మోదీ చారిత్రక రైలు ప్రయాణం
దక్షిణాఫ్రికాలో గాంధీని రైల్లోంచి తోసేసిన ప్రాంతాన్ని సందర్శించిన ప్రధాని
- భారత వృద్ధి ఫలాలను ఆఫ్రికాకు అందిస్తాం
డర్బన్ : ప్రపంచంలో అత్యంత ఉజ్వలమైన కేంద్రాల్లో భారతదేశం ఒకటని అభివర్ణిస్తూ.. భారత ఆర్థిక పురోగతి ప్రయోజనాలను ఆఫ్రికాకు, ప్రత్యేకించి దక్షిణాఫ్రికాకు అందించటానికి సిద్ధంగా ఉన్నామని మోదీ పేర్కొన్నారు. భారత ప్రధాని గౌరవార్థం డర్బన్ మేయర్ శనివారం ఏర్పాటు చేసిన ఆతిథ్య కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సహకారం పెంపొందాలని అభిలషించారు.
‘21వ శతాబ్దంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లు మారి నా.. అభివృద్ధికి సంబంధించిన మన ఆందోళనలు ఒకే తరహావి. మన అభివృద్ధి భాగస్వామ్యం ఫలితం మన సమాజంలో అది ఎక్కువగా అవసరమున్న వర్గాల వారికి అం దేలా చూడటానికి నేను కృషి చేస్తున్నా’ అని పేర్కొన్నా రు.డర్బన్‌లో అత్యధిక జనాభా భారతీయులేనన్న విషయం పట్ల గర్విస్తున్నామని పేర్కొన్నారు. భారత్‌కు వెలుపల అతి పెద్ద భారతీయ నగరం డర్బనేనన్నారు. శనివారం డర్బన్‌లో కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన రెండు రోజుల దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుని టాంజానియాకు వెళ్లారు.
పీటర్‌మారిట్జ్‌బర్గ్ : దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ‘చరిత్రాత్మక’ రైలు ప్రయాణం చేశారు. దక్షిణాఫ్రికాలో నాడు మహాత్మాగాంధీ ప్రయాణం చేసిన మార్గంలో ప్రయాణించారు. జాతిపితను రైల్లో నుంచి తోసేసిన రైల్వే స్టేషన్‌ను మోదీ సందర్శించారు. శుక్రవారం ఆ దేశాధ్యక్షుడు జాకబ్ జుమాతో, ప్రవాస భారతీయులతో సమావేశమైన మోదీ శనివారం పెంట్రిచ్ రైల్వే స్టేషన్ నుంచి పీటర్‌మారిట్జ్‌బర్గ్ స్టేషన్‌కు పయనించారు. 1893లో గాంధీ ఈ రైల్వేస్టేషన్‌లో మొదటితరగతి టికెట్ తీసుకొని ప్రయాణిస్తుండగా, జాతి వివక్ష కారణంగా ఆయనను మూడో తరగతి బోగీలో ప్రయాణించాలని అధికారులు ఆదేశించారు. అయితే, ఆ ఆదేశాలను లెక్కచేయకపోవడంతో వారు గాంధీని రైల్లోంచి తోసేశారు. ‘మోహన్‌దాస్ (కరంచంద్ గాంధీ) మహాత్ముడిగా అవతరించడానికి బీజం పడింది ఈ స్థలంలోనే’ అని మోదీ పీటర్‌మారిట్జ్‌బర్గ్ స్టేషన్ వద్ద అన్నారు. 1893, జూన్ 7న రైల్లో జరిగిన ఘటనతోనే గాంధీ దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. తర్వాత భారత స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారు.
ఇది నాకు తీర్థయాత్ర..తాను భారత చరిత్రకు, జాతిపిత జీవితానికి కీలకమైన ప్రాంతాల్లో పర్యటించానని మోదీ చెప్పారు. ‘ఈ దక్షిణాఫ్రికా పర్యటన నాకు తీర్థయాత్ర లాంటిది. భారత చరిత్రకు,గాంధీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన మూడు ప్రాంతాల్లో పర్యటించే అవకాశం లభించడం నా అదృష్టం’ అని అన్నారు. పీటర్‌మార్టిజ్‌బర్గ్‌లో గాంధీని తోసేసిన ప్రాంతాన్నీ మోదీ సందర్శించారు. పీటర్‌మారిట్జ్‌బర్గ్ ఘటనే భారత చరిత్రగతిని మార్చేసిందని అక్కడి సందర్శకుల పుస్తకంలో మోదీ రాశారు. ఆస్టేషన్‌లో మోదీ ఒక ఎగ్జిబిషన్‌ను ఆవిష్కరించారు. తోసివేత తర్వాత ఆ రోజు రాత్రి గాంధీ తీవ్ర చలిలో స్టేషన్‌లోని వెయిటింగ్ హాల్లో గడిపారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా, అన్యాయాలపై చేసిన పోరాటంలో గాంధీ ఎన్నో బాధలను తట్టుకున్నారని మోదీ పేర్కొన్నారు.అనంతరం మోదీ గాంధీ రాజకీయ కార్యకలాపాల కోసం వినియోగించిన ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌ను సందర్శించారు. గాంధీ మనుమరాలు ఇలాగాంధీ మోదీ వెంట ఉండి ఈ ప్రాంత విశేషాలను వివరించారు.