పెట్రోల్ ‘బాంబు’
లీటరుకు రూ. 1.69 పెంపు
డీజిల్ లీటరుకు 50 పైసల వడ్డింపు
న్యూఢిల్లీ: రైలు చార్జీల భారం మరవకముందే, మోడీ సర్కారు మరో గుదిబండను సామాన్యుడిపై వేసింది. ఈసారి పెట్రోలు, డీజిల్ చార్జీల మోత మోగించింది. పెట్రోలు లీటరు ధర రూ.1.69, డీజిల్ 50 పైసలు పెంచింది. సోమవారం అర్ధరాత్రి నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చేశాయి. ఇరాక్‌లో కొనసాగుతున్న సంక్షోభం అంతర్జాతీయ చమురు ధరలపై తీవ్రంగా ప్రభావం చూపటంతో పెట్రో ధరల పెంపు అనివార్యమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం పెంచిన రూ.1.69కి స్థానిక అమ్మకపు పన్ను, వ్యాట్ ట్యాక్స్ కలిపితే మరింతగా ధర పెరిగినట్టవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర రూ.2.02 పెరిగింది.
దీంతో లీటరు పెట్రోలు రూ.73.58 అయింది. డీజిల్ ధర ఢిల్లీలో లీటరుకు 56పైసలు పెరిగి రూ.57.84కు చేరుకుంది. పశ్చిమాసియాలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి వల్ల అంతర్జాతీయ ముడిచమురు ధర బ్యారెల్‌కు 4 డాలర్లు పెరిగింది. దీని ప్రభావం మన దేశంలో ధరలపై పడింది. సబ్సిడీల్లో కోత పెట్టేందుకు ప్రతినెలా కొద్దికొద్దిగా డీజిల్ చార్జీలు పెంచాలన్న యూపీఏ 2013 జనవరి నాటి విధానం వల్ల ఇప్పటికి 17సార్లు ధరలు పెరిగాయి. అయినా, లీటరు డీజిల్‌పైన రూ.3.40 నష్టం వస్తోందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది.
హైదరాబాద్‌లో.. పాత ధర కొత్త ధర
పెట్రోల్ 78.17 80.38
డీజిల్ 62.41 63.03