమోదైంది. దీంతో చిన్నారుల జీవిత పయనమెటో తెలియని దయనీయ పరిస్థితి నెలకొంది. ఆ చిన్నారులను చూసి అంతా అయ్యో..పాపం అంటున్నారు... వారిని అక్కున చేర్చుకునేదెవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. భువనేశ్వర్ : ఇద్దరు చిన్నారుల జీవితాలతో విధి ఆడుకుంది. తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడంతో నాలుగేళ్ల కిందట ఆ చిన్నారుల తల్లి తన భర్తను, పిల్లలను వదిలి వెళ్లిపోయింది. తండ్రి మద్యానికి బానిసై ఉన్న కుటుంబ సభ్యులను నిత్యం విసిగించడంతో విసిగిపోయిన కన్నతల్లే క్షణికావేశంలో హతమార్చింది. మూడేళ్ల కిందట చిన్నారుల తాతయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. ఉపాధి కోసం పెదనాన్న వలసబాట పట్టాడు. మేనత్త సాకుతుందా! అంటే ఆమెది రెక్కాడితేగాని కడుపు నిండని దయనీయ స్థితి. ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారులకు దిక్కెవరన్నది ప్రశ్నార్ధకంగా మారింది. మక్కువ మండలం కొండబుచ్చమ్మపేట గ్రామానికి చెందిన జానకి గౌరీశంకర్, కమల దంపతులు. వీరికి హారిక, చరణ్‌తేజ సంతానం. తల్లిదండ్రులిద్దరూ గుంటూరు పట్టణం వలసవెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసుకుంటూ జీవించేవారు. కొన్నాళ్లు గడిచాక గౌరీశంకర్ మద్యానికి బానిసై భార్య కమలను నిత్యం వేధించడంతో విసిగిన ఆమె భర్తను ఇద్దరు చిన్నారులను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో చేసేదిలేక గౌరీశంకర్ తన ఇద్దరు చిన్నారులతో గుంటూరు వీడి కొండబుచ్చమ్మపేట గ్రామానికి వచ్చి ఓ అద్దె ఇంట్లో ఉండేవాడు. గౌరీశంకర్ మద్యానికి బానిస కావడంతో చిన్నారుల ఆలనాపాలన నాన్నమ్మ ఈశ్వరమ్మ చూస్తుండేది. ఈశ్వరమ్మకు ప్రభుత్వం అందిస్తున్న వితంతు పింఛనే జీవనాధారం. ఈ క్రమంలో ఈశ్వరమ్మను కన్నకొడుకు గౌరీశంకర్ మద్యం కోసం నిత్యం నగదు కావాలని వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తల్లీకొడుకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఈశ్వరమ్మ కన్నకొడుకు గౌరీశంకర్‌ను హతమార్చింది. దీంతో చిన్నారుల తండ్రి లేకుండాపోయాడు. నాన్నమ్మ ఈశ్వరమ్మ రిమాండ్‌కు వెళ్లనుంది. ఇలా తల్లి ఉన్నా ఎక్కడ ఉందో తెలియక, తండ్రి హతమవగా.. ఇన్నాళ్లు తమ ఆలనాపాలన చూసిన నాన్నమ్మ రిమాండ్‌కు వెళ్లనుండడంతో ఈ చిన్నారుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్ధకమైంది. మేనత్త ఉన్నా పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది. హారిక ఐదో తరగతి, చరణ్‌తేజ రెండో తరగతి గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్నారులు హారిక, చరణ్‌తేజ జీవన పయనమెటు? అన్నది అందరి మదిలో తొలిచే ప్రశ్న. -
ఏం పాపం చేశాను.. నాకు దిక్కెవరు దేవుడా?
మునుగోడు : ‘‘నేనేం పాపం చేశాను.. నాకే ఎందుకీ శిక్ష.. నా అనే వారు లేకుండా చేశావు.. నాకు దిక్కెవరు దేవుడా..?’’ అంటూ పన్నెండేళ్ల ప్రాయంలోనే విధి వంచితగా మారిన ఓ బాలిక తల్లి మృతదేహం వద్ద రోదించిన తీరు అందరి హృదయాలను ద్రవింపజేసింది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేడు గ్రామానికి చెందిన బొడ్డు అంజయ్య, పద్మ (32) దంపతులకు కిరణ్, వందన సంతానం. అంజయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. తనకున్న రెండు ఎకరాల భూమితో పాటు మరో 5 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేశాడు. ఆశించిన మేర దిగుబడి రాక, చేసిన అప్పులు తీర్చలేక 2018లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ భారం మోస్తూ.. అప్పుల బాధను తట్టుకోలేక భర్త అఘాయిత్యానికి ఒడిగట్టడంతో పద్మ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అయితే చేతికి అందివచ్చిన కొడుకు ఆసరాగా ఉంటాడనుకుంటే అనుకోని ఆపద ఆ తల్లి ఆశలను అడియాశలు చేసింది. ఏడాది క్రితం పద్మ కుమారుడు ఓ ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. అనారోగ్యం బారిన పడి.. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న భర్తను, చేతికి అందివచి్చన కుమారుడిని వెంటవెంటనే కోల్పోయిన ఆ ఇల్లాలు బాధ వర్ణనాతీతం. ఈ నేపథ్యంలోనే పద్మ అనారోగ్యం బారిన పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నీట మునగడంతో కుంగిపోయింది. ఎదుగుతున్న కుమార్తె బాగోగులు చూసుకోలేక ఆ తల్లి తీవ్ర మనస్తాపం చెందింది. నా అనే వారు లేక.. ఆస్పత్రిలో చూపించుకునే స్థోమత లేక ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసింది. దీంతో ఆమె కుమార్తె వందన అనాథగా మారింది. తల్లి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న ఆ బాలికను ఆపడం ఎవరి తరం కాలేదు. దయ గల దాతలు ముందుకొచ్చి ఆ బాలికను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. కుటుంబ సభ్యులను అంతా కోల్పోయి అనాధ అయిన బాలికను పరామర్శించి రూ పది వేల ఆర్థిక సహాయం అందించిన స్థానిక జడ్పీటీసీ స్వరూప రాణి. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్, రెవెన్యూ అధికారులు సోమవారం ఆ గ్రామానికి వెళ్లి బాలికను పరామర్శించి ప్రభుత్వపరంగా తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
నాడు తల్లి.. నిన్న తండ్రి మృతి
ఖానాపూర్: చిన్నతనంలోనే అనారోగ్యంతో తల్లి.. శనివారం తండ్రి మృతి చెందడంతో పిల్లలు అనాథలుగా మిగిలారు. ఉన్న నానమ్మ సైతం వికలాంగురాలు కావడంతో ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మండలంలోని సత్తన్‌పల్లి గ్రామానికి చెందిన ఇరవేని కొమురయ్య, పద్మలకు ముగ్గురు సంతానం. అనారోగ్యంతో పద్మ 15ఏళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి ఇద్దరు కుమారులు, కూతుర్ని తండ్రే అన్నీ తానై చూసుకుంటున్నాడు. అయితే రెండేళ్ల క్రితం తండ్రి కొమురయ్య కాలుకు తీవ్ర గాయమై అనారోగ్యం బారిన పడ్డాడు. చికిత్స కోసం అప్పులు చేసి నిజామాబాద్, హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. అయినా నయం కాలేదు. ఏడాదిగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. తండ్రిని బతికించుకునేందు కూతురు సైతం చదువు మానేసి తండ్రికి సపర్యాలు చేసింది. ఇటీవ ల అనారోగ్యం పూర్తిగా క్షిణించడంతో కొమురయ్య (40) శనివారం మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు, మిత్రులు చందాలు వేసి అంత్యక్రియలు నిర్వహించారు. కుమారులు సాయి(11) 9వ తరగతి పూర్తి చేయగా, మనోజ్(12) పదో తరగతి పూర్తి చేశాడు. కూతురు మల్లేశ్వరి(15) పదో తరగతి వరకు చదివి తండ్రి కోసం మానేసింది. ప్రస్తుతం వీరు నానమ్మ వద్దే ఉంటున్నారు. ఉండేందుకు ఇళ్లు తప్ప ఎలాంటి ఆధారం లేదు. నానమ్మ సైతం వికలాంగురాలు కావడంతో ఏమిచేయని పరిస్థితి. దీంతో ముగ్గురు చిన్నారులు బిక్కుబిక్కుమంటూ చేస్తున్నారు. ఎవరైనా దాతలు ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అందరూ ఉన్నా.. అనాథ
ఆత్మకూరు: ఆయన.. అందరూ ఉన్న అనాథ. బాగా బతికిన రోజుల్లో దగ్గరగా ఉన్న తోబుట్టువులు.. చితికిపోయిన సమయంలో దూరమయ్యారు. ఊర్లోనే రక్త సంబంధీకులు ఉన్నా.. ఆ వృద్ధుడి పరిస్థితి చూస్తే మమకారాలు, మానవత్వం మంట కలిశాయని చెప్పక తప్పదు. వారం రోజులుగా మున్సిపల్ బస్టాండ్‌లో ఓ వృద్ధుడు ఆకలి దప్పులతో అలమటిస్తూ పడి ఉన్నాడు. వివరాల్లోకెళితే.. పట్టణంలోని జేఆర్‌పేటకు చెందిన పసుపులేటి మోహన్ ఒకప్పుడు బాగా బతికిన వ్యక్తే. ఇళ్లలో ప్రైవేట్‌గా కరెంట్ పనులు చేసుకుంటూ బతికిన వ్యక్తి. ఈ క్రమంలో భార్య అనారోగ్యానికి గురైంది. ఆమె వైద్యం కోసం ఖర్చు చేసి ఉన్న ఇల్లును అమ్మేసుకున్నాడు. గతేడాది అనారోగ్యానికి గురైన భార్య మృతి చెందడంతో ఇతను అనారోగ్యం పాలయ్యాడు. సొంత అన్నదమ్ములు ఉన్నా పట్టించుకునేవారు లేరు. భార్య చనిపోవడంతో, ఇల్లు అమ్ముకోవడంతో పాటు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఇతనిని ఎవరూ ఆదరించలేదు. సరైన తిండి లేక శల్యమయ్యాడు. వారం రోజులుగా ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ భవనమే షెల్టర్‌గా ఉంటున్నాడు. ఎవరైనా దాతలు చూసి తిండి పెడితే తింటున్నాడు. ఐదు రోజులుగా పట్టణంలో లాక్డౌన్ విధించడంతో జనజీవనం స్తంభించింది. దీంతో ఇతనిని గమనించి ఆహారం అందించే వాళ్లు లేరు. బుధవారం పట్టణానికి చెందిన వలంటీర్ హరీష్ బుధవారం ఆ దారిన వెళుతూ అతని పరిస్థితి చూసి ఆహారం అందించాడు. అది సైతం తినే శక్తి లేక నానా ఇబ్బందులు పడుతూ కొంత ఆహారం తిన్నట్లు హరీష్ తెలిపాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్‌బాబులు ఆ వృద్ధుడికి మున్సిపల్ బస్టాండ్ ఆవరణలోనే కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయి. పట్టించుకునే వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అత్తను అనాథగా వదిలేసిన అల్లుడు
గంగవరం(చిత్తూరు): వృద్ధురాలైన అత్తను ఓ అల్లుడు అనాథగా వదిలేసిన ఉదంతం శుక్ర వారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. చిత్తూరు జిల్లా గంగవరంలో ఫ్లయిఓవర్ బ్రిడ్జి కింద 75 ఏళ్ల వృద్ధురాలు రెండ్రోజులుగా అనాథగా ఉండడాన్ని శుక్రవారం స్థానికులు గమనించారు. తహసీల్దార్ బెన్నురాజ్కు సమాచారం ఇవ్వగా రెవెన్యూ సిబ్బందితో వచ్చి వివరాలను ఆరాతీశారు. వయస్సు మీరడంతో ఆమె సరిగ్గా చెప్పలేకపోయింది. ‘నా పేరు రాజమ్మ, స్వగ్రామం శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా నాయుడుపేట, నాకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరికీ వివాహాలై ఉద్యోగాలు చేస్తున్నారు. రెండ్రోజుల కిందట పెద్ద అల్లుడు కారులో తీసుకొచ్చి ఇక్కడ దించేసి వెళ్లిపోయాడు’ అని మాత్రమే తెలిపింది. దీంతో ఆమెను గంగవరం ప్రభుత్వం పాఠశాలకు తరలించి తహసీల్దార్ భోజన సౌకర్యాలను కల్పించారు. వృద్ధురాలు వివరాలను సరిగా చెప్పలేకపోతోందని, శనివారం కరోనా పరీక్షలు నిర్వహించి అనాథాశ్రమంలో చేర్చుతామని తహసీల్దార్ చెప్పారు. వృద్ధురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించి రప్పిస్తామని తెలిపారు. -
అనాథల ప్రేమపాశం
చెన్నై,టీ.నగర్: మానవత్వం బతికే ఉందని తెలిపే ఘటన నగరంలో చోటుచేసుకుంది. అరవకురిచ్చి– కరూరు రోడ్డు సోమవారం రాత్రి 9 గంటల సమయంలో జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా కనిపించింది. ఆ సమయంలో నడవలేని స్థితిలో 70 ఏళ్ల వృద్ధుడు కాళ్లతో దేక్కుంటూ నడిరోడ్డుపై వెళ్లసాగాడు. ఆ సమయంలో ఆ ప్రాంతానికి చెందిన కొందరు వృద్ధున్ని చేతులతో పట్టుకుని రోడ్డు పక్కన కూర్చోబెట్టారు. అతనితో మాటలు కలపగా మతిస్థిమితం లేని వ్యక్తిగా తెలిసింది. అతనికి ఓ మహిళ ఆహారం అందజేయగా, అతను తినడానికి నిరాకరించి నీళ్లు మాత్రం అడిగి తాగాడు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన మరో అనాథ ఏదో పాట పాడుకుంటూ వెళ్లసాగాడు. ఆ సమయంలో వృద్ధుడు నిరాకరించిన ఆహారాన్ని అతనికి ఇచ్చారు. వెంటనే అతను ఆహారం తీసుకుని వృద్ధుని దగ్గరకు వెళ్లి, అయ్యా! కొంచెం తినండి.. అని బతిమాలాడు. అందుకు వృద్ధుడు నువ్వు తింటే నేను తింటానని పట్టుబడడంతో సదరు వ్యక్తి ఆ వృద్ధునికి చేతితో గోరుముద్దలు తినిపించి, తానూ తిన్నాడు. అనాథల ప్రేమపాశం అక్కడున్న వారి కళ్లు చెమర్చేలా చేశాయి. -
ఆదుకున్నారు
నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో చెట్టు కింద ఆశ్రయం పొందుతున్న కుటుంబాన్ని అధికారులు కామారెడ్డి స్వగృహానికి తరలించారు. ఈ కుటుంబానికి చెందిన మహిళ 15 రోజుల క్రితం జిల్లా ప్రభుత్వాస్పతిలో డెలివరీ అయిన విషయం తెలిసిందే ! ఈ కుటుంబ అవస్థలపై గురువారం సాక్షిలో ప్రచురితం కాగా ఐసీడీఎస్, బాలల పరిరక్షణ అధికారులు, సఖీ సెంటర్ అధికారులు స్పందించారు.కుటుంబానికి ఆశ్రయం కల్పించారు. -
పేగుబంధం 'అన్వేషణ'
పాత తరం చిత్రాల్లో అంటే 70, 80వ దశకంలో వచ్చిన చిత్రాలు ఎప్పుడైనా చూశారా?ఆ చిత్రాల్లో హీరోయిన్ లేదా హీరోలు చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి అనుకోని పరిస్థితుల్లో విడిపోవడం, కొన్నేళ్లఅనంతరం పెరిగి పెద్దవుతారు. అనంతరం అనుకోని ఘటనల ద్వారాఅసలైన తల్లితండ్రుల గురించి తెలిసి వారి కోసం అన్వేషిస్తూ ప్రయాణం మొదలుపెట్టడం. అచ్చం ఇటువంటి సంఘటనే మండ్యలో వెలుగు చూసింది. ఆ కథేంటో ఒకసారి తెలుసుకోవాలంటే మండ్యనుంచి స్వీడన్‌కు వెళ్లాల్సిందే. కర్ణాటక ,మండ్య: 1987వ సంవత్సరంలో మండ్య జిల్లా దేశహళ్లి గ్రామానికి చెందిన జయమ్మ, బోరేగౌడ దంపతులకు ఓ పాప జన్మించింది. ఏడేళ్ల అనంతరం అంటే 1994లో జయమ్మకు కేన్సర్ వ్యాధి రావడంతో చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. చికిత్స కోసం మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి రావడంతో అసలే పేదరికంలో ఉన్న దంపతులకు కూతురును పెంచడం భారంగా మారింది. దీంతో ఇందిరానగర్‌లోనున్న ఓ అనాథశ్రమంలో కూతురును వదిలేసి వెళ్లిపోయారు .కొద్ది రోజులకు స్వీడన్ దేశానికి చెందిన ఓ జంట ఈ పాపను దత్తత తీసుకొని జూలిగా నామకరణం చేసి తమతో సాటు స్వీడన్‌కు తీసుకెళ్లి సొంత కూతురిలా పెంచి వివాహం సైతం చేశారు. కల పరమార్థం తెలిసి అయితే కొద్ది రోజులుగా ఎవరో తన కలలోకి వస్తుండడం, అందులో ఓ మహిళ కాలువలో దూకి ఆత్మహత్యకుచేసుకుంటున్నట్లు కనిపిస్తుండడంతో ఇదే విషయాన్ని పెంపుడు తల్లితండ్రులకు తెలిపింది. దీంతో జూలికి అసలు విషయం తెలపడంతో భర్త ఎరిక్‌తో కలసి కన్నవారి కోసం మండ్య జిల్లాలోని స్వగ్రామం దేశిహళ్లికి వచ్చి కన్నవారి కోసం వెతకడానికి నిర్ణయించుకుంది. కొద్దిరోజుల క్రితం దేశిహళ్లికి చేరుకొని తల్లిదండ్రుల కోసం గాలించింది. ఎన్నో ఆశలతో వచ్చిన జూలికి నిరాశే ఎదురైంది. జయమ్మ, బోరేగౌడల గురించి ఎవరూ వివరాలు చెప్పలేకపోయారు. అయినప్పటికీ తల్లితండ్రుల ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానని, తప్పకుండా కన్నవారిని కలుసుకుంటానని నమ్మకం వెలిబుచ్చింది. -
నాడు నాన్న.. నేడు అమ్మ
సాక్షి, కల్హేర్(నారాయణఖేడ్): నాడు నాన్న చనిపోయాడు.. నేడు అనారోగ్యంతో తల్లడిల్లుతున్న తల్లి మరణించడంతో వారి కొడుకు నవీన్(17) అనాథగా మారాడు. మంగళవారం కల్హేర్ మండలం మార్డిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నీరుడి సాయిలు, నీరుడి విఠ్ఠమ్మ దంపతులకు.. ఇద్దరు సంతానం. కూతురు చిట్టమ్మ, కుమారుడు నవీన్ ఉన్నారు. సాయిలు 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. కూతురు చిట్టమ్మ వివాహం ఇటీవలే నారాయణఖేడ్ మండలం కొత్తపల్లికి చెందిన ఓ వ్యక్తితో జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే భర్తతో మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి చిట్టమ్మ పుట్టింట తల్లి విఠ్ఠమ్మ వద్ద ఉండేది. చిట్టమ్మ రెండు నెలల క్రితం పురిటి నొప్పులు తాళలేక మృతి చెందింది. దీంతో ఇంట్లో తల్లి నీరుడి విఠ్ఠమ్మ(45)కు కుమారుడు నవీన్ ఒక్కడే తోడుగా మిగిలాడు. అనారోగ్యంతోపాటు మానసిక క్షోభతో విఠ్ఠమ్మ మంగళవారం మృతిచెందింది. దీంతో నవీన్ అనాథగా మిగిలాడు. తల్లి అంత్యక్రియలు చేయలేని పరిస్థితిలో పడిపోయాడు. విఠ్ఠమ్మ దూరం కావడంతో గ్రామస్తులు చలించిపోయారు. వారు చందాలు వేసి విఠ్ఠమ్మ అంత్యక్రియల కోసం రూ. 11,500 నగదు సహాయం అందజేశారు. తల్లి విఠ్ఠమ్మ మృతదేహం వద్ద నవీన్ -
మామను అనాథాశ్రమంలో చేర్పించిన కోడలు..
అల్లిపురం(విశాఖ దక్షిణం): భర్త ఇంటిని పట్టించుకోకపోవడంతో విసిగి సొంత మామ భారమనుకుందో ఏమో ఆ కోడలు.. ఆయన అనాథని చెప్పి నిరాశ్రయుల వసతి గృహం సిబ్బందికి అప్పగించి వెళ్లిపోయింది. అయితే తన కోడలే తనను ఇక్కడ చేర్పించిందని వృద్ధుడు చెప్పడంతో భీమ్‌నగర్ డిస్పెన్సరీ సిబ్బంది అవాక్కయ్యారు. గురువారం ఆమెను పిలిపించి మందలించి ఆయనను తిరిగి అప్పగించారు. భీమ్‌నగర్ వసతి గృహం నిర్వాహకురాలు మమత తెలిపిన వివరాల ప్రకారం.. రెండు నెలల క్రితం రామదాసు అనే 67 ఏళ్ల వృద్ధుడిని అతని కోడలు అనాథని చెప్పి తీసుకొచ్చింది. అతడు రోడ్డు మీద పడుకుండగా తాను చూశానని చెప్పి, అతడితో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిలా భీమ్‌నగర్ షెల్టర్‌కు తీసుకు వచ్చి అప్పగించి వెళ్లిపోయింది. షెల్టర్ సిబ్బంది తర్వాత ఆ వృద్ధుడిని ప్రశ్నించగా.. తన కోడలే తనను అనాథని చెప్పి ఇక్కడ చేర్పించిందని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. వెంటనే వారు ఆమెను గురువారం పిలిపించారు. ఆమెను కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా మళ్లీ ఇలాంటి పనులు పునరావృతం కాకూడదని హెచ్చరించి, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అతడిని ఆమె వెంట పంపించారు. రామదాసు షెల్టర్ నుంచి వెళ్తూ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. -
కన్నీటి బతుకులో పన్నీటి జల్లు
బంజారాహిల్స్: మానవత్వం మూర్తీభవించింది. నవజీవన యానానికి నాంది పలికింది. అనాథ యువతికి అండ దొరికింది. తనకంటూ ఎవరూ లేరని మనోవేదన చెందే హృదయానికి సాంత్వన లభించింది. మంచి మనసుతో ఓ యువకుడు అనాథ యువతిని వివాహం చేసుకుని గుండెగూటిలో స్థానమిచ్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ‘మా ఇల్లు ప్రజాదరణ’ అనాథాశ్రమంలో మనీషా అనే యువతి ఆశ్రయం పొందుతోంది. కూకట్‌పల్లిలోని సుజనా ఫోరం మాల్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తోంది. కాగా.. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెకు మామిడిపూడి వెంకటరమణయ్య ఫౌండేషన్ ఆశ్రయం కల్పించింది. మనీషా అని పేరు కూడా పెట్టింది. కొద్ది రోజులు అక్కడే ఉండి చదువుకున్న ఆమె ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చింది. మా ఇల్లు అనాథాశ్రమంలో గాదె ఇన్నయ్య పర్యవేక్షణలో డిగ్రీ పూర్తి చేసింది. గాదె ఇన్నయ్య, పుష్పరాణి దంపతులు తమ ఆశ్రమంలోనే పెరిగి పెద్దదైన మనీషాకు ఉద్యోగం కూడా కల్పించారు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఆమెకు అపోలో ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న లీలాకృష్ణ సాయితో పరిచయం ఏర్పడింది. ఆమెకు నా అనేవారెవరూ లేరని అతడు తెలుసుకున్నాడు. మనీషాను మనువాడేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించాడు. గాదె ఇన్నయ్య దంపతులు మనీషా తల్లిదండ్రుల పాత్ర పోషించారు. ఈ నెల 24న లీలాకృష్ణసాయితో వివాహం జరిపించారు. వచ్చే నెల 3న సంజీవయ్య పార్కు సమీపంలోని వండర్లా పార్కులో నూతన వధూవరుల రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గాదె ఇన్నయ్య తెలిపారు. స్వశక్తితో జీవనం సాగిస్తూ తన జీవిత భాగస్వామిని ఎంచుకొని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకున్న మనీషాను, అనాథ యువతికి అండగా నిలిచిన లీలాకృష్ణసాయిలను పలువురు అభినందిస్తున్నారు. మానవతా దృక్పథంతో మనీషాను తమ ఇంటి కోడలిగా చేసుకున్న సాయి తల్లిదండ్రులపై సైతంపొగడ్తల జల్లు కురుస్తోంది. -
అనాథ యువతికి అన్నీ తామై..
మేడ్చల్: అనాథాశ్రమంలో పెరిగిన యువతికి మంత్రి మల్లారెడ్డి అన్నీ తానయ్యారు. తండ్రి సా ్థనం వహించి వివాహం చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని గౌరీ ఆశ్రమానికి చెందిన అనాథ యువతి పుష్పకు, విజయవాడకు చెందిన కిషోర్‌తో ఆదివారం వివాహమైంది. మంత్రి మల్లారెడ్డి ఆయన సతీమణి కల్పనారెడ్డి కన్యాదానం చేశారు. పుష్ప పేరిట రూ.2.5 లక్షలు డిపాజిట్ చేయించారు. పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.25 వేల నగదు అందజేశారు. నూతన వధూవరులను మంత్రి దంపతులు ఆశీర్వదించారు. -
నాడు ఆధ్యాత్మిక గురువు.. నేడు అనాథ
నిన్నమొన్నటి వరకూ ఆయనో స్వామీజీ.. ఒంటి నిండా కాషాయ వస్త్రాలు ధరించి గ్రామగ్రామాలు తిరుగుతూ ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు తన జీవితాన్ని ధారపోశారు. విధి వక్రీకరించి పక్షవాతం సోకి ఒక కాలు, ఒక చేయి పనిచేయకుండా పోయాయి. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కిందపడి కాలు విరిగి మంచాన పడ్డారు. ఆలనా.. పాలనా చూసేవారు లేక అనాథగా మారి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సాక్షి, నల్లమాడ (ప్రకాశం): చీరాలకు చెందిన ఓ స్వామీజీ 15 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా నల్లమాడ మండలానికి చేరుకున్నారు. ఎన్.ఎనుమలవారిపల్లి సమీపంలోని దేవరగుళ్ల లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దీపారాధన చేస్తూ జ్యోతిస్వరూపానంద స్వామీజీ అలియాస్ చీరాల స్వామీజీగా మండలంలో గుర్తింపు పొందారు. చాలా ఏళ్లపాటు లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోనే ఉంటూ ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. సమాజ శ్రేయస్సు కోసం ఆలయంలో తరచూ యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు కృషి చేశారు. పాతబత్తలపల్లి పంచాయతీలోని గ్రామాల్లోనే గాక నల్లమాడ మండల వ్యాప్తంగా ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా స్వామీజీ పాల్గొని ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చేవారు. కుటుంబ బంధాలు తెగి.. ఆరు దశాబ్దాలు పైబడిన వయసున్న స్వామీజీకి చీరాలలో భార్యాపిల్లలు ఉన్నట్లు సమాచారం. అయితే 15 సంవత్సరాల క్రితమే వారితో సంబంధాలు తెగిపోయి.. ఒంటరిగా ఇక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 1న స్వామీజీకి పక్షవాతం సోకింది. ఎడమ చేయి, కాలు చచ్చుబడ్డాయి. చికిత్స అనంతరం ఊతకర్ర సాయంతో నడిచేవాడు. నెల రోజుల క్రితం ఊతకర్ర సాయంతో నడుస్తున్న స్వామీజీ అదుపు తప్పి కిందపడ్డారు. దీంతో అతని ఎడమకాలు విరిగింది. సహాయకులు లేక అనాథలా.. ప్రస్తుతం నడవలేని స్థితిలో మంచాన పడ్డారు. నా అనే వారు లేకపోవడంతో ఆలనాపాలనా కరువైంది. గ్రామస్తులెవరైనా ఇంత తెచ్చిపెడితే తినాలి. లేదంటే పస్తులే. అన్నపానీయాలతో పాటు వైద్యం అందక రోజురోజుకూ స్వామీజీ ఆరోగ్యం క్షీణిస్తోంది. చెండ్రాయునిపల్లి క్వార్టర్స్‌లోని ఓ గదిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లబుచ్చుతున్నాడు స్వామీజీ. ఆస్పత్రికి వెళ్లి చూపించుకుందామంటే సహాయకుడు లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తూ రోజులు లెక్కిస్తున్నారు. దాతలు, స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి తనకు చికిత్స అందించాలని ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన వారిని స్వామీజీ వేడుకుంటున్నారు. లేని పక్షంలో కారుణ్య మరణానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దాతలు ఎం.జ్యోతిస్వరూపానంద స్వామి, కదిరి ఎస్బీఐ అకౌంట్ నం.3559 549 9432 (ఐఎఫ్‌సీ కోడ్: ఎస్బీఐఎన్0000849)కు విరాళం పంపవచ్చు. -
పరిమళించిన మానవత్వం
పశ్చిమగోదావరి, ఆకివీడు : మానవత్వం పరిమళించింది. మండుటెండలో ఓ అవ్వ అనాథగా రోడు పక్కన ఖాళీ స్థలంలో పడి ఉంది. రెండు రోజులుగా ఆమె అక్కడే ఉండటం ఆ ప్రాంత మహిళలు, ఆటో డ్రైవర్లు గమనించారు. ఆమెను పరామర్శించారు. ఆ వృద్ధురాలి నోటివెంట మాట రావడంలేదు. దీంతో వెంటనే మంచినీళ్లు ఇచ్చి సమీపంలోని వారి ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టారు. రెండు రోజులుగా భోజనం లేకపోవంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయే స్థితిలో స్థానికులు ఆమె ప్రాణాల్ని కాపాడారు. సుమారు 60 ఏళ్లుపైబడి వయసున్న ఆమెను ఇంటి నుంచి నెట్టివేశారా, లేక ఇంట్లో అలిగి బయటకు ఆమె వచ్చేశారో తెలియదు గానీ మండుటెండల్లో ఆమె పడిన అవస్థల్ని చూసి స్థానికుల మనసు కరిగిపోయింది. మానవత్వంతో వృద్ధ మహిళను చెంతన చేర్చుకున్నారు. ఆమె వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తనది రాజోలు దగ్గర శివకోడు గ్రామమని, మన్నే మంగమ్మగా తన పేరును నోటమ్మట మాట రాని పరిస్థితుల్లో ఆమె చెప్పారని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న ‘సాక్షి’ ఆ ప్రాంతానికి వెళ్లి ఆమె ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుని, ఆమె వివరాలు అడిగగా మన్నే మంగమ్మ అని చెప్పారు. ఆమె వద్ద ఉన్న టిక్కెట్టును పరిశీలించగా భీమవర ం నుంచి చెరుకువాడ వరకూ బస్సులో వచ్చారు. చెరుకువాడ నుంచి ఆకివీడు ఎలా వచ్చారో, ఆకివీడులోని అయిభీమవరం రోడ్డులో ఆమె శుక్రవారం రాత్రి నుంచి ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. ఆమె ఇంటి పేరు స్థానిక మాజీ జెడ్పీటీసి మన్నే పోతురాజు ఇంటి పేరు ఒక్కటే కావడంతో ఆయనకు విషయం‘సాక్షి’ తెలియజేసింది. పోతురాజు వెంటనే స్పందించి ఆమెను తన ఇంటికి పంపించాలని సూచించారు. ఆటోలు స్థానిక మహిళ, ఆటోడ్రైవర్లు ఆమెను పోతరాజు ఇంటికి తీసుకువెళ్లారు. తనకు తెలిసిన వ్యక్తులు, తన ఇంటిపేరు ఉన్న వ్యక్తులు శివకోడులో ఉన్నారని, ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయని, ఆమె ఆ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు అయితే అక్కడకు పంపించే ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. వృద్ధురాలు మంగమ్మను తన స్వంత ఇంటికి పంపించేందుకు ఆటో డ్రైవర్లు ఆమెకు రూ.600 మేర చందాలు పోగు చేసి అందజేశారు. -
అనాథకు పోలీసుల ఆదరణ
విజయనగరం,నెల్లిమర్ల రూరల్: సతివాడ నుంచి నెల్లిమర్ల వెళ్లే మార్గంలో ఉన్నవారికి ఆయన చిరపరిచితుడే. ఎందుకంటే ఆయన రోజూ ఆ మార్గం గుండా నడకసాగిస్తాడు. ఎంతదూరమైనా నడిచేవెళ్తాడు. ఆ నడక సాగిస్తున్నప్పుడే భోజనమయానికి ఎక్కడకు చేరుకుంటే అక్కడే చేతిలో పళ్లెంతో ఏదో ఇంటిముందు నిలిచేవాడు. వారు ఇచ్చే కొద్దిపాటి ఆహారంతోనే కడుపు నింపుకునేవాడు. ఎప్పుడూ ఎవరినీ నోరుతెరచి అడిగిన దాఖలాల్లేవు. ఇలా 40 ఏళ్లుగా ఆయన దినచర్య సాగుతోంది. ఇప్పుడు ఆయన నడవలేని స్థితిలో గడచిన కొద్ది రోజులుగా విజయనగరం కొత్తపేట శ్మశానవాటిక వద్ద తిండి తిప్పలు లేకుండా పడి ఉన్నాడు.. ఆయనే నెల్లిమర్ల మండలం గుషిణి గ్రామానికి చెందిన పతివాడ అప్పలనాయుడు. అనాథలా ఆయనలా పడి ఉన్న విష యం తెలుసుకున్న జిల్లా ఎస్పీ పాల్‌రాజ్ వెంటనే ఆదుకోమని నెల్లిమర్ల పోలీసులకు సూచించారు. నెల్లిమర్ల ఎస్సై నారా యణరావు తన బృందంతో వెళ్లి ఆ అభాగ్యుడిని అక్కున చేర్చుకున్నారు. స్నానం చేయించి వస్త్రాలను అందజేశారు. అనంతరం పూల్‌బాగ్ ప్రేమ సమాజంలో ఆసరా కల్పించారు. పోలీసుల మానవతకు అందరూ ప్రశంసలు కురిపించారు. ఒకప్పుడు బాగా కలిగినవాడే... అప్పలనాయుడుది ఒకప్పుడు పేరు మోసిన కు టుంబమేనని గ్రామస్తులు చెబుతుంటారు. ఊహతెలిసినప్పటి నుంచి రోజూ ఇంటి నుంచి విజయనగరం కాలినడకతో వెళ్లి వచ్చేవాడు. మొదట్లో గ్రామంలో ఉన్న ఇంటికి వచ్చినా క్రమేపి ఆ విధానాన్ని మార్చుకుని సతివాడ జంక్షన్లో రాత్రి బస చేసేవాడు. కొన్నాళ్ల తరువాత తన కొడుకు ఏమవుతాడోనని తల్లి కూడా అప్పలనాయుడు వెంటనే తిరిగేది. ఇద్దరూ కలసి అలసట లేకుండా పాదయాత్ర చేసేవారు. అనారోగ్యంతో తల్లి ఐదేళ్లక్రితమే మృతి చెందింది. ఈయనకు ఓ చెల్లి ఉందని, ఆమె రాజాంలో నివాసం ఉంటున్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. తల్లి మృతి చెందడంతో అనాథలా మారాడు. -
పాపం.. వెంకటమ్మ..!
సుభాష్‌నగర్: రోజూ పనిచేస్తే గానీ పూట గడవదు.. భర్తలేడు.. తల్లితోపాటు ఏడేళ్ల కుమారుడి పోషణ బాధ్యత కూడా ఆమెదే..ఈ పరిస్థితుల్లో అనారోగ్యానికి గురైంది. రోజు రోజుకూ ఆరోగ్యం దెబ్బతింటుండటంతో తల్లి, కుమారుడితో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. చికిత్స అనంతరం ఇంటికి రావడానికి డబ్బుల్లేకపోవడంతో నడుచుకుంటూ వస్తున్నారు. అయితే నడిచే శక్తిలేక ఆమె విలవిల్లాడింది. ఒంట్లో శక్తినంతా కూడగట్టుకున్నా ఓపిక లేకపోయింది. దీంతో అక్కడే కనిపించిన ఓ బస్‌స్టాప్‌లోనే నిద్రపోయింది. ఆమెతోపాటు వచ్చిన కుమారుడు, తల్లి కూడా అక్కడే ఉండిపోయారు. తెల్లారింది.. ఇంటికి వెళదామని కుమారుడు అమ్మను నిద్రలేపాడు.. స్పందన లేదు.. అమ్మమ్మకు చెప్పాడు.. ఆమె వెళ్లి చూసినా కళ్లు తెరవలేదు. అనారోగ్యంతో నిద్రలోనే అమ్మ శాశ్వతంగా నిద్రలోకి వెళ్లిందని ఆ చిన్నారికి అర్థం కాలేదు. మృతదేహాన్ని అక్కడినుంచి తీసుకెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వలేదు.. ఏం చేయాలో అర్థం కాలేదు. గమనించిన డాక్యుమెంట్ రైటర్ రవీందర్ స్థానికులకు చెప్పాడు. దీంతో కొంత మొత్తం పోగైంది. చివరకు అమ్మ ఫౌండేషన్ సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు.ఈ హృదయ విదారక సంఘటన కుత్బుల్లాపూర్ పరిధి సూరారం బస్టాప్‌లో జరిగింది. మృతురాలు సుభాష్‌నగర్ డివిజన్ శివాలయనగర్‌కు చెందిన వెంకటమ్మగా గుర్తించారు. -
మంచి దొంగ
అతనో అనాథ. ఆలనాపాలనా పట్టించుకునేవారుగానీ, ఆదరించేవారు గానీ లేరు. దాంతో పొట్టపోసుకోవడం కోసం చిన్నప్పటినుంచి చిన్నాచితకా దొంగతనాలు చేస్తుండేవాడు. ఒకరోజు రాత్రిపూట అతను పొరుగూరిలోని ఒక తోటకు వెళ్లాడు. అక్కడ చెరువులో చేపలు పట్టుకుందామని వల వేశాడు. చేపలు పడలేదుగాని, ఆ అలికిడికి తోట యజమాని లేచి, తన సేవకులను అప్రమత్తం చేశాడు. అందరూ కలిసి కాగడాలు Ðð లిగించుకుంటూ తోటంతా గాలిస్తున్నారు. ఈలోగా దొంగ, తన ఒంటి మీదున్న దుస్తులను తీసివేసి, మొలకు గోచి మాత్రమే ఉంచుకుని, ఒంటినిండా బూడిద పూసుకుని, తోటలో ఒక చెట్టుకింద కూర్చుని కళ్లు మూసుకుని ధ్యానం చేస్తున్నట్లు నటించసాగాడు. దొంగకోసం వెతుకుతున్న వారికి చెట్టుకింద ధ్యానంలో మునిగి ఉన్న సాధువు తప్పితే ఎవరూ కనిపించలేదు. దాంతో వాళ్లు తమ చేతులలో ఉన్న కత్తులు, కర్రలు కింద పడేసి, తోటలో చెట్టుకున్న కాయలు కొన్ని కోసి, మూటకట్టి, సాధువు ముందుంచి, భక్తితో నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తొందరపడి లేస్తే ఎవరైనా గమనిస్తారేమోనన్న భయంతో దొంగ కళ్లూ నోరూ తెరవకుండా సమాధి స్థితిలో ఉన్నట్లు అలాగే ఉండిపోయాడు. తెల్లారింది. ఊళ్లో అందరికీ తోటలో చెట్టుకింద ఉన్న సాధువు సంగతి తెలిసింది. అన్ని దిక్కుల నుంచి జనాలు తండోపతండాలుగా వచ్చారు. పళ్లు తెచ్చిన వారు కొందరు, చెంబులతో పాలు తెచ్చిన వారు కొందరు... వెండినాణేలే సమర్పించుకున్నవారు ఇంకొందరు, ఉన్నదానిలోనే కొంతయినా సాధువుకు సమర్పించుకుని ఆశీస్సులు అందుకుందామని మరికొందరు... ఇలా ఎవరికి తోచింది వాళ్లు స్వామికి చెల్లించుకున్నారు. ఇదంతా గమనిస్తున్న దొంగ, ‘ఎంత మంచివాళ్లు వీళ్లంతా! కల్లాకపటం తెలియని వాళ్లు. నేను దొంగిలించవలసింది వీరి మంచితనాన్నే కానీ, డబ్బూ, నగలూ, మరోటీ కాదు. వీరిలోని మంచిని దోచుకుని, దానిని పదిమందికీ పంచిపెడితే, ఇక అప్పుడు నాలాగా దొంగతనం చేయవలసిన అవసరం బహుశా ఎవరికీ రాదేమో! అని ఆలోచించి, వైరాగ్యభావనలు తెచ్చుకుని, నిజమైన సాధువుగా పరివర్తన చెందాడు. – డి.వి.ఆర్. -
మద్యం... మక్కువ
రాక్షసుల గురువు శుక్రాచార్యునికి తెలియని విద్య లేదు. రాని యుద్ధ తంత్రం లేదు. ఆయన ఒక్కగానొక్క కూతురు దేవయాని. ఆచార్యునిగా శుక్రుడు మేటి. అయితే ఆయనకు రెండు బలహీనతలు. మొదటిది సురాపానం కాగా, రెండవది కూతురిమీద వల్లమాలిన ప్రేమ. శుక్రాచార్యునికి మృతసంజీవనీ విద్య తెలుసు. దాని సాయంతో ఆయన దేవతల చేతిలో మృతిచెందిన రాక్షసవీరులను బతికిస్తూ, రాక్షస జాతి నశించిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎలాగైనా సరే, రాక్షసగురువు నుంచి మృతసంజీవని విద్యను నేర్చుకోవాలి. అందుకు ఎంతో ఒడుపు, చాకచక్యమూ కలిగిన వారికోసం అన్వేషిస్తున్నాడు బృహస్పతి. దేవతలందరూ వెనకాడుతున్న పనిని నేను చేయగలనంటూ ముందుకొచ్చాడు ఆయన కుమారుడు కచుడు. కుమారుణ్ణి పితృవాత్సల్యంతో కావలించుకున్నాడు బృహస్పతి. ‘‘కుమారా! ఆ విద్యను సాధించేందుకు కేవలం తెలివితేటలొక్కటే సరిపోదు. తంత్రం కూడా తెలిసుండాలి. అదేమంటే, శుక్రాచార్యుడికి కూతురంటే పంచప్రాణాలు. ఆమెకోసం ఆయన ఏమైనా చేస్తాడు కాబట్టి ముందుగా నీవు ఆయన కూతురు ప్రేమను సాధించుకో. అప్పుడు నీకు ఎటువంటి ప్రమాదమూ ఉండదు’’ అంటూ మార్గాంతరాన్ని ఉపదేశించాడు బృహస్పతి. కచుడు మానవరూపంలో శుక్రాచార్యుడి వద్దకు వెళ్లాడు. తాను ఎవరూ లేని అనాథనని, విద్యలు నేర్చుకోవడానికి వచ్చానని ఎంతో వినయంతో పరిచయం చేసుకున్నాడు. అతని వినయ విధేయతలకు, తెలివితేటలకు ముచ్చటపడి, తన వద్దనే ఉంచుకుని ప్రేమతో విద్య బోధించసాగాడు శుక్రుడు. తమ గురువు కచుణ్ణి అభిమానించడం, గురుపుత్రిక దేవయాని కచుణ్ణి ఆరాధించడం రాక్షసులకు కంటగింపుగా మారింది. ఓసారి అదను చూసి అడవిలో ఒంటరిగా ఉన్న కచుణ్ణి కొట్టి చంపేసి, తర్వాత ఏమీ ఎరగనట్లుగా కచుడు కనబడటం లేదంటూ గురువుకు చెప్పారు. అదంతా దివ్యదృష్టితో గ్రహించాడు శుక్రాచార్యుడు. మృతసంజీవనీ విద్యతో కచుణ్ణి బతికించాడు. ఇలా రెండుమూడుసార్లు జరిగింది. ఇలా లాభం లేదనుకున్న రాక్షసులు, ఈసారి కచుణ్ణి చంపి, కాల్చి బూడిదచేసి, ఆ బూడిదను మద్యంలో కలిపి మాటల్లో పెట్టి శుక్రాచార్యుడి చేత తాగించారు. శుక్రుడికి కచుడు బూడిదరూపంలో తన ఉదరంలోనే ఉన్నట్లు తెలిసింది. పుత్రిక మీదున్న ప్రేమతో శుక్రాచార్యుడు తన ఉదరంలో ఉన్న కచుడికి మృతసంజీవనీ విద్యను ఉపదేశించాడు. కచుడు శుక్రుడి పొట్టను చీల్చుకుని వచ్చి, తనకు నేర్పిన విద్యతో తిరిగి గురువును బతికించుకున్నాడు. ‘పుత్రిక అంటే తనకున్న అపారమైన ప్రేమ, మద్యమంటే ఉన్న మక్కువ వల్లే కదా, రాక్షసులకు గురుస్థానంలో ఉన్న తనే తన నోటితో శత్రువులకు మృతసంజీవనీ విద్యను ఉపదేశించవలసి వచ్చింది,’ అని ఆలోచించిన శుక్రుడు, జీవితంలో ఇక మద్యం ముట్టనని, ఎవరి మీదా మక్కువ పెంచుకోననీ శపథం చేశాడు. – డి.వి.ఆర్ -
పేదింటి యువతికి అండగా.. కులాంతర వివాహం
టెక్కలి: టెక్కలిలో విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన నిరుపేద యువతి శ్రీదేవి వివాహానికి విశ్వబ్రాహ్మణులంతా అండగా నిలిచారు. తల్లిదండ్రుల పాత్రలో కన్యాదానం ఇచ్చారు.. కుటుంబ సభ్యులు మాదిరిగా హాజరై బ్రాహ్మణ యువకునితో వైభవంగా వివాహం జరిపించారు. వివరాల్లోకి వెళితే.. టెక్కలిలోని రెడ్డికవీధికి చెందిన లక్కోజు నీలవేణి, కుమార్తె శ్రీదేవిలు నిరుపేదలు. దీంతో శ్రీదేవికి వివాహం చేసే బాధ్యతను పట్టణంలోని విశ్వబ్రాహ్మణులంతా వారి భుజాన వేసుకున్నారు. ఇదే సందర్భంలో హైదరాబాద్‌లో ఉంటున్న లోకేశ్‌శర్మ అనే బ్రాహ్మణ యువకుడు పేదింటి యువతిని వివాహం చేసుకునేందుకు ఆలోచన చేశాడు. ఈ క్రమంలో టెక్కలి మండలం సుఖదేవ్పేట గ్రామానికి చెందిన బొడ్డు ఢిల్లేశ్వరరావుకు పరిచయం కలిగిన వ్యక్తులు హైదరాబాద్‌లో ఉండడంతో వారి ద్వారా శ్రీదేవి గురించి తెలుసుకున్నాడు. టెక్కలిలో విశ్వబ్రాహ్మణ సంఘాన్ని సంప్రదించి వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో బుధవారం టెక్కలి లక్ష్మీ నృసింహా స్వామి ఆలయంలో వీరి వివాహం జరిగింది. -
ఏ జన్మదో ఈ బంధం!
సుభాష్‌నగర్ : అనాథ చిన్నారిని చేరదీశారు. ఆలనా పాలన చూశారు. చిన్నప్పటినుంచి కన్నబిడ్డలా పెంచారు. విద్యాబుద్ధులు చెప్పించారు. యుక్త వయసు రాగానే ఆమె వివాహాన్ని ఘనంగా జరిపించి ఆదర్శంగా నిలిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. గండిమైసమ్మ దుండిగల్ మండలం బహదూర్‌పల్లిలోని గౌరీ ఆశ్రమాన్ని డీఎన్ గౌరి, మీరా కుమారి నిర్వహిస్తున్నారు. 2000 సంవత్సరంలో అమీర్‌పేటలోని ఉమెన్ అండ్ వెల్ఫేర్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి రమ్య అనే మూడేళ్ల చిన్నారిని తీసుకువచ్చి ఆశ్రమంలో చేర్చారు. ప్రస్తుతం రమ్య (22) బీటెక్ పూర్తి చేసి బాలానగర్‌లోని మెడిప్లస్‌లో ఉద్యోగం చేస్తోంది. పంజాబ్ రాష్ట్రం పటాన్‌కోట్ ప్రాంతానికి చెందిన ఓం ప్రకాశ్, దర్శినిదేవిల కుమారుడు శంభు మెహేరా (25) బీకాం పూర్తి చేసి బాలానగర్‌లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. ఆశ్రమ నిర్వాహకులు శంభు తల్లిదండ్రులను ఒప్పించి వివాహం కుదిర్చారు. ఆదివారం ఉదయం 9 గంటలకు బహదూర్‌పల్లిలోని గౌరీ ఆశ్రమంలో హైందవ సంప్రదాయ పద్ధతిలో గౌరీ, మీరాలు కన్యాదానం చేశారు. ఉమెన్ డైవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ సీహెచ్ అనురాధ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎంవీ సాయిబాబా, ఆశ్రమం ఇన్చార్జి లక్ష్మి, ప్రేమ పాల్గొన్నారు. -
ఆశయం పందిరి..అభిమానం సందడి
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): వేద మంత్రాలు.. పచ్చని తోరణాలు.. బాజా భజంత్రీలు.. మంగళ వాయిద్యాలు.. దాతల దీవెనలు..విందు భోజనాలు..కల్యాణ కాంతులతో ప్రేమసమాజం కళకళలాడింది. పెద్దల దీవెనలతో ప్రేమసమాజం అమ్మాయికి.. పాయకరావుపేట అబ్బాయికి పెళ్లి జరిగింది. అందుకు ప్రేమసమాజంలోని అన్నపూర్ణ ఆడిటోరియం వేదికైంది. అనాథ బాలలు పెద్దలను ఆహ్వానిస్తూ కల్యాణ వేడుకకు స్వాగతం పలకగా వివాహం ఆనందోత్సాహాలతో కొనసాగింది. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో రావడంతో, కన్యాదాతలుగా ప్రముఖులు వ్యవహరించడంతో అసలు అమ్మాయికి అమ్మానాన్నా లేరన్న అభిప్రాయానికి తావే లేకుండా పోయింది. ఇరవై ఏళ్లుగా ప్రేమ సమాజంలో ఆశ్రయం పొందుతున్న పద్మ, విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన కక్కిరాల వెంకటరమణ, (లేటు) సత్యవతి దంపతుల కనిష్ట కుమారుడు కక్కిరాల వెంకట సత్యనారాయణ (చిన్నా) మధ్య పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. అందరి సమక్షంలో గురువారం ఉదయం 10.59 గంటలకు ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రేమ సమాజం ప్రతినిధులు, రాజస్థాన్ సాంస్కృతిక మండల్ సభ్యులు, పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన దంపతులను దీవించారు. దాతలు ముందుకొచ్చి ఆ నూతన దంపతులకు కట్నకానుకలు అందజేశారు. కనకమహాలక్ష్మి దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త ఉప్పల భాస్కరరావు, వరహాలక్ష్మి దంపతులు కన్యాదానం చేశారు. ప్రేమసమాజంలో ఇది 110వ వివాహం. కానుకల వెల్లువ : ప్రేమసమాజంలో రెండు దశాబ్దాలుగా ఆశ్రయం పొందుతున్న పద్మ తమ సొంత అమ్మాయి అన్న తీరున ఎక్కడెక్కడి వారూ కానుకలు అందించారు. ప్రేమసమాజం అధ్యక్షు డు కంచర్ల రామబ్రహ్మం రూ.10వేలు, హైదరాబాద్‌కు చెందిన కల్యాణ్‌కుమార్ రూ.10,116, ప్రేమసమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ విశ్వేశ్వరరావు రూ.10వేలు, ప్రేమసమాజం మాజీ కార్యదర్శి ఎం.వి.రమణ రూ. 5వేలు, కటిల్, జగన్ పటేల్ రూ.6,500, సీహెచ్ శేఖర్ రూ.15వేలు, కిరణ్ రూ.6,500, టి.వినీష్ రూ.10 వేలు ఇవ్వగా బొంది నాగభూషణరావు బంగారు శతమానం, ఎన్ఆర్ఐ భారతి జత పుస్తెలు కానుకగా అందించారు. అనేక మంది చీరలు, సారె సామగ్రి అందజేశారు. అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ ఆంధ్రప్రదేశ్ శాఖ ముందుకొచ్చి పెళ్లి కుమార్తెకు బంగారు పుస్తెల తాడు, చెవి రింగులు, ఉంగరాలు,, సంపతి గొట్టం, కాళ్ల మట్టెలు, సారె సామగ్రి అందజేశారు. ప్రేమసమాజం అధ్యక్షుడు కంచర్ల రామబ్రహ్మం, కార్యదర్శి మట్టపల్లి హనుమంతరావు, ఉపాధ్యక్షులు బుద్దా శివాజీ, డాక్టర్ పి.విశ్వేశ్వరరావు, కోశాధికారి డి.వి.బాలాజీకుమార్, సంయుక్త కార్యదర్శులు జగదీశ్వరరావు, సత్యనారాయణ, జి.రాధాకృష్ణ, సంస్థ కార్యవర్గ సభ్యులు, పీఆర్వో ఎం.వి.రాజశేఖర్, అగర్వాల్ సమ్మేళన్ రాష్ట్ర అధ్యక్షుడు చాంద్‌మాల్ అగర్వాల్, ప్రేమసమాజం సిబ్బందితో పాటు ఎందరో ప్రముఖులు నూతన దంపతులను దీవించారు. ప్రేమసమాజం ఉపాధ్యక్షుడు బుద్ధ శివాజి, సంస్థ కార్యదర్శి మట్టపల్లి హనుమంతరావు (మట్టపల్లి చలమయ్య చారిటబుట్ ట్రస్ట్) సహకారంతో పెద్ద ఎత్తున విందు భోజనం ఏర్పాటు చేశారు. -
చిన్నాకు పెద్ద మనసు
(చిన్నా) ఆర్థికంగా స్థితిమంతుడైన ఓ యువ వ్యాపారి. అతను కావాలనుకుంటే పెళ్లికి కోట్ల రూపాయలు కట్నకానుకలుగా వస్తాయి. కానీ చిన్నా మాత్రం ఓ అనాథ యువతిని భార్యగా చేసుకోవాలని భావించాడు. ఆ మేరకు విశాఖలోని ప్రేమసమాజంలో ఉంటున్న ఓ అనాథ యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి కూడా సాదాసీదా కాకుండా అనాథ పిల్లల మధ్య ఈనెల 21న చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వ్యాపారస్తుడైనా..ఉద్యోగస్తుడైనా..పెళ్లి చేసుకోవాలంటే ఎంతో కొంత కట్నం ఆశిస్తాడు. ఉద్యోగస్తుడైతే సుమారుగా రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు..వ్యాపారస్తుడైతే..రూ.15 నుంచి రూ.20లక్షలు కట్న రూపంలో గానీ...ఆస్తుల రూపంలో గానీ ఆశించడం సహజం. చిన్నా మాత్రం పెద్ద మనసు చాటుకున్నాడు. కట్న కానుకలు వద్దనుకున్నాడు. ఆదర్శ వివాహం చేసుకోవాలనుకున్నాడు. సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) : మమతల కోవెలలో పెళ్లి సందడి. వేద మంత్రాలు..పచ్చని తోరణాలు..బాజా భజంత్రీలు..మంగళ వాయిద్యాలు..దాతల దీవెనలు..విందు భోజనాలు. కల్యాణ కాంతులతో ప్రేమసమాజం కళకళలాడుతోంది. పెద్దల దీవెనలతో ప్రేమసమాజం అమ్మాయికి..పాయకరావుపేటకు చెందిన కక్కిరాల వెంకటరమణ (లేటు) సత్యవతి దంపతుల కనిష్ట పుత్రుడు వెంకట సత్యనారాయణ(చిన్న)కు ఈ నెల 21న పెళ్లి జరగనుంది. అందుకు ప్రేమసమాజం అన్నపూర్ణ ఆడిటోరియం వేదిక కానుంది. అనాథ పిల్లలే పెద్దలను కల్యాణానికి ఆహ్వానించనున్నారు. 21 ఉదయం 10.59 గంటలకు ఈ వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇరవై ఏళ్లుగా ప్రేమసమాజంలో ఆశ్రయం పొందుతున్న పద్మకు పాయకరావుపేటకు చెందిన యువ వ్యాపారి వెంకట సత్యనారాయణతో వివాహం కానుంది. ప్రేమసమాజం అధ్యక్షుడు కంచర్ల రాంబ్రహ్మం, కార్యదర్శి మట్టుపల్లి హనుమంతరావు పాలకవర్గం సమక్షంలో ఈ వివాహం జరగనుంది. మమతల కోవెల ప్రేమసమాజంలో ఇది 110 వివాహం. ప్రేమ సమాజంలో పెళ్లి రాట ప్రేమసమాజంలో ఆశ్రయం పొందుతున్న పద్మను, పాయకరావుపేటకు చెందిన కక్కిరాల సత్యనారాయణతో ఈ నెల 21న ప్రేమసమాజం అన్నపూర్ణ ఆడిటోరియంలో జరగనున్న వివాహంలో భాగంగా సోమవారం ప్రేమసమాజంలో పెళ్లిరాట వేశారు. పలువురు ముత్తైదువులు పద్మను పెళ్లి కుమార్తెను చేసి ఆశీర్వదించారు. ప్రేమసమాజం పూర్వపు కార్యదర్శి పి.గణపతిరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రేమసమాజం కార్యదర్శి మట్టపల్లి హనుమంతరావు, సహాయ కార్యదర్శులు జగదీశ్వరరావు, సత్యనారాయణ, జి.రాధాకృష్ణ, పీఆర్వో ఎం.వి.రాజశేఖర్ ప్రేమసమాజం సిబ్బంది పాల్గొన్నారు. ముందుకొచ్చిన దాతలు..పెద్ద ఎత్తున కానుకలు.. ప్రేమసమాజం అమ్మాయికి పెళ్లి జరుగుతుందన్న విషయం తెలుసుకున్న పలువురు దాతలు ముందుకొచ్చారు. కనకమహాలక్ష్మి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఉప్పల భాస్కరరావు, వరాహలక్ష్మి దంపతులు కన్యాదాతగా నిలిచారు. ప్రేమసమాజం మాజీ కార్యదర్శి గణపతిరావు దంపతులు దగ్గరుండీ పెళ్లి కుమార్తెను చేశారు. ఇదిలా ఉండగా..ప్రేమసమాజం అధ్యక్షుడు కంచర్ల రాంబ్రహ్మం రూ.10వేలు, హైదరాబాద్‌కు చెందిన సీహెచ్ కల్యాణ్‌కుమార్ రూ.10,116, ప్రేమసమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ విశ్వేశ్వరరావు రూ.10వేలు, ప్రేమసమాజం మాజీ కార్యదర్శి ఎం.వి.రమణ రూ.5వేలు, ఏ.కె.చైతన్య రూ.5వేలు, కటిల్, జగన్ పటేల్ రూ.6,500, సీహెచ్ శేఖర్ రూ.15వేలు, కిరణ్ రూ.6,500, టి.వినీష్ రూ.10వేలు ఇవ్వగా అగర్వాల్ మహాసభ ప్రతినిధులు పుస్తుల తాడు, చెవి రింగులు, పుస్తులు, సంపతి గొట్టాం, పట్టీలు, కాళ్ల మెట్టెలు వంటి పెళ్లి సామాన్లు, అనేక మంది చీరలు, సారె సామగ్రి అందజేశారు. ఆదర్శ వివాహమే చేసుకోవాలనుకున్నా.. తల్లిదండ్రులు మంచివారు. ఇద్దరు అక్కలు, బావలు చాలా మంచివారు. అన్నయ్య ఐదేళ్ల కిందట ప్రమాదవశాత్తు చనిపోయాడు. నేను..నాన్న ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుంటున్నాం. పాయకరావుపేటలోనే మా ఇల్లు. వ్యాపార నిమిత్తం తుని వెళ్తుంటాం. అమ్మ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. నన్ను, నాన్నను, అక్కలు, బావల్ని బాగా చూసుకునే అమ్మాయి కావాలనుకున్నా. అందుకు ఆదర్శ వివాహమైతే బాగుంటుందని అనుకున్నా. ప్రేమసమాజంలో అమ్మాయిని చూశాను. చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలనుకున్నా. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరూ లేరని తెలుసుకున్నా. అటువంటి అమ్మాయికి జీవితం ఇచ్చిన వాడినవుతానని అనుకున్నా. వెంకట సత్యనారాయణ(చిన్నా), పెండ్లి కుమారుడు ప్రేమసమాజమే అమ్మా..నాన్న తల్లిదండ్రులు చిన్నవయస్సులోనే చనిపోయారు. ఐదేళ్ల వయస్సులో నన్ను, అన్నయ్య లక్ష్మణ్‌ను బంధువులు ప్రేమసమాజంలో చేర్పించారు. అప్పటి నుంచి మా ఇద్దరికి అమ్మా..నాన్న అంటే ప్రేమసమాజమే. చిన్నప్పటి నుంచి మా ఇద్దర్ని ప్రేమసమాజం ఎంతగానో ఆదుకుంది. తల్లిదండ్రులు లేని మా ఇద్దరికి ప్రేమసమాజమే దైవం. ఇంటర్మీ డియట్ వరకు చదివించారు. అధ్యక్షుడు రాంబ్రహ్మం, కార్యదర్శి హనుమంతరావు ఇక్కడి పిల్లల శ్రేయస్సు కోసం పరితపిస్తుంటారు. పదిహేడేళ్ల పాటు ఇక్కడే ఉన్నాను. కొత్త జీవితంలో అడుగుపెడతున్నాను. అంతా మంచే జరుగుతుందని భావిస్తున్నా. ఆదర్శ వివాహంచేసుకుంటున్న..కాబోయే భర్త సత్యనారాయణ(చిన్న), అందుకు సహకరించి ముందుకొచ్చిన మావయ్య వెంకటరమణకు కృతజ్ఞతలు. వారికి మంచిపేరు తెస్తాను. –పద్మ, ప్రేమసమాజం పుత్రిక..పెళ్లి కుమార్తె కుమారుడి అభీష్టం మేరకే.. భార్య సత్యవతి అనారోగ్యంతో ఏడాది కిందట చనిపోయింది. నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమార్తెలు ఇద్దరికీ పెళ్లి చేసేశాను. ఇద్దరు కుమారుల్లో పెద్దోడు ఐదేళ్ల కిందట వినాయక చవితి ఉత్సవాల నిమజ్జన సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి చనిపోయాడు. చిన్నోడు వెంకటసత్యనారాయణ(చిన్నా)ఇంటర్మీడియట్ వరకు చదివాడు. నాతోనే తునిలో కారం(మసాల సామాన్లు విక్రయం) పనులు చేస్తుంటాడు. ప్రేమ సమాజం అమ్మాయిని చేసుకుంటే ఒకరికి దారి చూపిన వాడినవుతానని చెప్పడంతో సరేనన్నా. నాలుగేళ్ల కిందట రూ.25 లక్షలతో ఇల్లు నిర్మించాను. 300 గజాల ఖాళీ స్థలం ఉంది. నా కుమారుడికి ఆదర్శ వివాహమంటే ఇష్టం. అందుకే ప్రేమసమాజం అమ్మాయితోనే పెళ్లి చేస్తున్నాం. – కక్కిరాల వెంకటరమణ, పెళ్లి కుమారుడు తండ్రి -
అనాథ బాలికల కంటిరెప్ప
గోరుముద్దలు పెట్టి, జాబిల్లి కథలు చెప్పి నిద్రపుచ్చాల్సిన అమ్మ వద్దనుకుంది. చేయిపట్టి నడిపించాల్సిన నాన్న వదలించుకున్నాడు. ఆర్థిక సమస్యల వల్లనో, కుటుంబ కలహాల కారణంగానో, బిడ్డకు అంగవైకల్యమనో, ఆడపిల్ల భారమనో ఇలా.. పురిటి గుడ్డుగానే ఎంతోమంది అనా«థలవుతున్నారు. ఆకలే తల్లిగా, ఆవేదనే తండ్రిగా, ఒంటరితనంతో అనాథలెందరో రోడ్ల పక్కన చేరి ఆలమటిస్తూ, కన్నీళ్లే తోడుగా, బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తూ, ప్రేమ కోసం పరితపిస్తూ కనిపిస్తుంటారు. అలాంటి వారికి అమ్మ, నాన్నలా బాధ్యతగా ఆశ్రయం కల్పించి ఆదరిస్తోంది తిరుపతిలోని ప్రభుత్వ బాలికల పర్యవేక్షణా గృహం. అనాథలను అక్కున చేర్చుకుని అన్ని వసతులతో వారిని పెంచడమే కాకుండా, వారికి పెళ్లి కూడా జరిపిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 4 కోట్లకు పైగా అనాథలు ఉన్నట్టు తేలింది. దేశ జనాభాలో వీరు నాలుగు శాతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 24 లక్షల మందికిపైగా అనా«థలు ఉన్నారు. అమ్మ ఒడికి , నాన్న లాలనకు నోచుకోని ఈ పిల్లల్లో అధిక శాతం ఆడపిల్లలే. అలా కన్నవారికి దూరమై సమాజంలో నిరాదరణకు గురైన బాలికలను చేరదీస్తోంది తిరుపతి అనంత వీధిలోని ప్రభుత్వ ప్రత్యేక ‘చిల్డ్రన్స్ హోమ్, అబ్జర్వేషన్ హోమ్ ఫర్ గర్ల్స్’. అంతే కాదు,కోరుకున్న చదువు చెప్పించి, వారి కాళ్లపై వారు నిలబడేందుకు ప్రోత్సహిస్తోంది ఈ హోమ్. ఆఖరికి సంప్రదాయబద్దంగా పెళ్లి చేసే బాధ్యతను సైతం తీసుకుంటోంది. 2008లో ఆరుమంది అనా«థపిల్లలతో ప్రారంభమైన హోమ్‌లో ప్రస్తుతం 136 మంది ఉన్నారు. హైటెక్ వసతులు ఈ వసతి గృహంలో అనాథ బాలికలకు అనేక హైటెక్ వసతులు కల్పిస్తున్నారు. సోలార్ వాటర్‌ప్లాంట్, ఆర్వో ప్యూరిఫైడ్ వాటర్ సిస్టం, వాషింగ్ మిషన్లు, ఇన్వర్టర్, కంప్యూటర్ ల్యాబ్ వంటి సౌకర్యాలతో పాటు తరచు స్పెషల్ మెనూతో ఆరోగ్యవంతమైన భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఇరవై నాలుగు గంటలూ డాక్టర్ల పర్యవేక్షణ, చదువులో వెనుకబడిన విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ట్యూషన్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి ఇండోర్ క్రీడల సౌకర్యం, నాటికలు, పురాణ కథలు, డ్రామాలు, కోలాటాలు, చెక్కభజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు. వీటితో పాటు యోగా, కరాటే, ధ్యానంతో వారిలో ఆత్మసై ్థర్యాన్ని నింపుతున్నారు. ఏడాదికోసారి విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాళహస్తి, మదనపల్లి, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రదేశాల్లో విహార యాత్రలకు సైతం తీసుకెళుతుంటారు. విద్యతో పాటు వివాహం బాలికల సంరక్షణతో పాటు ఉన్నత విద్యపై వారికి అవగాహన కల్పించి ఉపాధి ఉద్యోగాల వైపు వారిని నడిపించాలనే సంకల్పంతో బాలికల వసతి గృహ నిర్వాహకులు కృషి చేస్తున్నారు. బయటి విద్యార్థులకు దీటుగా కోరుకున్న చదువును చదివిస్తూ వారిని అన్ని రంగాల్లో రాణించే విధంగా తయారు చేస్తున్నారు. ప్రభుత్వ గ్రాంట్స్‌తో పాటు దాతల సహాయంతో చదువులో రాణించే బాలికలను పేరొందిన ప్రైవేటు సంస్థల్లో చదివిస్తున్నారు. డిగ్రీ, పీజీ, బీటెక్ వంటి కోర్సుల్లో చాలా మందికి ప్రవేశాలు కల్పించి వారిని ప్రోత్సహిస్తున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు 18 సంవత్సరాలు నిండిన ఏడు మంది అనాథ యువతులకు ప్రభుత్వ అనుమతితో వివాహం చేశారు. గత ఏడాది నలుగురు అనాథ బాలికలకు వివాహం చేశారు. పెళ్లిసందడి మొదలైంది ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో హోమ్‌లోని యువతులకు వివాహాలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుండడంతో పర్యవేక్షణా గృహంలో అప్పుడే పెళ్లిసందడి నెలకొంది. వందల సంఖ్యలో వరుళ్ల బయోడేటాలు, ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబీకులతో పాటు కార్పొరేట్ స్థాయి ఉద్యోగులు, ఉన్నతస్థాయి కుటుంబాలు సైతం వధువు కోసం దరఖాస్తులు పంపుతున్నారు. పెళ్లి తర్వాత పుట్టింటì తంతువివాహానంతరం పుట్టింటి నుంచి ఆడపడుచుకు పసుపు, కుంకుమ అందించడం ప్రతి కుటుంబంలో సాగే సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పర్యవేక్షణ గృహ ప్రతినిధులు పాటిస్తూ ఆడపడుచులకు అండగా నిలుస్తున్నారు. ప్రతి పండుగకు సాంప్రదాయ బద్దంగా గృహానికి ఆçహ్వానించి ఆడపడుచులకు కొత్తబట్టలు పెడుతున్నారు. – పోగూరి చంద్రబాబు, సాక్షి, తిరుపతి వరుడి ఎంపికకు ప్రత్యేక కమిటీ సామాజిక స్పృహ, నైతిక విలువలే ప్రాతిపదికగా ఏర్పాటైన ప్రత్యేక కమిటీతో హోమ్‌లోని యువతులకు వరుడి ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ కమిటీలో ఓ ప్రభుత్వ అధికారి, న్యాయవాది, స్వచ్చంధ సంస్థ ప్రతినిధి, హోం అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ వరుడి సామాజిక, ఆర్థిక స్థితిగతులతో పాటుగా అతని సత్ప్రవర్తనపై ఆరా తీసి, ఆ తర్వాత మాత్రమే వధువును చూపించడం జరుగుతుంది. వరుడికి ఆరోగ్య పరమైన పరీక్షలు కూడా నిర్వహించడం విశేషం. ఈ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు వధువుకు వివాహ భద్రత కల్పించేలా వరుడు, వరుడి తల్లిదండ్రుల నుంచి కూడా లిఖితపూర్వకంగా హామీ పత్రాలపై సంతకాలు తీసుకుంటుంది. పన్నెండు పెళ్లిళ్లకు ప్రణాళిక ఈ ఏడాది సెప్టెంబర్ మా హోమ్‌లో 18 సంవత్సరాల వయస్సు నిండిన పన్నెండు మంది అనా«థ యువతులకు వివాహాలు చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఏ కొరతా లేకుండా ప్రభుత్వ సాయంతో, దాతల ఔదార్యంతో పెళ్లిళ్లను నిర్వహిస్తున్నాం. నేను వ్యక్తిగతంగా రూ.50వేల నగదును వధువు పేరిట బ్యాంకు ఖాతాలో ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తున్నాను. అంతేకాదు, వివాహాలు జరిగిన వారికి నా సొంత ఆస్తిలో 15 అంకణాల ఇంటిస్థలాన్ని ఇవ్వడానికి వైఎస్సార్ కడపజిల్లా కోడూరులో పనులు కూడా ప్రారంభించాను. పది సంవత్సరాలుగా వీరితో మమేకమై వీరికి తండ్రిలా వ్యవహరిస్తున్నాను. ప్రస్తుతం నాకు విజయవాడకు రీజన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ అధికారిగా బదిలీ అయింది. – బి. నందగోపాల్ ఆయనే మాకు ఆదర్శం రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా తిరుపతిలోని బాలికల పర్యవేక్షణా గృహంలో గత ఏడాది ఏడు మంది అనాథ యువతులకు పూర్వపు పర్యవేక్షణాధికారి నందగోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా వివాహాలు జరిగాయి. ప్రస్తుతం కూడా సెప్టెంబర్ నెలలో 12 మంది అనా«థ యువతులకు వివాహాలు జరిపించేందుకు నందగోపాల్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ వివాహాలు ఘనంగా నిర్వహిస్తాం. పూర్వపు పర్యవేక్షణాధికారి నందగోపాల్‌ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని మిగతా ఆశ్రమాల వారు కూడా ఇలాంటి సేవాకార్యక్రమాలకు ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటాం. – సంజీవరెడ్డి, ప్రస్తుత పర్యవేక్షణాధికారి -
కలెక్టర్ ఔదార్యం
సంగారెడ్డి టౌన్: నిస్సహాయులకు మానవతా దృక్పథంతో చేతనైన సాయం చేసి చేయూతనివ్వాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం తెల్లవారుజాము నుంచి కలెక్టర్ సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ఎంఎన్ఆర్ ఆస్పత్రి పరిసరాలు, బైపాస్‌రోడ్డు, పోతిరెడ్డిపల్లి ఎక్స్‌రోడ్, బాలాజీ నర్సింగ్ హోం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లపై ఒంటిమీద సరైన దుస్తులు లేకుండా, పెరిగిన జుట్టు, అపరిశుభ్రంగా, మతిస్థితిమితం లేని, కుటుంబ సభ్యుల నిరాధరణకు గురైన ఎనిమిది మందిని గుర్తించి వారిని అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని ఇన్సెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ (మానసిక దివ్యాంగుల వార్డు)కు తరలించారు. అక్కడ జట్టు కత్తిరించి, శుభ్రంగా స్నానం చేయించిన తర్వాత కలెక్టర్ వారికి కొత్త దుస్తులు, దుప్పట్లను అందజేశారు. అల్పాహారాన్ని తెప్పించి ఇచ్చారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురహరి వారికి వైద్య చికిత్సలు నిర్వహించారు. మళ్లీ రోడ్ల మీదకు రాకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవాలని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు మనోహర్‌కు కలెక్టర్ సూచించారు. సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో నిరాధరణకు గురైన, మతిస్థిమితం లేని వారు ఎవరైనా తారసపడితే వారిని ఇన్సెడ్ స్వచ్ఛంద సేవా సంస్థలో అప్పగించాలని అన్నారు. వారికి చేయూత నివ్వడానికి జిల్లా యంత్రాంగం తరఫున అన్ని విధాలా సహకరిస్తామన్నారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురహరి, సంగారెడ్డి, కంది తహసీల్దారులు విజయ్‌కుమార్, గోవర్థన్ ఉన్నారు. -
అందరు ఉన్నా అనాథగా..
ఎక్కడి నుంచి వచ్చారో, ఏమైందో తెలియకుండా కొందరు ఆఖరికి అనాథ శవాలై మిగులుతున్నారు. కుటుంబ సభ్యుల చేత అంతిమ సంస్కారానికి నోచుకోని అభాగ్యులుగా లోకం విడుస్తున్నారు. రోజు రోజుకు జిల్లాలో లభ్యమవుతున్న అనాథ శవాల సంఖ్య పెరుగుతోంది. వారి కుటుంబ సభ్యల ఆచూకీ దొరకక మృతదేహాలను ఏమి చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని సార్లు స్వచ్ఛంద సంస్థలు సభ్యులు మందుకు వచ్చి అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకుంటున్నారు. సంగారెడ్డి క్రైం: కోటిశ్వరుడు నుంచి నిరుపేద వరకు ఎవరైనా తన అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువుల చేతుల మీదే జరగాలని కోరుకుంటారు. కానీ అనుకోని సంఘటనలతో అనాథలుగా మారిన వారు, ప్రయాణంలో మార్గమధ్యలో ప్రమాదాల బారిన పడిన వారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న వారు ఇందుకు నోచుకోవడం లేదు. అందరు ఉన్నా చివరి మజిలీ నాటికి అనాథలవుతున్నారు. పట్టించుకునే వారు లేక.. కుటుంబానికి భారమై కొందరు, మతి స్థిమితం లేక కొందరు, నా అనే వారు లేక మరి కొందరు రోడ్ల పక్కన, బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ఖాళీ ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు. వీరంతా దుర్భర పరిస్థితుల్లో జీవితాన్ని వెల్లదీస్తున్నారు. తిండి లేక, అనారోగ్యానికి గురైనా చికిత్స అందించే వారు లేక ప్రాణాలు వదులుతున్నారు. ఎవరైనా గమనించి పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందిస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి మార్చురిలో శవాలను ఉంచుతున్నారు. సంబంధికులు వస్తే మృతదేహాన్ని అప్పగిస్తున్నారు. లేకుంటే స్థానిక స్వచ్ఛంద సంస్థల సభ్యుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తరహాలో చేస్తే మేలు.. రాష్ట్ర జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ నేతృత్వంలో హైదరాబాద్‌లో సంచరిస్తున్న యాచకులు, అనాథలు, మతస్థిమితం లేని వారిని జైళ్లలో ఆశ్రమం కల్పిస్తున్నారు. ఇదే విధానాన్ని జిల్లాలలో కూడా అమలు చేస్తే అనాథలకు మేలు కలుగుతుందని పలువురు ఆశిస్తున్నారు. కలచివేసిన ఘటన పటాన్చెరు బస్టాండ్‌లో ఈ నెల ఏప్రిల్ 4న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. అటువైపు ఎవరూ వెళ్లకపోవడంతో ఆ అనాథ శవం కుళ్లి పోయింది. ఈ ఘటన ఆ చుట్టు పక్కల వారిని ఎంతో కలచివేసింది. ఈ విషయాన్ని ‘సాక్షి’ ప్రచురించడంతో పట్టణంలోని ఎండీఆర్ యువసేన సభ్యులు స్పందించారు. శవానికి అంత్యక్రియాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. బంధువుల వివరాల కోసం యత్నిస్తాం.. అనాధ శవాల ఆచూకీ తెలిస్తే వాటిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్పత్రులల్లో భద్రపరుస్తున్నాం. కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆచూకీ తెలిస్తే శవాన్ని వారికి అప్పగిస్తున్నాం. లేని పక్షంలో మున్సిపాలిటీ వారికి సమాచారం అందిస్తాం. వారే శవాన్ని ఖననం చేస్తారు. – చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ -
నువు లేక అనాథలం
‘‘ఆ రోజు డిసెంబర్ 22, 2017. రాత్రి 7 గంటల సమయంలో నాతో పాటు తమ్ముడు, చెల్లెని అమ్మ తన వద్ద కూర్చోబెట్టుకుంది. కళ్ల నిండా నీళ్లతో మా తల నిమురుతూ ‘నాన్న చనిపోయాడు.. నా పరిస్థితి అప్పుడో ఇప్పుడో అన్నట్లుంది. మీకంటూ ఏమీ మిగల్లేదు. నేను కూడా పోతే మీకు దిక్కెవరమ్మా..’ అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. అలా మాటలు చెబుతూనే అన్నం కూడా తినకుండా అందరం నిద్రలోకి జారుకున్నాం. మరుసటి రోజు బడికి వెళ్లేందుకని సిద్ధమవుతూ అమ్మను లేపినా ఉలుకూపలుకూ లేకపోయింది. నిద్రపోతుందనుకున్నాం. ఉదయం 8 దాటినా లేవకపోవడం.. లేమ్మా అని పిలిచినా పలక్కపోవడంతో చుట్టుపక్క వాళ్లను పిలిచి చూపించినాం. వాళ్లు వచ్చి చూసి ‘మీ అమ్మ చనిపోయిందని చెప్పినారు.’ మాకేం చేయాలో దిక్కుతోచలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దారీతెన్నూ లేని జీవితం గడుపుతున్నాం. ఇదిగో ఈ పంప్‌హౌస్‌లోనే కాలం గడుపుతున్నాం.’’ – వైష్ణవి కదిరి (అనంతపురం జిల్లా) : ‘‘అమ్మానాన్న లేని లోకం శూన్యంగా ఉంది. తమ్ముడు, చెల్లిని బాగా చూసుకోవాలని.. చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. అందుకే దుఃఖాన్ని దిగమింగుకొని ఇటీవల పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యా. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తమ్ముడు పురుషోత్తం 7వ తరగతి, చెల్లి స్వాతి 3వ తరగతి చదువుతోంది. అమ్మానాన్న గుర్తుకొచ్చివీళ్లిద్దరూ ఏడుస్తుంటే ఓదార్చేందుకు నావల్ల కావట్లేదు. పనికి వెళ్దామన్నా పిల్లలను వదిలి ఉండలేను. ఎం పని చేయాల్నో కూడా నాకు తెలియదు. ఇప్పటికైనా అమ్మ తెచ్చిపెట్టిన గింజలతో కడుపు నింపుకుంటున్నాం. నాకేమో బాగా చదువుకోవాలనుంది.’’ చెమర్చిన కళ్లతో వైష్ణవి చెబుతున్న మాటలు వింటే పాషాణ హృదయం కూడా ఇట్టే ద్రవిస్తుంది. వైష్ణవితో పాటు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు ఈ పిల్లల దీనావస్థ ఇదీ.. తండ్రికి క్షయ.. తల్లికి క్యాన్సర్ తలుపుల మండల కేంద్రానికి చెందిన చాకలి అరుణమ్మను వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం కొండలవాండ్లపల్లికి చెందిన చాకలి సుబ్బరాయుడుకిచ్చి కొనేళ్ల క్రితం వివాహం జరిపించారు. అక్కడ కొంతకాలం కుల వృత్తిని చేసుకుంటూ గడిపినా.. ఆ తర్వాత భర్తతో కలిసి తన పుట్టినిల్లు అయిన తలుపులకు వచ్చి అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. సంసారం సాఫీగా సాగుతున్న సమయంలో భర్తకు క్షయ వ్యాధి సోకి మంచం పట్టాడు. ఎలాగైనా కాపాడుకునేందుకు తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో చికిత్స చేయించింది. కుల వృత్తితో సంపాదించిన డబ్బంతా వైద్యానికే సరిపోయింది. దొరికిన చోటల్లా అప్పు చేసినా ఫలితం లేకపోయింది. సరిగ్గా ఏడాది క్రితం సుబ్బరాయుడు కన్నుమూశాడు. ఉన్న ఒక్కగానొక్క ఆసరా కూడా దూరం కావడంతో ఆమె కుమిలిపోయింది. పిల్లలను చూసి ధైర్యం కూడగట్టుకుంది. కుల వృత్తితోనే సంసారం నెట్టుకొచ్చింది. ఇంతలో విధి మరోసారి పరీక్ష పెట్టింది. ఒక రోజు విపరీతమైన దగ్గుతో పాటు నోటి నుంచి రక్తం వచ్చింది. కదిరిలో వైద్యులతో పరీక్ష చేయించుకుంటే క్యాన్సర్‌గా నిర్ధారించారు. అయితే ఉన్న డబ్బంతా భర్త ఆరోగ్యానికే ఖర్చయిపోవడంతో దేవునిపైనే భారం వేసి ఇంటి ముఖం పట్టింది. ఇల్లు ఖాళీ చేయండి క్యాన్సర్ వ్యాధి సోకిందనే బాధతో పిల్లల భవిష్యత్తు తలుచుకొని ఇంటి ముఖం పట్టిన అరుణమ్మకు పిడుగులాంటి వార్త ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంటి యజమాని వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. మరో ఇంటి కోసం ఊరంతా తిరిగినా అద్దెకిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గ్రామ పెద్దలు కనికరించడంతో ఆంజనేయస్వామి గుడిలో తలదాచుకున్నారు. చివరకు అక్కడ ఉండేందుకు కూడా కొందరు ఆక్షేపించారు. మళ్లీ వీధినపడ్డారు. ఒంటరి మహిళ.. ముగ్గురు పిల్లలతో పడుతున్న బాధలను చూసి కొందరు పెద్దలు ఊరికి మంచినీళ్లు సరఫరా చేసే పంపు రూంలో ఉండేందుకు గ్రామస్తులను ఒప్పించారు. ఉన్న తిండి గింజలతోనే.. అమ్మానాన్నలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ పిల్లల బతుకు భారంగా మారింది. ఎవరిని అడగాలో తెలియదు.. ఎం చేయాలో పాలుపోదు. అమ్మా బతికుండగా పోగు చేసిన తిండి గింజలతోనే ఒక పూట తింటూ ఇంకో పూట కడుపులో కాళ్లు పెట్టుకుని నిద్రిస్తున్నారు. ఎవరో ఒకరు దయతలిస్తే కాస్త గంజి పడుతున్నారు. ఇక రాత్రిళ్లు వీరి పరిస్థితి దయనీయంగా ఉంటోంది. తల్లి పొత్తిళ్లలో తలదాచుకున్న చిన్నారులకు పొద్దుగూకే కొద్దీ భయం వెంటాడుతోంది. పెద్ద దిక్కుగా మారిన వైష్ణవికి వెన్నులో వణుకు వస్తున్నా తమ్ముడు, చెల్లికి ధైర్యం చెబుతూ నిద్రపుచ్చుతోంది. (ఈ వార్తకు స్పందించి ఇప్పటికే అనేక మంది సాయం చేస్తామని ముందుకు వస్తున్నారు. ఆ చిన్నారుల కాంటాక్ట్ ఫోన్ నెంబర్ కావాలని ‘సాక్షి’ని సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం వారి వద్ద ఎలాంటి ఫోన్ లేదు. ఎవరైనా సాయం చేయాలంటే కింద ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ లో నగదు వేయగలరు) దాతలు స్పందించాలనుకుంటే.. ముళ్లపతి వైష్ణవి ఆంధ్రా బ్యాంకు(తలుపుల శాఖ) ఖాతా నెం. 057010100175499 ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఏఎన్‌డీబీ0000570 ఎంఐసీఆర్ కోడ్ 515011762 -
అమ్మను అనాథను చేశారు
ఆకు చాటు పిందె ముద్దు..తల్లి చాటు బిడ్డ ముద్దు..బిడ్డ ఎదిగి గడ్డమొస్తె..కన్న తల్లే అడ్డు అడ్డు..అని సినీగేయ రచయిత రాసి అక్షరాలను నిజం చేశారు ఈ పుత్రరత్నాలు. నలుగురు కొడుకులు..ఒకరికి మించి ఒకరిపై ప్రేమ కురిపించింది. కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందోనని తన గుండెలపై పెట్టుకుని లాలించింది..రెక్కలొచ్చాక బిడ్డలకు ఆ రెక్కలిచ్చిన తల్లి భారమైంది. గుట్టుచప్పుడు కాకుండా నడిరోడ్డుపై అనాథలా వదిలిపడేశారు. ఇదేందయ్యా అని అడిగే శక్తి లేక..నడిచే ఓపిక లేక జీవచ్ఛవంలా ఆ పండుటాకు కూలబడిపోయింది. అవస్థాన దశలో పడి ఉన్న ఈ అమ్మను చూసి చలించిపోయిన ఓ ఇద్దరు ఆమెకు ఆయువు పోయడంతోపాటు మానవత్వాన్నీ బతికించారు. మంగళవారం గుంటూరులోని కాకానిరోడ్డులో జరిగిన ఈ సంఘటన నేటి సమాజంలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మానవీయ బంధాలను కళ్లకు కట్టింది. గుంటూరు(పట్నంబజారు): రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం శాఖమూరు గ్రామానికి చెందిన పుసులూరి ఉమామణికి 70 ఏళ్లు. భర్త ఆనందయ్య మూడేళ్ల క్రితం మృతి చెందారు. వీరికి శ్రీనివాసరావు, రమేష్, బాలకృష్ణ, కృష్ణార్జున కుమారులు. ఆనందయ్య చనిపోకముందే రెండు ఎకరాల పొలాన్ని అమ్మి వచ్చిన రెండున్నర కోట్లు కుమారులతోపాటు భార్యకు పంచారు. ఇటీవల మూడో కుమారుడు బాలకృష్ణ మృతి చెందాడు. ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక వాహనంలో ఉమామణిని ఎవరో తీసుకొచ్చి కాకానిరోడ్డులోని వాసవి క్లాత్ మార్కెట్ ఎదురుగా ఉన్న బస్‌స్టాప్‌లో పడుకోబెట్టి వెళ్లిపోయారు. ఎండిన డొక్కలతో ఆ వృద్ధురాలు అక్కడే పడి ఉంది. గమనించిన స్థానికుడు శ్రీవారి సేన రాష్ట్ర అధ్యక్షుడు టి. మణికంఠ వృద్ధురాలి ఆచూకీ కోసం ప్రయత్నించారు. శాఖమూరు గ్రామానికి చెందిన సుభాని అనే వ్యక్తి కారు రిపేరు నిమిత్తం వచ్చి వృద్ధురాలిని గుర్తించి బంధువులకు సమాచారాన్ని అందించారు. మాతృమూర్తిని మరిచారు... వృద్ధురాలి మూడో కుమారుడు బాలకృష్ణ భార్య వీరమ్మ, ఆమె కుమార్తెలు పద్మ, శిరీషలకు విషయాన్ని తెలియపరిచారు. మనమరాళ్లు పద్మ, శిరీషలు బస్‌స్టాప్ వద్దకు చేరుకుని తల్లికి విషయాన్ని చెప్పారు. అయితే పెద్ద కుమారుడు శ్రీనివాసరావు, రెండో కుమారుడు రమేష్‌లకు తెలియజేసినా వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవటం గమనార్హం. రెండో కుమారుడి భార్య వీరమ్మ వృద్ధురాలి బాధ్యతను తాను చూసుకుంటానని శాఖమూరు తీసుకెళ్లింది. -
అద్దెకు తెలంగాణ జైళ్లు
చంచల్‌గూడ: జైళ్లశాఖ చేపట్టిన సంస్కరణలతో ఖైదీల్లో పరివర్తన వస్తోందని, తద్వారా ఖైదీలు లేక జైళ్లు ఖాళీ అవుతున్నాయని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ అన్నారు. సోమవారం చంచల్గూడలోని జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా గ్రాండ్ విజన్ 2025 లక్ష్యాలను ఏర్పరచుకున్నట్లు తెలిపారు. నేరాల తగ్గింపు, సమాజిక సేవ, ఉపాధి కల్పన, స్వయం సమృద్ధి సాధన దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. సామాజిక సేవలో జైళ్ల శాఖ ఒక కొత్త ఆధ్యయాన్ని సృష్టించిందన్నారు. యాచకరహిత హైదరాబాద్‌లో భాగంగా జైళ్ల ప్రాంగణంలో ఆనందాశ్రమం ఏర్పాటు చేసి 3749 యాచకులను పునరావాస కేంద్రానికి తరలించామన్నారు. కౌన్సిలింగ్ నిర్వహించగా అందులో 3526 మంది తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్లారన్నారు. జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణల కారణంగా జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. త్వరలో ఇతర రాష్ట్రాల జైళ్ల శాఖకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జైళ్ల అద్దెకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లో కూడా ఆనందాశ్రమాలను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, అంధులు, మానసిక రోగులకు, అనాథలకు, వృద్ధులకు, వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు 9 సబ్ జైళ్లను మూసివేశామని, త్వరలో మరో 5 సబ్ జైళ్లను మూసివేయనున్నట్లు తెలిపారు. విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పిస్తే నేరాలు తగ్గుతాయన్నారు. సమావేశంలో ఐజీ ఆకుల నర్సింహ, డీఐజీ సైదయ్య, అధికారులు సంపత్, శ్రీమాన్‌రెడ్డి తదితరులున్నారు. -
నాడు తండ్రి.. నేడు తల్లి
► రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రుల దుర్మరణం ► అనాథలైన ఇద్దరు చిన్నారులు ధర్మపురి: విధి ఆ కుటుంబాన్ని వెంటాడింది. రోడ్డు ప్రమాదానికి గురై నాడు తండ్రి నేడు తల్లి మృతిచెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి శోకం ఎంతోమందిని కదిలించింది. ఈ చిన్నారులపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథకం. ధర్మపురికి చెందిన దుబ్బల రాజు–యమున దంపతులకు అఖిల్(11), వినయ్(8) అనే కుమారులున్నారు. ఉండడానికి ఇల్లు లేదు. రాజు గ్రామంలో కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 2011 ఫిబ్రవరి 3న జగిత్యాల పొలాస వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో రాజుతోపాటు ధర్మపురికి చెందిన మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ భారం యమునపై పడింది. కూలీ పని చేస్తూ వారిని స్థానిక ప్రైవేట్‌లో ఆంగ్ల మీడియంలో చదివిస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ వారి ఆలనాపాలనా చూస్తోంది. దైవదర్శనం చేసుకొని వస్తుండగా తల్లి మూడు రోజుల క్రితం వారి ఇంటి దైవమైన ఏసు ప్రభువు వద్ద ప్రార్థనలు జరిపి ఇంటికి తిరిగి వస్తుండగా.. జగిత్యాల జిల్లాలోని తక్కళ్లపెల్లి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో యమున(32)కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. తలకొరివి ఈ చిన్నారులే నిర్వహించడం కలచివేసింది. అనాథలైన అన్నదమ్ములు గోరుమద్దలు తినాల్సిన అన్నదమ్ములు తల్లిదండ్రులను కోల్పోవడంతో అనాథలయ్యారు. పూరి గుడిసెలో నివాసముంటున్న వీరిని ఆదుకోడానికి సహృదయులు ముందుకు రావాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు. -
శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం
ప్రేమ మందిరంలో వైభవంగా దాక్షాయణి, ఉమామహేశ్వరావుల వివాహం ఆదర్శ వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు కన్యాదానం చేసిన అరబిందో మార్కెటింగ్ వైస్ చైర్మన్ ప్రసాద్ దంపతులు అమలాపురం టౌన్:అక్కడ ఆదర్శం ఆవిష్కృతమైంది. పెద్దాపురానికి చెందిన చెన్నైలో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న పేరి ఉమామహేశ్వరరావు అమలాపురం కామాక్షీపీఠం ప్రేమమందిరంలో పెరిగిన దాక్షాయణిని వివాహమాడి అందరి ప్రశంసలు అందుకున్నారు. కామాక్షీ పీఠం ప్రేమ మందిరంలో అనాథగా పెరిగిన దాక్షాయణిని ఆదివారం తెల్లవారు జామున ఉమామహేశ్వరరావు వివాహమాడారు. పీఠాధిపతి కామేశమహర్షి ఆధ్వర్యంలో కామాక్షీ పీఠం ప్రేమ మందిరంలో ఈ ఆదర్శ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఆర్డీఓ జి.గణేష్‌కుమార్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు మిండగుదుటి మోహన్, చెల్లుబోయిన శ్రీనివాసరావు, అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్థి కమిటీ చైర్మన్ మెట్ల రమణబాబు, ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు తదితర ప్రముఖులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. కామాక్షీ పీఠానికి వచ్చే భక్తులందరూ ఈ వేడుకకు తరలి రావటంతో పీఠం కిక్కిరిసిపోయింది. ప్రేమ మందిరింలోని మిగిలిన పిల్లలందరూ తమ అక్క దాక్షాయణి వివాహ వేడుకలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కకు చిరు కానుకలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ మందిరం అమ్మ వక్కలంక వాణి తన సొంత ఆడపిల్లకు పెళ్లి చేసినట్టే అన్నీ తానై చక్కబెట్టింది. శనివారం మధ్యాహ్నానికే పెద్దాపురం నుంచి వరుడు ఉమామహేశ్వరరావు కుటుంబసభ్యులు, బంధువులు పీఠానికి చేరుకున్నారు. సాయంత్రం నుంచి పెళ్లి వేడుకులు మొదలయ్యాయి. మాకు ఆడపిల్ల లేని లోటు తీరింది నేను హైదరాబాద్ అరబిందో ఫార్మా లిమిటెడ్ మార్కెటింగ్ వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్నాను. మా స్వగ్రామం అమలాపురంలో కామాక్షీ పీఠం ఉన్న కృష్ణారావు వీధే. చిన్నతనం నుంచి పీఠంతో నాకు అనుబంధం ఉంది. మా కుంటుంబంలో అందరి పుట్టిన రోజులు పీఠంలోనే జరుపుకుంటాం. నా భార్య సుజాత, నేను పీఠంలోని ప్రేమ మందిరంలో పెరిగే అనాథ పిల్లలతో అనుబంధం పెంచుకున్నాం. మాకు ఆడపిల్లలు లేరు. అందుకే దాక్షాయణిని తమ కూతురుగా భావించి ఆమె పెళ్లి ఖర్చు అంతా భరించాం. వరుడికి కాళ్లు కడిగి కన్యాదానం చేశాం. మాకు ఆడపిల్ల లేదన్న లోటు తీరింది. – పెమ్మరాజు ప్రసాదరావు, సుజాత దంపతులు సంగీతమే ఇద్దర్నీ కలిపింది గత సంవత్సరం ఇదే పీఠం ప్రేమ మందిరంలో ఓ అనాథ యువతిని నా స్నేహితుడు వివాహం చేసుకున్నాడు. ఆ వివాహానికి నేనూ వచ్చాను. అప్పుడే నాకూ ఓ అనాథ యువతిని పెళ్ల ఆలోచన చేసుకోవాలన్న ఆలోచన కలిగింది. అప్పుడే దాక్షాయణిని చూశాను. ఆమె నాకు నచ్చటానికి ప్రధాన కారణం ఆమె ఓ గాయకురాలు, సంగీతం వచ్చు. నాకు సంగీతమన్నా... గానమన్నా ఇష్టం. ఇవే ఆమెను ఇష్టపడటానికి అసలు కారణాలయ్యాయి. అవే నన్ను ఆమె మెడలో మూడు ముళ్లు వేసేలా... ఏడు అడుగులు నడిచేలా చేశాయి. – పేరి ఉమా మహేశ్వరరావు, వరుడు, సాప్ట్ వేర్ ఉద్యోగి, చెన్నై -
బాబు బంగారం
- అనాథ యువతిని పెళ్లి చేసుకోనున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి - అమలాపురం కామాక్షి పీఠం ప్రేమ మందిరంలో పెరిగిన అనాథ ‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని.. ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని.. నేనున్నానని.. నీ తోడవుతానని, నేనున్నానని.. నిను మనువాడతానని’’ అంటూ ఓ అనాథ యువతితో ఏడడుగులు నడిచేందుకు.. మూడుముళ్ల బంధంతో జీవిత పయనం సాగించేందుకు సిద్ధమయ్యాడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి.. దీంతో అమలాపురం కామాక్షీ పీఠంలోని ప్రేమమందిరంలో ‘పెళ్లి’సందడి నెలకొంది. అమలాపురంలోని కామాక్షీ పీఠంలో అనాథ పిల్లలు పెరిగే ప్రేమమందిరానికి చెందిన అనాథ యువతి దాక్షాయణిని పెద్దాపురానికి చెందిన, చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగి పేరి ఉమామహేశ్వరరావు వివాహం చేసుకునేందుకు నిశ్చయించాడు. వీరికి శనివారం రాత్రి 5.10 గంటలకు (తెల్లవారితే ఆదివారం) వివాహం జరిపేందుకు పీఠాధిపతి కామేశ మహర్షి ముహూర్తం నిర్ణయించారు. దాక్షాయణికి రక్తసంబంధీకులు ఎవరూ లేకపోయినా పీఠం ఉన్న వీధికి చెందిన పెమ్మరాజు ప్రసాదరావు, సుజాత దంపతులు కన్యాదానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ప్రేమ మందిరంలో పెళ్లి సందడి నెలకొంది. తమ అక్క పెళ్లికూతరు కాబోతోందనే ఆనందంలో మిగతా అనాథపిల్లలు ఆనందంలో ఉన్నారు. కామాక్షీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆదర్శ వివాహం జరగనుంది. ఆ ఆలోచన వచ్చిందిలా.. గత ఏడాది పీఠం ప్రేమ మందిరంలోని జరిగిన ఓ అనాథ యువతి వివాహ కార్యక్రమానికి ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఆ వివాహ సమయంలో దాక్షాయణిని చూసిన ఆయన తానూ అనాథను పెళ్లిచేసుకోవాలన్న ఆదర్శమైన ఆలోచనకు వచ్చారు. దాని ఫలితమే వారి వివాహం నేడు కార్యరూపం దాల్చుతోంది. ఎక్కడో పుట్టి.. ప్రేమ మందిరంలో పెరిగి.. ఐదేళ్ల ప్రాయంలో దాక్షాయణి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం వచ్చే ఆర్టీసీ బస్సులో రాజమహేంద్రవరం చేరుకుంది. అక్కడ బస్ స్టేషన్లో ఏడుస్తున్న ఆ చిన్నారిని కొందరు చేరదీసి పోలీసుల సహకారంతో అమలాపురం కామాక్షీపీఠంలోని ప్రేమ మందిరంలో చేర్చారు. సుమారు ఇరవై ఏళ్ల నుంచి పీఠంలోనే పెరిగింది. ఇంటర్మీడియట్ వరకూ చదివింది. సంగీతం నేర్చుకుంది. గాయకురాలిగా ఎన్నో మధుర గీతాలు ఆలపించి మరెన్నో బహుమతులు పొందింది. అమలాపురంలోని పలు పాఠశాలల్లో సంగీతం ఉపాధ్యాయినిగా పనిచేసి తన వంతు ఉపాధికి బాటలు వేసుకుంది. వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది నా అన్న వాళ్లు లేకపోయినా అమ్మ, నాన్న కమ్మని పిలుపులకు దూరమైనా ఆ లోటు ప్రేమమందిరంలో ఏనాడు అనిపించలేదు, కనిపించలేదు. 60 మంది పిల్లల మధ్య తానూ ఓ అనాథగా పెరిగినా ఆ భావన ఏ రోజూ కలగకుండా పీఠాధిపతి కామేశ మహర్షి, ప్రేమ మందిరం అమ్మ వాణి తమను పెంచారు. తమ ప్రేమ మందిరం కుటుంబం నుంచి వెళ్లిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. - దాక్షాయణి -
అందరూ ఉన్నా అనాథలా..!
- షెల్టర్ హోంలో తలదాచుకుంటున్న బాలుడు నంద్యాలవిద్య: గోరుముద్దలు తినిపిస్తూ, ఆత్మీయతను పంచాల్సిన అమ్మ పిచ్చిదైంది. అనురాగాన్ని పంచుతూ, బాధ్యతగా అక్షరాలు నేర్పించాల్సిన తండ్రి పోషించలేక చేతులెత్తేశారు. నమ్మిన చిన్నాన్న రూ.20వేలకు తెగనమ్మడానికి ప్రయత్నించాడు. అదృష్టవశాత్తూ పోలీసులు, ఐసీడీఎస్ అధికారుల చొరవతో ఆరేళ్ల లోకేష్ అనాథలా షెల్టర్ హోంలో తలదాచుకుంటున్నాడు. లోకేష్ స్వగ్రామం ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల. చిన్నతనంలోనే తల్లి లక్ష్మికి మతిచలించింది. పిచ్చిచేష్టలు చేస్తూ, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేది. తండ్రి బుజ్జి ..ఆర్థిక స్థోమత లేకపోవడంతో పోషించలేక కుమారుడిని వదిలేశాడు. నిస్సహాయస్థితిలో ఉన్న లోకేష్‌ను.. చిన్నాన్న శీను అన్నీ తానై చూసుకుంటానని, విద్యాబుద్ధులు చెప్పిస్తానని మభ్యపెట్టి బేతంచెర్లకు తీసుకొని వచ్చాడు. బస్టాండ్ వద్ద లోకేష్‌ను రూ.20వేలకు అమ్మడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని లోకేష్‌కు విముక్తి కల్పించారు. కాని మళ్లీ అమ్మానాన్నల దగ్గరకు వెళ్లలేని పరిస్థితి. దీంతో ఐసీడీఎస్ అధికారులు కొద్ది రోజులు కర్నూలు సీక్యాంపులోని శిశు గృహానికి అతన్ని తరలించారు. తర్వాత జిల్లా బాలల సంరక్షణ అధికారులు అతన్ని నంద్యాల పట్టణం నందమూరినగర్‌లో స్టార్ సొసైటీ నిర్వహిస్తున్న షెల్టర్ హోంలో చేర్పించారు. లోకేష్ పదినెలల నుంచి ఈ షెల్టర్ హోంలోనేఉంటూ తల దాచుకుంటున్నాడు. ఇతని కోసం ఎవరూ ముందుకు రావడం లేదని షెల్టర్ హోం నిర్వాహకురాలు రాజేశ్వరమ్మ తెలిపారు. బాలుని ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా ముందుకు వస్తే కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. అయితే తాను షెల్టర్ హోంలోనే ఉంటూ బాగా చదువుకొని పోలీస్ అవుతానని లోకేష్ చెబుతున్నాడు. -
ఆస్పత్రిలో అనాథ శవం
ఆదోని టౌన్ : పట్టణంలోని గోకారి జెండా వీధిలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందగా వన్ న్ పోలీసులు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.మృతి చెందిన వృద్ధుడి వయస్సు 65 ఏళ్లు ఉంటాయని, తెల్లని షర్టు, పంచ ధరించి ఉన్నాడని ఔట్‌పోస్టు కానిస్టేబుల్ పుల్లయ్య తెలిపారు. తెల్లని వెంట్రుకలు, చామన ఛాయ రంగు ఉన్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో ఉన్న వృద్ధుడి శవాన్ని పరిశీలించి గుర్తించవచ్చని చెప్పారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. -
ఈ శిక్ష తగునా..?
కక్షల నేపథ్యంలో తలిదండ్రుల హత్య అనాథగా మారిన కుమారి పోలీసుల సంరక్షణలో ఎన్నాళ్లు? సాలూరు(విజయనగరం) : అభం, శుభం తెలియని ప్రాయం ఆ బాలికది. ఏ తప్పూ చేయకపోయినా.. అయినవారు కక్షలకు పోవడంతో తాను శిక్ష అనుభవిస్తోంది. కన్న తల్లిదండ్రులకు దూరమై అనాథగా మారింది. ఆ బాలిక పేరు తాడంగి కుమారి. వయసు ఎనిమిదేళ్లు. ఊరు బింగుడువలస. ఈనెల 11వరకు తను కూడా అందరి చిన్నారుల్లాగే ఎంతో సంతోషంగా ఆడుతూ.. పాడుతూ.. అమ్మా, నాన్నల చెంత మారాం చేస్తూ సంతోషంగా గడిపింది. ఇంతలో బాబాయి కుటుంబంతో తన తల్లిదండ్రులు సీతమ్మ, శంబుకున్న పాతకక్షలు పొడచూడడంతో ఈనెల 11న తల్లిదండ్రులిద్దరూ దారుణ హత్యకు గురయ్యారు. తల్లిదండ్రులు తప్పు చేసారో లేదో గానీ స్పర్థల నేపథ్యంలో కుమారి జీవితం ప్రశ్నార్థకమైంది. అన్నీ తామై పెంచిన అమ్మానాన్నలు ఇక తిరిగిరారన్న విషయం పూర్తిగా అర్థం కాకపోయినా.. బంధువులు, ఇళ్లూ వాకిలీ, ఊరు అన్నీ వదిలి పోలీసుల సంరక్షణలో కాలం వెళ్లబుచ్చాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇమడలేకపోతున్న చిన్నారి తల్లిదండ్రుల హత్య నేపథ్యంలో విచారణకు వెళ్లిన సీఐ జి. రామకృష్ణ అనాథ అయిన కుమారిని వెంటబెట్టుకుని సాలూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. రెండు రోజులపాటు మహిళా హోమ్‌గార్డ్ ఇంటిలో ఆశ్రయం కల్పించారు. అక్కడ ఇమడలేకపోతే తన ఇంటికే సీఐ తీసుకువెళ్లి తన పిల్లలతో కలిపి ఉంచారు. రెండు రోజులు గడచిన తర్వాత చైల్డ్‌లైన్ సంస్థకు అప్పగించారు. అయితే కొండకోనల్లో హాయిగా గడిపిన ఆ చిన్నారి అక్కడ కూడా ఇమడలేకపోయింది. దీంతో బాలికను అక్కడ నుంచి బొబ్బిలిలోని సన్‌రైజ్ హోమ్‌కు తరలించారు. అక్కడా అదే పరిస్థితి. చేసేది లేక కుమారిని మరలా తన ఇంటికే తీసుకువచ్చారు సీఐ రామకృష్ణ, తన బిడ్డ దుస్తులనే వేయించి, ఆలనాపాలనా చూస్తున్నారు. కుమారికి అండగా నిలుస్తానని సీఐ రామకృష్ణ చెబుతున్నప్పటికీ, ఇలాంటి వ్యక్తులు తారసపడకపోయి ఉంటే ఆ చిన్నారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్న. జీవితాలు బలిపెట్టొద్దు.. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం, కక్షలు పెంచుకోవడం వంటి కారణాలతో చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు, పిల్లల భవిష్యత్‌ను కూడా నాశనం చేస్తున్నారు. అందుకే చట్టంపై అవగాహన పెంచుకుని, ప్రశాంతంగా జీవనం సాగించాలి. – జి రామకృష్ణ, సీఐ, సాలూరు -
‘ఆమె’కు ఆశ్రయం
ధర్మవరం అర్బన్ : అనాథలా.. జీవచ్ఛవంలా ఉన్న పాతికేళ్ల యువతికి అనంతపురం మండలం కాట్నేకాలువలోని ‘ఆశ్రయ’ అనాథాశ్రమ వ్యవస్థాపకుడు వై.క్రిష్ణారెడ్డి, అతని భార్య వై.దేవి ఆదరించి, ఆశ్రయం కల్పించారు. ఈనెల 17న ‘ఈమె ఎవరు?’ అనే శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురితమైంది. కథనానికి ఆశ్రయ అనాథాశ్రమం నిర్వాహకులు స్పందించారు. ఆదివారం ధర్మవరం పట్టణం వచ్చిన ఆశ్రయ అనాథాశ్రమం నిర్వాహకులు క్రిష్ణారెడ్డి, దేవిలు పట్టణంలోని ఎల్పీ సర్కిల్ అండర్ బ్రిడ్జి వద్ద ఉన్న యువతికి భోజనం తినిపించారు. అనంతరం ఆమెకు స్నానం చేయించి, కొత్త దుస్తులు తొడిగించారు. ఆటోలో ఆమెను అనంతపురం సమీపంలోని కాట్నేకాలువలోని ఆశ్రమానికి తీసుకెళ్లారు. అంగన్వాడీ ఆయా అంజినమ్మ వారికి సాయం చేసింది. ధర్మవరం పట్టణానికి చెందిన పట్టుచీరల వ్యాపారి బాలం కోదండపాణి ఆటో బాడుగను చెల్లించి, తన దాతృత్వాన్ని చాటుకున్నారు. -
అనాథ వృద్ధాశ్రమం తొలగింపు
ముకుందాపురం(మునగాల): మండలంలోని ముకుందాపురం గ్రామపంచాయతీ శివారులో జాతీయ రహాదారి పక్కన గత కొంతకాలంగా ఉన్న అనాథ వృద్ధాశ్రమాన్ని శనివారం రాత్రి మండల తహసీల్దార్ ఆదేశాల మేరకు మునగాల పోలీసులు బలవంతంగా తొలగించారు. తహసీల్దార్ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం... జాతీయ రహాదారి విస్తరణలో భాగంగా మూడేళ్ల క్రితం ముకుందాపురం శివారులో కొంతభూమిని ప్రభుత్వం సేకరించి సదరు రైతుకు నష్టపరిహారం అందించింది. కాగ ఈ ప్రాంతంలో రెండేళ్లుగా ఓ మహిళ అనాథ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో జాతీయ రహాదారి విస్తరణలో భాగంగా క్యాంటిన్ ఏర్పాటు చేయాలని జీఎమ్మార్ సంస్థ నిర్ణయించింది. ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని తొలగించాలని నిర్వాహాకులకు తెలిపినప్పటీకీ తొలగించకపోవడంతో జిల్లా కలెక్టర్ దృష్టికి జీఎమ్మార్ సంస్థ తీసుకువెళ్లింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించాల్సి వచ్చిందని ఆయన‡ తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి మునగాల ఎస్ఐ గడ్డం నగేష్ ఆధ్వర్యంలో సిబ్బంది వృద్ధాశ్రమాన్ని బలవంతంగా తొలగించారు. -
అనాథలా... జీవచ్ఛవంలా..
ధర్మవరం అర్బన్ : ఇక్కడ అనాథలా.. జీవచ్ఛవంలా పడుకున్న ఈమెకు పాతికేళ్లు ఉంటాయి. ఈమె ఎవరో తెలియదు.. ఎందుకు ఇక్కడికి వచ్చిందో చెప్పలేదు. మతి స్థిమితం లేదా.. లేక ఇల్లు వదిలి వచ్చిందో తెలియదు. వారం రోజుల నుంచి ఇదే చోటే రోడ్డుపక్కన నేలపై నిస్సహాయురాలుగా పడుకుంది. ఆమె వద్దకు నా అన్నవారు రాలేదు. ఎవరైనా తిండి పెడితే కాస్తంత తినడం..లేదంటే దుప్పటి కప్పుకొని పడుకోవడం..చేస్తోంది. ఈమెను ‘సాక్షి’ పలకరించగా తన పేరు ‘అరుణ’ అని.. తన తల్లిదండ్రులు నాగరాజు, వెంకటలక్ష్మమ్మ ’ అని మాత్రమే చెప్తోంది. తండ్రి అనంతపురంలో ఐస్‌క్రీంలు అమ్ముతాడని, ధర్మవరంలో తన అక్కలు ఉన్నారని, వారింటికి వచ్చినానని ఒక్కోసారి చెప్తోంది. వాళ్లింటికి ఎందుకు వెళ్లలేదని ఎవరైనా అడిగితే రేపు పోతాలే అంటోంది. ఇంటి నుంచి తప్పిపోయి వచ్చేశావా? అని అడిగితే ‘తెలియదు’ అని అంటోంది. ఈమెను బంధువులు తీసుకెళ్లాలని, లేదంటే స్వచ్ఛంద సంస్థలు తీసుకెళ్లి ఆశ్రయం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. -
తల్లికోసం తల్లడిల్లి..
తల్లి మృతి.. అనాథలైన పిల్లలు ఇంద్రవెల్లి : మండలంలోని వడగామ్ గ్రామపంచాయతీ పరిధిలోని లింగపూర్ గ్రామానికి చెందిన మెస్రం అనుసూయబాయి(35) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారు జమున మృతి చెందింది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. లింగాపూర్ గ్రామానికి చెందిన మెస్రం మారుతికి వడగామ్ గ్రామానికి చెందిన అనుసూయబాయితో వివాహం చేశారు. వీరికి ముగ్గురు సంతానం. లక్ష్మీ(12), గణేష్(8), రామ్‌చరణ్ (1) ఉన్నారు. మారుతి గత సంవత్సరం వేరే మహిళతో మరో వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి మారుతి ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. అనుసూయ ఆరోగ్యం బాగలేకపోయిన కులీ పనులు చేసి ముగ్గురు పిల్లలను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం నుంచి అనుసూయబాయి అనారోగ్యంతో బాధపడుతోంది. భర్త లేక, వైద్యం చేయించడానికి ఇంట్లో ఆర్థిక స్తోమత లేకపోవడంతో రోజు రోజుకూ పరిస్థితి విషమించి అనసూయబాయి శనివారం మృతి చెందింది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. లింగపూర్ గ్రామంలో విషాధచాయలు అములుకున్నాయి. -
‘గాంధీ’ సెల్లార్లో పాపను వదిలేసిన మహిళ
గాంధీ ఆస్పత్రి: ఏడాదిన్నర వయసుగల పాపను సెల్లార్లో వదిలి వెళ్లిన ఘటన ఆదివారం గాంధీ ఆసుపత్రిలో జరిగింది. ఆస్పత్రి అధికారులు, పోలీసుల కథనం ప్రకారం... గాంధీ ఆస్పత్రిలో లిఫ్ట్ సూపర్వైజర్గా పని చేసే భరత్ ఆదివారం ఉదయం 10 గంటలకు తన బైక్‌ను పార్కింగ్ చేసేందుకు సెల్లార్లోకి వెళ్లాడు. అక్కడ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించింది. చుట్టుపక్కల పాప సంబంధీకులెవరూ కనిపించకపోవడంతో ఆస్పత్రి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆర్ఎంఓ బబిత నేతృత్వంలో చిన్నారిని పీఐసీయూకు తరలించి వైద్యసేవలందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ఓ మహిళ ఈ చిన్నారిని ఎత్తుకొని ప్రధాన భవనంలోకి ప్రవేశించి మెట్లు మీదుగా సెల్లార్లోకి దిగినట్లు నమోదైంది. అయితే దృశ్యాల్లో స్పష్టత లేకపోవడంతో మహిళను గుర్తించలేకపోయారు. చిన్నారికి కాళ్లు, చేతులు వంకరగా ఉన్నాయి. పోలియో సోకిందనే కారణంతో చిన్నారిని ఇక్కడ వదిలేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా పాపను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
అమ్మా.. నాన్నా.. ఏడున్నారు?
– బిడ్డను కని మృతి చెందిన తల్లి – పారిపోయిన తండ్రి – తనకు పట్టదన్న తాత – ఏడుస్తూ పాలకోసం ఎదురు చూస్తున్న అనాథ శిశువు చీరాల: కేవ్.. కేవ్.. అంటూ పండంటి మగబిడ్డ అమ్మ కడుపులో నుంచి బయట పడ్డాడు. కానీ వాడు దురదృష్టవంతుడు కాబోలు. వెంటనే తల్లిని పోగొట్టుకున్నాడు. అంతకంటే ముందుగానే ఆమె భర్త అని చెప్పుకున్న వ్యక్తి ఎక్కడికో పారిపోయాడు. కనీసం మృతురాలి తండ్రి.. అంటే తాత అయినా వచ్చి ఎత్తుకుంటాడనుకుంటే.. తనకు సంబంధం లేదంటూ వెళ్లిపోయాడు. తల్లి శవానికి మునిసిపాలిటీవాళ్లు అంతిమ సంస్కారాలు చేశారు. మరి లోకం చూసిన ఈ బాబుకు సంస్కారాలు నేర్పించి అక్కున చేర్చుకొనేదెవరు? ఈ హృదయ విదారక సంఘటన చీరాల ఆస్పత్రిలో చోటు చేసుకుంది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా నిద్రపోవాల్సిన ఆ బిడ్డ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఎవరూలేని అనాథగా మారిపోయాడు. పురిటి నొప్పులతో బాధపడుతున్న భవాని అనే మహిళను ఈపూపాలెం పీహెచ్సీ సిబ్బంది 108లో మంగళవారం రాత్రి చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వాహన సిబ్బంది వెంట భవానీ భర్తనంటూ ఓ వ్యక్తి కూడా వచ్చాడు. అయితే ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న డాక్టర్‌తో పాటు ఇతర వైద్య సిబ్బంది ఆమె పరిస్థితి చూసి కంగారు పడ్డారు. అయితే తనకు మూడో కాన్పని, తనను ఇంటికి పంపించాలని ఆ మహిళ బాత్రూమ్లోకి వెళ్లి తలుపులు మూసుకుంది. చాలాసేపు ఆస్పత్రి సిబ్బంది బతిమలాడగా బయటకు వచ్చింది. ఆమె చాలా బలహీనంగా ఉండటంతో పాటు బీపీ కూడా కనిపించడంతో గుంటూరు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. దీంతో భర్తనని చెప్పుకున్న వ్యక్తి అక్కడి నుంచి మాయమయ్యాడు. పాలుపోని సిబ్బంది భవానికి కాన్పు చేయడంతో మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఎక్కువగా రక్తం పోతుండటంతో గుంటూరు తీసుకెళ్లాని 108 వాహన సిబ్బందికి సూచించడంతో బయలు దేరారు. కారంచేడు రోడ్డులోని రక్షిత మంచినీటి చెరువు సమీపంలోకి వెళ్లగానే మృతి చెందింది. మృతదేహం మున్సిపాలిటికి అప్పగింత.. వైద్య సిబ్బంది వివరాలు సేకరించగా మృతురాలి తండ్రి స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద అవ్వారు వీధిలో నివాముంటున్నాడని తెలుసుకుని పిలిపించారు. తన కుమారై చాలా కాలం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. తనకు సంబంధం లేదని.. దహన సంస్కారాలు చేయలేనన్నాడు. దీంతో శవాన్ని మున్సిపాలిటీవారు స్వాధీనం చేసుకున్నారు. ఎవరిదారి వారు చూసుకోవడంతో ఏమీ తెలియని అమాయక జీవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కనీసం చైల్డ్‌లైన్ సిబ్బంది అయినా స్పందిస్తారో లేదో! అధిక రక్తస్రావంతోనే మృతి చెందింది భవానికి రక్తం లేకపోవడంతో చాలా బలహీనంగా ఉంది. దానికి తోడు కాన్పు సమయంలో ఆమెకు రక్తం అధిక రక్తస్రావమైంది. ఆమె వద్ద ఎటువంటి మెడికల్ రికార్డు లేదు. డ్యూటీలో ఉన్న వైద్యులు కాన్పు చేశారు. మాయ బటయటకు రాకపోవడంతో అధికంగా రక్తస్రావమైంది. శిశువు బలహీనంగా ఉండడంతో ఎన్బీయూసీలో ఉంచాం.– సీహెచ్ ప్రసన్నకుమార్, సూపరింటెండెంట్ -
ఓ కవిత కథ..!
* ఆసుపత్రిలో అనాథగా వదిలేశారు..! *పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది బళ్లారి (తోరణగల్లు) : అమ్మనాన్నలు చిన్నప్పుడే పోయారు. తోడబుట్టిన తమ్ముడే దిక్కయ్యాడు. ఇద్దరు కాయకష్టం చేసుకుంటు జీవనం సాగిస్తున్న తరుణంలో ఎనిమిదేళ్ల క్రితం ఓసారి కాలుజారి కిందపడింది. దీంతో తుంటి భాగం బెణికింది. కట్టె సాయంతో నడుస్తుండగా వారం క్రితం మళ్లీ కింద పడింది. దీంతో నడవలేని స్థితికి వచ్చింది. తమ్ముడు ఆసుపత్రిలో చికిత్సకు తీసుకొచ్చి గురువారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లి వస్తానని తిరిగి రాలేదు. దీంతో ఆ అభాగ్యురాలు ఎమర్జెన్సీ వార్డు దారిలోనే స్ట్రెచర్ పైనే ఉంది. ఆసుపత్రి సిబ్బంది సైతం పట్టించు కోలేదని వాపోయింది. వివరాల్లోకెళితే... ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన కవిత (39)కు బాల్యంలోనే తల్లిదండ్రులు గోపీనాథ్, వత్సలా బాయిలు మృతి చెందారు. తమ్ముడు శ్రీనివాస్, కవిత పెద్దమ్మతో బళ్లారిలో స్థిరపడ్డారు. కొంత కాలానికి కవిత పెద్దమ్మ జబ్బుతో చనిపోయింది. కవిత బట్టల షాపులో సేల్స్‌గర్ల్ గా, తమ్ముడు శ్రీనివాస్ ఓ బంగారు దుకాణంలో పని చేస్తు కాలం వెళ్లదీస్తుండగా ఎనిమిదేళ్ల క్రితం కవిత కాలు జారి కింద పడటంతో తుంటి భాగం దెబ్బతింది. కట్టె సాయంతో నడుస్తుండేది. మళ్లీ వారం రోజుల క్రితం కింద పడటంతో నడవలేని స్థితికి వచ్చింది. దీంతో తమ్ముడు శ్రీనివాస్ గురువారం విమ్స్‌కు వైద్యం కోసం తీసుకొచ్చాడు. వైద్యులు ఎక్స్‌రే పరీక్షలకు సిఫారసు చేశారు. తమ్ముడు శ్రీనివాస్ గురువారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లి వస్తానని తిరిగి రాలేదు. దీంతో బాధితురాలు కవిత గురువారం నుంచి విమ్స్ మైనర్ఓటీ వద్దే స్ట్రెచర్‌పై అభాగ్యురాలుగా పడి ఉంది. ఆసుపత్రి సిబ్బంది గాని వైద్యులు కాని తనను పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయింది. తన తమ్ముడు తన వైద్యం కోసం డబ్బుల కోసం ఎక్కడ తిరుగుతున్నాడోనని ఆవేదన చెందుతోంది. ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులు పాలు, బ్రెడ్డు ఇస్తున్నారే తప్ప ఆ వార్డులో పని చేసే సిబ్బంది గాని అటెండర్లు కాని పట్టించుకోవడం లేదు. తమ్ముడి కోసం ఎదురు చూస్తు రెండురోజులుగా అక్కడే గడుపుతోంది. -
అడ్రస్ పోయింది...
ఆ కుటుంబానికి తండ్రే ఒక అడ్రస్. భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా, కుటుంబానికి పెద్ద దిక్కుగా తానే ఒక అడ్రస్‌గా ఉన్నాడు. కాని ఇప్పుడా అడ్రస్ పోయింది. భార్యాపిల్లలు ఆ అడ్రస్ వెతుక్కుంటున్నారు. చెప్పకుండా మాయమైన తండ్రిని ఐదేళ్లుగా వెతుక్కుంటున్నారు. ‘మా నాన్న అడ్రస్ చెప్పరూ’ అని మానవ హక్కుల కమిషన్ గడప తొక్కిన ఆ పిల్లలకు కావలసింది ఓదార్పు మాత్రమే కాదు. ఆ తండ్రి తోడు. అతని నీడా. ఫలితంగా తమకో అడ్రస్ ఉందనే ధైర్యం. చింతల మల్లయ్యకు యాభై ఏళ్లు. గవర్నమెంట్ టీచర్. ఊరు నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం పెద్దమాందాపురం గ్రామం. భార్య ఉంది. పేరు యాదమ్మ. ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుమారుడు కౌశిక్‌కుమార్, కూతురు సృజన, మరో కూతురు శ్రీలేఖ. ఆర్థికంగా పెద్ద కష్టాలేమీ లేవు. మల్లయ్య ఉపాధ్యాయునిగా పనిచేస్తూ, పిల్లలను చదివిస్తున్నాడు. వారి సంసారం హాయిగా సాగిపోయేది. కాని- సరిగ్గా ఐదేళ్ల క్రితం. 2011. మండు వేసవి. ఆ వేసవి ఆ ఇంట్లో వడగాడ్పు కొట్టింది. అంతవరకూ ఎంతో బాధ్యతగా ఉన్న మల్లయ్య హఠాత్తుగా ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఎవరికీ ఏమీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంతో వెతికారు. కాని దొరకలేదు. మూడు నెలలకు అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యి పాలివాండ్లతో భూముల గొడవలను పరిష్కరించుకొని ఉన్న డబ్బులను, ఆస్తులను పట్టుకెళ్లిపోయాడు. చాలా పెద్ద దెబ్బ ఇది. ఆ దెబ్బకు కుటుంబం వీధిన పడింది. భార్య యాదమ్మ కూలీనాలీ చేస్తూ మిగిలిన భూమిని కౌలుకు చేయిస్తూ, కుటుంబాన్ని పోషిస్తూ, పిల్లలను చదివిస్తోంది. ఈ పని చేస్తూనే ఇంటి బాధ్యతను వదిలేసి అనాథలను చేసిన మల్లేశంను వెతుకుతూనే ఉంది. ఎక్కడున్నాడు? మల్లయ్య ఉప్పల్‌లో ఉంటున్నాడని తెలుసుకొని 2014లో అప్పటి జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులును ఆశ్రయించారు యాదమ్మ, పిల్లలు. పోలీసులు మల్లయ్యపై మిస్సింగ్ కేసు నమోదు చేసి వెతికి పట్టి తెచ్చి కుటుంబానికి అప్పగించారు. ఇకపై తాను ఎక్కడికీ వెళ్లనని, బుద్ధిగా భార్యాపిల్లలను చూసుకుంటానని, లేదంటే చట్టరీత్యా చర్యతీసుకోమని పోలీస్ స్టేషన్లో రాసిచ్చాడు మల్లయ్య. కుటుంబ సభ్యుల వెంట ఇంటికెళ్లాడు. కాని రెండు రోజులే ఉన్నాడు. మళ్లీ పరార్. ఇప్పటికి రెండున్నర సంవత్సరాలుగా ఇంటికిగాని, ఉద్యోగానికి గాని రాలేదు. విద్యాశాఖ అధికారులు అతను చేస్తున్న టీచరు ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ సంగతి తెలిసి మల్లయ్య మళ్లీ ఊడిపడ్డాడు. భార్యాపిల్లలతో కలిసి అప్పటి డీఈవోను ఉద్యోగం ఇప్పించాలని మొరపెట్టుకున్నాడు. 8నెలల పాటు తిరిగితే చివరకు పిల్లల మోహం చూసి అధికారులు మళ్లీ ఉద్యోగం ఇస్తూ గుర్రంపోడు మండలం మక్కపల్లి ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ వేశారు. మల్లయ్య రెండు రోజులు ఉద్యోగం చేశాడు. మూడో రోజు తెల్లారి లేచి చూసేసరికి ఇంట్లో లేడు. కుటుంబ సభ్యులు మళ్లీ మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు, అత ని ఆచూకీ కనుగొనలేదు. దీంతో రెండు రోజుల క్రితం మల్లయ్య పిల్లలు హెచ్చార్సీని ఆశ్రయించి, తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇంతకీ ఏం చేస్తున్నాడు... మల్లయ్య వివాహేతర సంబంధంలో ఉన్నాడని బోగట్టా. టీచర్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో పక్క మండలానికి చెందిన ఓ మహిళతో సంబంధం ఏర్పడిందని చెబుతున్నారు. ఆ మహిళకు వివాహం అయిందని, వీరి సంబంధం చూసి భర్త గొడవ పడి మల్లయ్యను కొట్టాడని ఆ తర్వాత ఆమెను వదిలేశాడని చెబుతున్నారు. తనతో సంబంధం వల్ల ఇదంతా అయ్యింది కనుక మల్లయ్య ఆమెతోనే ఉంటూ ఆమెను పోషిస్తూ ఉన్నాడని కథనం. ఇది తెలిసి యాదమ్మ దేవరకొండ కోర్టులో భరణం కేసు కూడా వేసింది. కాని అడ్రస్ లేని మనిషికి ఎక్కడికని నోటీసులు పంపాలి? ఏమైనా ఇది బాధ్యత మరిచిన ఒక మనిషి కథ. కుటుంబానికి అన్యాయం చేసిన మనిషి తప్పిదం. ఈ తప్పిదానికి శిక్ష అనుభవిస్తున్నది మాత్రం భార్యా పిల్లలు.డడడడ - కనకల లింగస్వామి సాక్షి, చౌటుప్పల్, నల్లగొండ జిల్లా మొగుడు సచ్చిండనుకొని బతుకమండు నేను మూడో తరగతి వరకే చదివా. కూలీనాలీ చేసి పిల్లలను పోషిస్తున్నా, ఇప్పటికి రూ.3 లక్షల మేర అప్పులు చేసి నా శక్తిమేరకు పిల్లలను సదివిపిస్తున్నా. నా భర్త మల్లయ్య ప్రభుత్వ ఉద్యోగి కావడంతో, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కూడా రావడంలేదు. నా భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్న మూడేళ్ల వరకు కనుక్కోలేకపోయా. నిలదీస్తే మొగుడు సచ్చిండనుకొని బతుకమండు. కుటుంబం పరువుపోతుందని ఇంతవరకు రోడ్డెక్కలే. ఇక ఈ కుటుంబాన్ని పోషించేందుకు నాకు దమ్ము చాలడంలేదు. పిల్లలు పెళ్లీలకు ఎదిగిండ్రు. నా భర్తను నాకు వెతికిపించాలె - యాదమ్మ, భార్య డాడే గుర్తుకొస్తుండు ఏడాదిన్నర క్రితం కిట్స్‌లో ఎంటెక్ పూర్తి చేశా. బ్యాక్లాగ్ ఉండడంతో ఖాళీగా ఉన్న. నాన్న ఉన్నప్పుడు ప్రతిపనికి భుజం తట్టి ప్రోత్సహించేవాడు. నాన్న వెళ్లిపోయాక ఏం చేయాలో తెలియడం లేదు. కష్టమొచ్చినా, సంతోషమనిపిచ్చినా ఆయనే గుర్తుకొస్తుండు. ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. నాన్నకు ఇంకా 9 ఏళ్ల సర్వీసు ఉంది. ఇప్పటికైనా వస్తే వారి పెళ్లిళ్లు చేసి, కుటుంబాన్ని సర్దుకోవచ్చు. - కౌశిక్‌కుమార్ కుమారుడు ఫీజు రూ.3 లక్షలు చెల్లిస్తే బీటె క్ సర్టిఫికేట్లు నాన్నే 2008లో బాసర ట్రిపుల్ ఐటీలో చేర్పించిండు. నాన్న నా ఇంటర్‌కు బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుండు. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్లి పోయిండు. బ్యాంకు లోన్ కట్టలే. ఇంటర్ పూర్తయ్యాక బీటెక్ చదివా. ఏడాదికి ఫీజు రూ.40 వేలు. ఇప్పుడు బ్యాంకు లోను, ఫీజు అన్నీ కలిసి, రూ.3 లక్షలకు చేరాయి. ఈ పైసలు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని చెబుతుండ్రు. బీటెక్ కిందటి ఏడాదే పూర్తయింది. ఉస్మానియా పీజీసెట్ రాశా. 300 ర్యాంకు వచ్చింది. సర్టిఫికేట్లు ఉంటే ఎంటెక్ మొదటి ఏడాది పూర్తయ్యేది. నాన్న వస్తడేమో, ఫీజు కట్టి సర్టిఫికేట్లు ఇప్పిస్తడేమోననే ఆశతో మళ్లీ, ఈ ఏడాది పీజీ సెట్‌కు ప్రిపేర్ అవుతున్నా. ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్ ఇప్పించినా చదువుకుంటా. - సృజన, పెద్ద కుమార్తె బువ్వపెడ్త కానీ, చదివించలేనంది నాన్న ఉన్నప్పుడు నల్లగొండలోని ఆల్ఫా స్కూల్లో చదివించిండు. 9వ తరగతిలో ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయిండు. ఎస్సెస్సీలో 9.8పాయింట్లు సాధించా. నల్లగొండలోని గౌతమ్ కళాశాల వారు ఉచితంగా కళాశాలలో సీటు ఇచ్చారు. ఎంసెట్ కోచింగ్ ఇచ్చారు. ఇంటర్లో 959మార్కులు సాధించా. బీటెక్ చదవాలనేది నా కోరిక. కానీ, ఫీజు రియింబర్స్‌మెంట్ రానందున అమ్మ బువ్వ పెడతా కానీ, అంత ఫీజు కట్టలేనంది. దీంతో డిగ్రీలో చేరా. నాన్న ఉంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదు. పెద్ద చదువులు చదివించే వారు. - శ్రీలేఖ, చిన్నకుమార్తె -
వీధిలో నుంచి విధాన సౌధకు.....
బెంగళూరు: అనాథగా పుట్టి అనాథాశ్రయంలో పెరిగి తండ్రెవరో తెలియని తనయుడిగా 14వ ఏట బయట ప్రపంచంలోకి అడుగుపెడితే ఆ బాలుడి బతుకు ఎలా ఉంటుంది? అగమ్య గోచరంగా, అంతులేని ఆవేదనాభరితంగా ఉంటుంది. అందులోనూ పెళ్లి కాకుండానే తల్లైన తల్లికి (అత్యాచారం కారణంగా) జన్మించిన రఘు లాంటి వ్యక్తికి ఇంకెలా ఉంటుంది. తనకంటూ సొంత గుర్తింపు లేకుండా అనాథాశ్రయం ఇచ్చిన పెట్టుడు పేరుతో బతకాలంటే మరీ మరీ కష్టం. ఎక్కడికెళ్లినా అవమానాలే, ఆటంకాలే ఏర్పడతాయి. సహజంగా ఇలాంటి పిల్లలు తప్పుదోవ పట్టి సమాజానికి చీడ పురుగుల్లా తయారవుతారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బల్లారి అనాథాశ్రయంలో పెరిగి సమాజంలోకి అడుగుపెట్టిన రఘు మాత్రం ఎన్నో అవమానాలు, కష్టాలకోర్చి నలుగురికి ఆదర్శంగా నిలిచాడు. పాస్‌పోర్టు కోసం రఘు ఓ రోజు పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లినప్పుడు కూడా అతనికి అవమానమే ఎదురైంది. తానెవరో నిరూపించుకోవడం, తనకంటూ ఓ గుర్తింపు కార్డును సాధించడం కష్టమైంది. పాస్‌పోర్టు దరఖాస్తులో తప్పనిసరిగా తండ్రి పేరు వెల్లడించాలంటూ పాస్‌పోర్టు సిబ్బంది చెప్పారు. తనకు తండ్రంటూ లేడని, అత్యాచారానికి గురైన యువతికి పుట్టానని ఎలా నిరూపించుకోగలడు. అందుకనే రఘు దరఖాస్తును స్వీకరించేందుకు కూడా పాస్‌పోర్ట్ కార్యాలయం సిబ్బంది నిరాకరించింది. అసలు పాస్‌పోర్టు చట్టంలో తండ్రి పేరు తప్పనిసరా అన్న నిబంధన ఉందా? అన్న విషయాన్ని ఆయన శోధించాడు. దరఖాస్తు దారుడి నుంచి తండ్రి పేరును ఇన్సిస్ట్ చేయరాదన్న క్లాజ్‌ను వెతికి పట్టుకొని మళ్లీ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లాడు. చట్టం గురించి వివరించాడు. అయినా వారు పట్టించుకోలేదు. ఉన్నతాధికారిని కలిసేందుకు కూడా అంగీకరించలేదు. చివరకు ఓ రోజు కార్యాలయం మూతపడే సమయం వరకూ ఉండి ఉన్నతాధికారిని కలుసుకొని పాస్ పోర్టును సాధించాడు. ఈ నేపథ్యంలో తానెవరో, తన తల్లి ఎక్కడ ఉంటుందో, తన మూలాలను తెలుసుకోవాలనుకున్నాడు రఘు. తండ్రి గురించి తెలియలేదుగానీ ప్రభుత్వ మహిళా సంక్షేమ ఆశ్రమంలో తన తల్లి ఉంటున్న విషయాన్ని కనుగొన్నాడు. పిచ్చిదానిగా మారిన తన తల్లికి చెవుడు, మూగ అని తెలిసి, కళ్లు కూడా సరిగ్గా కనిపించవని గ్రహించి తల్లడిల్లాడు. తాను బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజులు గుర్తొచ్చాయి. రైలంటే ఎలా ఉంటుందో, రైల్వే స్టేషన్ ఎక్కడుంటుందో కూడా తెలియకుండా 14 ఏళ్ల వరకు పిల్లల అనాధాశ్రయంలోని నాలుగు గోడల మధ్య పెరిగిన రఘుకు బయటకు వచ్చాక తొలి ఆశ్రయం రైల్వే స్టేషనే అయింది. అక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ బతికాడు. కొంతకాలానికి మైసూరుకు వెళ్లి అక్కడ మార్కెట్లో పని చేశాడు. తనలాంటి అనాథలను ఆదుకోవాలని, వారికో ఆశ్రయం కల్పించాలని నిశ్చయానికి వచ్చాడు. అందుకోసం రేయింబవళ్లు పని చేశాడు. దాదాపు నాలుగు లక్షల రూపాయలు కూడబెట్టాడు. అతని మిత్రుడు... రఘును మోసం చేసి ఆ మొత్తం సొమ్మును ఎత్తుకు పోయాడు. ఇక అక్కడ పని చేయాలనిపించక బెంగళూరుకు వెళ్లి ఏదో ఒక పని చేయాలనుకున్నాడు. ప్రయాణంలో ఆరోగ్యం క్షీణించింది. దాంతో మళ్లీ మైసూరునే ఆశ్రయించాడు. దొరికిన ఉద్యోగం చేస్తూ ప్రైవేట్‌గా డిగ్రీ చదవుతున్నాడు. ఆరోగ్యం క్షీణించి హృద్రోగ సమస్యలు కూడా వచ్చాయి. గత జనవరి నెలలో రఘు గురించి స్థానిక మీడియా వార్తా కథనం రాయడంతో దాన్ని చదవిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్పందించారు. రఘును పిలిచి తనవద్ద గుమస్తా ఉద్యోగం ఇచ్చారు. ఇంతకాలానికి రఘుకు స్థిరమైన ఉద్యోగం వచ్చింది. ఇక చదువుకు ఎలాంటి ఆటంకం ఏర్పడదని, శ్రద్ధగా చదువుకుంటానని చెబుతున్నాడు. ఇప్పటికీ సరైన గుర్తింపు లేని తనకు ఎస్సీ లేదా ఎస్టీగా గుర్తిస్తే సివిల్స్‌కు కూడా ప్రిపేర్ అవుతానని చెబుతున్నాడు. -
అనాధ యువతిని రక్షించిన రైల్వే శాఖ
ఇండియన్ రైల్వే కొన్నాళ్లుగా ప్రయాణీకుల సేవే లక్ష్యంగా పనిచేస్తోంది. సౌకర్యవంతమైన ప్రయాణాలకోసం అన్ని వసతులు కల్పిస్తోంది. వైద్యం నుంచి ఆహారం వరకూ సదుపాయాలను చేకూరుస్తోంది. అంతేకాదు... సామాజిక మాధ్యమాలు, మెయిల్స్ ద్వారా ప్రయాణీకులకు తక్షణ సహాయం అందిస్తోంది. తాజాగా రైల్వే విజిలెన్స్ అధికారులు ... హ్యూమన్ ట్రాఫికర్ల బారిన పడిన ఓ అనాధ యువతిని రక్షించారు. అయితే దేశంలో భారీగా సాగుతున్నమహిళల అక్రమ రవాణాకు ఇది నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ ప్రయాణిస్తున్న 19 ఏళ్ళ రాధా లోహర్... అపాయంలో చిక్కుకుంది. అయితే ఆమె పరిస్థితిపై ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఇతరులకు మాత్రం అనుమానం కలగలేదు. ఆమె కష్టాల్లో ఉందన్న విషయం ఏమాత్రం గ్రహించలేకపోయారు. ఇక లాభం లేదనుకున్నరాధా... తన వివరాలను ఓ కాగితం పై రాసి తోటి ప్రయాణీకులకు అందించింది. పదోతరగతి చదువుతున్నరాధా లోహర్... తానో అనాధ బాలికనని, తనతో ఉన్న ఇద్దరు పురుషులూ తనను బలవంతంగా ఢిల్లీ తరలిస్తున్నారని పేర్కొంది. తనను ఈ కష్టంనుంచి గట్టెక్కించమని కోరింది. రాధా పరిస్థితిని తెలుసుకున్న తోటి ప్రయాణీకులు వెంటనే ఈ సమాచారాన్ని రైల్వే మంత్రిత్వ శాఖకు ట్వీట్ చేశారు. తక్షణమే స్పందించిన ఢిల్లీ అధికారులు సికింద్రాబాద్ లోని అధికారులకు సమాచారం అందించారు. దక్షిణమధ్య రైల్వే ఛీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్... రాధా ప్రయాణిస్తున్న రైలు... రామగుండం స్టేషన్ కు చేరేసరికి ప్రొటెక్షన్ ఫోర్స్ ను బాధితురాలున్న కోచ్ కు పంపించారు. సమాచారాన్ని ధృవీకరించిన అధికారులు ఆమెను దుండగుల బారినుంచి రక్షించి, ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైల్వే వెబ్ సైట్ లోని ఓ నివేదిక ప్రకారం ప్రశ్చిమ బెంగాల్ లోని అలీపూర్‌ద్వార్ జంక్షన్ నివాసి అయిన రాధా... ఢిల్లీకి చెందిన కె.టి. ఎంటర్ ప్రైజెస్ లో పని చేస్తోంది. అయితే ఆమె ఇంటికి వెళితే తిరిగి తమ కంపెనీలో పనికోసం రాదని గ్రహించిన దుండగులు హైదరాబాద్ వస్తున్న రాధాను బలవంతంగా ఢిల్లీ ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు రైల్వే అధికారుల చొరవకు తోడు ఓ ట్వీట్ రాధాను రక్షించగల్గింది. -
అయ్యోపాపం అనాథ
మెదక్ జిల్లా : తల్లి ప్రేమకు పదేళ్ల క్రితమే దూరమయ్యాడు. తండ్రిని మేనమామ హత్య చేశాడు. తండ్రిని చంపిన కేసులో మేనమామ జైలుకు వెళ్లాడు. పోషణ చూసే అమ్మమ్మ నెలరోజుల క్రితమే చనిపోయింది. నా అనేవాళ్లు లేని ఓ అనాథ దీన గాథ ఇది. వివరాల్లోకి వెళితే..18 ఏళ్ల క్రితం రాయికోడ్ మండలం తుమ్నూర్ గ్రామానికి చెందిన నాగయ్య రేగోడ్ మండలం గజ్వాడ గ్రామానికి చెందిన యాదమ్మను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. ఆ దంపతుల కుమారుడు కృష్ణ గజ్వాడ గ్రామంలో 10వతరగతి చదువుతున్నాడు. ఆ బాలుని తల్లి పదేళ్ల క్రితమే చనిపోయింది. ఈ నెల 6వ తేదీన ఇంట్లో నిద్రలో ఉన్న బాలుడి తండ్రి నాగయ్యను ఆయన బావమరిది శంకరయ్య హత్య చేశాడు. ఆ హత్య కేసులో బాలుడు మేన మామ జైలుకు వెళ్లాడు. నెల రోజుల క్రితం అమ్మమ్మ కూడా మృతి చెందింది. దీంతో ఆ బాలుడు అనాథగా మారాడు. అనాధగా మిగిలిన కృషను చూసిన గ్రామస్తులు అయ్యోపాపం అంటున్నారు. తండ్రి హత్యానంతరం గ్రామ మాజీ సర్పంచ్ బేతమ్మ దుర్గయ్య దంపతులు కృష్ణను చేరదీసి సుమారు ఇరవై రోజులుగా భోజనం పెడుతున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కృష్ణ చదువుతున్నా తల్లిదండ్రులు లేరనే బెంగతో సరిగా చదువుకోవడం లేదు. మనసున్న మా రాజులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు ఈ ఆనాధ బాలుడిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరతున్నారు. -
చివరికి అనాథను చేశారు!
అభం శుభం తెలియని ఆ పాపను విధి వంచించింది. చిన్న వయసులోనే తనను కన్న తల్లిదండ్రులు కన్నుమూశారు. అల్లారు ముద్దుగా పెంచేవారు దూరమయ్యారనే బాధతో ఉన్న ఆ బాలికను నేనున్నానంటూ చిన్నాన్నా చేరదీశాడు. 12ఏళ్ల వరకు పెంచి పోషించారు. చదివించారు కూడా. కానీ నా అన్నవారు, చేరదీసిన వారు ప్రస్తుతం తమకు ఆర్థిక స్థోమత లేదని, పెంచి పోషించలేమంటూ దూరం చేసి చివరకు బాలికను అనాథను చేశారు. సోమవారం ఆ బాలికను వెంట తీసుకువచ్చి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించి వెల్లిపోయారు. తల్లి దండ్రులు లేని సమయంలో ఆదుకున్న వారు కూడా తనను ఇలా దూరం చేశారని పుట్టెడు దు:ఖంతో బాల సదనంలో చేరింది. ఇది చూసిన అధికారులు ఇంతటి కష్టం ఇంకెవ్వరికి ఇవ్వకు దేవుడా అంటూ వేడుకున్నారు. * 12 ఏళ్ల బాలిక ఐసీడీఎస్ అధికారులకు అప్పగింత * తల్లి దండ్రులు చనిపోవడంతో చిన్నాన్న వద్దే ఉండిపోయిన బాలిక * ప్రస్తుతం పెంచి పోషించే స్థోమత లేదని దూరం చేసుకున్న కుటుంబసభ్యులు ఇందూరు: ఆ బాలిక పేరు శ్రుతి. వర్ని మండల కేంద్రం వడ్డెపల్లికి చెందిన తన తల్లిదండ్రులు తన చిన్న తనంలోనే ప్రమాదవశాత్తు మరణించారు. ఒంటరిగా ఉన్న బాలికను తన చిన్నాన్నా చేరదీసి పెంచి పోషించాడు. తన సొంత కూతురు మాదిరిగా చూసుకున్నాడు. ఊళ్లోనే ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివించాడు. కానీ చిన్నాన్నా కుటుంబానికి రానురాను ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో తన కుటుంబాన్నే నడిపించడం కష్టంగా మారింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చేరదీసిన బాలికను దూరం చేసుకోలేక తప్పలేదు. తెలిసిన వారికి దత్తతన్వికుండా ఐసీడీఎస్ అధికారులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వెల్లిన అధికారులు బాలికకు, చిన్నాన్నాకు కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామ పెద్దలతో,సర్పంచుతో మాట్లాడారు. బాలికను అప్పగిస్తున్నామని అంగీకారం తెలుపుతూ బాండ్ పేపర్‌పై చిన్నాన్నా, వారి కుటుంబ సభ్యుల, గ్రామ పెద్దల సంతకాలు తీసుకున్నారు. అయితే బాలికను తీసుకుని సోమవారం రోజు ఐసీడీఎస్ కార్యాలయాని రావాలని సూచించారు. బాలికతో వచ్చిన చిన్నాన్నా ఐసీడీఎస్ అధికారులకు బాలికను అప్పగించి వెళ్లాడు. స్వాధీనం చేసుకున్న అధికారులు సీడబ్ల్యూసీ కమిటీ ముందు బాలికను హాజరు పరిచి వసతికల్పన కోసం బాల సదనంకు తరలించారు. బాలికకు ఉచిత వసతితో పాటు విద్యను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే తల్లి దండ్రులు చనిపోయారనే ఒక బాధ, ఆర్థిక స్థోమత లేక చిన్నాన్నా వాళ్లు కూడా చివరకు అనాథను చేశారనే మరో బాధతో సదరు బాలిక పట్టరాని దు:ఖంతో ఏడ్చింది. పాపం ఇన్ని రోజులు అందరితో కలిసిమెలిసి ఉండి నేడు అనాథలుండే భవనంలో ఒకరిగా చేరింది. ఊహ తెలిసిసోచ్చిన వయసులో బాలికకు నా అన్న వారు కూడా లేరంటే పాపం ఎంతగా బాధపడిందో చెప్పనక్కర్లేదు. -
ఆస్తి పంచి అనాథ అయ్యూడు
అతనికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఉన్న ఆస్తిలో కొంత భాగాన్ని నలుగురు కుమారులకు సమానంగా పంచాడు. మరికొంత భూమిని తనపేరుపై ఉంచుకున్నాడు. అందరికీ పెళ్లిళ్లు చేసి సాగనంపాడు. ఈ క్రమంలో అనుకోని ప్రమాదం అతన్ని అవిటివాడ్ని చేసింది. కూలిపనులు చేసుకోలేక.. కన్నకొడుకులు ఆదరించక ఓ తండ్రి అనాథగా జీవిస్తున్న ఘటన మండలంలోని వడ్డివానికొత్తూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. శాంతిపురం, న్యూస్‌లైన్ : మండల పరిధిలోని వడ్డివానికొత్తూరుకు చెందిన తెల్లప్ప(74)కు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లు చేశాడు. తన కొడుకులు జయప్ప, నారాయణప్ప, శంకరప్ప వడ్డివానికొత్తూరులో నివాసముంటున్నారు. రామకృష్ణ బెంగళూరులో స్థిరపడ్డాడు. తెల్లప్ప భార్య మునివెంకటమ్మ 18 సంవత్సరాల క్రితం మృతిచెందింది. తనకున్న 5 ఎకరాల 40 సెంట్ల భూమిని నలుగురు కుమారులకు నాలుగు ఎకరాలు చొప్పున రాసిచ్చాడు. మిగిలిన 1.4 ఎకరాలను తన పేరుమీదనే ఉంచుకున్నాడు. కాలూచేయి ఆడేవరకు ఒకరిపై ఆధారపడకూడదని నిశ్చయించుకున్నాడు. సమీపంలోని సోగడబళ్ల, చెంగుబళ్ల గ్రామాల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలప్పుడు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో రెండు కాళ్లూ దెబ్బతిన్నాయి. స్థానికుల సహాయంతో స్వగ్రామానికి చేరుకున్నాడు. కన్నకొడుకులు ఆదరించలేదు. దీంతో స్థానికంగా ఉన్న బస్ షెల్టర్‌లో కాలం వెళ్లదీస్తున్నాడు. తన కొడుకులు, గ్రామస్తులు అప్పుడప్పుడూ తెచ్చిపెట్టే తిండి కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు ఆస్తి పంచుకుని అనాథను చేశారని కన్నీటిపర్యంతమవుతున్నాడు. కొడుకులు ఆదరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.