
టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్( Harish Shankar) పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. నేడు ఆయన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే, మీకు ఆయన కుటుంబ నేపథ్యంతో పాటు పిలల్లను ఎందుకు వద్దనుకున్నారో తెలుసా..? కరీంనగర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన సినిమాలపై మక్కువతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. నాన్న శ్యాంసుందర్ తెలుగు ఉపాధ్యాయుడు కావడంతో హరీశ్‌కు సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. కోన వెంకట్ సహకారంతో రవితేజ నటించిన వీడే సినిమాకు సహాయకుడుగా హరీశ్ జర్నీ మొదలైంది. ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ అతనికి రవితేజ హీరోగా షాక్ సినిమాకు దర్శకత్వం వహించమని అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం వంటి హిట్ సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చాడు.
దర్శకులు హరీశ్ శంకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబ విషయాలను పంచుకున్నారు. తన భార్య పేరు స్నిగ్ధ అని ఆమెకు పెద్దగా సినిమాలంటే ఇష్టం ఉండదని ఆయన చెప్పారు. చివరకు ఒక సినిమా కోసం పనిచేసినందుకు వచ్చిన రెమ్యునరేషన్ గురించి కూడా ఆమెకు తెలియదని ఆయన అన్నారు. ఈ క్రమంలో తమకు పిల్లలు ఎందుకు వద్దనుకున్నారో హరీశ్ ఇలా చెప్పారు. నా భార్య స్నిగ్ధతో చాలా స్పష్టతతో ఉంటాం. మాది మధ్యతరగతి కుటుంబం. బడ్జెట్ విషయంలో ప్రతిదానికి లెక్కలు వేసుకునే ముందుకు సాగుతాం. కుటుంబంలో నేనే పెద్దవాడిని కావడంతో బాధ్యతలు తీసుకోవాల్సిందే..
నా చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడంతో పాటు తమ్ముడిని సెటిల్ చేయడం నా ప్రధాన కర్తవ్యం. అమ్మానాన్నలకు కూడా మంచి ఇల్లు నిర్మించాలి. ఇలా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వీటిని పూర్తి చేసే పనిలో ఉన్న నాకు స్నిగ్ధ కూడా మద్దతుగా నిలవడం మరింత బలాన్ని ఇచ్చింది. ఇంతకుమించి జీవితంలో ఎలాంటి బాధ్యతలూ వద్దనుకున్నాం. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాతే పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నాం. పిల్లలు పుట్టిన తర్వాత సెల్ఫీష్‌గా తయారవుతాం అనిపించింది. దీంతో వారి ప్రపంచం కుదించుకుపోతుంది అనేది నా అభిప్రాయం.' అని ఆయన అన్నారు.
హరీశ్ శంకర్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, కేవీఎన్, మైత్రీ మూవీ మేకర్స్ వంటి భారీ బ్యానర్స్‌లో ఆయన సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌తో ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయి. త్వరలో వారిద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కానుంది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.