Railway staff
-
రైల్వే కొత్త యాప్.. ఎవరి కోసమంటే..?
ఇండియన్ రైల్వే ఫ్రంట్‌లైన్ భద్రతా సిబ్బంది కోసం భద్రతా శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే మొబైల్ అప్లికేషన్ 'సంరక్ష'ను ప్రారంభించింది. లక్షలాది మంది రైల్వే ఫ్రంట్‌లైన్ సిబ్బందికి క్లిష్టమైన కార్యాచరణ శిక్షణను అందించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే తెలిపింది.ఈ 'సంరక్ష' యాప్‌ను సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగపూర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రూపొందించారు. రైల్వే ఉద్యోగుల శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే సమర్థవంతమైన వ్యవస్థను అందించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఏఐ భవిష్యత్తులో సాధ్యాలతో, రైల్వే డొమైన్ పరిజ్ఞానంతో ఈ యాప్ అనుసంధానమై ఉంటుందని డీఆర్ఎం నమితా త్రిపాఠి పేర్కొన్నారు.రైల్వే రూపొందించిన ఈ యాప్ స్మార్ట్ లెర్నింగ్, ఫీడ్‌బ్యాక్ మెకానిజమ్‌లను కలిగి ఉంటుంది. ఇది మల్టీ లెవల్, రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్, పర్యవేక్షణను సాధ్యం చేస్తుంది. -
20 గంటల్లోనే రైల్వేట్రాక్ రెడీ!
సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో రైల్వే యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రమాదం జరిగిన గంట వ్యవధిలోనే సహాయక చర్యలతో పాటు పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. కేవలం 20 గంటల వ్యవధిలోనే రెండు ట్రాక్‌లలో రైళ్ల రాకపోకల్ని అధికారులు ప్రారంభించారు. వేలాది మంది రైల్వే సిబ్బంది, కార్మికుల సాయంతో అర్థరాత్రి మొదలుకుని.. సోమవారం రాత్రి వరకూ పనుల్ని నిర్వహించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వాల్తేరు రైల్వే డివిజనల్ మేనేజర్(డీఆర్ఎం) సౌరభ్ ప్రసాద్ ఘటనా స్థలికి 45 నిమిషాల్లోనే చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అప్పటికే విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు, ఏపీ పోలీసులు.. స్థానికుల సహకారంతో క్షతగాత్రుల్ని వెలికితీసి ఆస్పత్రులకు తరలించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. మరోవైపు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఏఎఫ్ బృందాలు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. అర్థరాత్రి 2.30 గంటలకల్లా.. మృతదేహాల్ని, క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించే ప్రక్రియ పూర్తి చేశారు. ఓ వైపు సహాయక చర్యలు జరుగుతుండగానే.. మరోవైపు నుంచి వాల్తేరు అధికారులు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. డీఆర్ఎం, సీనియర్ అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం విపత్తు నిర్వహణ బృందాలు, ఏజెన్సీల సమన్వయ కృషితో రెస్టొరేషన్ పనుల్ని వేగంగా పూర్తి చేశారు. దెబ్బతిన్న కోచ్‌లను తొలగించడంతో పాటు, పక్కనే ఉన్న ట్రాక్‌లలో ఉన్న గూడ్స్ ట్యాంకర్లను వేరు చేసే ప్రక్రియను తెల్లవారు జామునకల్లా పూర్తి చేశారు. భారీ క్రేన్లు.. వెయ్యి మంది కార్మికులు ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ మనోజ్ శర్మ, సీనియర్ అధికారుల బృంద పర్యవేక్షణలో ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు జోరుగా సాగాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎప్పటికప్పుడు చర్యల్ని సమీక్షించారు. రైల్వే బోర్డు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మెయిన్‌లైన్ పునరుద్ధరణ పనులపై దృష్టిసారించారు. 1000 మందికి పైగా కార్మికులు, సిబ్బంది, వివిధ విభాగాలకు చెందిన సూపర్వైజర్లు ఇందులో భాగస్వాములయ్యారు. రెండు 140 టన్నుల హెవీ డ్యూటీ క్రేన్లు, 15 ఎక్స్కవేటర్లు మిషన్ మోడ్ల ద్వారా ట్రాక్‌లను పునరుద్ధరించారు. కేవలం 19 గంటల వ్యవదిలోనే అప్ అండ్ డౌన్ ట్రాక్లని పునరుద్ధరించారు. మొదటిగా డౌన్‌లైన్‌లో మధ్యాహ్నం 2.42 గంటలకు గూడ్స్‌రైలు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తర్వాత మధ్యాహ్నం 2.55 గంటలకు అప్‌లైన్‌లో భువనేశ్వర్–బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ప్రమాద స్థలిని క్రాస్ చేసింది. మరికొన్ని మరమ్మతులు నిర్వహించి డౌన్‌లైన్‌లో రెండో ట్రైన్‌గా పూరీ–తిరుపతి–బిలాస్పూర్ రైలును అనుమతించారు. కాగా, ప్రమాదం జరిగిన మధ్యలైన్ ట్రాక్‌లోనే విశాఖపట్నం రాయగడ రైలు లోకో.. కూరుకుపోయింది. ట్రాక్‌లో లోతుగా కూరుకున్న ఇంజిన్‌ను తొలగించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఏఆర్టీ మెషీన్ తెచ్చి.. జాకీ మాదిరిగా వినియోగించారు. సోమవారం రాత్రి 11 గంటల వరకూ మూడో లైన్ పనులు కొనసాగాయి. తెగిపడిన హెచ్‌టీ లైన్ల విద్యుత్ పునరుద్ధరణ పనులూ పూర్తిచేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు ప్రమాద ఘటన విషయం తెలియడంతో ఆదివారం రాత్రి నుంచే ప్రయాణికుల బంధువులు, కుటుంబ సభ్యుల ఆందోళనతో విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకుని తమ వారి గురించి ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్‌తో పాటు డివిజన్లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల జాబితాతో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి బంధువులు, కుటుంబ సభ్యులకు వారి గురించి సమాచారం అందిస్తున్నారు. విజయవాడ డివిజన్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు.. విజయవాడ: 0866–2576924 అనకాపల్లి: 08924–221698 తుని: 08854–252172 సామర్లకోట: 0884–2327010 కాకినాడ టౌన్: 0884–2374227 రాజమండ్రి: 0883–2420541 నిడదవోలు: 0881–3223325 ఏలూరు: 0881–2232267 భీమవరం టౌన్: 0881–6230098 తెనాలి: 0864–4227600 ఒంగోలు: 0859–2280308 నెల్లూరు: 0861–2342028 గూడూరు: 9494178434 -
కదిరిలో తప్పిన రైలు ప్రమాదం
-
బిడ్డల చెంతకు చేరిన తల్లి
కాకినాడ క్రైం: ప్రాణప్రదంగా చూసుకునే ఇద్దరు బిడ్డల్నీ వదిలేసి రోడ్డు పాలైన ఓ తల్లి తిరిగి వారి చెంతకు చేరింది. భర్త వదిలేశాడనే వేదన తాళలేక మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళను దిశ వన్‌స్టాప్ సెంటర్ అక్కున చేర్చుకుంది. రాష్ట్రాలు దాటి వచ్చి అనాథలా రోడ్లు పట్టిన ఆ తల్లిని తిరిగి బిడ్డల చెంతకు చేర్చింది. వివరాలివీ.. సుమారు నెల రోజులక్రితం ఓ రోజు అర్ధరాత్రి కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్లో ఒంటరిగా కూర్చున్న ఓ అనాథ మహిళ వెంట ఇద్దరు వ్యక్తులు పడ్డారు. వారినుంచి తప్పించుకున్న ఆమె సహాయం కోసం రైల్వే సిబ్బంది క్యాబిన్ తలుపులు కొట్టింది. సిబ్బంది బయటకు రావడంతో ఆ దుండగులిద్దరూ పరారయ్యారు. రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఏవీకే సంతోష్ ఆ మహిళ దుస్థితిని గమనించి, మతిస్థిమితం కోల్పోయిందని నిర్ధారించారు. ఆమె పరిస్థితిని జిల్లా మహిళా, శిశు సాధికార అధికారి ప్రవీణకు వివరించి సహాయం కోరారు. తక్షణమే స్పందించిన ఆమె దిశ వన్‌స్టాప్ సెంటర్ అడ్మిన్ కె.శైలజకు తగిన ఆదేశాలిచ్చారు. శైలజ బాధిత మహిళను కాకినాడ జీజీహెచ్‌లోని దిశ వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించారు. నెల రోజులపాటు సపర్యలు చేసి ఆమె వివరాలు రాబట్టారు. ఆమె పేరు ప్రియాంక షైనీ అని, ఊరు గోరఖ్‌పూర్ అని గుర్తించారు. దీంతో ఆమె ఫొటో సర్క్యులేట్ చేసి... ఆ మహిళ బంధువుల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. 2021 నవంబర్ 2వ తేదీన ఆ మహిళ అదృశ్యమైనట్టు గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని నిర్ధారణ కాగా.. అక్కడి పోలీసుల ద్వారా ప్రియాంక షైనీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వీడియో కాల్లో ఆమెను చూసి నిర్ధారించుకుని కాకినాడ వచ్చారు. దిశ వన్‌స్టాప్ బృందం ఏఎస్ఐ చంద్ర, కౌన్సిలర్ జమీమా, ఐటీ స్టాఫ్ దుర్గాదేవి సమక్షంలో ప్రియాంకను అధికారులు గురువారం ఆమె సోదరికి అప్పగించారు. ప్రియాంక సోదరి మాట్లాడుతూ తన అక్కకు 12, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారని, ఏడాదికాలంగా అమ్మ ఏదని వారు అడుగుతుంటే ఊరెళ్లిందని, త్వరలోనే వచ్చేస్తుందని అబద్ధం చెబుతూ కాలం గడిపామని భావోద్వేగానికి గురైంది. -
చలో సంక్రాంతి.. కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు
-
తిరుపతి: నవజీవన్ ఎక్స్ ప్రెస్‌లో మంటలు
సాక్షి, తిరుపతి: నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. గూడూరు జంక్షన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పింది. అహ్మదాబాద్ నుండి చెన్నై వైపు వెళ్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్‌లోని పాంట్రీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సిబ్బంది.. గూడూరు రైల్వే స్టేషన్లో రైలు ఆపి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం కారణంగా.. గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్లోనే రైలు నిలిచిపోయింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న రైల్వే అధికారులు. ఘటనపై అధికారుల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. -
అతను కాస్తా.. ఆవిడగా మారడమే...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రైల్వే ఉన్నతాధికారులకు వింత అనుభవం ఎదురైంది. నివాసం మారినప్పుడు, మరేదైనా కారణాలతో కార్యాలయ రికార్డుల్లో మార్పులు చేయాలని మాత్రమే తెలిసిన వాళ్లకు.. తాజాగా జెండర్ మార్చాలని విజ్ఞప్తి వచ్చింది. అతను కాస్తా.. ఆవిడగా మారడమే దీనికి కారణం. వివరాలు.. రాజేష్ పాండే (35) తండ్రి రైల్వే ఉద్యోగి. తండ్రి 2003లో చనిపోవడంతో కారుణ్య నియామకం కింద రాజేష్ రైల్వేలో ఉద్యోగం పొందాడు. రైల్వే వర్క్ షాప్‌లో గ్రేడ్-1 టెక్నీషియన్‌గా చేరాడు. నలుగురు అక్కాచెల్లెళ్లకు ఒక్కడే సోదరుడైన రాజేష్‌కు చిన్నప్పటి నుంచి స్త్రీగా ఉండటమే ఇష్టం. దాంతో 2017లో రాజేష్ లింగమార్పిడి చేయించుకుని, సోనియా పాండేగా పేరు మార్చుకోవడం జరిగింది. అందరూ సోనియా అని పిలుస్తున్నా.. ఆఫీస్ రికార్డుల్లో మాత్రం ఇంకా రాజేష్ పాండే అనే ఉంది. దీంతో రికార్డుల్లో జెండర్ పేరు మార్చాలని గోరఖ్‌పూర్‌లోని ఈశాన్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్‌ను రాజేష్ అలియాస్ సోనియా కలిసింది. ఆ దరఖాస్తును హుండ్లీలోని రైల్వే బ్రాంచ్‌కు పంపించారు. రికార్డుల్లో పేరు, లింగం మార్చాలని కోరతూ దరఖాస్తు రావడం ఇదే మొదటిసారి అని వారు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. లింగ మార్పిడి చేసుకోవడానికి ముందే రాజేష్‌కు స్థానికంగా ఉండే ఓ యువతితో పెళ్లైంది. కానీ, అసలు విషయం బయటపడటంతో విడాకులు తప్పలేదు. భార్యకు తన శరీర స్వభావం గురించి చెప్పి విడాకులు తీసుకున్నానని, లింగ మార్పిడి అనంతరం అమ్మాయిగా జీవించడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది సోనియా పాండే. -
భారత వర్షం
మిలిటరీ సాంకేతిక నామంతో బి.ఎఫ్ 332 అని చోటు ఉంది. రోజస్తమానం అప్దైనా సరే డవున్దైనా సరే ఒక్క ట్రెయినైనా అక్కడ ఆగదు. ఒకటి ఆగుతుంది. అయితే అదొక స్పెషల్ ట్రెయిన్. అకస్మాత్తుగా ఒకరోజు తెల్లవారుజామున వచ్చి ఆగుతుంది. అది ఎప్పుడు ఎక్కడ ఆగుతుంది, ఆ సంగతి ముందుగా బిహారీ వంటవాడు భగవతిలాల్తో పాటు మాకు ఒక అయిదు మందికి మటుకు తెలుసును.స్టేషన్ లేదు, ట్రెయిన్ ఆగదు, అయినా రైల్వేసిబ్బంది ప్రతివాడి నోటిలోనూ ఒక కొత్త పేరు అల్లల్లాడుతుంది. దాన్ని మేము ‘అండా హాల్ట్’ అంటుంటాం. ‘అండా’ అంటే గుడ్డు. అండా హాల్ట్ దగ్గరగా ఉన్న కొండల కింద ‘మహాతా’ కులాల గ్రామం ఉంది. అక్కడికి దూరంగా ఉన్న భోర్కుండాలోని శనివారం సంతలో వాళ్లు కోళ్లనూ, కోడిగుడ్లను అమ్ముతూ ఉంటారు. చంకలో కోడిపుంజులు పెట్టుకొని కోడిపందాల ఆట ఆడుతుంటారు. మహాతా గ్రామస్థుల కోడిగుడ్లపై మాకేమీ ప్రత్యేకమైన మోజు లేదు. మా కాంట్రాక్టరుతో రైల్వేవాళ్లకు వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఒక ట్రాలీకి ఎర్రజెండా తగిలించి రైలు పట్టాలపై నుంచి గుంపులు గుంపులుగా కోడిగుడ్లు తీసుకువచ్చి అప్పచెపుతూ ఉంటారు. బిహారీ వంటవాడు భగవతీలాల్, వాటిని రాత్రి ఉడకబెట్టి ఉంచుతాడు. అందుమూలాన కూడా కాదు దానికి ‘అండా హాల్ట్’ అని పేరు రావడం. ఈ గుడ్లు పూర్తిగా ఉడకడం అయాక వాటి గుల్లలు బైట పారెయ్యడం వల్ల అవి పోగుపడ్డ చోట కాలక్రమాన ఒక గుల్లలకొండ లేచింది. ఇదీ అసలు కారణం. మిలిటరీ భాషలో ఉన్న బి.ఎఫ్ 332లో ఉన్న మొదటి రెండు అక్షరాలూ మాకు ఏదో సాంకేతికమైనవి కాదు. బ్రేక్‌ఫాస్టు, పదానికి ఎబ్రీవియేషను అని మేము అనుకుంటాం. రామ్‌గఢ్ ఆ రోజుల్లో యుద్ధకాలపు ఖైదీల మకాం. ఇటలీ దేశపు ఖైదీలను అక్కడ బాయొనెట్సుతోనూ, వైర్ఫెన్స్తోనూ చుట్టబెట్టి ఉంచారు. దాని మధ్య ఒక ట్రెయిన్ సామాను ఎగుమతి చేసుకొని బయలుదేరుతుంది. ఎందుకో ఎక్కడికో మాకెవరికీ తెలియదు. కంట్రాక్టరు వ్రాసిన ఉత్తరం చదివి క్రితం రోజున వచ్చిన కోడిగుడ్లు పరీక్షించి, వంట మనిషి భగవతిలాల్ అన్నాడు ‘‘330 బ్రేక్ఫాస్టులు’’. భగవతిలాల్ లెక్కపెట్టి 660 గుడ్డులూ, ఒక పాతిక రద్దుపోయేందుకు ఇవతలకు తీస్తాడు. చెడ్డవి బయటకు పారేస్తాడు. అటుపైన వాటిని నీటిలో ఉడకపెట్టి, అవి బాగా గట్టిపడ్డాక, కూలీలు, అతనూ కలిసి గుల్లలు విడదీస్తారు. వైర్ ఫెన్సింగ్‌కి బైట పారవేయబడిన ఆ గుల్లలు రోజూ ఒక స్థూపంలా తయారవుతాయి.తెల్లవారుజామున ట్రెయిన్ వచ్చి ఆగుతుంది. కంపార్ట్మెంట్లో నుంచి దిగి ట్రెయిన్ రెండుపక్కలా మిలిటరీగార్డులు వచ్చి నిలబడుతారు. రైఫిల్స్ తీసుకుని, వాళ్లు యుద్ధఖైదీలను కాపలా కాస్తారు. చారల బట్టలు కట్టుకున్న విదేశీ ఖైదీలు పింగాణి కప్పు, ఎనామెలు ప్లేటు పుచ్చుకొని గదుల్లో నుంచి బయటికి వస్తారు. ఒక్కొక్క ఖైదీకి వరుసగా బ్రేక్‌ఫాస్ట్ వడ్డిస్తారు కూలీలు. ఒకడు మగ్గులో కాఫీ పోస్తాడు. ఒకడు బ్రెడ్డూ, మరొకడు కోడిగుడ్డూ పళ్లెంలో వేస్తారు. అంతే, అంతటితో వాళ్లు వెళ్లి ట్రెయిన్ ఎక్కుతారు.ట్రెయిన్ వెళ్లిపోయాక భగవతీలాల్ ఆజమాయిషీలో అన్ని సరుకులూ గుడారంలో పెట్టి కూరలు కొనేందు కోసం కొన్ని రోజులు మేము మహాతా వాళ్ల గ్రామం వైపు వెళతాము. వైర్ ఫెన్సింగ్ మధ్య ప్రాంతాన్ని ఎత్తు చేసి ప్లాట్‌ఫారంగా తయారుచేశారు. ఖైదీల కాంపు మూసేసారు. మధ్యమధ్య ఒక మిలిటరీ స్పెషల్ ట్రెయిన్ వచ్చి ఆగుతుంది. సైనికులందరికీ గిన్నెలలో కాఫీ, ప్లేటులలో రొట్టి, కోడిగుడ్లూ యథావిధిగా పంచిపెట్టబడతాయి. దాని తర్వాత ఎవరి పెట్టెలో వాళ్లు ఎక్కుతారు. గార్డు ఈల ఊదుతాడు. నేను వెళ్లి సప్లైలు అందించే చోట మేజర్‌కి ఓకే చెప్పివస్తాను. ట్రెయిన్ వెళుతుంది. ఎక్కడికో, ఏ వైపుకో ఎవరికీ తెలియదు. ఒకరోజు అమెరికన్ సైనికుల ట్రెయిన్ వచ్చి నిలబడింది. సర్వర్లు రోటీ, కాఫీ అందించారు. సరిగ్గా అదే సమయంలో వైర్ ఫెన్సింగు అవతల సరిహద్దుపైన నా దృష్టి పడింది. ముళ్లకంచెకి కొంచెం దూరంలో ఒక చిగురు నిక్కరు కట్టుకున్న ‘మహాతా’ కుర్రవాడు కళ్లు పెద్దవి చేసుకొని చూస్తున్నాడు. నిశ్శబ్దంగా ట్రెయిన్ కేసి చూశాడు. ఈ తెల్ల అమెరికను సైనికులని చూశాడు. ఒక సోల్జరు వాణ్ణి చూసి ‘ఏయ్ ఏయ్’ అని అరుస్తూ పిలిచాడు. ఆ కుర్రవాడు వెంటనే వాళ్ల ఊరువైపు పరుగెత్తుకుంటూ పారిపోయాడు. వాణ్ణి చూసి కొందరు అమెరికన్ సైనికులు నవ్వుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఒకసారి ట్రెయిన్ రావడం చూసి ఆ ఇనుపబెల్టు పెట్టుకున్న కుర్రవాడు ఫెన్సింగ్ బైటికి వచ్చి నిలబడ్డాడు. వాడి కంటె పెద్దవాడు మరొక కుర్రవాడు కూడా ఉన్నాడు. వాడి మెడలో ఎర్రటి తాడు వేలాడదీసిన తగరపు రక్షరేకు ఉంది. భూర్కు సంతకు ఒకరోజు వెళ్లాను. అక్కడ కుప్పలు కుప్పలుగా అవి అమ్మకానికి ఉన్నాయి. ఆ బాలకులిద్దరూ మౌనంగా అమెరికన్ సైనికుల వైపు తేరిపార చూస్తున్నారు. నేను చేతిలో ఫారం పుచ్చుకొని అటూ ఇటూ తచ్చాడుతున్నాను. ఒక సైనికుడు తన కంపార్ట్మెంట్ తలుపుకి ముందుగా నిలబడి కాఫీ తాగుతూ కుర్రవాళ్లిద్దర్ని చూసి ‘ఫూల్’ అన్నాడు. మామూలుగా వాడిది వ్యవసాయపు పని. బాణం పుచ్చుకొని పిట్టలను కొట్టడం, పాటలు పాడడం, వినడం. విల్లునారిలాగ అప్పుడప్పుడు వంగుతూ సాగుతూ పొగరుబోతులా ఎదిరిస్తున్నట్లు నిలబడడం. చిరిగిన లాగు కట్టుకున్న వాడి శరీరం సన్నగా, నల్లగా ఉంటుంది. అమెరికన్ సిపాయి అన్న ‘ఎ ఫూల్’ అన్నమాట నా గుండెకు ముల్లులా గుచ్చుకుంది.ట్రెయిన్ వెళ్లిపోయింది. మళ్లీ అంతా నిర్మానుష్యం. మళ్లీ కొన్నాళ్లకు ట్రెయిన్ వచ్చింది. ఈసారి యుద్ధఖైదీల బండి. ఇటాలియన్ ఖైదీలు రామ్‌గఢ్ నుంచి మళ్లీ ఎక్కడికో పంపబడ్డారు. వాళ్ల చారల బట్టలలో దైన్యం ఉంది. ఒకడు పంచా, లాల్చి కట్టుకుని పారిపోవడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడని, బెంగాలీని కాబట్టి నాకింకా భయం వేసింది. ట్రెయిన్ వెళ్లిపోయాక– ముళ్లకంచె అవతల ఇద్దరు కుర్రవాళ్లు, బిగువు బట్టలు ధరించిన 15 సంవత్సరాల పిల్లా, ఇద్దరు పెద్ద మగవాళ్లూ పొలం పని విడిచి అక్కడకు వచ్చి నిలబడ్డారు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని, నవ్వుకుని, ఏదో జలపాతం చప్పుడయినట్లు కిలకిలలాడుతూ వాళ్ల ఊరు వైపు వెళ్లిపోయారు.ఒకరోజు వెళ్లి మహాతా వాళ్ల పెద్దను అడిగాను–వాళ్ల తాలూకు ఎవరినైనా పంపి మా క్యాంపులో కూరలు, చేపలు, రొయ్యలు... మొదలైనవి అమ్మించమని. ఆ పెద్ద నవ్వి అన్నాడు ‘‘పొలం పని విడిచి రాలేము’’ అదే క్షణంలో ట్రెయిన్ వచ్చేసింది. వెంటనే దిగారు అమెరికన్ సైనికులు–వరుసగా నిలబడ్డారు తమ కప్పులు, ప్లేట్లతో. ఆ కాలంలో కొంచెం చలి మొదలైంది. ఒక సైనికుడు యాంకీ గొంతుతో తన ముగ్ధతను వెల్లడి చేశాడు. మరొక సైనికుడు తన కంపార్ట్మెంట్ ఎదురుగా నిలబడి ముళ్ల కంచెకు అవతల ఉన్న శూన్యప్రదేశాన్ని తదేక దృష్టితో పరిశీలించాడు. అకస్మాత్తుగా అతను లాగు జేబులో చెయ్యి పెట్టాడు. పర్సులో నుంచి ఒక మెరిసే అర్ధరూపాయి బైటకు తీసి ఆ మహతా వాళ్ల వైపు విసిరాడు. వాళ్లు నిర్ఘాంతపోయి సైనికుల దిక్కుగా చూశారు. మెరిసే అర్ధరూపాయి దిక్కుగా చూశారు. తరువాత నిశ్శబ్దంగా ఉండిపోయారు.ట్రయిన్ వెళ్లిపోయాక వాళ్లు నిశ్శబ్దంగా వెళ్లిపోవడం చూసి నేను అన్నాను, ‘‘దొరగారు బహుమానం ఇచ్చారు. ఎందుకు తీసుకోరూ?’’ నేను అర్ధరూపాయి తీసి వాళ్ల పెద్ద చేతిలో పెట్టాను. అతను వెర్రి మొహం పెట్టి నాకేసి చూస్తూ అలా ఉండిపోయాడు. తర్వాత అందరూ మాట్లాడకుండా వెళ్లిపోయారు.మహతా గ్రామవాసులు నా దగ్గరకు రావడం మానేశారు. అప్పుడప్పుడు నేనే వెళ్లి అక్కడ కూరలు, చేపలు కొనుక్కొని వస్తుంటాను. వాళ్లు అమ్మేందుకు రావడం లేదు మా దగ్గరకు. మూడు క్రోసుల దూరంలో ఉన్న భూర్కుండాలోని సంతకు వెళుతున్నారు. కొన్నాళ్లు ఏ ట్రెయిన్ రాక గురించి కబురు రాలేదు. నిశ్శబ్దం నిశ్శబ్దం. అనుకోకుండా ఒకరోజున ఆ లోహపుబెల్టు పెట్టుకున్న కుర్రవాడు వచ్చి అడిగాడు:‘‘టెరియిను రాదాండి, బాబుగోరూ?’’నవ్వుతూ అన్నాను: ‘‘వస్తుంది. వస్తుంది’’తెల్లవారుజామున ఒక పాసెంజర్ తుస్సుమంటూ వెళుతుంది. సాయంత్రం డౌన్ ట్రెయిన్ ఆగదు. అయినా ఏదో సమయాన ట్రెయిన్ కిటికీలోంచి అస్పష్టంగా కనిపించే ముఖాల్ని చూడగలనేమోనని క్యాంప్లోంచి బైటకు వచ్చాను. కొత్తముఖాలు చూడక నా బెంగ ఎక్కువైపోతుంది. ఆ అమెరికన్ సైనికుల స్పెషల్ ట్రెయిన్ వస్తుందన్న వార్త విని ఎంత గాభరా పడతానో మళ్లీ అంత తృప్తి కూడా కలుగుతుంది.కొన్నాళ్ల తరువాత మిలిటరీ స్పెషల్ వచ్చింది. హఠాత్తుగా చూసేసరికి ముళ్లకంచెకు అవతల వైపు మహతా గ్రామ ప్రజలు గుంపుగా వచ్చి పడ్డారు. వాళ్లందరినీ చూసేసరికి నాకేదో భయం అనిపించింది. అమెరికన్ సైనికులు కాఫీ తాగుతూ అటూ ఇటూ తిరుగుతున్నారు. ఉండిఉండి ఒకడు తన జేబులోంచి మనీపర్సు తీసి, అందులో నుంచి రెండురూపాయల కాగితంలాగి భగవతిలాల్ని అడిగాడు ‘‘దీనికి చిల్లర ఉందా?’’అణాలు,బేడాలు, పావలాలు కలిపి భగవతిలాల్ చిల్లర ఇచ్చాడు. చిల్లరను ఆ అమెరికన్ సైనికుడు మహాతా గ్రామస్థుల గుంపులోకి విసిరేశాడు. నా సఫ్లై ఫారంని ఓకే చేసి, గార్డు ఈల ఊదాడు. ట్రెయిన్ కదలడం మొదలు పెట్టిందనేసరికి, నేను మహతా జనం వైపు చూశాను. వాళ్లు అలా చూస్తూనే నిలబడిపోయారు. బెల్టు కట్టుకున్న వాడూ, వాడి స్నేహితుడు మెళ్లో తావీజు కట్టుకున్నవాడూ ఆ చిల్లర డబ్బులను పోగు చేయడానికి ప్రయత్నించారు. మహతా పెద్ద వాళ్లని తిడుతూ ‘ఖబడ్దార్’ అన్నాడు. కాని ఆ కుర్రవాళ్లు అతని మాటలు వినలేదు. వాళ్లు దొరికినంత మట్టుకు అణాలు బేడలు పోగు చేసి తీసుకున్నారు. మహతా పెద్ద కోపంతో గిజగిజలాడుతూ తను ఒక్కడూ స్వగ్రామం వైపు బయలుదేరాడు. ఆడవాళ్లూ, మగవాళ్లూ కూడా నవ్వుకుంటూ వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లాక మళ్లీ ‘అండా హాల్ట్’ నిర్మానుష్యం అయిపోయింది. దూరాన కొండలూ, ‘మహతా’ పళ్లతోట, కూరల తోట దాటాక ఒక చిన్న జలధార, దాని తర్వాత మహతా వాళ్ల ఆకుపచ్చని పొలాలు. కళ్లు చల్లబడి హాయి అనిపిస్తుంది.మధ్యమధ్యన అమెరికను సోల్జర్ల ట్రెయిన్ రావడం, ఆగడం, వాళ్లు గుడ్లు, రొట్టె, కాఫీ సేవించి వెళ్లిపోవడం, మహతా గ్రామజనం గుంపులుగా రావడం, ముళ్ల కంచెకు అవతల నిలబడి తేరిపారచూడడం..‘‘దొరగారూ, బహుమతి! దొరగారూ! బహుమతి!’’ఒక్కసారి అనేకమంది పల్లెజనం అరిచారు. ఒకరోజున కూరగాయలు కొనేందుకు నేను వెళ్లినప్పుడు ఆ పిల్ల అడిగింది: ‘‘టెరియిను ఎప్పుడొస్తుంది?’’ఒక్కొక్క రోజున వీళ్లందరూ చాలాసేపు ఎదురుచూసి, చూసి వెళ్లిపోయేవారు. భుజానికి 3 చారలు గల చొక్కా తొడుక్కున్న అమెరికన్ ఒకడు వాళ్లను చూడగానే జేబులోంచి గుప్పిళ్లతోటి అణాలూ, బేడాలుతీసివాళ్ల వైపు విసిరేవాడు. వాళ్లు ఆ డబ్బుల మీద పడిపోయేవారు పోగు చేసుకుందుకు.ట్రెయిన్ వెళ్లాక వాళ్లని సావధానంగా పరీక్షించి చూశాను. మహతా గ్రామంలోని సగం మంది వచ్చి పడ్డారనిపించింది. అందరికీ ఏదో కొంత డబ్బు దొరికే సరికి వాళ్ల ముఖంలో ఆనందరేఖలు వెలిగేవి.వంటవాడు భగతిలాల్, ముగ్గురు సర్వర్లూ, నేనూ మేము ఐదుగురం ఎలాగోలాగా క్యాంపులో రోజు వెళ్లబుచ్చేవాళ్లం. మధ్య మధ్య ఒక్కొక్క రోజున సైనికుల ట్రెయిన్ వచ్చేది, ఆగేది, వెళ్లేది. మహతా›గ్రామ గుంపు ‘‘సాబ్, బక్షీస్! బక్షీస్’’ అని చేతులు జాపి అరిచేది.ఒకరోజున మహతా వాళ్ల పెద్దను చూడడం తటస్థించింది. ఒకరోజు పొలం పని ఆపు చేసి, చేతుల్లోని దుమ్ము దులుపుకుంటూ కంగారుగా వచ్చి వాళ్లందరిని కోపపడి దూషించాడు. అతని మాట ఎవరూపట్టించుకోక పోవడం వల్ల నిస్సహాయుడై వాళ్ల పనిని అడ్డగిస్తున్నట్లు కంటి చూపును ప్రకటిస్తూ వాళ్లని చూస్తున్నాడు. కానీ వెనుకకు తిరిగి అతని మాట ఎవరూ వినడం లేదు. సైనికులు నవ్వుకుంటూ పాంటు జేబులోంచి గుప్పిట్లతో చిల్లర తీసి వాళ్ల వైపు విసురుతున్నారు. డబ్బులేరుకోవడంలో ఒకరినొకరు తోసుకుంటూ పోవడంలో వాళ్లలో వాళ్లకు దెబ్బలాటలు బయలుదేరాయి. అది చూసి సైనికులు నవ్వుతున్నారు.తాళ్లజోడు కట్టుకున్న వృద్ధుడు రావడం మానేశాడు. అతను జనంపై కోపగించడం, అతనింక రాకపోవడం– ఇదంతా నాకు ఒక విధంగా గర్వకారణమైంది. ఒక్కొక్కప్పుడు ఈ పల్లెటూరి జనం వ్యవహారం చూస్తే, నాకూ, భగవతిలాల్కు చాలా చిరాకు కలిగేది. వాళ్ల నల్లదన దరిద్రవేషం చూసి సైనికులు వాళ్లను ముష్టివాళ్లలా పరిగణిస్తున్నారు. ఆ సంగతి మాకు చాలా ఏవగింపు కలిగించింది.ఒకరోజున ముళ్లకంచె అవతల వైపు నుంచి ఆ జనం ‘బక్షీస్, బక్షీస్’ అని అరవడం విని– ఓ ప్రక్కన గార్డు జానకినాథతో మాట్లాడుతుండగా– మా పక్కన ఉన్న ఒక ఆఫీసరు వాళ్ల కేకల వల్ల విసుగుపుట్టిన వాడై వాళ్లని ఉద్దేశించి అన్నాడు: ‘‘బ్లడీ బెగ్గర్స్!’’. నేనూ, భగవతిలాల్ ఒకరి ముఖంలోకి మరొకరం చూసుకున్నాం. అవమానంతో మా ముఖాలు నల్లబడ్డాయి. భరించలేని కోపం.నా కోపం అంతా మహతా పల్లెజనంపై పడింది. ట్రెయిన్ వెళ్లగానే, భగవతిలాల్ని కూడా తీసుకువెళ్లి వాళ్లకి బుద్ధి చెపుదామని వెళ్లేసరికి, వాళ్లందరూ డబ్బులు పోగు చేసుకొని బట్టల్లో మూటకట్టుకుని నవ్వుకుంటూ పారిపోయారు. అయినా వాళ్ల గురించి నాకు కలిగిన అవమానాన్ని నా అహంకారంలో దాచి ఉంచుకున్నాను. భూర్కుండా కాంట్రాక్టర్ల నుంచి క్యాంపు మూసేయమని తీసుకు వచ్చాను, వాళ్లను కలుసుకునేందుకు వెళ్లినప్పుడు. ‘అండాహాల్ట్’ ఫెన్సింగు అవతల డ్రమ్ముల మీద ఒక్కతాపు గట్టిగా తన్ని భగవతిలాల్ అన్నాడు: ‘‘ఆట అయిపోయింది’’ఏదో గందరగోళం, గొడవ వినబడగా వెనక్కి తిరిగి చూసేసరికి మహతా గ్రామవాసులు పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఎందుకో ఏమో భగవతిలాల్ నవ్వడం మొదలు పెట్టాడు. వాళ్లందరూ ముళ్ల కంచెకి అవతల గుంపుగా నిలబడ్డారు. అదే సమయంలో ట్రెయిన్ వస్తున్న శబ్దం కూడా అయింది. వెనక్కి తిరిగి చూస్తే ట్రెయిన్ వంపు తిరిగి ‘అండాహాల్ట్’ వైపే వస్తోంది. కిటికీలలో ఖాకీ దుస్తులు కనిపిస్తున్నాయి. మేము గాభరా పడిపోయాం. అయితే భూర్కుండా వాళ్ల ఆఫీసు నుంచి పొరపాటు వార్త అందిందా? లేదే, నేనే వెళ్లి ఆ కబురు తీసుకువచ్చాను కదా!ట్రెయిను కొంచెం దగ్గరగా వచ్చేసరికి, ట్రెయిన్లో సైనికులందరూ గొంతు కలిపి నిండు గొంతుతో పాటలు పాడుతున్నట్లు స్పష్టమయింది. విభ్రాంతుడనై నేను ఒకసారి ట్రెయిన్ వైపు చూశాను. అలాగే ఒకసారి ముళ్లకంప వైపున ఆ గుంపు వైపు చూశాను. అదే సమయంలో నా కంటికి ఆ మహతా గ్రామపు పెద్ద కనిపించాడు. మిగతా గుంపుతో కూడా ఆ వృద్ధుడు కూడా ‘బక్షీస్, బక్షీస్’’ అని అరుస్తున్నాడు. వాళ్లందరూ ముష్టి వాళ్లలా అరుస్తున్నారు. అయితే మిగతా రోజుల్లా ఆ అమెరికన్ సైనికులు ఈసారి ‘అండాహాల్ట్’లో ఆగలేదు. పాసెంజర్ ట్రెయిన్లాగే ఈ స్పెషల్ ట్రెయిన్ కూడా ‘అండాహాల్డ్’ను నిర్లక్ష్యం చేసి తుస్సుమంటూ వెళ్లిపోయింది.ట్రెయిన్ ఇంకెప్పుడూ ఇక్కడ ఆగదని మాకు తెలిసింది. ట్రెయిన్ వెళ్లిపోయింది. కాని మహతా గ్రామస్థులందరు మటుకు ముష్టివాళ్లలా తయారై కూర్చున్నారు. పొలాల్లో వ్యవసాయం చేసుకునే మనుషులందరూ ముష్టి వాళ్లైపోయారు. బెంగాలీ మూలం : రమాపద్ చౌధురీ తెలుగు: రాధాకృష్ణమూర్తి చల్లా -
భీమవరం యువతి.. 12 గంటల నరకం
సాక్షి, భీమవరం: కదులుతున్న రైలులో నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి, 12 గంటలపాటు నరకయాతన అనుభవించిన యువతిని కాపాడిన రైల్వే సిబ్బందిపై ప్రశంసలు కురుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. భీమవరంలోని శ్రీరామపురానికి చెందిన రాజేశ్వరి(21) బీఈడీ చదువుతోంది. పని నిమిత్తం గురువారం విజయవాడకు వచ్చిన ఆమె సాయంత్రం పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో భీమవరానికి తిరుగు ప్రయాణమైంది. రైలు ఆకివీడు గుమ్ములూరు స్టేషన్‌కు సమీపం ప్రయాణిస్తున్నప్పుడు.. ప్రమాదవశాత్తూ కిందపడిపోయింది. ట్రాక్ పక్కన బురదగుంటలో పడటంతో అదృష్టవశాత్తూ ప్రాణాలు దక్కినా.. షాక్‌కు గురై, గాయాలతో పైకి లేవలేకపోయింది. అలా సుమారు 12 గంటలు నరకయాతన అనుభవించింది. శుక్రవారం ఉదయం అటుగా వచ్చిన కీ మ్యాన్ ఒకరు ఆమెను గుర్తించారు. వెంటనే సమీపంలో పనిచేస్తోన్న ట్రాక్మన్లను పిలిపించాడు. అందరూ కలిసి యువతిని బయటికి తీసి, బురదను శుభ్రంచేసి, కాసిన్ని నీళ్లు తాగించిన అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి భీమవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మానవత్వాన్ని చూపించిన సిబ్బంది.. యాక్టింగ్ కీ మ్యాన్ గోపాల కృష్ణ, ట్రాక్ మ్యాన్లు మహేశ్, మణికుమార్, కనకేశ్వర్‌రావు, ఎం.రాంబాబులను ఉన్నతాధికారులు, పౌరసమాజం, నెటిజన్లు అభినందిస్తున్నారు. -
డ్యూటీలో ఉన్నప్పుడు వాట్సాప్ వాడారో అంతే..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాణికుల భద్రత నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. మెసేజింగ్ యాప్‌లో ఫుల్‌గా పాపులారిటీ సంపాదించుకున్న యాప్ వాట్సాప్‌ను, డ్యూటీలో ఉన్న సమయంలో వాడకూడదంటూ ఆపరేషనల్ స్టాఫ్‌ను రైల్వే ఆదేశించింది. ఈ మెసేజింగ్ యాప్ పనిప్రదేశంలో ఎక్కువ ఆటంకం కలిగిస్తుందని గుర్తించిన రైల్వే అధికారులు, తమ స్టాఫ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పని సయమాల్లో ఈ యాప్‌ను వాడకూడదంటూ సూచనలు పంపించారు. ఢిల్లీ డివిజన్‌కు చెందిన మొత్తం స్టాఫ్‌కు ఈ సర్క్యూలర్ జారీఅయింది. వీరిలో డ్రైవర్లు, గార్డులు, టీటీఈలు, ఇతర స్టేషన్ మేనేజర్లున్నారు. ఎవరైనా తమ సూచనలను అతిక్రమిస్తే, వారిపై కఠిన చర్యలుంటాయని రైల్వే అధికారులు హెచ్చరించారు. రైల్వే, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని డివిజన్లకు ఈ ఆదేశాలు జారీచేసినట్టు సీనియర్ రైల్వే అధికారి పేర్కొన్నారు. సేఫ్టీ డిపార్ట్మెంట్, ఆపరేషనల్ డిపార్ట్మెంట్లకు చెందిన కొందరు ఉద్యోగులు పనిప్రదేశాల్లో వాట్సాప్, యూట్యూబ్ ఎక్కువగా వాడుతున్నారని గుర్తించామని చెప్పారు. ప్రయాణికుల భద్రతను పన్నంగా పెట్టి వీటిని ఎక్కువగా వాడటం అతిపెద్ద సమస్యలకు దారితీస్తుందన్నారు. ఇటీవల రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో రైల్వే అధికారులు ఈ కీలక ఆదేశాలు జారీచేశారు. ప్రమాదాలను నిర్మూలించడానికి, రైలు ప్రయాణాన్ని సురక్షితవంతం చేయడానికి అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వాని లోహని కూడా చెప్పారు. స్టేషన్ మేనేజర్లు, సూపరిటెండెంట్లు డ్యూటీలో ఉన్నప్పుడు స్టేషన్లో వాట్సాప్ వాడటానికి వీలులేదంటూ కఠిన ఆదేశాలు జారీ చేశారు. వరుస రైలు ప్రమాదాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా రైల్వే సంబంధిత సమస్యలన్నింటిన్నీ పరిష్కరించాలని అధికారులకు డెడ్‌లైన్ విధించారు. -
సెల్ఫీ సరదా.. ఎంత పని చేసింది!
ఆయిల్ ట్యాంకర్‌పైకి ఎక్కి ఫొటో తీయించుకోబోయి విద్యుత్ షాక్‌కు గురైన వైనం తీవ్రగాయాల పాలైన గీతం వర్సిటీ విద్యార్థి అరకులోయ: ఫొటో సరదా..ఆ విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చింది. ఆగి ఉన్న గూడ్స్ ఆయిల్ ట్యాంకర్ పైకి ఎక్కి ఫొటో తీయించుకోవాలన్న కోరిక అతడిని తీవ్ర గాయాలపాలయ్యేలా చేసింది. ఆటవిడుపు కోసం నలుగురు స్నేహితులతో అరుకులోయకు వచ్చిన హెండ్రీ జోన్స్ (20) సోమవారం ఉదయం అరకు రైల్వేస్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకెక్కి ఫొటో తీయించుకోవాలనుకున్నాడు. గార్డు బోగీ పక్క ఉన్న గూడ్స్ ఆయిల్ ట్యాంకర్ పైకి ఎక్కి ఫొటో తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పైన ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో కింద పడిపోయాడు. స్పృహ కోల్పోయిన అతడిని చూసి చనిపోయాడనుకొని అక్కడకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేకపోయారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది అతడిని పరిశీలించగా ఊపిరితో ఉండటాన్ని గుర్తించి అరుకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం విశాఖలోని కింగ్‌జార్జ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జోన్స్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, క్షతగాత్రుడు జోన్స్ విశాఖలోని మద్దిలపాలెం నివాసి. గీతం వర్సిటీలో బీటెక్ మెకానికల్ బ్రాంచిలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెన్నై- హౌరా ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
చెన్నై నుంచి హౌరా వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. రైలు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం గోదారిపేట సమీపంలోకి రాగానే ఈ ఘటన జరిగింది. ఓ బోగీ నుంచి పొగలు, సన్నని మంటలు వచ్చినట్టు గుర్తించడంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే రైలును ఆపేశారు. వాటిని ఆర్పివేసిన తర్వాత అరగంట ఆలస్యంగా రైలు బయల్దేరింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. -
యువర్ అటెన్షన్ ప్లీజ్..!
రైలు ప్రయాణానికి ఎన్నో సౌకర్యాలు, మరెన్నో సదుపాయాలు ♦ ఇంటి నుంచే ఆన్లైన్లో రైలు టికెట్ పొందే అవకాశం ♦ ఏ రైలు ఎక్కడుందో, ఎప్పుడు వస్తుందో చిటికెలో సమాచారం ♦ ఆన్లైన్లోనే నచ్చిన భోజనం ఆర్డరిచ్చే వెసులుబాటు ♦ పోర్టర్లు, టాక్సీ, హోటల్ గదులనూ ముందే బుక్ చేసుకోవచ్చు ♦ ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌తో చెంతనే ఎన్నో సేవలు రైలు ప్రయాణం ఒక అనుభూతి.. అదో ఆహ్లాదం.. మనవారి కోసమో, ఏదైనా పనిమీదో, పర్యటన కోసమే రైలు ప్రయాణం చేస్తూనే ఉంటాం. రైలు ప్రయాణం ఎంత బాగున్నా.. టికెట్ తీసుకోవడం దగ్గరి నుంచి భోజనం దాకా ఎన్నో సమస్యలు.. రెలైప్పుడు వస్తుంది, ఎంత లేటుగా వస్తుంది, మన టికెట్ రిజర్వేషన్ పరిస్థితి ఏమిటి అంటూ ఎన్నో సందేహాలు. కానీ ఇప్పుడు రైల్వే అంతా ఆన్లైన్. ఇంట్లోనే కూర్చుని ముందుగానే కావాల్సిన చోటికి, కోరుకున్న రైల్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. రైలుకు సంబంధించిన వివరాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రైల్వే సిబ్బంది, పోలీసుల నుంచి అవసరమైన సహాయం పొందవచ్చు. రైల్లో తినే భోజనంతోపాటు గమ్యస్థానంలో దిగగానే అవసరమైన పోర్టర్లు, ట్యాక్సీలనూ, హోటల్ గదులనూ ముందే బుక్ చేసుకోవచ్చు. ఇన్ని సౌకర్యాలున్నా.. చాలా మంది దీనిపై అవగాహన లేక టికెట్ల కోసం స్టేషన్లలో, ప్రయాణంలో తంటాలు పడుతుంటారు. అలాంటివారితోపాటు అందరికీ అవగాహన కల్పించేందుకే ఈ వారం ఫోకస్.. - సాక్షి, హైదరాబాద్ స్టేషన్‌కు వెళ్లకుండానే టికెట్లు రైలు ప్రయాణం అంటే టికెట్ కోసం కుస్తీ పట్టాల్సి ఉంటుందని చాలామంది జంకుతారు. కానీ స్టేషన్‌కు వెళ్లాల్సిన పని లేకుండానే ఆన్లైన్లో హాయిగా టికెట్ తీసుకోవచ్చు. కంప్యూటర్లోగానీ, సెల్‌ఫోన్‌లోగానీ ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఓపెన్ చేసి కోరుకున్న రైలుకు, కావాల్సిన చోటికి టికెట్ బుక్ చేసుకోవచ్చు. లేదా ఇంటికి చేరువలో ఉన్న ఐఆర్సీటీసీ అనుబంధ ప్రైవేటు కేంద్రాలకు వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మొత్తం రైలు టికెట్లలో 58 శాతం ఆన్లైన్ ద్వారా బుక్ అవుతున్నట్టు రైల్వే అధికారులు గుర్తించారు. అంటే 42 శాతం మంది మాత్రమే రైల్వే కౌంటర్లకు వెళ్లి టికెట్ కొంటున్నారు. ఈ 42 శాతం మందిలోనూ ఈ-టికెటింగ్‌పై అవగాహన లేక దాన్ని వినియోగించుకోలేనివారే ఎక్కువ. 120 రోజుల ముందే రిజర్వేషన్ దూర ప్రయాణాలకు ముందస్తుగా టికెట్ కొనేందుకు నాలుగు నెలల గడువును రైల్వే నిర్ధారించింది. అంటే ప్రయాణానికి 120 రోజుల ముందు నుంచీ టికెట్ కొనుక్కోవచ్చు. గతంలో దీన్ని 60 రోజులకు కుదించిన రైల్వే... తిరిగి గత బడ్జెట్‌కు ముందు 120 రోజులకు పెంచింది. మరెన్నో సేవలు కూడా.. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కేవలం రైలు ప్రయాణం కోసం టికెట్లు తీసుకోవడమేకాదు.. మరెన్నో ఇతర సేవలు పొందవచ్చు. నచ్చిన ఆహారం తినొచ్చు.. రైల్లో ప్రయాణిస్తూ ప్యారడైజ్ హోటల్లో తయారైన దమ్ బిర్యానీ తినాలని ఉందా? మీరే హోటల్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా రైల్వే సిబ్బందే దాన్ని మీకు బోగీలోకి తెచ్చి అందిస్తారు. మీరు ప్రయాణంలో ఉండగానే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇచ్చి పొందొచ్చు. మీకు కన్ఫర్మేషన్ టికెట్ ఉంటే ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఈ- కేటరింగ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి (ఈ-కేటరింగ్ మొబైల్ యాప్ కూడా ఉంది). అందులో ఏ హోటల్ భోజనం కావాలో జాబితా వస్తుంది (ఒప్పందం ఉన్న హోటళ్లు). అందులో కావాల్సిన మెను, ఏ స్టేషన్లో అందించాలనే వివరాలను ఎంచుకుని, టికెట్ పీఎన్ఆర్ నంబర్‌ను ఎంటర్ చేస్తే చాలు. రైలు ఆ స్టేషన్‌కు రాగానే సిబ్బంది వచ్చి నిర్ధారిత భోజనాన్ని అందిస్తారు. క్యాబ్, పోర్టర్ సిద్ధం రైలు దిగగానే సామాను మోసేందుకు పోర్టర్ కోసం ఎదురు చూడాల్సిన పనిలేకుండా ఆన్లైన్ ద్వారా ముందే బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ట్యాక్సీని కూడా ముందే ఎంగేజ్ చేసుకోవచ్చు. దీనికి కన్ఫర్మ్ టికెట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. నడవలేని వారుంటే వీల్‌చైర్ కూడా బుక్‌చేసుకోవచ్చు. హోటల్ గది కావాలా.. కొత్త ప్రాంతానికి వెళుతున్నట్లయితే దిగగానే హోటల్ కోసం వెదుక్కోవాల్సిన పనిలేకుండా ఐఆర్సీటీసీ ద్వారా హోటల్ గదిని ముందే బుక్ చేసుకోవచ్చు. ఆ ప్రాంతంలోని హోటళ్ల వివరాలు నమోదు చేసి ఉన్న ఒక వెబ్సైట్ లింక్ ఐఆర్సీటీసీ వెబ్సైట్లో కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే.. హోటళ్లు, అవి ఉన్న ప్రాంతాలు, రైల్వే స్టేషన్ నుంచి చేరుకునే మార్గం, ధరల పట్టిక అంతా కనిపిస్తుంది. హోటల్ గది అవసరం లేదనుకుంటే రైల్వేస్టేషన్లో ఉండే విశ్రాంతి గదులను కూడా బుక్ చేసుకోవచ్చు. గరిష్టంగా రెండు రోజులు ఉండేలా వాటిని బుక్ చేసుకోవచ్చు. విమానం టికెట్టూ తీసుకోవచ్చు రైల్వేకు సంబంధించిన వెబ్సైట్ ద్వారా విమానం టికెట్లను కూడా బుక్ చేసుకునే వెసులుబాటు గురించి చాలామందికి తెలియదు. ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలు నిర్వహిస్తోంది. దేశ, విదేశీ పర్యటనలకు సంబంధించిన ప్యాకేజీలు కూడా ఉన్నాయి. దాని ద్వారా యాత్ర చేపడితే... ఐఆర్‌సీటీసీయే కన్ఫర్మ్ టికెట్‌ను అందించడంతోపాటు హోటల్, భోజనం, కారు వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. వేరే దేశాలకు వెళ్లేందుకు విమాన టికెట్లనూ సిద్ధం చేస్తుంది. ఈ టూర్లతో సంబంధం లేకుండా వ్యక్తిగత పనులపై విమాన ప్రయాణం చేయాలనుకునేవారు కూడా ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎంఎంటీఎస్‌లో ప్రత్యేక సేవలు హైదరాబాద్‌లో ప్రాచుర్యం పొందిన ఎంఎంటీఎస్ రైళ్లలో రెండు సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. హైలైట్స్(హైదరాబాద్ లైవ్ ట్రెయిన్ ఎంక్వైరీ సిస్టం) ఏ రైలు ఎక్కడుంది, ఎన్నింటికి స్టేషన్‌కు వస్తుంది, తర్వాతి రైలు రావడానికి ఎంత సమయం పడుతుంది, గమ్యస్థానానికి ఎప్పుడు చేరుతుంది.. ఇలా సమస్త సమాచారాన్ని తెలుసుకోగలిగే మొబైల్ యాప్ ఇది. పూర్తిగా జీపీఆర్ఎస్ ద్వారా పనిచేస్తుంది. ఎంఎంటీఎస్ రైళ్లే కాక సికింద్రాబాద్, హైదరాబాద్(నాంపల్లి), కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమాచారమూ లభిస్తుంది. రిస్టా (రైల్ ఇంటరాక్టివ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఫర్ ట్రావెలర్) ఎంఎంటీఎస్‌లో ప్రయాణించే వారు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. రక్షణపరంగా ఏదైనా సమస్య ఎదుర్కొంటే... ఆ యాప్‌లో ఫోన్ నంబర్ టైప్ చేసి, ట్యాప్ చేయగానే రైల్వే పోలీసులకు సమాచారం వెళుతుంది. కాల్ ఆప్షన్ క్లిక్ చేస్తే పోలీసులకు కాల్ వెళ్తుంది, ఎస్సెమ్మెస్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎస్సెమ్మెస్ వెళ్తుంది, ఎమర్జెన్సీపై ట్యాప్ చేస్తే అత్యవసర సహాయం కావాలని కోరుతుంది. దీంతో నిమిషాల వ్యవధిలోనే పోలీసులు మీ వద్దకు చేరుకుంటారు. మీకే స్పెషల్ బోగీ సాధారణంగా రైలుకు 18 నుంచి 21 వరకు బోగీలుంటాయి. ఎవరైనా 50 మందికి మించి స్నేహితులు, బంధువులు కలసి ప్రయాణించాలనుకుంటే.. వారి కోసం ప్రత్యేకంగా ఓ బోగీని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఐఆర్సీటీసీ కార్యాలయానికి వెళ్లి ఇలా బోగీని బుక్ చేసుకోవచ్చు. ఓ రైలు మొత్తాన్ని కూడా బుక్ చేసుకోవచ్చు. దానిని ప్రత్యేక రైలు పేరుతో కేటాయిస్తారు. సందర్భం, అవసరం తదితర అంశాలను పరిశీలించి వాటిని కేటాయిస్తారు. ఇందుకోసం సాధారణ చార్జీల కంటే ఎక్కువగా ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తారు. -
డెల్టా ప్యాసింజర్‌కు తప్పిన ప్రమాదం
తెనాలి నుంచి సికింద్రాబాద్‌కు వెళుతున్న డెల్టా ప్యాసింజర్‌కు ప్రమాదం తప్పింది. నల్లగొండ జిల్లా టేకుల సోమవారం వద్ద గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కల్వర్ట్‌పై ట్రాక్ కింద ఉన్న కంకర కొట్టుకుపోయింది. సిబ్బంది ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు వెంటనే రైలును నిలిపివేశారు. రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. 3 గంటల తర్వాత బయల్దేరిన ప్యాసింజర్ తెనాలి నుంచి సికింద్రాబాద్‌కు వెళుతున్న డెల్టా ప్యాసింజర్ మూడు గంటల తర్వాత తిరిగి బయల్దేరింది. నల్లగొండ జిల్లా టేకుల సోమవారం బొల్లేపల్లి గేటు వద్ద అండర్‌పాస్ బ్రిడ్జిపై మట్టి కొట్టుకుపోవడంతో శుక్రవారం ఉదయం 5.30గంటల సమయంలో రైలును నిలిపివేశారు. ఇక్కడ రైల్వే గేటు వద్ద కాపలాదారుడిని తీసేసి అండర్‌పాస్ నిర్మిస్తున్నారు. ఈ అండర్‌పాస్‌పై ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో ఓ పాల రైతు శుక్రవారం తెల్లవారుజామున గుర్తించి రైలును ఆపివేశాడు. గంటన్నర తర్వాత రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది ట్రాక్‌ను పునరుద్ధరించారు. దీంతో దాదాపు మూడు గంటల తర్వాత 8.20గంటల సమయంలో రైలు ముందుకు కదిలింది. -
ఐషర్ బోల్తా - గాయపడ్డ రైల్వే సిబ్బంది
అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది గాయాలపాలయ్యారు. వేములపాడు వద్ద రైలు మార్గం పనులు చేయటానికి ఇంజినీరింగ్ విభాగం సిబ్బందితో వెళ్తున్న ఐషర్ వాహనం ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో వాహనంలో ఉన్న 15 మందిలో ఐదుగురు తీవ్రంగాను, 10 మంది స్వల్పంగాను గాయపడ్డారు. క్షతగాత్రులను గుత్తి ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం గుంతకల్లులోని రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
ప్రయాణికులకు మెరుగైన సదుపాయం
సిబ్బందికి సందేశం పంపిన రైల్వేశాఖ కొత్త మంత్రి సురేశ్ ప్రభు సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు భద్రతతో కూడిన మెరుగైన రవాణా, వసతి సౌకర్యాల్ని కల్పించాల్సిన గురుతర బాధ్యత రైల్వే సిబ్బందిపై ఉందని రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వే చేదోడువాదోడుగా ఉందన్న విషయాన్ని గుర్తించి ప్రతిఒక్కరూ సమర్థంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రైల్వేశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఆయన అన్ని రైల్వే జోన్లకు సందేశాన్ని పంపారు. రైల్వేను సమూలంగా మార్చాలని భావిస్తే ముందుగా ప్రతి రైల్వేఉద్యోగి తనకుతాను మారాల్సి ఉంటుందని సూచించారు. మంత్రి పంపిన సందేశాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ సిబ్బందికి పంపిణీ చేసి అమలు చేయాల్సిందిగా ఆదేశించారు. -
రైల్వే గ్రూప్ డీ కేటగిరీ ఉద్యోగులు సమస్యలు
వికారాబాద్: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తమ పరిస్థితి తయారైందని గ్రూప్ డీ కేటగిరీకి చెందిన రైల్వే సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేఫ్టీ విభాగంలో పని చేస్తున్న తమ జీవితాలకు మాత్రం సేఫ్టీ లేకుండాపోయిందని గేట్మెన్, గ్యాంగ్, కీమెన్లు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని వికారాబాద్ నుంచి మొదలుకొని మెదక్ జిల్లా జహీరాబాద్ వరకు ఉన్న సుమారు 33 లెవల్ క్రాసింగ్ గేట్లు ఉన్నాయి. అయితే వీటిలో 4, 6, 7, 8, 9, 13, 27, 28 గేట్ల పరిధిలో సమస్యలు నెలకొన్నాయి. రైల్వే ఉన్నతాధికారులు మాత్రం ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గేట్ల సమీపంలో వేసిన బోర్లు పనిచేయడం లేదు. పని చేసిన బోర్లలో సైతం మురుగునీరు వస్తోంది. కొన్ని గేట్లలో రాత్రి పూట కరెంట్ లేక విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ లేకపోవడంతో రాత్రి పూట గేట్ల సమీపంలోని గదుల్లోకి పాములు, తేళ్లు తదితర విష కీటకాలు వస్తున్నాయి. వికారాబాద్ నుంచి మొదలుకొని జహీరాబాద్ సమీపంలోని మెటల్‌కుంట వరకు ఎస్ఎస్ఈ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ పరిధి ఉంటుంది. అతని పర్యవేక్షణలోనే గేట్ల నిర్వహణ ఉంటుంది. అయితే గేట్మెన్ల కోసం ఏర్పాటు చేసిన గదులు కాలం చెల్లినవి కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ట్రాక్‌కు అతి సమీపంలో ఉండటంతో రైళ్లు వెళుతున్నప్పుడు ఈ గదులు ప్రకంపనలకు గురవుతున్నాయి. గోడల పెచ్చులు ఊడిపోతున్నాయి. దీంతో గేట్ ఆపరేటర్లు ఎక్కువ శాతం గది బయటే గడుపుతున్నారు. రైల్వే నిబంధనల ప్రకారం గేట్ల వద్ద గేట్మెన్లకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ వాటిని రైల్వే ఉన్నతాధికారులు మాత్రం అమలుచేయడం లేదని గేట్మెన్లు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తమ సమస్యలు పరిష్కరిస్తే మరింత మెరుగైన సేవలను అందిస్తామని గ్రూప్ డీ కేటగిరీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. -
సమ్మెకు సన్నద్ధం
చెన్నై, సాక్షి ప్రతినిధి:రైల్వే సిబ్బందిని ప్రభుత్వం యంత్రాల్లా వాడుకుంటోందని ఆలిండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్) ఆరోపించింది. 365 రోజులూ 24 గంటల విధుల్లో వేతనం తక్కువ పనిభారం ఎక్కుగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దుర్భర పరిస్థితి నుంచి బయటపడేలా రైల్వే ఉద్యోగులు, కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నుంచి సాధించుకోవడానికి సమ్మెకు సిద్ధమవుతోంది. ఇందుకోసం నవంబరు వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చి, స్పందించకుంటే దేశవ్యాప్త సమ్మెకు పూనుకోకతప్పదని ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా, సంయుక్త ప్రధాన కార్యదర్శి ఎన్ కన్నయ్య ప్రకటించారు. రైల్వే ఉద్యోగుల, కార్మికుల సమస్యల పరిష్కారంపై చెన్నైలోని రాజాఅన్నామలై హాలులో గురువారం ఏఐఆర్ఎఫ్ జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. దేశం నలుమూల నుంచి వేలాది మంది ప్రతినిధులు హాజరయ్యూరు. వారు మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రోజుకు 1900 రైళ్లు పరుగెడుతున్నాయని, సగటున రోజుకు 2 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. అయితే ఇటువంటి కీలకమైన సేవలందించేవారికి తగిన విశ్రాంతి కరువైందని చెప్పారు. అనాదిగా ఉన్న ఖాళీలను భర్తీచేయకుండా రాజకీయ లబ్ది కోసం ప్రతి ఏటా రైల్వే బడ్జెట్లో కొత్త రైళ్లను ప్రవేశపెట్టడాన్ని వారు తప్పుపట్టారు. సిబ్బంది పెరగకుండా కొత్త రైళ్లు వేస్తే ఆ పనిభారం తామే మోయాలని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే ఉద్యోగుల న్యాయపరమైన కోర్కెలను నెరవేర్చేందుకు ఆర్థిక స్థోమత లేదని బుకాయిస్తున్న మంత్రిత్వ శాఖ వివిధ ప్రాజెక్టుల రూపంలో రూ.25వేల కోట్లను వృథా చేసిందని వారు ఆరోపించారు. అంతేగాక కిలోమీటరు నిర్మాణానికి రూ.400 కోట్ల ఖర్చుకాగల బుల్లెట్ ట్రైన్లను ప్రవేశపెట్టాలని భావిస్తోందన్నారు. ఖరీదైన టికెట్‌తో ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే బుల్లెట్ ట్రైన్ల ద్వారా రైల్వే శాఖ సాధారణ ప్రజలకు దూరం కాగలదని వారు విమర్శించారు. 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన రైల్వే కార్మికులకు కొత్త పెన్షన్ విధానాన్ని అమలుచేయరాదని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. 7వ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉద్యోగులకు కనీసం రూ.26వేలు తగ్గకుండా జీతం, రూ.3,500 టీఏ, 20శాతం హెచ్ఆర్ఏ, డీఏ చెల్లించాలని వారు కోరారు. రైల్వే ఉద్యోగుల 52 డిమాండ్లను నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని గత ఏడాది డిసెంబరు 21,22 తేదీల్లో నిర్వహించిన సమావేశంలోనే నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో సమ్మె సబబు కాదని తాత్కాలికంగా వాయిదా వేసి అవే డిమాండ్లను కొత్త ప్రభుత్వం ముందు ఉంచామని చెప్పారు. కన్నయ్యకు ప్రమోషన్ ఏఐఆర్ఎఫ్ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా, ఎస్ఆర్ఎంయూ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎన్ కన్నయ్యకు ఏఐఆర్ ఎఫ్ నిర్వాహక అధ్యక్షుడుగా పదోన్నతి లభించింది. సుమారు 14 లక్షల మంది కార్మికుల సభ్యత్వం కలిగి, గుర్తింపు పొందిన సంఘానికి నిర్వాహక అధ్యక్షుడిగా గురువారం చెన్నైలో జరిగిన సర్వసభ్య సమావేశం ద్వారా కన్నయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
రైల్వే సిబ్బంది.. తప్పిదాలు చేయొద్దు
సేఫ్టీ సెమినార్లో రైల్వే డీఆర్ఎం మిశ్రా పాల్గొన్న కాజీపేట-బల్లార్షా, కొండపల్లి, భువనగిరి అధికారులు కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : రైల్వే సిబ్బంది విధి నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగుకుండా వ్యవహరించాలని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఎస్కె.మిశ్రా సూచించారు. కాజీపేట జంక్షన్‌లోని సెమినార్ హాల్లో శుక్రవారం సికింద్రాబాద్ డివిజన్ స్థాయి సేప్టి సమావేశం జరిగింది. ఈ సెమినార్లో కాజీపేట-బల్లార్షా, కొండపెల్లి, భువనగిరి రైల్వే సెక్షన్లలో పనిచేస్తున్న రైల్వే అధికారులు, సూపర్వైజర్లు, రైల్వే గేట్మెన్లు. సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు, పాయింట్స్ మెన్లు, స్టేషన్ మాస్టర్లు, డ్రైవర్లు, కీ మెన్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు హాజరయ్యూరు. ఈ సేఫ్టీ సెమినార్లో సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఎస్కె.మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అన్ని విభాగాల వారు అప్రమత్తంగా ఉండి రైల్వే ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. సమావేశంలో సికింద్రాబాద్ సీనియర్ డీఎస్ఓ మోహన్రాం, డీఈఎన్ సెంట్రల్ నాయక్, డిప్యూటీ సీఎస్ఓ ప్రజాపతి, కాజీపేట ఆర్పీఎఫ్ అదనపు కమిషనర్ విజయ్‌కుమార్, కాజీపేట ఏరియా ఆఫీసర్ కుమార్, స్టేషన్ మేనేజర్ ఓదేలు, ఆర్పీఎఫ్ సీఐ సయ్యద్ ఇక్బాల్ అహ్మద్, జీఆర్పీ ఎస్సై శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్ఎం మిశ్రా కాజీపేట జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వరకు గూడ్స్ రైళ్లో ఫుట్ప్లేటింగ్ తనిఖీ చేస్తూ వెళ్లారని అధికారులు తెలిపారు. డీఆర్ఎంకు రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుల వినతి కాజీపేటలో రైల్వే కార్మికులు ఎదుర్కొటున్న పలు సమస్యలపై మజ్దూర్ యూనియన్ ఇంజినీరింగ్ బ్రాంచ్ సెక్రటరీ బి. రామనాథం ఆధ్వర్యంలో నాయకులు డీఆర్ఎం మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. రైల్వే క్వార్టర్స్‌లలో సౌకర్యాలు లేవని, నిరుపయోగంగా ఉన్న క్వార్టర్స్‌ను నేలమట్టం చేయకపోవడంతో అందులో అసాంఘిక కార్యాకలాపాలు సాగుతున్నాయ ని, రైల్వే ఆస్పత్రిలో మందుల కొరత ఉందని తదితర సమస్యలను వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు ఎ.శ్రీనివాస్, పి.వేదప్రకాష్, ఎన్.సదానందం, నిజాముద్దీన్, జేపీ యాదవ్, ఎన్.కుమారస్వామి ఉన్నారు. -
రైల్వే సిబ్బంది పనితీరుపై డీఆర్ఎం ఆగ్రహం
సామర్లకోట, న్యూస్‌లైన్ :రైల్వే సిబ్బంది పనితీరుపై డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శని వారం విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సామర్లకోట వచ్చిన ఆయన అన్నవరానికి కుటుంబ సభ్యులతో కారులో వెళ్లా రు. తిరిగి వచ్చిన అనంతరం స్థానిక రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. రైల్వే ట్రాక్ మధ్య డ్రెయిన్‌లో మురుగు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చే శారు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజి ద్వా రా మురుగు పోయేలా ఏర్పాటు చే యాలని ఆదేశించారు. దీనిపై ఇం జనీరింగ్ సిబ్బంది, హెల్త్ సిబ్బం దిని మందలించారు. సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్నల్ సెక్షన్ ఇంజ నీర్ అన్వర్‌బాషాను పనితీరు మెరు గు పర్చుకోవాలని సూచించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ కార్యాలయంలో రికార్డులు సక్రమంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశా రు. ఒకటో నంబరు ప్లాట్ ఫారంపై పార్సిల్ కార్యాలయం వద్ద తాగునీరు వేడిగా రావడం, కుళాయిలు సక్రమంగా పనిచేయక పోవడంపై మండిపడ్డారు. రైల్వే లిఫ్టు వద్ద ఉన్న తాగునీటి ప్రదేశానికి బోర్డు లేకపోవడం, చెత్త ఎక్కువగా ఉండడంతో సిబ్బందిని మందలించారు. స్టేషన్ మేనేజర్ కార్యాలయం, విశ్రాంతి గ దులు, ప్లాట్ఫారంను పరిశీలించి, లిఫ్టు పనితీరుపై ఆరా తీశారు. కాగా జిల్లా మీదుగా ప్రయాణించే రైళ్లకు అదనపు బోగీలు కేటాయించడంపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటుం దని ప్రదీప్‌కుమార్ అన్నారు. పలువురు ప్రయాణికులు ఆయనకు వినతిపత్రాలు సమర్పించారు. రైలుకు కనీసం 4 సాధారణ బోగీలు ఏర్పా టు చేసి, ముఖ్యమైన రైళ్లు నాలుగు నిమిషాలు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట సీని యర్ డివిజనల్ మేనేజర్ అమిత్ అగర్వాల్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎన్వీవీ సత్యనారాయణ, ఎస్డీఎం (ఆపరేషన్స్) కె. సత్యనారాయణ, స్టేషన్ మేనేజర్ సీహెచ్ సుబ్రహ్మణ్యం, ఏడీఈఎన్ సీహెచ్ తులసీరామ్, పబ్లిక్ వే ఇన్స్పెక్టర్ ఆర్.సత్యం, ఇంజనీర్లు సుబ్రహ్మణ్యం, కె.కామేశ్వరరావు, ఆర్పీఎఫ్ సీఐ బి.రాజు, ఏఎస్సై డీవీ నరసింహరావు, రైల్వే ఎస్సై ఎస్.గోవిందరెడ్డి తదితరులు ఉన్నారు. బొకారో ఎక్స్‌ప్రెస్‌లో ఆయన సామర్లకోట నుంచి విజయవాడ వెళ్లారు.