రావిశాస్త్రి ‘కార్నర్ సీట్’ కథ సుప్రసిద్ధం. అందులో ఒకతను రైలు ప్రయాణం చేయబోయి కంపార్ట్‌మెంట్‌లోని కార్నర్ సీట్ ఆశిస్తాడు. కూచునే లోపల ఒక ఆకుపచ్చకోటు వాడు ఆ సీటును ఆక్రమిస్తాడు. అప్పట్నించి ఇతను ఆ ఆకుపచ్చకోటు వాణ్ణి తిట్టుకుంటూనే ఉంటాడు. ఆ ఆకుపచ్చకోటు వాడు ఇదంతా పట్టకుండా ఎటో చూస్తుంటాడు. ఏదో ఆలోచిస్తుంటాడు. మధ్యలో ఒకచోట రైలు ఆగుతుంది. తిరిగి బయలుదేరబోతుంటుంది. ఒక్క క్షణం. ఆకుపచ్చకోటు వాడు ఒక్క ఉదుటున కంపార్ట్‌మెంట్ దిగేస్తాడు.
ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ముక్కలైపోతాడు. రెప్పపాటు. అంతవరకూ అతణ్ణి తిట్టుకున్న ఇతను నిశ్చేష్టుడవుతాడు. అతనికీ ఇతనికీ ఏ సంబంధమూ లేదు– కార్నర్ సీటుతో తప్ప. కాని ఇతనికి ఏడుపు వస్తుంది. దుఃఖం కలుగుతుంది. ఈ లోకంలో ఎంతో ఎండా నీడా గాలి నీరూ వర్షం ఉన్నాయి. వాటిని అనుభవించకుండా ఏదో ఒక సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూసి ఊరట చెందకుండా ఏ కష్టానికి ఎందుకు చనిపోయాడో అని వెక్కివెక్కి ఏడుస్తాడు. ఎదుటివాడి చావు పట్ల మనకు ఉండాల్సిన వేదన, సహానుభూతి గురించి రావిశాస్త్రి రాసిన గొప్ప కథ అది.
ఆర్.కె.నారాయణ్ ‘మిస్సింగ్ మెయిల్’ కథ కూడా సుప్రసిద్ధమే. వినాయక్ మొదలి వీధిలో ఇంటింటికీ ఉత్తరాలు అందించే పోస్ట్‌మేన్ తానప్పకు ఆ వీధిలోని అందరి కష్టసుఖాలు తెలుసు. రామానుజమ్ గారి కుమార్తె కామాక్షికి చాలా రోజులుగా సంబంధాలు కుదరడం లేదని తెలుసు. ఇప్పుడు కుదిరిన ఢిల్లీ సంబంధం ఈ ముహూర్తం దాటితే తిరిగి మూడేళ్ల వరకు అబ్బాయికి వీలు కాదనీ తెలుసు. రామానుజమ్ ఇంట్లో ఒకవైపు పెళ్లి పనులు జరుగుతుండగా మరోవైపు తానప్పకు టెలిగ్రామ్, ఉత్తరం అందుతాయి.
వాటిలో రామానుజమ్ మేనమామ మరణవార్త ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? ఈ కబురు రామానుజమ్‌కు తెలిస్తే వెంటనే బయల్దేరాలి. పెళ్లి ఆగిపోవాలి. మళ్లీ మూడేళ్ల వరకూ పోస్ట్‌పోన్ చేయాలి. అందుకే తానప్ప ఆ టెలిగ్రామ్, ఉత్తరం దాచి పెడతాడు. పెళ్లయ్యి అమ్మాయిని సాగనంపాక మెల్లగా ఆ సంగతి తెలియచేస్తాడు. మరణవార్త ఎప్పుడు, ఎలా చెప్పాలో తెలిసి సంస్కారం పాటించిన తానప్పను పాఠకుడు గుండెల్లో పెట్టుకుంటాడు.
చావును గౌరవించడం ప్రతి నాగరికతలో ఉంది. చనిపోయిన వ్యక్తికి ‘అంతిమ సంస్కారం’ నిర్వహించడం సాటి మనిషి సంస్కారం. జననంతో మొదలయ్యే మనిషి జీవనవృత్తం మరణంతో ముగుస్తుందని అందరికీ తెలిసినా మరణం తెచ్చే శూన్యం, వెలితి ఆ కుటుంబానికి, సంబంధీకులకు, స్నేహితులకు చాలా తీవ్రమైనవిగా జనులు భావిస్తారు. అందుకే నిన్న మొన్నటి వరకూ పల్లెల్లో ఒక వ్యక్తి మరణిస్తే ఎత్తుబడి అయ్యేంత వరకూ ఊరు ఊరంతా పొయ్యి ముట్టించేది కాదు. చావుఇంటి దగ్గర చేరి ధైర్యం చెప్పడం, జరగవలసిన పనులు చూడటం చేసేవారు.
మనిషి చనిపోవడం అంటే ‘కూకటి వేళ్లతో సహా చెట్టు కూలిపోవడం’గా గాథా సప్తశతి వ్యాఖ్యానిస్తుంది. చెట్టు ఆధారంగా ఎంత జీవం పెనవేసుకుని ఉంటుందో మనిషి ఆధారంగా కూడా అనేక జీవనాలు పెనవేసుకుని ఉంటాయి. ఇప్పటికీ కొన్ని గిరిజన సముదాయాలైతే తమ సమూహంలోని ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి మరణిస్తే ఆ ఆవాసాన్ని, గూడేన్ని ఏకంగా ఖాళీ చేసి వెళ్లిపోతాయి జ్ఞాపకాలను తట్టుకోలేక. అందుకే మనిషి పోయినప్పుడు పోయిన వ్యక్తిని గౌరవించడంతో పాటు అతని చుట్టూ ఉన్న వ్యక్తుల వేదనను కూడా గౌరవించి మెలగాలి.
ఈ దేశం విన్న అత్యంత విషాదకరమైన మరణవార్త గాంధీ గారి హత్య. రేడియోలో ఈ వార్త విన్న ఒక బాలిక పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకు వచ్చి ‘అమ్మా... గాంధీ గారు చనిపోయారట’ అంటే ఆ తల్లి ఉలిక్కిపడి లేచి కూతురి చెంప మీద లాగి పెట్టి ఒక్కటి వేస్తుంది– ‘ఏమిటా పాడు మాటలు’ అని! ఆ తర్వాత ఆ వార్త నిజం అని తెలిసి కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంది.
ఇంద్రగంటి జానకీబాల ‘కనిపించే గతం’ నవల ఈ సంఘటనతోనే మొదలవుతుంది. గాంధీ గారి మరణవార్త విని ఎక్కడికక్కడ కూలబడి విలపించినవాళ్లు, సినిమా హాళ్లలో సగం నుంచి లేచి ఏడ్చుకుంటూ బయటపడినవాళ్ళు, మూడు రోజులు లంకణం చేసినవారు ఎందరో ఉన్నారు. మహనీయులు, కళాకారులు, నాయకులు, ఆపద్బాంధవులు... జనులతో మమేకమై ఉంటారు. అందువల్ల వారి మరణ వార్తల పట్ల ఇంకా గౌరవం పాటించాలి. నిర్థారణలు చేసుకోవాలి. అప్పుడే చెప్పాలి.
కాని ఇవాళ ఒక వికృతమైన సంస్కృతి ఎల్లెడలా కనిపిస్తూ ఉంది. దానిని పైశాచిక సంస్కృతి అనవచ్చు. చిల్లర సంస్కృతి అనవచ్చు. సోషల్ మీడియా సంస్కృతి అని కూడా అనవచ్చు. వ్యక్తుల చావు వార్తలను సత్యాసత్యాలతో సంబంధం లేకుండా పుకార్ల స్థాయికి దిగజార్చడం. బతికున్నవారిని చంపడం. వైద్యం తీసుకుంటూ పోరాడుతున్నవారికి చావు ముహూర్తం లిఖించడం. దీనికి హతాశులైన ఆ సజీవులు తామే ముందుకొచ్చి ‘బతికున్నాం మొర్రో’ అని చెప్పడం.
బంధువులు దిగ్భ్రాంతితో ‘అవన్నీ అబద్ధాలు’ అని చెప్పాల్సి రావడం. జవాబుదారీతనం లేని వ్యవస్థ డ్రైనేజీలాంటిది. ఆ డ్రైనేజీతో మనకెందుకు అని నలుగురూ ఊరుకోవడం వల్లే అందులో కంపుతోపాటు ఇంపు కూడా కొట్టుకొనిపోవాల్సి వస్తోంది. ఫేక్‌ఐడిలు, ఆనవాలు లేని వాట్సప్‌లతో తప్పుడు చావువార్తలు వ్యాప్తి చేసి సైకిక్ స్టిమ్యులేషన్ పొందుతున్న వారు ఎంతటి మానసిక రోగులో అనుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వాళ్లు మన ఇళ్లలో కూడా ఉండొచ్చు. చావును గౌరవిద్దాం. చావుపై చిల్లర ఏరుకునే వ్యవస్థను చావగొడదాం.
చావు చిల్లర
Published Mon, May 8 2023 12:11 AM | Last Updated on Mon, May 8 2023 12:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment