
సహాయక చర్యల నిమిత్తం లోకో ట్రాక్ ద్వారా టన్నెల్‌లోనికి వెళ్తున్న రెస్క్యూ బృందాలు
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో ప్రమాదం
నీటి ఊట పెరగడంతో కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయి.. భారీ శబ్దంతో కూలిపడిన పైకప్పు
50 మంది కార్మికులు సురక్షితంగా బయటకు.. ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు లోపలే..
హుటాహుటిన సహాయక చర్యలు.. శిథిలాలు, బురదతో తీవ్ర ఇబ్బంది
టన్నెల్‌లో నీటిని, బురదను తొలగిస్తున్నామన్న మంత్రి ఉత్తమ్
ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. ఉన్నత స్థాయి సమీక్ష.. సహాయక చర్యలు వేగిరం చేయాలని ఆదేశం
సీఎంకు మోదీ ఫోన్.. ప్రమాదంపై ఆరా
సాక్షి, నాగర్‌కర్నూల్/ సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది.
ఘటన విషయం తెలిసిన సీఎం రేవంత్‌రెడ్డి వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు టన్నెల్ వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మరోవైపు సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపుతామని, పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
ఇటీవలే పనులు పునః ప్రారంభమై...
శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించే ‘ఎస్‌ఎల్‌బీసీ’ ప్రాజెక్టులో భాగంగా భారీ సొరంగం నిర్మిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వైపు (టన్నెల్ ఇన్‌లెట్) నుంచి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)తో ఈ తవ్వకం కొనసాగుతోంది. కొంతకాలం కింద టీబీఎం బేరింగ్ చెడిపోగా పనులు నిలిచిపోయాయి.
ఇటీవలే అమెరికా నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతు చేశారు. నాలుగైదు రోజుల కిందే పనులను పునః ప్రారంభించారు. ప్రస్తుతం సొరంగం లోపల 14వ కిలోమీటర్ వద్ద పనులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం టన్నెల్ ఇన్‌లెట్ నుంచి 14 కిలోమీటర్ పాయింట్ వద్దకు ప్రాజెక్టు ఇంజనీర్లు, మెషీన్ ఆపరేటర్లు, కార్మీకులు చేరుకున్నారు.
నీటి ఊట పెరిగి.. కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపోయి..
ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్‌లో నీటి ఊట పెరిగింది. దీనితో మట్టి వదులుగా మారి.. సొరంగం గోడలకు రక్షణగా లేర్పాటు చేసిన రాక్‌బోల్ట్, కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయాయి. పైకప్పు నుంచి మట్టి, రాళ్లు కుప్పకూలాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడంతో.. టీబీఎం మెషీన్‌కు ఇవతలి వైపున్న 50 మంది వరకు కార్మీకులు సొరంగం నుంచి బయటికి పరుగులు తీశారు. మెషీన్‌కు అవతలి వైపున్న 8 మంది మాత్రం మట్టి, రాళ్లు, శిథిలాల వెనుక చిక్కుకుపోయారు. టన్నెల్‌లో సుమారు 200 మీటర్ల వరకు పైకప్పు శిథిలాలు కూలినట్టు సమాచారం.
వేగంగా సహాయక చర్యలు చేపట్టినా...: సొరంగం పైకప్పు కూలిన విషయం తెలిసిన వెంటనే.. లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పైకప్పు కూలిపడటంతో జనరేటర్ వైర్లు తెగిపోవడంతో సొరంగం మొత్తం అంధకారం ఆవహించింది. పైగా 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, నీటి ఊట ఉధృతి పెరగడం, శిథిలాలు, బురదతో నిండిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందిగా మారింది.
ఈ సొరంగానికి ఇన్‌లెట్ తప్ప ఎక్కడా ఆడిట్ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు లేవు. దీనితో ఒక్క మార్గం నుంచే లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రానికి సుమారు 150 మంది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి.
ఘటనా స్థలికి చేరుకున్న మంత్రులు
సొరంగం ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు ప్రత్యేక హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. సహాయక చర్యలను పరిశీలించారు. నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతో‹Ù, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తదితరులు క్షేత్రస్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ పనులను పర్యవేక్షిస్తున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కిషన్‌రెడ్డి ఫోన్
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలను పంపించాలని, కేంద్రం నుంచి అన్నిరకాల సహాయం అందించాలని కోరారు. అమిత్ షా సానుకూలంగా స్పందించారని.. హైదరాబాద్ నుంచి ఒకటి, విజయవాడ నుంచి 3 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ప్రమాద స్థలానికి పంపారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇక సొరంగం ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
శరవేగంగా సహాయక చర్యలు: సీఎం రేవంత్
సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యల ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గాయపడిన కార్మీకులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించా రు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని తనకు తెలియజేయాలని స్పష్టం చేశారు. ఇక ఈ అంశంపై శనివారం రాత్రి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ప్రమాదం ఘటన, సహాయక చర్యల పరిస్థితి, ఇతర అంశాలను సీఎంకు మంత్రి ఉత్తమ్ వివరించారు.
పూర్తి సహకారం అందిస్తాం: ప్రధాని మోదీ
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న కార్మీకులను కాపాడేందుకు పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టామని సీఎం రేవంత్ వివరించారు. దీనితో కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, సహాయక చర్యల కోసం సత్వరమే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని పంపిస్తామని మోదీ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment