1,500 కి.మీ. 5 గంటల్లో..
ఢిల్లీ నుంచి కోల్‌కతాకు బుల్లెట్ రైలుపై కసరత్తు
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి కోల్‌కతాకు 5 గంటలలోపే చేరుకోవచ్చు! 1,513 కి.మీ దూరమున్న ఈ మార్గంలో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఈ మార్గంలో బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఇది కార్యరూపంలోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కసరత్తు బాధ్యతను రైల్వే శాఖ స్పెయిన్‌కు చెందిన కన్సల్టెన్సీకి అప్పగించింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వజ్ర చతుర్భుజి ప్రాజెక్టులో ఢిల్లీ-కోల్‌కతా కారిడార్ భాగమని రైల్వే శాఖ అధికారి ఒకరు చెప్పారు. దీనికి రూ. 84 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా. స్పెయిన్ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం ఈ ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రయాణం ఢిల్లీ-కోల్‌కతాకు 4.56 గంటలు పడుతుంది. అదే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో 17 గంటలు పడుతుంది.
బుల్లెట్ రైలు గంటలకు 300 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ఈ మార్గంలో ఆగ్రా, లక్నో, వారణాసి, పట్నాలతోపాటు 12 నగరాలు కలుస్తాయి. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ అందుబాటులోకి వస్తే ఢిల్లీ నుంచి లక్నోకు, వారణాసికి, పట్నాకు ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది ఢిల్లీ నుంచి 506 కి.మీ దూరంలో ఉన్న లక్నోకు 1.45 గంటలు, 782 కి.మీ. దూరంలో ఉన్న వారణాసికి 2.45 గంటలు పడుతుంది. 4 మెట్రో నగరాలను హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్‌తో అనుసంధానించే వజ్ర చతుర్భుజి ప్రాజెక్టులో భాగమైన ఢిల్లీ-ముంబై, ముంబై-చెన్నై హైస్పీడ్ కారిడార్ సాధ్యాసాధ్యాలపైనా అధ్యయనం చేయనున్నారు.
దూరం-ప్రయాణ సమయం
ఢిల్లీ-లక్నో 506 కి.మీ. 1.45 గంటలు
ఢిల్లీ-వారణాసి 782 కి.మీ. 2.40 గంటలు
ఢిల్లీ-కోల్‌కతా 1,513 కి.మీ. 4.56 గంటలు
ఎంత ఖర్చవుతుంది?
ఢిల్లీ-కోల్‌కతా కారిడార్ రూ.84 వేల కోట్లు