
అద్దాల రైలులో.. అందాల వీక్షణం!
- గాజు బోగీల తయారీలో రైల్వే
- ప్రకృతి రమణీయత ఉట్టిపడే మార్గాల్లో తిరిగే రైళ్లకు ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణం అనగానే.. రాత్రివేళ బండి ఎక్కి.. రైలు బయలుదేరాక కిటికీలు మూసి నిద్రకు ఉపక్రమించటం పరిపాటి. ఇక పగటి పూట దూర ప్రయాణాలు చేసేవారు రైలులో కూర్చోవటం పెద్ద ఇబ్బందిగా భావిస్తుంటారు. ఇప్పుడా పరిస్థితి మారబోతోంది. మీ ప్రయాణం ఆహ్లాదంగా సాగేలా రైల్వే కొత్త ప్రణాళిక రూపొందించింది. న్యూజిలాండ్, స్విట్జర్‌లాండ్ తరహాలో గాజు బోగీలను ప్రారంభించేందుకు రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. అటు ఆకాశం, ఇటు రెండు వైపులా బయటి దృశ్యాలు కనిపించేలా బోగీలు గ్లాస్‌తో ఉంటారుు. ప్రకృతి రమణీయత ఉట్టిపడే ప్రాంతాల గుండా రైలు దూసుకెళ్తుంటే ఆ దృశ్యాలు ఆస్వాదిస్తూ ప్రయాణికులు ముందుకు సాగుతారు. కొత్త గాజు బోగీలను ప్రకృతి రమణీయత ఉండే మార్గాల్లో తిరిగే రైళ్లకు అమరుస్తారు.
ఆదిలాబాద్ అడవి.. అరకు సోయగం..
వచ్చే జనవరి నాటికల్లా గాజు బోగీలను అందుబాటులోకి తెచ్చేలా రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. రైలు పర్యాటకానికి కొత్త ఊపు తెచ్చే క్రమంలో ఐఆర్‌సీటీసీ దీనికి రూపకల్పన చేసింది. ‘ది రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్‌డీఎస్‌ఓ)’ఆధ్వర్యంలో తమిళనాడు పెరంబూర్‌లోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ బోగీలను సిద్ధం చేస్తున్నారు. తొలి బోగీని కశ్మీర్‌లో తిరిగే రైలుకు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ తరహా బోగీలను ఏర్పాటు చేయాలని ఐఆర్‌సీటీసీ ప్రతిపాదించింది. ఇందులో ఏపీలోని అరకు లోయ మార్గంలో తిరిగే రైలుకు ఏర్పాటు చేయనున్నారు. మలివిడతలో నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని దట్టమైన అటవీ మార్గం గుండా సాగే మార్గంలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని మార్గాల్లో గాజు బోగీలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. కొన్ని మార్గాల్లో శీతాకాలం, వానా కాలంలో మాత్రమే వీటిని నడిపి ఆ తర్వాత రద్దు చేస్తారు. ఇలాంటి ఒక్కో బోగీ తయారీకి రూ.4 కోట్ల వరకు ఖర్చవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.