యువర్ అటెన్షన్ ప్లీజ్..! | Your Attention Please | Sakshi
Sakshi News home page

యువర్ అటెన్షన్ ప్లీజ్..!

Published Sun, May 15 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

యువర్ అటెన్షన్ ప్లీజ్..!

యువర్ అటెన్షన్ ప్లీజ్..!

రైలు ప్రయాణానికి ఎన్నో సౌకర్యాలు, మరెన్నో సదుపాయాలు
 
♦ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో రైలు టికెట్ పొందే అవకాశం
♦ ఏ రైలు ఎక్కడుందో, ఎప్పుడు వస్తుందో చిటికెలో సమాచారం
♦ ఆన్‌లైన్‌లోనే నచ్చిన భోజనం ఆర్డరిచ్చే వెసులుబాటు
♦ పోర్టర్లు, టాక్సీ, హోటల్ గదులనూ ముందే బుక్ చేసుకోవచ్చు
♦ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తో చెంతనే ఎన్నో సేవలు
 
 రైలు ప్రయాణం ఒక అనుభూతి.. అదో ఆహ్లాదం.. మనవారి కోసమో, ఏదైనా పనిమీదో, పర్యటన కోసమే రైలు ప్రయాణం చేస్తూనే ఉంటాం. రైలు ప్రయాణం ఎంత బాగున్నా.. టికెట్ తీసుకోవడం దగ్గరి నుంచి భోజనం దాకా ఎన్నో సమస్యలు.. రెలైప్పుడు వస్తుంది, ఎంత లేటుగా వస్తుంది, మన టికెట్ రిజర్వేషన్ పరిస్థితి ఏమిటి అంటూ ఎన్నో సందేహాలు. కానీ ఇప్పుడు రైల్వే అంతా ఆన్‌లైన్. ఇంట్లోనే కూర్చుని ముందుగానే కావాల్సిన చోటికి, కోరుకున్న రైల్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. రైలుకు సంబంధించిన వివరాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రైల్వే సిబ్బంది, పోలీసుల నుంచి అవసరమైన సహాయం పొందవచ్చు. రైల్లో తినే భోజనంతోపాటు గమ్యస్థానంలో దిగగానే అవసరమైన పోర్టర్లు, ట్యాక్సీలనూ, హోటల్ గదులనూ ముందే బుక్ చేసుకోవచ్చు. ఇన్ని సౌకర్యాలున్నా.. చాలా మంది దీనిపై అవగాహన లేక టికెట్ల కోసం స్టేషన్లలో, ప్రయాణంలో తంటాలు పడుతుంటారు. అలాంటివారితోపాటు అందరికీ అవగాహన కల్పించేందుకే ఈ వారం ఫోకస్..
 - సాక్షి, హైదరాబాద్
 
 స్టేషన్‌కు వెళ్లకుండానే టికెట్లు
 రైలు ప్రయాణం అంటే టికెట్ కోసం కుస్తీ పట్టాల్సి ఉంటుందని చాలామంది జంకుతారు. కానీ స్టేషన్‌కు వెళ్లాల్సిన పని లేకుండానే ఆన్‌లైన్‌లో హాయిగా టికెట్ తీసుకోవచ్చు. కంప్యూటర్‌లోగానీ, సెల్‌ఫోన్‌లోగానీ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి కోరుకున్న రైలుకు, కావాల్సిన చోటికి టికెట్ బుక్ చేసుకోవచ్చు. లేదా ఇంటికి చేరువలో ఉన్న ఐఆర్‌సీటీసీ అనుబంధ ప్రైవేటు కేంద్రాలకు వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మొత్తం రైలు టికెట్లలో 58 శాతం ఆన్‌లైన్ ద్వారా బుక్ అవుతున్నట్టు రైల్వే అధికారులు గుర్తించారు. అంటే 42 శాతం మంది మాత్రమే రైల్వే కౌంటర్‌లకు వెళ్లి టికెట్ కొంటున్నారు. ఈ 42 శాతం మందిలోనూ ఈ-టికెటింగ్‌పై అవగాహన లేక దాన్ని వినియోగించుకోలేనివారే ఎక్కువ.

 120 రోజుల ముందే రిజర్వేషన్
 దూర ప్రయాణాలకు ముందస్తుగా టికెట్ కొనేందుకు నాలుగు నెలల గడువును రైల్వే నిర్ధారించింది. అంటే ప్రయాణానికి 120 రోజుల ముందు నుంచీ టికెట్ కొనుక్కోవచ్చు. గతంలో దీన్ని 60 రోజులకు కుదించిన రైల్వే... తిరిగి గత బడ్జెట్‌కు ముందు 120 రోజులకు పెంచింది.
 
 మరెన్నో సేవలు కూడా..
  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా కేవలం రైలు ప్రయాణం కోసం టికెట్లు తీసుకోవడమేకాదు.. మరెన్నో ఇతర సేవలు పొందవచ్చు.
 నచ్చిన ఆహారం తినొచ్చు..
 రైల్లో ప్రయాణిస్తూ ప్యారడైజ్ హోటల్‌లో తయారైన దమ్ బిర్యానీ తినాలని ఉందా? మీరే హోటల్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా రైల్వే సిబ్బందే దాన్ని మీకు బోగీలోకి తెచ్చి అందిస్తారు. మీరు ప్రయాణంలో ఉండగానే ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ ఇచ్చి పొందొచ్చు. మీకు కన్ఫర్మేషన్ టికెట్ ఉంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఈ- కేటరింగ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి (ఈ-కేటరింగ్ మొబైల్ యాప్ కూడా ఉంది). అందులో ఏ హోటల్ భోజనం కావాలో జాబితా వస్తుంది (ఒప్పందం ఉన్న హోటళ్లు). అందులో కావాల్సిన మెను, ఏ స్టేషన్‌లో అందించాలనే వివరాలను ఎంచుకుని, టికెట్ పీఎన్‌ఆర్ నంబర్‌ను ఎంటర్ చేస్తే చాలు. రైలు ఆ స్టేషన్‌కు రాగానే సిబ్బంది వచ్చి నిర్ధారిత భోజనాన్ని అందిస్తారు.

 క్యాబ్, పోర్టర్ సిద్ధం
 రైలు దిగగానే సామాను మోసేందుకు పోర్టర్ కోసం ఎదురు చూడాల్సిన పనిలేకుండా ఆన్‌లైన్ ద్వారా ముందే బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ట్యాక్సీని కూడా ముందే ఎంగేజ్ చేసుకోవచ్చు. దీనికి కన్ఫర్మ్ టికెట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. నడవలేని వారుంటే వీల్‌చైర్ కూడా బుక్‌చేసుకోవచ్చు.

 హోటల్ గది కావాలా..
 కొత్త ప్రాంతానికి వెళుతున్నట్లయితే దిగగానే హోటల్ కోసం వెదుక్కోవాల్సిన పనిలేకుండా ఐఆర్‌సీటీసీ ద్వారా హోటల్ గదిని ముందే బుక్ చేసుకోవచ్చు. ఆ ప్రాంతంలోని హోటళ్ల వివరాలు నమోదు చేసి ఉన్న ఒక వెబ్‌సైట్ లింక్ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే.. హోటళ్లు, అవి ఉన్న ప్రాంతాలు, రైల్వే స్టేషన్ నుంచి చేరుకునే మార్గం, ధరల పట్టిక అంతా కనిపిస్తుంది. హోటల్ గది అవసరం లేదనుకుంటే రైల్వేస్టేషన్‌లో ఉండే విశ్రాంతి గదులను కూడా బుక్ చేసుకోవచ్చు. గరిష్టంగా రెండు రోజులు ఉండేలా వాటిని బుక్ చేసుకోవచ్చు.

 విమానం టికెట్టూ తీసుకోవచ్చు
 రైల్వేకు సంబంధించిన వెబ్‌సైట్ ద్వారా విమానం టికెట్లను కూడా బుక్ చేసుకునే వెసులుబాటు గురించి చాలామందికి తెలియదు. ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలు నిర్వహిస్తోంది. దేశ, విదేశీ పర్యటనలకు సంబంధించిన ప్యాకేజీలు కూడా ఉన్నాయి. దాని ద్వారా యాత్ర చేపడితే... ఐఆర్‌సీటీసీయే కన్ఫర్మ్ టికెట్‌ను అందించడంతోపాటు హోటల్, భోజనం, కారు వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. వేరే దేశాలకు వెళ్లేందుకు విమాన టికెట్లనూ సిద్ధం చేస్తుంది. ఈ టూర్లతో సంబంధం లేకుండా వ్యక్తిగత పనులపై విమాన ప్రయాణం చేయాలనుకునేవారు కూడా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
 
 ఎంఎంటీఎస్‌లో ప్రత్యేక సేవలు
  హైదరాబాద్‌లో ప్రాచుర్యం పొందిన ఎంఎంటీఎస్ రైళ్లలో రెండు సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి.
 హైలైట్స్(హైదరాబాద్ లైవ్ ట్రెయిన్ ఎంక్వైరీ సిస్టం)
 ఏ రైలు ఎక్కడుంది, ఎన్నింటికి స్టేషన్‌కు వస్తుంది, తర్వాతి రైలు రావడానికి ఎంత సమయం పడుతుంది, గమ్యస్థానానికి ఎప్పుడు చేరుతుంది.. ఇలా సమస్త సమాచారాన్ని తెలుసుకోగలిగే మొబైల్ యాప్ ఇది. పూర్తిగా జీపీఆర్‌ఎస్ ద్వారా పనిచేస్తుంది. ఎంఎంటీఎస్ రైళ్లే కాక సికింద్రాబాద్, హైదరాబాద్(నాంపల్లి), కాచిగూడ స్టేషన్‌ల నుంచి రాకపోకలు సాగించే ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమాచారమూ లభిస్తుంది.

 రిస్టా
 (రైల్ ఇంటరాక్టివ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఫర్ ట్రావెలర్)

 ఎంఎంటీఎస్‌లో ప్రయాణించే వారు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. రక్షణపరంగా ఏదైనా సమస్య ఎదుర్కొంటే... ఆ యాప్‌లో ఫోన్ నంబర్ టైప్ చేసి, ట్యాప్ చేయగానే రైల్వే పోలీసులకు సమాచారం వెళుతుంది. కాల్ ఆప్షన్ క్లిక్ చేస్తే పోలీసులకు కాల్ వెళ్తుంది, ఎస్సెమ్మెస్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎస్సెమ్మెస్ వెళ్తుంది, ఎమర్జెన్సీపై ట్యాప్ చేస్తే అత్యవసర సహాయం కావాలని కోరుతుంది. దీంతో నిమిషాల వ్యవధిలోనే పోలీసులు మీ వద్దకు చేరుకుంటారు.
 
 మీకే స్పెషల్ బోగీ
 సాధారణంగా రైలుకు 18 నుంచి 21 వరకు బోగీలుంటాయి. ఎవరైనా 50 మందికి మించి స్నేహితులు, బంధువులు కలసి ప్రయాణించాలనుకుంటే.. వారి కోసం ప్రత్యేకంగా ఓ బోగీని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఐఆర్‌సీటీసీ కార్యాలయానికి వెళ్లి ఇలా బోగీని బుక్ చేసుకోవచ్చు. ఓ రైలు మొత్తాన్ని కూడా బుక్ చేసుకోవచ్చు. దానిని ప్రత్యేక రైలు పేరుతో కేటాయిస్తారు. సందర్భం, అవసరం తదితర అంశాలను పరిశీలించి వాటిని కేటాయిస్తారు. ఇందుకోసం సాధారణ చార్జీల కంటే ఎక్కువగా ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement