రైలు నుంచి దిగిన యూపీ దంపతులు
కాజీపేట రూరల్: ఇండోనేసియాలో పర్యటించి వచ్చిన దంపతులు క్వారంటైన్ నిబంధనను ఉల్లంఘించి శనివారం రైలు ప్రయాణం చేయడం కలకలం సృష్టించింది. వీరికి అధికారులు వచ్చే నెల 5వ తేదీ వరకు క్వారంటైన్ స్టాంపింగ్ వేయగా.. ఎవరికీ చెప్పకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. కొద్ది దూరం ప్రయాణించాక వారి చేతులపై ఉన్న స్టాంప్‌ను గమనించిన రైల్వే సిబ్బంది, సహ ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదుతో వారిని కాజీపేటలో దింపి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్‌కు పంపించారు. ఈ సందర్భంగా రైలు గంటన్నర పాటు కాజీపేటలో ఆగింది.
ఇండోనేసియాకు విహారయాత్ర..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన భార్యాభర్తలు రోహిత్ కుమార్, పూజా యాదవ్ ఇటీవల ఇండోనేసియాలో విహారయాత్రకు వెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం వీరు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా.. పరీక్షల అనంతరం చేతులపై క్వారంటైన్ స్టాంపులు వేసిన అధికారులు.. 14 రోజుల పాటు నిర్బంధం లో ఉండాలని సూచించారు. వచ్చే నెల 5వ తేదీ వరకు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉన్నా.. ఎవరికీ చెప్పకుండా శనివారం ఉదయం క్వారంటైన్ కేంద్రం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని బెంగళూరు నుంచి ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బీ–3 రిజర్వేషన్ కోచ్‌లో ఎక్కారు. వీరి చేతులపై ఉన్న స్టాంప్‌లను గమనించిన తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో జీఆర్‌పీ, సివిల్ పోలీసులు, అధికారులు.. రైలు కాజీపేట జంక్షన్‌కు చేరుకోగానే నిలిపివేసి ఈ దంపతులతో మాట్లాడారు.
రైలు దిగాల్సిందే...
ఆస్పత్రికి తీసుకెళతామని స్టేషన్ అధికారులు చెప్పగా.. రోహిత్ కుమార్, పూజా యాదవ్ దంపతులు అందుకు నిరాకరించారు. వారిని దింపితేనే రైలును కదలనిస్తామని మిగతా ప్రయాణికులు పట్టుబడ్డారు. అధికారులు ఆ దంప తులకు నచ్చచెప్పి స్టేషన్ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌కు పంపించారు. తర్వాత ఆ బోగీని శానిటైజేషన్ చేయించారు. దీంతో ఉదయం 10.30 గంటలకు కాజీపేట చేరుకున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ గంటన్నర ఆలస్యంతో కాజీపేట నుండి 12 గంటలకు బయలుదేరింది. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.
మరో ప్రయాణికుడిపై ఫిర్యాదు
ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఒక ప్రయాణికుడికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని సహచర ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆ వ్యక్తిని ఆలేరులో దింపి చికిత్స కోసం అక్కడి ఆస్పత్రికి పంపించారు. ఆ తర్వాత కృష్ణా ఎక్స్‌ప్రెస్ కోచ్‌ను శానిటైజర్‌తో శుభ్రం చేసి కాజీపేట వైపు పంపించగా కాజీపేటలోనూ శుభ్రం చేసి తిరుపతి వైపు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment