![Medical and health officials about Covid Situations In Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/11/covid.jpg.webp?itok=l-PrmYRp)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ తీవ్రజబ్బుకు లోనై ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువేనని స్పష్టం చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల వరకు అందుబాటులో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4,774 యాక్టివ్ కేసులున్నాయి.
వీరిలో కేవలం 9.04 శాతం అంటే 434 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరారు. 1.75 శాతం మంది అంటే 84 మంది క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారు. మిగిలిన 89.14 శాతం అంటే 4,256 మంది వైద్యసిబ్బంది పర్యవేక్షణలో హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో సుమారు 40 మంది మాత్రమే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. వీరు వయసు పైబడి, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు కావడం గమనార్హం. సాధారణ దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలే ఎక్కువమందిలో ఉంటున్నాయి. రెండోదశలో మాదిరిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ శాచురేషన్ తగ్గిపోవడం వంటి సమస్యలు తక్కువమందిలో కనిపిస్తున్నాయి.
దేశంలో 20వ స్థానంలో..
యాక్టివ్ కేసుల పరంగా పరిశీలిస్తే మన రాష్ట్రం.. దేశంలో 20వ స్థానంలో ఉంది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలు తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోనే యాక్టివ్ కేసులు ఎక్కువ ఉన్నాయి. మరణాల రేటులో మన రాష్ట్రం.. దేశంలో 31వ స్థానంలో రాష్ట్రం ఉంది. నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.70 శాతం మంది మాత్రమే రాష్ట్రంలో మృత్యువాతపడ్డారు. పంజాబ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment