విమాన ప్రయాణికుల రద్దీపెరిగినంత వేగంగా రైలు ప్రయాణాల్లో రద్దీ పెరగటం లేదు. కోవిడ్–19 కారణంగా క్షీణించిన ప్రజా రవాణా నెమ్మదిగా పుంజుకుంటున్నా.. కోవిడ్ ముందు కాలంతో పోలిస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితికి ద్రవ్యోల్బణమే కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోవిడ్ తర్వాత ప్రయాణాల రద్దీ పెరుగుదల ఆర్థిక వృద్ధికి ప్రత్యక్ష సూచికగా నిలుస్తుందని చెబుతున్నారు. కానీ.. కోవిడ్ ముందు సాగినన్ని ప్రయాణాలు ప్రస్తుతం కనిపించటం లేదని స్పష్టం చేస్తున్నారు.
కనిపించని మునుపటి మార్క్..
కరోనాకు ముందు 2019–20 ఆర్థిక సంవత్సరంలో 7,674 మిలియన్ల మంది రైళ్లలో ప్రయాణించగా.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 5,858 మిలియన్ల మంది మాత్రమే ప్రయాణించారు. అంటే ప్రయాణికుల బుకింగ్ 1,816 మిలియన్లు కంటే ఎక్కువ తగ్గింది. 2022–23తో పోలిస్తే.. 2019–20 కంటే 24 శాతం తక్కువ రద్దీని సూచిస్తోంది. సబర్బన్ ప్రాంతాల్లో 20 శాతం తగ్గుదల ఉండగా.. నాన్–సబర్బన్ ప్రాంతాల్లో 29 శాతం తగ్గుదల నమోదైంది.
నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల విభాగంలో రైల్వే 73 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ నుంచి మార్చి (2022–23) వరకు రూ.54,733 కోట్ల రాబడి వస్తే.. గత ఆర్థిక ఏడాదిలో ఇది రూ.31,634 కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే రైలు ప్రయాణాల్లో వృద్ధి కనిపిస్తున్నా.. 2019–20 కాలం నాటి గణాంకాలతో పోలిస్తే మాత్రం తక్కువగానే ఉంది.
ద్రవ్యోల్బణమే కారణం
ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం పడుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల కారణంగా ఆయా వర్గాల ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నట్టు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితి రైలు ప్రయాణాల్లో రద్దీ పెరగకపోవడానికి కారణమని స్పష్టం చేస్తున్నారు. ఎగువ, ఉన్నత ఆదాయ వర్గాల వారిపై ద్రవ్యోల్బణం పెద్దగా ప్రభావం చూపని కారణంగా.. ఆ వర్గాల వారు విమానాల్లో యథావిధిగా ప్రయాణించగలుగుతున్నారని చెబుతున్నారు.
విమానాలు ఎక్కేస్తున్నారు
మరోవైపు దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా వృద్ధి చెందుతూ కోవిడ్ ముందునాటి స్థితికి చేరింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసీఆర్‌ఏ) నివేదిక ప్రకారం 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన సంస్థలు 1,360 లక్షల మంది ప్రయాణికులను తరలించాయి. ఇది 2021–22లో ప్రయాణించిన 852 లక్షల మంది ప్రయాణికులతో పోలిస్తే 60 శాతం పెరుగుదలను సూచిస్తోంది.
అయితే, ప్రస్తుతం దేశీయ ప్రయాణికుల రద్దీ 2020–21 ఆర్థిక సంవ్సతరంలో 1,415 లక్షల కంటే 4 శాతం తక్కువ. ఈ ఏడాది మార్చిలో 130 లక్షల మంది దేశీయంగా విమానాల్లో ప్రయాణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 121 లక్షలు కాగా.. మార్చి నెలలో 8 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. 2022 మార్చిలో ఇది 106 లక్షలు ఉండగా.. ప్రస్తుతం 22 శాతం వృద్ధిలో నడుస్తోంది. అదే 2019 మార్చిలో 116 లక్షలు ఉంటే ఇప్పటి మార్చి ప్రీకోవిడ్‌లో చూస్తే 12 శాతం పెరుగుదల కనిపిస్తోంది.
సరుకు రవాణా పెరుగుతోంది
దేశంలో అత్యధికంగా ఒక ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా చేసిన సంస్థగా రైల్వే రికార్డు సృష్టించింది. జాతీయ రవాణా సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం.. 2022–23లో 1,512 మిలియన్ టన్నుల సరుకును రైల్వే రవాణా చేసింది. 2021–22లో 1,418 మిలియన్ టన్నులు తరలించింది. ఇక్కడ 2022–23లో రైల్వే మొత్తం ఆదాయం రూ.2.44 లక్షల కోట్లు కాగా.. 2021–22లో రూ.1.91 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే మొత్తం ఆదాయంలో ఏకంగా 27.75 శాతం వృద్ధిని సూచిస్తోంది.
– సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment