
అనాథలా... జీవచ్ఛవంలా..
ధర్మవరం అర్బన్ : ఇక్కడ అనాథలా.. జీవచ్ఛవంలా పడుకున్న ఈమెకు పాతికేళ్లు ఉంటాయి. ఈమె ఎవరో తెలియదు.. ఎందుకు ఇక్కడికి వచ్చిందో చెప్పలేదు. మతి స్థిమితం లేదా.. లేక ఇల్లు వదిలి వచ్చిందో తెలియదు. వారం రోజుల నుంచి ఇదే చోటే రోడ్డుపక్కన నేలపై నిస్సహాయురాలుగా పడుకుంది. ఆమె వద్దకు నా అన్నవారు రాలేదు. ఎవరైనా తిండి పెడితే కాస్తంత తినడం..లేదంటే దుప్పటి కప్పుకొని పడుకోవడం..చేస్తోంది. ఈమెను ‘సాక్షి’ పలకరించగా తన పేరు ‘అరుణ’ అని.. తన తల్లిదండ్రులు నాగరాజు, వెంకటలక్ష్మమ్మ ’ అని మాత్రమే చెప్తోంది.
తండ్రి అనంతపురంలో ఐస్‌క్రీంలు అమ్ముతాడని, ధర్మవరంలో తన అక్కలు ఉన్నారని, వారింటికి వచ్చినానని ఒక్కోసారి చెప్తోంది. వాళ్లింటికి ఎందుకు వెళ్లలేదని ఎవరైనా అడిగితే రేపు పోతాలే అంటోంది. ఇంటి నుంచి తప్పిపోయి వచ్చేశావా? అని అడిగితే ‘తెలియదు’ అని అంటోంది. ఈమెను బంధువులు తీసుకెళ్లాలని, లేదంటే స్వచ్ఛంద సంస్థలు తీసుకెళ్లి ఆశ్రయం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.