కాకినాడ క్రైం: ప్రాణప్రదంగా చూసుకునే ఇద్దరు బిడ్డల్నీ వదిలేసి రోడ్డు పాలైన ఓ తల్లి తిరిగి వారి చెంతకు చేరింది. భర్త వదిలేశాడనే వేదన తాళలేక మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళను దిశ వన్‌స్టాప్ సెంటర్ అక్కున చేర్చుకుంది. రాష్ట్రాలు దాటి వచ్చి అనాథలా రోడ్లు పట్టిన ఆ తల్లిని తిరిగి బిడ్డల చెంతకు చేర్చింది. వివరాలివీ.. సుమారు నెల రోజులక్రితం ఓ రోజు అర్ధరాత్రి కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా కూర్చున్న ఓ అనాథ మహిళ వెంట ఇద్దరు వ్యక్తులు పడ్డారు. వారినుంచి తప్పించుకున్న ఆమె సహాయం కోసం రైల్వే సిబ్బంది క్యాబిన్ తలుపులు కొట్టింది.
సిబ్బంది బయటకు రావడంతో ఆ దుండగులిద్దరూ పరారయ్యారు. రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ ఏవీకే సంతోష్ ఆ మహిళ దుస్థితిని గమనించి, మతిస్థిమితం కోల్పోయిందని నిర్ధారించారు. ఆమె పరిస్థితిని జిల్లా మహిళా, శిశు సాధికార అధికారి ప్రవీణకు వివరించి సహాయం కోరారు. తక్షణమే స్పందించిన ఆమె దిశ వన్‌స్టాప్ సెంటర్ అడ్మిన్ కె.శైలజకు తగిన ఆదేశాలిచ్చారు. శైలజ బాధిత మహిళను కాకినాడ జీజీహెచ్‌లోని దిశ వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించారు.
నెల రోజులపాటు సపర్యలు చేసి ఆమె వివరాలు రాబట్టారు. ఆమె పేరు ప్రియాంక షైనీ అని, ఊరు గోరఖ్‌పూర్ అని గుర్తించారు. దీంతో ఆమె ఫొటో సర్క్యులేట్ చేసి... ఆ మహిళ బంధువుల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. 2021 నవంబర్ 2వ తేదీన ఆ మహిళ అదృశ్యమైనట్టు గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని నిర్ధారణ కాగా.. అక్కడి పోలీసుల ద్వారా ప్రియాంక షైనీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వీడియో కాల్‌లో ఆమెను చూసి నిర్ధారించుకుని కాకినాడ వచ్చారు.
దిశ వన్‌స్టాప్ బృందం ఏఎస్‌ఐ చంద్ర, కౌన్సిలర్ జమీమా, ఐటీ స్టాఫ్ దుర్గాదేవి సమక్షంలో ప్రియాంకను అధికారులు గురువారం ఆమె సోదరికి అప్పగించారు. ప్రియాంక సోదరి మాట్లాడుతూ తన అక్కకు 12, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారని, ఏడాదికాలంగా అమ్మ ఏదని వారు అడుగుతుంటే ఊరెళ్లిందని, త్వరలోనే వచ్చేస్తుందని అబద్ధం చెబుతూ కాలం గడిపామని భావోద్వేగానికి గురైంది.
Comments
Please login to add a commentAdd a comment