Train travel
-
సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దారుణం.. మద్యం మత్తులో దంపతులపై..
లక్నో: ఇటీవలి కాలంలో విమానాల్లో కొందరు వ్యక్తులు తోటి ప్రయాణీకులతో అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు చూశాం. పక్కన వారితో మూత్ర విసర్జన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే ఇప్పుడు రైలులో చోటుచేసుకుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువకుడు అభ్యంతరకంగా ప్రవర్తించాడు. పీకలదాకా మద్యం తాగి తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు. అయితే, యూపీకి చెందిన ఓ వృద్ధ దంపతులు ఢిల్లీ వెళ్లేందుకు గత బుధవారం సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. వీరు ఏసీ బోగీలో ప్రయాణిస్తుండగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ యువకుడు.. లోయర్ బెర్త్‌లో పడుకున్న ఆ దంపతులపై, వారి వస్తువులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. దీంతో, వారు ఒక్కసారిగా షాకయ్యారు. A drunk passanger allegedly urinated on an elderly woman travelling with her husband in Nizamuddin-bound 12447 Uttar Pradesh Sampark Kranti express. The passanger was deboarded at Jhansi railway station. He was later booked and arrested. pic.twitter.com/H7jggmhJaO — Piyush Rai (@Benarasiyaa) October 6, 2023 మరోవైపు.. ఈ దారుణ ఘటనను గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే కోచ్ అటెండెంట్, టీటీఈకి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దంపతులకు సాయం చేశారు. అనంతరం.. ఘటనకు పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఝాన్సీ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితుడిని ఢిల్లీకి చెందిన రితేశ్‌గా గుర్తించారు. మహోబాలో రైలెక్కిన అతడు అప్పటికే మద్యం తాగి ఉన్నాడని తోటి ప్రయాణికులు తెలిపారు. రితేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక, ఈ ఘటనలో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
ట్రెండ్ మారింది గురూ! ఏసీకి ఫ్యాన్స్! ఖర్చుకు తగ్గేదేలే!
సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణం అంటేనే హడావుడి. త్వరగా బయలుదేరి రైలు అందుకోవడం.. ఏ మూలనో కాసింత చోటు సంపాదించుకుని హమ్మయ్య అనుకోవడం.. రోజుల తరబడి వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు చివరికి ఏదో ఒక బెర్త్ కన్ఫర్మ్ అయితే చాలు అని ఆశపడటం ఇన్నాళ్లుగా కనిపించేంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. సౌకర్యవంతమైన ప్రయా ణానికి జనం మొగ్గు చూపుతున్నారు. జనరల్, నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ బోగీల కంటే.. ఏసీ బోగీల్లో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. దూరంతో, కాలంతో సంబంధం లేకుండా వేసవిలోనైనా, చలికాలంలోనైనా.. ఏసీ కోచ్‌లో సీట్లు దొరికాకే ప్రయాణానికి సిద్ధమవు తున్నారు. ఒంటరిగా ప్రయాణించినప్పుడు ఏదో ఒక బోగీలో ప్రయాణం చేసినా.. ఇంటిల్లిపాది కలిసి వెళితే మాత్రం ఏసీపై దృష్టిపెడుతున్నారు. థర్డ్ ఏసీకి ప్రాధాన్యం.. సాధారణ స్లీపర్ చార్జీలతో పోల్చుకుంటే ఏసీ ప్రయాణానికి చార్జీలు చాలా ఎక్కువే. ఫస్ట్, సెకండ్ ఏసీ బోగీలకైతే చాలా ఎక్కువ. అయితే అటు సౌకర్యం, ఇటు కాస్త అందుబాటులో ఉండటంతో థర్డ్ ఏసీ బోగీల్లో ప్రయాణానికి జనం మొగ్గుచూపుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి స్లీపర్ క్లాస్ చార్జీ రూ.450 వరకు ఉంటుంది. అదే థర్డ్ ఏసీలో రూ.1,100 వరకు ఉంటుంది. అయినా 12 గంటల పాటు ప్రయాణం కావడంతో టికెట్ ధర ఎక్కువే అయినా వీటిలో ప్రయాణిస్తున్నారు. ఇక ఏసీ బోగీల్లో దుప్పట్లు, బెడ్షీట్లు అందజేయడం, రెండు వైపులా డోర్లు లాక్ చేసే సదుపాయం వల్ల ప్రయాణంలో భద్రత ఉంటుందనే భరోసా.. రాత్రంతా ప్రశాంతంగా నిద్రించి ఉదయాన్నే గమ్యస్థానానికి చేరుకొనే అవకాశం ఉంటాయి. కొన్నిరైళ్లలో ఏసీ బోగీల్లో ఐఆర్సీటీసీ కేటరింగ్ సదుపాయం కూడా లభిస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలో ప్రతిరోజు సుమారు 650 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా.. వీటిలో 230కిపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లలో ప్రతిరోజు లక్షకుపైగా థర్డ్ ఏసీ బెర్తులు భర్తీ అవుతున్నట్టు అంచనా. సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ చార్జీలు బాగా ఎక్కువే అయినా.. దూర ప్రాంత ప్రయాణాల్లో సెకండ్ ఏసీకి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇవి రోజూ సుమారు 30 వేల బెర్తులు భర్తీ అవుతున్నట్లు అంచనా. స్లీపర్ బోగీలు తగ్గిస్తూ.. అన్ని ప్రధాన రైళ్లలో స్లీపర్ కోచ్‌లను తగ్గించి థర్డ్ ఏసీ బోగీలను పెంచుతున్నారు. గతంలో 1.5 లక్షల వరకు స్లీపర్ బెర్తులు అందుబాటులో ఉంటే.. ఇప్పుడవి లక్షకు తగ్గినట్టు అంచనా. ఇదే సమయంలో ప్రయాణికుల డిమాండ్‌కు తగినట్టు థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ బెర్తులు పెంచారు. హైదరాబాద్ నుంచి విశాఖ, బెంగళూరు, ముంబై, దానాపూర్, రెక్సాల్, భువనేశ్వర్ తదితర రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువ. ఈ రూట్లలో నడిచే రైళ్లలో స్లీపర్ బెర్తుల సంఖ్య సగానికి సగం తగ్గించినట్టు సమాచారం. ‘‘స్లీపర్ బోగీలకు డిమాండ్ లేదని చెప్పలేం. దిగువ మధ్య తరగతి, సాధారణ ప్రయాణికులకు తమ బడ్జెట్లో ప్రయాణ సదుపాయాన్ని అందజేసేవి స్లీపర్ క్లాస్ బోగీలే. కానీ ఇటీవల కాలంలో ఏసీ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు..’’ అని దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ఇక ముందుఅన్నీ ఏసీ రైళ్లే.. రానున్న కాలంలో పూర్తిగా ఏసీ రైళ్లు మాత్రమే పట్టా లెక్కనున్నట్టు రైల్వే శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లు విజయవంతంగా పరుగులు తీస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ, తిరుపతి పట్టణాలకు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. డిమాండ్ బాగుండటంతో తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో బోగీల సంఖ్యను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. త్వరలో బెంగళూరుకు వందేభారత్ అందుబాటులోకి రానుంది. అలాగే ఢిల్లీ, ముంబై తదితర నగరాలకు కూడా పూర్తి ఏసీ సదుపాయం ఉన్న వందేభారత్ రైళ్లను నడపనున్నారు. దక్షిణ మధ్య రైల్వే గణాంకాలివీ.. ♦ ప్రతి రోజు వచ్చే ఆదాయం: రూ.10 కోట్లు ♦ మొత్తం ప్రయాణికుల రైళ్లు: 650 ♦ రోజూ రాకపోకలు సాగించే ప్రయాణికులు 10.50 లక్షలు ♦ స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించేవారు 2.50 లక్షలు ♦ ఏసీ బోగీల్లో ప్రయాణించేవారు 1.50 లక్షలు ♦ థర్డ్ ఏసీ ప్రయాణికులు 1.10 లక్షలు ♦ సెకండ్ ఏసీ ప్రయాణికులు 30వేలు ♦ ఫస్ట్ ఏసీ ప్రయాణికులు 10వేల లోపు -
చావు చిల్లర
రావిశాస్త్రి ‘కార్నర్ సీట్’ కథ సుప్రసిద్ధం. అందులో ఒకతను రైలు ప్రయాణం చేయబోయి కంపార్ట్మెంట్లోని కార్నర్ సీట్ ఆశిస్తాడు. కూచునే లోపల ఒక ఆకుపచ్చకోటు వాడు ఆ సీటును ఆక్రమిస్తాడు. అప్పట్నించి ఇతను ఆ ఆకుపచ్చకోటు వాణ్ణి తిట్టుకుంటూనే ఉంటాడు. ఆ ఆకుపచ్చకోటు వాడు ఇదంతా పట్టకుండా ఎటో చూస్తుంటాడు. ఏదో ఆలోచిస్తుంటాడు. మధ్యలో ఒకచోట రైలు ఆగుతుంది. తిరిగి బయలుదేరబోతుంటుంది. ఒక్క క్షణం. ఆకుపచ్చకోటు వాడు ఒక్క ఉదుటున కంపార్ట్మెంట్ దిగేస్తాడు. ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ముక్కలైపోతాడు. రెప్పపాటు. అంతవరకూ అతణ్ణి తిట్టుకున్న ఇతను నిశ్చేష్టుడవుతాడు. అతనికీ ఇతనికీ ఏ సంబంధమూ లేదు– కార్నర్ సీటుతో తప్ప. కాని ఇతనికి ఏడుపు వస్తుంది. దుఃఖం కలుగుతుంది. ఈ లోకంలో ఎంతో ఎండా నీడా గాలి నీరూ వర్షం ఉన్నాయి. వాటిని అనుభవించకుండా ఏదో ఒక సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూసి ఊరట చెందకుండా ఏ కష్టానికి ఎందుకు చనిపోయాడో అని వెక్కివెక్కి ఏడుస్తాడు. ఎదుటివాడి చావు పట్ల మనకు ఉండాల్సిన వేదన, సహానుభూతి గురించి రావిశాస్త్రి రాసిన గొప్ప కథ అది. ఆర్.కె.నారాయణ్ ‘మిస్సింగ్ మెయిల్’ కథ కూడా సుప్రసిద్ధమే. వినాయక్ మొదలి వీధిలో ఇంటింటికీ ఉత్తరాలు అందించే పోస్ట్‌మేన్ తానప్పకు ఆ వీధిలోని అందరి కష్టసుఖాలు తెలుసు. రామానుజమ్ గారి కుమార్తె కామాక్షికి చాలా రోజులుగా సంబంధాలు కుదరడం లేదని తెలుసు. ఇప్పుడు కుదిరిన ఢిల్లీ సంబంధం ఈ ముహూర్తం దాటితే తిరిగి మూడేళ్ల వరకు అబ్బాయికి వీలు కాదనీ తెలుసు. రామానుజమ్ ఇంట్లో ఒకవైపు పెళ్లి పనులు జరుగుతుండగా మరోవైపు తానప్పకు టెలిగ్రామ్, ఉత్తరం అందుతాయి. వాటిలో రామానుజమ్ మేనమామ మరణవార్త ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? ఈ కబురు రామానుజమ్కు తెలిస్తే వెంటనే బయల్దేరాలి. పెళ్లి ఆగిపోవాలి. మళ్లీ మూడేళ్ల వరకూ పోస్ట్‌పోన్ చేయాలి. అందుకే తానప్ప ఆ టెలిగ్రామ్, ఉత్తరం దాచి పెడతాడు. పెళ్లయ్యి అమ్మాయిని సాగనంపాక మెల్లగా ఆ సంగతి తెలియచేస్తాడు. మరణవార్త ఎప్పుడు, ఎలా చెప్పాలో తెలిసి సంస్కారం పాటించిన తానప్పను పాఠకుడు గుండెల్లో పెట్టుకుంటాడు. చావును గౌరవించడం ప్రతి నాగరికతలో ఉంది. చనిపోయిన వ్యక్తికి ‘అంతిమ సంస్కారం’ నిర్వహించడం సాటి మనిషి సంస్కారం. జననంతో మొదలయ్యే మనిషి జీవనవృత్తం మరణంతో ముగుస్తుందని అందరికీ తెలిసినా మరణం తెచ్చే శూన్యం, వెలితి ఆ కుటుంబానికి, సంబంధీకులకు, స్నేహితులకు చాలా తీవ్రమైనవిగా జనులు భావిస్తారు. అందుకే నిన్న మొన్నటి వరకూ పల్లెల్లో ఒక వ్యక్తి మరణిస్తే ఎత్తుబడి అయ్యేంత వరకూ ఊరు ఊరంతా పొయ్యి ముట్టించేది కాదు. చావుఇంటి దగ్గర చేరి ధైర్యం చెప్పడం, జరగవలసిన పనులు చూడటం చేసేవారు. మనిషి చనిపోవడం అంటే ‘కూకటి వేళ్లతో సహా చెట్టు కూలిపోవడం’గా గాథా సప్తశతి వ్యాఖ్యానిస్తుంది. చెట్టు ఆధారంగా ఎంత జీవం పెనవేసుకుని ఉంటుందో మనిషి ఆధారంగా కూడా అనేక జీవనాలు పెనవేసుకుని ఉంటాయి. ఇప్పటికీ కొన్ని గిరిజన సముదాయాలైతే తమ సమూహంలోని ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి మరణిస్తే ఆ ఆవాసాన్ని, గూడేన్ని ఏకంగా ఖాళీ చేసి వెళ్లిపోతాయి జ్ఞాపకాలను తట్టుకోలేక. అందుకే మనిషి పోయినప్పుడు పోయిన వ్యక్తిని గౌరవించడంతో పాటు అతని చుట్టూ ఉన్న వ్యక్తుల వేదనను కూడా గౌరవించి మెలగాలి. ఈ దేశం విన్న అత్యంత విషాదకరమైన మరణవార్త గాంధీ గారి హత్య. రేడియోలో ఈ వార్త విన్న ఒక బాలిక పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకు వచ్చి ‘అమ్మా... గాంధీ గారు చనిపోయారట’ అంటే ఆ తల్లి ఉలిక్కిపడి లేచి కూతురి చెంప మీద లాగి పెట్టి ఒక్కటి వేస్తుంది– ‘ఏమిటా పాడు మాటలు’ అని! ఆ తర్వాత ఆ వార్త నిజం అని తెలిసి కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంది. ఇంద్రగంటి జానకీబాల ‘కనిపించే గతం’ నవల ఈ సంఘటనతోనే మొదలవుతుంది. గాంధీ గారి మరణవార్త విని ఎక్కడికక్కడ కూలబడి విలపించినవాళ్లు, సినిమా హాళ్లలో సగం నుంచి లేచి ఏడ్చుకుంటూ బయటపడినవాళ్ళు, మూడు రోజులు లంకణం చేసినవారు ఎందరో ఉన్నారు. మహనీయులు, కళాకారులు, నాయకులు, ఆపద్బాంధవులు... జనులతో మమేకమై ఉంటారు. అందువల్ల వారి మరణ వార్తల పట్ల ఇంకా గౌరవం పాటించాలి. నిర్థారణలు చేసుకోవాలి. అప్పుడే చెప్పాలి. కాని ఇవాళ ఒక వికృతమైన సంస్కృతి ఎల్లెడలా కనిపిస్తూ ఉంది. దానిని పైశాచిక సంస్కృతి అనవచ్చు. చిల్లర సంస్కృతి అనవచ్చు. సోషల్ మీడియా సంస్కృతి అని కూడా అనవచ్చు. వ్యక్తుల చావు వార్తలను సత్యాసత్యాలతో సంబంధం లేకుండా పుకార్ల స్థాయికి దిగజార్చడం. బతికున్నవారిని చంపడం. వైద్యం తీసుకుంటూ పోరాడుతున్నవారికి చావు ముహూర్తం లిఖించడం. దీనికి హతాశులైన ఆ సజీవులు తామే ముందుకొచ్చి ‘బతికున్నాం మొర్రో’ అని చెప్పడం. బంధువులు దిగ్భ్రాంతితో ‘అవన్నీ అబద్ధాలు’ అని చెప్పాల్సి రావడం. జవాబుదారీతనం లేని వ్యవస్థ డ్రైనేజీలాంటిది. ఆ డ్రైనేజీతో మనకెందుకు అని నలుగురూ ఊరుకోవడం వల్లే అందులో కంపుతోపాటు ఇంపు కూడా కొట్టుకొనిపోవాల్సి వస్తోంది. ఫేక్ఐడిలు, ఆనవాలు లేని వాట్సప్‌లతో తప్పుడు చావువార్తలు వ్యాప్తి చేసి సైకిక్ స్టిమ్యులేషన్ పొందుతున్న వారు ఎంతటి మానసిక రోగులో అనుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వాళ్లు మన ఇళ్లలో కూడా ఉండొచ్చు. చావును గౌరవిద్దాం. చావుపై చిల్లర ఏరుకునే వ్యవస్థను చావగొడదాం. -
రైలెక్కట్లేదు.. విమానం దిగట్లేదు.. ప్రజల్లో వచ్చిన మార్పుకు కారణమిదే!
విమాన ప్రయాణికుల రద్దీపెరిగినంత వేగంగా రైలు ప్రయాణాల్లో రద్దీ పెరగటం లేదు. కోవిడ్–19 కారణంగా క్షీణించిన ప్రజా రవాణా నెమ్మదిగా పుంజుకుంటున్నా.. కోవిడ్ ముందు కాలంతో పోలిస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితికి ద్రవ్యోల్బణమే కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోవిడ్ తర్వాత ప్రయాణాల రద్దీ పెరుగుదల ఆర్థిక వృద్ధికి ప్రత్యక్ష సూచికగా నిలుస్తుందని చెబుతున్నారు. కానీ.. కోవిడ్ ముందు సాగినన్ని ప్రయాణాలు ప్రస్తుతం కనిపించటం లేదని స్పష్టం చేస్తున్నారు. కనిపించని మునుపటి మార్క్.. కరోనాకు ముందు 2019–20 ఆర్థిక సంవత్సరంలో 7,674 మిలియన్ల మంది రైళ్లలో ప్రయాణించగా.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 5,858 మిలియన్ల మంది మాత్రమే ప్రయాణించారు. అంటే ప్రయాణికుల బుకింగ్ 1,816 మిలియన్లు కంటే ఎక్కువ తగ్గింది. 2022–23తో పోలిస్తే.. 2019–20 కంటే 24 శాతం తక్కువ రద్దీని సూచిస్తోంది. సబర్బన్ ప్రాంతాల్లో 20 శాతం తగ్గుదల ఉండగా.. నాన్–సబర్బన్ ప్రాంతాల్లో 29 శాతం తగ్గుదల నమోదైంది. నేషనల్ ట్రాన్స్పోర్ట్ నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల విభాగంలో రైల్వే 73 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ నుంచి మార్చి (2022–23) వరకు రూ.54,733 కోట్ల రాబడి వస్తే.. గత ఆర్థిక ఏడాదిలో ఇది రూ.31,634 కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే రైలు ప్రయాణాల్లో వృద్ధి కనిపిస్తున్నా.. 2019–20 కాలం నాటి గణాంకాలతో పోలిస్తే మాత్రం తక్కువగానే ఉంది. ద్రవ్యోల్బణమే కారణం ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం పడుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల కారణంగా ఆయా వర్గాల ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నట్టు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితి రైలు ప్రయాణాల్లో రద్దీ పెరగకపోవడానికి కారణమని స్పష్టం చేస్తున్నారు. ఎగువ, ఉన్నత ఆదాయ వర్గాల వారిపై ద్రవ్యోల్బణం పెద్దగా ప్రభావం చూపని కారణంగా.. ఆ వర్గాల వారు విమానాల్లో యథావిధిగా ప్రయాణించగలుగుతున్నారని చెబుతున్నారు. విమానాలు ఎక్కేస్తున్నారు మరోవైపు దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా వృద్ధి చెందుతూ కోవిడ్ ముందునాటి స్థితికి చేరింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) నివేదిక ప్రకారం 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన సంస్థలు 1,360 లక్షల మంది ప్రయాణికులను తరలించాయి. ఇది 2021–22లో ప్రయాణించిన 852 లక్షల మంది ప్రయాణికులతో పోలిస్తే 60 శాతం పెరుగుదలను సూచిస్తోంది. అయితే, ప్రస్తుతం దేశీయ ప్రయాణికుల రద్దీ 2020–21 ఆర్థిక సంవ్సతరంలో 1,415 లక్షల కంటే 4 శాతం తక్కువ. ఈ ఏడాది మార్చిలో 130 లక్షల మంది దేశీయంగా విమానాల్లో ప్రయాణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 121 లక్షలు కాగా.. మార్చి నెలలో 8 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. 2022 మార్చిలో ఇది 106 లక్షలు ఉండగా.. ప్రస్తుతం 22 శాతం వృద్ధిలో నడుస్తోంది. అదే 2019 మార్చిలో 116 లక్షలు ఉంటే ఇప్పటి మార్చి ప్రీకోవిడ్లో చూస్తే 12 శాతం పెరుగుదల కనిపిస్తోంది. సరుకు రవాణా పెరుగుతోంది దేశంలో అత్యధికంగా ఒక ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా చేసిన సంస్థగా రైల్వే రికార్డు సృష్టించింది. జాతీయ రవాణా సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం.. 2022–23లో 1,512 మిలియన్ టన్నుల సరుకును రైల్వే రవాణా చేసింది. 2021–22లో 1,418 మిలియన్ టన్నులు తరలించింది. ఇక్కడ 2022–23లో రైల్వే మొత్తం ఆదాయం రూ.2.44 లక్షల కోట్లు కాగా.. 2021–22లో రూ.1.91 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే మొత్తం ఆదాయంలో ఏకంగా 27.75 శాతం వృద్ధిని సూచిస్తోంది. – సాక్షి, అమరావతి -
ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఉత్తర భారత యాత్ర
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఉత్తర భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను తక్కువ ఖర్చుతో సందర్శించేందుకు ‘ఉత్తర భారత యాత్ర’ పేరుతో ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నట్టు ఐఆర్సీటీసీ విజయవాడ ఏరియా మేనేజర్ మురళీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్సర్, హరిద్వార్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించుకునేందుకు ఈ నెల 19న ఈ రైలును నడపుతున్నట్టు వెల్లడించారు. రేణిగుంటలో ప్రారంభమమ్యే ఈ రైలుకు నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, నాగ్‌పూర్ స్టేషన్లలో బోర్డింగ్ ఉందని పేర్కొన్నారు. 10 రాత్రిళ్లు, 11 పగటి పూటలు సాగే రైలు ప్రయాణంలో కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ ఉదయం టీ, కాఫీ, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం, పర్యాటక ప్రాంతాలకు రోడ్డు మార్గంలో రవాణా, రాత్రిళ్లు బస ఏర్పాట్లుంటాయని పేర్కొన్నారు. స్టాండర్డ్(స్లీపర్ క్లాస్), కంఫర్ట్ (ఏసీ 3 టైర్)గా రెండు కేటగిరీల్లో ఉండే ప్యాకేజీలో.. స్టాండర్డ్ ధర ఒక్కొక్కరికి రూ.10,400, కంఫర్ట్ ధర ఒక్కొక్కరికి రూ.17,330గా నిర్ణయించినట్టు వెల్లడించారు. ఆసక్తి గల వారు దగ్గర్లోని ఐఆర్సీటీసీ కార్యాలయాల్లోగానీ, విజయవాడ స్టేషన్‌లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలోగానీ, లేదా ఫోన్ నంబర్లు 8287932312, 9701360675, వెబ్సైట్ www.irctctourism.comలో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. -
కూల్ కూల్‌గా రైలు ప్రయాణం
సాక్షి, అమరావతి: రైళ్లలోని త్రీటైర్ ఏసీ బోగీల్లో చాలీచాలనీ ఏసీ.. ఇరుకు బెర్త్‌లతో ఇక్కట్లు.. అటూ ఇటూ నడిచేందుకు అవస్థలకు ఇక చెక్ పడనుంది. త్రీటైర్ ఏసీ రైలు ప్రయాణం మరింత కూల్ కూల్‌గా మారనుంది. జర్మనీకి చెందిన ‘లింక్ హాఫ్మన్ బుష్’ (ఎల్‌హెచ్‌బీ) సాంకేతిక పరిజ్ఞానంతో సౌకర్యవంతంగా రూపొందించిన అధునాతన బోగీలను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. పంజాబ్ కపుర్తలాలోని కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేసిన అధునాతన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను దేశవ్యాప్తంగా అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దశలవారీగా ప్రవేశపెట్టనుంది. తద్వారా తక్కువ చార్జీలతో అత్యంత సౌకర్యవంతమైన ఏసీ రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి రానుంది. సౌకర్యం.. భద్రత ► ప్రస్తుతం ఉన్న కోచ్‌లలో అప్పర్ బెర్త్‌కే ఏసీ సరిగా వస్తుంది. మిడిల్, లోయర్ బెర్త్‌లకు చల్లదనం సరిగా రాదు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో ఈ సమస్య ఉండదు. చల్లదనాన్ని అందించేందుకు ప్రతి బెర్త్ వద్ద ఏసీ వెంట్ ఏర్పాటు చేశారు. దీనివల్ల అప్పర్, మిడిల్, లోయర్, సైడ్ బెర్త్‌లకూ సమాన రీతిలో చల్లదనం వస్తుంది. ► మెరుగుపరచిన మాడ్యులర్ డిజైన్లతో బెర్త్‌లు రూపొందించారు. బెర్త్‌ల పొడవు, వెడల్పు పెంచారు. అప్పర్, మిడిల్, లోయర్ బెర్త్‌ల మధ్య దూరాన్ని కొంత పెంచారు. ► మొబైల్ ఫోన్లు, నీళ్ల సీసాలు, పేపర్లు పెట్టుకునేందుకు ప్రతి బెర్త్‌కు ప్రత్యేకంగా హోల్డర్లు ఏర్పాటు చేశారు. ► ప్రత్యేకంగా రీడింగ్ ల్యాంప్, మొబైల్ ఫోన్ చార్జింగ్ పాయింట్ పెట్టారు. ► కంటికి ఇబ్బందిలేని రీతిలో ప్రకాశవంతమైన లైట్లను ఏర్పాటు చేశారు. కోచ్ అంతటా లైట్ల కాంతి ప్రసరించేలా డిజైన్ చేశారు. ► ప్రస్తుతం ఉన్న కోచ్‌లలో 72 బెర్త్‌లు ఉన్నాయి. కొత్తగా రూపొందించిన ఈ కోచ్‌లలో 83 బెర్త్‌లు ఉంటాయి. ► కోచ్‌లకు పెద్ద తలుపులు ఏర్పాటు చేయడంతోపాటు నడవా (బెర్త్‌ల మధ్య ఖాళీ జాగా) విశాలంగా ఉంటుంది. దాంతో దివ్యాంగులకు ఇబ్బందులు తొలగుతాయి. ► భద్రతకు మరింత ప్రాధాన్యమిచ్చారు. టాయిలెట్లు పెద్దగా ఏర్పాటు చేశారు. అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో.. ఒక్కో కోచ్ తయారీకి రూ.3 కోట్లు ఖర్చవుతుంది. రాజధాని, శతాబ్ధి, దురంతో, జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లు మినహా మిగిలిన అన్ని రైళ్లలోనూ వీటిని అందుబాటులోకి తెస్తారు. 2021–22లో 248 కోచ్‌లు తయారు చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది నుంచి కోచ్‌ల తయారీని ఇంకా పెంచాలని భావిస్తోంది. త్రీ టైర్ ఏసీ కోచ్‌లో ప్రయాణ చార్జీలను రైల్వే బోర్డు త్వరలో నిర్ణయించనుంది. -
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కరోనా కలకలం
కాజీపేట రూరల్: ఇండోనేసియాలో పర్యటించి వచ్చిన దంపతులు క్వారంటైన్ నిబంధనను ఉల్లంఘించి శనివారం రైలు ప్రయాణం చేయడం కలకలం సృష్టించింది. వీరికి అధికారులు వచ్చే నెల 5వ తేదీ వరకు క్వారంటైన్ స్టాంపింగ్ వేయగా.. ఎవరికీ చెప్పకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. కొద్ది దూరం ప్రయాణించాక వారి చేతులపై ఉన్న స్టాంప్‌ను గమనించిన రైల్వే సిబ్బంది, సహ ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదుతో వారిని కాజీపేటలో దింపి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్‌కు పంపించారు. ఈ సందర్భంగా రైలు గంటన్నర పాటు కాజీపేటలో ఆగింది. ఇండోనేసియాకు విహారయాత్ర.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భార్యాభర్తలు రోహిత్ కుమార్, పూజా యాదవ్ ఇటీవల ఇండోనేసియాలో విహారయాత్రకు వెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం వీరు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా.. పరీక్షల అనంతరం చేతులపై క్వారంటైన్ స్టాంపులు వేసిన అధికారులు.. 14 రోజుల పాటు నిర్బంధం లో ఉండాలని సూచించారు. వచ్చే నెల 5వ తేదీ వరకు క్వారంటైన్లో ఉండాల్సి ఉన్నా.. ఎవరికీ చెప్పకుండా శనివారం ఉదయం క్వారంటైన్ కేంద్రం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని బెంగళూరు నుంచి ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బీ–3 రిజర్వేషన్ కోచ్‌లో ఎక్కారు. వీరి చేతులపై ఉన్న స్టాంప్‌లను గమనించిన తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో జీఆర్పీ, సివిల్ పోలీసులు, అధికారులు.. రైలు కాజీపేట జంక్షన్‌కు చేరుకోగానే నిలిపివేసి ఈ దంపతులతో మాట్లాడారు. రైలు దిగాల్సిందే... ఆస్పత్రికి తీసుకెళతామని స్టేషన్ అధికారులు చెప్పగా.. రోహిత్ కుమార్, పూజా యాదవ్ దంపతులు అందుకు నిరాకరించారు. వారిని దింపితేనే రైలును కదలనిస్తామని మిగతా ప్రయాణికులు పట్టుబడ్డారు. అధికారులు ఆ దంప తులకు నచ్చచెప్పి స్టేషన్ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌కు పంపించారు. తర్వాత ఆ బోగీని శానిటైజేషన్ చేయించారు. దీంతో ఉదయం 10.30 గంటలకు కాజీపేట చేరుకున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ గంటన్నర ఆలస్యంతో కాజీపేట నుండి 12 గంటలకు బయలుదేరింది. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. మరో ప్రయాణికుడిపై ఫిర్యాదు ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఒక ప్రయాణికుడికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని సహచర ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆ వ్యక్తిని ఆలేరులో దింపి చికిత్స కోసం అక్కడి ఆస్పత్రికి పంపించారు. ఆ తర్వాత కృష్ణా ఎక్స్‌ప్రెస్ కోచ్‌ను శానిటైజర్‌తో శుభ్రం చేసి కాజీపేట వైపు పంపించగా కాజీపేటలోనూ శుభ్రం చేసి తిరుపతి వైపు పంపించారు. -
రైలు ప్రయాణం మరింత భద్రం
ఇన్నాళ్లూ జరిగినట్లుగా.. ఆఖరి నిమిషంలో రైలెక్కే సన్నివేశాలు ఇకపై కనిపించకపోవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో రైలు ప్రయాణికులంతా ప్రయాణానికి 20 నిమిషాలు ముందే స్టేషన్ చేరుకోవాలి. తమ లగేజీ తనిఖీ చేసుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి. ఇకపై రైలుప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ప్రయాణానికి అనుమతించనున్నారు. ఇలాంటి ఎన్నో మార్పులకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరచడంతోపాటు రక్షణ పరంగా కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా కేంద్ర రైల్వే బోర్డు పలు సంస్కరణలు చేపడుతోంది. ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ (ఐఎస్ఎస్) పేరిట దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లలో ఈ భద్రతా ఏర్పాట్లను విస్తరించనున్నారు. ఇప్పటికే అలహాబాద్, హుబ్లీ స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీ లిస్తోన్న రైల్వేశాఖ త్వరలోనే దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్)లో ఈ సేవలను విస్తరించనుంది. ఇందుకోసం ఎస్సీఆర్ పరిధిలోని సికింద్రాబాద్, నాంపల్లి, తిరుపతి స్టేషన్లను ఎంపిక చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పాత్ర అత్యంత కీలకం కానుంది. – సాక్షి, హైదరాబాద్ ఎలాంటి ఏర్పాట్లు వస్తాయి? ఐఎస్ఎస్ విధానం ఏర్పాట్లలో భాగంగా స్టేషన్ పరిసరాలన్నింటినీ సీసీటీవీ కెమెరాల నిఘాలోకి తీసుకువస్తారు. స్టేషన్ పరిధిలో అసాంఘిక శక్తుల కదలికలను పసిగట్టి వారి ఆటకట్టించేందుకు ఇది దోహదపడనుంది. ఇకపై రైళ్లల్లో ఎవరెవరు ఎక్కుతున్నారన్న విషయం రికార్డవుతుంది. తద్వారా రైల్లో నేరాలు, చోరీలు తగ్గుముఖం పడతాయి. ఈ కట్టుదిట్టమైన వ్యవస్థ కోసం అదనంగా ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది అవసరమవుతారు. డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్, హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్స్, అండర్ వెహికల్ స్కానర్స్, ఫేస్ రికగ్నేషన్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే సికింద్రాబాద్ స్టేషన్లో దాదాపుగా ఈ ఏర్పాట్లన్నీ ఉన్నాయి. ప్రతీ ప్రవేశ ద్వారం, బయటికి వెళ్లే మార్గంపై సునిశిత నిఘా ఉంటుంది. ఇందుకోసం కొన్ని మార్గాలను ఆనుకుని ప్రహరీలు నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యవస్థను అమలు చేయాలంటే ఇపుడున్న వ్యవస్థను మరింత బలోపేతం చేసి అదనపు సిబ్బందిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వల్ల లాభాలేంటి? - రైళ్లలో ప్రయాణం మరింత సురక్షితమవుతుంది - నేరస్తులు ఇకపై రైళ్ల ద్వారా పరారయ్యే అవకాశాలుండవు - టికెట్ లేని ప్రయాణాలు తగ్గుముఖం పడతాయి - మాదకద్రవ్యాలు, మారణాయుధాలు తదితరాల అక్రమరవాణాకు వీలుండదు - ఉగ్రవాదులు, పాత నేరస్తులను సులభంగా గుర్తించవచ్చు - అనుమానితులు స్టేషన్లోకి చొరబడలేరు - తప్పిపోయిన, ఇంటినుంచి పారిపోయిన చిన్నారులను గుర్తించడం సులభం - ఆడపిల్లలు, మహిళల అక్రమరవాణాకు కూడా ముకుతాడు నిజంగా సవాలే! సికింద్రాబాద్ స్టేషన్లో ఒక్క రోజు జరిగే కార్యకలాపాలను గమనిస్తే.. ప్రయాణించే రైళ్లు : 215 ప్రయాణీకులు : 1,80,000 ప్లాట్‌ఫామ్‌లు : 10 ప్రవేశద్వారాలు : 6 - ఒక్క సికింద్రాబాద్ స్టేషన్ నుంచే ఇంత మంది ప్రజలు ప్రయాణాలు సాగిస్తే.. వీరందరిని రైలు వచ్చేలోగా తనిఖీ చేసి పంపడం సవాలే. - దేశంలో నలుమూలలా భిన్న వాతావరణాలుంటాయి. ఇవి రైళ్ల రాకపోకల్లో జాప్యానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పయాణికులను తనిఖీ చేయడమంత సులువు కాదు. - పండుగలు, పర్వదినాలు, మేళాలు జరిగినపుడు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయాల్లోనూ సిబ్బందికి తనిఖీలు నిర్వహించడం కత్తిమీదసామే. - ఇప్పటికే ప్రతిరోజూ 300 రైళ్లల్లో 321 ఆర్పీఎఫ్, 154 మంది జీఆర్పీ పోలీసులు గస్తీ కాస్తున్నప్పటికీ.. నేరాలు తగ్గినట్లు కనిపించడం లేదు. అధికారిక ఆదేశాలు రాలేదు నూతన సమీకృత భద్రతా వ్యవస్థ (ఐఎస్ఎస్) అమలుకు సంబంధించిన ఆదేశాలు అధికారికంగా అందలేదు. ఎస్సీఆర్ పరిధిలోని తిరుపతి, సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇది పూర్తిస్థాయిలో అమలు కావాలంటే మరికాస్త సమయం పట్టే అవకాశముంది – రాకేశ్ సీపీఆర్వో, దక్షిణమధ్య రైల్వే. -
రైలుబండి.. సినిమాలండి!
రైలు ప్రయాణంలో బోరు కొడుతోందా? మీ సీరియళ్లు, క్రికెట్ మ్యాచ్‌లు మిస్సవు తున్నామన్న బెంగా? సినిమాలు చూద్దామంటే నెట్ బ్యాలెన్స్ తక్కువుందా? లైట్ తీసుకోండి.. ఎందుకంటే.. రైల్వే శాఖ లేటెస్ట్గా తెస్తున్న ఓ కొత్త సదుపాయం ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపనుంది. – సాక్షి, హైదరాబాద్ ఇంతకీ ఏమిటది? మనకు తెలిసిందే.. వైఫై.. ఇళ్లలో ఉన్నట్టుగానే ఇప్పుడు వీటిని బోగీల్లోనూ పెట్టనున్నారు. ఇప్పటికే ఈ హాట్స్పాట్లను ఆపరేషన్ స్వర్ణ్ కింద శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే అధికారులు పరీక్షించి చూశారు కూడా. ప్రయోగం విజయవంతమవడంతో మరిన్ని రైళ్లకు విస్తరించనున్నారు. తేజస్‌లో అనుకున్నా.. తొలుత దీన్ని తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో అమలు చేద్దామనుకున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌లో ప్రతీసీటుకు ఓ ఎల్సీడీ స్క్రీన్ ఉంటుంది. అయితే, మొన్నామధ్య ఈ తేజస్ ముంబై– గోవా ట్రైన్లో సీట్లకు ఉన్న ఎల్సీడీ స్క్రీన్లను, హెడ్సెట్లను ప్రయాణికులు ఎత్తుకెళ్లడంతో రైల్వేశాఖ వెనకడుగు వేసింది. మరి ఏయే రైళ్లలో.. శతాబ్ది, ప్రీమియం, దురంతోలాంటి రైళ్లలో దీన్ని అందు బాటులోకి తేనున్నారు. ఫోన్లు, ల్యాప్‌టాపుల్లో వైఫై కనెక్ట్ చేసుకుని.. కావాల్సిన సినిమా, సీరియళ్లు, మ్యాచ్‌లు చూసుకోవచ్చు. త్వరలో టెండర్లు పిలిచేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తారా లేదా తెలియరాలేదు. దీనిపై త్వరలోనే రైల్వే శాఖ ఓ నిర్ణయం తీసుకోనుంది. -
ఆ రైలు టిక్కెట్ ధర అక్షరాల రూ.2లక్షలు..
న్యూఢిల్లీ : రైలులో దూర ప్రయాణాలు చేసే వారికి శుభవార్త. రోజుల తరబడి చేసే ట్రైన్ జర్నీలు ఇప్పుడు సాఫీగా సాగిపోతాయి. ఇరుకిరుకు బోగీలలో అష్టకష్టాలు పడాల్సిన అవసరం లేదు. దూర ప్రయాణాలు చేసేవారి కోసం ‘‘ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్’’ (ఐఆర్సీటీసీ) కొత్తగా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లతో విలాసవంతమైన ‘‘స్వాంకీ సెలూన్ కోచ్’లను అందుబాటులోకి తెచ్చింది. ఈ బోగీలలో మీ ప్రయాణం ఎలా ఉంటుందంటే.. విశాలమైన ఏసీ గదులు, రూమ్ విత్ పర్నిచర్, అటాచ్డ్ బాత్రూం, పిలవగానే వచ్చే సేవకులు. మొత్తానికి ఓ లగ్జరీ హోటల్లో సూట్ రూమ్ బుక్ చేసుకున్నట్లు ఉంటుంది. సామాన్య పౌరునికి కూడా విలాసవంతమైన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఐఆర్సీటీసీ వీటిని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ బోగీలను ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని జమ్మూ మేయిల్‌తో పాటు జతచేసి నడుపుతున్నారు. మొత్తం 336 సెలూన్ కోచ్‌లు ఉండగా వాటిలో 66ఏసీవి. ‘‘స్వాంకీ సెలూన్ కోచ్’లలో ప్రయాణించడానికి ‘‘ఐఆర్సీటీసీ’’ వెబ్సైట్లో వెళ్లి ఓ టిక్కెట్ బుక్ చేసుకుంటే సరి. ధర విషయానికొస్తే లగ్జరీ అంటున్నాం కాబట్టి.. డబ్బులు కూడా లగ్జరీకి తగ్గట్టుగానే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో టిక్కెట్ ధర అక్షరాల రూ. 2లక్షలు.. 18 ఫస్ట్‌క్లాస్ టిక్కెట్లతో సమానం. అంటే ‘‘స్వాంకీ సెలూన్ కోచ్’లో ఒక్క టిక్కెట్ కొంటే ఫస్ట్‌క్లాస్ బోగీలలో 18సార్లు ప్రయాణించవచ్చు. -
మత్తు మందుకు గురైన బాధితులకు పరామర్శ
ఎంజీఎం (వరంగల్) : సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో మత్తుమందుకు గురై సృహ కోల్పోయిన బాధితులను రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైనా వైద్యచికిత్సలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం రాత్రి 10 గంటలకు సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ యశ్వంత్ పూర్ టూ న్యూఢిల్లీ వెళ్తుండగా ఆరుగురు రైలు ఎక్కారన్నారు. రైలు గంట ప్రయాణించిన తరువాత రైళ్లో ఇంకొందరు ఎక్కారు. వీరు ప్రయాణికులతో పరిచయం ఏర్పర్చుకుని సమోస, మజా, బిస్కెట్స్ తినిపించారు. వాటిని తినగానే ఆరుగురు వ్యక్తులు సృహ కోల్పోయినట్లు తెలిపారు. దాదాపు అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చినా వారు లేవకపోవడంతో తోటి ప్రయాణికులు మనించి రైల్వే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. స్పందించిన రైల్వే కంట్రోల్ రూమ్ ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు కాజీపేట స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే ఇక్కడి ఇన్స్పెక్టర్, వైద్యులు అప్రమత్తమై అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి బాగానే ఉందని, ఒక్క ప్రయాణికుడు మాత్రం సృహాలోకి రాలేదని తెలిపారు. -
ముందస్తు’తో చౌక ప్రయాణం
న్యూఢిల్లీ: ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న రైలు ప్రయాణికులు విమాన ప్రయాణికుల మాదిరిగా రాయితీలు పొందే అవకాశాలున్నాయి. టికెట్ ధరల సమీక్షపై ఏర్పాటు చేసిన కమిటీ పలు కీలక సూచనలతో ఇటీవల తన నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించింది. కమిటీ ప్రతిపాదించిన వాటిలో ముఖ్యమైనవి.. ► నెలరోజుల ముందుగా సీట్లు బుక్ చేసుకునే వారికి అప్పటికి ఖాళీగా ఉన్న సీట్ల సంఖ్యను బట్టి టికెట్ ధరలో 50 శాతం నుంచి 20 శాతం వరకు రాయితీ. ► రైలు ప్రయాణానికి రెండు రోజుల నుంచి రెండు గంటల ముందు వరకు బుక్ చేసుకున్న టికెట్లపైనా స్లాట్ ప్రకారం తగ్గింపు. ► ప్రయాణానికి రెండు రోజుల ముందు నుంచి రెండు గంటల ముందు వరకు బుక్ చేసుకున్న వారికి రాయితీ. ► దివ్యాంగులు, గర్భిణులు, వృద్ధులకు మాత్రం ఎలాంటి అదనపు చార్జీ లేకుండానే లోయర్ బెర్తు. ► అర్ధరాత్రి నుంచి వేకువజాము 4 గంటల మధ్య, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటలకు మధ్య కాకుండా సౌకర్యంగా ఉండే ఉదయం వేళల్లో గమ్య స్థానానికి చేరుకునే రైలు ప్రయాణికులపై అదనపు చార్జీ. ► ప్రయాణికుల డిమాండ్, రైళ్లను బట్టి జోనల్ స్థాయిలో టికెట్ ధర నిర్ణయం. ► రద్దీ ఉండే పండుగ రోజులు, సెలవు దినాల్లో ఎక్కువ ఛార్జీలు. అంతగా రద్దీ ఉండని సమయాల్లో టికెట్ ధరపై తగ్గింపు. ► ప్రీమియం రైళ్లు, ప్యాంట్రీకార్ ఉండే రైళ్లలో టికెట్ ధర 50 శాతం వరకు పెంపు. -
500 రైళ్ల ప్రయాణ సమయం తగ్గింపు
న్యూఢిల్లీ: ఎక్కువ దూరం ప్రయాణించే దాదాపు 500 రైళ్ల ప్రయాణ సమయాన్ని వచ్చే నెల నుంచి సరాసరి దాదాపు 15 నిమిషాల నుంచి 2 గంటల వరకూ తగ్గించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది. రైల్వే మంత్రి ఆదేశాల మేరకు ఈ కొత్త టైం టేబుల్‌ను నవంబర్ నుంచి అమలు చేయనున్నారు. కొత్త టైం టేబుల్ అమల్లోకి వచ్చిన వెంటనే 51 రైళ్ల ప్రయాణ సమయం గంట నుంచి 3 గంటల వరకూ తగ్గుతుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. దీన్ని క్రమంగా 500 రైళ్లకు పెంచుతామని చెప్పారు. రైళ్ల వేగం పెంపులో భాగంగా 50 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ సర్వీసుగా మార్చుతామని ఆయన పేర్కొన్నారు -
అద్దాల రైలులో.. అందాల వీక్షణం!
- గాజు బోగీల తయారీలో రైల్వే - ప్రకృతి రమణీయత ఉట్టిపడే మార్గాల్లో తిరిగే రైళ్లకు ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణం అనగానే.. రాత్రివేళ బండి ఎక్కి.. రైలు బయలుదేరాక కిటికీలు మూసి నిద్రకు ఉపక్రమించటం పరిపాటి. ఇక పగటి పూట దూర ప్రయాణాలు చేసేవారు రైలులో కూర్చోవటం పెద్ద ఇబ్బందిగా భావిస్తుంటారు. ఇప్పుడా పరిస్థితి మారబోతోంది. మీ ప్రయాణం ఆహ్లాదంగా సాగేలా రైల్వే కొత్త ప్రణాళిక రూపొందించింది. న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ తరహాలో గాజు బోగీలను ప్రారంభించేందుకు రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. అటు ఆకాశం, ఇటు రెండు వైపులా బయటి దృశ్యాలు కనిపించేలా బోగీలు గ్లాస్‌తో ఉంటారుు. ప్రకృతి రమణీయత ఉట్టిపడే ప్రాంతాల గుండా రైలు దూసుకెళ్తుంటే ఆ దృశ్యాలు ఆస్వాదిస్తూ ప్రయాణికులు ముందుకు సాగుతారు. కొత్త గాజు బోగీలను ప్రకృతి రమణీయత ఉండే మార్గాల్లో తిరిగే రైళ్లకు అమరుస్తారు. ఆదిలాబాద్ అడవి.. అరకు సోయగం.. వచ్చే జనవరి నాటికల్లా గాజు బోగీలను అందుబాటులోకి తెచ్చేలా రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. రైలు పర్యాటకానికి కొత్త ఊపు తెచ్చే క్రమంలో ఐఆర్సీటీసీ దీనికి రూపకల్పన చేసింది. ‘ది రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)’ఆధ్వర్యంలో తమిళనాడు పెరంబూర్‌లోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ బోగీలను సిద్ధం చేస్తున్నారు. తొలి బోగీని కశ్మీర్లో తిరిగే రైలుకు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ తరహా బోగీలను ఏర్పాటు చేయాలని ఐఆర్సీటీసీ ప్రతిపాదించింది. ఇందులో ఏపీలోని అరకు లోయ మార్గంలో తిరిగే రైలుకు ఏర్పాటు చేయనున్నారు. మలివిడతలో నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని దట్టమైన అటవీ మార్గం గుండా సాగే మార్గంలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని మార్గాల్లో గాజు బోగీలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. కొన్ని మార్గాల్లో శీతాకాలం, వానా కాలంలో మాత్రమే వీటిని నడిపి ఆ తర్వాత రద్దు చేస్తారు. ఇలాంటి ఒక్కో బోగీ తయారీకి రూ.4 కోట్ల వరకు ఖర్చవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. -
రైల్వే సీజన్ టికెట్లపై 4 లక్షల ప్రమాద బీమా
భువనేశ్వర్: సీజన్ టికెట్‌దారులకు రైల్వేశాఖ రూ.4 లక్షల విలువైన ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, రోజూ రైలు ప్రయాణం చేసేవారు దీన్ని వినియోగించుకోవాలని, ప్రయాణానికి ముందే టికెట్ కొనే విధానానికి స్వస్తిపలకాలని కోరింది.రోజూ 1-20 కి.మీలు ప్రయాణించేవారు నెలవారీ సీజన్ టికెట్(ఎంఎస్టీ)కు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. అలాకాక ప్రతిరోజు టికెట్ కొంటే రూ. 600 ఖర్చవుతుంది. అలాగే త్రైమాసిక సీజన్ టికెట్(క్యూఎస్‌టీ)కు రూ.270 చెల్లించాలి. రానుపోనుకు మూడు నెలలపాటు టికెట్ కొంటే రూ.1800 ఖర్చవుతుంది. ఎంఎస్టీ, క్యూఎస్‌టీ టికెట్దారులు లోకల్ ప్యాసింజర్ రైళ్లలో అపరిమితంగా ప్రయాణించవచ్చని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. -
మోదీ చారిత్రక రైలు ప్రయాణం
-
మోదీ చారిత్రక రైలు ప్రయాణం
దక్షిణాఫ్రికాలో గాంధీని రైల్లోంచి తోసేసిన ప్రాంతాన్ని సందర్శించిన ప్రధాని - భారత వృద్ధి ఫలాలను ఆఫ్రికాకు అందిస్తాం డర్బన్ : ప్రపంచంలో అత్యంత ఉజ్వలమైన కేంద్రాల్లో భారతదేశం ఒకటని అభివర్ణిస్తూ.. భారత ఆర్థిక పురోగతి ప్రయోజనాలను ఆఫ్రికాకు, ప్రత్యేకించి దక్షిణాఫ్రికాకు అందించటానికి సిద్ధంగా ఉన్నామని మోదీ పేర్కొన్నారు. భారత ప్రధాని గౌరవార్థం డర్బన్ మేయర్ శనివారం ఏర్పాటు చేసిన ఆతిథ్య కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సహకారం పెంపొందాలని అభిలషించారు. ‘21వ శతాబ్దంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లు మారి నా.. అభివృద్ధికి సంబంధించిన మన ఆందోళనలు ఒకే తరహావి. మన అభివృద్ధి భాగస్వామ్యం ఫలితం మన సమాజంలో అది ఎక్కువగా అవసరమున్న వర్గాల వారికి అం దేలా చూడటానికి నేను కృషి చేస్తున్నా’ అని పేర్కొన్నా రు.డర్బన్‌లో అత్యధిక జనాభా భారతీయులేనన్న విషయం పట్ల గర్విస్తున్నామని పేర్కొన్నారు. భారత్‌కు వెలుపల అతి పెద్ద భారతీయ నగరం డర్బనేనన్నారు. శనివారం డర్బన్‌లో కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన రెండు రోజుల దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుని టాంజానియాకు వెళ్లారు. పీటర్‌మారిట్జ్‌బర్గ్ : దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ‘చరిత్రాత్మక’ రైలు ప్రయాణం చేశారు. దక్షిణాఫ్రికాలో నాడు మహాత్మాగాంధీ ప్రయాణం చేసిన మార్గంలో ప్రయాణించారు. జాతిపితను రైల్లో నుంచి తోసేసిన రైల్వే స్టేషన్‌ను మోదీ సందర్శించారు. శుక్రవారం ఆ దేశాధ్యక్షుడు జాకబ్ జుమాతో, ప్రవాస భారతీయులతో సమావేశమైన మోదీ శనివారం పెంట్రిచ్ రైల్వే స్టేషన్ నుంచి పీటర్‌మారిట్జ్‌బర్గ్ స్టేషన్‌కు పయనించారు. 1893లో గాంధీ ఈ రైల్వేస్టేషన్లో మొదటితరగతి టికెట్ తీసుకొని ప్రయాణిస్తుండగా, జాతి వివక్ష కారణంగా ఆయనను మూడో తరగతి బోగీలో ప్రయాణించాలని అధికారులు ఆదేశించారు. అయితే, ఆ ఆదేశాలను లెక్కచేయకపోవడంతో వారు గాంధీని రైల్లోంచి తోసేశారు. ‘మోహన్‌దాస్ (కరంచంద్ గాంధీ) మహాత్ముడిగా అవతరించడానికి బీజం పడింది ఈ స్థలంలోనే’ అని మోదీ పీటర్‌మారిట్జ్‌బర్గ్ స్టేషన్ వద్ద అన్నారు. 1893, జూన్ 7న రైల్లో జరిగిన ఘటనతోనే గాంధీ దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. తర్వాత భారత స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారు. ఇది నాకు తీర్థయాత్ర..తాను భారత చరిత్రకు, జాతిపిత జీవితానికి కీలకమైన ప్రాంతాల్లో పర్యటించానని మోదీ చెప్పారు. ‘ఈ దక్షిణాఫ్రికా పర్యటన నాకు తీర్థయాత్ర లాంటిది. భారత చరిత్రకు,గాంధీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన మూడు ప్రాంతాల్లో పర్యటించే అవకాశం లభించడం నా అదృష్టం’ అని అన్నారు. పీటర్మార్టిజ్బర్గ్లో గాంధీని తోసేసిన ప్రాంతాన్నీ మోదీ సందర్శించారు. పీటర్‌మారిట్జ్‌బర్గ్ ఘటనే భారత చరిత్రగతిని మార్చేసిందని అక్కడి సందర్శకుల పుస్తకంలో మోదీ రాశారు. ఆస్టేషన్‌లో మోదీ ఒక ఎగ్జిబిషన్‌ను ఆవిష్కరించారు. తోసివేత తర్వాత ఆ రోజు రాత్రి గాంధీ తీవ్ర చలిలో స్టేషన్‌లోని వెయిటింగ్ హాల్లో గడిపారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా, అన్యాయాలపై చేసిన పోరాటంలో గాంధీ ఎన్నో బాధలను తట్టుకున్నారని మోదీ పేర్కొన్నారు.అనంతరం మోదీ గాంధీ రాజకీయ కార్యకలాపాల కోసం వినియోగించిన ఫీనిక్స్ సెటిల్మెంట్ను సందర్శించారు. గాంధీ మనుమరాలు ఇలాగాంధీ మోదీ వెంట ఉండి ఈ ప్రాంత విశేషాలను వివరించారు. -
1,500 కి.మీ. 5 గంటల్లో..
ఢిల్లీ నుంచి కోల్‌కతాకు బుల్లెట్ రైలుపై కసరత్తు న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి కోల్‌కతాకు 5 గంటలలోపే చేరుకోవచ్చు! 1,513 కి.మీ దూరమున్న ఈ మార్గంలో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఈ మార్గంలో బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఇది కార్యరూపంలోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కసరత్తు బాధ్యతను రైల్వే శాఖ స్పెయిన్‌కు చెందిన కన్సల్టెన్సీకి అప్పగించింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వజ్ర చతుర్భుజి ప్రాజెక్టులో ఢిల్లీ-కోల్‌కతా కారిడార్ భాగమని రైల్వే శాఖ అధికారి ఒకరు చెప్పారు. దీనికి రూ. 84 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా. స్పెయిన్ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం ఈ ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రయాణం ఢిల్లీ-కోల్‌కతాకు 4.56 గంటలు పడుతుంది. అదే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో 17 గంటలు పడుతుంది. బుల్లెట్ రైలు గంటలకు 300 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ఈ మార్గంలో ఆగ్రా, లక్నో, వారణాసి, పట్నాలతోపాటు 12 నగరాలు కలుస్తాయి. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ అందుబాటులోకి వస్తే ఢిల్లీ నుంచి లక్నోకు, వారణాసికి, పట్నాకు ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది ఢిల్లీ నుంచి 506 కి.మీ దూరంలో ఉన్న లక్నోకు 1.45 గంటలు, 782 కి.మీ. దూరంలో ఉన్న వారణాసికి 2.45 గంటలు పడుతుంది. 4 మెట్రో నగరాలను హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్‌తో అనుసంధానించే వజ్ర చతుర్భుజి ప్రాజెక్టులో భాగమైన ఢిల్లీ-ముంబై, ముంబై-చెన్నై హైస్పీడ్ కారిడార్ సాధ్యాసాధ్యాలపైనా అధ్యయనం చేయనున్నారు. దూరం-ప్రయాణ సమయం ఢిల్లీ-లక్నో 506 కి.మీ. 1.45 గంటలు ఢిల్లీ-వారణాసి 782 కి.మీ. 2.40 గంటలు ఢిల్లీ-కోల్‌కతా 1,513 కి.మీ. 4.56 గంటలు ఎంత ఖర్చవుతుంది? ఢిల్లీ-కోల్‌కతా కారిడార్ రూ.84 వేల కోట్లు -
యువర్ అటెన్షన్ ప్లీజ్..!
రైలు ప్రయాణానికి ఎన్నో సౌకర్యాలు, మరెన్నో సదుపాయాలు ♦ ఇంటి నుంచే ఆన్లైన్లో రైలు టికెట్ పొందే అవకాశం ♦ ఏ రైలు ఎక్కడుందో, ఎప్పుడు వస్తుందో చిటికెలో సమాచారం ♦ ఆన్లైన్లోనే నచ్చిన భోజనం ఆర్డరిచ్చే వెసులుబాటు ♦ పోర్టర్లు, టాక్సీ, హోటల్ గదులనూ ముందే బుక్ చేసుకోవచ్చు ♦ ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌తో చెంతనే ఎన్నో సేవలు రైలు ప్రయాణం ఒక అనుభూతి.. అదో ఆహ్లాదం.. మనవారి కోసమో, ఏదైనా పనిమీదో, పర్యటన కోసమే రైలు ప్రయాణం చేస్తూనే ఉంటాం. రైలు ప్రయాణం ఎంత బాగున్నా.. టికెట్ తీసుకోవడం దగ్గరి నుంచి భోజనం దాకా ఎన్నో సమస్యలు.. రెలైప్పుడు వస్తుంది, ఎంత లేటుగా వస్తుంది, మన టికెట్ రిజర్వేషన్ పరిస్థితి ఏమిటి అంటూ ఎన్నో సందేహాలు. కానీ ఇప్పుడు రైల్వే అంతా ఆన్లైన్. ఇంట్లోనే కూర్చుని ముందుగానే కావాల్సిన చోటికి, కోరుకున్న రైల్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. రైలుకు సంబంధించిన వివరాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రైల్వే సిబ్బంది, పోలీసుల నుంచి అవసరమైన సహాయం పొందవచ్చు. రైల్లో తినే భోజనంతోపాటు గమ్యస్థానంలో దిగగానే అవసరమైన పోర్టర్లు, ట్యాక్సీలనూ, హోటల్ గదులనూ ముందే బుక్ చేసుకోవచ్చు. ఇన్ని సౌకర్యాలున్నా.. చాలా మంది దీనిపై అవగాహన లేక టికెట్ల కోసం స్టేషన్లలో, ప్రయాణంలో తంటాలు పడుతుంటారు. అలాంటివారితోపాటు అందరికీ అవగాహన కల్పించేందుకే ఈ వారం ఫోకస్.. - సాక్షి, హైదరాబాద్ స్టేషన్‌కు వెళ్లకుండానే టికెట్లు రైలు ప్రయాణం అంటే టికెట్ కోసం కుస్తీ పట్టాల్సి ఉంటుందని చాలామంది జంకుతారు. కానీ స్టేషన్‌కు వెళ్లాల్సిన పని లేకుండానే ఆన్లైన్లో హాయిగా టికెట్ తీసుకోవచ్చు. కంప్యూటర్లోగానీ, సెల్‌ఫోన్‌లోగానీ ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఓపెన్ చేసి కోరుకున్న రైలుకు, కావాల్సిన చోటికి టికెట్ బుక్ చేసుకోవచ్చు. లేదా ఇంటికి చేరువలో ఉన్న ఐఆర్సీటీసీ అనుబంధ ప్రైవేటు కేంద్రాలకు వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మొత్తం రైలు టికెట్లలో 58 శాతం ఆన్లైన్ ద్వారా బుక్ అవుతున్నట్టు రైల్వే అధికారులు గుర్తించారు. అంటే 42 శాతం మంది మాత్రమే రైల్వే కౌంటర్లకు వెళ్లి టికెట్ కొంటున్నారు. ఈ 42 శాతం మందిలోనూ ఈ-టికెటింగ్‌పై అవగాహన లేక దాన్ని వినియోగించుకోలేనివారే ఎక్కువ. 120 రోజుల ముందే రిజర్వేషన్ దూర ప్రయాణాలకు ముందస్తుగా టికెట్ కొనేందుకు నాలుగు నెలల గడువును రైల్వే నిర్ధారించింది. అంటే ప్రయాణానికి 120 రోజుల ముందు నుంచీ టికెట్ కొనుక్కోవచ్చు. గతంలో దీన్ని 60 రోజులకు కుదించిన రైల్వే... తిరిగి గత బడ్జెట్‌కు ముందు 120 రోజులకు పెంచింది. మరెన్నో సేవలు కూడా.. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కేవలం రైలు ప్రయాణం కోసం టికెట్లు తీసుకోవడమేకాదు.. మరెన్నో ఇతర సేవలు పొందవచ్చు. నచ్చిన ఆహారం తినొచ్చు.. రైల్లో ప్రయాణిస్తూ ప్యారడైజ్ హోటల్లో తయారైన దమ్ బిర్యానీ తినాలని ఉందా? మీరే హోటల్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా రైల్వే సిబ్బందే దాన్ని మీకు బోగీలోకి తెచ్చి అందిస్తారు. మీరు ప్రయాణంలో ఉండగానే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇచ్చి పొందొచ్చు. మీకు కన్ఫర్మేషన్ టికెట్ ఉంటే ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఈ- కేటరింగ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి (ఈ-కేటరింగ్ మొబైల్ యాప్ కూడా ఉంది). అందులో ఏ హోటల్ భోజనం కావాలో జాబితా వస్తుంది (ఒప్పందం ఉన్న హోటళ్లు). అందులో కావాల్సిన మెను, ఏ స్టేషన్లో అందించాలనే వివరాలను ఎంచుకుని, టికెట్ పీఎన్ఆర్ నంబర్‌ను ఎంటర్ చేస్తే చాలు. రైలు ఆ స్టేషన్‌కు రాగానే సిబ్బంది వచ్చి నిర్ధారిత భోజనాన్ని అందిస్తారు. క్యాబ్, పోర్టర్ సిద్ధం రైలు దిగగానే సామాను మోసేందుకు పోర్టర్ కోసం ఎదురు చూడాల్సిన పనిలేకుండా ఆన్లైన్ ద్వారా ముందే బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ట్యాక్సీని కూడా ముందే ఎంగేజ్ చేసుకోవచ్చు. దీనికి కన్ఫర్మ్ టికెట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. నడవలేని వారుంటే వీల్‌చైర్ కూడా బుక్‌చేసుకోవచ్చు. హోటల్ గది కావాలా.. కొత్త ప్రాంతానికి వెళుతున్నట్లయితే దిగగానే హోటల్ కోసం వెదుక్కోవాల్సిన పనిలేకుండా ఐఆర్సీటీసీ ద్వారా హోటల్ గదిని ముందే బుక్ చేసుకోవచ్చు. ఆ ప్రాంతంలోని హోటళ్ల వివరాలు నమోదు చేసి ఉన్న ఒక వెబ్సైట్ లింక్ ఐఆర్సీటీసీ వెబ్సైట్లో కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే.. హోటళ్లు, అవి ఉన్న ప్రాంతాలు, రైల్వే స్టేషన్ నుంచి చేరుకునే మార్గం, ధరల పట్టిక అంతా కనిపిస్తుంది. హోటల్ గది అవసరం లేదనుకుంటే రైల్వేస్టేషన్లో ఉండే విశ్రాంతి గదులను కూడా బుక్ చేసుకోవచ్చు. గరిష్టంగా రెండు రోజులు ఉండేలా వాటిని బుక్ చేసుకోవచ్చు. విమానం టికెట్టూ తీసుకోవచ్చు రైల్వేకు సంబంధించిన వెబ్సైట్ ద్వారా విమానం టికెట్లను కూడా బుక్ చేసుకునే వెసులుబాటు గురించి చాలామందికి తెలియదు. ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలు నిర్వహిస్తోంది. దేశ, విదేశీ పర్యటనలకు సంబంధించిన ప్యాకేజీలు కూడా ఉన్నాయి. దాని ద్వారా యాత్ర చేపడితే... ఐఆర్‌సీటీసీయే కన్ఫర్మ్ టికెట్‌ను అందించడంతోపాటు హోటల్, భోజనం, కారు వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. వేరే దేశాలకు వెళ్లేందుకు విమాన టికెట్లనూ సిద్ధం చేస్తుంది. ఈ టూర్లతో సంబంధం లేకుండా వ్యక్తిగత పనులపై విమాన ప్రయాణం చేయాలనుకునేవారు కూడా ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎంఎంటీఎస్‌లో ప్రత్యేక సేవలు హైదరాబాద్‌లో ప్రాచుర్యం పొందిన ఎంఎంటీఎస్ రైళ్లలో రెండు సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. హైలైట్స్(హైదరాబాద్ లైవ్ ట్రెయిన్ ఎంక్వైరీ సిస్టం) ఏ రైలు ఎక్కడుంది, ఎన్నింటికి స్టేషన్‌కు వస్తుంది, తర్వాతి రైలు రావడానికి ఎంత సమయం పడుతుంది, గమ్యస్థానానికి ఎప్పుడు చేరుతుంది.. ఇలా సమస్త సమాచారాన్ని తెలుసుకోగలిగే మొబైల్ యాప్ ఇది. పూర్తిగా జీపీఆర్ఎస్ ద్వారా పనిచేస్తుంది. ఎంఎంటీఎస్ రైళ్లే కాక సికింద్రాబాద్, హైదరాబాద్(నాంపల్లి), కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమాచారమూ లభిస్తుంది. రిస్టా (రైల్ ఇంటరాక్టివ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఫర్ ట్రావెలర్) ఎంఎంటీఎస్‌లో ప్రయాణించే వారు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. రక్షణపరంగా ఏదైనా సమస్య ఎదుర్కొంటే... ఆ యాప్‌లో ఫోన్ నంబర్ టైప్ చేసి, ట్యాప్ చేయగానే రైల్వే పోలీసులకు సమాచారం వెళుతుంది. కాల్ ఆప్షన్ క్లిక్ చేస్తే పోలీసులకు కాల్ వెళ్తుంది, ఎస్సెమ్మెస్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎస్సెమ్మెస్ వెళ్తుంది, ఎమర్జెన్సీపై ట్యాప్ చేస్తే అత్యవసర సహాయం కావాలని కోరుతుంది. దీంతో నిమిషాల వ్యవధిలోనే పోలీసులు మీ వద్దకు చేరుకుంటారు. మీకే స్పెషల్ బోగీ సాధారణంగా రైలుకు 18 నుంచి 21 వరకు బోగీలుంటాయి. ఎవరైనా 50 మందికి మించి స్నేహితులు, బంధువులు కలసి ప్రయాణించాలనుకుంటే.. వారి కోసం ప్రత్యేకంగా ఓ బోగీని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఐఆర్సీటీసీ కార్యాలయానికి వెళ్లి ఇలా బోగీని బుక్ చేసుకోవచ్చు. ఓ రైలు మొత్తాన్ని కూడా బుక్ చేసుకోవచ్చు. దానిని ప్రత్యేక రైలు పేరుతో కేటాయిస్తారు. సందర్భం, అవసరం తదితర అంశాలను పరిశీలించి వాటిని కేటాయిస్తారు. ఇందుకోసం సాధారణ చార్జీల కంటే ఎక్కువగా ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తారు. -
అందరం రైలుకు వెళుతున్నామన్నావే!
► అందుకే ఒప్పుకున్నా..! ► దుఃఖంతో రోదించిన మృతురాలి తండ్రి సిరుగుప్ప : నాయనా.. అందరూ ఫెండ్స్ కలిసి రైలుకు వెళుతున్నారు అన్నందుకే వెళ్లమని ఒప్పుకొన్నానని క్రూసర్ వాహనంలో వెళ్తామంటే ఒప్పుకొనేవాణ్ణి కాదని కన్నీరు కారుతుండగా గద్గద స్వరంతో మృతురాలి తండ్రి విరుపాక్షగౌడ తెలిపారు. తాలూకాలోని ఇబ్రాంపురం గ్రామంలో ఆదివారం ‘సాక్షి’తో మృతురాలి తండ్రి విరుపాక్షగౌడ తన ఆవేదన వెలి బుచ్చారు. తనకు పెద్ద కూతురు డీ.సుధా(19), ఇద్దరు కుమారులు ఒకరు దొడ్డబసవ(16), ఇంకొకరు నవీన్ కుమార్(13) వున్నారని తెలిపారు. కూ తురు సుధా బళ్లారిలోని శ్రీగురు తిప్పేరుద్ర కాలేజ్‌లో మొదటి సంవత్సరం బీ.కాం చదివిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగమేళాలో సెలెక్ట్ అయి బెంగళూరులో ఓరల్ ఇంటర్వ్యూ కోసం వెళ్లి కానరాని లోకానికి వెళ్లిందని పట్టరాని దుఃఖంతో తెలుపుతూ వుంటే పక్కన వున్న జనం కూడా దుఃఖం ఆపుకోలేక పోయారు. దిననిత్యం హోటల్ జీవనం సాగిస్తూ పిల్లలను చదివిస్తున్నానని తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషా ద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబం ఇంకా దుఃఖం నుంచి తేరుకోలేదు. గృహము, కుటుంబ జీవనానికి తోడ్పడుతున్న హోటల్ నిర్మానుష్యంగా మారాయి. గ్రామంలోని ప్రతి ఒక్కరు మృతురాలు సుధా తల్లి దండ్రులను ఓదార్చుతూ వున్నారు. ఎంత ఓదార్చిన వారి శోకం చూసే వారి హృదయాలను కలిచి వేస్తోంది. ఏదిఏమైనా ఇబ్రాంపురం గ్రామంలో హోటల్ జీవనం సాగించుకుంటున్న విరుపాక్షగౌడ తన పిల్లలను గారాబంగా పెంచి ఉన్నత చదువులు చదివించాలనుకొన్న ఆశలు పూర్తికాకముందే భగవంతుడు డీ.సుధాను పరలోకానికి తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చింతిస్తున్నారు. -
మరో రెండు వారాల్లో...
శరవేగంగా రైలు ప్రయాణం అందుబాటులోకి ఆధునిక సేవలు నగర వాసి కోర్కెలు నెరవేరే రోజులు చేరువయ్యాయి. గంటల తరబడి రహదారులపై పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా పోతోంది. నమ్మ మెట్రో పేరిట ఆధునిక నగర ప్రయాణ సేవలు అందుబాటులోకి రానుంది. బెంగళూరు: నగరంలోని తూర్పు-పశ్చిమ (ఈస్ట్-వెస్ట్) కారిడార్లను కలుపుతూ నిర్మించిన మెట్రో మరో రెండు వారాల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్ వెల్లడించారు. బెంగళూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన సోమవారం మాట్లాడారు. ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తున్నామని అదే విధంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అందుబాటులో ఉన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని గరిష్టంగా రెండు వారాల్లోపు ఈస్ట్-వెస్ట్ మెట్రో రైలును ప్రారంభిస్తామన్నారు. దీని వల్ల బయ్యపనహళ్లి నుంచి మైసూరు రోడ్డు వరకూ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మెట్రోలో ప్రయాణం చేవచ్చునని తెలిపారు. నగరంలో బసవేశ్వర సర్కిల్ నుంచి హెబ్బాళ వరకూ రూ.1,200 కోట్ల నిధులతో నిర్మించనున్న ఫ్లైఓవర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని కే.జే జార్జ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
రైలు ప్రయాణం పెనుభారం
- సరుకు రవాణాపై తప్పని వడ్డన - సర్వత్రా వ్యక్తమవుతున్న నిరసన - భారీగా పెరిగిన రైలు చార్జీలు - మోడీ ప్రభుత్వ నిర్ణయంపై జనం ఆగ్రహం గూడూరు/ నెల్లూరు (నవాబుపేట)/ నెల్లూరు (సెంట్రల్) : పేద, మధ్య తరగతి ప్రయాణికులకు అనుకూలమైన రైలు ప్రయాణం మరింత భారంగా మారింది. ప్రజలపై భారాలు మోపకుండానే దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని హామీలు గుప్పించిన నరేంద్రమోడీ ప్రధానిగా ఎన్నికై కొద్ది రోజుల్లోనే రైలు చార్జీలను మరింతగా పెంచి తన అసలు స్వరూపాన్ని చాటుకున్నారు. బస్సులెక్కి చార్జీలు చెల్లించలేక గంటల తరబడి కూడా వేచి ఉండి పేద, మధ్యతరగతి ప్రజలు రైలు ప్రయాణాలే చేశారు. ఒక్కసారిగా రైలు చార్జీలు కూడా భారీగా పెరగడంతో ప్రయాణికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పెరిగిన రైలు చార్జీల్లో ఈ నెల 25వ తేదీ నుంచి అమలు కానున్నాయి. రైలు ప్రయాణంపై 14.2 శాతం పెరగ్గా, లగేజీ చార్జీలు కూడా 6.5 శాతం పెరగడంపై అందరిలోనూ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సాధారణంగా ప్రయాణ చార్జీలపై 10 శాతం మాత్రమే పెరగాల్సి ఉండగా, ఇందన సర్దుబాటు పేరుతో అదనంగా 4.2 శాతాన్ని పెంచి 14.2 శాతం పెంపుదలను వడ్డించారు. రవాణాపై కూడా 5 శాతం మాత్రమే పెరగాల్సి ఉండగా 1.5 శాతం అదనంగా పెరగడం జరిగింది. ముఖ్యంగా గూడూరుతో పాటు పలు రైల్వేస్టేషన్ల నుంచి నిత్యం చెన్నై, హైదరాబాద్‌కు వేల మంది ప్రయాణాలు చేస్తున్నారు. గూడూరు నిమ్మ మార్కెట్ నుంచి నిమ్మకాయలు భారీగా చెన్నై, మైసూర్, బెంగళూర్ తదితర ప్రాంతాలతో పాటు సిలిగురి, బొకారో, హౌరా, ధన్‌బాద్ తదితర సుదూర ప్రాంతాలకు కూడా నిత్యం వందల టన్నులు నిమ్మకాయలు పలు రైళ్లలో ఎగుమతి అవుతున్నాయి. దీనిపై కూడా చార్జీలు విపరీతంగా పెరగడంతో అందరిపై పెనుభారం పడి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రైలు ప్రయాణ చార్జీలు గణనీయంగా పెరగడంతో స్టీపర్ క్లాస్ చార్జీలో ఒక్కో టికెట్‌పై రూ.30 నుంచి రూ.80 వరకూ పెరగనున్నాయి. ఏసీ క్లాస్‌కు రూ.90 నుంచి రూ.540 వరకూ పెరగనున్నాయి. రవాణాపై కూడా చార్జీలు పెరగడంతో కేజీ నిమ్మకాయలకు గతంలో రూ. 5 నుంచి రూ.7 వంతున 40 కిలో ప్యాకింగ్ కు రూ. 200 నుంచి రూ. 280 వరకు ఉండగా ప్రస్తుతం పెరిగిన లగేజీ చార్జీలతో అది కాస్తా రూ.215 నుంచి రూ.300 వరకు పెరగనుంది. మాలాంటి వారికెంతో ఇబ్బందే: పురుషోత్తం బస్సుల్లో చార్జీలు పెట్టలేక రైళ్లలో వెళుతున్నాం. ఇప్పుడు రైలు చార్జీలు కూడా పెరగడంతో మాలాంటి వారెంతో ఇబ్బంది పడాల్సి ఉంది. మాలాంటి పేద, మధ్య తరగ తి వారు ఇక రైళ్లలో కూడా ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది.