సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణం అంటేనే హడావుడి. త్వరగా బయలుదేరి రైలు అందుకోవడం.. ఏ మూలనో కాసింత చోటు సంపాదించుకుని హమ్మయ్య అనుకోవడం.. రోజుల తరబడి వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు చివరికి ఏదో ఒక బెర్త్ కన్ఫర్మ్ అయితే చాలు అని ఆశపడటం ఇన్నాళ్లుగా కనిపించేంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. సౌకర్యవంతమైన ప్రయా ణానికి జనం మొగ్గు చూపుతున్నారు.
జనరల్, నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ బోగీల కంటే.. ఏసీ బోగీల్లో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. దూరంతో, కాలంతో సంబంధం లేకుండా వేసవిలోనైనా, చలికాలంలోనైనా.. ఏసీ కోచ్‌లో సీట్లు దొరికాకే ప్రయాణానికి సిద్ధమవు తున్నారు. ఒంటరిగా ప్రయాణించినప్పుడు ఏదో ఒక బోగీలో ప్రయాణం చేసినా.. ఇంటిల్లిపాది కలిసి వెళితే మాత్రం ఏసీపై దృష్టిపెడుతున్నారు.
థర్డ్ ఏసీకి ప్రాధాన్యం..
సాధారణ స్లీపర్ చార్జీలతో పోల్చుకుంటే ఏసీ ప్రయాణానికి చార్జీలు చాలా ఎక్కువే. ఫస్ట్, సెకండ్ ఏసీ బోగీలకైతే చాలా ఎక్కువ. అయితే అటు సౌకర్యం, ఇటు కాస్త అందుబాటులో ఉండటంతో థర్డ్ ఏసీ బోగీల్లో ప్రయాణానికి జనం మొగ్గుచూపుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి స్లీపర్ క్లాస్ చార్జీ రూ.450 వరకు ఉంటుంది. అదే థర్డ్ ఏసీలో రూ.1,100 వరకు ఉంటుంది.
అయినా 12 గంటల పాటు ప్రయాణం కావడంతో టికెట్ ధర ఎక్కువే అయినా వీటిలో ప్రయాణిస్తున్నారు. ఇక ఏసీ బోగీల్లో దుప్పట్లు, బెడ్‌షీట్లు అందజేయడం, రెండు వైపులా డోర్‌లు లాక్ చేసే సదుపాయం వల్ల ప్రయాణంలో భద్రత ఉంటుందనే భరోసా.. రాత్రంతా ప్రశాంతంగా నిద్రించి ఉదయాన్నే గమ్యస్థానానికి చేరుకొనే అవకాశం ఉంటాయి. కొన్నిరైళ్లలో ఏసీ బోగీల్లో ఐఆర్‌సీటీసీ కేటరింగ్ సదుపాయం కూడా లభిస్తోంది.
దక్షిణ మధ్య రైల్వేలో ప్రతిరోజు సుమారు 650 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా.. వీటిలో 230కిపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లలో ప్రతిరోజు లక్షకుపైగా థర్డ్ ఏసీ బెర్తులు భర్తీ అవుతున్నట్టు అంచనా. సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ చార్జీలు బాగా ఎక్కువే అయినా.. దూర ప్రాంత ప్రయాణాల్లో సెకండ్ ఏసీకి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇవి రోజూ సుమారు 30 వేల బెర్తులు భర్తీ అవుతున్నట్లు అంచనా.
స్లీపర్ బోగీలు తగ్గిస్తూ..
అన్ని ప్రధాన రైళ్లలో స్లీపర్ కోచ్‌లను తగ్గించి థర్డ్ ఏసీ బోగీలను పెంచుతున్నారు. గతంలో 1.5 లక్షల వరకు స్లీపర్ బెర్తులు అందుబాటులో ఉంటే.. ఇప్పుడవి లక్షకు తగ్గినట్టు అంచనా. ఇదే సమయంలో ప్రయాణికుల డిమాండ్‌కు తగినట్టు థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ బెర్తులు పెంచారు. హైదరాబాద్ నుంచి విశాఖ, బెంగళూరు, ముంబై, దానాపూర్, రెక్సాల్, భువనేశ్వర్ తదితర రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువ.
ఈ రూట్లలో నడిచే రైళ్లలో స్లీపర్ బెర్తుల సంఖ్య సగానికి సగం తగ్గించినట్టు సమాచారం. ‘‘స్లీపర్ బోగీలకు డిమాండ్ లేదని చెప్పలేం. దిగువ మధ్య తరగతి, సాధారణ ప్రయాణికులకు తమ బడ్జెట్‌లో ప్రయాణ సదుపాయాన్ని అందజేసేవి స్లీపర్ క్లాస్ బోగీలే. కానీ ఇటీవల కాలంలో ఏసీ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు..’’ అని దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు.
ఇక ముందుఅన్నీ ఏసీ రైళ్లే..
రానున్న కాలంలో పూర్తిగా ఏసీ రైళ్లు మాత్రమే పట్టా లెక్కనున్నట్టు రైల్వే శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లు విజయవంతంగా పరుగులు తీస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ, తిరుపతి పట్టణాలకు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.
డిమాండ్ బాగుండటంతో తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో బోగీల సంఖ్యను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. త్వరలో బెంగళూరుకు వందేభారత్ అందుబాటులోకి రానుంది. అలాగే ఢిల్లీ, ముంబై తదితర నగరాలకు కూడా పూర్తి ఏసీ సదుపాయం ఉన్న వందేభారత్ రైళ్లను నడపనున్నారు.
దక్షిణ మధ్య రైల్వే గణాంకాలివీ..
♦ ప్రతి రోజు వచ్చే ఆదాయం: రూ.10 కోట్లు
♦ మొత్తం ప్రయాణికుల రైళ్లు: 650
♦ రోజూ రాకపోకలు సాగించే ప్రయాణికులు 10.50 లక్షలు
♦ స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించేవారు 2.50 లక్షలు
♦ ఏసీ బోగీల్లో ప్రయాణించేవారు 1.50 లక్షలు
♦ థర్డ్ ఏసీ ప్రయాణికులు 1.10 లక్షలు
♦ సెకండ్ ఏసీ ప్రయాణికులు 30వేలు
♦ ఫస్ట్ ఏసీ ప్రయాణికులు 10వేల లోపు
Comments
Please login to add a commentAdd a comment