రైలు ప్రయాణం పెనుభారం
- సరుకు రవాణాపై తప్పని వడ్డన
- సర్వత్రా వ్యక్తమవుతున్న నిరసన
- భారీగా పెరిగిన రైలు చార్జీలు
- మోడీ ప్రభుత్వ నిర్ణయంపై జనం ఆగ్రహం
గూడూరు/ నెల్లూరు (నవాబుపేట)/ నెల్లూరు (సెంట్రల్) : పేద, మధ్య తరగతి ప్రయాణికులకు అనుకూలమైన రైలు ప్రయాణం మరింత భారంగా మారింది. ప్రజలపై భారాలు మోపకుండానే దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని హామీలు గుప్పించిన నరేంద్రమోడీ ప్రధానిగా ఎన్నికై కొద్ది రోజుల్లోనే రైలు చార్జీలను మరింతగా పెంచి తన అసలు స్వరూపాన్ని చాటుకున్నారు. బస్సులెక్కి చార్జీలు చెల్లించలేక గంటల తరబడి కూడా వేచి ఉండి పేద, మధ్యతరగతి ప్రజలు రైలు ప్రయాణాలే చేశారు. ఒక్కసారిగా రైలు చార్జీలు కూడా భారీగా పెరగడంతో ప్రయాణికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పెరిగిన రైలు చార్జీల్లో ఈ నెల 25వ తేదీ నుంచి అమలు కానున్నాయి.
రైలు ప్రయాణంపై 14.2 శాతం పెరగ్గా, లగేజీ చార్జీలు కూడా 6.5 శాతం పెరగడంపై అందరిలోనూ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సాధారణంగా ప్రయాణ చార్జీలపై 10 శాతం మాత్రమే పెరగాల్సి ఉండగా, ఇందన సర్దుబాటు పేరుతో అదనంగా 4.2 శాతాన్ని పెంచి 14.2 శాతం పెంపుదలను వడ్డించారు. రవాణాపై కూడా 5 శాతం మాత్రమే పెరగాల్సి ఉండగా 1.5 శాతం అదనంగా పెరగడం జరిగింది. ముఖ్యంగా గూడూరుతో పాటు పలు రైల్వేస్టేషన్ల నుంచి నిత్యం చెన్నై, హైదరాబాద్‌కు వేల మంది ప్రయాణాలు చేస్తున్నారు.
గూడూరు నిమ్మ మార్కెట్ నుంచి నిమ్మకాయలు భారీగా చెన్నై, మైసూర్, బెంగళూర్ తదితర ప్రాంతాలతో పాటు సిలిగురి, బొకారో, హౌరా, ధన్‌బాద్ తదితర సుదూర ప్రాంతాలకు కూడా నిత్యం వందల టన్నులు నిమ్మకాయలు పలు రైళ్లలో ఎగుమతి అవుతున్నాయి. దీనిపై కూడా చార్జీలు విపరీతంగా పెరగడంతో అందరిపై పెనుభారం పడి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రైలు ప్రయాణ చార్జీలు గణనీయంగా పెరగడంతో స్టీపర్ క్లాస్ చార్జీలో ఒక్కో టికెట్‌పై రూ.30 నుంచి రూ.80 వరకూ పెరగనున్నాయి. ఏసీ క్లాస్‌కు రూ.90 నుంచి రూ.540 వరకూ పెరగనున్నాయి. రవాణాపై కూడా చార్జీలు పెరగడంతో కేజీ నిమ్మకాయలకు గతంలో రూ. 5 నుంచి రూ.7 వంతున 40 కిలో ప్యాకింగ్ కు రూ. 200 నుంచి రూ. 280 వరకు ఉండగా ప్రస్తుతం పెరిగిన లగేజీ చార్జీలతో అది కాస్తా రూ.215 నుంచి రూ.300 వరకు పెరగనుంది.
మాలాంటి వారికెంతో ఇబ్బందే: పురుషోత్తం
బస్సుల్లో చార్జీలు పెట్టలేక రైళ్లలో వెళుతున్నాం. ఇప్పుడు రైలు చార్జీలు కూడా పెరగడంతో మాలాంటి వారెంతో ఇబ్బంది పడాల్సి ఉంది. మాలాంటి పేద, మధ్య తరగ తి వారు ఇక రైళ్లలో కూడా ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది.