కూల్‌ కూల్‌గా రైలు ప్రయాణం | Railway department to introduce advanced AC coaches | Sakshi
Sakshi News home page

కూల్‌ కూల్‌గా రైలు ప్రయాణం

Published Sat, Jun 5 2021 5:25 AM | Last Updated on Sat, Jun 5 2021 5:25 AM

Railway department to introduce advanced AC coaches - Sakshi

సాక్షి, అమరావతి: రైళ్లలోని త్రీటైర్‌ ఏసీ బోగీల్లో చాలీచాలనీ ఏసీ.. ఇరుకు బెర్త్‌లతో ఇక్కట్లు.. అటూ ఇటూ నడిచేందుకు అవస్థలకు ఇక చెక్‌ పడనుంది. త్రీటైర్‌ ఏసీ రైలు ప్రయాణం మరింత కూల్‌ కూల్‌గా మారనుంది. జర్మనీకి చెందిన ‘లింక్‌ హాఫ్‌మన్‌ బుష్‌’ (ఎల్‌హెచ్‌బీ) సాంకేతిక పరిజ్ఞానంతో సౌకర్యవంతంగా రూపొందించిన అధునాతన బోగీలను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. పంజాబ్‌ కపుర్తలాలోని కోచ్‌ ఫ్యాక్టరీలో తయారు చేసిన అధునాతన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను దేశవ్యాప్తంగా అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో దశలవారీగా ప్రవేశపెట్టనుంది. తద్వారా తక్కువ చార్జీలతో అత్యంత సౌకర్యవంతమైన ఏసీ రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి రానుంది.  


సౌకర్యం.. భద్రత 
► ప్రస్తుతం ఉన్న కోచ్‌లలో అప్పర్‌ బెర్త్‌కే ఏసీ సరిగా వస్తుంది. మిడిల్, లోయర్‌ బెర్త్‌లకు చల్లదనం సరిగా రాదు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో ఈ సమస్య ఉండదు. చల్లదనాన్ని అందించేందుకు ప్రతి బెర్త్‌ వద్ద ఏసీ వెంట్‌ ఏర్పాటు చేశారు. దీనివల్ల అప్పర్, మిడిల్, లోయర్, సైడ్‌ బెర్త్‌లకూ సమాన రీతిలో చల్లదనం వస్తుంది.  
► మెరుగుపరచిన మాడ్యులర్‌ డిజైన్లతో బెర్త్‌లు రూపొందించారు. బెర్త్‌ల పొడవు, వెడల్పు పెంచారు. అప్పర్, మిడిల్, లోయర్‌ బెర్త్‌ల మధ్య దూరాన్ని కొంత పెంచారు.  
► మొబైల్‌ ఫోన్లు, నీళ్ల సీసాలు, పేపర్లు పెట్టుకునేందుకు ప్రతి బెర్త్‌కు ప్రత్యేకంగా హోల్డర్లు ఏర్పాటు చేశారు.  
► ప్రత్యేకంగా రీడింగ్‌ ల్యాంప్, మొబైల్‌ ఫోన్‌ చార్జింగ్‌ పాయింట్‌ పెట్టారు.  
► కంటికి ఇబ్బందిలేని రీతిలో ప్రకాశవంతమైన లైట్లను ఏర్పాటు చేశారు. కోచ్‌ అంతటా లైట్ల కాంతి ప్రసరించేలా డిజైన్‌ చేశారు.  
► ప్రస్తుతం ఉన్న కోచ్‌లలో 72 బెర్త్‌లు ఉన్నాయి. కొత్తగా రూపొందించిన ఈ కోచ్‌లలో 83 బెర్త్‌లు ఉంటాయి. 
► కోచ్‌లకు పెద్ద తలుపులు ఏర్పాటు చేయడంతోపాటు నడవా (బెర్త్‌ల మధ్య ఖాళీ జాగా) విశాలంగా ఉంటుంది. దాంతో దివ్యాంగులకు ఇబ్బందులు తొలగుతాయి.  
► భద్రతకు మరింత ప్రాధాన్యమిచ్చారు. టాయిలెట్లు పెద్దగా ఏర్పాటు చేశారు.  

అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో.. 
ఒక్కో కోచ్‌ తయారీకి రూ.3 కోట్లు ఖర్చవుతుంది. రాజధాని, శతాబ్ధి, దురంతో, జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లు మినహా మిగిలిన అన్ని రైళ్లలోనూ వీటిని అందుబాటులోకి తెస్తారు. 2021–22లో 248 కోచ్‌లు తయారు చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది నుంచి కోచ్‌ల తయారీని ఇంకా పెంచాలని భావిస్తోంది. త్రీ టైర్‌ ఏసీ కోచ్‌లో ప్రయాణ చార్జీలను రైల్వే బోర్డు త్వరలో నిర్ణయించనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement